Thursday, July 28, 2016

క్షీరసాగరమథనం – క్రొక్కారు మెఱుఁగు


అష్టమ స్కంధముఅప్సరావిర్భావము

8-262-వ.
మఱియునుం గొండకవ్వంబునం గడలి మథింప నప్సరోజనంబు జనించె నంత.
8-263-క.
క్రొక్కారు మెఱుఁగు మేనులు 
గ్రిక్కిరిసిన చన్నుఁగవలుఁ గ్రిస్సిన నడుముల్
పిక్కటిలి యున్న తుఱుములుఁ
క్కని చూపులును దివిజతులకు నొప్పెన్.
8-264-వ.
వెండియు నా రత్నాకరంబు నందు సుధాకరుం డుద్భవించి; విరించి యనుమతంబునఁ దన యథాస్థానంబునం బ్రవర్తించుచుండె; నంత.

టీకా:
                        మఱియున్ = ఇంకను; కొండ = పర్వతపు; కవ్వంబునన్ = కవ్వముతో; కడలిన్ = సముద్రమును; మథింపన్ = చిలుకగా; అప్సరస్ = దేవకన్యలు; జనంబున్ = సమూహము; జనించెన్ = పుట్టనివి; అంతన్ = అంతట.
            క్రొక్కారు = వర్షాకాలపు; మెఱుగు = మెరుపుతీగలవంటి; మేనులున్ = తనువులు; క్రిక్కరిసిన = ఎడములేకవ్యాపించిన; చన్ను = స్తనముల; కవలు = జంటలు (2); క్రిస్సిన = కృశించిన; నడుముల్ = నడుములు; పిక్కటిలి = నిండారి; ఉన్న = ఉన్నట్టి; తుఱుములున్ = కొప్పులు; చక్కని = మనోహరమైన; చూపులునున్ = చూపులు; దివిజసుతల్ = అప్సరసల; కున్ = కు; ఒప్పెన్ = అమరెను.
            వెండియున్ = ఇంకను; రత్నాకరంబున్ = సముద్రము; అందున్ = లో; సుధాకరుండు = చంద్రుడు; ఉద్భవించి = పుట్టి; విరించి = బ్రహ్మదేవుడు; అనుమతంబునన్ = అనుజ్ఞ ప్రకారము; తన = తన యొక్క; యథా = స్వ; స్థానంబునన్ = స్థానమునందు; ప్రవర్తించుచుండెన్ = వర్తిల్లుచుండెను; అంతన్ = అంతట.

భావము:
            మందరపర్వతం అనే కవ్వంతో అలా సాగరాన్ని చిలుకుతుంటే, తరువాత అప్సరస స్త్రీలు పుట్టారు. వారు. . .
            వానాకాలంలో మెరిసే మెరుపుతీగలవంటి మేనులతో, చిక్కని చక్కని స్తనాలతో, సన్నని నడుములతో, నిండైన కొప్పులతో, అందమైన చూపులతో సుందరంగా ఉన్నారు.
            ఆపైన, రత్నాలగని అయిన ఆ కడలిని మధిస్తుంటే, వెన్నెల అమృతాన్ని వెదజల్లే చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ దేవుడి అనుమతితో చంద్రుడు తన యథాస్థానాన్ని అధిష్టించాడు. పిమ్మట . . .


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: