Saturday, August 31, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_41

మున్ను గ్రాటవిలో

ము న్ను గ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో
న్నాహంబునఁ గాలకేయుల ననిం క్కాడుచోఁ బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ
న్నీ రెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా ల్యాణమే చక్రికిన్?
1-353-Saa.
mu nnu graaTavilO varaahamunakai mukkaMTitO@M bOruchO
sannaahaMbuna@M gaalakaeyula naniM jakkaaDuchO@M braabhava
skannuMDai chanu kauravaeMdru panikai gaMdharvulaM dOluchO@M
gannee rennaDu@M daevu taMDri! chepumaa kalyaaNamae chakrikin^?
          కృష్ణ నిర్యాణానంతరం ద్వారక నుండి విచారంగా తిరిగొచ్చిన అర్జునుని ధర్మరాజు ఏ మైందని అడుగుతున్నాడు - ఇదేమి టయ్యా? కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. పూర్వం భయంకర మైన ఆ అడవిలో పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరే టప్పుడు కాని, సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కదనరంగంలో చీల్చి చెండాడే టప్పుడు కాని, పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధనుని విడిపించే పనిలో గంధర్వులను తరిమే టప్పుడు కాని ఇంతకు ముందు ఎప్పుడు కంట నీరు పెట్టి ఎరుగవు కదా. ఇప్పుడే మయిం దయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు. 
               ము న్ను గ్రాటవిలో - మున్ను = ఇంతకు ముందు; ఉగ్ర = భయంకరమైన; అటవి = అడవి; లోన్ = అందు; వరాహమునకై - వరాహమున = పంది; కై = కోసము; ముక్కంటితోఁ బోరుచో - ముక్కంటి = శివుని {ముక్కంటి - మూడు కన్నులు ఉన్నవాడు, శివుడు}; తోన్ = తో; పోరు చోన్ = యుద్ధము చేయు నప్పుడు కాని; సన్నాహంబునఁ గాలకేయుల ననిం జక్కాడుచోఁ బ్రాభవ స్కన్నుండై - సన్నాహంబునన్ = పోరుకు దిగి నప్పుడు; కాలకేయులన్ = కాలకేయులను రాక్షసులను; అనిన్ = యుద్ధములో; జక్కాడు చోన్ = చెండాడుచు నున్నప్పుడు కాని; ప్రాభవ = వైభవమును; స్కన్నుండు = కోల్పోయిన వాడు; = అయ్యి; చను - చను = పోతున్న; కౌరవేంద్రు పనికై - కౌరవేంద్రు = దుర్యోధనుని {కౌరవేంద్రుడు - కురువంశపు రాజు, దుర్యోధనుడు}; పని = పని; కై = కోసము; గంధర్వులం దోలుచోఁ గన్నీ రెన్నడుఁ దేవు - గంధర్వులన్ = గంధర్వులను; తోలు చోన్ = పారదోలు నప్పుడు కాని; కన్నీరు = కన్నీరు; ఎన్నడున్ = ఎప్పుడును; తేవు = తీసుకొని రాలేదు, కార్చ లేదు; తండ్రి - తండ్రి = నాయనా; చెపుమా - చెపుమా = చెప్పుము; కల్యాణమే - కల్యాణమే = శుభమేనా; చక్రికిన్ - చక్రి = కృష్ణుని {చక్రి - చక్రాయుధము ధరించు వాడు / కృష్ణుడు}; కిన్ = కి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, August 30, 2013

28 ఆగస్టు 2013న http://telugubhagavatam.org/ జయప్రద ఆవిష్కరణ


       మన తెలుగుభాగవతం.కం ((http://telugubhagavatam.org/) ఆవిష్కరణకు హాజరైన, ఆశీర్వదించిన  ఆత్మీయులు సుహృత్ భాందవులు అందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతోంది తెలుగుభాగవతం. భగవంతునికిభక్తులకు చెందిన భాగవత పురాణ పూరితమైనది ఈ తెలుగుభాగవతం.కం (http://telugu bhagavatam.org/) జాలిక. పెద్దలు, పూజనీయులు నిర్ణయ ప్రకారం శుభప్రదంగా ఆవిష్కరింప బడింది. కలియుగ భగవంతుడు బాలాజీ సన్నిధానంలో, భక్తాగ్రేసరులు రంగరాజన్ గారిచే ఆవిష్కరింప బడటం మా అదృష్టం. మాతృ భాషా దినోత్సవం రోజు ఇలా చక్కటి తెలుగు జాలిక అవిష్కరింప బడుట సంతోష దాయకం అని సాహితీ మిత్రల ఆత్మీయ ఉవాచ. తెలుభాగవతం.కం నకు ప్రోత్సాహం అందిస్తున్న అభిమానులు వీక్షక దేవుళ్ళు అందరికి ధన్యవాదాలు. ఆదరించి ఆశీర్వదిస్తున్న చిలుకూరు భక్తాగ్రగణ్యులు సౌందరరాజన్, రంగరాజన్ గార్లకు చిలుకూరు దేవస్థానానికి కృతఙ్ఞతా నమస్కారాలు. భగవంతుడు చిలుకూరు బాలాజీకి ప్రణామాలు.

   తెలుగుభాగవతం.కం ద్వారా అందిస్తున్న సర్వం మరియు మరింత మెరుగుగా మరింత అనుకూలంగా మరిన్ని విషయాలు అందించడానికి ఈ తెలుగుభాగవతం.కం (http://telugubhagavatam.org/)తో ప్రయత్నం ఆరంభించాం. సహృదయులు, రసఙ్ఞులు ఆస్వాదించి ఆదరించి మీ అభిమాన ప్రోత్సాహకాలనే గట్టి ఇంధనాన్ని అందించ ప్రార్థన. 

తెలుగు భాగవత తేనె సోనలు_40

ను లాత్మీయ

10.1-1710-మ.
ను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజ తోయ మందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా! 
10.1-1710-ma.
ghanu laatmeeya tamOnivRttiko~rakai gaureeSumaryaada ne
vvani paadaaMbujatOyamaMdu munu@Mgan^ vaaMChiMtu raen aTTi nee
yanukaMpan^ vilasiMpanaeni vratacharyan^ noo~rujanmaMbulun^
ninu@M jiMtiMchuchu@M braaNamul^ viDichedan^ nikkaMbu praaNaeSvaraa!
          రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం – జీవితేశ్వరా! నాథా! మహాత్ములు అఙ్ఞాన రాహిత్యం కోరి పరమేశ్వరుని లాగ ఏ పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారో, అటువంటి తీర్థపాదుడ వైన నీ యనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను.
          భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మఙ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అఙ్ఞానాంధకార నివారణ కోసం రజో సాత్వికాలు అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర ఙ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మరణించే దాకా తపిస్తూనే ఉంటాను.
        ఘను లాత్మీయ - ఘనులు = గొప్పవారు; ఆత్మీయ = తమ యొక్క; తమో నివృత్తి కొఱ కై - తమః = అఙ్ఞానమును; నివృత్తి = తొలగించుకొనెడి; వృత్తిన్ = ఉపాయము; కొఱకు = కోసము; = అయ్యి; గౌరీశు = శివుని {గౌరీశుడు - గౌరి యొక్క ప్రభువు, శివుడు}; మర్యాద  నెవ్వని - మర్యాదన్ = వలెనే; ఎవ్వని = ఎవరి యొక్క; పాదాంబుజ తోయ మందు - పాద = పాదము లనెడి; అంబుజ = పద్మముల; తోయము = తీర్థము; అందున్ = అందు; మునుఁగన్ - మునుగన్ = స్నానముచేయవలెనని; వాంఛింతు రే నట్టి - వాంఛింతురు = కోరుదురో; ఏనున్ = నేను కూడ; అట్టి = అటువంటి; నీ = నీ యొక్క; యనుకంపన్ - అనుకంపన్ = దయచేత; విలసింపనేని = మెలగలేకపోతే; వ్రతచర్యన్ - వ్రత = వ్రతదీక్ష; చర్యన్ = వంటి కార్యముగా; నూఱు = వంద (100); జన్మంబులున్ = రాబోవు జన్మములులో; నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ - నినున్ = నిన్ను; చింతించుచున్ = తలచుచు; ప్రాణముల్ విడిచెదన్ = చనిపోయెదను; నిక్కంబు = ఇది తథ్యము; ప్రాణేశ్వరా = నా పాణమునకు ప్రభువా.
                                                            http://telugubhagavatam.org/ 
                                                               సర్వేజనాః సుఖినోభవంతు.

Thursday, August 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_39

ర్ణాలంబిత

10.1-502-శా.
ర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయహారాళితో
స్వర్ణాభాసిత వేత్రదండకముతో త్పింఛదామంబుతో
పూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతో
దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీ వీధికిన్.
          కృష్ణుడు దూడలకై అడవిలో వెదక బోవుట – జులపాల జుట్టు చెవులదాకా వేళ్ళాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగరంలా మెరిసే కర్ర చేతిలో ఉంది. చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు. ఎర్రటి అర చేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసి పోతూ ఉంది. ఇలా గోపాల కృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళాడు.
        క ర్ణాలంబిత - కర్ణా = చెవులమీద; ఆలంబిత = వేళ్ళాడుచున్న; కాకపక్షములతో - కాకపక్షముల = జులపాల; తోన్ = తోటి; గ్రైవేయ హా రాళితో - గ్రైవేయ = మెడలోవేసుకొన్న; హార = దండల; ఆళి = వరుసల; తోన్ = తోటి; స్వ ర్ణాభాసిత - స్వర్ణ = బంగారములా; ఆభాసిత = మెరుస్తున్న; వేత్రదండకముతో - వేత్రదండకము = బెత్తంకర్ర; తోన్ = తోటి; స త్పింఛ దామంబుతో - సత్ = మంచి; పింఛ = నెమలి పింఛముల; దామంబు = మాల; తోన్ = తోటి; పూర్ణోత్సాహముతో - పూర్ణ = నిండు; ఉత్సాహము = పూనిక; తోన్ = తోటి; ధృ తాన్న కబళో త్ఫు ల్లాబ్జ హస్తంబుతో - ధృత = ధరింప బడిన; అన్న = అన్నపు; కబళ = ముద్ద కలిగిన; ఉత్ఫుల్ల = విరిసిన; అబ్జ = పద్మము వంటి; హస్తంబు = చేతి; తోన్ = తోటి; తూర్ణత్వంబున నేఁగె - తూర్ణత్వంబునన్ = తొందర కలిగి; ఏగెన్ = వెళ్ళెను; లేఁగలకు నై - లేగలు = దూడలు; కున్ = కోసము; = అయ్యి; దూ రాటవీ - దూర = దూరమునందలి; అటవీ = అడవి; వీధికిన్ = మార్గమున.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||

Wednesday, August 28, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_38

మాటిమాటికి వ్రేలు డిఁచి

10.1-496-సీ.
మాటిమాటికి వ్రేలు డిఁచి యూరించుచు; నూరుఁగాయలు దినుచుండు నొక్క;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి; “చూడు లేదని నోరు చూపు నొక్కఁ;
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిద మాడి; కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ;
డిన్ని యుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన; మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;
ఆ. కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి వడి మ్రోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;
నవ్వు నొకఁడు; సఖుల వ్వించు నొక్కఁడు;
ముచ్చటలాడు నొకఁడు; మురియు నొకఁడు.
10.1-496-see.
maaTimaaTiki vraelu maDi@Mchi yooriMchuchu
            nooru@Mgaayalu dinuchuMDu nokka;
Dokani kaMchamulOni doDisi chayyana mriMgi
            chooDu laedani nOru choopunokka@M;
Daegu raarguri chaldu lelami@M bannidamaaDi
            koorkonikoorkoni kuDuchu nokka@M;
DinniyuMDa@Mga@M baMchi yiDuTa nechchalitana
            manuchu baMtenaguMDu laaDu noka@MDu;
aa. kRshNu@M jooDu manuchu@M gikuriMchi vaDi mrOla
maeli bhakshyaraaSi mesa@Mgu noka@MDu;
navvu noka@MDu; sakhula navviMchu nokka@MDu;
muchchaTalaaDu noka@MDu; muriyu noka@MDu.
          ఎంత చక్కగా మురిపిస్తున్నాడో చూడండి మన పోతన కృష్ణుడు. – ఒక గొల్ల పిల్లాడు వ్రేళ్ళ మధ్యలో ఊరగాయ ముక్క ఇరికించుకొని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తిన్నాడు. ఇంకొక గోప బాలుడు పక్కవాడి కంచంలోది చటుక్కున లాక్కొని మింగేసి, వాడు అడిగేసరికి ఏదీ ఏంలేదు చూడు అంటు తన నోరు చూపించాడు. మరొకడు పందాలు కాసి మరీ, ఐదారుమంది తినే చల్దులు నోట్లో కుక్కుకొని తినేసాడు. మరో పిల్లాడు ఒరే ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, స్నేహ మంటే పంచుకోడంరా అంటు బంతెనగుండు లనే ఆట ఆడుతు తింటున్నాడు. ఇంకో కుర్రాడు ఒరే కృష్ణుణ్ణి చూడు అని  దృష్టి మళ్ళించి, మిత్రుడి ముందున్న మధుర పదార్థాలు తినేసాడు. మరింకో కుర్రాడు తాను నవ్వుతున్నాడు. ఇంకొకడు అందరిని నవ్విస్తున్నాడు. మరొకడు ముచ్చట్లాడు తున్నాడు. వేరొకడు ఉరికే మురిసిపోతన్నాడు.
        మాటిమాటికి - మాటిమాటికిన్ = పలుమార్లు, అస్తమాను; వ్రేలు - వ్రేలున్ = వేలిని; మడిఁచి - మడిచి = వంచి; యూరించుచు నూరుఁగాయలు దినుచుండు నొక్క డొకని - ఊరించుచున్ = ఆశ పెట్టుచు; ఊరగాయలున్ = ఆవకాయ లాంటివి; తినుచున్ = తింటూ; ఒక్కడు = ఒకా నొకడు; ఒక్కని = ఒకా నొకని యొక్క; కంచములోని దొడిసి - కంచము = కంచము; లోనిదిన్ = లో ఉన్న దానిని; ఒడిసి = ఒడుపుగా తీసుకొని; చయ్యన = చటుక్కున; మ్రింగి = తినేసి; చూడు = చూసుకొనుము; లే దని - లేదు = ఏమీలేదు; అని = అని; నోరు = నోటిని; చూపు నొక్కఁ డేగు రార్గురి - చూపున్ = చూపెట్టును; ఒక్కడు = ఒకతను; ఏగురి = ఐదుగురి వంతు (5); ఆర్గురి = ఆరుగురి వంతు (6); చల్దు లెలమిఁ బన్నిద మాడి - చల్దులు = చద్ది అన్నం; ఎలమి = రెచ్చిపోయి; పన్నిదము = పందెములు; ఆడి = వేసుకొని; కూర్కొని కూర్కొని = బాగా కూరేసు కుంటు; కుడుచు నొక్కఁ డిన్నియుఁ - కుడుచున్ = తినును; ఒక్కడు = ఒకతను; ఇన్ని = ఇంత ఎక్కువగ; యుండగఁ బంచి - ఉండగన్ = ఉన్నప్పుడు; పంచి = పంచిపెట్టి; యిడుట - ఇడుట = ఇచ్చుట; నెచ్చలి తన మనుచు – నెచ్చలి తనము = స్నేహ భావము; అనుచున్ = అనుచు; బంతెన గుండు లాడు నొకఁడు బంతెన గుండులు = వరుసగ అందరికి ముద్దలు పెట్టుట {బంతెన గుండ్లు - బంతి (వరుస)గా కూర్చొన్న వారికి తలా ఒక గుండు ఇచ్చెడి ఆట}; ఆడున్ = చేయును; ఒకడున్ = ఒకతను
            కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి - కృష్ణున్ = కృష్ణుడుని; చూడుము = చూడు; అనుచున్ = అనుచు; కికురించి = మాయజేసి; వడి - వడిన్ = వేగముగా; మ్రోల - మ్రోలన్ = ఎదురుగా నున్న; మేలి = మంచి; భక్ష్య రాశి - భక్ష్య = తిను బండారముల; రాశిన్ = గుంపును; మెసఁగు నొకఁడు - మెసగు = వేగముగా తినును; ఒకడు = ఒకతను; నవ్వు నొకఁడు - నవ్వున్ = నవ్వును; ఒకడు = ఒకతను; సఖుల నవ్వించు నొక్కఁడు - సఖులన్ = స్నేహితులను; నవ్వించున్ = నవ్వించును; ఒక్కడు = ఒకతను; ముచ్చట లాడు నొకఁడు ముచ్చట లాడున్ = కబుర్లు చెప్పును; ఒకడు = ఒకతను; మురియు నొకఁడు - మురియున్ = మురిసిపోవును; ఒకడు = ఒకతను.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||