Saturday, July 31, 2021

శ్రీకృష్ణ విజయము - 296

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-520-వ.
అట్టియెడ రుధిర ప్రవాహంబులును, మేదోమాంసపంకంబునునై సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె; నయ్యవసరంబునం గయ్యంబునకుం గాలుద్రవ్వు నప్పౌండ్రకునిం గనుంగొని; హరి సంబోధించి యిట్లనియె.
10.2-521-మ.
"మనుజేంద్రాధమ! పౌండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేఁ
డనిలో మాపుదు; నెద్దు క్రొవ్వి పెలుచన్నాఁబోతుపై ఱంకెవై
చిన చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే
రునుఁ జిహ్నంబులు నీపయిన్ విడుతునర్చుల్‌ పర్వనేఁడాజిలోన్
10.2-522-క.
అదిగాక నీదు శరణము
పదపడి యేఁజొత్తు నీవు బల విక్రమ సం
పదగల పోటరి వేనిం
గదలక నిలు" మనుచు నిశితకాండము లంతన్.
10.2-523-మ.
చల మొప్పన్ నిగుడించి వాని రథముం జక్కాడి తత్సారథిం
దల వే త్రుంచి హయంబులన్ నరికి యుద్దండప్రతాపక్రియం
బ్రళయార్కప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్ వెసం ద్రుంప వాఁ
డిలఁ గూలెం గులిశాహతిన్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా!

భావము:
అలా శ్రీకృష్ణుడు చేస్తున్న యుద్ధంలో, నెత్తుటి ప్రవాహంతో, మాంసపు బురదతో సంగరాంగణం భయంకరంగా అయిపోయింది. ఆ సమయంలో తనపై కాలుద్రువ్వుతున్న పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ రాజాధమా! పౌండ్రకా! ఈరోజు యుద్ధంలో నీ మానం అంతా మంటగలుపుతాను. పౌరుషం అంతా పటాపంచలు చేస్తాను. ఎద్దు క్రొవ్వెక్కి ఆబోతుపై రంకెవేసినట్లు, నా దగ్గరకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నన్ను వదలివేయమనిన ఆ చక్రాది చిహ్నాలనే నీ మీద నిప్పులు చెలరేగేలా యుద్ధంలో ప్రయోగిస్తాను. అలా చేయలేకపోతే నిన్ను శరణువేడతానులే. నిజంగా నీవు కనుక బలపరాక్రమాలు గల వీరాధివీరుడవు అయితే యుద్ధరంగంలో నిలకడగా ఉండు.” అంటూనే శ్రీకృష్ణుడు వాడి బాణాలను సంధించి, పట్టుదలతో బాణాలు వేసి, వాడి రథాన్ని కూల్చివేసి, వెంటవెంటనే సారథి తల తెగనరికి, గుఱ్ఱాలను సంహరించాడు. ఉద్దండ ప్రతాపంతో ప్రళయకాల సూర్యుడితో సమానమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించి, పౌండ్రకుడి శిరస్సును ఖండించాడు. వజ్రాయుధము దెబ్బకి కూలిన పర్వతంలా పౌండ్రకుడు నేలకూలాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=523

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 295

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-517-క.
పరిఘ శరాసన పట్టిస
శర ముద్గర ముసల కుంత చక్ర గదా తో
మర భిందిపాల శక్తి
క్షురికాసిప్రాస పరశుశూలముల వెసన్.
10.2-518-చ.
పరువడి వైచినన్ దనుజభంజనుఁ డంత యుగాంత కాల భీ
కరమహితోగ్ర పావకుని కైవడి నేచి విరోధిసాధనో
త్కరముల నొక్కటన్ శరనికాయములన్ నిగిడించి త్రుంచి భా
స్వరగతి నొత్తె సంచలితశాత్రవసైన్యముఁ బాంచజన్యమున్.
10.2-519-ఉ.
వారని యల్కతోఁ గినిసి వారిజనాభుఁడు వారి సైన్యముల్‌
మారి మసంగినట్లు నుఱుమాడినఁ బీనుఁగుఁబెంటలై వెసం
దేరులు వ్రాలె; నశ్వములు ద్రెళ్ళె; గజంబులు మ్రొగ్గె; సద్భటుల్‌
ధారుణిఁ గూలి; రిట్లు నెఱిదప్పి చనెన్ హతశేషసైన్యముల్‌.

భావము:
పరిఘ, విల్లు అమ్ములు, పట్టిసం, ముసలం, సమ్మెట, ఈటె, చక్రం, గద, చిల్లకోల, బాకు, శక్తి ఆయుధము, చురకత్తి, గొడ్డలి, శూలం మొదలైన ఆయుధాలను చేపట్టి శ్రీకృష్ణుడి మీద వేగంగా ప్రయోగించాడు. దానితో, దానవాంతకుడు కృష్ణుడు భయంకర ప్రళయాగ్ని వలె విజృంభించి విరోధి ప్రయోగించిన ఆయుధాలు అన్నింటినీ తన బాణ సమూహంతో త్రుంచివేశాడు. శత్రుసైన్యాలకు సంచలనం కల్గించే తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అమితమైన ఆగ్రహంతో సరోజనాభుడు శ్రీకృష్ణుడు, మారి మహామారి వ్యాపించి సంహరించినంత భీకరంగా, వారియొక్క సైన్యాలను నాశనం చేసాడు; రథాలు విరిగిపోయాయి; అశ్వాలు కూలాయి; ఏనుగులు వ్రాలాయి; కాల్బలం గడ్డి కరచింది; ఈ విధంగా రణరంగము అంతా పీనుగుపెంటలు అయిపోయింది; మరణించకుండా మిగిలిన సైన్యం పరాక్రమం చెడి పారిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=519

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, July 29, 2021

శ్రీకృష్ణ విజయము - 294

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-515-వ.
అంతఁ గృష్ణుండు దండయాత్రోత్సుకుఁడై వివిధాయుధ కలితంబును, విచిత్రకాంచనపతాకాకేతు విలసితంబు నగు సుందరస్యందనంబుఁ బటు జవతురంగంబులం బూన్చి దారుకుండు తెచ్చిన, నెక్కి యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం, బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప నక్షౌహిణీద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతని మిత్రుండైన కాశీపతియును మూఁ డక్షౌహిణులతోడం దోడుపడువాఁడై వెడలె, నిట్లాప్తయుతుండై వచ్చువాని.
10.2-516-సీ.
చక్ర గదా శంఖ శార్ఙ్గాది సాధనుఁ-
  గృత్రిమగౌస్తుభ శ్రీవిలాసు
మకరకుండల హార మంజీర కంకణ-
  మణిముద్రికా వనమాలికాంకుఁ
దరళ విచిత్ర పతంగ పుంగవకేతుఁ-
  జెలువొందు పీతకౌశేయవాసు
జవనాశ్వకలిత కాంచన రథారూఢుని-
  రణకుతూహలు లసన్మణికిరీటు
10.2-516.1-తే.
నాత్మసమవేషు రంగవిహారకలిత
నటసమానునిఁ బౌండ్రభూనాథుఁ గాంచి
హర్ష మిగురొత్త నవ్వెఁ బద్మాయతాక్షుఁ
డంత వాఁడును నుద్వృత్తుఁ డగుచు నడరి.

భావము:
ఆ తరువాత, దారుకుడు అనేక రకాల ఆయుధాలు కలది; బంగారుజెండాతో విలసిల్లుతున్నది; వేగవంతాలైన గుఱ్ఱాలు కట్టినది అయిన రథం సిద్ధంచేసి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకుడి మీదకు దండయాత్రకు ఉత్సహించి దారుకుడు తెచ్చిన ఆ రథాన్ని అధిరోహించి కాశీనగరానికి వెళ్ళాడు. పౌండ్రకుడు కూడా మిక్కిలి రణోత్సాహంతో రెండు అక్షౌహిణుల సైన్యంతో పట్టణం బయటకు వచ్చాడు. అతని స్నేహితుడైన కాశీరాజు కూడ మూడు అక్షౌహిణుల సైన్యంతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. ఈ విధంగా మిత్రసహితుడై యుద్ధరంగానికి వస్తున్న పౌండ్రకుడిని శ్రీకృష్ణుడు చూసాడు. పౌండ్రకుడు శంఖం, చక్రం, గద, శార్ఞ్గంకత్తి మొదలైన ఆయుధాలను ధరించాడు. కృత్రిమమైన కౌస్తుభమణి వక్షాన తగిలించుకున్నాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు ధరించాడు. కంఠంలో వనమాల వేసుకున్నాడు. గరుడకేతనాన్ని చేకూర్చుకున్నాడు. పీతాంబరాన్ని కట్టాడు. వడిగల గుఱ్ఱాలతో గూడిన బంగారురథాన్ని అధిరోహించాడు. కాంతివంతమైన కిరీటాన్ని తలపై అలంకరించుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఇలా తన వేషాన్ని ధరించిన పౌండ్రకుని చూసి రంగస్థల నటునిగా భావించి శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=516

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, July 28, 2021

శ్రీకృష్ణ విజయము - 293

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-510-ఆ.
ఇంతనుండి యైన నెదిరిఁ దన్నెఱిఁగి నా
చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి
బ్రదుకు మనుము కాక పంతంబు లాడెనా
యెదురు మనుము ఘోర కదనమునను. "
10.2-511-క.
అను దుర్భాషలు సభ్యులు
విని యొండొరు మొగము సూచి విస్మితు లగుచున్
"జనులార! యెట్టి క్రొత్తలు
వినఁబడియెడు నిచట? లెస్స వింటిరె?" యనఁగన్.
10.2-512-వ.
అట్టియెడ కృష్ణుండు వాని కిట్లనియె.
10.2-513-మ.
"వినరా! మీ నృపుఁ డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో
దనమీఁదన్ వెస వైవఁ గంకముఖగృధ్రవ్రాతముల్‌ మూఁగఁగా,
ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి
న్ననయంబున్ నశనంబ వయ్యె దను మే నన్నట్లుగా వానితోన్. "

భావము:
నీ శక్తి ఎదుటివారిశక్తి ఇక నుంచి అయినా తెలుసుకుని, నా చిహ్నాలు అన్నింటినీ వదలిపెట్టి నాకు సేవకుడవై బ్రతుకు. కాదు పంతానికి పోతాను అంటావా. యుద్ధానికి సిద్ధపడు.” ఇలా పలికిన దూత దుర్భాషలను సభ్యులంతా విని ఒకరి ముఖం మరొకరు చూచుకుంటూ ఆశ్చర్యపోయారు. “ఈవేళ ఎంత విచిత్రపు మాటలు విన్నాము.” అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రౌండ్రకుడి దూతతో ఇలా అన్నాడు. “ఓరీ! సరిగా విను. మీ రాజు ఏ చిహ్నాలను ధరించాను అని నన్ను గురించి చెప్పాడో; అవే చిహ్నాలను రేపు బయలుదేరి వచ్చి తొందరలోనే ఘోరయుద్ధంలో అతని మీద ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోల్పోయి కూలి వికలం అయిపోయిన నిన్ను గ్రద్దలూ రాబందులూ చుట్టుముట్టుతా యని; కుక్కల గుంపులు నిన్ను చీల్చుకొని తింటా యనీ; మేము చెప్పినట్లుగా అతనికి చెప్పు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=513

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, July 27, 2021

శ్రీకృష్ణ విజయము - 292

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-508-సీ.
"మనుజేశ బలగర్వమున మదోన్మత్తుఁడై-
  యవనిపై వాసుదేవాఖ్యుఁ డనఁగ
నే నొక్కరుఁడ గాక యితరుల కీ నామ-
  మలవడునే?"యని "యదటు మిగిలి
తెగి హరిదా వాసుదేవుఁ డననుకొను-
  నఁట! పోయి వల దను"మనుచు దూతఁ
బద్మాయతాక్షుని పాలికిఁ బొమ్మన-
  నరిగి వాఁ డంబుజోదరుఁడు పెద్ద
10.2-508.1-తే.
కొలువుఁ గైకొని యుండ సంకోచపడక
"వినుము; మా రాజుమాటగా వనజనాభ!
యవని రక్షింప వాసుదేవాఖ్య నొంది
నట్టి యేనుండ సిగ్గు వోఁ దట్టి నీవు.
10.2-509-క.
నా పేరును నా చిహ్నము
లేపున ధరియించి తిరిగె దిది పంతమె? యిం
తే పో! మదిఁ బరికించిన
నే పంత మెఱుంగు గొల్లఁ డేమిట నైనన్?

భావము:
“భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నాకు ఒక్కడికే చెల్లుతుంది. ఇతరులకు ఏమాత్రం చెల్లదు. కృష్ణుడు రాజ్యం పెద్ద సైన్యం కలిగాయనే గర్వంతో పొగరెక్కి వాసుదేవుడనని అనుకుంటున్నాడుట. పోయి వద్దని చెప్పు” అని బలగర్వంతో మదోన్మత్తుడై, కమలాల వంటి కన్నులు ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరకు పౌండ్రకుడు ఆ దూతను పంపించాడు. వాడు వెళ్ళి శ్రీకృష్ణుడు సభతీర్చి ఉండగా సంకోచం లేకుండా ఇలా అన్నాడు “ఓ శ్రీకృష్ణా! మా రాజు చెప్పిన మాటలు విను. ‘భూమిని రక్షించడానికి వాసుదేవుడనే పేరు నాకుండగా, నీవు సిగ్గు విడిచి ఆ పేరు పెట్టుకున్నావు. నా పేరూ, నా చిహ్నాలూ ధరించి సంచరిస్తున్నావు. ఇది నీ పంతమా? ఐనా గోవులకాచుకునే గోపాలుడికి పంతమేమిటి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=508

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, July 26, 2021

శ్రీకృష్ణ విజయము - 291

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-481-వ.
మఱియును దన ధనంబు పరులచేతఁ గోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు సేయ రాలిన యశ్రుకణంబుల నవనిరేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలుగల కుంభీపాక నరకంబు నొందు; మఱియు నతనితోడఁ గ్రిందటఁ బది తరంబులవారును, ముందటఁ బది తరంబులవారును మహానరకవేదనలం బొందుదురు; స్వదత్తంబైన నర్ధలోభంబునం జేసి దుశ్శీలుండై యెవ్వఁడు బ్రాహ్మణక్షేత్ర సంభూత ధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డఱువదివేల సంవత్సరంబులు మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు; నట్లగుట యెఱింగి విప్రుడెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివా; రదియునుంగాక యేనును బ్రతిదినంబును భూసురుల నతి వినయంబునఁ బూజింతు; నిట్లు సేయక విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు; నదిగావున మీరలును బ్రాహ్మణజనంబుల వలనం బరమభక్తి గలిగి మెలంగుం" డని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోకశరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజ నివాసంబునకుం జనియె” నని చెప్పి శుకుం డిట్లనియె.
10.2-482-క.
"ఈ కథఁ జదివిన వారలుఁ
గైకొని వినువారు విగత కలుషాత్మకులై
లౌకికసౌఖ్యము నొందుదు
రా కైవల్యంబుఁ గరతలామలక మగున్.

భావము:
పరుల వలన తన ధనాన్ని కోల్పోయిన బ్రాహ్మణుడు దుఃఖించి నపుడు, స్రవించిన కన్నీటిధారల వలన భూమిమీద ఎన్ని రేణువులు తడుస్తాయో, అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించేరాజు కుంభీపాక నరకంలో బాధలు అనుభవిస్తాడు. అంతేకాదు అతడికి పదితరాల పూర్వులూ, తర్వాత పదితరాల వారూ నరకవేదనలను పొందుతారు. తాను ఇచ్చినదైనా, మరొకరు ఇచ్చినదైనా బ్రాహ్మణ భూముల నుండి వచ్చిన ధనధాన్యాలను రాజు దుశ్శీలుడై ఆశించకూడదు. అట్లాశించిన పాపాత్ముడు అరవైవేల సంవత్సరములు మలకూపంలో పురుగై బ్రతుకుతాడు. కనుక, ఈ విశేషాలు గ్రహించి బ్రాహ్మణుడు ఎంత తప్పుచేసినా, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా, అతనికి ఎదురు చెప్పకుండా వినయంతో నమస్కరించాలి. అటువంటివారే పుణ్యాత్ములు. అటువంటివారే నా అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు, నేను కూడా ప్రతిరోజూ బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను. ఇలా కాకుండా విపరీతంగా ప్రవర్తించే తామసులను నేను వెదకి దండిస్తాను. అందువలన, మీరు బ్రాహ్మణుల పట్ల మిక్కిలి భక్తిపరులై ప్రవర్తించండి.” అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు. ఇలా ధర్మబోధ చేసి, యాదవులు సేవిస్తుండగా శ్రీకృష్ణుడు తన మందిరం చేరాడు.” ఇలా చెప్పిన పిమ్మట శుకమహర్షి ఇలా అన్నాడు. “ఈ కథను చదివినవారికీ, విన్నవారికీ, సర్వపాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది. పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=482

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, July 23, 2021

శ్రీకృష్ణ విజయము - 290

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-479-సీ.
"నరనాథకుల కాననము దహించుటకును-
  నవనీసురులవిత్త మగ్నికీల;
జననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప-
  బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు;
పార్థివోత్తముల సంపచ్ఛైలములఁ గూల్ప-
  భూసురధనము దంభోళిధార;
జగతీవరుల కీర్తి చంద్రిక మాప వి-
  ప్రోత్తము ధనము సూర్యోదయంబు;
10.2-479.1-తే.
విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు
గరళమునకును బ్రతికృతి గలదు గాని
దాని మాన్పంగ భువి నౌషధములు లేవు
గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి.
10.2-480-క.
ఎఱుఁగమి నైనను భూసుర
వరులధనం బపహరింప వలవదు పతికిన్;
మఱపున ననలము ముట్టిన
దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్?

భావము:
రాజవంశం అనే అడవిని దహించే అగ్నిజ్వాల బ్రాహ్మణుల ధనం; జగపతుల ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఇంకించే బడబానలం విప్రక్షేత్రం; నరనాథుల సంపద అనే పర్వతాలకు భూసురుల ధనం వజ్రాయుధం; భూపతుల కీర్తి అనే వెన్నెలను తొలగించే సూర్యోదయం విప్రుల సంపద; బ్రాహ్మణుల ధనం కంటే విషం మేలు; విషానికి విరుగుడు ఉన్నది కానీ, బ్రాహ్మణ ధనాపహరణ వలన ప్రాప్తించే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు; అందుచేత, క్షత్రియులు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు. తెలిసి కాని, తెలియక కాని, విప్రుల సొమ్ము రాజు అపహరించ రాదు, తెలియక అగ్నిని ముట్టుకున్నా, శరీరం బొబ్బలెక్కి బాధపెడుతుంది తప్ప, ఆ అగ్ని దహించకుండా ఉండదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=480

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 289

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-477-ఆ.
"కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!
యప్రమేయ! వరద! హరి! ముకుంద!
నిన్నుఁ జూడఁ గంటి, నీ కృపం గనుగొంటి
నఖిల సౌఖ్యపదవు లందఁ గంటి. "
10.2-478-వ.
అని యనేకభంగులం గొనియాడి గోవిందుని పదంబులు దన కిరీటంబు సోఁకం బ్రణమిల్లి “దేవా! భవదీయ పాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాఁ బ్రసాదింపవే?” యని తదనుజ్ఞాతుండై యచ్చటి జనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతుల తేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె; నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె.

భావము:
“శ్రీకృష్ణా! వాసుదేవా! కేశవా! పరమాత్మా! అప్రమేయా! వరదా! హరీ! ముకుందా! నిన్ను దర్శించగలిగాను. నీ కృపను పొందగలిగాను. సమస్త సౌఖ్య పదవులను అందుకోగలిగాను.” ఇలా అనేక విధాలుగా స్తుతించి ఆ నృగుడు గోపాల ప్రభువు శ్రీకృష్ణుడి చరణారవిందాలకు నమస్కరించాడు. “దేవా! నీ పాదపద్మాలు నా హృదయ పద్మ మందు స్థిరపడునట్లు అనుగ్రహింపుము.” అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని అనుజ్ఞ గైకొని అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యానందాలు పొందుతుండగా నృగమహారాజు ఒక దివ్యవిమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాకుమార శ్రేష్ఠులకు ఇలా ధర్మబోధ గావించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=478

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, July 21, 2021

శ్రీకృష్ణ విజయము - 288

( నృగోపాఖ్యానంబు )

10.2-475-మ.
"మనుజేంద్రోత్తమ! వంశపావన! జగన్మాన్యక్రియాచార! నీ
ఘన దానక్రతుధర్మముల్‌ త్రిభువనఖ్యాతంబులై చెల్లెడిన్,
మును దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యానుబంధంబులై
చను సౌఖ్యంబులఁ బొందు; పద్మజునియాజ్ఞం ద్రోవఁగావచ్చునే? "
10.2-476-వ.
అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపు డీనికృష్టంబయిన యూసరవెల్లి రూపంబుఁ గైకొంటి; నింతకాలంబు దద్దోష నిమిత్తంబున నిద్దురవస్థం బొందవలసెఁ; బ్రాణులకుఁ బుణ్య పాపంబు లనుభావ్యంబులు గాని యూరక పోనేరవు; నేఁడు సమస్త దురితనిస్తారకంబయిన భవదీయ పాదారవింద సందర్శనంబునం జేసి యీ ఘోరదుర్దశలంబాసి నిర్మలాత్మకుండ నైతి" నని పునఃపునః ప్రణామంబు లాచరించి, మఱియు నిట్లనియె.

భావము:
“ఓ మహారాజా! నీవు చేసిన దానాలు యజ్ఞాలు ముల్లోకాలలో ప్రఖ్యాతి గాంచాయి, నీ పాపఫలాన్ని మొదట నీవు అనుభవించు. అటుపిమ్మట స్వర్గ సౌఖ్యాలను అనుభవించు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ దాటరానిది కదా.” ఇలా పలికి యముడు నన్ను అక్కడ నుండి త్రోసివేయించాడు. భూమిపై పడేటప్పుడే నాకు ఈ ఊసరవెల్లి రూపం సంభవించింది. ఇంతకాలం ఆ దోషం పోవడానికే, ఈ దురవస్థ పొందవలసివచ్చింది, ప్రాణులు తమ తమ పుణ్యపాప ఫలాలను రెండింటినీ అనుభవించాలి తప్పదు. అవి ఊరకేపోవు. ఇదిగో ఇవాళ సమస్త దోషాలను పోగొట్టగల నీ పాదపద్మాలను దర్శించడంతో, ఆ ఘోరదుర్దశ నుండి బయటపడ్డాను. నిర్మల హృదయుడను అయ్యాను.” అని నమస్కరించి ఇంకా ఇలా ప్రార్థించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=476

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 287

( నృగోపాఖ్యానంబు )

10.2-472-క.
అని మఱియును నవ్విప్రుని
సునయోక్తుల ననునయింపుచును నిట్లంటిన్
"ననుఁ గావు, నరకకూపం
బునఁ బడఁగా జాలఁ విప్రపుంగవ!" యనుచున్.
10.2-473-తే.
"ఎంత వేఁడిన మచ్చరంబంత పెరిఁగి
మొదల నాకిచ్చి నట్టి యీమొదవె కాని
యెనయ నీ రాజ్యమంతయు నిచ్చితేని
నొల్ల" నని విప్రుఁ డచ్చట నుండ కరిగె.
10.2-474-వ.
అ ట్లతం డరిగిన నా రెండవ బ్రాహ్మణునిం బ్రార్థించిన నతండును జలంబు డింపక "పదివే లేఱికోరిన పాఁడిమొదవుల నిచ్చిననైనను దీనిన కాని యొల్ల” నని నిలువక చనియె; నంతఁ గాలపరిపక్వం బైన నన్ను దండధరకింకరులు గొనిపోయి వైవస్వతు ముందటం బెట్టిన నతండు నన్ను నుద్దేశించి యిట్లనియె.

భావము:
ఇంకా ఆ బ్రాహ్మణుని రకరకాలుగా బతిమాలి, ప్రాధేయపడి, “మహాత్మా నన్ను నరకకూపం నుండి రక్షించండి” అని ప్రార్థించాను. నేను ఎంత వేడుకుంటుంటే అతనిలో మచ్చరం అంత పెచ్చుపెరిగిపోయింది. “మొదట నీవు నాకు ఇచ్చిన గోవును తప్ప, నీవు నీ రాజ్యమంతా ఇస్తాను అన్నా నేను అంగీకరించను” అని చెప్పి అక్కడ నుంచి విసవిసా వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన తరువాత రెండవ బ్రాహ్మణుడిని ఆ గోవును ఇవ్వమని ప్రార్థించాను. అతడు కూడా పట్టుదలతో “నీవు పదివేల గోవులను ఇచ్చినా, నాకు అవసరం లేదు. నాకు ఈ గోవే కావాలి.” అని అతను కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు. ఆ తరవాత కాలం పరిపూర్తి కాగా నన్ను యమభటులు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు ముందు నిలిపారు. యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=474

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, July 19, 2021

శ్రీకృష్ణ విజయము - 286

( నృగోపాఖ్యానంబు )

10.2-469-చ.
అనవుడు నాతఁ డిట్లనియె నాతనితో "నిపు డేను దీని నీ
జనపతిచేత ధారగొని సాధుగతిం జన నీది యంట యె"
ట్ల? నిన నతండు "నేనును ధరాధిపుచే మును ధారగొన్న యా"
వని వినిపింప నిద్దఱకు నయ్యె నపార వివాద మచ్చటన్.
10.2-470-వ.
ఇట్లు విప్రు లిద్దఱుం దమలో నంతకంతకు మచ్చరంబు పెచ్చుపెరిఁగి కలహించి నాయున్నయెడకుం జనుదెంచిరి; మున్ను నా చేత గోదానంబు గొన్న బ్రాహ్మణుం డిట్లనియె.
10.2-471-సీ.
"మనుజేంద్ర! ప్రజ లధర్మప్రవర్తనముల-
  నడవకుండఁగ నాజ్ఞ నడపు నీవు
మనమున నే ధర్మమని యాచరించితి?-
  మును నాకు నిచ్చిన మొదవు దప్పి
వచ్చి నీ మందలోఁ జొచ్చిన నిప్పు డీ-
  భూసురునకు ధారవోసి యిచ్చి
తగవు మాలితివి, దాతవు నపహర్తవు-
  నైన ని న్నేమందు? నవనినాథ! "
10.2-471.1-తే.
యనిన మాటలు సెవులు సోఁకినఁ గలంగి
"భూసురోత్తమ! యజ్ఞానపూర్వకముగ
నిట్టి పాపంబు దొరసె నే నెఱిఁగి సేయఁ
గొనుము నీ కిత్తు నొక లక్ష గోధనంబు. "

భావము:
ఆ మాటలు వినిన గోవును తోలుకుని వెళుతున్న బ్రాహ్మణుడు కశ్యపునితో “ఈ ఆవును నేను రాజుగారి దగ్గర దానంగా స్వీకరించాను. ఈ గోవు నీది అంటున్నావు. ఇదేమిటి” అన్నాడు అప్పుడు కశ్యపుడు “ఈ ఆవును రాజుగారే నాకు దానంగా ఇచ్చారు” అని అన్నాడు. ఈవిధంగా ఇద్దరు బ్రాహ్మణులకూ అక్కడ పెద్ద వివాదం జరిగింది. అంతకంతకూ పట్టుదలలు పెంచుకుని బాగా కలహించుకుని, ఆ బ్రాహ్మణులు ఇద్దరూ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు కశ్యపుడనే బ్రాహ్మణుడు నాతో ఇలా అన్నాడు. “ఓ రాజేంద్రా! నీవు ప్రజలను అధర్మమార్గంలో నడవకుండా నియంత్రించాల్సిన వాడవు. నీవే ధర్మము తప్పావు. ఇంతకు ముందు నాకు దానమిచ్చిన ఈ గోవు తప్పిపోయి నీ మందలో కలసిపోయింది. దీనిని ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు. నీవు ఏ విధంగా అధర్మమైన ఈ పని చేసావు. ఇలా ధర్మం తప్పి దానకర్తవు అవహర్తవు రెండూ నీవే అయ్యావు. కాని నిన్ను ఏమనగలము.” అన్నాడు ఈమాటలకు నేను బాధపడి “ఓ బ్రాహ్మణోత్తమా తెలియక ఈ పొరపాటు జరిగింది. ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు. దీనికి బదులుగా నీకు లక్షగోవులను దానమిస్తాను. స్వీకరించు.” అన్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=471

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, July 17, 2021

శ్రీకృష్ణ విజయము - 285

( నృగోపాఖ్యానంబు )

10.2-466-క.
అనఘా! మునుపడఁ గశ్యపుఁ
డను విప్రున కే నకల్మషాత్ముఁడనై యి
చ్చిన గోవు దప్పి నా మం
దను గలసినఁ దెలియలేక తగ నా గోవున్.
10.2-467-క.
ఒండొక భూమీసురకుల
మండనునకు దాన మీయ మసలక యా వి
ప్రుం డా గోవుంగొని చను
చుండన్ మును ధారగొన్న యుర్వీసురుఁడున్.
10.2-468-క.
మది రోష మొదవ దోవతి
వదలిన బిగియించుకొనుచు వడిఁ గది "సిది నా
మొదవు; నడివీథి దొంగిలి
వదలక కొనిపోయె; దిట్టివారుం గలరే? "

భావము:
ఓ పుణ్యపురుషా! అంతకు ముందు నేను కశ్యపుడనే విప్రుడికి పవిత్ర హృదయంతో దానముగా ఇచ్చిన గోవు తప్పిపోయి తిరిగివచ్చి నా ఆలమందలో కలసిపోయింది. ఆ విషయం తెలియక, నేను ఆ గోవును ఇంకొక బ్రాహ్మణోత్తమునకు దానముగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ఆవును తోలుకుని వెళుతూంటే, ఇంతకు ముందు నాచే దానం పొందిన కశ్యపుడు ఆ గోవును చూసాడు. అలా చూసిన కశ్యపుడు,మిక్కిలి రోషంతో ఊడిపోతున్న దోవతి బిగించి, ఆవును తోలుకుని వెళ్ళే బ్రాహ్మణుని దగ్గరకు వేగంగా వెళ్ళి “ఇది నా ఆవు. దానిని దొంగిలించి నడివీధిలో తోలుకుని పోతున్నావు. ఇటువంటి వారు ఎక్కడైనా ఉంటారా.” అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=468

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 284

( నృగోపాఖ్యానంబు )

10.2-462-చ.
పలుకులఁ దన్నుఁ దాఁ బొగడఁ బాతక మందు రటుండెఁ దారకా
వలి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్క పెట్టఁగా
నలవడుఁ గాని యేను వసుధామరకోటికి దాన మిచ్చు గో
వుల గణుతింప ధాతయునునోపఁడు మాధవ! యేమిసెప్పుదున్?
10.2-463-వ.
అదియునుం గాక.
10.2-464-చ.
పొలుచు సువర్ణశృంగఖురముల్‌ దనరం దొలిచూలులై సువ
త్సలు గల పాఁడియావుల నుదాత్త తపోవ్రత వేదపాఠముల్‌
గలిగి కుటుంబులై విహితకర్మములం జరియించు పేద వి
ప్రులకు సదక్షిణంబుగ విభూతి దలిర్పఁగ నిత్తు, నచ్యుతా!
10.2-465-వ.
మఱియును న్యాయసముపార్జిత విత్తమ్ములగు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతీ వస్త్ర తిల కాంచన రజత శయ్యాది బహువిధ దానంబు లనూనంబులుగా ననేకంబులు సేసితిఁ, బంచమహాయజ్ఞంబు లొనరించితి, వాపీ కూప తటాక వన నిర్మాణంబులు సేయించితి, నివ్విధంబునం జేయుచో నొక్కనాఁడు.

భావము:
శ్రీకృష్ణా! తనను తాను పొగడుకోవడం పాతకమని పెద్దలు అంటారు. కానీ మీరు చెప్పమన్నారు కనుక చెప్తాను. తారలను, ఇసుక రేణువులను, మంచు బిందువులను లెక్కించవచ్చు. కాని నేను బ్రాహ్మణశ్రేష్ఠులకు దానాలు ఇచ్చిన గోవులను లెక్కించడానికి బ్రహ్మకు కూడా శక్తి చాలదు. ఏమిచెప్పేది. అంతే కాదు అదీగాక, అచ్యుతా! తపోనిధులు, వేద పండితులు, విహితకర్మలను ఆచరించే గృహస్తులూ ఐన బ్రాహ్మణులకు బంగారుకొమ్ములు గిట్టలు కలిగి, తొలిచూలు దూడలు కల పాడిఆవులను దక్షిణతోపాటు ఘనంగా దానం చేశాను. అంతేకాకుండా, న్యాయసముపార్జిత మైన ధనంతో నేను గోదానం, భూదానం, బంగారుదానం, రత్నదానం, గృహదానం, రథదానం, గజదానం, అశ్వదానం, సరస్వతీదానం, వస్త్రదానం, తిలదానం, కన్యాదానం, మొదలైన దానాలను ఎన్నింటినో చేసాను. పంచమహాయజ్ఞాలు నెరవేర్చాను. బావులను, దిగుడు బావులను, చెఱువులను, వనాలను, నిర్మింపజేశాను. ఇలా దానధర్మాలు చేస్తూ ఉండగా ఒక రోజున ఒక విశేషం జరిగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=465

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, July 15, 2021

శ్రీకృష్ణ విజయము - 283

( నృగోపాఖ్యానంబు )

10.2-459-క.
అని యడిగిన మురరిపు పద
వనజంబులఁ దన కిరీటవరమణు లొరయన్
వినయమున మ్రొక్కి యిట్లను
ఘనమోదముతోడ నిటల ఘటితాంజలియై.
10.2-460-తే.
"విశ్వసంవేద్య! మహిత! యీ విశ్వమందుఁ
బ్రకటముగ నీ వెఱుంగని దొకటి గలదె
యైన నాచేత విన నిష్ఠమయ్యె నేని
నవధరింపుము వినిపింతు నంబుజాక్ష!
10.2-461-శా.
ఏ నిక్ష్వాకుతనూజుఁడన్ నృగుఁడు నా నేపారు భూపాలుఁడన్;
దీనవ్రాతము నర్థిఁ బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్చి స
మ్మానింపం జతురంత భూభరణసామర్థ్యుండనై సంతత
శ్రీ నిండారినవాఁడ నుల్లసిత కీర్తిస్ఫూర్తి శోభిల్లఁగన్.

భావము:
అని శ్రీకృష్ణుడు అడుగడంతో ఆ పురుషుడు మురారి పాదపద్మాలకు తన కిరీటం మణులు సోకేలా నమస్కరించి, తన నుదుట చేతులు మోడ్చి, ఆనందంతో ఇలా విన్నవించాడు. “ఓ విశ్వవేద్యా! మహానుభావ! నీవు సర్వజ్ఞుడవు. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం ఏదీ లేదు. అయినా, నా ద్వారా వినాలని భావించావు గనుక, అలాగే చెప్తాను. నేను ఇక్ష్వాకుని పుత్రుడను. నా పేరు నృగుడు. నేను రాజులు అనేకులు నన్ను సేవిస్తుండగా బహు సమర్థవంతంగా రాజ్యపాలన సాగించాను. దీనులను పోషించాను. పెంపొందిన అనంత కీర్తిసంపదలతో శోభించాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=461

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 282

( నృగోపాఖ్యానంబు )

10.2-456-ఉ.
విని సరసీరుహాక్షుఁ డతివిస్మితుఁడై జలశూన్యకూప మ
ల్లన కదియంగ నేఁగి కృకలాసము నొక్కతృణంబుఁ బోలె గొ
బ్బు న వెడలించె వామకరపద్మమున న్నది యంతలోనఁ గాం
చనరుచి మేనఁ గల్గు పురుషత్వముతోఁ బొడసూపి నిల్చినన్.
10.2-457-వ.
చూచి కృష్ణుం డతని వృత్తాంతం బంతయు నెఱింగియు నక్కడి జనంబులుం గుమారవర్గంబును దెలియుకొఱకు నతనిచేత తద్వృత్తాంతం బంతయు నెఱింగించువాఁడై యిట్లనియె.
10.2-458-చ.
"కన దురు రత్నభూషణ నికాయుఁడవై మహనీయమూర్తివై
యనుపమకీర్తిశోభితుఁడవై విలసిల్లుచు ధాత్రిమీఁదఁ బెం
పొనరిన నీకు నేమిగతి నూసరవెల్లితనంబు చొప్పడెన్
విన నిది చోద్య మయ్యె సువివేకచరిత్ర! యెఱుంగఁ జెప్పుమా! "

భావము:
పద్మాక్షుడు ఈ విషయం విని ఆశ్చర్యపడి, ఆ నీరులేని బావి దగ్గరకు వచ్చి, తన ఎడమచేతితో ఆ ఊసరవెల్లిని ఒక గడ్డిపరకను తీసినంత అవలీలగా బయటకు తీసాడు. అంతలో ఆ ఊసరవెల్లి బంగారురంగుతో శోభిల్లే పురుష రూపాన్ని పొందింది. అతనిని చూచి శ్రీకృష్ణుడు అతని వృత్తాంతం తనకు తెలిసినా కూడా, తన కుమారులకూ మిగిలిన జనాలకు తెలియడం కోసం. అతని కథను అతని చేతనే చెప్పించాలి అనుకుని అతనితో ఇలా అన్నాడు. “ఓ విచిత్ర చరిత్రుడా! చాలా విచిత్రంగా ఉంది. రత్నభూషణాలను ధరించి అసమానమైన కీర్తిని గడించి మహనీయమూర్తివై భూలోకంలో విలసిల్లే నీకు ఊసరవెల్లి రూపం ఎలా కలిగింది. నీ వృత్తాంతం అంతా మాకు వివరంగా చెప్పు”.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=458

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, July 13, 2021

శ్రీకృష్ణ విజయము - 281

( నృగోపాఖ్యానంబు )

10.2-454-సీ.
"ధరణీశ! యొకనాఁడు హరి తనూజులు రతీ-
  శ్వర సాంబ సారణ చారుభాను
లాదిగా యదుకుమారావలి యుద్యాన,-
  వనమున కతివైభవమున నేగి
వలనొప్ప నిచ్ఛానువర్తులై సుఖలీలఁ-
  జరియించి ఘనపిపాసలనుఁ జెంది
నెఱిదప్పి సలిల మన్వేషించుచును వేగ-
  వచ్చుచో నొకచోట వారిరహిత
10.2-454.1-తే.
కూపమును నందులో నొక కొండవోలె
విపుల మగు మేని యూసరవెల్లిఁ గాంచి
చిత్తముల విస్మయం బంది తత్తఱమున
దాని వెడలించు వేడుక దగులుటయును.
10.2-455-చ.
పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటఁగట్టి య
గ్గురుభుజు లందఱుంగదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం
దరలఁగఁ దీయలేక దగ దట్టముగా మది దుట్టగిల్ల నొం
డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంతఁ జెప్పినన్.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! ఒకనాడు శ్రీకృష్ణుడి కుమారులు ఐన ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలైన యాదవ కుమారులు మిక్కిలి వైభవంగా ఉద్యానవనానికి వెళ్ళారు. స్వేచ్ఛగా ఆ ఉద్యానవనంలో విహరించి అలసిపోయారు. దాహం తీర్చుకోవడానికి నీటి కోసం వెదికారు. ఒకచోట, వారికి ఒక నీరు లేని పాడుబడ్డ బావి కనిపించింది. దానిలో ఉన్న పెద్దగా కొండంత ఉన్న ఊసరవెల్లిని చూసి, వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఊసరవెల్లిని బావిలో నుంచి బయటకు తీయాలని అనుకున్నారు. వారంతా పరుగు పరగున వెళ్ళి, పెద్ద పెద్ద తాళ్ళు తీసుకుని వచ్చారు. గొప్ప భుజబలం కల ఆ వీరులు ఆ ఊసరవెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వారు వెంటనే వెళ్ళి శ్రీకృష్ణుడితో ఈ విషయం విన్నవించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=455

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 280

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-309-క.
అందు వసించిరి నందిత
చందన మందార కుంద చంద్ర లసన్మా
కందముల నీడ హృదయా
నందము సంధిల్ల నందనందనముఖ్యుల్‌.
10.2-310-వ.
తదనంతరంబ పురప్రవేశంబు సేసి" రని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

భావము:
అలా చందనవృక్షాలు మందారాలు మంచి మామిళ్ళు మొదలైన అనేక వృక్షాలతో శోభిస్తున్న ఆ కుశస్థలి పట్టణం సమీపంలోని ఉద్యానవనం చేరి విడిసారు. అక్కడ కృష్ణాదులు చందన మందారాది ఉద్యానవన వృక్షాల నీడలలో ఆనందంగా విశ్రమించారు. అటుపిమ్మట, వారందరూ పురప్రవేశం చేశారు.” అని చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుతో ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=309

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, July 11, 2021

శ్రీకృష్ణ విజయము - 279

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-306-క.
పరమానురాగరస సం
భరితాంతఃకరణు లగుచుఁ బాటించి వధూ
వరులను రథమం దిడి హల
ధర హరి రుక్మిణులఁ గొల్చి తగ యదువీరుల్‌.
10.2-307-ఉ.
మంగళతూర్యఘోషము లమందగతిం జెలఁగంగ మత్త మా
తంగ తురంగ సద్భట కదంబముతోఁ జని కాంచి రంత నా
రంగ లవంగ లుంగ విచరన్మదభృంగ సురంగనాద స
త్సంగ తరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్.
10.2-308-వ.
ఇట్లు పురోపవనోపకంఠంబునకుం జని.

భావము:
యాదవవీరులు అనురాగమయ హృదయులై, వధూవరులను రథం మీద ఎక్కించుకుని బలరాముడు, కృష్ణుడు, రుక్మిణిలతో పాటు తమ రాజ్యానికి బయలుదేరారు. మంగళవాద్య ధ్వనులు మ్రోగుతుండగా; మదగజ, తురగ, రథ, సుభటులతో కూడిన చతురంగబలాలతో బయలుదేరి, వికసించిన నానావిధ వృక్షాలతో ఝుంకారంచేసే తుమ్మెదలతో స్వచ్ఛమైన తరంగాలతో ఎడతెగక పారే నదులతో కూడిన కుశలమైన ప్రాంతం కావున కుశస్థలి అని పేరుపొందిన ద్వారకానగరం చేరారు. అలా ద్వారకానగర పొలిమేర దాపునకు చేరి.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=307

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 278

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-301-క.
మును దంతపంక్తి వెలిగాఁ
దను నవ్విన యక్కళింగుఁ దల వట్టి రయం
బునఁ బడఁదిగిచి వదన మే
పునఁ బెడచే వ్రేసి దంతములు వెస డులిచెన్.
10.2-302-క.
అంతం బోవక రుక్మిని
దంతంబులు మున్ను డులిచి తను వగలింప
న్నంతకుపురి కేగెను వాఁ
డెంతయు భయ మంది రాజు లెల్లం గలఁగన్.
10.2-303-వ.
అట్లుచేసి యయ్యాదవసింహం బసహ్యవిక్రమంబునం జెలంగె నంత.
10.2-304-క.
భూవర! పద్మాక్షుఁడు దన
బావ హతుం డగుట గనియుఁ బలుకక యుండెన్
భావమున రుక్మిణీ బల
దేవుల కే మనఁగ నెగ్గు దేఱునొ? యనుచున్.
10.2-305-వ.
అంత నా విదర్భానగరంబు నిర్గమించి.

భావము:
ఇంతకు ముందు తనను చూసి పండ్లికిలించి నవ్విన ఆ కళింగుడి తలపట్టుకుని క్రిందపడత్రోసి ఎడమచేతితో నోటి మీద గుద్ది పండ్లు ఊడగొట్టాడు. బలభద్రుడు అంతటితో ఊరుకోకుండా రాజులంతా భయపడేలా రుక్మి పండ్లు పగుల గొట్టి, గట్టిగా కొట్టాడు. దానితో వాడు మరణించాడు. ఈ విధంగా యదుసింహుడు బలరాముడు భయంకరమైన పరాక్రమంతో చెలరేగాడు. ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు తన బావమరది మరణాన్ని చూసి కూడా ఏమాటంటే రుక్మిణీ బలరాములు ఏమనుకుంటారోనని మౌనం వహించాడు. అంతట, యదువీరులు విదర్భానగరం వదలిపెట్టారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=304

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, July 9, 2021

శ్రీకృష్ణ విజయము - 277

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-300-వ.
అనిన విని సకలజనంబులు నద్భుతానందనిమగ్న మానసులైరి; కుటిలస్వభావులయిన భూవరులు రుక్మిం గైకొల్పిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిందన్ను నెఱుంగక బలాబల వివేకంబు సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునిం గని "యిప్పటి యాటయు నేన గెల్చియుండ వృథాజల్పకల్పనుండ వయి ‘గెల్చితి’ నని పల్కెద; వక్షవిద్యా నైపుణ్యంబు గల భూపకుమారులతోఁ బసులకాపరు లెత్తువత్తురే" యని క్రొవ్వున నవ్వుచుం బలికిన, నప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాఁకినఁ గోపోద్దీపితమానసుండై పెటపెటం బండ్లుగొఱకుచుం గన్నులనిప్పు లుప్పతిల్లం గినుకం దోఁకత్రొక్కిన మహోరగంబు నోజ రోఁజుచు దండతాడితంబయిన పుండరీకంబులీల హుమ్మని మ్రోయుచుఁ బ్రచండ బాహుదండంబులు సాఁచి పరిఘం బందుకొని పరిపంథి యైన రుక్మిని నతని కనుకూలంబయిన రాజలోకంబును బడలుపడ నడిచె; నయ్యవసరంబున.

భావము:
ఆ మాటలువిని అక్కడి జనులంతా ఆనందించారు. కానీ కొందరు దుష్ట రాజులు ప్రేరేపించగా, రుక్మి పూర్వం జరిగిన పరాభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని, బలాబలాలు తెలుసుకోలేక, విధివశాన బలరాముడిని చూసి పట్టుదలగా ఇలా అన్నాడు “ఈ ఆట గూడా నేనే గెల్చాను. వ్యర్థ ప్రలాపాలతో నేనే గెల్చానని చెప్పుకుంటున్నావు. జూదంలో ప్రావీణ్యం కల రాజకుమారులతో పశుల కాపరులు జూదమాడి గెలవగలరా?” అని అహంకారంతో నవ్వుతూ అవహేళన చేసాడు. ఈ పలుకులు బలరాముడి చెవులకు ములుకులుగా తగిలాయి. దానితో ఆయన కోపంగా పండ్లు పటపటా కొరుకుతూ, తోకత్రొక్కిన త్రాచులాగా బుసలుకొడుతూ, కఱ్ఱదెబ్బ తగిలిన పెద్దపులివలె గాండ్రించి, ఒక ఇనుపగుదియను తన చేతిలోకి తీసుకుని రుక్మినీ అతని పక్షం వారయిన రాజలు అందరినీ చావచితకబాదాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=300

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, July 7, 2021

శ్రీకృష్ణ విజయము - 276

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-296-ఉ.
ఆడిన యాట లెల్లను హలాయుధుఁ డోడిన రుక్మి గెల్చుడున్
దోడి నృపాల కోటి పరితోషముఁ జెందఁ గళింగభూవిభుం
"డోడె బలుం" డటంచుఁ బ్రహసోక్తుల నెంతయు రాముఁ జుల్కఁగా
నాడెను దంతపంక్తి వెలి యై కనుపట్టఁగఁ జాల నవ్వుచున్.
10.2-297-తే.
బలుఁడు కోపించి యొక లక్ష పణము సేసి
యాడి ప్రకటంబుగా జూద మపుడు గెల్చె;
గెల్చి నను రుక్మి "యిది యేను గెల్చియుండ
గెలుపు నీ దని కికురింప నలవి యగునె?"
10.2-298-క.
అనవుడు హలధరుఁ డచ్చటి
జనపాలకసుతులఁ జూచి "సత్యము పలుకుం"
డని యడిగిన వారలు రు
క్ముని హితులై పలుక రైరి మొగమోటమునన్.
10.2-299-ఉ.
అప్పటి యట్ల యొడ్డి ముసలాయుధుఁ డేపున నాడి జూదముం
జొప్పఁడ గెల్చి "యీ గెలుపు సూడగ నాదియొ వానిదో జనుల్‌
తప్పక చెప్పుఁ" డన్న విదితధ్వనితో నశరీరవాణి తా
నిప్పటియాట రాముఁడె జయించె విదర్భుఁడె యోడె నావుడున్.

భావము:
ఆడిన ప్రతీ ఆటలో బలరాముడు ఓడిపోయాడు. రుక్మి గెలిచాడు. అక్కడి రాజు లందరికీ సంతోషం కలిగేలా, కళింగరాజు “బలరాముడు ఓడిపోయా” డని ఎగతాళి చేస్తూ పండ్లు బయటపడేలా ఇకిలించాడు. అప్పుడు బలరాముడికి కోపం వచ్చింది. ఒక లక్ష పందెంకాసి బలరాముడు రుక్మిపై విజయం సాధించాడు. బలరాముడు గెలిచినప్పటికీ, రుక్మి “విజయం నాదైతే, నువ్వే గెలిచానని చెప్పి మోసపుచ్చడం తగదు.” అని ఎదురుతిరిగాడు. అప్పుడు బలరాముడు అక్కడ చేరిన రాజులను అందరిని చూసి “నిజం చెప్పం” డని అడిగాడు. వారు రుక్మి మీది పక్షపాతం వలన మొహమాటంతో మౌనం వహించారు. బలరాముడు మళ్ళీ మరో ఆట ఆడి గెలిచాడు. “ఇప్పటి విజయం నాదా లేక ఇతనిదా చెప్పండి” అని అక్కడి వారిని మరల ప్రశ్నించాడు. ఆ సమయంలో అశరీరవాణి “ఈ ఆటలో బలరాముడే గెల్చాడు. విదర్భరాజు రుక్మి ఓడిపోయాడు” అని స్పష్టంగా తెలిపింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=299

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, July 5, 2021

శ్రీకృష్ణ విజయము - 275

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-294-ఆ.
"పూని మనము గొంత ప్రొద్దువోకకు రామ!
నెత్త మాడ నీవు నేర్తు వనఁగ
విందు; మిపుడు గొంత వెల యొడ్డి యాడుద"
మనిన బలుఁడు "లెస్స" యని చెలంగె.
10.2-295-క.
మదిలోని చలము డింపక
పది యిరువది నూఱు వేయి పదివే లిదె ప
న్నిద మని యొడ్డుచు నాడిరి
మదమున నిద్దఱును దురభిమానము పేర్మిన్.

భావము:
“బలరామా! జూదంలో నీవు సమర్ధుడవని విన్నాను. మనం కాలక్షేపానికి జూదమాడుదామా? ఇప్పుడు పందెం పెట్టుకుని జూదమాడుదామా?” అని పిలువగా, బలరాముడు అందుకు ఉత్సాహంగా “సరే” అన్నాడు. మనస్సులోని పట్టుదలలు ఏమాత్రం వదలకుండా, పది, ఇరవై, నూరు, వేయి, పదివేలు, అంటూ పందేలు పెంచుకుంటూ పట్టుదలలతో వారిద్దరూ జూదము ఆడసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=295

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 274

( ప్రద్యుమ్న వివాహంబు )

10.2-291-క.
అని పురికొల్పిన రుక్మియుఁ
దన చేటు దలంప లేక తాలాంకునితో
డను జూదమాడఁ దివిరెను
వనజాసను కృతము గడచు వారెవ్వ రిలన్?
10.2-292-వ.
అంత.
10.2-293-క.
కోరి విదర్భుఁడు కుటిల వి
హారుండై పిలిచె జూదమాడ జితారిన్
హారిన్ సన్నుతసూరిన్
సీరిన్ రైవతసుతార్ద్ర చిత్తవిహారిన్.

భావము:
కళింగదేశాధీశుడు ఈ మాదిరిగా పురికొల్పగా, రుక్మి తనకు కలిగే చేటు గమనించుకోకుండా, తాడిచెట్టు జండా గుర్తుగా కల ఆ బలరాముడితో జూదమాడడానికి సిద్ధమయ్యాడు. లోకంలో బ్రహ్మవ్రాత తప్పించుకో గలవారు ఎవరు లేరు కదా. అటుపిమ్మట శత్రుసంహారకుడు, సజ్జన సేవితుడు, రేవతీవల్లభుడూ, హాలాయుధుడూ అయిన బలరాముణ్ణి జూదమాడడానికి రమ్మని, రుక్మి కుటిల స్వభావంతో కోరి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=29&Padyam=293

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, July 3, 2021

శ్రీకృష్ణ విజయము - 273

( ప్రద్యుమ్న వివాహంబు )

10.2-289-క.
ఒకనాఁడు యదుకుమారకు
లకలంక సమగ్ర వైభవాటోప మహో
త్సుకులై యుండఁగఁ జూపో
పక యెకసెక్కెమున నవనిపాలురు వరుసన్.
10.2-290-ఉ.
ఎచ్చరికం గళింగధరణీశుఁడు రుక్మిమొగంబు సూచి నీ
యొచ్చెముఁ దీర్చుకో నిదియ యొప్పగువేళ బలుండు జూదమం
దిచ్చ గలండు; గాని పొలుపెక్కిననేర్పరి గాఁడు; గాన నీ
కిచ్చు నవశ్యమున్ జయము నీఁగుము తొల్లిటఁబడ్డ బన్నమున్.

భావము:
ఒక రోజున యాదవులంతా మహావైభవంతో ఉత్సాహ పూరితులై ఉండగా చూస్తున్న కొందరు రాజులు ఓర్వలేక పోతూ కళింగాధీశుడు రుక్మితో ఇలా అన్నాడు “నీకు ఇంతకు ముందు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే తగిన సమయం. బలరాముడికి జూదం మీద ఇష్టం ఎక్కువ కాని, ఆటలో నేర్పరి కాదు. అందుచేత నీకే విజయం లభిస్తుంది. ఇంతకు ముందు పొందిన అవమానాన్ని ఇప్పుడు ఇలా తొలగించుకో.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=29&Padyam=290

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, July 2, 2021

శ్రీకృష్ణ విజయము - 272

( ప్రద్యుమ్న వివాహంబు )

10.2-286-తే.
ప్రకటచరితుండు భీష్మభూపాలసుతుఁడు
మనము మోదింపఁ దన కూర్మిమనుమరాలి
రుక్మలోచన నసమాన రుక్మకాంతిఁ
జెలిమి ననిరుద్ధునకుఁ బెండ్లి సేయు నపుడు.
10.2-287-క.
పొలుపుగ రత్నవిభూషో
జ్జ్వలుఁలయి శుభవేళ నవ్వివాహార్థము ని
ర్మల బహు వైభవ శోభన
కలితవిదర్భావనీశ కటకంబునకున్.
10.2-288-చ.
హరియును రుక్మిణీసతియు నా బలభద్రుఁడు శంబరారియు
న్నరిమదభేది సాంబుఁడును నాదిగ రాజకుమారకోటి సిం
ధుర రథవాజి సద్భటులతోఁ జని యందు సమగ్రవైభవా
చరిత వివాహయుక్త దివసంబులు వేడుకఁ బుచ్చి యంతటన్.

భావము:
సుప్రసిద్ధుడైన భీష్మక మహారాజు కుమారుడు రుక్మి, బంగారు కాంతులతో శోభిస్తున్న తన మనుమరాలు “రుక్మలోచన”ను అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేయించాడు. ఆ వివాహ శుభసందర్భంలో ఆ విదర్భ రాజధాని కుండిన పట్టణానికి, రత్నఖచిత భూషణాలు అలంకరించుకుని నిర్మల బహువిధ శోభలతో శుభముహూర్తాన బయలుదేరి రుక్మిణి, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, శంబరుని సంహరించిన ప్రద్యుమ్నుడు, అరివీర భయంకరుడు సాంబుడు మున్నగు రాకుమారులు అందరూ ఆ కుండిన పురానికి విచ్చేసారు. సర్వవైభవ యుక్తంగా వివాహం జరుగుతున్న ఆ రోజులలో అందరూ వేడుకలతో అనందంగా కాలం గడపసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=29&Padyam=288

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, July 1, 2021

శ్రీకృష్ణ విజయము - 271

( ప్రద్యుమ్న వివాహంబు )

10.2-283-చ.
చని పురిఁజొచ్చి వృష్ణికులసత్తముఁ డచ్చట మూఁగియున్న య
మ్మనుజవరేణ్యనందనుల మానము దూలి భయాకులాత్ము లై
చనఁగ ననేక చండతర సాయకసంపదఁ జూపి రుక్మి నం
దనఁ గొనివచ్చి వేడ్క నిజధామము సొచ్చె నవార్యశౌర్యుఁ డై.
10.2-284-వ.
ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరినయనం బరిణయంబంది నిఖిల సుఖంబు లనుభవింపుచుండె; యనంతరంబ.
10.2-285-క.
ధీరుఁడు కృతవర్ముని సుకు
మారుఁడు వరియించె రుచిరమండనయుత నం
భోరుహముఖి రుక్మిసుతం
జారుమతీకన్యఁ బ్రకటసజ్జనమాన్యన్.

భావము:
అలా కుండిన నగరంలో ప్రవేశించిన ఆ ప్రద్యుమ్నుడు వృష్ణివంశోత్తముడు, అక్కడ చేరిన రాజకుమారులపై తీవ్రమైన బాణాలు ప్రయోగించి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఆ రాకుమారులు ధైర్యం కోల్పోయి భయంతో పారిపోయారు. ప్రద్యుమ్నుడు అవక్ర పరాక్రముడై మేనమామ రుక్మి పుత్రిక రుక్మవతిని తన నగరానికి తీసుకుని వచ్చాడు, ఆ విధంగా ఆ హరిణాక్షి రుక్మవతిని తన నగరానికి తెచ్చిన ప్రద్యుమ్నుడు ఆమెని వివాహమాడి, సకల సౌభాగ్యాలను అనుభవిస్తున్నాడు. రుక్మి మరొక కుమార్తె పద్మముఖి సజ్జన సమ్మాన్య “చారుమతి”ని ధీరుడైన కృతవర్మ కుమారుడు వివాహమాడాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=29&Padyam=285

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 270

( ప్రద్యుమ్న వివాహంబు )

10.2-281-సీ.
నావుడు శుకయోగి "నరనాయకోత్తమ!-
  నీవు చెప్పిన యట్ల నెమ్మనమునఁ
బద్మాయతాక్షుచేఁ బడిన బన్నమునకుఁ-
  గనలుచు నుండియు ననుజతోడి
నెయ్యంబునను భాగినేయున కిచ్చెను-
  గూఁతు నంచితపుష్ప కోమలాంగిఁ
దన పూన్కి దప్పినఁ దగ విదర్భేశుండు-
  విను మెఱింగింతు న వ్విధము దెలియఁ
10.2-281.1-తే.
బరఁగ రుక్మవతీ స్వయంవరమున కొగి
నరుగుదెం డని భీష్మభూవరసుతుండు
వరుస రప్పించె రాజన్యవర కుమార
వరుల నను వార్త కలరి యా హరిసుతుండు.
10.2-282-చ.
వర మణిభూషణప్రభలవర్గ మనర్గళ భంగిఁ బర్వఁ బ్ర
స్ఫురిత రథాధిరోహణవిభూతి దలిర్ప మనోహరైక సు
స్థిరశుభలీల నేగె యదుసింహకిశోరము రాజకన్యకా
పరిణయవైభవాగత నృపాలక కోటికి రుక్మివీటికిన్.

భావము:
ఇలా అడిగిన పరీక్షిత్తు మహారాజుతో శుకముని ఇలా చెప్పనారంభించాడు “ఓ రాజేంద్రా! నీవు అన్నట్లుగానే రుక్మి శ్రీకృష్ణుని వలన పొందిన అవమానానికి మనసులో బాధపడుతూనే వున్నాడు. అయినా తాను చేసిన ప్రయత్నం ఫలించకపోగా ఆ విదర్భరాజు తన చెల్లెలిపై గల అభిమానంతో తన మేనల్లుడికి కుసుమ కోమలయైన తన కుమార్తెను ఇచ్చాడు. అ విషయం తెలియజేస్తాను, విను. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతి స్వయంవరానికి రాజకుమారులను అందరినీ ఆహ్వానించాడు. ఆ వార్త విని కృష్ణనందనుడు ప్రద్యుమ్నుడు సంతోషించాడు. మహోజ్వల మణిభూషణాలకాంతులతో శోభిస్తూ రమణీయమైన రథాన్ని ఎక్కి మనోహర సౌందర్య విలాసాలతో యదుకుల సింహకిశోరం ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడాలనే కోరికతో మేనమామ పట్టణం కుండిననగరం వెళ్ళాడు. అప్పటికే స్వయంవరానికి రాజులందరూ విచ్చేసి ఉన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=29&Padyam=281

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :