Friday, May 31, 2019

కపిల దేవహూతి సంవాదం - 28

3-904-సీ.
జననుత! సత్త్వరజస్తమో గుణమయ; 
మైన ప్రాకృతకార్య మగు శరీర
గతుఁ డయ్యుఁ బురుషుండు గడఁగి ప్రాకృతములు; 
నగు సుఖ దుఃఖ మోహముల వలనఁ
గర మనురక్తుండు గాఁడు వికారవి; 
హీనుఁడు ద్రిగుణరహితుఁడు నగుచు
బలసి నిర్మలజల ప్రతిబింబితుండైన; 
దినకరుభంగి వర్తించు నట్టి
3-904.1-తే.
యాత్మ ప్రకృతిగుణంబుల యందుఁ దగులు
వడి యహంకారమూఢుఁడై దొడరి యేను
గడఁగి నిఖిలంబునకు నెల్లఁ గర్త నని ప్ర
సంగవశతను బ్రకృతి దోషములఁ బొంది

భావము:
“జనులచే స్తుతింపబడేదానా! సత్త్వరజస్తమో గుణాలతో నిండి, ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరాన్ని ఆశ్రయించి కూడ పురుషుడు ప్రకృతి సంబంధమైన సుఖదుఃఖ మోహాలకు లోనుగాడు. ఎటువంటి వికారాలు లేకుండా, త్రిగుణాలకు అతీతుడై, తేటనీటిలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఆ జలం అంటని విధంగా సత్త్వరజస్తమో గుణాలు పురుషుణ్ణి స్పృశింపలేవు. అలా కాకుండా జీవుడు ప్రాకృతిక గుణాలలో చిక్కుకున్నట్లయితే ఈ జరుగుతున్న అన్ని సన్నివేశాలకు నేనే కర్తనని అహంకారంతో వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. అతిశయమైన సంగం వల్ల అతడు ప్రకృతి దోషాలు పొంది....

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=904

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, May 30, 2019

కపిల దేవహూతి సంవాదం - 27:

3-903-వ.
మఱియు; విరాట్పురుషు నం దుదయించిన వ్యష్టిరూపంబు లగు నాకాశాది భూతంబులును శబ్దంబు మొదలగు భూతతన్మాత్రంబులును వాగాదీంద్రియ జాతంబును దదధిదేవతలును దమంతన సమిష్టిరూపుం డగు క్షేత్రజ్ఞుం బ్రవృత్తి ప్రవక్తకుం జేయ నసమర్థంబు లయ్యె; ఎట్లనిన దేవాధిష్ఠితంబు లగు నింద్రియంబులు దాము వేర్వేఱ యయ్యీశ్వరుం బ్రవృత్తున్ముఖుం జేయనోపక క్రమంబునం దత్తదధిష్ఠానాదుల నొందె; అందు నగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబు నొంది ప్రవర్తించిన విరాట్కార్యం బగు వ్యష్టి శరీరజాతం బనుత్పన్నం బయ్యె; అంత నాసయు ఘ్రాణేంద్రియంబుతోడ వాయువుం గూడిన నట్టిది యయ్యె; నాదిత్యుఁడు చక్షురింద్రియంబుతోడ నేత్రంబులు నొందిన వృథాభూతం బయ్యె; దిగ్దేవతాకం బగు కర్ణంబు శ్రోత్రేంద్రియంబుతోఁ గూడిన విరాట్కార్య ప్రేరణాయోగ్యం బయ్యె ఓషధులు రోమంబులం ద్వగింద్రియంబుఁ జెంది విఫలం బయ్యె; అద్దైవం బగు మేఢ్రంబు రేతంబు నొందినఁ దత్కార్యకరణాదక్షం బయ్యెఁ; బదంపడి గుదంబు మృత్యువు తోడ నపానేంద్రియంబుఁ జేరిన నది హైన్యంబు నొందె; విష్ణు దేవతాకంబు లగు చరణంబులు గతితోఁ గూడిన ననీశ్వరంబు లయ్యెఁ; బాణీంద్రియంబు లింద్రదైవతంబు లగుచు బలంబు నొందిన శక్తిహీనంబు లయ్యె; మఱియు నాడులు సనదీకంబులై లోహితంబు వొందిన నిరర్థకంబు లయ్యె; నుదరంబు సింధువుల తోడఁ జేరి క్షుత్పి పాసలం బొందిన వ్యర్థం బయ్యె; హృదయంబు మనంబు తోడం జంద్రు నొందిన నూరక యుండె; బుద్ధి బ్రహ్మాది దైవతంబై హృదయంబు నొందిన నిష్ఫలం బయ్యెఁ జిత్తం బభిమానంబుతో రుద్రునిం జెందిన విరాట్కార్య జాతం బనుభూతం బయ్యె; నంతఁ జైత్యుం డగు క్షేత్రజ్ఞుండు హృదయాధిష్ఠానంబు నొంది చిత్తంబు తోడం బ్రవేశించిన విరాట్పురుషుండు సలిల కార్యభూత బ్రహ్మాండంబు నొంది ప్రవృత్యున్ముఖక్షముం డయ్యె; సుప్తుం డగు పురుషునిం బ్రాణాదులు దమ బలంబుచే భగవదప్రేరితంబు లగుచు నుత్థాపనా సమర్థంబు లగు చందంబున నగ్న్యాదులు స్వాధిష్ఠాన భూతంబు లగు నిద్రియంబులతోడ దేవాది శరీరంబుల నొందియు నశక్తంబు లయ్యె" అని మఱియు "నవ్విరాట్పురుషుని ననవరతభక్తిం జేసి విరక్తులై యాత్మల యందు వివేకంబు గల మహాత్ములు చింతింపుదు రనియుఁ బ్రకృతిపురుష వివేకంబున మోక్షంబును బ్రకృతి సంబంధంబున సంసారంబును గలుగు" ననియుఁ జెప్పి మఱియు నిట్లనియె.

భావము:
ఇంకా విరాట్పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలూ, శబ్దం మొదలైన పంచతన్మాత్రలూ, వాక్కు మొదలైన ఇంద్రియాలూ, ఆ ఇంద్రియాల అధిదేవతలూ వేరువేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేక పోయాయి. ఆ యా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు, తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోకవ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాలలో ఉండిపోయాయి. విరాట్పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించి నప్పటికీ విరాట్పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలుగలేదు. అట్లే విరాట్పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కన్నులలో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించినా వ్యర్థమే అయింది. అలాగే చెవులలో దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడ విరాట్పురుషుని కార్యం సాధించటంలో వృథా అయ్యాయి. రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు వర్తించి విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవతగా కల పురుషాంగం రేతస్సును పొందికూడా సృష్టికి సమర్థం కాలేదు. మలావయవం మృత్యువుతోకూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్థకమే అయింది. హరిదేవతాకాలైన పాదాలు గతితో కూడి శక్తిహీనాలు అయ్యాయి. ఇంద్రదేవతాకాలైన చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగాలైనాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ నిరర్థకాలైనాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలిదప్పులను పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుణ్ణి పొందికూడా ఊరక ఉంది. అట్లే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ విరాట్పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలేదు. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదుర్పగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి, చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్పురుషుడు, జలాలలో తేలుతున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టికార్యాన్ని ప్రవర్తింప గలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంతబలంతో కదలాడలేవు. లేవటానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తమకు అధిష్ఠానాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొందికూడా, అవి శక్తిహీనా లయ్యాయి. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే మెలకువ వచ్చినట్లు ఆయా శరీరభాగాలు పనిచేయటం ప్రారంభించాయి. అటువంటి విరాట్పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారు. ప్రకృతి, పురుషుల యథార్థజ్ఞానం వల్ల మోక్షమూ, కేవలం ప్రకృతి సంబంధంతో సంసారబంధమూ కలుగుతుంది” అని చెప్పి కపిలుడు దేవహూతితో మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=48&padyam=903

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, May 29, 2019

కపిల దేవహూతి సంవాదం - 26:

3-901-క.
ఘన నాడీ పుంజమువల
నను రక్తము దానివలన నదులును జఠరం
బున నాకఁలియును దప్పియుఁ
ననయము నా రెంటివలన నబ్దులు పుట్టెన్.
3-902-క.
విను హృదయమువలనను మన
మును మనమునఁ దుహినకరుఁడు బుద్ధియుఁ జిత్తం
బున బ్రహ్మయు క్షేత్రజ్ఞుం
డును గలిగిరి యవ్విరాజుఁడుం బూరుషతన్.

భావము:
విరాట్పురుషుని నాడులవల్ల రక్తమూ, రక్తంవల్ల నదులూ, జఠరం వల్ల ఆకలిదప్పులూ, ఈ రెండింటివల్ల సముద్రాలు పుట్టాయి. విరాట్పురుషుని హృదయంవల్ల మనస్సూ, మనస్సువల్ల చంద్రుడూ, బుద్ధీ, చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండం నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=48&padyam=902

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, May 28, 2019

కపిల దేవహూతి సంవాదం - 25

3-899-తే.
దానివలనను మేఢ్రంబు గానఁబడియెఁ
బరఁగ రేతంబువలన నాపంబు పుట్టె
గుదమువలన నపానంబు నుదయ మయ్యె
దానివలనను మృత్యువు దగ జనించె.
3-900-క.
కరములవలనను బలమును
నిరవుగ నా రెంటివలన నింద్రుఁడుఁ బాదాం
బురుహంబులవలన గతియు
నరుదుగ నా రెంటివలన హరియును గలిగెన్.

భావము:
చర్మం వలన మూత్రావయవం పుట్టింది. దానినుండి రేతస్సు పుట్టింది. రేతస్సువల్ల జలం పుట్టింది. దానివల్ల అపానం పుట్టింది. దానివల్ల మృత్యువు పుట్టింది. విరాట్పురుషుని చేతులవల్ల బలం, చేతుల బలంవల్ల ఇంద్రుడు, పాదాలవల్ల గమనం, పాదగతులవల్ల ఉపేంద్రుడు ఉద్భవించటం జరిగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=48&padyam=900

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, May 26, 2019

కపిల దేవహూతి సంవాదం - 24

3-898-సీ.
కరమొప్పఁగా విరాట్పురుషుండు వెలుఁగొందు; 
నా విరాట్పురుషుని యాననంబు
వలనను వాణియు వాణితో వహ్నియు; 
నాసంబువలనఁ బ్రాణములఁ గూడి 
ఘ్రాణేంద్రియం బయ్యె ఘ్రాణంబువలనను; 
వాయువులును బ్రాణవాయువులును
నందు నక్షులు చక్షు వందు సూర్యుండును; 
నందభిధ్యానంబు నర్థిఁ జేయఁ
3-898.1-తే.
గర్ణములు జాత మయ్యెఁ దత్కర్ణసమితి
వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగెఁ 
ద్వక్కుచే శ్మశ్రు రోమ వితానకములు
నోషధివ్రాతమును భవ మొందె; మఱియు.

భావము:
ఆ అండంలో విరాట్పురుషుడు వెలుగుతూ ఉంటాడు. అతని ముఖం నుండి వాణి, వాణితోపాటు అగ్ని పుట్టాయి. ముక్కునుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నులు, కన్నులవల్ల సూర్యుడు పుట్టారు. వానియందు ధ్యాన మేర్పడగా చెవులు పుట్టాయి. వానివల్ల శ్రోత్రేంద్రియం దిక్కులూ పుట్టాయి. చర్మంనుండి గడ్డం, మీసాలు మొదలగు రోమసమూహమూ, ఓషధులూ జనించాయి. ఇంకా..

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=48&padyam=898

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 23

3-897-సీ.
గురుశక్తియౌ విరాట్పురుషుండు సంభవం; 
బయ్యె నయ్యండంబు నర్థిఁ బొదవి
యంబు ముఖావరణంబు లొక్కొకటికి; 
దశగుణితంబులై తవిలి యావ
రణములై యుండును గ్రమమున లోకంబు; 
నకు మేలుకట్ల పోలికఁ దనర్చి
పంకజోదరుని రూపము విలసించును; 
లోలత జలములోఁ దేలుచున్న
3-897.1-తే.
హేమమయ మైన యండంబులో మహాను
భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల
జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు
విష్ణుపద భేదనంబు గావించి యందు. 
సప్తతత్వములు

భావము:
ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటె ఒకటి పదింతల ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీలవలె ఒప్పియున్న ఆ పొరలలో నుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంతో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=47&padyam=897

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, May 25, 2019

కపిల దేవహూతి సంవాదం - 22

3-896-వ.
అది యెట్టు లంటేని సామాన్యచింతయు విశేషచింతయు ననందగు సంకల్ప వికల్పంబులం జేసి కామసంభవం బనంబడు నెద్ది, యనిరుద్ధాఖ్యం బయిన వ్యూహం బదియ హృషీకంబులకు నధీశ్వరం బయి సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదిందీవర శ్యామం బయి యుండు; వెండియుం దైజసంబువలన బుద్ధితత్త్వంబు పుట్టె; దాని లక్షణంబులు ద్రవ్యప్రకాశం బైన జ్ఞానంబును, నింద్రియానుగ్రహంబును, సంశయంబును, మిథ్యాజ్ఞానంబును, నిద్రయు, నిశ్చయంబును స్మృతియు ననందగి యుండు; మఱియుఁ దైజసాహంకారంబు వలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులును గ్రియాజ్ఞానసాధనంబులును గలిగి యుండుఁ; బ్రాణంబునకుం గ్రియాశక్తియు బుద్ధికి జ్ఞానశక్తియు నగుటం జేసి యింద్రియంబులకుఁ దైజసత్వంబు గలిగి యుండు; భగద్భక్తి ప్రేరితం బయిన తామసాహంకారంబువలన శబ్ద తన్మాత్రంబు పుట్టె; దానివలన నాకాశంబును నాకాశంబువలన శ్రోత్రింద్రియంబును పుట్టె; శ్రోత్రంబు శబ్దగ్రాహి యయ్యె; శబ్దం బర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకం బయ్యె మఱియు శబ్దతన్మాత్రంబువలన నాకాశం బయి యా యాకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల నవకాశం బిచ్చటయు నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశ్రయం బగుటయు నను లక్షణంబులు గలిగి యుండు కాల గతిచే వికారంబు నొందు; శబ్దతన్మాత్ర లక్షణం బగు నభంబువలన స్పర్శంబును స్పర్శంబువలన వాయువును వాయువుచే స్పర్శగ్రాహియైన త్వగింద్రియంబును బుట్టె; మృదుత్వంబును గఠినత్వంబును శైత్యంబును నుష్ణత్వంబును నను నివి స్పర్శంబునకు స్పర్శత్వం బని చెప్పంబడు; మఱియు వాయువునకుఁ జాలనంబును పరస్పర విభాగకరణంబును దన్మేళనంబును ద్రవ్యశబ్దనేతృత్వంబు నగు; అందు గంధవంతం బగు ద్రవ్యంబును ఘ్రాణేద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు దూరస్థం బగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్య మగు; నట్లొనరించుట శబ్దనేతృత్వంబు సర్వేంద్రియాత్మకత్వంబు ననునవి లక్షణంబులై యుండు; దైవప్రేరితంబై స్పర్శ తన్మాత్ర గుణకం బగు వాయువువలన రూపంబును దానివలనఁ దేజంబును బుట్టె; రూపంబు నేత్రేంద్రియ గ్రాహకం బయ్యె నేత్రగతం బయిన రూపంబునకు నుపలంభకత్వంబును ద్రవ్యాకారసమత్వంబును ద్రవ్యంబునకు నుపసర్జనం బగుటయు ద్రవ్యపరిణామ ప్రతీతియు నివి రూపవృత్తు లనంబడు; తైజసంబునకు సాధారణంబు లగు ధర్మంబులు ద్యోతం బనఁ బ్రకాశంబు పచనం బనఁ దండులాదుల పాకంబు పిపాసా నిమిత్తం బైన పానంబు క్షున్నిమిత్తం బైన యోదనంబు హిమమర్దనం బగు శోషణంబు ననునివి వృత్తులై యుండు; రూపతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబు నొందు తేజస్సు వలన రసతన్మాత్రంబు పుట్టె; రసతన్మాత్రంబువలన జలంబు పుట్టె; జిహ్వ యను రసనేంద్రియంబు రసగ్రాహకం బయ్యె; ఆ రసం బేకంబై యుండియు భూతవికారంబునం జేసి కషాయ తిక్త కట్వామ్ల మధురాది భేదంబుల ననేక విధం బయ్యె; వెండియు సాంసర్గిక ద్రవ్యవికారంబునంజేసి యార్ద్రం బగుటయు ముద్దగట్టుటయుఁ దృప్తి దాతృత్వంబును జీవంబును దద్వైక్లబ్య నివర్తనంబును మృదూకరణంబును దాపనివారణంబును గూపగతం బయిన జలంబు దివియ మఱియు నుద్గమించుటయు ననునివి జలవృత్తు లనంబడు; రసతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబునం బొందిన జలంబు వలన గంధతన్మాత్రంబు పుట్టె; దానివలనం బృథ్వియు గలిగె ఘ్రాణంబు గంధగ్రాహకం బయ్యె; అందు గంధం బేకం బయ్యు వ్యంజనాదిగతం బయి హింగ్వాది నిమిత్తం బయిన మిశ్రమగంధంబును కరంభంబును గృంజనాదిగతం బయిన పూతిగంధంబును; ఘనసారాది నిమిత్తం బయిన సుగంధంబును శతపత్రాదిగతం బగు శాంత గంధంబును లశునాదిగతం బైన యుగ్రగంధంబును బరుష్యిత చిత్రాన్నాది గతం బయిన యామ్లగంధంబును ద్రవ్యావయవ వైషమ్యంబునం జేసి యనేకవిధంబై యుండు; అదియునుం గాక ప్రతిమాదిరూపంబులం జేసి సాకారతాపాదనం బగు భావంబును, జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షం బయిన స్థితియు జలాధ్యాధారత యను ధారణంబును, నాకాశాద్యవచ్ఛేదకత్వంబును, సకలప్రాణి పుంస్త్వాభి వ్యక్తీకరణంబును ననునివి పృథ్వీవృత్తు లనంబడు" అని చెప్పి వెండియు నిట్లనియె "నభో సాధారణగుణ శబ్దవిశేషగ్రాహకంబు శ్రోత్రంబును, వాయ్వ సాధారణగుణ విశేషగ్రాహకంబు స్పర్శంబును, దేజో సాధారణగుణ విశేషగ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభో సాధారణగుణ విశేషగ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్య సాధారణగుణ విశేషగ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును, నాకాశాది గుణంబులగుచు శబ్దాదికార్యంబు లగు వాయ్వాదు లందుఁ గారణాన్వయంబు ననన్నిఁటికిం బృథ్వీ సంబంధంబు గలుగుటంజేసి భూమి యందు శబ్దస్పర్శరూపరసగంధంబులు గలుగుట మహదాదిపృథివ్యంతంబు లగు నీ యేడు తత్త్వంబులు పరస్పర మిళితంబు లై భోగాయతనం బగు పురుషునిం గల్పింప సమర్థంబులై యున్నం జూచి కాలాదృష్టసత్వాదులం గూడి జగత్కారణుండును ద్రైగుణ్యవిశిష్టుండును నశేష నియామకుండును నిరంజనాకారుండును నగు సర్వే శ్వరుం డందు బ్రవేశించు; అంత నన్యోన్యక్షుబితంబు లై మిళితంబు లైన మహదాదుల వలన నధిష్ఠాతృచేతన రహితం బగు నొక యండంబు పుట్టె; అందు.

భావము:
అది ఎలాగంటే ఈ మనస్తత్త్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం, విశేష చింతనం అని రెండు విధాలు. వీనినే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీనివల్లనే వివిధ కామాలు ఉత్పన్నమౌతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధ వ్యూహం సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికి అధీశ్వరమై, యోగీంద్రు లందరకు సంసేవ్యమై, శరత్కాల మందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసాహంకారం వల్ల బుద్ధితత్త్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధితత్త్వ లక్షణాలు. ఈ తైజసాహంకారం వల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడుతాయి. ఈ తైజసాహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు శక్తులూ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తివల్ల ప్రేరేపించబడిన తామసాహంకారంనుండి శబ్దతన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రంనుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం (చెవి) పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవానికి జ్ఞానజనకం అవుతున్నది. ఈ శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఈయటమే కాక ఆత్మకూ, ప్రాణాలకూ, ఇంద్రియాలకూ ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్దతన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శమూ, స్పర్శంవల్ల వాయువూ, ఆ వాయువువల్ల స్పర్శను గ్రహించగల చర్మమూ పుట్టి స్పర్శజ్ఞానాన్ని కలిగించింది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శజ్ఞానానికి లక్షణాలు. వాయువునకు కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయటం ద్రవ్యనేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింప జేయటం శబ్దనేతృత్వం. భగవత్ప్రేరణతో స్పర్శతన్మాత్రం వల్ల పుట్టిన వాయువువల్ల రూపం పుట్టింది.ఈ రూపం వలన తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనుపించునటువంటి ఆకారానికి వృత్తులు ఉపలంభకత్వం (అనుభవం కలుగడం), ద్రవ్యాకారసమత్వం (ద్రవ్యంయొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం (ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్యపరిణామ ప్రతీతి (ద్రవ్యంయొక్క మార్పు తెలియడం). ఇక తేజస్సుకు సాధారణాలైన ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు. దైవప్రేరితమై మార్పు చెందిన తేజస్సువల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వ అనే పేరుగల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పువల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేకవిధాలుగా మార్పు చెందింది. తనలో చేరిన ద్రవ్యాల మార్పులనుబట్టి ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం అనేవి ఈ జలవృత్తులు. రసతన్మాత్రవల్ల దైవప్రేరణతో మార్పుచెందిన జలంనుండి గంధతన్మాత్రం పుట్టింది. ఈ గంధతన్మాత్రం వలన పృథ్వి (భూమి) ఏర్పడింది. ఘ్రాణేంద్రియం (ముక్కు) గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన కారణంగా మిశ్రమగంధం అనీ, నిలువ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వానితో కలిసినప్పుడు దుర్గంధం అనీ, కర్పూరం మొదలైనవానితో కలిసినపుడు సుగంధం అనీ, తామరపూలు మొదలైన వానితో కలిసినపుడు శాంతగంధం అనీ, వెల్లుల్లి మొదలైన వానితో కలిసినపుడు ఉగ్రగంధం అనీ, పాసిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినపుడు ఆమ్లగంధం అనీ వేరువేరు పదార్థాలతో కలిసినపుడు మరెన్నో విధాలుగా పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవనగా ప్రతిమల రూపాన్నీ వాటి ఆకారాలనూ నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, బలం వీనిని విభజించడం, సకల జీవరాసులకు దేహంగా పనిచేయటం అనేవి పృథ్వీవృత్తులు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. “పంచభూతాలకు సాధారణ ధర్మాలు విన్నావు. ఇవికాక వానికి సంబంధించిన అసాధారణ ధర్మాలు విను. ఆకాశానికి అసాధారణగుణం శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణగుణం స్పర్శం. దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణగుణం రూపం. దీనిని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణగుణం రసం. దీనిని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. పృథివికి అసాధారణగుణం గంధం. దీనిని ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశం మొదలైన అన్నింటితో సంబంధం ఉండడం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అసాధారణ గుణాలు అయినాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ఈ ఏడు తత్త్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించటానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడూ అంతుపట్టని అస్తిత్వం కలవాడూ, జగత్కారణుడూ, సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడూ, సమస్తాన్ని నియమించేవాడూ, నిరంజనాకారుడూ అయిన సర్వేశ్వరుడు పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపులగమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వలన అధిష్ఠాతయైన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక అండం పుట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=47&padyam=896

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :