Thursday, March 31, 2016

దేవతల నరసింహ స్తుతి - త్రిభువనశత్రుఁడు


7-333-వ.
వైతాళికు లిట్లనిరి.
7-334-క.
త్రిభువనశత్రుఁడు పడియెను
సభలందును మఖము లందు జగదీశ్వర! నీ
శుభగీతములు పఠించుచు
నభయులమై సంచరింతు మార్తశరణ్యా!
టీకా:
          వైతాళికులు = మేలుకొలుపు పాడు వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          త్రిభువన = ముల్లోకములకు; శత్రుడు = శత్రువు; పడియెన్ = చనిపోయెను; సభలు = సభలు; అందును = లోను; మఖములు = యజ్ఞములు; అందున్ = లోను; జగదీశ్వర = నరసింహుడా {జగదీశ్వరుడు - జగత్ (భువనములకు) ఈశ్వరుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; శుభ = మంగళ; గీతములున్ = స్తోత్రములను; పఠించుచున్ = పాడుచు; అభయులము = భయములేనివారము; ఐ = అయ్యి; సంచరింతుము = తిరిగెదము; ఆర్తశరణ్య = నరసింహుడా {ఆర్తశరణ్యుడు - ఆర్తులైనవారికి శరణు యిచ్చువాడు, విష్ణువు}.
భావము:
            మేలుకొలుపులు పాడే వైతాళికులు ఇలా స్తుతించారు
            “ఓ సకల భువన పాలకా! నరకేసరి! నీవు ఆర్తులకు శరణు ఇచ్చువాడవు. ముల్లోకాలకూ శత్రువు అయిన హిరణ్యకశిపుడు మరణించాడు. ఇంక యజ్ఞశాలలలోనూ, సభావేదికలమీదా నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యం మేము నిర్వహిస్తాము.”
७-३३३-व.
वैताळिकु लिट्लनिरि.
७-३३४-क.
त्रिभुवनशत्रुँडु पडियेनु
सभलंदुनु मखमु लंदु जगदीश्वर! नी
शुभगीतमुलु पठिंचुचु
नभयुलमै संचरिंतु मार्तशरण्या!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, March 30, 2016

దేవతల నరసింహ స్తుతి - పురుషోత్తమ

7-331-వ.
కింపురుషు లిట్లనిరి.
7-332-క.
పురుషోత్తమ! నేరము కిం
పురుషుల మల్పులము నిన్ను భూషింపఁగ దు
ష్పురుషున్ సకల సుజన హృ
త్పరుషుం జంపితివి జగము బ్రదికె నధీశా!
టీకా:
          కింపురుషులు = కిపురుషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          పురుషోత్తమ = నరసింహుడా; నేరము = సమర్థులముకాము; కింపురుషులము = కింపురుషజాతి వారము; అల్పులము = చిన్నవారము; నిన్నున్ = నిన్ను; భూషింపగన్ = స్తుతించుటకు; దుష్పురుషున్ = చెడ్డవానిని; సకల = అఖిలమైన; సుజన = మంచివారి; హృత్ = హృదయములకు; పరుషున్ = కఠినుని; చంపితివి = సంహరించితివి; జగము = భువనము; బ్రతికెన్ = కాపాడబడినది; అధీశా = నరసింహుడా {అధీశ - సర్వజగత్తులకు అధి (పై) ఈశ (ప్రభువు), విష్ణువు}.
భావము:
            కింపురుషులు కీర్తిస్తూ ఇలా అన్నారు
            “ఓ పురుషోత్తమా! పరమేశ! మేము కింపురుషులు అనే దేవతాభేదం వారం. నరముఖమూ అశ్వశరీరమూ కలవారం. అల్పులం. నీ మహాత్మ్యం కీర్తించడానికి మేము తగినవారం కాదు. శిష్టులైన వారి హృదయాలు గాయపడేలా బాధించేవాడు హిరణ్యకశిపుడు. ఆ దుష్టుడిని సంహరించావు. లోకమంతా బ్రతికిపోయింది.”
७-३३१-व.
किंपुरुषु लिट्लनिरि.
७-३३२-क.
पुरुषोत्तम! नेरमु किं
पुरुषुल मल्पुलमु निन्नु भूषिंपँग दु
ष्पुरुषुन् सकल सुजन हृ
त्परुषुं जंपितिवि जगमु ब्रदिके नधीशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, March 29, 2016

దేవతల నరసింహ స్తుతి - భ్రంశము లేని

7-329-వ.
యక్షు లిట్లనిరి.
7-330-ఉ.
భ్రంశము లేని నీ భటుల భంగవిముక్తుల మమ్ము నెక్కి ని
స్సంశయవృత్తి దిక్కులఁ బ్రచారము చేయుచు నుండు వీఁడు ని
స్త్రింశముతోడ; వీనిఁ గడతేర్చితి వాపద మానె నో! చతు
ర్వింశతితత్త్వశాసక! త్రివిష్టపముఖ్యజగన్నివాసకా!
టీకా:
          యక్షులు = యక్షులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          భ్రంశము = కలత; లేని = లేనట్టి; నీ = నీ యొక్క; భటులన్ = కింకరులము; భంగవిముక్తులము = పరాభవములేనివారము; మమ్మున్ = మమ్ములను; ఎక్కి = అధిరోహించి; నిస్సంశయ = సంశయమేమిలేని; వృత్తిన్ = విధముగ; దిక్కులన్ = అన్నివైపులకు; ప్రచారము = అధికముగ చరించుట; చేయుచునుండు = చేయుచుండు; వీడు = ఇతడు; నిస్త్రింశము = గోర్లు {నిస్త్రింశము - ముప్పది మానములకంటె పెద్దవి, నరహరి గోర్లు}; తోడన్ = తోటి; వీనిన్ = ఇతనిని; కడతేర్చితివి = చంపితివి {కడతేర్చు - (జీవితము) కడ (చివరకు) చేర్చు, చంపు}; ఆపద = కష్టము; మానెను = తప్పినది {త్రివిష్టపము - (ముల్లోకములు భూర్భువస్సువర్లోకములలోని) త్రి (మూడవ 3) విష్టపము (లోకము), స్వర్గము}; ఓ = ఓ {చతుర్వింశతితత్త్వములు -దశేంద్రియములు (10) విషయ పంచకము (5) భూత పంచకము (5) అంతఃకరణ చతుష్టయము}; చతుర్వింశతితత్త్వశాసక = నరసింహుడా {చతుర్వింశతితత్త్వశాసకుడు - 24 తత్త్వములను పాలించెడివాడు, విష్ణువు}; త్రివిష్టపముఖ్యజగన్నివాసకా = నరసింహుడా {త్రివిష్టపముఖ్యజగన్నివాసకుడు - త్రివిష్టప (స్వర్గము) మొదలగు జగత్ (లోకములలో) నివాసకా (వసించెడివాడు), విష్ణువు}.
భావము:
            యక్షులు ఈ విధంగా అన్నారు.
            “ఓ నరసింహస్వామీ! నీవు ఇరవైనాలుగు తత్వాలను ప్రవర్తింపజేసే వాడవు. త్రివిష్టప వాసులైన దేవత లందరికి ఉన్నతుడవు. జగత్తంతా నిండి ఆత్మ రూపంలో వసించి ఉండే వాసుదేవుడవు. ఈ దానవేశ్వరుడు అయ్యో పాపం అనికూడా అనుకోకుండా, మా భుజాల మీద ఎక్కి నల్దిక్కులా తిరుగుతుండే వాడు. ఆ హిరణ్యకశిపుడుని వధించావు. మా కష్టాలు కడతేర్చావు.”
७-३२९-व.
यक्षु लिट्लनिरि.
टीका:
भावमु:
७-३३०-उ.
भ्रंशमु लेनि नी भटुल भंगविमुक्तुल मम्मु नेक्कि नि
स्संशयवृत्ति दिक्कुलँ ब्रचारमु चेयुचु नुंडु वीँडु नि
स्त्रिंशमुतोड; वीनिँ गडतेर्चिति वापद माने नो! चतु
र्विंशतितत्त्वशासक! त्रिविष्टपमुख्यजगन्निवासका!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, March 28, 2016

దేవతల నరసింహ స్తుతి - భువనజన

7-327-వ.
చారణు లిట్లనిరి.
7-328-క.
భువనజన హృదయభల్లుఁడు
దివిజేంద్ర విరోధి నేఁడు దెగె నీ చేతన్
భవరోగ నివర్తక మగు
భవదంఘ్రి యుగంబుఁ జేరి బ్రదికెద మీశా!
టీకా:
          చారణులు = చారణులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          భువన = జగత్తునందలి; జన = జనుల యొక్క; హృదయ = హృదయములకు; భల్లుడు = బల్లెమువంటివాడు; దివిజేంద్ర = ఇంద్రుని {దివిజేంద్రుడు - దివిజ (దేవత)లకు ఇంద్రుడు, దేవేంద్రుడు}; విరోధి = శత్రువు; నేడు = ఈ దినమున; తెగెన్ = మరణించెను; నీ = నీ; చేతన్ = వలన; భవ = సంసారము యనెడి; రోగ = రోగమును; నివర్తకము = పోగొట్టునది; అగు = అయిన; భవత్ = నీ యొక్క; అంఘ్రి = పాదముల; యుగంబున్ = జంటను; చేరి = చేరి; బ్రదికెదము = బతికెదము; ఈశా = నరసింహుడా.
భావము:
            చారణులు ఇలా అన్నారు.
            “ఓ నరకేసరీ! సర్వలోకేశ్వరా! హిరణ్యకశిపుడు ప్రజా హృదయ కంటకుడు. దేవేంద్రుని బద్దశత్రువూ. రాత్రించరులైన రాక్షస జాతికి చెందినవాడు నీ చేతిలో మరణించాడు, మా కష్టాలు గట్టెక్కాయి. ఇంక సంసార బంధాలనుండి విముక్తి నొసంగే నీ పాదపద్మాలను ఆశ్రయించి బ్రతుకుతాము.”
७-३२७-व.
चारणु लिट्लनिरि.
७-३२८-क.
भुवनजन हृदयभल्लुँडु
दिविजेंद्र विरोधि नएँडु देगे नी चेतन्
भवरोग निवर्तक मगु
भवदंघ्रि युगंबुँ जेरि ब्रदिकेद मीशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, March 27, 2016

దేవతల నరసింహ స్తుతి - ఆడుదుము

7-325-వ.
గంధర్వు లిట్లనిరి.
7-326-క.
ఆడుదుము రేయుఁబగలుం
బాడుదుము నిశాటు నొద్ద, బాధించు దయం
జూడఁడు నీచే జమునిం
గూడె మహాపాతకునకుఁ గుశలము గలదే.
టీకా:
          గంధర్వులు = గంధర్వులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          ఆడుదుము = నాట్యముచేసెదము; రేయున్ = రాత్రులందు; పగలున్ = పగళ్ళయందు; పాడుదుము = పాడెదము; నిశాటున్ = రాక్షసుని {నిశాటుడు - రాత్రించరుడు, రాక్షసుడు}; ఒద్దన్ = దగ్గర; బాధించున్ = బాధపెట్టును; దయన్ = కరుణతో; చూడడు = చూడడు; నీ = నీ; చేన్ = చేత; జమునిగూడెన్ = చనిపోయెను {జమునిగూడు - జముని (యముని) కూడు (కలియు), మరణించు}; మహా = అతి; పాతకున్ = తీవ్రమైనపాపములుగలవాని; కున్ = కు; కుశలము = క్షేమము; కలదే = ఉండునా ఏమి.
భావము:
            గంధర్వులు ఇలా అంటూ గానాలు చేసారు.
            “ప్రభూ! రాత్రిం బవళ్ళు ఈ రాక్షసుడి సమక్షంలో గానం చేసేవాళ్ళం; నాట్యం చేసే వాళ్ళం; అయినా మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు; ఏనాడూ దయగా చూడలేదు. వీడిలాంటి మహాపాపిష్టి వానికి మంగళం ఎలా కలుగుతుందా? చివరికి నీ వల్ల యమపురికి పోయాడు”
७-३२५-व.
गंधर्वु लिट्लनिरि.
७-३२६-क.
आडुदुमु रेयुँबगलुं
बाडुदुमु निशाटु नोद्द, बाधिंचु दयं
जूडँडु नीचे जमुनिं
गूडे महापातकुनकुँ गुशलमु गलदे.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, March 26, 2016

దేవతల నరసింహ స్తుతి - ప్రజలం

7-323-వ.
ప్రజాపతు లిట్లనిరి.
7-324-మ.
ప్రజలం జేయుటకై సృజించితి మముం బాటించి; దైత్యాజ్ఞచేఁ
బ్రజలం జేయక యింతకాలము మహాభారంబుతో నుంటి; మీ
కుజనున్ వక్షముఁ జీరి చంపితివి; సంకోచంబు లే కెల్ల చోఁ
బ్రజలం జేయుచు నుండువారము జగద్భద్రాయమాణోదయా!
టీకా:
          ప్రజాపతులు = ప్రజాపతులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          ప్రజలన్ = లోకులను; చేయుట = పుట్టించుట; కై = కోసము; సృజించితి = పుట్టించితి; మమున్ = మమ్ములను; పాటించి = పూని; దైత్య = రాక్షసుని; ఆజ్ఞ = ఉత్తరువుల; చేత = వలన; ప్రజలన్ = లోకులను; చేయక = పుట్టించకుండగ; ఇంత = ఇన్ని; కాలమున్ = దినములు; మహా = గొప్ప; భారంబు = దుఃఖభారము; తోన్ = తోటి; ఉంటిమి = ఉన్నాము; ఈ = ఈ; కుజనున్ = దుర్జనుని; వక్షమున్ = రొమ్మును; చీరి = చీల్చివేసి; చంపితివి = సంహరించితివి; సంకోచంబుల్ = అనుమానములు; లేకన్ = లేకుండగ; ఎల్ల = అన్ని; చోన్ = చోటులందు; ప్రజలన్ = లోకులను; చేయుచున్ = చేయుచు; ఉండువారము = ఉంటాము; జగత్ = లోకములను; భద్రాయమాణ = క్షేమకరమగుటకు; ఉదయా = అవతరించినవాడ.
భావము:
            ప్రజాపతులు ప్రస్తుతిస్తూ ఇలా అన్నారు.
            “ఓ నరకేసరీ! జగత్తులకు మేలు చేయుటకు అవతరించిన ప్రభువా! జగద్రక్షకా! మమ్మల్ని ప్రజాసృష్టి చేయటం కోసమే సృష్టించావు. కానీ ఈ రాక్షసుడి ఆజ్ఞ మూలాన ఆ ప్రజాసృష్టినే మానేయవలసి వచ్చింది. ప్రజా వ్యవస్థకు దురవస్థ దాపురించింది. ఆ దుర్మతి హిరణ్యకశిపుని గుండెలు చీల్చి చంపావు. ఇంక ఏ సంకోచమూ లేకుండా ప్రజాసృష్టి చేస్తుంటాము.”
७-३२३-व.
प्रजापतु लिट्लनिरि.
७-३२४-म.
प्रजलं जेयुटकै सृजिंचिति ममुं बाटिंचि; दैत्याज्ञचेँ
ब्रजलं जेयक यिंतकालमु महाभारंबुतो नुंटि; मी
कुजनुन् वक्षमुँ जीरि चंपितिवि; संकोचंबु ले केल्ल चोँ
ब्रजलं जेयुचु नुंडुवारमु जगद्भद्रायमाणोदया!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :