Friday, July 1, 2016

క్షీరసాగరమథనం – అదియునుం

8-216-వ.
అదియునుం బ్రళయకాలాభీల ఫాలలోచన లోచనానలశతంబు చందంబున నమందంబై; విలయ దహన సహస్రంబు కైవడి వడియై; కడపటి పట్టపగలింటి వెలుంగుల లక్ష తెఱంగున దుర్లక్షితంబై; తుదిరేయి వెలింగిన మొగిలుగముల వలనం బడు బలు పిడుగుల వడువున బెడిదంబై; పంచభూతంబులుం దేజోరూపంబులైన చాడ్పున దుస్సహంబై; భుగభుగాయమానంబులైన పొగలును; జిటచిటాయమానంబులైన విస్ఫులింగంబులును; ధగధగాయమానంబు లైన నెఱమంటలును; గలిగి మహార్ణవ మధ్యంబున మందరనగం బమంథరంబుగం దిరుగునెడ జనియించి పటపటాయమానంబై నింగికిం బొంగి దిశలకుం గేలు చాఁచి బయళ్ళు ప్రబ్బికొని తరిగవ్వంపుఁ గొండ నండ గొనక; నిగిడి కడలి నలుగడలకుం బఱచి; దరుల కుఱికి; సురాసుర సముదయంబులం దరిగొని; గిరివర గుహాగహ్వరంబుల సుడిపడక కులశిఖరి శిఖరంబుల నెరగలివడి; గహనంబుల దహించి కుంజమంజరీ పుంజంబుల భస్మంబుజేసి; జనపదంబు లేర్చి; నదీ నదంబు లెరియించి; దిక్కుంభికుభంబులు నిక్కలుపడ నిక్కి; తరణి తారామండలంబులపై మిట్టించి; మహర్లోకంబు దరికొని; యుపరిలోకంబునకు మాఱుగొనలిడి సుడిపడి ముసురుకొని; బ్రహ్మాండ గోళంబు చిటిలి పడన్ దాఁటి; పాతాళాది లోకంబులకు వేళ్ళుబాఱి; సర్వలోకాధికంబై శక్యంబుగాక యెక్కడఁ జూచినం దానయై; కురంగంబు క్రియం గ్రేళ్ళుఱుకుచు; భుజంగంబు విధంబున నొడియుచు; సింగంబు భంగి లంఘించుచు; విహంగంబు పగిది నెగయుచు; మాతంగంబు పోలికి నిలువంబడుచు నిట్లు హాలాహల దహనంబు జగంబులం గోలాహలంబు చేయుచున్న సమయంబున; మెలకు సెగల మిడుకం జాలక నీఱైన దేవతలును; నేలంగూలిన రక్కసులును; డుల్లిన తారకలును; గీటడంగిన కిన్నర మిథునంబులును; గమరిన గంధర్వవిమానంబులును; జీకాకుపడిన సిద్ధచయంబులును; జిక్కుపడిన గ్రహంబులును జిందఱవందఱ లయిన వర్ణాశ్రమంబులును; నిగిరిపోయిన నదులును; నింకిన సముద్రంబులును; గాలిన కాననంబులును బొగిలిన పురంబులును; బొనుఁగుపడిన పురుషులును; బొక్కిపడిన పుణ్యాంగనా జనంబులును; బగిలిపడిన పర్వతంబులును భస్మంబులైన ప్రాణి సంఘంబులును; వేఁగిన లోకంబులును; వివశలైన దిశలును; నొడ్డగెడవులైన భూజచయంబులును; నఱవఱలైన భూములునునై యకాల విలయకాలంబై తోచుచున్న సమయంబున.
టీకా:
            అదియునున్ = అది; ప్రళయ = ప్రళయ; కాల = సమయపు; అభీల = భయంకరమైన; ఫాలలోచన = రుద్రునికంటి; అనల = అగ్నికి; శతంబు = నూరురెట్లు; చందంబునన్ = వలె; అమందంబున్ = శ్రీఘ్రగమనముగలది; = అయ్యి; విలయ = కల్పాంతకాలపు; దహన = అగ్నులు; సహస్రంబు = వెయ్యి (1,000); కైవడిన్ = వలె; వడియై = తీవ్రమైనది; ఐ = అయ్యి; కడపటి = కల్పాంతపు ఆఖరి; పట్టపగలింటి = నిట్టమధ్యాహ్నపు; వెలుంగులన్ = కాంతులు; లక్ష = లక్ష (1,00,000); తెఱంగునన్ = వలె; దుర్లక్షితంబు = తేరిచూడరానిది; ఐ = అయ్యి; తుది = కల్పాంతపు ఆఖరి; రేయి = రాత్రి; వెలింగిన = ప్రకాశించెడి; మొగిలి = మేఘముల; గముల = సమూహముల; వలనన్ = వలన; పడు = పడెడి; పలు = అనేకమైన; పిడుగుల = పిడుగుల; వడువునన్ = వలె; బెడిదంబు = మహాభయంకరమైనది; ఐ = అయ్యి; పంచభూతంబులున్ = పంచభూతములు {పంచభూతములు - 1భూమి 2నీరు 3వాయువు 4అగ్ని 5ఆకాశము}; తేజస్ = మంటల; రూపంబులున్ = స్వరూపములుగలవి; ఐన = అయిపోయిన; చాడ్పునన్ = విధముగా; దుస్సహంబు = భరింపరానిది; ఐ = అయ్యి; భుగభుగాయమానంబులు = భుగభుగమనెడివి; ఐన = అయిన; పొగలును = పొగలును; చిటచిటాయమానంబులు = చిటపటమనియెడివి; ఐన = అయిన; విస్ఫులింగంబులును = నిప్పుకణములు; ధగధగాయమానంబులు = ధగధగమనియెడివి; ఐన = అయిన; నెఱ = పెను; మంటలును = మంటల; కలిగి = తో; మహా = గొప్ప; అర్ణవ = సముద్రపు; మధ్యంబునన్ = నడుమ; మందరనగంబు = మందరపర్వతము; అమంథరంబుగన్ = మెల్లనిదిగ; తిరుగు = తిరిగెడి; ఎడన్ = సమయమునండు; జనియించి = పుట్టి; ఫటఫటాయమానంబు = ఫటఫటమనెడిది; ఐ = అయ్యి; నింగికిన్ = ఆకాశమునకు; పొంగి = పొంగి; దిశల్ = దిక్కుల; కున్ = కు; కేలుచాచి = వ్యాపించి; బయళ్ళు = బయటంతా; ప్రబ్భికొని = నిండిపోయి; తరి = చిలికెడి; కవ్వంపు = కవ్వపు; కొండన్ = పర్వతమును; అండగొనక = అతిక్రమించి; నిగిడి = నిక్కి; కడలిన్ = సముద్రమునకు; నలుగడల్ = నాలుగుపక్కల; కున్ = కు; పఱచి = వ్యాపించి; దరుల్ = గట్ల; కున్ = కు; ఉఱికి = వ్యాపించి; సుర = దేవతలు; అసుర = రాక్షసుల; సముదయంబులన్ = సమూహములను; దరిగొని = మండించి; గిరి = కొండలు; వర = ఉత్తములను; గుహా = గుహలు; గహ్వరంబులన్ = అడవులందు; సుడిపడక = తొట్రుపకుండగ; కులశిఖరి = కులపర్వతముల; శిఖరంబులన్ = శిఖరములలో; ఎరగలి = కార్చిచ్చుతో; వడిన్ = వేగముగా; గహనంబులన్ = అడవులను; దహించి = కాల్చేసి; కుంజ = పొదరిండ్ల; మంజరీ = పూలగుత్తుల; పుంజంబులన్ = సమూహములను; భస్మంబు = బూడిద; చేసి = చేసి; జనపదంబులన్ = గ్రామములను; ఏర్చి = కాల్చివేసి; నదీ = నదులను; నదంబుల్ = నదములు; ఎరియించి = ఎండించి; దిక్కుంభి = దిగ్గజముల; కుంభంబులున్ = కుంభములను; ఇక్కలుపడ = ఇక్కట్లుపడగ; నిక్కి = ఎక్కి; తరణి = సూర్యగోళమును; తారామండలంబుల్ = నక్షత్రమండలముల; పైన్ = మీదకి; మిట్టించి = అణగదొక్కి; మహర్లోకంబున్ = మహర్లోకమును; దరికొని = మసిచేసి; ఉపరి = పై; లోకంబున్ = లోకముల; కున్ = కు; మాఱుగొనలు = శాఖోపశాఖలుగ విస్తరించి; ఇడి = చేసి; సుడిపడి = చుట్టుముట్టి; ముసురుకొని = క్రమ్ముకొని; బ్రహ్మాండ = బ్రహ్మాండ; గోళంబున్ = గోళమును; చిటిలిపడన్ = చిట్లిపోవునట్లు; దాటి = విస్తరించి; పాతాళ = పాతాళము; ఆది = మున్నగు; లోకంబుల్ = లోకముల; కున్ = కు; వేళ్ళుబాఱి = పాకి; సర్వ = సమస్తమైన; లోక = లోకములకు; అధికంబు = పొంగిపొర్లెడిది; ఐ = అయ్యి; శక్యంబు = సాధ్యము; కాక = కాకపోయి; ఎక్కడ = ఎక్కడ; చూచినన్ = చూసినను; తాన = తనే; ఐ = అయ్యి; కురంగంబు = లేళ్ల; క్రియన్ = వలె; క్రేళ్లుఱుకుచున్ = గంతులువేయుచు; భుజంగంబు = పాము; విధంబునన్ = వలె; ఒడియుచున్ = ఒడిసి పట్టుకొనుచు; సింగంబు = సింహము; భంగిన్ = వలె; లంఘించుచున్ = దుముకుచు; విహంగంబు = పక్షి; పగిదిన్ = వలె; ఎగయుచున్ = ఎగురుచు; మాతంగంబు = ఏనుగు; పోలికిన్ = వలె; నిలువంబడుచున్ = నిలబడిపోతూ; ఇట్లు = ఈ విధముగ; హాలాహల = హాలాహలము యొక్క; దహనంబు = మంటలు; జగంబులన్ = లోకములను; కోలాహలంబు = లబలబలాడ; చేయుచున్న = చేయుచున్నట్టి; సమయంబునన్ = సమయమునందు; మెలకు = జ్వలించెడి; సెగల = వేడికి; మిడుకంజాలక = బతకలేక; నీఱు = బూడిద; ఐన = అయిన; దేవతలును = దేవతలు; నేలంగూలిన = మరణించిన; రక్కసులును = రాక్షసులును; డుల్లిన = రాలిన; తారకలును = చుక్కలు; కీటడంగిన = రూపుమాసిన; కిన్నర = కిన్నర; మిథునంబులును = దంపతులును; కమరిన = కాలిపోయిన; గంధర్వ = గంధర్వుల; విమానంబులును = విమానములు; చీకాకుపడిన = చెదిరిపోయిన; సిద్ధ = సిద్ధుల; చయంబులును = సమూహములు; చిక్కుపడిన = సంకటపడిన; గ్రహంబులును = గ్రహములు; చిందఱవందఱలయిన = చెల్లాచెదరైన; వర్ణాశ్రమంబులును = వర్ణాశ్రమములు; ఇగిరిపోయిన = ఎండిపోయిన; నదులునున్ = నదులు; ఇంకిన = ఇంకిపోయిన; సముద్రంబులును = సముద్రములు; కాలిన = కాలిపోయిన; కాననంబులును = అడవులు; పొగిలిన = పరితపించిన; పురంబులును = పట్టణములు; పొనుగుపడిన = నిస్జేజులైన; పురుషులును = మగవారును; పొక్కిపడిన = దుఃఖపడిన; పుణ్యాంగనా = పునిస్త్రీ; జనంబులును = జనములు; పగిలిపడిన = బద్దలైన; పర్వతంబులును = పర్వతములు; భస్మంబులైన = బూడిదైన; ప్రాణి = జీవ; సంఘంబులును = జాలము; వేగిన = తపించిన; లోకంబులును = లోకములు; వివశలైన = కలతబారిన; దిశలును = దిక్కులు; ఒడ్డగెడవులైన = తలక్రిందులైన; భూజ = చెట్ల; చయంబులును = గుంపులు; నఱవఱలైన = బీటలువారిన; భూములును = పొలములు; ఐ = అయ్యి; అకాల = కాలంకానిసమయంలోని; విలయకాలంబు = ప్రళయకాలము; ఐ = అయ్యి; తోచుచున్న = కనబడుచున్న; సమయంబునన్ = సమయమున.
భావము:
            మంథర పర్వతంతో చిలికిన చిలుకుడుకు పాలసముద్రంలో పుట్టిన హాలాహలం, ప్రళయకాలంలో, పరమేశ్వరుని నుదటి కన్ను నుండి వెలువడే మహా భయంకరమైన అగ్నిజ్వాలలకంటె నూరురెట్లు చురుకైనది; కల్పాంతకాలపు అగ్నికంటె వెయ్యిరెట్లు తీవ్రమైనది; మహాప్రళయకాలపు లక్ష సూర్యుల తేజస్సువలె తేరిచూడరానిది; ప్రళయకాలపు కాళరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగులవలె మహా భీకరమైనది; భగ భగ మండే పంచభూతాలవలె భరింపలేనిది. భుగ భుగ మనే పొగలతో, చిటపటమనే నిప్పుకణాలతో, ధగ ధగ మని మెరిసే పెనుమంటలతో, ఫట ఫట మంటూ ఆ మాహా విషం ఆకాశం అంత ఎత్తు పొంగుతోంది; దిక్కులంతా వ్యాపిస్తోంది; బయళ్ళన్నీ నిండిపోతోంది; మంథర పర్వతాన్ని దాటి సముద్రంలో నలువైపులా వ్యాపిస్తోంది; చెలియలికట్టలు గట్లు దాటేస్తోంది;. దేవదానవుల గుంపులను దాటిపోతోంది; కొండగుహలలో తొట్రుపడకుండా ఎత్తైన పర్వతశిఖరాలలో నిప్పులు నింపేస్తోంది; అడవులను కాల్చేస్తోంది; పొదరిళ్ళలో పూలగుత్తులను మాడ్చేస్తోంది. గ్రామాలను కాల్చేస్తోంది; నదీనదాలను ఎండగట్టేస్తోంది; దిగ్గజాల కుంభస్థలాలపైకి ప్రాకేస్తోంది; సూర్యగోళాన్నీ నక్షత్రాలనూ అణగద్రొక్కేస్తోంది; మహర్లోకాన్ని మసిచేస్తోంది; ఊర్థ్వ లోకాలకు కీడు కలిగేటట్లు పెరగిపోతోంది; చుట్టు ముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండం బద్దలయిపోయేలా విస్తరిస్తోంది; పాతాళ లోకం దాకా వ్రేళ్ళూనుతోంది. ఆ హాలాహలం ఎటుచూస్తే అటుప్రక్క అసాధరణంగా అన్నిలోకాలలోనూ కూరుకుపోతోంది; జింకవలె గంతులు వేస్తోంది; సింహాంవలె దూకుతోంది; పక్షిలా ఎగురుతోంది; ఏనుగులా స్థిరంగా నిలబడిపోతోంది; లోకాలన్నిటా గగ్గోలు పెట్టిస్తోంది. ఆ పెను మంటల వేడికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మం అయ్యారు; రాక్షసులు నేలకూలారు; చుక్కలు రాలాయి; కిన్నర దంపతులు నశించారు; గంధర్వుల విమానాలు కాలిపోయాయి; సిద్దుల గుంపులు చెదిరి పోయాయి; గ్రహాలు సంకటపడ్డాయి; నదులు ఎండిపోయాయి; సముద్రాలు ఇంకిపోయాయి; అడవులు మాడిపోయాయి; పట్టణాలు బావురుమన్నాయి; పురుషులు వెతల పాలయ్యారు; పుణ్యస్త్రీలు పొగిలిపోయారు; పర్వతాలు బ్రద్దలైపోయాయి; జీవరాసులు అడుగంటిపోయాయి; లోకాలు తపించి పోయాయి; దిక్కులు కలత చెందాయి; చెట్లు తలక్రిందులు అయ్యాయి; నేలలు బదాబదలు అయ్యాయి; అకాలంలో ప్రళయం వచ్చినట్లు అయింది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: