Sunday, February 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౭(487)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1039-వ.
ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోక ధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగర రక్షణంబునకుం బ్రద్యుమ్న, గద, సాంబ, సుచంద్ర, శుక, సారణానిరుద్ధ, కృతవర్మాది యోధవరుల నియమించి తాము నక్రూర వసుదేవోగ్రసేనాది సకల యాదవులుం గాంతాసమేతులై స్రక్చంద నాభరణ వస్త్రాదులు ధరియించి, శోభనాకారంబులతోడం బుష్పక విమానంబులనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, మనోవేగంబులైన తురగంబుల నెక్కి వియచ్చరులం బురుడించు పురుషులు దమ్ము సేవింపం జని య ప్పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి, యనంతరంబ. 

భావము:
బలరామకృష్ణులు లోకధర్మపాలనకు పూనుకుని, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సుచంద్రుడు, శుకుడు, సారణుడు, అనిరుద్ధుడు, కృతవర్మ మున్నగు యాదవ మహాయోధులను నగర రక్షణ కోసం ద్వారకలో నిలిపారు. అక్రూరుడు, వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైన యాదువులుతో కలిసి, వారు సర్వాలంకారశోభితులై కాంతాసమేతంగా బయలుదేరారు. పుష్పక విమానాల వంటి రథాలు, మేఘాలను పోలు ఏనుగులు, మనోజవములైన అశ్వాలు వంటి, వారివారికి తగిన వాహనాలలో శమంత పంచకానికి ప్రయాణం అయ్యారు. దేవతలకు సాటి వచ్చే సేవకులు వారిని సేవిస్తుండగా ఆ పుణ్యక్షేత్రం చేరారు. ఆ పుణ్యతీర్ధాలలో స్నానాలు చేసి ఉపవాసాలు చేశారు. పిమ్మట.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1039 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




శ్రీకృష్ణ విజయము - ౪౮౬(486)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1037-సీ.
ధరణీశ! బలుఁడును సరసిజోదరుఁడు న-
  వోన్నతసుఖలీల నుండునంతఁ
జటులోగ్రకల్పాంత సమయమందునుఁ బో-
  దృగసహ్యమై సముద్దీప్త మగుచు
రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు-
  టెఱిఁగి భూజను లెల్ల వరుసఁ గదలి
మును జమదగ్ని రాముఁడు పూని ముయ్యేడు-
  మాఱులు ఘనబలోదారుఁ డగుచు
10.2-1037.1-తే.
నిజభుజాదండ మండిత నిబిడ నిశిత
చటుల దంభోళిరుచిరభాస్వత్కుఠార
మహితధారావినిర్భిన్న మనుజపాల
దేహనిర్ముక్త రుధిర ప్రవాహములను.
10.2-1038-తే.
ఏను మడువులు గావించె నెచటనేని
నట్టి పావనసుక్షేత్రమగు శమంత
పంచకంబున కపుడు సంభ్రమముతోడఁ
జనిరి బలకృష్ణులును సంతసం బెలర్ప. 

భావము:
“మహారాజా బలరామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్న రోజులలో కల్పాంత కాలంలో వలె చూడశక్యంగాని విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నారు. ప్రజలందరూ తమ వెంట రాగా వారు శమంతపంచకం అనే మహా పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే, పరశురాముడు అవక్రవిక్రమంతో అభిరాముడై ఇరవైఒక్క మార్లు దండెత్తి, వజ్రాయుధం లాంటి తన కఠోర కుఠారంతో రాజలోకం కుత్తుకలు తునిమాడు. లోకాన్ని నిఃక్షత్రం చేసాడు. ఆసమయంలో ఆ రాజుల శరీరాలనుండి స్రవించిన రక్తం ప్రవాహం కడితే అలా ప్రవహించిన మహీపతుల రక్తప్రవాహాన్ని పరశురాముడు ఐదుమడుగులు కావించాడు. అవి శమంతపంచకం అనే పేరుతో పవిత్రక్షేత్రంగా రూపొందాయి. అట్టి శమంతకానికి శ్రీబలరామకృష్ణాది యాదవులు గ్రహణ సందర్భంగా చేరుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1038 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Friday, February 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౫(485)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1034-వ.
అనిన మఱియుం బరాశరపౌత్రున కర్జునపౌత్రుం డిట్లనియె.
10.2-1035-ఆ.
"దుష్టశిక్షణంబు దురితసంహరణంబు
శిష్టరక్షణంబుఁ జేయఁ దలఁచి
భువిని మనుజుఁ డగుచుఁ బుట్టిన శ్రీ కృష్ణు
విమలచరిత మెల్ల విస్తరింపు."
10.2-1036-వ.
అనిన శుకుం డిట్లనియె. 

భావము:
అలా చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. “పాపాన్ని నాశనం చేయడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసం, మానవ రూపంతో అవతరించిన శ్రీకృష్ణుడి నిర్మల చరిత్ర సవిస్తరంగా ఇంకా నాకు వివరించు.” ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1035 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Thursday, February 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౪(484)

( అటుకులారగించుట ) 

10.2-1032-ఆ.
దేవదేవుఁ, డఖిల భావజ్ఞుఁ, డాశ్రిత
వరదుఁ డైన హరికి ధరణిసురులు
దైవతములు గాన ధారుణీదివిజుల
కంటె దైవ మొకఁడు గలడె భువిని?
10.2-1033-క.
మురహరుఁ డిట్లు కుచేలుని
చరితార్థునిఁ జేసినట్టి చరితము విను స
త్పురుషుల కిహపరసుఖములు
హరిభక్తియు యశముఁ గలుగు నవనీనాథా!" 

భావము:
దేవదేవుడైన వాసుదేవుడికి తెలియని విషయం లేదు; భక్తవత్సలు డగు హరికి బ్రాహ్మణులు అంటే దైవ సమానులు; తరచిచూస్తే, భూలోకంలో వారి కంటే వేరే దైవం లేడు. ఓ రాజా! మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు కుచేలుని చరితార్థుడినిగా చేసిన ఈ వృత్తాంతం విన్న వారికి ఇహపర సుఖాలూ, హరిభక్తి, యశస్సూ కలుగుతాయి.” అని శుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1033 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Wednesday, February 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౩(483)

( అటుకులారగించుట ) 

10.2-1031-వ.
అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును. 

భావము:
భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మఱియును... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1031 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Tuesday, February 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౨(482)

( అటుకులారగించుట ) 

10.2-1030-క.
నను నా వృత్తాంతంబును
దన మనమునఁ గనియు నేమి దడవక ననుఁ బొ
మ్మని యీ సంపద లెల్లను
నొనరఁగ నొడఁగూర్చి నన్ను నొడయునిఁ జేసెన్. 

టీకా:
ననున్ = నన్ను; నా = నా యొక్క; వృత్తాంతంబును = విషయమును; తన = తన యొక్క; మనమునన్ = మనస్సు నందు; కనియున్ = తెలిసికొనినను; ఏమి = ఏమియును; తడవక= ఆలస్యము చేయక; ననున్ = నన్ను; పొమ్ము = వెళ్ళు; అని = అని; ఈ = ఈ; సంపదలు = సంపదలు; ఎల్లనున్ = సమస్తమును; ఒనరన్ = చక్కగా; ఒడగూర్చి = కలుగజేసి; నన్నున్ = నన్ను; ఒడయునిన్ = ప్రభువును; చేసెన్ = చేసెను. 

భావము:
ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలూ అనుగ్రహించి ధనవంతుడిని చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1030 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Monday, February 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౧(481)

( అటుకులారగించుట ) 

10.2-1028-వ.
సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు, నిర్మలంబగు తన మనంబున నిట్లను; “నింతకాలం బత్యంత దురంతంబగు దారిద్య్రదుఃఖార్ణవంబున మునింగి యున్న నాకుం గడపటఁ గలిగిన విభవంబున నిప్పుడు.
10.2-1029-ఆ.
ఎన్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా
కబ్బు టెల్ల హరిదయావలోక
నమునఁ జేసి కాదె! నళినాక్షుసన్నిధి
కర్థి నగుచు నేను నరుగుటయును. 

భావము:
కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకూ లోనుకాకుండా సుఖంగా జీవిస్తూ, తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు “ఇన్నాళ్ళూ దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది. ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్ళడం.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1029 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Sunday, February 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౦(480)

( అటుకులారగించుట ) 

10.2-1026-క.
ఆ నారీరత్నంబునుఁ
దానును ననురాగరసము దళుకొత్తఁగ ని
త్యానందము నొందుచుఁ బెం
పూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెఱయన్.
10.2-1027-సీ.
కమనీయ పద్మరాగస్తంభకంబులుఁ-
  గొమరారు పటికంపుఁ గుడ్యములును
మరకత నవరత్నమయ కవాటంబులుఁ-
  గీలిత హరి నీల జాలకములు
దీపిత చంద్రకాంతోపల వేదులు-
  నంచిత వివిధ పదార్థములును
దగు హంసతూలికా తల్పంబులును హేమ-
  లాలిత శయనస్థలములుఁ దనరు
10.2-1027.1-తే.
సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు
మానితోన్నత చతురంతయానములును
వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును
గలిగి చెలువొందు మందిరం బెలమిఁ జొచ్చి. 

భావము:
కృష్ణుని అనుగ్రహంవలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరకూ సరిక్రొత్త అన్యోన్యానురాగాలు చిగురిస్తుండగా అపారమైన ఆనందాన్ని పొందారు. పద్మరాగాలు తాపిన చిరుస్తంభాలు; చలువరాతితో నిర్మించిన గోడలు; మరకతమణులు నవరత్నాలు పొదిగిన గుమ్మాలు, తలుపులు; ఇంద్రనీలాల కిటికీలు; అందగించే చంద్రకాంత శిలావేదికలు; బహువిధ పదార్ధాలు; హంసతూలికా తల్పాలు; స్వర్ణమయ శయన మందిరాలు; వైభవోపేతమైన ఉన్నత పీఠములు; చక్కటి నాలుగు బొంగుల పల్లకీలు; కావలసిన సమస్త వస్తువులతో నిండుగా ఉన్న వాటికలు; కలిగి అందాలు చిందే ఆ భవనం లోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1027 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Saturday, February 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౯(479)

( అటుకులారగించుట ) 

10.2-1024-వ.
ఇట్లు సనుదేర నతని భార్య యైన సతీలలామంబు దన మనంబున నానందరసమగ్న యగుచు.
10.2-1025-సీ.
తన విభురాక ముందటఁ గని మనమున-
  హర్షించి వైభవం బలర మనుజ
కామినీరూపంబు గైకొన్న యిందిరా-
  వనిత చందంబునఁ దనరుచున్న
కలకంఠి తన వాలుఁగన్నుల క్రేవల-
  నానందబాష్పంబు లంకురింప
నతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భా-
  వంబున నాలింగనంబు సేసె
10.2-1025.1-తే.
నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ
రణ విభూషితలై రతిరాజు సాయ
కముల గతి నొప్పు పరిచారికలు భజింప
లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి. 

భావము:
కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది. ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి, ఎంతో ఆనందంతో ఎదురువచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. ఆమె కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. మనస్సులోనే భర్త పాదాలకు నమస్కరించి, కౌగలించుకుంది. దివ్యాంబరాలూ ఆభరణాలు ధరించి మన్మథుడి బాణాల లాగ ఉన్న పరిచారికల సేవలందుకుంటూ ఐశ్వర్యంతో తులతూగే తన భార్యను కుచేలుడు చూసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1025 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Friday, February 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౮(478)

( అటుకులారగించుట ) 

10.2-1021-సీ.
భానుచంద్రప్రభా భాసమానస్వర్ణ-
  చంద్రకాంతోపల సౌధములునుఁ
గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ-
  మానిత కూజితోద్యానములును
ఫుల్లసితాంభోజ హల్లక కహ్లార-
  కైరవోల్లసిత కాసారములును
మణిమయ కనక కంకణ ముఖాభరణ వి-
  భ్రాజిత దాసదాసీజనములుఁ
10.2-1021.1-తే.
గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ
యమునుఁ బొందుచు "నెట్టి పుణ్యాత్ముఁ డుండు
నిలయ మొక్కొ! యపూర్వమై నెగడె మహిత
వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు."
10.2-1022-వ.
అని తలపోయుచున్న యవసరంబున.
10.2-1023-తే.
దివిజ వనితలఁ బోలెడు తెఱవ లపుడు
డాయ నేతెంచి "యిందు విచ్చేయుఁ" డనుచు
విమల సంగీత నృత్య వాద్యములు సెలఁగ
గరిమఁ దోడ్కొని చని రంతిపురమునకును. 

భావము:
సూర్యచంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి మేడలు, శుక, పిక, మయూరాల కూజితాలతో అలరారే చక్కటి ఉద్యానవనాలు, వికసించిన అనేక వన్నెల తామరలతో కలువలతో కనులపండువుగా ఉన్న సరోవరాలు, మణికంకణాలు మున్నగు రకరకాల భూషణాలూ ధరించి ప్రకాశిస్తున్న దాస దాసీజనము కలిగిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. “ఏ పుణ్యాత్ముని భవనమో ఇది సిరిసంపదలకు నిలయముగా అపూర్వంగా ప్రకాశిస్తున్నది.” ఇలా అనుకుంటూ సంకోచిస్తున్న సమయంలో దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి, “ఇటు దయచేయండి.” అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురం లోనికి తీసుకుని వెళ్ళారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1021 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, February 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౭(477)

( అటుకులారగించుట ) 

10.2-1019-ఉ.
శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె; నెన్న దరిద్రుఁడు సంపదంధుఁడై
కానక తన్నుఁ జేరఁ డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వవస్తుపరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే? "
10.2-1020-వ.
అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకుఁ జనిచని ముందట. 

భావము:
మహా సంపన్నుడు అయిన శ్రీకృష్ణుడు నన్ను గొప్పగా సత్కరించాడు. కానీ దరిద్రుడుకి సంపదలు లభిస్తే గర్వాంధుడై తనను సేవించడని కాబోలు ధనము మాత్రం ఏమీ ఇవ్వలేదు అనుకుంటాను. లేకపొతే ఆశ్రితజనుల ఆర్తిని బాపే అంబుజాక్షుడు, అపార కృపా సముద్రుడు, నాకు సకల సంపదలు అనుగ్రహించకుండా ఉంటాడా?” ఈ మాదిరి ఆలోచనలతో కుచేలుడు పయనించి తన ఊరికి చేరుకున్నాడు. అక్కడ కుచేలుడు తన కట్టెదుట.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1020 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




శ్రీకృష్ణ విజయము - ౪౭౬(476)

( అటుకులారగించుట ) 

10.2-1016-క.
"నా పుణ్య మరయ నెట్టిదొ
యా పుణ్యనిధిం, బ్రశాంతు, నచ్యుతు, నఖిల
వ్యాపకు, బ్రహ్మణ్యునిఁ, జి
ద్రూపకుఁ, బురుషోత్తమునిఁ, బరుం గనుఁగొంటిన్.
10.2-1017-సీ.
పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి-
  యే నేడ? నిఖిలావనీశ్వరి యగు
నిందిరాదేవికి నెనయంగ నిత్య ని-
  వాసుఁడై యొప్పు న వ్వాసుదేవుఁ
డేడ? న న్నర్థిమైఁ దోడఁబుట్టిన వాని-
  కైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్ప-
  మున నుంచి సత్క్రియల్‌ పూనినడపి
10.2-1017.1-తే.
చారు నిజవధూ కరసరోజాత కలిత
చామరానిలమున గతశ్రమునిఁ జేసి
శ్రీకుచాలిప్త చందనాంచితకరాబ్జ
తలములను నడ్గు లొత్తె వత్సలత మెఱసి. 

భావము:
“ఆహా ఏమి నాపుణ్యం? ఆ పుణ్యల రాశిని; పరమ శాంతుని; అచ్యుతుని; అఖిల వ్యాపకుని; చిన్మయ స్వరూపుని; పర మాత్మను; పురు షోత్తముని; శ్రీకృష్ణపరమాత్మను దర్శించ గలిగాను. మందుడను అయిన నే నెక్కడ? లక్ష్మికి నిత్యనివాస మైన వాసుదేవు డెక్కడ? అచ్యుతుడు అనురాగంతో నన్ను తన తోడబుట్టినవాడిలా కౌగిట చేర్చాడు. దేవుడితో సమానమైన వాడిలా భావించి తన పానుపు మీద కూర్చోబెట్టుకున్నాడు. పూని నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి రుక్మిణీదేవి నాకు వింజామర వీచింది. నా శ్రమను పోగొట్టింది. అతిశయించిన వాత్సల్యంతో శ్రీకృష్ణుడే సాక్షాత్తూ లక్ష్మీదేవిని లాలించే తన చందనాలు అలదిన పాణిపల్లవాలతో ఆప్యాయంగా నా పాదా లొత్తాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1017 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, February 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౫(475)

( అటుకులారగించుట ) 

10.2-1015-వ.
అని యిట్లు వారించె; నక్కుచేలుండును నా రాత్రి గోవిందు మందిరంబునఁ దనకు హృదయానందకరంబు లగు వివిధ పదార్థంబు లనుభవించి, మృదుల శయ్యాతలంబున నిద్రించి తన మనంబునం దన్ను సమధిక స్వర్గభోగానుభవుంగాఁ దలంచుచు మఱునాఁ డరుణోదయంబున మేల్కని కాలోచితకృత్యంబులు దీర్చి, యిందిరారమణుండు దన్నుఁ గొంత దవ్వనిపి యామంత్రితుం జేయఁ జనుచు నందనందన సందర్శనానంద లోలాత్ముండై తన మనంబున నిట్లనియె. 

భావము:
అలా భర్తను రుక్మిణీదేవి వారించింది. పిమ్మట, కుచేలుడు నాటి రాత్రి శ్రీకృష్ణుని మందిరంలో తనకు ఇష్టమైన రకరకాల పదార్ధాలు అన్నీ భుజించాడు. మెత్తని పానుపు మీద పవళించి తాను స్వర్గభోగాన్ని అనుభవిస్తున్నంతగా సంతోషించాడు. మరునాడు తెలవారగానే అతడు కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తన అప్తమిత్రుడిని కొంతదూరం కూడా వచ్చి సాగనంపాడు. ఆ నందనందనుడు అయిన శ్రీకృష్ణుని దర్శించిన ఆనందంతో నిండిన అక్కఱతో కుచేలుడు వెళుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1015 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Saturday, February 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౪(474)

( అటుకులారగించుట ) 

10.2-1013-క.
మురహరుఁడు పిడికెఁ డడుకులు
గర మొప్పఁగ నారగించి కౌతూహలియై
మఱియునుఁ బిడికెఁడు గొనఁ ద
త్కర మప్పుడు పట్టెఁ గమల కరకమలములన్.
10.2-1014-క.
"సొం పారఁగ నతనికి బహు
సంపద లందింప నివియ చాలును నిఁక భ
క్షింపఁగ వలవదు త్రిజగ
త్సంపత్కర! దేవదేవ! సర్వాత్మ! హరీ! " 

భావము:
శ్రీపతి తీసుకున్న ఆ పిడికెడు అటుకుల్ని ఆదరంగా తిన్న తరువాత, మళ్ళీ ఇంకొక్క పిడికెడు తీసుకుంటున్నాడు. ఇంతలో, రుక్మిణీదేవి తన రెండు చేతులతో భర్త చేయి పట్టుకుని వారిస్తూ ఇలా అన్నది. “దేవాదిదేవా! సకలాంతరాత్మా! శ్రీహరీ! ముజ్జగాలకు సంపద లొసగు వాడా! ఈ కుచేలుడికి సకల సంపదలను అందించడానికి మీరు ఆరగించిన గుప్పెడు అటుకులే చాలు. ఇక భక్షించకండి.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1014 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Thursday, February 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౨(472)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1010-క.
దళమైనఁ బుష్పమైనను
ఫలమైనను సలిలమైనఁ బాయని భక్తిం
గొలిచిన జను లర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్.
10.2-1011-క.
అని పద్మోదరుఁ డాడిన
వినయోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె
చ్చిన యడుకులు దగ నర్పిం
పను నేరక మోము వాంచి పలుకక యున్నన్. 

భావము:
పత్రమైనా ఫలమైనా పుష్పమైనా జలమైనా సరే భక్తితో నాకు సమర్పిస్తే దానిని మధురాన్నంగా భావించి స్వీకరిస్తాను.” అనిన పద్మనాభుడి వినయ పూరిత వాక్కులకు కుచేలుడు సంతోషించాడు. తాను తీసుకు వచ్చిన అటుకులను అర్పించలేక తలవంచుకుని మౌనంగా ఉన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1011 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




శ్రీకృష్ణ విజయము - ౪౭౩(473)

( అటుకులారగించుట ) 

10.2-1012-వ.
అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుండు దన దివ్యచిత్తంబున నెఱింగి “యితండు పూర్వభవంబున నైశ్వర్యకాముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబుకొఱకు నా యొద్దకుఁ జనుదెంచిన వాఁ; డితనికి నింద్రాదులకుం బడయ రాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు” నని తలంచి యతండు జీర్ణవస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యడుకుల ముడియఁ గని “యిది యేమి” యని యొయ్యన నమ్ముడియఁ దనకరకమలంబుల విడిచి యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని “యివియ సకల లోకంబులను, నన్నును బరితృప్తిం బొందింపఁ జాలు” నని యప్పుడు. 

భావము:
కుచేలుడు వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. పూర్వజన్మ నుండి ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించినవాడు కాదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా దగ్గరకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని సకల సంపదల్ని ఈక్షణమే ఇతనికి ఇవ్వాలని భగవంతుడు భావించాడు. తన చినిగిన ఉత్తరీయంలో ముడివేసి కుచేలుడు తీసుకువచ్చిన అటుకులను చూసి, కృష్ణుడు ఆలా అన్నాడు. ఇదేమిటి అని అడుగుతూ ముడి విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు, “నాకూ సమస్త లోకాలకూ సంతృప్తి కలిగించడానికి ఇవి చాలు.” అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1012 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Tuesday, February 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౧(471)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1009-వ.
అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మితవదనారవిందుం డగుచు నతనిం జూచి “నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రంబైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున. 

భావము:
గోవిందుడు సకల ప్రాణుల మనసులోని భావాలను ఎరిగిన వాడు, కనుక సాభిప్రాయంగా కుచేలుడు పలికిన ఈ పలుకులలోని అంతర్యాన్ని గ్రహించాడు. మందస్మిత వదనారవిందుడై కుచేలుడితో “నీ విక్కడికి వస్తూ నా కోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వత మంత పదార్థం ఇచ్చినా, అది నాకు అంగీకారం కాదు. అందుచేత... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1009 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Monday, February 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౦(470)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1005-క.
కని గారవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
మనమునఁ దలఁతే" యటంచు మఱియుం బలికెన్.
10.2-1006-వ.
“అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!” యని యవి యెల్లం దలంచి యాడు మాధవు మధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె.
10.2-1007-క.
"వనజోదర! గురుమందిర
మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం
పని పను లెవ్వియుఁ గలవే?
విను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా! 

భావము:
ఇలా దీవించి, పిమ్మట గురువు సాందీపని వాత్సల్యంతో మనలను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీవు తలచుకుంటూ ఉంటావా?” అని కుచేలునితో శ్రీకృష్ణుడు మరల ఇలా అన్నాడు.
“పుణ్యాత్మా! అప్పుడు, మనం చదువుకుంటూ అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలగిన తీరులు నీవు మర్చిపోలేదు కదా?” ఈ విధంగా శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి ముచ్చటలను గుర్తుచేసుకుంటూ పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు. “ఓ సచ్చరితుడా! దామోదరా! గురువుగారి ఆశ్రమంలో సంతోషంతో మనం చేయని పనులు ఏమైనా అసలు ఉన్నాయా? అది అలా ఉండనీ కాని నా మాట విను. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1006 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Saturday, February 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౯(469)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1003-క.
అప్పుడు సాందీపని మన
చొప్పరయుచు వచ్చి వానసోఁకునను వలిం
దెప్పిఱిలుటఁ గని ఖేదం
బుప్పతిలం బలికె "నకట! యో! వటులారా!
10.2-1004-చ.
కటకట! యిట్లు మా కొఱకుఁగాఁజనుదెంచి మహాటవిన్ సము
త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు! మీ ఋణంబు నీఁ
గుట కిది కారణంబు సమకూరెడిఁ బో; యిట మీఁద మీకు వి
స్ఫుట ధనబంధుదారబహుపుత్త్ర విభూతి జయాయురున్నతుల్‌. " 

భావము:
అప్పుడు, మన గురువుగారైన సాందీపని మహర్షి మనలను వెదుక్కుంటూ వచ్చాడు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనల్ని చూసి విచారం పొంగిపొరలగా ఇలా అన్నాడు. “అమ్మో! పిల్లల్లారా! మాకోసం అడవికి వచ్చి అయ్యయ్యో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కనుక, ఓ శిష్యులారా! మీరు మీ గురుఋణం తీర్చుకున్నారు. మీకు ధన దార బహు పుత్ర సంపదలూ దీర్ఘాయురున్నతులూ విజయశ్రీలు చేకూరగలవు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1004 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Friday, February 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౮(468)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1002-క.
తెలతెలవాఱెడి వేళం
గలకల మని పలికెఁ బక్షిగణ మెల్లెడలన్
మిలమిలని ప్రొద్దుపొడువున
ధళధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్. 

భావము:
ఇంతలో తెలతెల్లగా తెల్లవారింది. పక్షుల కలకలారావాలు వినబడుతున్నాయి. మిలమిల కాంతులు పరచుకుంటున్నాయి. సకల దిక్కుల లోనూ తళతళలాడుతూ ఉదయకాంతులు నిండాయి. 

ఈ పద్యాన్ని పోతనగారు “తెలతెల”, “కలకల”, “మిలమిల”, “ధళధళ” జంటపదాలతో వేసిన వృత్త్యనుప్రాసము అద్భుతంగా అలంకరించారు. అర్థభేదం, శబ్దభేదం లేకుండా అవే పదాలు తత్పర్య భేదం కలిగి తిరిగి అవ్యవధానంగా (ఎడం లేకుండా) ప్రయోగిస్తే “వృత్త్యనుప్రాససాలంకారము” అంటారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1002 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Thursday, February 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౭(467)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1000-తే.
బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును
రహిత సహితస్థలంబు లేర్పఱుపరాక
యున్న యత్తఱి మనము నొండొరుల చేతు
లూతఁగాఁ గొని నడచుచు నుండునంత.
10.2-1001-క.
బిసబిస నెప్పుడు నుడుగక
విసరెడి వలిచేత వడఁకు విడువక మనముం
బస చెడి మార్గముఁ గానక
మసలితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్. 

భావము:
త్రోవలూ డొంకలూ మిట్ట పల్లాలూ కనపడకుండా వాననీరు కప్పివేసింది; ఒకరి చేతిని ఒకరం ఊతగా పట్టుకుని మనం ఆ అడవిలో దారి కానక తిరిగాము. తీవ్రంగా వీచే గాలులకు మనం విపరీతంగా వణకసాగాం; మనం ఏం చేయలో తోచక, దిక్కూ తెన్నూ తెలియక అడవిలో తెగ తిరిగాము; అప్పుడు, ఎట్టకేలకు సూర్యోదయం అయింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1001 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Wednesday, February 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౬(466)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-999-సీ.
ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత;
పటల సంఛన్నాభ్రభాగ మగుచుఁ
జటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నా;
నావిధ జంతుసంతాన మగుచుఁ
జండ దిగ్వేదండ తుండ నిభాఖండ;
వారిధారాపూర్ణ వసుధ యగుచు
విద్యోతమానోగ్రఖద్యోత కిరణజి;
ద్విద్యుద్ధ్యుతిచ్ఛటావిభవ మగుచు
10.2-999.1-తే.
నడరి జడిగురియఁగ నినుఁ డస్తమింప
భూరినీరంధ్రనిబిడాంధకార మేచి
సూచికాభేద్యమై వస్తుగోచరంబు
గాని యట్లుండ మనము న వ్వానఁ దడిసి. 

భావము:
పెద్ద పెద్ద ఉరుములతో ఆకాశం అంతా భీకరంగా కారుమబ్బులు ఆవరించాయి; సుడిగాలులు మహా వేగంతో వీచి అడవి జంతువులను ఎగరగొట్టసాగాయి; వర్షధారలు దిగ్గజాలతొండా లంత పరిమాణంతో భూమిపై వర్షించాయి; మెరుపులు మిరుమిట్లు గొలిపాయి; వాన జడి పెరిగింది; సూర్యుడు అస్తమించాడు; వర్షం ఆగలేదు; చీకట్లు దట్టంగా వ్యాపించి, కంటికి ఏమీ కనపడటం లేదు; అలాంటి జడివానలో మనం తడిసి ముద్దయ్యాము. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=999 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :