Wednesday, November 14, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 47

10.1-526-వ.
ఇట్లు బాలకాలింగనంబుల నానందబాష్పపూరిత నయనులై గోపకులు గోవుల మరలించుకొని తలంగిచన వారలం జూచి బలభ ద్రుండు తనలోఁ నిట్లని తలంచె.


భావము:
ఈ విధంగా కుమారులను కౌగలించుకోవడంతో కలిగిన ఆనందబాష్పాలతో నిండిన కన్నులతో గోపకులు కుమారులను వదలిపెట్టి గోవులను మళ్ళించుకుని దూరంగా వెళ్ళిపోయారు. వారిని చూసి బలరాముడు ఇలా అనుకున్నాడు.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Sunday, November 11, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 46

10.1-524-వ.
అంత గోపకులు గోవుల వారింప నలవి గాక దిగ్గన నలుకతోడి సిగ్గు లగ్గలంబుగ దుర్గమ మార్గంబున వానివెంట నంటి వచ్చి లేఁగల మేపుచున్న కొడుకులం గని.
10.1-525-ఉ.
అయ్యలఁ గంటి మంచుఁ బులకాంకురముల్ వెలయంగఁ గుఱ్ఱలం
జయ్యన డాసి యెత్తికొని సంతస మందుచుఁ గౌగలింపఁ దా
రయ్యెడ నౌదలల్ మనము లారఁగ మూర్కొని ముద్దు చేయుచున్
దయ్య మెఱుంగు; గోపకులు దద్దయు నుబ్బిరి నిబ్బరంబుగన్.

భావము:
ఇంతవరకూ తమ మాటలను ఆవులు ధిక్కరించేవి కాదు. అలాంటిది అలా వచ్చిన ఆవులను ఆపుచేయడం, గోపకులకు సాధ్యం కాలేదు. వారికి కోపంతోపాటు సిగ్గు కూడా కలిగింది. వాటి వెనుకనే తుప్పల వెంట బండల పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూసారు. మమతలతో వారు కోపాలు సిగ్గులు అన్నీ మరచిపోయారు. “మా చిన్ని అయ్యలను చూడగలిగాము” అంటూ బిడ్డల వద్దకు చేరి వారిని ఎత్తుకున్నారు. ఒడలంతా పులకలెత్తుతుండగా సంతోషంతో కౌగలించుకుని తలలను మూర్కొని ముద్దులు చేసారు. బిడ్డలలో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=71&padyam=525

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 45

10.1-522-వ.
ఇట్లు కృష్ణుండు బాలవత్సరూపంబులు దాల్చి తన్నుఁ దాన రక్షించుకొనుచు, మందను వనంబున నమంద మహిమంబున నొక్క యేఁడు గ్రీడించె, నా యేటికి నైదాఱు దినంబులు కడమపడి యుండ నం దొక్కనాఁడు బలభద్రుండును, దానును వనంబునకుం జని మందచేరువ లేఁగల మేప నతి దూరంబున గోవర్థన శైలశిఖరంబున ఘాసంబులు గ్రాసంబులు గొనుచున్న గోవు లా లేఁగలం గని.
10.1-523-చ.
ముదమున హుంకరించుచును; మూఁపులపై మెడ లెత్తి చాఁచుచున్
బదములు నాల్గు రెండయిన బాగునఁ గూడఁగ బెట్టి దాఁటుచున్
వదనములన్ విశాలతర వాలములన్ వడి నెత్తి పాఱి యా
మొదవులు చన్నులంగుడిపె మూఁతుల మ్రింగెడిభంగి నాకుచున్.


భావము:
ఇలా బాలకృష్ణుడు గొల్లపిల్లల రూపాలూ దూడల రూపాలు తానే ధరించి, అందరి రూపాలలోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ, ఆ బృందావనంలోనూ గోకులంలోనూ మహమహిమతో ఒక ఏడాది పాటు విహరించాడు. ఏడాదికి ఇంకా ఐదారు రోజులు ఉన్నయి అనగా, ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నారు. ఆ ప్రదేశానికి చాలాదూరంగా గోవర్ధనపర్వత శిఖరంపైన గోపకులు ఆవులు మేపుతున్నారు. ఆ కొండ మీది ఆవులు ఈ క్రింద ఉన్న దూడలను చూసాయి. ఆనందంతో ఆ ఆవులు ఒక్కసారి హూంకరించాయి; మూపుల పైదాకా మెడలు ఎత్తి వేగంగా చెంగుచెంగున దాట్లువేస్తూ పరిగెత్తాయి; తోకలు ముఖాలపైకి వచ్చేలా ఎత్తి దూడల దగ్గరకు పరిగెత్తాయి; లేగల మూతులను ఆత్రంగా నాకుతూ ఆవులు లేగలకు పాలు కుడిపాయి.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Thursday, November 8, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 44

10.1-520-క.
వ్రేతలకును గోవులకును 
మాతృత్వము జాలఁ గలిగె మఱి మాధవుపై
మాత లని హరియు నిర్మల
కౌతూహల మొప్పఁ దిరిగెఁ గడు బాల్యమునన్.
10.1-521-ఆ.
ఘోషజనుల కెల్లఁ గుఱ్ఱలపై వేడ్క
పూఁటపూఁట కెలమిఁ బొటకరించె
నిచ్చ గ్రొత్త యగుచు నీరజాక్షునిమీఁద
వేడ్క దమకుఁ దొల్లి వెలసినట్లు.

భావము:
గోపికలకు, గోవులకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో అధికంగా కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా వారి మధ్య ప్రవర్తించాడు. పూర్వం బాలకృష్ణుని మీద తమకు మిక్కిలి అధికమైన ప్రేమ కలిగినట్లు. ఈ గోపబాలకుల పైన కూడ గోకులంలోని జనులు అందరికి రోజురోజుకీ ప్రేమలు పెరగుతూ ఏరోజు కారోజు క్రొత్తలు తొడుగుతూనే ఉండేవి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=71&padyam=521

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 43

10.1-517-క.
ఏ తల్లుల కే బాలకు
లే తెఱఁగునఁ దిరిగి ప్రీతి నెఁసగింతురు ము
న్నా తల్లుల కా బాలకు
లా తెఱఁగునఁ బ్రీతిఁ జేసి రవనీనాథా!
10.1-518-వ.
ఆ సమయంబున.
10.1-519-ఉ.
పాయని వేడ్కతో నునికిపట్టులకుం జని గోవులెల్ల నం
బే యని చీరి హుమ్మనుచుఁ బేరిచి మూర్కొని పంచితిల్లి పె
ల్లై యతిరేకమై పొదుగులం దెడలేక స్రవించుచున్న పా
లాయెడ నాకుచున్ సుముఖలై యొసఁగెన్ నిజవత్సకోటికిన్.


భావము:
ఓ పరీక్షిన్మహారాజా! ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ యే విధంగా ఆనందం కలిగించారో; ఇప్పుడు అలాగే ఆ యా బాలకులు ఆ యా తల్లులకు అ యా విధాలైన ఆనందాలు కలిగించారు. ఆ సమయంలో దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే అంబా అంటూ బిడ్డలను పిలిచాయి; హుమ్మంటూ దూడలను వాసన చూసి, ఆనందంతో చటుక్కున మూత్రాలు కార్చాయి; ప్రేమతో దూడలను నాకుతూ, పొదుగుల నుండి కురుస్తున్న పాలను లేగదూడలకు త్రాగించాయి.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Wednesday, November 7, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 42

10.1-515-చ.
కొడుకుల వేణునాదములు గొబ్బున వీనులకుం బ్రియంబు లై
ముడిపడ లేచి యెత్తుకొని మూర్కొని తల్లులు గౌగలించుచుం
జడిగొనఁ జేపువచ్చి తమచన్నుల యందు సుధాసమంబు లై
వెడిలెడి పాలు నిండుకొనువేడుక నిచ్చిరి తత్సుతాళికిన్.
10.1-516-వ.
మఱియుఁ దల్లు లుల్లంబులం బెల్లుగ వెల్లిగొనిన వేడుకలం దమనందనులకు నలుంగు లిడి, మజ్జనంబులు గావించి, గంధంబు లలంది తొడవులు దొడిగి నిటలతటంబుల రక్షాతిలకంబులు పెట్టి, సకలపదార్థసంపన్నంబులైన యన్నంబు లొసంగి సన్నములు గాని మన్ననలు చేసిరి.

భావము:
గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీనులవిందుగా వినిపించి వారి మనస్సులు పరవశించాయి. వెంటనే ఆ తల్లులు లేచి కుమారులను కౌగిలించుకుని శిరస్సులను మూర్కొన్నారు. వారి పాలిళ్ళు అందు పాలు ఉవ్వెత్తుగా చేపుకుని వచ్చాయి. గోపికలు అమృతంతో సమాన మైన ఆ పాలను నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు. పిమ్మట, ఆ గోపికా తల్లుల హృదయాలు ఆనందంతో పరవళ్ళు తొక్కగా వారు ఎంతో వేడుకతో కొడుకులకు నలుగుపెట్టి తలంటి స్నానాలు చేయించారు; గంధాలు పూసారు; చక్కని ఆభరణాలు అలంకరించారు; నుదిటిపై రక్షా తిలకాలు పెట్టారు; అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు; ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=71&padyam=515

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 41

10.1-513-క.
మరలుపు మనియెడు కర్తయు
మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్
పరికింపఁ దాన యై హరి
మరలం జనె లీలతోడ మందకు నధిపా!
10.1-514-వ.
ఇట్లు బాలవత్సరూపంబులతో విహరించుచు మందకు వచ్చి వారివారి దొడ్ల నయ్యై వత్సంబుల ముందఱి కందువల నిలిపి, తత్తద్బాలరూపంబుల నందఱి గృహంబులం బ్రవేశించి వేణునాదంబులు చేసిన.


భావము:
విచిత్రంగా మందలోని పశువులను తమ ఇంటి వైపు తోలమని చెప్పేవాడు తానే, అలా తోలుతున్న గొల్లపిల్లలు తానే, అలా తోలబడి తమ ఇళ్ళకు వెళ్తున్న పశువులు తానే అయ్యి ఆ శ్రీహరి గొప్పవినోదంగా రేపల్లెకు వెళ్ళాడు.
సూత్రధారి పాత్రధారి అభేదమా జీవాత్మ పరమాత్మల అభేదమా, ఆహా! ఏమి లీల! ఇలా సమస్తమైన బాలురు, లేగలు యొక్క స్వరూపాలు అన్నీ తానే ధరించి విహరిస్తూ గోకులానికి తిరిగివచ్చి, వారి వారి దొడ్లలో ఆయా దూడలను ఆయా స్థానాలలో కట్టేసి, ఆయా బాలకుల స్వరూపంలో ఆయా ఇళ్ళల్లో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం వినిపించసాగాడు.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Monday, November 5, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 40

10.1-511-మ.
కరముల్ పాదములున్ శిరంబు లవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాం
తరముల్ ముక్కులు గన్నులుం శ్రవణముల్ దంతాదులున్ దండ కాం
బర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన త
త్పరతల్ వీడ్వడకుండఁ దాల్చె విభుఁ డా వత్సార్భకాకారముల్.
10.1-512-క.
రూపంబు లెల్ల నగు బహు
రూపకుఁ డిటు బాలవత్సరూపంబులతో
నేపారు టేమి చోద్యము? 
రూపింపఁగ నతని కితరరూపము గలదే?


భావము:
ఇలా అయితే గోపికలు సంతోషిస్తారు కదా అనుకుంటూ, కృష్ణబాలుడు ఆ యా లేగదూడల, గోపబాలకుల రూపాలను అన్నీ తానే ధరించాడు. అన్ని అవయవాదులు ఆ యా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతే కాకుండా, ఆ బాలురు ధరించే చేతికఱ్ఱలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాటలాడే యాస ఏ ఒక్కటీ వదలకుండా సంపూర్ణంగా ఆ యా బాలుర, లేగల స్వరూపాలు అన్నీ తనే ధరించాడు. ఈ జగన్నాటకంలో అందరి రూపాలూ ధరించే అంతర్యామి స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడు కదా. ఆ మహానటుడు ఇలా బాలుర యొక్క, లేగల యొక్క రూపాలు ధరించడంలో ఏమి ఆశ్చర్యం ఉంది. ఏ రూపంలో అయినా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతడు సర్వాత్మకుడు రూపాతీతుడు కనుక అతనికి రూపం అన్నది వేరే ఉండదు కదా. అవును, ఆ జగన్నాటక సూత్రధారి ధరించలేని పాత్ర ఏముంటుంది.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Sunday, November 4, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 39

10.1-509-శా.
"వంచింపం బనిలేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులన్ బాలురన్
వంచించెం గనుఁ బ్రామి; తన్ను మరలన్ వంచించు టాశ్చర్యమే? 
వంచింపం మనకేల? తెచ్చుటకునై వ"ల్దంచు బ్రహ్మాండము
ల్వంచింపన్ మరలింప నేర్చు హరి లీలన్మందహాసాస్యుఁడై.
10.1-510-క.
"గోపాలసుతులు లే రని
గోపికలకుఁ జెప్ప నేల? గోపాలకులున్
గోపికలు నలర బాలుర 
క్రేపులరూపముల నేఁ జరించెద ననుచున్. "

భావము:
“ఇలా పిల్లలను, లేగదూడలను వంచనచేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్నుకప్పి మోసం చేసాడు. అతణ్ణి తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. అయినా వారిని తిరిగి తీసుకురాడానికి అతణ్ణి వంచించడం మనకెందుకు వద్దులే” అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి ఈ బ్రహ్మాండాలనే వంచించడం మరలించడం అనే విద్యలలో నేర్పరి కదా. “ఇంటికి తిరిగివెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలకుల రూపాల లోనూ; గోవత్సాల రూపాల లోనూ సంచరిస్తాను గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు." అంటూ

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=70&padyam=510

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 38

10.1-507-శా.
బాలుం డయ్యు నితం డఘాసురుఁడు ద్రుంపన్బాలురం గ్రేపులన్
యేలీలన్ బ్రతికించెనొక్కొ? భువి నూహింపం గడుం జోద్య మం
చాలో నంబుజసంభవుండు చని మాయా బాలు శుంభద్బలం
బాలోకింపఁ దలంచి డాఁచె నొకచో నా లేఁగలన్ బాలురన్.
10.1-508-వ.
ఆ సమయంబున, దూడలు పోయిన జాడ యెఱుంగక, తప్పి య ప్పద్మలోచనుం డెప్పటి కొలంకుకడకు వచ్చి, యచ్చోట నె నెచ్చెలులం గానక వారిం జీరి, లేకుండుట నిశ్చయించి గోవిందుండు విశ్వవిదుండు గావున నిది విరించి మొఱంగని యెఱింగి తిరిగి పోవుచు.

భావము:
అలా కృష్ణుడు పశువులను వెతుకుతుంటే, భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు. “ఇతడు పసిబాలుడు కదా! అఘాసురుడు మ్రింగిన గోపబాలురను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఇది ఈ భూలోకం లోనే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ మాయబాలకుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాం” అనుకున్నాడు. బ్రహ్మయ్య ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురనూ ఒక రహస్య ప్రదేశంలో దాచాడు.
అప్పుడు కృష్ణుడు దూడలజాడలు కనపడక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలురు కూడా కనిపించలేదు. వారిని పిలిచి వారు ఇక్కడ లేరని నిర్ధారించు కున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగిన వాడు కదా. ఇది బ్రహ్మదేవుడి మోసం అని గ్రహించాడు. వెంటనే గిరుక్కున వెనుదిరిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=70&padyam=507

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :