Thursday, September 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౨(642)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1331-క.
"నరవర! దేవాసుర సం
గరమును మును నిహతులైన క్రవ్యాద సము
త్కరము నరేశ్వరులై ద్వా
పరమున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్.
10.2-1332-క.
హరి తద్వధార్థమై ని
ర్జరులను యదుకులము నందు జనియింపింపం
ధర నూటొక్క కులం బై
పరఁగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే?

భావము:
“ఓ నరేంద్రా! పూర్వం దేవదానవ సంగ్రామంలో మరణించిన రాక్షసులు అందరు ద్వాపరయుగంలో రాజులుగా పుట్టి ప్రజలను బాధించసాగారు. విష్ణుమూర్తి ఆ రాక్షసులను చంపడం కోసం దేవతలను యదుకులంలో జన్మించేలా చేశాడు. అందువలన, యాదవుల యందు నూటొక్క కులాలు ఏర్పడ్డాయి. వారిని అందరిని లెక్కపెట్టడం బ్రహ్మదేవుడికి కూడ సాధ్యం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1332

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, September 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౧(641)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1330-వ.
అని మఱియు నిట్లను; “వారలు ప్రద్యు మ్నానిరుద్ధ, దీప్తిమ ద్భాను, సాంబ, మిత్ర, బృహద్భాను, మిత్రవింద, వృ కారుణ, పుష్కర, దేవబాహు, శ్రుతదేవ, సునందన, చిత్రబాహు, వరూధ, కవి, న్యగ్రోధ, నామంబులం బ్రసిద్ధు లైరి; వెండియుఁ ద్రివక్ర యందు సంభవించిన యుపశ్లోకుం డనువాఁడు దన జనకుండైన కృష్ణు పాదారవింద సేవారతుండగుచు నారదయోగీంద్రునకు శిష్యుండై యఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, స్త్రీ శూద్ర దాసజన సంస్కారకంబై స్మరణమాత్రంబున ముక్తిసంభవించునట్టి సాత్త్వత తంత్రం బను వైష్ణవస్మృతిం గల్పించె; నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్పవీర్యవంతులును, బ్రహ్మణ్యులునై విఖ్యాతింబొందిరి; వారిని లెక్క వెట్టఁ బదివేల వత్సరంబులకైనం దీఱదు, మున్ను నీకెఱింగించి నట్లు తత్కుమారులకు విద్యావిశేషంబుల నియమించు గురు జనంబులు మూఁడుకోట్లునెనుబదెనిమిదివేలనూర్గు రనం గల్గి యుందు; రక్కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను"మని యిట్లనియె.

భావము:
అని శుకుడు పరీక్షుత్తుతో మళ్ళీ ఇలా అన్నాడు. “రుక్మిణి మున్నగు ఆ అష్టపట్టమహిషలకు కలిగిన పుత్రులలో ప్రసిద్ధులైనవారు పద్దెనిమిది మంది, వారు 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు అనేవారు. త్రివక్ర అనే ఆమెకి కృష్ణుని వలన పుట్టిన ఉపశ్లోకు డనేవాడు శ్రీకృష్ణభక్తుడై నారదునికి శిష్యుడై సాత్వతతంత్రం అనే వైష్ణవ స్మృతిగ్రంథాన్ని రచించాడు. స్త్రీలకూ శూద్రులకూ దాసజనానికి ఈ గ్రంథం పఠన మాత్రం చేతనే ముక్తిమార్గాన్ని అందిస్తుంది. ఈ విధంగా కృష్ణుడి పుత్రులు అసంఖ్యాకులై ఆయురార్యోగ్యాలతో, మహాబలంతో, బ్రహ్మణ్యులై, మహోన్నతులై ప్రకాశించారు. వారందరినీ లెక్కపెట్టడానికి పదివేలసంవత్సరాలైనా చాలవు. వారి కోసం నియమించబడిన గురువులే మూడుకోట్లఎనభైఎనిమిదివేలనూరుమంది ఉన్నారు ఇక శ్రీకృష్ణుని సంతతి లెక్కించడం ఎవరికి మాత్రం సాధ్యము అవుతుంది. అంతే కాదు మరొక మరొక విశేషం ఉంది చెప్తాను.” అని శుకుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1330

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౦(640)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1328-ఉ.
"వారక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థధర్మ మే
పారఁగ బూని ధర్మమును నర్థముఁ గామము నందుఁ జూపుచుం
గోరికమీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం
సారిగతిన్ మెలంగె నృపసత్తమ! లోకవిడంబనార్థమై.
10.2-1329-సీ.
హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తర-
  షోడశసాహస్ర సుందరులను
మును నీకు నెఱుఁగఁ జెప్పినరీతి నందఱ-
  కన్నిరూపములు దా నర్థిఁ దాల్చి
కైకొని యొక్కక్క కామినీమణి యందు-
  రమణ నమోఘ వీర్యమునఁ జేసి
పదురేసి కొడుకులం బడసె రుక్మిణ్యాది-
  పట్టమహిషులకుద్భవులు నైన
10.2-1329.1-తే.
నందనులలోన ధరణి నెన్నంగ బాహు
బల పరాక్రమ విజయ సంపద్విశేష
మాని తాత్ములు పదునెనమండ్రు; వారి
నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర! "

భావము:
“రాజోత్తమా! పరీక్షిత్తూ! ఈ విధంగా వేదోక్తమైన పద్ధతిలో గృహస్థధర్మాన్ని స్వీకరించి, ధర్మార్ధ కామాదులను సాధిస్తూ, ఉత్తములకు తానే దిక్కు అయి ఉంటూ, లోకం తనను అనుసరించి ఇలా నడవాలి అని తెలుసుకునేలా, తానూ ఒక సంసారిలా శ్రీకృష్ణుడు నటించాడు. పరీక్షిత్తు మహారాజా! ఈ విధంగా పదహారువేల సుందరీమణులకు అందరకూ అన్నిరూపాలు ధరించి గృహస్థుడై శ్రీకృష్ణుడు ఏలుకున్నాడు. అమోఘ వీర్యుడైన ఆ మహానుభావుడికి, వారిలో ఒక్కొక్కరి యందు పదిమంది చొప్పున పుత్రులు పుట్టారు. రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన పుత్రులలో పదునెనిమిదిమంది భుజబల, పరాక్రమ, వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. వారి పేర్లను చెప్తాను. శ్రద్ధగా విను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1329

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౯(639)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1324-మ.
అరవిందాక్ష పదాంబుజాత యుగళధ్యానానురాగక్రియా
సరసాలాప విలోకనానుగత చంచత్సౌఖ్య కేళీరతిం
దరుణుల్ నూఱుపదాఱువేలు మహితోత్సాహంబునం జొక్కి త
త్పరలై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మ లై భూవరా!
10.2-1325-వ.
అదియునుం గాక.
10.2-1326-మ.
హరినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్
విరతిం బొందఁగఁజాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచుం
బరిరంభించుచు, నంటుచున్నగుచుసంభాషించుచున్నుండు సుం
దరు లానంద నిమగ్ను లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా! "

భావము:
ఓ రాజా! ఆ పదహారువేలవంద మంది శ్రీకృష్ణసతులు పద్మాక్షుని పాదారవిందాలపై అనురాగాలతో, సరససల్లాపాలుతో, మధుర వీక్షణలతో, మహా సౌఖ్యాలతో, కేళీరతులతో గొప్ప ఉత్సాహాలతో సొక్కి సోలుతూ ఉన్నారు. సంపూర్ణంగా శ్రీకృష్ణ తత్పరులై ఇతర ధ్యాసలు లేకుండా ఉన్నారు. అంతేకాకుండా మహారాజ! ఎంతటి మూఢాత్ములైనా హరినామ సంకీర్తనం ఒక్కసారి వింటేనే ముక్తిని పొందుతారుట. అలాంటిది ఆ మహానీయుడినే చూస్తూ; అతడిని కౌగలిస్తూ, తాకుతూ; అతనితో నవ్వుతూ, సంభాషిస్తూ; ఆ అంగనలు ఆనందపారవశ్యులు కావడంలో ఆశ్చర్యం ఏముంది?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1326

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౮(638)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1323-వ.
అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునఁ బూజ్యం బగు రాజ్యంబు సేయుచుఁ బురందరవిభవంబున నిరవొంది కనక మణిమయ విమాన, మండప, గోపుర, ప్రాసాద, సౌధ, చంద్రశాలాంగణాది వివిధ భవనంబు లందును రంగదుత్తుంగతరంగ డోలావిలోల కలహంస, చక్రవాక, కారండవ, సారస, క్రౌంచముఖ జలొవిహంగ విలసదుచ్చలిత గరు దనిల దరదమల కమల, కుముద, కహ్లార సందోహ నిష్యంద మకరందరసపాన మదవదిందిందిరకుల కల గాయక ఝంకార నినదంబులును, నిరంతర వసంతసమయ సముచిత పల్లవిత, కోరకిత బాలరసాలజాల లాలిత కిసలయ విసర ఖాదన జాత కుతూహలాయమాన కషాయకంఠ కలకంఠ కలరవ మృదంగ ఘోషంబులును, నిశిత నిజచంచూపుట నిర్దళిత సకలజన నయనానంద సుందరనందిత మాకంద పరిపక్వ ఫలరంధ్ర విగళిత మధుర రసాస్వాదనముదిత రాజకీర శారికా నికర మృదు మధురవచన రచనావశకృత్యంబులును నమరఁ, బురపురంధ్రీజన పీన పయోధర మండల విలిప్త లలిత కుంకుమ పంక సంకుల సౌగంధ్యానుబంధ బంధురగంధానుమోదితుండును, జందనాచల సానుదేశసంజాత మంజుల మాధవీలతానికుంజ మంజుల కింజల్క రంజిత నివాస విసర విహరమాణ శబరికా కబరికా పరిపూర్ణ సురభి కుసుమమాలికా పరిమళ వహుండును, గళిందకన్యకా కల్లోల సందోహ పరిస్పంద కందళిత మందగమనుండును నగు మందానిల విదూషకునిచేఁ బోషితాభ్యాసిత లాలిత లగు నేలాలతా వితాన నటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర భాసురోద్యానంబులందును, జారు ఘనసార పటీర బాలరసాల సాల నీప తాపింఛ జంబూ జంబీర నింబ కదంబప్రముఖ ముఖ్య శాఖి శాఖాకీర్ణ శీతలచ్ఛాయా విరచిత విమల చంద్రకాంతోపల వేదికాస్థలంబులందును, నుదంచిత పింఛవిభాసిత బాలనీలకంఠ కేకార వాకులీకృత కృతక మహీధరంబు లందును, లలితమణి వాలుకానేక పులినతలంబు లందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచిత దారు యంత్ర నిబద్ధ కలశ నిర్యత్పయో ధారాశీకర పరంపరా సంపాదిత నిరంతర హేమంత సమయ ప్రదేశంబులందును, నిందిరారమణుండు షోడశ సహస్ర వధూయుక్తుండై యందఱ కన్ని రూపులై లలితసౌదామినీలతా సమేత నీలనీరదంబుల విడంబించుచుఁ గరేణుకాకలిత దిగ్గజంబు నోజ రాజిల్లుచు, సలిలకేళీవిహారంబులు మొదలుగా ననేక లీలా వినోదంబులు సలుపుచు, నంతఃపురంబునఁ గొలువున్న యవసరంబున వివిధ వేణువీణాది వాద్యవినోదంబులను, మంజుల గానంబులను, గవి గాయక సూత వంది మాగధజన సంకీర్తనంబులను, నటనటీజన నాట్యంబులను, విదూషక పరిహాసోక్తులను సరససల్లాప మృదుమధుర భాషణంబులను బ్రొద్దుపుచ్చుచు నానందరసాబ్ధి నోలలాడు చుండె; నంత.

భావము:
అలా శ్రీకృష్ణుడు దేవేంద్రవైభవంతో సగౌరవంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ద్వారకానగరంలో చాలా కాలం ఉన్నాడు. ఆ నగరంలో రత్నాలు పొదిగిన బంగారు మయమైన విమానాలు, మండపాలు, గోపురాలు, ప్రాసాదాలు, డాబాలు, సౌధాలు, రాజభవనాలు ముంగిళ్ళు ఉన్నాయి. అక్కడి సరోవరాలలో ఉత్తుంగ తరంగాలలో ఊయలలూగే కలహంసలు, కారండాలు, చక్రవాకాలు, బెగ్గురులు, క్రౌంచాలు మున్నగు నీటి పక్షులు విహరిస్తున్నాయి. తెల్ల తామరలు, తెల్ల కలువలు, ఎఱ్ఱ కలువలు యందు స్రవిస్తున్న మకరందాన్ని త్రాగి మత్తిల్లిన తుమ్మెదల ఝంకార గానాలు మారుమోగుతున్నాయి. ఎడతెగని వసంత ఋతువు విరాజిల్లుతున్నట్లు సదా చిగురించి, మొగ్గలు తొడిగిన లేత మామిడి పల్లవాలను తిని కుతూహలంతో వగరెక్కిన గొంతులతో కూసే కోయిలల కమ్మని కూజితాలు వినిపిస్తున్నాయి. అందరూ ఇష్టపడె సుందరమైన తియ్య మామిడిపళ్ళ రసాన్ని త్రాగి ఆనందంతో పలికే చిలుకల గోరువంకల తియ్యని పలుకులు వీనుల విందుచేస్తున్నాయి. మెత్తని పలుకులతో అలరించే అప్సరసల బలిష్ఠమైన స్తనములపై పూయబడిన కుంకుమాది సుగంధ ద్రవ్యాల సువాసనలు మనోఙ్ఞంగా వస్తున్నాయి. మలయ పర్వత సానువుల్లో సంచరించే శంబర స్త్రీల కొప్పులలోని పూలమాలలు సురభి పరిమళాలుతో కూడిన మందమారుతాలు వీస్తున్నాయి. ఏలకి ఆది లతలు మనోహరంగా పోషింపబడుతున్నాయి. సరస్సు తీర ప్రాంతాలు, ఉద్యానవనాలు యందు విదూషకుల, నాట్యకత్తెల ఆటపాటలుతో మనోఙ్ఞంగా ఉన్నాయి. కర్పూరము, చందనము, లేత మామిడి, మద్ది, నీప, చీకటి మాను, నేరేడు, నిమ్మ, వేప, కడిమి మున్నగు అందమైన చెట్ల నీడలలో చంద్రకాంత శిలా వేదికలు మీద పింఛాలు ఎత్తి నెమళ్ళు నాట్యాలు చేస్తున్నాయి. కృత్రిమ కొండలు, ఇసుక తిన్నెలు వద్ద వేసిన వట్టివేళ్ళ పందిరులు అలరిస్తున్నాయి. నీళ్ళుతోడే కొయ్య యంత్రాలకు కట్టిన కుండల నుండి జలజల మంటూ నీళ్ళు జాలువారుతున్నాయి. అట్టి దివ్యశోభాన్వితమైన ద్వారకలో, నిరంతరం హేమంతమే అనిపించే ప్రదేశాలలో శ్రీకృష్ణుడు తన పదహారువేలనూరు మంది మానినీమణులతో కలగలిసి అందరికి అన్ని రూపుల వాడు అయి, మెరుపు తీగల నడుమ నీలిమేఘంలా మెరుస్తున్నాడు. ఆడ ఏనుగులతో విహరించే దిగ్గజమును పోలి జలక్రీడాది అనేక క్రీడలతో విహరిస్తున్నాడు. మురళి, వీణ మున్నగు రక రకాల వాయిద్య వినోదాలతో అంతఃపురంలో కొలువుతీరి మంజుల గానాలు ఆస్వాదిస్తున్నాడు. కవి, గాయక, సూత, వంది, మాగధాదుల స్తోత్రాలకు పరవశాలు పొందుతున్నాడు. నటనటీజనుల నాట్యాలతో, విదూషకుల సరస పరిహాస పలుకులు, మృదు మధురోక్తులతో పొద్దుపుచ్చుతూ ద్వారకలో ఆనందంగా ఉన్నాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1323

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౭(637)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1321-మ.
హరి, సర్వేశుఁ, డనంతుఁ, డాద్యుఁ, డభవుం, డామ్నాయసంవేది, భూ
సుర ముఖ్యప్రజలన్ సమస్త ధనవస్తుశ్రేణి నొప్పారఁగాఁ
బరిరక్షించుచు ధర్మమున్ నిలుపుచుం బాపాత్ములం ద్రుంచుచుం
బర మోత్సాహ మెలర్ప భూరిశుభ విభ్రాజిష్ణుఁడై ద్వారకన్.
10.2-1322-క.
జనవినుతముగాఁ బెక్కు స
వనములు దనుఁ దాన కూర్చి వైదిక యుక్తిం
బొనరించుచు ననురాగము
మనమునఁ దళుకొత్త దైత్యమర్దనుఁ డెలమిన్.

భావము:
అనంతుడు, వేదవేద్యుడు, సర్వేశ్వరుడు, ఆద్యుడు, అభవుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసాడు. వారిని సంరక్షిస్తూ ధర్మాన్ని సంస్థాపిస్తు పాపాత్ములను సంహరిస్తు, ద్వారకలో గొప్ప శుభసంతోషాలతో ప్రకాశించాడు. సంతోషచిత్తుడై ప్రజలు మెచ్చేలాగ అనేక యజ్ఞ యాగాలను శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా తనను ఉద్దేశించి తనే పరమోత్సాహంతో జరిపించాడు,

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1322

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౬(636)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1318-చ.
అనిమిషనాథనంద,నుఁ డహర్పతితేజుఁడు గృష్ణుతోడఁ దాఁ
జని యచటం గనుంగొనిన సర్వశరణ్యునిఁ, బుండరీకనే
త్రుని, నిజధామ వైభవసదున్నత తన్మహనీయ కీర్తికిన్
మనమున మోదమంది పలుమాఱును సన్నుతిఁ జేసె భూవరా!
10.2-1319-తే.
వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ
గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము
వినుతి సేయుచుఁ దత్పాదవనజములకు
వందనము లాచరించి యానంద మొందె.

భావము:
ఓ మహారాజా పరీక్షిత్తు! ఇంద్రతనయుడు సూర్యసమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి తను దర్శించిన ఆ లోకశరణ్యుడు విష్ణుమూర్తి సౌధవైభవం; ఆయన మహనీయ సమున్నత యశస్సునకు మనస్సులో ఆనందించి పెక్కుమార్లు స్తుతించాడు. పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1319

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౫(635)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1316-క.
అని "యా డింభకులను దో
కొని పొం" డని యిచ్చి వీడుకొలిపిన వారల్‌
వినతు లయి పెక్కు విధముల
వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్.
10.2-1317-వ.
తోడ్కొని సంప్రాప్త మనోరథు లయి య బ్బాలకులఁ ద త్తద్వయో రూపంబులతోడఁ దెచ్చి యాబ్రాహ్మణునకు సమర్పించిన నతండు సంతుష్టాంతరంగుం డయ్యె; న య్యవసరంబున.

భావము:
అని పిమ్మట “ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి” అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు. కోరిన పని సాధించి సఫల మనోరథులు అయిన కృష్ణార్జునులు వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఉన్న ఆ విప్రసుతులను వెంటబెట్టుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పజెప్పారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రుడు ఎంతో ఆనందం పొందాడు. అంతట....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1317

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౩౪(634)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1314-క.
"ధరణికి వ్రేఁ గగు దైత్యులఁ
బొరిబొరి వధియించి ధర్మమున్ నిలుపుటకై
ధర జనియించితి రిరువురు
నరనారాయణు లనంగ నా యంశమునన్.
10.2-1315-క.
ఆరూఢ నియతితోఁ బెం
పారిన మిము నిమ్మునీంద్రు లర్థిం జూడం
గోరిన మీ వచ్చుటకై
ధారుణిసురసుతుల నిటకుఁ దగఁ దేవలసెన్. "

భావము:
“భూమికి భారమైపోయిన రాక్షసులను వధించి, ధర్మాన్ని రక్షించడం కోసం నా అంశతో మీరిద్దరు నరనారాయణులుగా జన్మించారు. మహానిష్ఠతో ఉన్నతులైన మిమ్మల్ని ఈ మనీశ్వరులు చూడాలని కోరారు. అందుకని, మీరిక్కడకు రావాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని కుమారులను ఇక్కడకు తెప్పించవలసివచ్చింది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1314

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౩(633)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1313-వ.
మఱియు సునందాది పరిజన సంతత సేవితు, నానందకందళిత హృదయారవిందు, నరవిందవాసినీ వసుంధరాసుందరీ సమేతు, నారదయోగీంద్రసంకీర్తనానందితు, నవ్యయు, ననఘు, ననంతు, నప్రమేయు, నజితు, నవికారు, నాదిమాధ్యాంతరహితు, భవలయాతీతుఁ, గరుణాసుధాసముద్రు, నచ్యుతు, మహానుభావుఁ, బరమపురుషుఁ, బురుషోత్తము, నిఖిలజగదుత్పత్తి స్థితిలయ కారణుఁ, జిదచిదీశ్వరు, నష్టభుజుఁ, గౌస్తుభశ్రీవత్సవక్షు, శంఖచక్ర గదా పద్మ శార్ఙ్గాది దివ్యసాధను, సర్వ శక్తి సేవితుఁ, బరమేష్ఠి జనకు, నారాయణుం గనుంగొని దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచి భక్తి పూర్వకంబుగా నభినందించిన, నయ్యాది దేవుండును వారలం గరుణావలోకనంబులు నిగుడ నవలోకించి, దరహాసపూరంబు దోరంబుగా సాదరంబుగ నిట్లనియె.

భావము:
అంతేకాదు, సదా సునందాది పరిజనులచే సేవించబడువాడు, నిత్యానంద కందళిత హృదయుడు, శ్రీదేవి భూదేవి సమేతుడు, నారదయోగీంద్ర గానలోలుడు, కరుణాసముద్రుడు, అవ్యయుడు, అనఘుడు, అనంతుడు, అప్రమేయుడు, అజితుడు, అవికారుడు, పరమ పురుషుడు, పురుషోత్తముడు, సకల లోకాల సృష్టి స్థితి లయ కారకుడు, చిత్తు అచిత్తులకు ఈశ్వరుడు, అష్టభుజుడు, వక్షమున కౌస్తుభమణి అలంకృతుడు, శంఖచక్రగదాశార్ఙ్గాది దివ్యాయుధ సంపన్నుడు, సర్వశక్తి సేవితుడు, బ్రహ్మదేవుని జనకుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, చేతులు జోడించి స్తుతించారు. ఆ ఆదినారాయణుడు వారిని దయాదృష్టితో చూసి, మందహాసం చేసి, సాదరంగా ఇలా అన్నాడు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1313

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౨(632)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1312-సీ.
సజల నీలాంబుద శ్యామాయమానాంగు,-
  నాశ్రితావన ముదితాంతరంగు,
సనకాది యోగిహృద్వనజ మదాళీంద్రు,-
  ముఖపద్మ రుచిజిత పూర్ణచంద్రుఁ,
గమనీయ నిఖిలజగద్ధితచారిత్రుఁ,-
  బ్రత్యూషసంఫుల్లపద్మనేత్రు,
నిందిరాహృదయారవిందారుణోల్లాసు,-
  శ్రీకర పీత కౌశేయవాసు,
10.2-1312.1-తే.
హార కుండల కటక కేయూర మకుట
కంక ణాంగద మణిముద్రికా వినూత్న
రత్ననూపుర కాంచీ విరాజమాను,
భవమహార్ణవశోషు, సద్భక్తపోషు.

భావము:
నీలమేఘశ్యాముడు, ఆశ్రితజనరక్షకుడు, పద్మాలలో తుమ్మెదలాగ సనకాది మునీంద్రుల హృదయపద్మాలలో నివసించేవాడు, పూర్ణ చంద్రుని మించిన ముఖకాంతి కలవాడు, విశ్వవిఖ్యాత చారిత్రుడు, ప్రాతఃకాలంలో వికసించిన పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీమనోహరుడు, శ్రీకరుడు, పీతాంబరధరుడు, హారాలు కేయూరాలు కటక కంకణాలు కిరీటాలతో భూషణుడు, భవసాగర శోషణుడు, భక్తజన సంపోషణుడు అయిన మహావిష్ణువును వారు చూసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1312

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౧(631)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1310-సీ.
సాంద్రశరచ్చంద్ర చంద్రికా కర్పూర-
  నీహార హారాభ దేహ మమర
నిందింది రేందీవ రేంద్ర నీలద్యుతిఁ-
  గర మొప్పు మేచక కంఠసమితి
యరుణాంశుబింబ భాసుర పద్మరాగ వి-
  స్యస్త సహస్రోరు మస్తకములు
వివృతాననోద్గత విషధూమరేఖల-
  లీలఁ జూపట్టిన నాలుకలును
10.2-1310.1-తే.
గలిత సాయంతనజ్వలజ్జ్వలన కుండ
ముల విడంబించు వేఁడి చూపులును గలిగి
భూరి కలధౌత గిరినిభాకార మమరఁ
బరఁగు భోగీంద్రభోగతల్పంబు నందు.
10.2-1311-వ.
సుఖాసీనుండై యున్నవాని డాయంజని యప్పుడు.

భావము:
అటువంటి ఆ దివ్యభవనంలో దట్టమైన శరత్కాలపు పండువెన్నెల, కర్పూరం, మంచులకు సాటివచ్చే తెల్లనిదేహము; తుమ్మెదల్లాగా నల్లకలువల్లాగా ఇంద్రనీలమణులలాంటి నల్లని కంఠాలు; ఉదయకాలం సూర్యుడిలాగా ప్రకాశించే పద్మరాగమణులతో కూడిన పడగలు; తెరచుకున్న నోళ్ళ నుంచి వెలువడే విషపు పొగలలా ఉన్న నాలుకలు; యాగగుండాలలోని జ్వాలలాగ ప్రకాశించే వేడిచూపులు; వెండికొండలాగా ఉన్న భారీ ఆకారము కలిగిన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుని పాన్పుగా కొని సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తి దగ్గరకు శ్రీకృష్ణార్జునులు వెళ్ళి దర్శించారు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1310

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౩౦(630)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1308-తే.
కడఁగి దుర్వార మారుతోత్కట విధూత
చటుల సర్వంకషోర్మి భీషణ గభీర
వారిపూరంబు సొచ్చి తన్నీరమధ్య
భాగమునఁ గోటిసూర్యప్రభలు వెలుంగ.
10.2-1309-వ.
అది మఱియును జారు దివ్యమణి సహస్రస్తంభాభిరామంబును, నాలంబిత కమనీయ నూత్న రత్నమాలికాలంకృతంబును, భాను శశి మయూఖాగమ్యంబును, ననంత తేజోవిరాజితంబును, బునరావృత్తిరహిత మార్గంబును, నిత్యైశ్వర్య దాయకంబును, నవ్యయంబును, నత్యున్నతంబును, ననూనవిభవంబును, బరమయోగీంద్ర గమ్యంబును, బరమభాగవత నివాసంబునునై యొప్పు దివ్యధామంబు నందు.

భావము:
పిమ్మట, పూని మహావేగంగా వీచే గాలులతో, చెలరేగే కెరటాలతో గంభీరంగా ఉన్న జలరాశిని కృష్ణార్జునులు ప్రవేశించారు. ఆ నీటి నడిమిభాగంలో కోటిసూర్యుల కాంతులు ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఆ జలరాశిమధ్యలో ఒక దివ్యభవనం కనబడింది. దానిలో తేజోమయమైన వేలకొలది మనోహరమైన మణిస్తంభాలు ఉన్నాయి రమణీయ రత్నహారాలు అలంకృతమై వ్రేలాడుతున్నాయి. అది అనంత తేజస్సుతో విరాజిల్లుతోంది. సూర్యచంద్ర కిరణాలకు ప్రవేశింపరానిది, జన్మరాహిత్యానికి మార్గము, నిత్యైశ్వర్యదాయకము, అవ్యయము, మహోన్నతము, సాటిలేని వైభవోపేతము, పరమ యోగీంద్రులకు ప్రవేశయోగ్యము, భాగవతోత్తములకు నివాసస్థానము అయి విరాజిల్లుతోంది. ఆయొక్క మహాసౌధంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1309

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౯(629)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1306-చ.
మసలక భూరిసంతమస మండలముం దఱియంగఁ జొచ్చి సా
హసమునఁ బోవఁబోవఁగ భయంకరమై మది గోచరింపమిన్
వసమఱి మోఁకరిల్లి రథవాజులు మార్గము దప్పి నిల్చినన్
బిసరుహపత్త్రలోచనుఁ డభేద్యతమఃపటలంబు వాపఁగన్.
10.2-1307-సీ.
బాలభానుప్రభా భాసమానద్యుతిఁ-
  గరమొప్ప నిజ రథాంగంబుఁ బనుప
నమ్మహాస్త్రం బేగి చిమ్మచీఁకటి నెల్ల-
  నఱిముఱి నందంద నఱికి వైచి
యగ్రభాగంబున నతులిత గతి నేగ-
  నా మార్గమున నిజస్యందనంబు
గడువడిఁదోలి యా కడిఁదితమోభూమిఁ-
  గడవ ముందఱకడఁ గానరాక
10.2-1307.1-తే.
మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు గొనఁగఁ
జదల వెలుఁగొందు దివ్యతేజంబుఁ జూచి
మొనసి గాండీవి కన్నులు మూసికొనుచు
నాత్మ భయమంది కొంతద వ్వరిగి యరిగి.

భావము:
శ్రీకృష్ణార్జునులు దట్టమైన చీకటిమండలాన్ని ప్రవేశించారు. వారు సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటే, చీకటి మరింత భయంకరంగా తయారైంది. కళ్ళకేదీ కనిపించ లేదు. గుఱ్ఱాలు శక్తి కోల్పోయి దారితప్పి నిలబడిపోయాయి. శ్రీకృష్ణుడు భేదించరాని ఆ చీకట్లను రూపుమాపడం కోసం బాలసూర్యుడి కాంతికి సాటివచ్చే కాంతితో వెలిగే తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మచీకటిని తొలగిస్తూ పైనుండి ముందుకు దూసుకుని పోసాగింది. కృష్ణార్జునులు చక్రాయుధం వెళ్ళే మార్గం వెంట అమితివేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అప్పుడు వారి ముందు కన్నులు మిరుమిట్లు కొలిపే దివ్యతేజస్సు కనిపించింది. అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతని ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1307

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౨౮(628)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1304-ఉ.
సుందరదివ్యరత్నరుచి శోభితమై తనరారు కాంచన
స్యందన మంబుజాప్తుఁ డుదయాచల మెక్కు విధంబు దోఁపఁ బౌ
రందరి దాను నెక్కి తను రశ్ములు దిగ్వితతిన్ వెలుంగ గో
విందుఁ డుదారలీలఁ జనె విప్రతనూజ గవేషణార్థియై.
10.2-1305-చ.
చని పుర గోష్ఠ దుర్గ వన జానపదాచల పక్కణప్రభూ
త నద నదీ సరోవర యుతక్షితి నంతయు దాఁటి సప్త వా
రినిధుల దీవులం గులగిరిప్రకరంబుల నుత్తరించి మే
రునగము నాక్రమించుచు మరుద్గతితో రథ మేగ నత్తఱిన్.

భావము:
సూర్యుడు ఉదయపర్వతాన్నిఎక్కినట్లు, అందమైన దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అధిరోహించాడు. తన దేహకాంతులు దిక్కుల ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు విప్రబాలురను వెదకటానికి బయలుదేరాడు. పట్టణాలతో పల్లెలతో దుర్గాలతో అరణ్యాలతో పర్వతాలతో నదీనదాలతో సరోవరాలతో నిండిన భూమండలం, సప్తసముద్రాలు, మహాదీవులు, కులపర్వతాలు, మేరుపర్వతం దాటి శ్రీకృష్ణుడి రథం మహావేగంతో ముందుకు సాగిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1304

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౭(627)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1302-చ.
నర సుర యక్ష కింపురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖే
చర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందు రోసి భూ
సురసుత లేగినట్టి గతి సొప్పడకుండుటఁ జూచి క్రమ్మఱన్
ధరణికి నేగుదెంచి బెడిదంబుగ నగ్ని సొరంగఁ బూనినన్.
10.2-1303-వ.
అవ్విధంబంతయు నెఱింగి యమ్మురాంతకుండు “విప్రనందనుల నీకుం జూపెద” నని యనలంబు సొరకుండ నతని నివారించి యప్పుడు.

భావము:
దేవ, యక్ష, కింపురుష, నాగ, రాక్షస, సిద్ధ, సాధ్య, ఖేచరాదుల ఇళ్ళకు వెళ్ళి బ్రాహ్మణపుత్రుల కోసం వెదికాడు. కాని వారి జాడ అక్కడ కూడా దొరకలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయటానికి పట్టుదలగా సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని “బ్రాహ్మణ కుమారులను నేను నీకు చూపిస్తాను.” అని చెప్పి అర్జునుడిని మంటల్లో దూకకుండా వారించాడు. పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1302

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౨౬(626)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1299-క.
అని తను నోడక నిందిం
చిన విని యయ్యర్జునుండు చిడిముడిపడుచుం
దన విద్యమహిమ పెంపునఁ
జనియెన్ వెస దండపాణి సదనంబునకున్.
10.2-1300-క.
చని యందు ధారుణీసుర
తనయులు లేకుంటఁ దెలిసి తడయక యింద్రా
గ్ని నిరృతి వరుణ సమీరణ
ధనదేశానాలయములు దగఁ బరికించెన్.
10.2-1301-వ.
వెండియు.

భావము:
ఈలాగున బ్రాహ్మణుడు తనను నిందిస్తుంటే, కోపిం వచ్చిన అర్జునుడు తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణపుత్రులు లేకపోడంతో పార్థుడు వెంటనే ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల నివాసాలకు వెళ్ళి అన్వేషించాడు. అనంతరం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1300

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౫(625)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1297-వ.
అవధరింపుము దేవా! యర్జునుం డనెడి పౌరుషవిహీనుం డాడిన వృథాజల్పంబులు నమ్మి పుత్త్రుం గోలువడి బేలనైన నన్ను నే మందు? నిఖిల విశ్వోత్పత్తి స్థితి లయంబులకుఁ బ్రధాన హేతుభూతుండవయిన నీవు సమర్థుండవయ్యు, వారింపంజాలక చూచుచుండ, నొక్క మనుష్యమాత్రుండు దీర్పంజాలెడువాఁడు గలఁడె?” యని వెండియు.
10.2-1298-క.
"ఎక్కడి పాండుతనూభవుఁ?
డెక్కడి విలుకాఁడు? వీని కెక్కడి సత్త్వం?
బెక్కడి గాండీవము? దన
కెక్కడి దివ్యాస్త్ర సమితి? యే మనవచ్చున్? "

భావము:
మహాత్మా! నా విన్నపాన్నిఆలకించు. పౌరుషహీనుడైన పార్థుని డాంబిక వచనాలను నమ్మి అమాయకుడిని అయి కొడుకును పోగొట్టుకున్న నన్ను నేను ఏమని నిందించుకోవాలి. సమస్త జగత్తు సృష్టి స్థితి లయాలకు మూలకారకుడవు అయిన నీవు సమర్ధుడివే అయినా వారించలేక ఊరకున్నావు. మానవమాత్రుడు ఇంతటి మహాకార్యం ఎక్కడ నెరవేర్చగలడు?” అని ఇంకా ఇలా అన్నాడు. “ఈ పాండుతనయుడు ఒక విలుకాడట; ఇతగాడి మాటలు యదార్థ మట; ఇదొక గాండీవ మట; ఇతగాడికి దివ్యాస్త్రాలంటూ ఉన్నాయిట; ఏ మనగలం.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1298

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౪(624)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1295-వ.
అప్పుడు సని.
10.2-1296-క.
ముందట నిల్చి "ముకుంద! స
నందనమునివినుత! నందనందన! పరమా
నంద! శరదిందు చందన
కుంద యశస్సాంద్ర! కృష్ణ! గోవింద! హరీ!

భావము:
అలా వెళ్ళిన విప్రోత్తముడు శ్రీకృష్ణుడి సమక్షంలో నిలబడి. “ముకుందా! నందనందనా! సనందాది ముని వందితా! పరమానంద! శ్రీకృష్ణా! గోవిందా! హరీ! శరశ్చంద్రుని వెన్నెల వంటి గొప్ప సత్కీర్తి కలవాడా!

విశేషాంశం:
ఒకటి, అంతకన్నా ఎక్కువ హల్లులు పెక్కుమార్లు ఆవృత్తి చేయుట వృత్యనుప్రాస. అనగా ఒకే హల్లు అనేకసార్లు తిరిగితిరిగి వస్తే అది వృత్యనుప్రాస. ఇక్కడ విప్రుడు శ్రీకృష్ణుని స్తుతించు సందర్భంలో కంద పద్యంలో "పూర్ణానుస్వార పూర్వక ద" పది పర్యాయాలు వాడుతూ నింద చేయబోతున్నాడు అని సూచిస్తున్నాడా అన్నట్లు వృత్యనుప్రాస మన పోతన అలంకరించాడు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1296

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౩(623)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1294-సీ.
భూసురు వెంట నిమ్ముల నేగి సూతికా-
  భవనంబు చుట్టును బాణవితతి
నరికట్టి దిక్కులు నాకాశపథము ధ-
  రాతలం బెల్ల నీరంధ్రముగను
శరపంజరముఁ గట్టి శౌర్యంబు దీపింపఁ-
  గడు నప్రమత్తుఁ డై కాచియున్న
యెడ న మ్మహీసురు నింతికిఁ బుత్త్రుండు-
  జనియించె; నప్పు డచ్చటి జనంబు
10.2-1294.1-తే.
పోయెఁ బోయెఁ గదే యని బొబ్బ లిడఁగ
బొంది తోడన యాకాశమునకు మాయఁ
జెందె నప్పుడు; దుఃఖంబు నొంది, భూమి
సురుఁడు విలపించుచును మురహరుని కడకు.

భావము:
బ్రాహ్మణుడి కూడా వెళ్ళి ఆ ప్రసవమందిరం చుట్టూ దట్టమైన బాణాలతో కప్పివేశాడు. మిక్కిలి జాగరూకతతో ప్రసూతిగృహానికి కావలి కాస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణుని భార్యకు మగ పిల్లాడు పుట్టి వెంటనే చనిపోయాడు. అక్కడి జనం ఆర్తనాదాలు చేశారు. మరణించిన పిల్లాడు శరీరంతోసహా ఆకాశంలోనికి అదృశ్యం అయ్యాడు. బ్రాహ్మణుడు విలపిస్తూ మురాసురుడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1294

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౨(622)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1292-చ.
లలిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు సేసి, సు
స్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మ్రొక్కి మహాస్త్రవేది ని
ర్మల శుభమంత్ర దేవతల మానసమందుఁ దలంచి గాండివం
బలవడ నెక్కు ద్రోచి బిగియం గదియించి నిషంగయుగ్మమున్.
10.2-1293-వ.
ఇవ్విధంబునఁ గట్టాయితంబై యప్పుడు.

భావము:
విశిష్టమైన పవిత్రజలాలతో ఆచమనం చేసాడు. పరిశుద్ధ ప్రదేశంలో నిలబడి శివుడికి నమస్కరించాడు. గొప్పగొప్ప అస్త్రాలను వేయగలిగిన అర్జునుడు శుభప్రదులైన మంత్రదేవతలను మనసున తలచుకుని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెంటినీ కట్టుకున్నాడు. ఈ విధంగా సంసిద్ధుడు అయిన అర్జునుడు అంతట....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1292

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౧(621)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1291-వ.
అని నమ్మంబలికిన యర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబున నూఱడిల్లి యతని నభినందించుచు నిజ మందిరంబునకు జని; కొన్ని దినంబు లుండునంత భార్యకుం బ్రసూతివేదనా సమయంబయినం జనుదెంచి వివ్వచ్చుం గని తద్విధం బెఱింగించిన నయ్యింద్రనందనుం డప్పుడు.

భావము:
ఇలా నమ్మకంగా పలికిన పార్థుడి మాటలపై బ్రాహ్మణుడి మనసు శాంతించింది. అతడు నరుని కొనియాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిదినాలు గడిచాయి. విప్రుడి భార్యకు మళ్ళీ ప్రసవవించే సమయం సమీపించింది. భూసురుడు వెంటనే వచ్చి పరమ భీభత్సంగా యుద్ధంచేసే వాడైన అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. ఆ ఇంద్రపుత్రుడు అంతట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1291

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౦(620)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1288-మ.
"బలుఁడంగాను; మురాసురాంతకుఁడఁగాఁ; బ్రద్యుమ్నుఁడంగాను; నేఁ
దెలియం దత్తనయుండఁగా"నని "విరోధివ్రాతమున్ భీషణో
జ్జ్వలగాండీవ ధనుర్విముక్త నిశితాస్త్రశ్రేణిచేఁ బీన్గుపెం
టలు గావించు పరాక్రమప్రకటచండస్ఫూర్తి నేఁ బార్థుఁడన్.
10.2-1289-వ.
అదియునుం గాక.
10.2-1290-చ.
బలిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణమొప్ప నెక్కటిం
దలపడి పోరినట్టి రణధైర్యుని నన్ను నెఱుంగ వక్కటా!
పెలుకుఱ మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజుల
న్నలవుఁజలంబుఁ జూపి కొనియాడఁగ నిప్పుడతెచ్చియిచ్చెదన్. "

భావము:
“నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని. అంతేకాక అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1290

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౯(619)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1286-తే.
వినుతబలు లైన యాదవ వీరవరులుఁ
గలుగ వారలచేఁ గాని కార్య మీవు
చక్కఁబెట్టుట యెట్లు? నీచనెడు త్రోవఁ
బొమ్ము" నావుడు నయ్యింద్రపుత్త్రుఁ డపుడు
10.2-1287-క.
మనమున దురహంకారము
ఘనముగఁ బొడముటయు, నపుడు కవ్వడి విప్రుం
గనుఁగొని యచ్చటిజనములు
వినఁగా నిట్లనియె రోషవిహ్వలమతియై.

భావము:
ప్రశంసించదగిన బలం కలిగిన యాదవవీరులు ఉండగా, వారిచేతనే కాని పనిని చక్కపెట్టడం నీవు ఎలా చేయగలవు కానీ, నీ దారిన నీవు వెళ్ళు.” ఇలా అంటున్న ఆ బ్రాహ్మణుడి మాటలు వినిన ఇంద్రతనయుడు అర్జునుడి మనసులో దురహంకారం పెచ్చుమీరింది. రెండు చేతులతో వడిగా బాణాలు వేయగలిగిన ఆ మహావీరుడు రోషంతో వశంతప్పి, అక్కడి జనాలు అందరు వినేలా విప్రుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1287

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౮(618)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1284-క.
"ఈ పగిది నీవు వగలన్
వాపోవఁగఁ జూచి యకట! వారింపంగా
నోపిన విలుకాఁ డొక్కం
డీ పురి లేఁ డయ్యె నయ్య! యిది పాపమగున్.
10.2-1285-సీ.
పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున-
  వనటఁ బొందుచు విప్రవరులు సాల
నే రాజురాజ్య మందేని వసించుదు-
  రా రాజుఁ దలపోయ నవనిమీఁద
నటునిఁగా నాత్మ నెన్నం దగు; నీ పుత్త్రు-
  నే బ్రతికించెద నిపుడ పూని
యటు సేయనైతి నే ననలంబు సొచ్చెద"-
  నని భూసురుఁడు వెఱఁగందఁ బలుక
10.2-1285.1-తే.
నతఁడు విని "యీ వెడఁగుమాట లాడఁ దగునె?
భూరివిక్రమశాలి రాముండు మేటి
బలుఁడు హరియును శౌర్యసంపన్ను లనఁగఁ
దనరు ప్రద్యుమ్నుఁ డతని నందనుఁడు మఱియు.

భావము:
“అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము. ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.” ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. “అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1285

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౭(617)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1283-వ.
ఇవ్విధంబున మఱియు దన సుతులు మృతులయినపు డెల్ల వారలం గొనివచ్చి యవ్విప్రుండు రాజుమొగసాలంబెట్టి రోదనంబు సేయుచు నెప్పటియట్ల కొన్నిగాథలు సదివిపోవుచుండె; నివ్విధంబున నెనమండ్రు సుతులు మృతులైనపిదపం దొమ్మిదవ సుతుండును మృతుండైన వాని నెత్తికొని వచ్చి యెప్పటి విధంబునఁ బలవరించుచున్న యా బ్రాహ్మణునిం గని యర్జునుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా తనకు కొడుకులు పుట్టి మరణించిన ఎనమండుగురు కొడుకులను ప్రతిసారి, వారిని తీసుకు వచ్చి రాజమందిర ద్వారం ముందు పెట్టి, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ మునుపటిలాగే కొన్ని కథలు చదివి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా అతనికి పుట్టి చనిపోయిన తొమ్మిదవకొడుకును కూడ ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆక్రందిస్తున్న బ్రాహ్మణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1283

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౬(616)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1282-సీ.
అధికశోకంబున నలమటఁ బొందుచు-
  నచ్చటి జనులతో ననియెఁ బెలుచ
"బ్రాహ్మణ విద్వేషపరుఁ డయి తగ శాస్త్ర-
  పద్ధతి నడవక పాపవర్తి
యై క్షత్రబంధువుఁ డగు వాని దురితంబు-
  చేత మత్పుత్త్రుండు జాతమైన
యప్పుడ మృతుఁ డయ్యె నక్కట! హింసకు-
  రోయక యెప్పు డన్యాయకారి
10.2-1282.1-తే.
యగుచు విషయానుగతచిత్తుఁ డైన యట్టి
రాజుదేశంబు ప్రజలు నిరాశు లగుచు
దుఃఖములఁ జాల వనటఁ బొందుదు ర"టంచు
నేడ్చుచును నట నిల్వక యేగె నపుడు.

భావము:
దుర్భరశోకంతో కుమిలిపోతున్న ఆ విప్రుడు అక్కడి ప్రజలతో “బ్రాహ్మణద్వేషి, శాస్త్రాచారాన్ని పాటించని వాడు, పాపాత్ముడు అయిన క్షత్రబంధువు చేసిన పాపం వలన నా కుమారుడు పుట్టగానే చచ్చిపోయాడు. దేశాన్ని ఏలే రాజు హింసను ఏవగించుకోకుండా, న్యాయానికి దూరుడు, ఇంద్రియలోలుడు అయితే ఆ ప్రజలు నిరాశతో దుఃఖాలవలన అధికమైన కష్టాలను పొందుతారు.” అని ఏడుస్తూ ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1282

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :