Tuesday, January 31, 2017

వామన వైభవం - 102:8-641-సీ.
దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి;
ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును;
స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు;
గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు;
నిరయంబు బొందుట నిజముగాదె?
8-641.1-తే.
కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు
కాక యిచ్చెదవేని వేగంబ నాకు
నిపుడ మూఁడవ పదమున కిమ్ముఁ జూపు
బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె?

టీకా:
దానవ = రాక్షసుడా; త్రిపద = మూడడుగుల; భూతలమున్ = భూభాగమును; ఇత్తున్ = ఇచ్చెదను; అంటివి = అన్నావు; ధరణిన్ = భూమిని; చంద్ర = చంద్రుడు; అర్కులు = సూర్యుడు; ఎందాక = ఎక్కడిదాక; ఉందురు = కనబడెదరో; అంత = అక్కడివరకు; భూమియున్ = భూమిని; ఒక్క = ఒకేఒక; అడుగు = అడుగు; అయ్యెన్ = అయినది; నా = నా; కునున్ = కు; స్వర్లోకమును = స్వర్గలోకము; ఒక్క = ఒకేఒక; చరణము = అడుగు; అయ్యెన్ = అయినది; నీ = నీ యొక్క; సొమ్ము = సంపద; సకలంబు = అంతా; రెండు = రెండు (2); అడుగులు = అడుగులు; కడమ = మిగిలిన; పాదమున్ = అడుగున; కున్ = కు; కలదె = ఉన్నదా; భూమి = నేల; ఇచ్చెదన్ = దానమిచ్చెదను; అన్న = అనిన; అర్థమున్ = సొమ్ము; ఈని = ఇయ్యనట్టి; దురాత్ముండు = దుష్టుడు; నిరయంబున్ = నరకమును; పొందుట = పొందుట; నిజము = సత్యము; కాదె = కాదా ఏమి. కాన = కనుక; దుర్గతి = నరకమునకుపోవుట; కినిన్ = కి; కొంత = కొంత; కాలము = సమయము; అరుగున్ = పట్టును; కాక = అలాకాకుండగ; ఇచ్చెదవు = ఇచ్చెడివాడవు; ఏని = ఐతే; వేగంబ = శ్రీఘ్రమే; నా = నా; కున్ = కు; ఇపుడ = ఇప్పుడే; మూడవ = మూడవ (3); పదమున్ = అడుగున; కున్ = కు; ఇమ్ము = చోటు; చూపు = చూపుము; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; అధీనములున్ = ఆధీనముకావలసినవానిని; త్రోవన్ = కాదనుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవునకైన; వశమె = సాధ్యమా, కాదు.

భావము:
“ఓ దనుజేంద్రా! బలీ! మూడడుగుల నేల ఇస్తాను అన్నావు కదా. భూలోకమూ, సూర్య చంద్రుల దాకా ఉండే స్థలము నాకు ఒక అడుగుకి సరిపోయింది. స్వర్గలోకం ఒక అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు రెండు అడుగులైంది. ఇక మూడవ అడుగుకు చోటెక్కడుంది. ఇస్తానన్న అర్ధాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా! అందువల్ల, నీకు కొంచెంసేపటిలో నరకం ప్రాప్తిస్తుంది. సందేహం లేదు. అలాకాకుండా మూడవ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆచోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు."
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=641

: : చదువుకుందాం భాగవతం: బాగుపడదాం మనం అందరం : :

Monday, January 30, 2017

కాళియమర్దనము – మానవేశ్వర

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-635-వ.
అనిన శుకుం డిట్లనియె.
10.1-636-సీ.
"మానవేశ్వర! యొక్క డుఁగు కాళిందిలోఁ;
; దది యెప్పుడుఁ గాళియాహి
విషవహ్నిశిఖలచే వేచు చుండును; మీఁదఁ;
ఱతెంచినంతన క్షులైనఁ
డి మ్రగ్గు; నందుఁ దద్భంగశీకరయుక్త;
వనంబు సోఁకినఁ బ్రాణు లెవ్వి
యైన నప్పుడ చచ్చుట్టి యా మడుఁగులో;
నుదకంబు పొంగుచు నుడుకుచుండుఁ
10.1-636.1-తే.
జూచి వెఱగంది కుజనుల స్రుక్కఁజేయ
వతరించిన బలువీరుఁ డాగ్రహించి
భుజగవిషవహ్ని దోషంబుఁ బొలియఁజేసి
సుజలఁ గావించి యా నదిఁ జూతు ననుచు.
టీకా:
అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
మానవేశ్వరా = రాజా {మానవేశ్వరుడు - మానవులకు ప్రభువు, రాజు}; ఒక్క = ఒకానొక; మడుగు = మడుగు {మడుగు - ఏటిలో లోతైన నిడుపాటి ప్రాంతము, హ్రదము}; కాళింది = యమునానది; లోన్ = అందు; కలదు = ఉన్నది; అది = ఆ మడుగు; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; కాళియ = కాళియుడు అనెడి; అహి = పాము యొక్క; విష = విషపు; అగ్ని = అగ్ని; శిఖల = జ్వాలల; చేన్ = చేత; వేచుచుండును = తపించిపోతుండును; మీదన్ = పైన; పఱతెంచి = వెళ్ళిన; అంతనన్ = మాత్రముచేతనే; పక్షులు = పక్షులు; ఐనన్ = అయినను; పడి = పడిపోయి; మ్రగ్గును = చచ్చిపోవును; అందున్ = ఆ మడుగునందు; తత్ = ఆ మడుగు యొక్క; భంగ = అలల వలని; శీకర = తుపుంరులతో; యుక్త = కూడినట్టి; పవనంబు = గాలి; సోకినన్ = తగులగానే; ప్రాణులు = జంతువులు; ఎవ్వి = ఏవి; ఐనన్ = అయినను; అప్పుడ = అప్పుడే; చచ్చున్ = చనిపోవును; అట్టి = అటువంటి; ఆ = ఆ; మడుగు = మడుగు; లోన్ = అందలి; ఉదకంబు = నీరు; పొంగుచున్ = ఉబుకుచు; ఉడుకుచున్ = తెర్లుతు; ఉండున్ = ఉండును; చూచి = అది చూసి.
వెఱగంది = ఆశ్చర్యపడి; కుజనులన్ = దుష్టులను; స్రుక్కజేయ = అణచివేయుటకు; అవతరించిన = పుట్టినట్టి; బలువీరుడు = బలమైనశౌర్యముకలవాడు; ఆగ్రహించి = కోపించి; భుజగ = కాళియసర్పము యొక్క; విష = విషపు; వహ్ని = అగ్ని వలని; దోషంబున్ = కల్మషమును; పొలియజేసి = పోగొట్టి; సుజలన్ = మంచినీరుకది; కావించి = చేసి; ఆ = ఆ యొక్క; నదిన్ = నదిని; చూతున్ = కాపాడెదను; అనుచున్ = అనుచు.
భావము:
అని పరీక్షిన్మహారాజు అనగా, శుకమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు.
 “మహారాజా! యమునానదిలో మడుగు ఒకటి ఉంది. కాళియుడనే సర్పరాజు విషజ్వాలలతో అది ఎప్పుడు తుకతుకలాడుతు ఉంటుంది. దాని పై ఎగిరే పక్షులు కూడ ఆ విషపు గాలులు సోకి చచ్చి అందులో పడిపోతాయి. ఆ కాళిందిలోని అలలకి చెలరేగిన నీటితుంపరలు కలిసిన గాలి సోకితే చాలు ఏ జంతువైనా అప్పటికప్పుడు చచ్చి పడిపోవలసిందే. ఆ మడుగులోని జలాలు ఎప్పుడు కుతకుత పొంగుతు ఉడుకుతు ఉంటాయి. ఆ మడుగును చూచి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. దుర్మార్గులను అణచేయడానికి అవతరించిన ఆ మహావీరునికి బాగా కోపం వచ్చింది. ఈ నదిలోని పాము విషాగ్ని దోషం పోగొట్టి, నిర్మల జలాలతో నిండి ఉండే నదిగా చేస్తాను. అని నిశ్చయించుకొన్నాడు.

వామన వైభవం - 101:

8-640-క.
సంపద చెడియును దైన్యము
గంపంబును లేక తొంటికంటెను బెంపుం
దెంపును నెఱుకయు ధైర్యము
వంపని సురవైరిఁ జూచి వటుఁ డిట్లనియెన్.

టీకా:
సంపద = ఐశ్వర్యము; చెడియును = నశించినను; దైన్యము = దీనత్వము; కంపంబునున్ = బెదురులు; లేక = లేకుండ; తొంటి = ఇంతకుముందు; కంటెను = కంటె; పెంపున్ = అతిశయము; తెంపు = తెగువ; ఎఱుకయున్ = జ్ఞానము; ధైర్యము = ధైర్యము; వంపని = తగ్గని; సురవైరిన్ = బలిచక్రవర్తిని; చూచి = చూసి; వటుడు = బ్రహ్మచారి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
ఐశ్వర్యం నశించినా బలిచక్రవర్తి లో దీనత్వమూ కంపమూ కలుగలేదు. అంతే కాదు వెనుకటికంటే ఔన్నత్యమూ. తెగువా, జ్ఞానమూ, ధైర్యమూ అధికం అయ్యాయి. అప్పుడు బలిచక్రవర్తిని చూచి వామనుడు ఇలా అన్నాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=640

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, January 29, 2017

కాళియమర్దనము - తొఱ్ఱులఁ

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-633-వ.
అనిన “న య్యగాధజలంబుల వలన మాధవుం డెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించె, నందుఁ బెద్దకాలం బా వ్యాళం బేల యుండె? నెఱిగింపుము.
10.1-634-క.
తొఱ్ఱులఁ గాచిన నందుని
కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్
జుఱ్ఱంగఁ దనివి గల్గునె;
వెఱ్ఱుల కైనను దలంపవిప్రవరేణ్యా! "
టీకా:
అనినన్ = అనగా; ఆ = ఆ; అగాధ = మిక్కిలి లోతుగల; జలంబుల = నీటి; వలన = నుండి; మాధవుండు = కృష్ణుడు; ఎట్టి = ఎటువంటి; నేర్పునన్ = నేర్పుచేత; సర్పంబు = ఆ పాము యొక్క; దర్పంబున్ = మదమును; మాపి = పోగొట్టి; వెడలించెన్ = వెడలగొట్టెను; అందున్ = ఆనదియందు; పెద్దకాలంబు = చాలాకాలమునుండి; వ్యాళంబు = పాము; ఏల = ఎందుచేత; ఉండెన్ = ఉన్నది; ఎఱిగింపుము = తెలియ చెప్పుము.
తొఱ్ఱులన్ = ఆవులను; కాచిన = మేపెడి; నందుని = నందుని యొక్క; కుఱ్ఱని = కుమారుని; చరిత = చరిత్ర అనెడి; అమృతంబున్ = అమృతమును; కొనకొని = పూని; చెవులన్ = చెవులతో; జుఱ్ఱంగన్ = ఆసక్తితో పీల్చుకొనగా; తనివి = తృప్తి; కల్గునె = కలుగునా, కలుగదు; వెఱ్ఱుల్ = పిచ్చివాని; కిన్ = కి; ఐనను = అయినప్పటికి; తలంపన్ = తరచి చూసినచో; విప్ర = బ్రాహ్మణ; వరేణ్యా = శ్రేష్ఠుడా.
భావము:
అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “ఆ అతి లోతైన మడుగులోని నాగరాజు కాళియుడి గర్వం లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు ఎలా అణచాడో. ఎలా వెళ్ళ గొట్టాడో? ఆ నేర్పు ఎలాంటిదో? అసలు అన్నాళ్ళు ఆ కాళిందిలో ఆ సర్పరాజు ఎందుకున్నాడో. నాకు చెప్పు.
ఓ బ్రహ్మణోత్తమా! శుకబ్రహ్మ! గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని చెవులారా జుర్రుకుంటు ఆస్వాదిస్తున్న ఎంతటి వెర్రివాడైనా తృప్తిచెంది ఇంక చాలు అనుకోగలడా? ఊహు అనుకోలేడు."

వామన వైభవం - 100:

8-638-వ.
అట్లు గావున రణంబున శత్రుల కిప్పు డెదురు మోహరించుట కార్యంబుఁ గాదు; మనకుం దగు కాలంబున జయింతము; నలంగక తొలంగుం డనిన దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసా తలంబునకుం జని; రంత హరి హృదయం బెఱింగి తార్క్ష్యనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాశంబుల నసురవల్లభుని బంధించెను; అంత.
8-639-క.
బాహులుఁ బదములుఁ గట్టిన
శ్రీహరి కృపగాక యేమి జేయుదు నని సం
దేహింపక బలి నిలిచెను
హాహారవ మెసఁగె దశ దిగంతములందున్.

టీకా:
అట్లుగావున = అందుచేత; రణంబునన్ = యుద్దమునందు; శత్రుల్ = శత్రువుల; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; ఎదురు = ఎదురునిల్చి; మోహరించుట = వ్యూహములు పన్నుట; కార్యంబు = తగినపని; కాదు = కాదు; మన = మన; కున్ = కు; తగు = తగినట్టి; కాలంబునన్ = కాలంకలిసివచ్చినప్పుడు; జయింతము = గెలిచెదము; నలంగక = అనవసర శ్రమపడక; తొలంగుడు = తప్పుకొనుడు; అనినన్ = అనగా; తలంగి = తప్పుకొని; భాగవత = భగవంతుని, విష్ణు; భట = భటుల యెడ; భీతులు = భయపడువారు; ఐ = అయ్యి; చిక్కి = తగ్గి; రక్కసులున్ = రాక్షసులు; రసాతలంబున్ = రసాతలమున; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అప్పుడు; హరి = విష్ణుని; హృదయంబున్ = మనసు; ఎఱింగి = తెలిసికొని; తార్క్ష్యనందనుండు = గరుడకుమారుడు; యాగసుత్య = యాగముచివర సుత్య చేసెడి {సుత్య - స్నానము, సోమలతను కొట్టిపిడుచుట, సోమపానము}; అహంబునన్ = దినమున; వారుణపాశంబులన్ = వరుణ పాశములతో; అసురవల్లభుని = బలిచక్రవర్తిని; బంధించెను = బంధించెను; అంత = అంతట. బాహులున్ = చేతులు; పదములున్ = కాళ్ళు; కట్టినన్ = కట్టివేసినను; శ్రీహరి = విష్ణునియొక్క; కృప = దయ; కాక = కాకుండగ; యేమి = ఏమి; చేయుదును = చేయగలను; అని = అని; సందేహింపకన్ = సంకోచములేకుండ; బలి = బలి; నిలిచెను = మౌనమువహించెను; హాహారవములు = హాహాకారములు; ఎసగెన్ = చెలరేగెను; దశదిగంతముల్ = అన్నివైపుల; అందున్ = లోను.

భావము:
కనుక, ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైన సమయంలో గెలువవచ్చు. అనవసరంగా శ్రమపడకుండా తొలగిపొండి.” అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణుభక్తులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయారు. అటుపిమ్మట యాగంలో సోమపానంచేసే చివరి దినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకుని గరుడుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు. చేతులూ కాళ్ళూ కట్టబడిన బలి చక్రవర్తి, ఇది విష్ణువు దయ దీనికి ఏమీ చేయలేను అనుకుంటూ, సంకోచం ఏమీ లేకుండా మౌనం వహించాడు. అన్నివైపులా హాహాకారాలు చెలరేగాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=639

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, January 28, 2017

కాళియమర్దనము - కాళియఫణిదూషిత

చదువుకుందాం భాగవతం :: బాగుపడదాం మనం అందరం:
10.1-632-క.
కాళియఫణిదూషిత యగు
కాళిందిఁ బవిత్రఁ జేయఁగా నుత్సుకుఁడై
కాళిందీజలవర్ణుఁడు
కాళియు వెడలంగ నడిచెఁ గౌరవముఖ్యా!
టీకా:
కాళియ = కాళియుడు అనెడి; ఫణి = సర్పముచేత; దూషిత = కలుషితము చేయబడినది; అగు = ఐన; కాళిందిన్ = యమునానదిని; పవిత్రంబు = పరిశుద్ధమైనదిగా; చేయన్ = చేయుటకొరకు; ఉత్సుకుడు = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి; కాళిందీజలవర్ణుండు = కృష్ణుడు {కాళిందీజలవర్ణుడు - కాళిందీ (యమునా నది) యొక్క జల (నీటి) వలె నల్లని వర్ణుడు (రంగు దేహము కలవాడు), కృష్ణుడు}; కాళియున్ = కాళింగుని; వెడలంగనడిచెన్ = వెడలగొట్టెను; కౌరవముఖ్య = పరీక్షిన్మహారాజా {కౌరవముఖ్యుడు - కురువంశపు రాజులలో ముఖ్యమైన వాడు, పరీక్షిత్తు}.
భావము:
కురువంశంలో ముఖ్యమైన మహారాజా! పరీక్షిత్తూ! కాళియుడు అనే నాగుడి వల్ల పాడైన కాళింది మడుగును బాగు చేయాలని శ్రీకృష్ణుడు సంకల్పించుకొన్నాడు. కాళిందినదీ జలాల వలె నీల వర్ణ దేహుడైన కృష్ణుడు కాళియ సర్పాన్ని వెళ్ళగొట్టాడు.”
గంగానది నీళ్ళు తెల్లగా ఉంటాయి. యమునానది నీళ్ళు నల్లగా ఉంటాయి. ప్రయాగ త్రివేణీసంగమం వద్ద ఆ తేడా బాగా తెలుస్తుంది.

వామన వైభవం - 99:

8-636-వ.
అదియునుం గాక.
8-637-క.
పలు దుర్గంబులు సచివులు
బలములు మంత్రౌషధములు బహు శేముషియుం
గలిగియు సామోపాయం
బులఁ గాల మెఱింగి నృపుడు పోరుట యొప్పున్.

టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండ.
పలు = అనేక; దుర్గంబులు = కోటలు; సచివులు = మంత్రులు; బలములు = సేనలు; మంత్ర = మంత్రాంగములు; ఔషధములు = ఔషధములు; బహు = మిక్కిలి; శేముషియున్ = యశస్సు; కలిగియున్ = ఉండికూడ; సామోపాయంబులన్ = అనుకూల వర్తనలద్వారా {సామోపాయము - అనుకూలప్రవర్తన, పంచతంత్రములలోనిది, ఇది పదివిధములు 1పరస్పరోపాకారము కనిపింపజేయుట 2మంచితనము 3గుణములను కొనియాడుట 4సంబంధములునెరపుట 5నేను నీవాడనని మంచిమాటలాడుట}; కాలమున్ = సమయము; ఎఱింగి = తెలిసికొని; నృపుండు = రాజు; పోరుట = యుద్దముచేయుట; ఒప్పున్ = సరియైనపని.


భావము:
అంతేకాక....రాజైనవాడు ఎంతటి కోటలూ, మంత్రులూ, సైన్యాలూ, మంత్రాలూ, ఔషదాలూ, తెలివితేటలూ ఉన్నప్పటికీ కాలాన్నిగమనించి ఓర్పుతో ఉపాయంతో యుద్ధం చేయడమే సరైన పని.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=80&Padyam=637

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, January 27, 2017

కాళియ మర్దనం

చదువుకుందాం భాగవతం :: బాగుపడదాం మనం అందరం:
10.1-631-సీ.
కనాడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ;
గోపాలకులు దానుఁ గూడి కృష్ణుఁ
డవికిఁ జని యెండ నా గోవులును గోప;
కులు నీరుపట్టునఁ గుంది డస్సి
కాళిందిలో విషలిత తోయముఁ ద్రావి;
ప్రాణానిలంబులు బాసి పడిన
యోగీశ్వరేశుండు యోగివంద్యుఁడు గృష్ణుఁ;
డీక్షణామృతధార లెలమిఁ గురిసి
10.1-631.1-ఆ.
సుల గోపకులను బ్రతికించె మరలంగ;
వారుఁ దమకుఁ గృష్ణులన మరలఁ
బ్రతుకు గలిగెనంచు భావించి సంతుష్ట
మానసములఁ జనిరి మానవేంద్ర!
టీకా:
ఒక = ఒకానొక; నాడు = దినమున; బలభద్రుడు = బలరాముడు; ఒక్కడు = మాత్రము; రాకుండన్ = రాకుండగా; గోపాలకులున్ = యాదవులు; తానున్ = అతను; కూడి = కలిసి; కృష్ణుడు = కృష్ణుడు; అడవి = అడవి; కిన్ = కి; చని = వెళ్ళి; ఎండన్ = ఎండలో; ఆ = ఆ; గోవులును = పశువులు; గోపకులున్ = యాదవులు; నీరుపట్టునన్ = దాహముతో; కుంది = కుంగిపోయి; డస్సి = బడలిక చెంది; కాళింది = యమున; లోన్ = అందు; విష = విషముతో; కలిత = కూడిన; తోయమున్ = నీటిని; త్రావి = తాగి; ప్రాణానిలంబులున్ = ప్రాణవాయువులు; పాసి = పోయి; పడినన్ = పడిపోగా; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులకు; ఈశుండు = ప్రభువు; యోగి = యోగులచే; వంద్యుడు = స్తుతింపబడువాడు; కృష్ణుడు = కృష్ణుడు; ఈక్షణ = చూపులు అనెడి; అమృత = అమృతపు; ధారలు = జల్లులు; ఎలమిన్ = ప్రేమతో; కురిసి = కురిపించి;
పశులన్ = పశువులను; గోపకులనున్ = గొల్లవాండ్రను; బ్రతికించె = జీవింపజేసెను; మరలంగ = తిరిగి; వారున్ = వారుకూడ; తమ = వారల; కున్ = కు; కృష్ణు = కృష్ణుని; వలన = వలన; మరలన్ = మళ్ళీ; బ్రతుకు = జీవితము; కలిగెన్ = కలిగినది; అంచున్ = అని; భావించి = తలచుకొని; సంతుష్ట = సంతోషించిన; మానసములన్ = మనసులతో; చనిరి = వెళ్ళిరి; మానవేంద్రా = రాజా {మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}.
భావము:
శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగేడు “ఓ పరీక్షిన్మహారాజా! ఒకరోజు కృష్ణుడు గోపాలకులు తాను కలిసి ఆవులను తోలుకొని అడవికి వెళ్ళాడు. ఆ రోజున మాత్రం బలరాముడు వారితో వెళ్ళలేదు. ఆ వేళ ఎండ తీవ్రతకి గోవులు, గోపాలకులు దాహంతో తపించిపోతు సొమ్మసిల్లి పోసాగారు. వారు కాళింది అనే యమునా నది మడుగులోని విషపూరితమైన నీళ్ళు తాగి ప్రాణవాయువులు కోల్పోయి పడిపోయారు. మహా యోగులకు ప్రభువు, యోగు లందరికి వందనీయుడు అయిన శ్రీకృష్ణుడు తన చూపులనే గొప్ప అమృతం వర్షించి ఆ గోవులను, గోపాలకులను మళ్ళీ బతికించాడు. వారంతా కృష్ణుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని సంతోషించి ఇళ్ళకు వెళ్ళిపోయారు.