Thursday, December 31, 2015

తెలుగు వెలుగు మాసపత్రికలో తెలుగుభావతం.ఆర్గ్ - సమీక్ష

తెలుగు వెలుగులో – భాగవత మకరందం – తెలుగుభాగవతం.ఆర్గ్
రామోజీ రావు వారి తెలుగు వెలుగు మాసపత్రిక తాజా సంచికలో మన తెలుగుభాగవతం.ఆర్గ్ గురించి వ్యాసం ప్రచురించారు. ఆ వ్యాస ఉల్లేఖనం జతచేస్తున్నాను వీక్షించండి. వారికి, తెలుగు వెలుగు బృందానికి, కారణభూతులైన మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతా నమస్కారములు. భాగవత గణనాధ్యాయి.ఆంగ్ల మాన నూతన సంవత్సరాది శుభాకాంక్షలు


ప్రహ్లాదుని హింసించుట - చెప్పడొక

7-210-క.
"చెప్పఁ డొక చదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగాఁ
జెప్పెడు మన యెడ నొజ్జలు
చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్."
టీకా:
          చెప్పడు = తెలుపడు; ఒక = ఒక; చదువు = శాస్త్రము; మంచిది = మంచిది; చెప్పెడిన్ = చెప్పును; తగులములు = సాంసారిక బంధనములను; చెవులు = చెవులు; చిందఱగొనగాన్ = చెదిరిపోవునట్లు; చెప్పెడు = చెప్పును; మన = మన; ఎడన్ = అందు; ఒజ్జలు = గురువులు; చెప్పెదన్ = తెలిపెదను; ఒక = ఒకటి; చదువు = విద్యని; వినుడు = వినండి; చిత్తముల్ = మనసులు; అలరన్ = సంతోషించునట్లుగ.
భావము:
            స్నేహితులారా! మన గురువులు మన కెప్పుడు ఒక్క మంచి చదువు కూడ చెప్పటం లేదు కదా! ఎప్పుడు చూసినా చెవులు చిల్లులు పడేలా సంసార భోగ విషయాలైన కర్మబంధాలను గూర్చి చెప్తున్నారు. మీ మనసుకు నచ్చే మంచి చదువు నేను చెప్తాను. వినండి.”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, December 30, 2015

ప్రహ్లాదుని హింసించుట - ఆటలకు

7-209-క.
లకుఁ దన్ను రమ్మని
పాటించి నిశాటసుతులు భాషించిన దో
షాకులేంద్రకుమారుఁడు
పావమున వారిఁ జీరి ప్రజ్ఞాన్వితుఁడై.
టీకా:
          ఆటల = క్రీడల; కున్ = కు; తన్ను = తనను; రమ్ము = రావలసినది; అని = అని; పాటించి = బతిమాలి; నిశాట = రాక్షస; సుతులు = బాలురు; భాషించినన్ = అడుగగా; దోషాట = (దోషవర్తనగల) రాక్షస; కుల = వంశ; ఇంద్ర = రాజు యొక్క; కుమారుడు = పుత్రుడు; పాటవమున = నేర్పుతో; వారిన్ = వారిని; చీరి = పిలిచి; ప్రజ్ఞ = తెలివి; ఆన్వితుడు = కలవాడు; ఐ = అయ్యి.
భావము:
            అతనితో చదువుకుంటున్న రాక్షసుల పిల్లలు తమతో ఆడుకోడానికి రమ్మని పిలిచారు. అప్పుడు దోషాచారులు దానవుల చక్రవర్తి కుమారుడు, మంచి ప్రజ్ఞానిధి అయిన ప్రహ్లాదుడు వారితో చేరి నేర్పుగా ఇలా చెప్పసాగాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, December 29, 2015

ప్రహ్లాదుని హింసించుట - అని గురుపుత్రులు

7-208-వ.
అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు "గృహస్థులైన రాజులకు నుపదేశింపఁ దగిన ధర్మార్థ కామంబులు ప్రహ్లాదునకు నుపదేశింపుఁ" డని యనుజ్ఞ జేసిన, వారు నతనికిఁ ద్రివర్గంబు నుపదేశించిన నతండు రాగద్వేషంబులచేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబు లైన ధర్మార్థకామంబులుఁ దనకు నగ్రాహ్యంబు లనియును వ్యవహార ప్రసిద్ధికొఱకైన భేదంబు గాని యాత్మభేదంబు లేదనియును ననర్థంబుల యందర్థకల్పన చేయుట దిగ్భ్రమం బనియు నిశ్చయించి, గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు దమ గృహస్థ కర్మానుష్టానంబులకుం బోయిన సమయంబున.
టీకా:
          అని = అని; గురుపుత్రులు = చండామార్కులు {గురుపుత్రులు - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు}; పలికినన్ = చెప్పగా; రాక్షసేశ్వరుండు = రాక్షసరాజ; గృహస్థులు = వివాహమైనవారు; ఐన = అయినట్టి; రాజుల్ = రాజుల; కున్ = కు; ఉపదేశింపన్ = తెలుపుటకు; తగిన = అర్హమైన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములను; ప్రహ్లాదున్ = ప్రహ్లాదున; కున్ = కు; ఉపదేశింపుడు = తెలియజెప్పండి; అని = అని; అనుజ్ఞ = ఆనుమతి; చేసినన్ = ఇవ్వగా; వారున్ = వారుకూడ; అతని = అతని; కిన్ = కి; త్రివర్గంబున్ = ధర్మార్థకామములను; ఉపదేశించిన = చెప్పగా; అతండు = అతడు; రాగ = అనురాగము; ద్వేషంబుల = విరోధముల; చేతన్ = వలన; విషయ = ఇంద్రియార్థములందు; ఆసక్తులు = ఆసక్తిగలవారు; ఐన = అయిన; వారల = వారి; కిన్ = కి; గ్రాహ్యంబులు = గ్రహింపదగినవి; ఐన = అయిన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; తన = తన; కున్ = కు; అగ్రాహ్యంబులు = గ్రహింపదగినవి కాదు; అనియున్ = అని; వ్యవహార = వ్యవహారముల; ప్రసిద్ది = మిక్కిలి సిధ్ధించుట; కొఱకు = కోసము; ఐన = అయిన; భేదంబు = భేదములే; కాని = తప్పించి; ఆత్మన్ = వానిలో; భేదంబు = భేదము; లేదు = లేదు; అనియున్ = అని; అనర్థంబులన్ = ప్రయోజనములుకానివాని; అందున్ = లో; అర్థ = ప్రయోజనములను; కల్పన = ఊహించుకొనుట; చేయుట = చేయుట; దిగ్భ్రమంబు = భ్రాంతి; అనియున్ = అని; నిశ్చయించి = నిశ్చయించుకొని; గురు = గురువులచే; ఉపదిష్ట = ఉపదేశింపబడిన; శాస్త్రంబులు = చదువులు; మంచివి = మంచివి; అని = అని; తలంపక = భావింపక; గురువులు = గురువులు; తమ = తమ యొక్క; గృహస్థ = ఇంటియందున్న; కర్మ = కార్యములను; అనుష్టానంబుల్ = చేయుట; కున్ = కు; పోయిన = వెళ్ళిన; సమయంబున = సమయమునందు.
భావము:
            ఇలా శుక్రుని కొడుకులు బోధించి చెప్పటంతో, ఆ దానవ చక్రవర్తి శాంతించాడు. “వివాహమైన క్షత్రియులు నేర్చదగిన ధర్మ అర్థ కామములను ప్రహ్లాదుడికి నేర్పండి” అని ఆదేశించాడు. గురువులు చండామార్కులు ఆవిధంగానే చెప్పసాగారు. కాని “నానా విధాలైన కోరికలు కలవారికి ఈ ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం కావాలి. కనుక ఈ గురువులు చెప్పే పాఠాలు మంచివి కావు. లోక వ్యవహారం కోసమే ఈ తేడాలు తప్ప, ఆత్మకు మాత్రం ఏ మార్పులు లేవు. ప్రయోజనం లేని వీటి గురించి ఏదో ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి మాత్రమే.” అని ప్రహ్లాదుడు నిశ్చయం చేసుకున్నాడు. గురువులు తమ గృహకృత్యాలు, జపాలు, తపాలు మున్నగు నిత్యకృత్యాలు కోసం వెళ్ళే సమయం గమనించాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, December 28, 2015

ప్రహ్లాదుని హింసించుట - వక్రుండైన

7-207-శా.
క్రుండైన జనుండు వృద్ధ గురు సేవంజేసి మేధానయో
క్రాంతిన్ విలసిల్లు మీఁదట వయఃపాకంబుతో బాలకున్
క్రద్వేషణబుద్ధుఁ జేయుము మదిం జాలింపు మీ రోషమున్
శుక్రాచార్యులు వచ్చునంత కితఁడున్ సుశ్రీయుతుం డయ్యెడున్."
టీకా:
          వక్రుండు = వంకరబుద్ధిగలవాడు; ఐన = అయిన; జనుండు = వాడు; వృద్ధ = పెద్దలను; గురు = గురువులను; సేవన్ = సేవించుట; చేసి = చేసి; మేధస్ = బుద్ధి; నయః = నీతి; ఉపక్రాంతిన్ = ప్రారంభమగుటచేత; విలసిల్లు = ప్రకాశించును; మీదటన్ = ఆ పైన; వయః = వయస్సు; పాకంబు = పరిపక్వమగుట; తోన్ = తో; బాలకున్ = పిల్లవానిని; శక్ర = ఇంద్రుని; ద్వేషణ = ద్వేషించెడి; బుద్దున్ = బుద్ధిగలవానిని; చేయుము = చేయుము; మదిన్ = మనసున; చాలింపుము = ఆపుము; ఈ = ఈ; రోషమున్ = క్రోధమును; శుక్రాచార్యులు = శుక్రాచార్యులు; వచ్చున్ = వచ్చెడి; అంత = సమయమున; కున్ = కు; ఇతడున్ = ఇతడుకూడ; సు = మంచితనము యనెడి; శ్రీ = సంపద; యుతుండు = కలవాడు; అయ్యెడున్ = కాగలడు.
భావము:
            రాక్షసరాజా! ఎంతటి వంకర బుద్దితో అల్లరిచిల్లరగా తిరిగేవాడు అయినా, పెద్దలు గురువులు దగ్గర కొన్నాళ్ళు సేవ చేసి జ్ఞానం సంపాదించి బుద్ధిమంతుడు అవుతాడు కదా. ఆ తరువాత మన ప్రహ్లాదుడికి వయసు వస్తుంది. వయసుతో పాటు ఇంద్రుడి మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు. ఇప్పుడు కోప్పడ వద్దు. గురుదేవులు శుక్రాచార్యులు వారు వచ్చే లోపల మంచి గుణవంతుడు అవుతాడు. ఆ పైన ఆయన పూర్తిగా దారిలో పెడతారు.”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, December 27, 2015

ప్రహ్లాదుని హింసించుట - శుభ్రఖ్యాతివి

7-206-శా.
"శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర! రో
భ్రూయుగ్మ విజృంభణంబున దిగీవ్రాతముం బోరులన్
విభ్రాంతంబుగఁ జేసి యేలితి గదా విశ్వంబు వీఁ డెంత? యీ
భ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతం బొంద నీ కేటికిన్?
టీకా:
          శుభ్ర = పరిశుద్ధమైన; ఖ్యాతివి = కీర్తిగలవాడవు; నీ = నీ యొక్క; ప్రతాపము = పరాక్రమము; మహా = గొప్ప; చోద్యము = చిత్రము; దైత్యేంద్ర = రాక్షసరాజ; రోష = క్రోధముతోకూడిన; భ్రూ = కనుబొమల; యుగ్మ = జంట యొక్క; విజృంభణంబునన్ = విప్పారుటవలన; దిగీశ = దిక్పాలకుల {దిక్పాలురు - 1ఇంద్రుడు 2అగ్ని 3యముడు 4నిరృతి 5వరుణుడు 6వాయువు 7కుబేరుడు 8ఈశానుడు}; వ్రాతము = సమూహమునుకూడ; విభ్రాజితంబుగన్ = కలతపడినదిగ; చేసి = చేసి; ఏలితి = పాలించితివి; కదా = కదా; విశ్వంబున్ = జగత్తును; వీడు = ఇతడు; ఎంత = ఏపాటివాడు; ఈ = ఇట్టి; దభ్ర = అల్పపు; ఉక్తులు = పలుకులు; గుణ = సుగుణములకు; దోష = దోషమునుకలుగుటకు; హేతువులు = కారణములు; చింతన్ = విచారమున; పొందన్ = పడుట; నీ = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందుకు.
భావము:
            రాక్షసేంద్రా! నీవు నిర్మలమైన కీర్తిశాలివి. నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు యుద్ధంలో ఒక మాటు కనుబొమ్మలు కోపంతో చిట్లిస్తే చాలు దిక్పాలకులు సైతం భయపడిపోతారు. ఇలా ప్రపంచం అంతా ఏకఛత్రాధిపత్యంగా ఏలావు. అంతటి నీకు పసివాడు అనగా ఎంత? ఈ మాత్రానికే ఎందుకు విచారపడతావు? ఇంతకు ఇతడు పలికే తెలిసీ తెలియని మాటలకు నువ్వు దిగులు పడటం దేనికి?” అని చెప్తూ చండామార్కులు మంచి గుణాలున్న మంచి మాటలు, చెడ్డ గుణములున్న చెడ్డ మాటలు నని యెఱుఁగవా? మంచి బుద్ధి గలిగినవాఁడే బాగుపడును. లేకున్న చెడిపోవును. నీ కేల వృధాప్రయాసము? అని సమాధాన పరుస్తూ, చండామార్కులు ఇంకా ఇలా చెప్పసాగారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :