Tuesday, July 30, 2019

కపిల దేవహూతి సంవాదం - 76


(భక్తి యోగం)

3-975-సీ.
పూని యసత్యంబులైన గృహక్షేత్ర; 
పశు ధన సుత వధూ బాంధవాది
వివిధ వస్తువులను ధ్రువముగా మది నమ్మి; 
వఱలు దుర్మతి యగువాఁడు జంతు
సంఘాత మగు దేహసంబంధమున నిల్చి; 
యర్థి నయ్యై యోను లందుఁ జొరఁగ
ననుగమించును వాని యందు విరక్తుండు; 
కాక యుండును నరకస్థుఁ డైన
3-975.1-తే.
దేహి యాత్మీయదేహంబు దివిరి వదల 
లేక తన కది పరమసౌఖ్యాకరంబు
గాఁగ వర్తించు నదియును గాక యతఁడు
దేవమాయావిమోహితభావుఁ డగుచు.

భావము:

అశాశ్వతాలైన ఇల్లు, పొలం, పశువులు, ధనం, సంతానం, భార్య, బంధువులు మొదలైన వస్తువులే శాశ్వతం అని నమ్మి దుష్టబుద్ధియైన మానవుడు అనేకప్రాణుల శరీరాలను పొందుతూ వివిధ యోనుల్లో జన్మిస్తూ ఉంటాడు. వానిపట్ల విరక్తి చెందడు. నరకం అనుభవించిన తర్వాతకూడా దేహి తన దేహాన్ని వదలక అదే ఎంతో సుఖప్రద మైనదిగా భావించి దానినే అంటిపెట్టుకొని ఉంటాడు. అంతేకాక అతడు దేవుని మాయకు లొంగినవాడౌతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=975

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 75


(భక్తి యోగం)

3-973-క.
"నెఱి నిట్టి నిఖలలోకే
శ్వరుని పరాక్రమముఁ దెలియ సామర్థ్యంబె
వ్వరికినిఁగలుగదు మేఘము
గరువలి విక్రమముఁ దెలియఁగా లేని గతిన్.
3-974-క.
మగువా! విను సుఖహేతుక
మగు నర్థము దొరకమికి మహాదుఃఖమునం
దగులుదు రిది యంతయు నా
భగవంతుని యాజ్ఞఁజేసి ప్రాణులు మఱియున్.

భావము:
“గాలిలో ఎగిరే మేఘానికి గాలిశక్తిని తెలుసుకొనే శక్తి ఉండదు. అదేవిధంగా సకల లోకేశ్వరుడైన భగవంతుని శక్తిని గుర్తించే శక్తి ఎవ్వరికీ ఉండదు. అమ్మా! విను. దేనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకకపోవడం వల్ల జనులు దుఃఖాలపాలు అవుతున్నారు. ఇదంతా భగవంతుని ఆజ్ఞానుసారం జరుగుతూ ఉంటుంది. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=974

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, July 29, 2019

కపిల దేవహూతి సంవాదం - 74


(భక్తి యోగం)

3-972-వ.
అంత; నీశ్వరుండు జీవస్వరూపానుప్రవిష్టుండై యుండు నట్టి భగ వంతుం జూచి భక్తియోగంబుననేని యోగంబుననేనిఁ బురుషుండు పరమాత్మఁ బొందు ప్రకృతిపురుషాత్మకంబును దద్వ్యతిరిక్తంబును నైన దైవంబు నై కర్మవిచేష్టితం బగుచు నుండు; అదియ భగవద్రూపంబు; ఇట్టి భగవద్రూపంబు భేదాస్పదం బగుచు నద్భుత ప్రభావంబు గల కాలం బనియుఁ జెప్పంబడు; అట్టి కాలంబు మహదాదిత త్త్వంబులకును మహత్తత్త్వాభిమాను లగు జీవులకును భయాహం బగుటంజేసి సకల భూతములకు నాశ్రయం బగుచు నంతర్గతంబై భూతంబులచేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫలప్రదాత గావున వశీకృతభూతుండై ప్రభుత్వంబు భజియించి విష్ణుండు ప్రకాశించుచుండు; అతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేఁడు; అట్టి విష్ణుండు సకలజనంబుల యందావేశించి యప్రమత్తుఁడై ప్రమత్తు లయిన జనంబులకు సంహారకుండై యుండు; అతని వలని భయంబునంజేసి వాయువు వీచు సూర్యుం డుదయించు, నింద్రుండు వర్షించు, నక్షత్ర గణంబు వెలుంగుఁ, జంద్రుండు ప్రకాశించు, దత్తత్కాలంబుల వృక్ష లతాదులోషధుల తోడంగూడి పుష్ప ఫలభరితము లగు, సరిత్తులు ప్రవహించు, సముద్రంబులు మేరలు దప్పక యుండు; నగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతోఁ గూడ బరువునఁ గ్రుంగ వెఱచు, ఆకాశంబు సకల జనంబులకు నవకాశం బిచ్చు, మహత్తత్త్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబు గావున సప్తావరణావృతం బగు లోకం బను స్వదేహంబు విస్తరింపఁ జేయు; గుణాభిమాను లగు బ్రహ్మాదులు సర్వేశ్వరునిచేత జగత్సర్గంబు నందు నియోగింపఁబడి ప్రతిదినంబు నయ్యయి సర్గంబుసేయ నప్రమత్తులై యుండుదురు; పిత్రాదులు పుత్రోత్పత్తిఁ జేయుదురు; కాలుండు మృత్యుసహాయుండై మారకుండై యుండు" అని చెప్పి కపిలుండు వెండియు నిట్లనియె.

భావము:
అప్పుడు దేవుడు జీవుని స్వరూపాన్ని ఏర్పరచుకొని అందులో ప్రవేశించి ఉంటాడు. అటువంటి జీవునిలో ఉన్న దేవుని యోగమార్గంతో కాని, భక్తిమార్గంతో కాని పురుషుడు పొందగలుగుతాడు. ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మయే ప్రకృతినుండి వేరై కర్మలు చేయనివాడై కూడా ఉంటాడు. ఇదే భగవంతుని రూపం. ఇది జీవులందుగల పరస్పర భేదాలకు ఆధారమై అత్యంత శక్తిమంతమై ఉంటుంది. అదే కాలం అనబడుతుంది. అటువంటి కాలం మహదాది తత్త్వాలకు, మహత్తత్త్వాభిమానులకు భీతి గొల్పుతుంది. అందుకనే అది అన్ని జీవులకు ఆశ్రయమై, ఆ జీవులలో ఉంటూ ఒక ప్రాణిచేత మరొక ప్రాణిని గ్రసింపజేస్తుంది. భగవంతుడైన విష్ణువు యజ్ఞఫల ప్రదాతయై, ఆ జీవులను స్వాధీనంలో ఉంచుకొని, వాటిని పాలించే మహారాజుగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతనికి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు బంధువు అంటూ ఎవరూ లేరు. అటువంటి విష్ణువు అందరిలోను ఆవేశించి అప్రమత్తుడై ఉంటాడు. ప్రమత్తులైన వారిని అణచివేస్తుంటాడు. ఆ పరమాత్ముని గురించిన భయం వల్లనే గాలి వీస్తుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వాన కురిపిస్తాడు. నక్షత్రాలు వెలుగుతాయి. చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతాడు. ఆయా కాలాలలో చెట్లూ, తీగలూ మొదలైనవి ఓషధులతో కూడి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. నదులు ప్రవహిస్తాయి. సముద్రాలు హద్దు మీరకుండా ఉంటాయి. అగ్ని మండుతుంది. భూమి కొండల బరువుకు క్రుంగకుండా ఉంటుంది. ఆకాశం అందరికీ చోటిస్తుంది. మహత్తత్త్వమే ఈ లోకానికి మూలభూతమైనది. ఏడు ఆవరణాలు గల ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరింపచేస్తుంది. బ్రహ్మ మొదలైనవాళ్ళు సర్వేశ్వరుని ద్వారా ఈలోకసృష్టి నిమిత్తం నియమింపబడినవారై ప్రతిదినం ఆయా సృష్టికార్యక్రమాలలో జాగరూకులై ఉంటారు. తండ్రులు కుమారులకు జన్మనిస్తారు. కాలస్వరూపుడైన యముడు మృత్యుదేవత సాయంతో జీవులను చంపుతూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా భగవంతుని కట్టడిలో ఉంటుంది” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=972

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 73


(భక్తి యోగం)

3-970-వ.
అట్టివాని.
3-971-క.
కని సకలభూతగణములు
మనమున నానందజలధిమగ్నము లగుచున్
ఘన బహుమాన పురస్సర
మనయముఁ బాటిల్ల వినుతు లర్థిం జేయున్.

భావము:
(అటువంటి పుణ్యాత్ముని) సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవభావంతో చూచి, ఎప్పుడూ అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=971

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, July 23, 2019

కపిల దేవహూతి సంవాదం - 72


(భక్తి యోగం)

3-969-సీ.
తలఁప బ్రాహ్మణు లుత్తములు వారికంటెను; 
వేదవేత్తలు, వేదవిదులకంటె
విలసితవేదార్థవిదులు, వారలకంటె; 
సమధిక శాస్త్రసంశయము మాన్పు
మీమాంసకులు, మఱి మీమాంసకులకంటె; 
నిజధర్మవిజ్ఞాననిపుణు లరయ
వారికంటెను సంగవర్జితచిత్తులు; 
దగ వారికంటె సద్ధర్మపరులు
3-969.1-తే.
ధార్మికులకంటె నుత్తమోత్తములు వినుము
మత్సమర్పిత సకలధర్మస్వభావ
మహిమములు గల్గి యితర ధర్మములు విడిచి
సమత వర్తించు నప్పుణ్యతముఁడు ఘనుఁడు.

భావము:

(ఆ నాల్గు తెగలలో) బ్రాహ్మణులు ఉత్తములు. వీరికంటే వేదవేత్తలు శ్రేష్ఠులు. వీరికంటె వేదార్థం తెలిసినవాళ్ళు గొప్పవారు. వీరికంటె శాస్త్ర సంబంధమైన సందేహాలను చక్కగా తీర్చగల మీమాంసకులు అధికులు. వీరికంటె స్వధర్మపరాయణులు ఉత్తములు. వీరికంటే దేనిపైనా ఆసక్తిలేని నిస్సంగులు గొప్పవారు. వీరికంటె సద్ధర్మం ఆచరించేవారు అధికులు. అటువంటి ధర్మికులకంటే సర్వధర్మాలనూ, సర్వసంపదలనూ, సర్వబాధ్యతలనూ నాకే అర్పించి, అనన్యభావంతో సర్వత్ర సమవర్తనుడై జీవితం గడిపే పుణ్యాత్ముడు ఎంతో గొప్పవాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=969

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, July 22, 2019

కపిల దేవహూతి సంవాదం - 71


(భక్తి యోగం)

3-967-క.
తలఁపఁ జతుష్పదు లధికులు
బలకొని మఱి వానికంటెఁ బాదద్వయముం
గల మనుజు లలఘుతము లి
మ్ముల వారల యందు వర్ణములు నాల్గరయన్

భావము:
(బహుపాదుల కంటె) చతుష్పాత్తులు (నాలుగు పాదాలు కల ఆవులు మొదలైనవి) గొప్ప. వీనికంటె రెండుపాదాలు గల మానవులు గొప్ప. వీరిలో నాలుగు తెగలున్నాయి. ఆ తెగలలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=967

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 70


(భక్తి యోగం)

3-966-సీ.
"తరళాక్షి! విను మచేతన దేహములకంటెఁ; 
జేతన దేహముల్ శ్రేష్ట మందుఁ 
బ్రాణవంతంబులై స్పర్శనజ్ఞానంబు; 
గలుగు చైతన్యవృక్షములకంటె
ఘనరసజ్ఞానసంకలితచేతను లుత్త; 
ములు రసజ్ఞానంబు గలుగు వాని
కంటె గంధజ్ఞానకలితబృందంబులు; 
గడు శ్రేష్ఠములు వానికంటె శబ్ద
3-966.1-తే.
వేదు లగుదురు శ్రేష్ఠమై వెలయు శబ్ద
విదులకంటెను సద్రూపవేదు లైన
వాయసాదులు శ్రేష్ఠముల్ వానికంటె
వరుస బహుపాదు లుత్తముల్ వానికంటె

భావము:
“తల్లీ! విను. చైతన్యం లేని రాళ్ళురప్పలకంటే చైతన్యంగల చెట్లుచేమలు శ్రేష్ఠమైనవి. స్పర్శజ్ఞానంగల చెట్లకంటె రసజ్ఞానం (రుచిచూచే శక్తి) గల క్రిమికీటకాలు శ్రేష్ఠమైనవి. వీనికంటె గంధజ్ఞానం (వాసన చూసే శక్తి) కలవి మరీ శ్రేష్ఠం. వీనికంటె శబ్దజ్ఞానం (వినగల శక్తి) కలవి గొప్పవి. ఇలాంటి శబ్దజ్ఞానం కలవాని కంటె కూడా రూపజ్ఞానం (చూడగల శక్తి) కల కాకులు మొదలైనవి ఎంతో శ్రేష్ఠమైనవి. వానికంటే కూడా అనేక పాదాలు కల జెఱ్ఱులు మొదలైనవి శ్రేష్ఠం. వానికంటె...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=966

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, July 20, 2019

కపిల దేవహూతి సంవాదం - 69


(భక్తి యోగం)

3-965-సీ.
అబ్జాక్షి నిఖిలభూతాంతరాత్ముఁడ నైన; 
నా యందు భూతగణంబు నందు
నతిభేదదృష్టి మాయావులై సతతంబుఁ; 
బాయక వైరానుబంధ నిరతు
లగువారి మనములఁ దగులదు శాంతి యె; 
న్నఁటికైన నేను నా కుటిలజనుల
మానక యెపుడు సామాన్యాధికద్రవ్య; 
సమితిచే మత్పదార్చన మొనర్ప
3-965.1-తే.
నర్థి నాచిత్తమున ముదం బందకుందు"
ననుచు నెఱిఁగించి మఱియు నిట్లనియెఁ గరుణఁ
గలిత సద్గుణ జటిలుఁ డక్కపిలుఁ డెలమిఁ
దల్లితోడ గుణవతీమతల్లితోడ.

భావము:
కమలాలవంటి కన్నులు గల తల్లీ! నేను సమస్త జీవులలో అంతర్యామినై ఉన్నాను. అటువంటి నాయందు, మిగిలిన జీవరాసుల యందు భేదదృష్టి కలిగి మాయావులై విరోధభావంతో మెలిగేవారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చించి అట్టహాసంగా, ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తిపడను. సంతోషించను” అని చెప్పి సతీమతల్లియైన తల్లితో ఉత్తమగుణధుర్యుడైన కపిలుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=965

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, July 19, 2019

కపిల దేవహూతి సంవాదం - 68


(భక్తి యోగం)

3-963-తే.
గురుతరానేక కళ్యాణగుణవిశిష్ఠుఁ
డనఁగ నొప్పిన ననుఁ బొందు నండగొనక
పవనవశమునఁ బువ్వుల పరిమళంబు 
ఘ్రాణమున నావరించినకరణి మెఱసి.
3-964-చ.
అనిశము సర్వభూతహృదయాంబుజవర్తి యనం దనర్చు నీ
శు నను నవజ్ఞసేసి మనుజుం డొగి మత్ప్రతిమార్చనా విడం
బనమున మూఢుఁడై యుచితభక్తిని నన్ను భజింపఁడేని న
మ్మనుజుఁడు భస్మకుండమున మానక వేల్చిన యట్టివాఁ డగున్.

భావము:
అలాంటి పుణ్యాత్ముడు అనంత కళ్యాణగుణ సంపన్నుడనైన నన్ను పొందుతాడు. గాలి ద్వారా పువ్వుల సుగంధం ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించిన విధంగా ఇతరమైన ఎటువంటి అండదండలు లేకుండానే అనాయాసంగా నన్ను చేరుకుంటాడు. ఎల్లప్పుడు అఖిల జీవుల హృదయ కమలాలలో అంతర్యామినై ఉండే నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ లోకాన్ని మోసగించేవాడు మూర్ఖుడు. అచంచలమైన భక్తితో నన్ను ఆరాధింపని వాని పూజలు బూడిదలో పోసిన హోమద్రవ్యాలవలె నిరర్థకాలు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=964

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 67


(భక్తి యోగం)

3-960-వ.
మఱియును.
3-961-క.
హరి గుణ మంగళ కీర్తన
పరుఁడై తగ నార్జవమున భగవత్పరులం
గర మనురక్తి భజించుట
నిరహంకారమున నుంట నిశ్చలుఁ డగుటన్.
3-962-క.
ఇవి మొదలుగాఁగ గలుగు భ
గవదుద్దేశస్వధర్మకలితుం డై వీ
నివలనఁ బరిశుద్ధగతిం
దవిలిన మది గలుగు పుణ్యతముఁ డెయ్యెడలన్.

భావము:
ఇంకా...విష్ణువు యొక్క కళ్యాణ గుణాలను కీర్తించేవాడై, చిత్తశుద్ధితో అనురక్తితో భగవద్భక్తులను సేవించడం, అహంకారం లేకుండా నిశ్చల హృదయంతో జీవించాలి. ఈ మొదలైన సుగుణాలతో భగవంతుని ఉద్దేశించి చెప్పిన ఇటువంటి ధర్మాలతో కూడి పవిత్రమైన మార్గంలో ఆసక్తమైన మనస్సు కలవాడైన పుణ్యాత్ముడు ఎల్లప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=962

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, July 15, 2019

కపిల దేవహూతి సంవాదం - 66


(భక్తి యోగం)

3-959-సీ.
"నిత్యనైమిత్తిక నిజధర్మమున గురు; 
శ్రద్ధాగరిష్ఠతఁ జతుర పాంచ
రాత్రోక్త హరిసమారాధన క్రియలను; 
నిష్కామనంబున నెఱి మదీయ
విగ్రహదర్శన వినుతి పూజా వంద; 
నధ్యానసంశ్రవణములఁ గర్మ
సంగి గాకుండుట సజ్జనప్రకరాభి; 
మానంబు నొందుట హీను లందు
3-959.1-తే.
జాల ననుకంపసేయుట సముల యందు
మైత్రి నెఱపుట యమనియమక్రియాది
యైన యోగంబుచేత నాధ్యాత్మికాధి
భౌతికాదులఁ దెలియుట పలుకుటయును.

భావము:
“స్నాన సంధ్యాది నిత్యకర్మలందు, జగత్కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలందు అత్యంత శ్రద్ధాసక్తులు కలిగి ఉండడం, గురువులను పెద్దలను గౌరవించడం, పాంచరాత్రాగమంలో చెప్పబడిన ప్రకారం శ్రీహరిని నిష్కామ బుద్ధితో ఆరాధించడం, ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం, కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, నా చరిత్రలు వినడం, కర్మలలో చిక్కుకోకుండా ఉండడం, గొప్పవారిపైన ఆదర గౌరవాలు, తనకన్న తక్కువ వారిపైన దయాదాక్షిణ్యాలు, తనతో సమానులపైన స్నేహానురాగాలు కలిగి ఉండడం, యమ నియమాలను పాటించడం మొదలైన సుగుణాలను అలవరచుకోవాలి. యోగాభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలను తాను తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తూ ఉండడం... (చేయాలి).

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=959

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 65


(భక్తి యోగం)

3-957-క.
హేయగుణరహితుఁ డనఁగల
నా యందుల భక్తిలక్షణముఁ దెలిపితి నన్
బాయక నిర్హేతుకముగఁ
జేయు మదీయవ్రతైక చిరతరభక్తిన్.
3-958-వ.
నిష్కాము లయిన మదీయ భక్తులకు నట్టి భక్తియోగంబు సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు; గావున, మహాత్ము లగు వారు నిజమనోరథఫలదాయకంబు లయిన మదీయ సేవావిరహితం బులయిన యితర కర్మంబు లాచరింప నొల్లరు; దీని నాత్యంతిక భక్తియోగం బని చెప్పుదురు; సత్త్వ రజస్తమోగుణ విహీనుం డయిన జనుండు మత్సమానాకారంబుఁ బొందు" నని చెప్పి మఱియు నిట్లనియె.

భావము:
నిందనీయాలైన గుణాలు లేనివాడనైన నాయందు నిలుపవలసిన భక్తి లక్షణాలను తెలిపాను. నన్ను వదలకుండా, హేతువులు వెదకకుండా చేసే వ్రతమే అచంచలమైన భక్తి అని భావించు. కోరికలు లేకుండా నన్ను భజించే నా భక్తులకు పైన చెప్పిన భక్తియోగం సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే ముక్తులకు సాధనమౌతుంది. అందువల్ల మహాత్ములైనవారు తమ కోర్కెలు తీర్చేవే అయినా నా ఆరాధనకు దూరమైన ఏ సాధనలనూ చేయరు. దీనినే ఆత్యంతిక భక్తియోగం అని అంటారు. సత్త్వరజస్తమోగుణాలకు అతీతమైన ప్రవర్తనగల మానవుడు నాతో సమానమైన రూపాన్ని పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=958

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, July 13, 2019

కపిల దేవహూతి సంవాదం - 64


(భక్తి యోగం)

3-955-చ.
అనుపమ పాపకర్మపరిహారము కై భజనీయుఁ డైన శో
భనచరితుం డితం డనుచు భావమునం దలపోసి భక్తిచే
ననితర యోగ్యతన్ భగవదర్పణబుద్ధి నొనర్చి కర్మముల్
జనహితకారి యై నెగడ సాత్వికయోగమనంగఁ జొప్పడున్.
3-956-చ.
మనుసుత! మద్గుణశ్రవణమాత్ర లభించిన యట్టి భక్తిచే 
ననఘుఁడ సర్వశోభనగుణాశ్రయుఁడన్ పరమేశ్వరుండ నై
తనరిన నన్నుఁ జెందిన యుదాత్త మనోగతులవ్యయంబులై
వననిధిగామి యైన సురవాహినిఁబోలె ఫలించు నిమ్ములన్.

భావము:
సాటిలేని పాపాలను పరిహారం చేసేది భగవద్భక్తి ఒక్కటే అనే విశ్వాసంతో, భజింపదగిన పవిత్ర చరిత్రుడు భగవంతుడే అని మనస్సులో భావిస్తూ, సమస్త కార్యాలను భగవదంకితంగా ఆచరిస్తూ, లోకులకు మేలు చేకూర్చే పనులు చేస్తూ ఉండటం సాత్త్వికభక్తి.
మనుపుత్రికవైన ఓ తల్లీ! నా గుణాలను ఆలకించిన మాత్రాన ప్రాప్తమైన భక్తితో ఉదాత్తచిత్తులైన కొందరు పాపరహితుడనూ, అనంత కళ్యాణగుణ సహితుడనూ, పరమేశ్వరుడనూ అయిన నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి ఉత్తముల మనోభావాలు సముద్రాన్ని సంగమించిన గంగానది మాదిరిగా చక్కగా సఫల మౌతాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=956

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 63


(భక్తి యోగం)

3-953-తే.
సతతహింసాతిదంభ మాత్సర్యరోష
తమములను జేయుచును భేదదర్శి యగుచుఁ
బరఁగ నా యందుఁ గావించు భక్తి దలఁప
దామసం బనఁదగు వాఁడు తామసుండు.
3-954-క.
ఘన విషయప్రావీణ్యము
లను సుమహైశ్వర్య యశములను బూజాద్య
ర్హుని నను నర్థి భజించుట
చను రాజసయోగ మనఁగ సౌజన్యనిధీ!

భావము:
ఇతరులను హింసిస్తూ ఆడంబరం, అసూయ, రోషం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి నన్ను భజించేవాడు తామసుడు. అట్టి వానిది తామసభక్తి. సౌజన్యఖనీ! ఆడంబరంతో కూడిన పూజాద్రవ్యాలతో అష్టైశ్వర్యాలకోసం, పేరుప్రతిష్ఠలకోసం పూజనీయుడనైన నన్ను పూజించడం రాజసభక్తి అవుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=954

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, July 12, 2019

కపిల దేవహూతి సంవాదం - 62


(భక్తి యోగం)

3-951-క.
"నలినాయతాక్షి! విను జన
ముల ఫలసంకల్పభేదమునఁ జేసి మదిం
గల భక్తియోగమహిమం
బలవడఁగ ననేకవిధము లనఁదగు నవియున్.
3-952-వ.
వివరించెదఁ దామస రాజస సాత్త్వికాది భేదంబులం ద్రివిధం బై యుండు; అందుఁ దామసభక్తి ప్రకారం బెట్టిదనిన.

భావము:
“పద్మాలవంటి విశాలమైన కన్నులుగల తల్లీ! విను. ప్రజల సంకల్పాలను బట్టి ఆశయాలను బట్టి భక్తియోగం సిద్ధిస్తుంది. అదికూడ అనేకవిధాలుగా ఉంటుంది. వానిని వివరిస్తాను. భక్తి తామసం, రాజసం, సాత్త్వికం అని మూడు విధాలు. వానిలో తామసభక్తి ఎలాంటిదంటే…

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=952

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 61


( సాంఖ్య యోగము )

3-950-వ.
ఈ యాత్మ నిజస్వరూపంబునం జేసి వర్తించు" నని కపిలుం డెఱింగించిన విని దేవహూతి వెండియు నిట్లనియె "మహాత్మా! మహదాది భూతంబులకుం బ్రకృతి పురుషులకుం గల్గిన పరస్పర లక్షణంబులను దత్స్వరూపంబులను నెఱింగించితివి; ఇంక నీ ప్రకారంబున సాంఖ్యంబు నందు నిరూపింపఁబడు నట్టి ప్రకారంబును, భక్తియోగ మహాత్మ్యంబును, బురుషుండు భక్తియోగంబునం జేసి సర్వలోక విరక్తుం డగునట్టి యోగంబును, బ్రాణిలోకంబునకు సంసారం బనేక విధం బయి యుండుఁ; గావున బరాపరుండవై కాలస్వరూపి వైన నీ స్వరూపంబును ఏ నీవలని భయంబునం జేసి జనులు పుణ్యకార్యంబులు సేయుచుండుదురు; మిథ్యాభూతం బైన దేహంబు నందు నాత్మాభిమానంబుసేయుచు మూఢుండై కర్మంబు లందు నాసక్తం బైన బుద్ధిం జేసి విభ్రాంతుం డగుచు సంసార స్వరూపం బగు మహాంధ కారంబు నందుఁ జిరకాల ప్రసుప్తుం డైన జనునిఁ బ్రబోధించుకొఱకు యోగభాస్కరుండవై యావిర్భవించిన పుణ్యాత్ముండవు నీవు; గావున, నాకు నిన్నియుం దెలియ సవిస్తరంబుగా నానతియ్యవలయు" ననిన దేవహూతికి గపిలుం డిట్లనియె.

భావము:
ఈ ఆత్మ నిజస్వరూపంతో విరాజిల్లుతుంటుంది” అని కపిలుడు తెలియజెప్పగా విని దేవహూతి మళ్ళీ ఇలా అన్నది. “అసత్యమైన దేహంపై ఆత్మాభిమానం పెంచుకొని మూర్ఖుడై, కర్మలపై ఆసక్తి కలిగిన బుద్ధితో భ్రమించి, సంసారమనే పెనుచీకటిలో చాలాకాలం నిద్రామత్తుడైన జనుని మేల్కొల్పడం కోసం యోగభాస్కరుడవై పుట్టిన పుణ్యాత్ముడవు నీవు. కాబట్టి ఓ మహాత్మా! మహదాది భూతాలకు, ప్రకృతి పురుషులకు ఉన్న వేరువేరు లక్షణాలను చెప్పావు. వాటి వాటి స్వరూపాలను వివరించావు. ఆ విధంగానే సాంఖ్యయోగాన్ని అనుసరించి భక్తియోగ మహత్త్వాన్ని వెల్లడించు. పురుషుడు భక్తియోగం ద్వారా సమస్త ప్రపంచంనుండి విరక్తుడయ్యే విధం వివరించు. ప్రాణిలోకానికి అనేక విధాలుగా ఉండే సంసారానికి పరాపరుడవై కాలస్వరూపుడవై ఉన్న నీ స్వరూపాన్ని ఎరిగించు. కాలస్వరూపుడవైన ఏ నీ భయంవల్ల మానవులు పుణ్యకర్మలు చేస్తారో వానిని సవిస్తరంగా తెలిసేలా చెప్పు” అని అడుగగా దేవహూతితో కపిలుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=950

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, July 10, 2019

కపిల దేవహూతి సంవాదం - 60


( సాంఖ్య యోగము )

3-949-క.
భావింప సదసదాత్మక
మై వెలయును దుర్విభావ్య మగుచు స్వకీయం
బై వర్తించుచుఁ బ్రకృతిని
భావమునఁ దిరస్కరించు భవ్యస్ఫూర్తిన్.

భావము:
ఆత్మ సదసదాత్మకమై, భావాతీతమై, ఆత్మీయ భావంతో వర్తిస్తూ తన ఉజ్జ్వల తేజస్సుతో ప్రకృతిని తిరస్కరించి లోబరచుకుంటుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=949

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 59


( సాంఖ్య యోగము )

3-947-వ.
వెండియు.
3-948-సీ.
వరుస ననన్యభావంబునఁ జేసి భూ; 
తావళి యందుఁ దదాత్మకత్వ
మునఁ జూచు నాత్మీయ ఘనతరోపాదాన; 
ముల యందుఁ దవిలి యిమ్ముల వెలుంగు
నిట్టి దివ్యజ్యోతి యేకమయ్యును బహు; 
భావంబులను దోఁచు ప్రకృతిగతుఁడు
నగుచున్న యాత్మయుఁ బొగడొందు దేవ తి; 
ర్యఙ్మనుష్యస్థావరాది వివిధ
3-948.1-తే.
యోనులను భిన్నభావంబు నొందుటయును
జాలఁ గల్గు నిజగుణ వైషమ్యమునను
భిన్నుఁడై వెల్గుఁ గావున బేర్చి యదియు
దేహసంబంధి యగుచు వర్తించుచుండు.

భావము:
ఇంకా సర్వ భూతాలలోను అనన్య భావంతో, సర్వత్ర ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ దివ్యజ్యోతి ఒక్కటే అయినా పెక్కింటివలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆ ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనులలో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రమే వేరు కాని వెలుగు ఒక్కటే.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=948

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :