Wednesday, July 31, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_12


1-14-తే.
             చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
             నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
             దయయు సత్యంబు లోనుగాఁ లఁపఁడేనిఁ
             గలుగ నేటికిఁ దల్లుల డుపుఁ జేటు.
          ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు చేతులారా శివుణ్ణి పూజించాలి. నోరారా కేశవుణ్ణి కీర్తించాలి. కరుణ సత్యము మొదలైన గుణాలు అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం ఎందుకు. తల్లి కడుపు చెడగొట్టడం ఎందుకు.
        చేతులారంగ - చేతులు = చేతులు; ఆరంగ = నిండుగ; శివునిఁ బూజింపఁ డేని - శివుని = శివుడిని; పూబూజింపఁడు = పూజింపనివాడు; ఏని = ఐతే; నోరు - నోరు = నోరు; నొవ్వంగ - నొవ్వంగ = నొప్పెట్టేలా; హరి కీర్తి నుడువఁ డేని - హరి = విష్ణువుయొక్క; కీర్తి = కీర్తిని; నుడువఁడు = కీర్తించడు; ఏని = ఐతే; దయయు - దయయు = దయ మఱియు; సత్యంబు - సత్యంబు = సత్యములు; లోనుగాఁ దలఁపఁ డేనిఁ గలుగ నేటికిఁ దల్లుల - లోనుగాన్ = కలుగునట్లు; తలఁపఁడేనిన్ = ఎంచకపోతే; కలుగన్ = పుట్టుట; ఏటి = ఎందుల; కిన్ = కు; తల్లుల = వారి తల్లుల యొక్క; కడుపుఁ జేటు - కడుపు = కడుపు; చేటు = చెడపుటకా.
 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

Tuesday, July 30, 2013

జగన్నాథపండితరాయలు - ఏకసంథాగ్రాహి కన్నా గొప్పవాడు.


ఇవాళ ఎంతో శుభదినం. మా నల్లనయ్య కృపాకటాక్షాల వల్ల బహుళ శాస్త్ర పారంగత శ్రేష్ఠులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళి గారితో సంభాషించే అదృష్టం లభించింది. వారు చెప్పిన ఒక అసాధారణ ధారణ గల వ్యక్తి చరిత్ర మీతో పంచుకుంటా. . . .
జగన్నాథపండితరాయలు అని సంస్కృత పండితుడు కోనసీమలో ఉండేవారుట. ఈయన ఉత్రరదేశయాత్రకి బయలుదేరి వెళ్తున్నారుట. అవి ఢిల్లీని పాదుషాలు పాలిస్తున్న రోజులు. ఆ రోజుల్లో అందరు సామాన్యంగా కాలినడకన వెళ్ళేవారు కదా అలానే వారు వెళ్తున్నారు. అలా అక్కడ నడుస్తుండగా బాగా ఎండగా ఉందని ఒక చెట్టు కింద ఆగారు. ఆ పక్కనే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అలా ఆ గొడవ పాదుషా దర్బారుకి వెళ్ళింది. ప్రత్యక్ష సాక్షులు ఎవరేనా ఉన్నారా అంటే. ఒక బ్రాహ్మణుడు చెట్టు కింద ఉన్నాడు అని చెప్పారు. రౌతులు గుర్రాలమీద వెళ్ళి వీరిని పట్టుకొని పాదుషా ఎదుట హాజరు పరచారు. అరబ్బీ పారశీకాలు కలిసిన అప్పటి వాడుక భాషలో రైతులు దెబ్బలాడుకున్నారు. వీరికి మాతృ భాష తెలుగు పండిత భాష సంస్కృతం వచ్చు కాని ఆ భాష రాదు. అదే విషయం వివరించి, భాష రాకపోయిన వారు మాట్లాడుకున్న శబ్దాలు యధాతథంగా అప్పజెప్పారు. ఆహా ఏం ధారణాశక్తి, ఏం ఙ్ఞాపకశక్తి.
ఆ మహా పండితుడు పిమ్మట ముస్లిం స్త్రీ లవంగిని వివాహమాడారు, అనేక గొప్ప రచనలు రాశారట.
ఏకాసంథాగ్రాహి అని ఒక్కొక్కళ్ళు ఉంటా రని విన్నా కాని, ఇంత గొప్ప ఙ్ఞాపక శక్తి, ధారణ వినటం కాదు ఊహించను కూడ ఊహించ లేదు. మరి వీరి ఐక్యూ ఎలా లెక్కపెట్టాలో?

తెలుగు భాగవత తేనె సోనలు_1110.1-307-క.
బాలురకుఁ బాలు లే వని  
బాలింతలు మొఱలుపెట్టఁ కపక నగి యీ  
బాలుం డాలము చేయుచు  
నాకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!   
      గోపికలు బాలకృష్ణుని అల్లరి యశోదకు ఇలా పిర్యాదు చేస్తున్నారు. కమలలాంటి కన్నులున్న అమ్మా. అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోటం లే దని పసిపిల్లల తల్లులు  గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ ఆవులకు లేగదూడల తాళ్ళువిప్పి వదిలేస్తున్నాడు చూడమ్మ.
ఙ్ఞానముచే కలిగిన దృష్టి కలామె అంభోజాక్షి. గోపికలు అంటే ముముక్షువులు. బాలు రంటే అఙ్ఞానులు. బాలింతలు అంటే వారిని పోషించే ఙ్ఞానప్రదాతలు. వారు అఙ్ఞానులకి సరిపడినంత మోక్షం అనే పాలు అందటం లేదని తపిస్తున్నారట. ఎందుకంటే, బలం అంటే శక్తికి కారణభూతుడైన ఈ బాలుడు వేదాలు అనే ఆవులకి  మోక్షాపేక్ష గల వా రందరిని వదిలేస్తున్నా డట.
        బాలురకుఁ బాలు లేవని - బాలురు = పిల్లల; కున్ = కి; పాలు = తాగుటకు పాలు; లేవు = లేవు; అని = అని; బాలింతలు = పసిబిడ్డల తల్లులు; మొఱలుపెట్టఁ బకపక - మొఱలుపెట్టన్ = మొత్తుకొనగా; పకపక = పకపక అని; నగి = నవ్వి; యీ - = ; బాలుం డాలము - బాలుండు = పిల్లవాడు; ఆలమున్ = అల్లరి పెట్టుట, పరిహాసము; చేయుచు నాలకుఁ గ్రేపులను - చేయుచున్ = చేస్తూ; ఆల = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడిచె నంభోజాక్షీ - విడిచెన్ = వదలిపెట్టెను; అంభోజాక్షీ = సుందరీ {అంబోజాక్షి నీటిలో పుట్టిన పద్మాల్లాంటి కన్ను లున్నామె, స్త్రీ}.

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||