Tuesday, January 31, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౪(724)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-119-క.
దారుకుఁడు గనియె నంతటఁ
జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరిన్‌
మేరునగధీరు దనుజవి
దారుని నేకాంతపరునిఁ దద్దయు నెమ్మిన్‌.
11-120-వ.
కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె.
11-121-తే.
నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.

భావము:
ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. అలా చూసి మిక్కిలి భయ భక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు. “నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=121

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, January 22, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౩(723)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-118-వ.
అనిన రాజునకు శుకుం డిట్లనియె “నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁ బరిపాలనంబు సేసి, బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁ దాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి తురగ రథ పదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబు లయిన తుంగ సమూహంబుల బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకు నప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొఱగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జనిచని; యంత నీలాంబరుం డొక్క త్రోవంబోయి యోగమార్గంబు నననంతునిం గలసె; నప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేఱొక చరణంబు మీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరిణకర్ణంబు గాఁబోలునని దానిం గని శరంబు శరాసనంబునందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున “మహాపరాధుండను; బాపచిత్తుం డను; గుటిలప్రచారుండ” నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్తవదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె; “నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరక పోవనేరవు; నీవు నిమిత్తమాత్రుండ; వింతియ కాని” యని వానికిం దెలిపిన వాఁడును “మహాపరాధులైన వారూరక పోవరు; దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు” నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠపదప్రాప్తుండయ్యె నప్పుడు.

భావము:
ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=118

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Saturday, January 21, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౨(722)

( అవధూత సంభాషణ ) 

11-116-క.
చెప్పిన విని రాజేంద్రుఁడు
సొప్పడ శ్రీకృష్ణుకథలు చోద్యము గాఁగం
జెప్పినఁ దనియదు చిత్తం
బొప్పఁగ మునిచంద్ర! నాకు యోగులు మెచ్చన్‌.
11-117-తే.
అంతటను గృష్ణుఁ డేమయ్యె? నరసిచూడ
యదువు లెట్టులు వర్తించి రేర్పడంగ,
ద్వారకాపట్టణం బెవ్విధమున నుండె
మునివరశ్రేష్ఠ! యానతీ ముదముతోడ.

భావము:
ఆ శుకబ్రహ్మ పలుకులు వినిన రాజేంద్రుడు, “మునీశ్వరా! శ్రీకృష్ణుడి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. యోగులు మెచ్చేలా మీరెంత చెప్పినా నేను ఎంత విన్నా తనివితీరడం లేదు. మునివర్యా! అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఎమయ్యాడు? యాదవులు ఏం చేసారు? ద్వారకపట్టణం ఏమయింది? అన్నివిషయాలూ ఆనతీయవలసినది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=117

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౨౧(721)

( అవధూత సంభాషణ ) 

11-115-వ.
అని యుద్ధవుం డడిగిన నారాయణుం డిట్లనియె; “నేను సర్వవర్ణంబులకు సమంబైన పూజాప్రకారం బెఱింగించెద; నాచారంబునంజేసి యొకటిఁ బాషాణమృణ్మయదారువులం గల్పించి, నా రూపంబుగా నిల్పికొని కొందఱు పూజింతురు; కాంస్య త్రపు రజత కాంచన ప్రతిమావిశేషంబు లుత్తమంబు; లిట్లు నా ప్రతిమారూపంబు లందు మద్భావంబుంచి కొల్చినవారికి నేఁ బ్రసన్నుండనగుదు; నీ లోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు; గావునం బ్రతిమా విశేషంబు లనేకంబులు గలవు; వానియందు సౌందర్యసారంబులు మనోహరంబులునైన రూపంబుల మనఃప్రసన్నుండనై నే నుండుదుఁ; గావున దుగ్ధార్ణవశాయిఁగా భావించి ధౌతాంబరాభరణ మాల్యానులేపనంబులను, దివ్యాన్న పానంబులను, షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబులను, బాహ్యపూజా విధానంబుల నాచరించి మత్సంకల్పితంబు లైన పదార్థంబులు సమర్పించి, నిత్యంబును నాభ్యంతరపూజావిధానంబులం బరితుష్టునిం జేసి; దివ్యాంబరాభరణ మాల్యశోభితుండును, శంఖ చక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళవిగ్రహుండునుగాఁ దలంచి ధ్యానపరవశుండైన యతండు నాయందుఁ గలయు; నుద్ధవా! నీ వీ ప్రకారంబు గరిష్ఠనిష్ఠాతిశయంబున యోగనిష్ఠుండవై, బదరికాశ్రమంబు సేరి మత్కథితం బైన సాంఖ్యయోగం బంతరంగంబున నిల్పుకొని, కలియుగావసాన పర్యంతంబు వర్తింపు” మని యప్పమేశ్వరుండానతిచ్చిన నుద్ధవుండు నానందభరితాంతరంగుం డై తత్పాదారవిందంబులు హృదయంబునం జేర్చుకొని, పావనంబైన బదరికాశ్రమంబునకు నరిగె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పుటయు.

భావము:
ఉద్ధవుడు ఇలా అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నేను అన్ని వర్ణాలవారు అనుసరించ తగ్గ పూజా పద్ధతి చెప్తాను, విను. రాతితో కాని, మట్టితో కానీ, కొయ్యతో కానీ తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరుపెట్టి కొందరు పూజిస్తారు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసిన ప్రతిమలు శ్రేష్ఠమైనవి. ఈవిధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలచిన వారికి, నేను ప్రసన్నుడను అవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు కనుక, ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్నుడనై ఉంటాను. కాబట్టి, క్షీరసాగరంలో పడుకున్నవానిగా భావించి; శుభ్రమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను, మైపూతలను అర్పించి దివ్యమైన అన్నపానాలు, షోడశోపచారాలతో రాజోపచారాలు, బాహ్యమైన పూజలు చేసి నాకిష్టమైన పదార్ధాలను సమర్పించి కానీ; లేదా ప్రతిదినము మానసిక పూజాపద్ధతులతో కాని సంతుష్టి పరచి నన్ను దివ్యమైన వస్త్రాలు, భూషణాలు పూలదండలు ధరించి ప్రకాశిస్తూ; శంఖము, చక్రము, కిరీటము, మొదలైన వానితో అలంకృతుడనైన మంగళవిగ్రహునిగా భావించి ధ్యానపరవశుడు అగు నా భక్తుడు నా యందు కలుస్తాడు. ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రతరమైన యోగనిష్ఠతో బదరికాశ్రమం చేరు. నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకుని కలియుగం చివరి దాకా ఉండు.” అని పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు మనసు నిండా ఆనందం పొంగిపొర్లింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయాన చేర్చుకుని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తునకు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=115

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, January 17, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౦(720)

( అవధూత సంభాషణ ) 

11-114-ఆ.
రూపు లేని నీకు రూఢిగా యోగులు
రూపు నిల్పి నిన్ను రుచిరభక్తిఁ
గొల్చి యుండ్రు; వారికోర్కుల నిచ్చెద
వేమిలాగు? నాకు నెఱుఁగఁ బలుకు.

భావము:
“రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢీగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు. నాకు తెలుపుము.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=114

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, January 16, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౯(719)

( అవధూత సంభాషణ ) 

11-113-వ.
అనుటయు హరి యుద్ధవునకుం జెప్పె; “నట్లు మత్ప్రేరితంబులై మహదాది గుణంబులు గూడి యండం బై యుద్భవించె; నా యండంబువలన నేనుద్భవించితి; నంత నా నాభివివరంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్య నదీ నద సంఘంబులు మొదలుగాఁ గల జగన్నిర్మాణంబు లతనివలనం గల్పించితి; నంత శతానందునకు శతాబ్దంబులు పరిపూర్ణం బైన ధాత్రి గంధంబునందడంగు; నా గంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రసంబున లీనంబగు; నా రసంబు తేజోరూపంబగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శగుణసంగ్రాహ్యం బైన స్పర్శగుణం బాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపఁబడిన నింద్రియంబులు మనోవైకారిక గుణంబులం గూడి యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబు దాల్చు; నేను రజస్సత్త్వతమోగుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి, జగదుత్పత్తి స్థితి లయ కారణుండనై వర్తిల్లుదుఁ; గావున నీ రహస్యంబు నీకు నుపదేశించితిఁ, బరమపావనుండవుఁ బరమభక్తి యుక్తుండవుఁ గ”మ్మని చెప్పె; నంత.

భావము:
అనగా శ్రీహరి ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “ఆవిధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక అండంగా ఏర్పడ్డాయి; ఆ అండం నుంచి నేను పుట్టాను; అంతట నా నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచ మంతా అతని చేత నేనే నిర్మింప చేసాను. ఆ బ్రహ్మదేవుడికి నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది; గంధం నీటిలో కలుస్తుంది; ఆ నీరు రసములో లీనమవుతుంది; ఆ రసం తేజస్సు రూపాన్ని ధరిస్తుంది; ఆ తేజస్సు రూపము నందు సంక్రమిస్తుంది; ఆ రూపం వాయువులో కలుస్తుంది; ఆ వాయువు స్పర్శగా మారుతుంది; ఆ స్పర్శగుణం ఆకాశంలో లయమవుతుంది; ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే లోగొనబడుతుంది; ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి.

భగవంతుడనైన నేను రజస్సు సత్త్వము తమస్సు అనే మూడు గుణాలతోకూడి మూడుమూర్తులు ధరించి సృష్టి పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి, పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది.” ఇలా చెప్పిన కృష్ణుని పలుకులు విని ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=113

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౧౮(718)

( అవధూత సంభాషణ ) 

11-112-క.
అయ్యా! దేవ! జనార్దన!
నెయ్యంబున సృష్టికర్త నేర్పరియై తా
నొయ్యన నడపును నెవ్వఁడు
సయ్యన నెఱిఁగింపవయ్య! సర్వజ్ఞనిధీ!

భావము:
“స్వామీ! దేవదేవా! వాసుదేవా! జనార్ధనా! నీవు సర్వజ్ఞుడవు. సృష్టికర్తను ఎవరు నేర్పుతో నడుపుతాడో ఆనతీయవలసింది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=112

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Saturday, January 14, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౭(717)

( అవధూత సంభాషణ ) 

11-111-వ.
అట్లు గావున జనుండు బాల్య కైశోర కౌమార వయోవిశేషంబుల వెనుకనైననుం, బెద్దయైన వెనుకనైనను, నన్నెఱింగెనేనిఁ గృతకృత్యుండగుఁ; సంపద్గర్వాంధుం డైన నంధకారకూపంబునం బడు; వానిం దరిద్రునింగాఁ జేసిన జ్ఞానియై యస్మత్పాదారవింద వందనాభిలాషియై ముక్తుండగు; నట్లుగావున దేహాభిమానంబు వర్జించి యైహికాముష్మిక సుఖంబులఁ గోరక మనంబు గుదియించి యే ప్రొద్దు నన్నుఁ దలంచువాఁడు వైకుంఠపద ప్రాప్తుండగు; నేను నతని విడువంజాలక వెనువెంట నరుగుదు; నారదాది మునులు భక్తి భావంబునం జేసి నా రూపం బై” రని యుద్ధవునకుం జెప్పిన, నతండు మఱియు నిట్లనియె.

భావము:
అందుచేత, మానవుడు పసివానిగా కాని, పిల్లవానిగా కాని, యువకునిగ కాని, పెద్దవాడు అయిన పిమ్మట కాని నన్ను తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు. సంపదలు ఉన్నాయని గర్వంతో గ్రుడ్డివాడు అయితే చీకటిబావిలో పడతాడు. అటువంటివాడిని దరిద్రునిగా చేస్తే, జ్ఞాని అయి నా పాదపద్మాలకు నమస్కరించాలనే అభిలాష కలుగుతుంది. మోక్షం పొందుతాడు. శరీరము మీద అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందిన సుఖాలను కోరక మనస్సును నిగ్రహించుకొని, ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. నేనూ అతనిని విడచిపెట్టలేక వాని వెనువెంటనే వెళ్ళుతుంటాను. నారదుడు మున్నగు మునులు భక్తిభావం వలన నా సారూప్యం పొందారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడు మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=111

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౧౬(716)

( అవధూత సంభాషణ ) 

11-110-క.
గర్భమునఁ బరిజ్ఞానము
నిర్భరమై యుండు జీవునికిఁ దుది నతఁ డా
విర్భూతుఁ డైనఁ జెడు నం
తర్భావంబైన బోధ మంతయు ననఘా!

భావము:
ఉద్ధవా! గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమిమీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=110

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, January 10, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౫(715)

( అవధూత సంభాషణ ) 

11-109-వ.
అని యుద్ధవుం డడగినం బ్రబుద్ధమనస్కుం డయిన పుండరీకాక్షుండు “నీ ప్రశ్నంబులు దుర్లభంబు లయినను వినుము; నియమ శమ దమాదులు దపంబును సుఖదుఃఖంబులు స్వర్గ నరకంబులుననం బరఁగినవి యెవ్వి, దరిద్రుం డెట్టివాఁ డీశ్వరుండెవ్వం, డని నీవు నన్నడిగిన యర్థంబు లెల్ల వేఱువేఱ వివరించెద; మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జప తపంబులును, నతిథిసత్కారంబును, బరహితంబును, జౌర్యాదిరహితత్వంబును ననునివి మొదలైనవి నియమంబు లనందగు; నింద్రియనిగ్రహంబును, శత్రుమిత్ర సమత్వంబును, శమం బనం బరఁగు; మూఢజనులకు జ్ఞానోపదేశంబును, గామ్యత్యాగంబును, సమదర్శనంబును, వైష్ణవ సమూహంబులతోడి భక్తియుఁ, బ్రాణాయామంబును, జిత్తశుద్ధియు నను నివి కలిమివిద్య యనంబడు; శమదమాది గుణరహితుండును, మద్భక్తి విరహితుండును నగుట యవిద్య యనందగుఁ; జిత్తశుద్ధి గలిగి నిత్యతృప్తుండౌట దమం; బిట్టి నియమాది గుణ సహితత్వంబును మద్భక్తియుక్తియు ననునదియే సుఖంబు; నన్నెఱుంగలేక తమోగుణంబునం బరఁగుటయె దుఃఖం బనంబడు; బంధు గురు జనంబుల యెడ భేదబుద్ధి నొంది, శరీరంబు నిజగృహంబుగా భావించినవాఁడె దరిద్రుం; డింద్రియ నిరసనుండును, గుణ సంగ విరక్తుండు నైనవాఁడె యీశ్వరుండు; నాయందుఁ దలంపు నిలిపి, కర్మయోగంబునందును, భక్తి యోగంబునందును వాత్సల్యంబు గలిగి జనకాదులు కైవల్యంబుఁ జెందిరి; భక్తియోగంబునం జేసి బలి ప్రహ్లాద ముచుకుందాదులు పరమ పదప్రాప్తులై; రది గావున నిది యెఱింగి నిరంతర భక్తియోగం బధికంబుగా నీ మనంబున నిలుపుము; మృణ్మయంబైన ఘటంబున జలంబులు జాలుగొను తెఱంగున దినదినంబునకు నాయువు క్షయం బై మృత్యువు సన్నిహితం బై వచ్చుఁ గావున నిది యెఱింగి నిరంతంరంబును నన్నేమఱక తలంచుచుండు నతండు నాకుం బ్రియుండు.

భావము:
ఇలా ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “ఉద్ధవా! నీ ప్రశ్నలు సామాన్య మైనవి కావు. అయినా విను, చెప్తాను. యమ నియమాలూ శమదమాలు మొదలైనవి ఏవి? తపమనగా ఏమి? సుఖదుఃఖాలు స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు అంటే ఎట్టివాడు? ఈశ్వరు డంటే ఎవరు? అని నీవు అడిగిన విషయాలన్నీ విడివిడిగా వివరిస్తాను.

మౌనవ్రతము, బ్రహ్మచర్యము, ఓర్పు, జపము, తపము, అతిధులను సత్కరించుట, పరహితము, దొంగతనమూ మొదలైనవి లేకుండుట, ఇటువంటివి నియమాలు అనబడతాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం, శత్రువులందు మిత్రులందు సమభావంతో ఉండటం శమము. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించటము, కోరికలను వదలటం, సమదర్సనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం వీటిని విద్య అంటారు. శమదమాది గుణాలు లేకపోవటం, నామీద భక్తి లేకపోవటం, అవిద్య అంటారు, చిత్తశుద్ధి కలిగి ఎప్పుడు తృప్తిగా ఉండటం దమము. ఇటువంటి నియమాలు గుణాలు కలిగి, నామీద భక్తి కలిగి ఉండటమే సుఖము. నన్ను తెలుసుకోలేక తమోగుణముతో ఉండటమే దుఃఖము. బంధువులందు గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములలో విరక్తుడైన వాడే ఈశ్వరుడు.

నా మీద మనసును నిలిపి కర్మయోగమందు, భక్తియోగమందు అభిమానం కలిగిన జనక మహారాజు మొదలైన వాళ్ళు మోక్షం పొందారు. భక్తియోగం సాధించి బలి, ప్రహ్లాదుడు, ముచుకుందుడు మున్నగువారు పరమపదాన్ని పొందారు. కనుక, ఈ విషయాల్ని తెలుసుకుని ఎప్పుడూ భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనసులో నింపుకో. మట్టికుండకు చిల్లుపడితే నీళ్ళు కారిపోవునట్లు దినదినము ఆయువు తరిగిపోతూ చావు దగ్గరపడుతు ఉంటుంది. కాబట్టి, ఇది ఎరిగి ఎప్పుడూ ఏమరక నన్ను స్మరిస్తూ ఉండేవాడు, నాకు ప్రియుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=109

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, January 9, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౪(714)

( అవధూత సంభాషణ ) 

11-108-క.
తెలియనివి కొన్ని సెప్పితి;
తెలియంగల వెల్ల నింకఁ దెలుపుము కృష్ణా!
వల నెఱిఁగి మెలఁగవలయును
నలినాసనజనక! భక్తనతపదయుగళా!

భావము:
“బ్రహ్మదేవుడిని కన్నతండ్రి! భక్తులు నమస్కరించే పాదద్వయం కల శ్రీకృష్ణా! తెలియనివి కొన్ని చెప్పావు. ఇంకా తెలియవలసినవి ఏవైనా ఉంటే తెలుపు. వాటిని తెలుసుకుని కృతార్ధుడను అవుతాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=108

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, January 8, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౩(713)

( అవధూత సంభాషణ ) 

11-107-వ.
అనినం గృష్ణుండు నాలుగు వర్ణంబుల యుత్పత్తియు నాలుగాశ్రమంబుల కిట్టిట్టి వర్హంబు లనియును, నాలుగు వేదంబులం జెప్పిన ధర్మంబులును, బ్రవృత్తి నివృత్తి హేతువు లగు పురాణేతిహాస శాస్త్రంబులును, వైరాగ్యవిజ్ఞానంబులును నివి మొదలుగాఁ గలవన్నియు నెఱిగించి, “సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” యను నుపనిషత్తుల్యంబగు గీతావచన ప్రకారంబున నెవ్వఁడేని నా యందు మతి గలిగి వర్తించు వాఁడు నేనని పలుకంబడుఁ; బెక్కు విధంబుల వాదంబు లేల? యని యెందును దగులువడక నామీఁదఁ దలంపు గలిగి వర్తింపు” మనిన నుద్ధవుం డిట్లనియె.

భావము:
ఇలా అడిగిన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుక; నాలుగు ఆశ్రమాలకూ తగిన పద్ధతులు; నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలు; ప్రవృత్తి నివృత్తి హేతువులయిన పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు; వైరాగ్య విజ్ఞానములు; మొదలైనవన్నీ తెలిపాడు. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” ధర్మంబులు సకలం విడిచి నన్నొక్కనినే శరణు పొందు అనే ఉపనిషత్తులతో సమానమయిన గీతాప్రవచనం ప్రకారం. నాయందు మనస్సు కలిగి ప్రవర్తించేవాడు నేనని చెప్పబడతాడు. పలువిధాలైన వాదాలెందుకు ఇతరత్రా మనస్సు లగ్నం కానీయకుండా, నామీదనే తలపు కలిగి నడచుకో. అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=107

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Friday, January 6, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౨(712)

( అవధూత సంభాషణ ) 

11-105-వ.
అని యడిగిన నయ్యాదవేంద్రుం డిట్లని పలుకం దొడంగె; “దారు మధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున నందంబై సకలశరీరుల యందు నచ్ఛేద్యుండు నదాహ్యుండు నశోష్యుండునైన జీవుండు వసించి యుండు” ననిన హరికి నుద్ధవుం డిట్లనియె; “సనక సనందనాది యోగీంద్రులకు యోగమార్గం బేరీతి నానతిచ్చితి, వది యేవిధం? బానతీయవే” యని యభ్యర్థించిన నతం డిట్లనియె; “వారలు చతుర్ముఖు నడిగిన నతండు, “నేనును దెలియనేర” ననిన వారలు విస్మయం బందుచుండ నేనా సమయంబున హంసస్వరూపుండ నై వారల కెఱింగించిన తెఱుంగు వినుము; పంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు; నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్జిత దేహుండై సంసారమమతలు నిరసించి, నిశ్చలజ్ఞాన యుక్తుండై మత్పదప్రాప్తుండగు; స్వప్నలబ్ధ పదార్థంబు నిజంబు గాని క్రియఁ గర్మానుభవపర్యంతంబు కళేబరంబు వర్తించు నని సాంఖ్యయోగంబున సనకాదుల కెఱింగించిన విని, బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి; వారివలన భూలోకంబునఁ బ్రసిద్ధం బయ్యె; నదిగావున నీవును నెఱింగికొని, పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయ భక్తియుక్తుండును, హరిపరాయణుండునైన యతని చరణరజఃపుంజంబు తన శరీరంబు సోఁకజేయు నతండును, ముద్రాధారణపరులకును హరి దివ్యనామంబులు ధరియించు వారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతు” డని చెప్పి మఱియు “సర్వసంగపరిత్యాగంబు సేసి, యొండెఱుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనై యుండుదు” నని యానతిచ్చిన నుద్ధవుండు “ధ్యాన మార్గంబే రీతి? యానతీయవలయు” ననిన హరి యిట్లనియె; ఏకాంత మానసులై హస్తాబ్జంబు లూరుద్వయంబున సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ దలంచి, యష్టాదశ ధారణాయోగసిద్ధు లెఱింగి, యందణిమాదులు ప్రధాన సిద్ధులుగాఁ దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మనాత్మతోఁ గీలించిన బ్రహ్మపదంబుఁ బొందు; భాగవతశ్రేష్ఠు లితరధర్మంబులు మాని నన్నుం గాంతురు; తొల్లి పాండునందనుఁడగు నర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది యిట్ల యడిగిన నతనికి నేఁ జెప్పిన తెఱం గెఱింగించెదఁ; జరాచరభూతంబయిన జగంబంతయు మదాకారంబుగా భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును, దేవతలందుఁ బద్మగర్భుండును, వసువులందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును, బ్రహ్మలందు భృగువును, ఋషులందు నారదుండును, ధేనువులందుఁ గామధేనువును, సిద్ధులయందుఁ గపిలుండును, దైత్యులయందుఁ బ్రహ్లాదుండును గ్రహంబులందుఁ గళానిధియును, గజంబులయం దైరావతంబును, హయంబులయం దుచ్చైశ్శ్రవంబును, నాగంబులందు వాసుకియును, మృగంబులందుఁ గేసరియు, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులయం దోంకారంబును, నదులందు గంగయు, సాగరంబుల యందు దుగ్ధసాగరంబును, నాయుధంబులందుఁ గార్ముకంబును, గిరు లందు మేరువును, వృక్షంబుల యందశ్వత్థంబును, నోషధుల యందు యవలును, యజ్ఞంబుల యందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులం దాత్మయోగంబును, స్త్రీల యందు శతరూపయు భాషణంబులయందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో నభిజిత్తును, యుగంబులందుఁ గృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షుల లోఁ గుబేరుండును, వానరులం దాంజనేయుండును, రత్నంబు లందుఁ బద్మరాగంబును, దానంబులలోనన్నదానంబును, దిథు లయం దేకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవతప్రవర్తనం బ్రవర్తించువాఁడును, నివియన్నియు మద్విభూతులుగా నెఱుంగు" మని కృష్ణుం డుద్ధవునకు నుపన్యసించిన వెండియు నతం డిట్లనియె.

భావము:
అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.
పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.
“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.
ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=105

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Thursday, January 5, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౧(711)

( అవధూత సంభాషణ ) 

11-104-క.
"ధ్యానం బేక్రియ నిలుచును?
ధ్యానం బే రీతిఁ దగు? నుదాత్తచరిత్రా!
ధ్యానప్రకార మంత య
నూనంబుగఁ జెప్పు మయ్య యుర్వీరమణా!"

భావము:
అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. “ఓ ఉదాత్తచరిత్రా! భూదేవీకళత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=104

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, January 4, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౦(710)

( అవధూత సంభాషణ ) 

11-103-వ.
మఱియు నొక్క విశేషం బయిన పురాతనపుణ్యకథ వినుము; కనకావతీపురంబున నొక్క ధరామరుని కన్యకారత్నంబు గల; దవ్వ ధూతిలకంబు రత్నసమేతంబు లగు కంకణంబులు ధరియించి బంధుజనంబులకుఁ బరమాహ్లాదంబుగా నన్నంబు గావించుట కొఱకు శాలితండులంబులు దంచునప్పుడు ముసలగ్రహణభారంబునఁ గంకణంబు లతిరావంబుగా మ్రోయుచుండ నప్పరమపతివ్రత యందులకు నసహ్యపడి యన్నియు డులిచి యొక్కటి నిలిపె; నట్లుగావునఁ దత్తఱపడక భగవదాయత్తంబైన యేకచిత్తంబునం బ్రసన్నచిత్తులై నరులు ముక్తులగుదురు; గావున నవిద్యావిద్యలు నా మాయగా విచారించి, కేవల పశుమార్గులు కాక షడ్గుణైశ్వర్య సంసన్నులైన యోగీశ్వరుల పగిది సుఖంబు గోరక యుండు వారలు ముక్తులగుదురు; సర్వంబును విష్ణుమాయగాఁ దెలియు” మని యుద్ధవునికిం జెప్పిన నతండు “దేవా! నీరూపం బేలాగునం గానవచ్చు”ననిన నతం డిట్లనియె; “భక్తిభావనపరాయణుండై కృపారస తత్పరుండై మితభాషణుండై బొంకక కర్మంబులు మదర్పణంబుగాఁ జేసిన యతండు భాగవతుఁడనం బరఁగు; మత్కథలును మజ్జన్మకర్మంబులును వినుచు మత్సేవకులైన భాగవతులం జూచి తన గృహంబునకుం గొనిపోయి, మజ్జన పూజన భోజన శయనా సనాదికంబులఁ బరితుష్టులం జేసిన యతండైనను భాగవతుండనఁ బడు; నిట్లెంతకాలంబు జీవించు, నంతకాలంబును నడపునతండు మద్రూపంబున వైకుంఠనిలయంబు నొందు; నదియునుం గాక గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీసమేతుండనై, శంఖ చక్ర గదాశార్‌ఙ్గాది యుక్తుఁడ నైన నన్ను శుక సనకాది యోగీంద్రులును, నంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలు గాఁగల భాగవతులును, శాస్త్రాచారచోదితులు గాక భక్తి భావనావిశేషంబున నేమఱక నిత్యంబును జింతనాయత్తులై యెఱింగిరి; మధురాపురంబునకు హలాయుధ సమేతుండనై యే నరుగుచో, గోపిక లోపికలు లేక భక్తియోగంబునఁ జింతించి ముక్తలై; రిది భక్తియోగప్రకారం” బని యుద్ధవునికిం జెప్పిన.

భావము:
ఇంకొక విశేషమైన పురాతన పుణ్యకథ చెప్తాను, విను. కనకావతీనగరంలో ఒక ఉత్తమమైన బ్రాహ్మణ కన్యక ఉంది. ఆ కాంతారత్నం తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించేది. ఒకనాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. వారికి వండిపెట్టాలి అని బియ్యం కోసం వడ్లు ఇంట్లో రోకలితో వడ్లు దంచుతూ ఉంటే, ఆమె కంకణాలు గల్లుగల్లు మని చప్పుడు చేయసాగాయి. ఆ చప్పుడుకు చీకాకు పడింది. అందుకని, ఆ పరమపతివ్రత చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసి అవతల పెట్టి, చప్పుడు కాకుండా తన పని పూర్తిచేసుకుంది. అలాగే తత్తరపడక భగవంతుడికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో ప్రసన్న మనస్కులై మానవులు ముక్తులవుతారు. కనుక అవిద్య విద్య రెండు నా మాయగా తెలుసుకుని కేవలం పశుమార్గులు కాకుండా ఐశ్వర్యం వీర్యం యశస్సు జ్ఞానం సిరి వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరుల లాగా, సుఖాన్ని కోరకుండా ఉండే వాళ్ళు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయ అని గ్రహించు.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అప్పుడు అతను. “దేవా! నీ రూపాన్ని ఎలా చూడగలము.” అని అడిగాడు
అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఉద్ధవా! భక్తిభావన యందు ఆసక్తి, దయారసము కలిగి; మితభాషణుడై, అబద్ధమాడక, సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి. తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరచిన వాడు కూడ భాగవతుడు అనబడతాడు. చివరికి, జీవితాంత కాలం ఇదే విధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు.
అదీకాక శంఖచక్రగదాధరుడను, లక్ష్మీ సమేతుడను అయిన నన్ను; శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు; అంబరీషుడు, విభీషుణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలసి నేను వెళ్ళగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తిపొందారు. ఇది భక్తి యోగ వివరం.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=103

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, January 2, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౦౯(709)

( అవధూత సంభాషణ ) 

11-102-క.
దేహము నిత్యము గా దని
మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై
గేహము వెలువడి నరుఁడు
త్సాహమునుం జెందు ముక్తిసంపద ననఘా!

భావము:
ఓ పుణ్యాత్ముడా! ఉద్ధవా! దేహం శాశ్వతమైనది కాదని గ్రహించి, మోహాన్ని కత్తిరించి పారేసి, సిద్ధులు మునులు చరించే మార్గాన్ని అనుసరించి, సంసారం వదలిన మానవుడు మోక్షలక్ష్మిని పొందుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=102

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, January 1, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౦౮(708)

( అవధూత సంభాషణ ) 

11-101-వ.
ఇందులకుఁ బురాతన వృత్తాంతంబు గలదు; సావధానచిత్తుండవై వినుము; మిథిలా నగరంబునఁ బింగళ యను గణికారత్నంబు గలదు; దానివలనం గొంత పరిజ్ఞానంబుఁ గంటి? నదెట్లనిన నమ్మానిని ధనకాంక్ష జేసి యాత్మసఖుని మొఱంగి ధనం బిచ్చువానిం జేకొని నిజనికేతనాభ్యంతరంబునకుం గొనిచని రాత్రి నిద్రలేకుండుచుఁ బుటభేదన విపణిమార్గంబులఁ బర్యటనంబు సలుపుచు నిద్రాలస్య భావంబున జడనుపడి, యర్థాపేక్షం దగిలి తిరిగి యలసి, యాత్మ సుఖంబు సేయునతండె భర్త యని చింతించి నారాయణు నిట్లు చింతింప నతని కైవల్యంబు సేరవచ్చు నని విచారించి, నిజశయనస్థానాదికంబు వర్జించి వేగిరంబ వాసుదేవ చరణారవింద వందనాభిలాషిణియై దేహంబు విద్యుత్ప్రకారం బని చింతించి పరమతత్త్వంబు నందుఁ జిత్తంబు గీలుకొలిసి ముక్తురాలయ్యె నని యెఱింగించి.

భావము:
దీనికొక ప్రాచీన కథ ఉంది. శ్రద్ధగా విను. మిథిలానగరంలో పింగళ అనే వేశ్యామణి ఉంది. ఆమె వలన కొంత పరిఙ్ఞానాన్ని పొందాను. ఎలాగ అంటే, ఆ వనిత డబ్బుమీది ఆశతో తన ప్రియుడిని మోసపుచ్చి ధనమిచ్చే మరొక విటుడిని మరిగింది. వాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాడితో రాత్రిళ్ళు నిద్రలేకుండా ఊర్లమ్మట, వీధులమ్మట విహరించింది. నిద్ర లేకపోవటం వలన బాగా నీరసించింది. ధనకాంక్షతో తిరిగితిరిగి అలసిపోయింది. చివరకు ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించుకుంది. నారాయణుడిని కనుక ఇలా చింతిస్తే కైవల్యాన్ని చెందగలను కదా, అని విచారించింది. తన శయన గృహాన్ని, సమస్త సంపదలను త్యజించింది. వాసుదేవుడి పాదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదై, శరీరం మెరుపులా అశాశ్వతమైన దని నిశ్చయించుకుంది. పరతత్వం మీద మనస్సు లగ్నంచేసుకుని, ముక్తురాలైంది. అని శ్రీకృష్ణుడు వివరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=101

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..