Sunday, September 30, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 25

10.1-476-శా.
వేల్పుల్ చూచి భయంబు నొంద గ్రసనావేశంబుతో నుజ్జ్వల
త్కల్పాంతోజ్జ్వలమాన జిహ్వ దహనాకారంబుతో మ్రింగె న
స్వల్పాహీంద్రము మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్
యల్పాకారుల శిక్యభారులఁ గుమారాభీరులన్ ధీరులన్.
10.1-477-వ.
ఇట్లు పెనుబాముచేత మ్రింగుడుపడు సంగడికాండ్ర గమిం జూచి కృష్ణుండు.


భావము:
అప్పుడు అఘాసురుడు వారిని అందరినీ మ్రింగేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడు. ప్రళయ కాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలలవలె మంటలు మండుతున్న తన నాలుకతో వారిని అందరినీ నోటి లోనికి లాక్కుని మ్రింగేశాడు. దేవతలు అందరూ ఆ మహాసర్పం వారిని మ్రింగడం చూసి భయపడిపోయారు. ఆ గొల్లపిల్లలు మనస్సులు ఎప్పుడూ కృష్ణుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా బలవంతులు కారు. చిన్నపిల్లలు తాము మోస్తున్న చిక్కములు కూడా వారికి బరువే. అయినా ఆ గోపకుమారులు కృష్ణునికి తమను తాము సమర్పించుకున్నవారు కనుక చాలా ధైర్యం ఉన్నారు. తన మిత్రులు అందరూ అలా ఆ భయంకర సర్పం చేత మ్రింగబడుతూ ఉండడం చూసి, కృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, September 29, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 24

10.1-474-మ.
“అర్భకు లెల్లఁ బాము దివిజాంతకుఁ డౌట యెఱుంగ; రక్కటా! 
నిర్భయులై యెదుర్కొనిరి నేఁ గల” నంచు “విమూఢు” లంచు నా
విర్భవదాగ్రహత్వమున వెందగులన్ దమ లేఁగపిండుతో
దుర్భర ఘోర సర్ప ఘన తుండ బిలాంతముఁ జొచ్చి రందఱున్.
10.1-475-వ.
అ య్యవసరంబున.

భావము:
అప్పుడు, కృష్ణుడు చూసి ఇలా అనుకున్నాడు “అయ్యో! ఈ అర్భకులు అందరూ ఇది మామూలు పాము కాదని మహా రాక్షసుడనీ తెలుసుకోలేదు. నేను ఉన్నానని మొండి ధైర్యంతో నిర్భయంగా దానిని ఎదుర్కొంటున్నారు.” కృష్ణునికి వెంటనే రాక్షసునిపై కోపంవచ్చింది. అతడు కూడా వారి వెనుకనే పాము నోటిలో ప్రవేశించాడు. బాలకులు అందరూ తమ లేగలతో సహా భయంకరమైన ఆ చిలువ నోటిలో ప్రవేశించారు. అలా గోపబాలురూ లేగలూ అఘాసురుని నోటిలోనికి వెళ్ళిన ఆ సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=474

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, September 27, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 23

10.1-471-వ.
అని యొండొరులకుం జూపుచు.
10.1-472-మ.
బకునిం జంపిన కృష్ణుఁ డుండ మనకుంబామంచుఁ జింతింప నే
టికి? రా పోదము దాఁటి; కాక యది కౌటిల్యంబుతో మ్రింగుడున్
బకువెంటం జనుఁ గృష్ణుచేత ననుచుం బద్మాక్షు నీక్షించి యు
త్సుకులై చేతులు వ్రేసికొంచు నగుచున్ దుర్వారులై పోవగన్.
10.1-473-వ.
వారలం జూచి హరి తన మనంబున.


భావము:
అంటూ ఒకరి కొకరు పామును చూపించు కున్నారు. కానీ ఎవరూ భయపడటం లేదు “బకాసురుడు అంత వాడిని సంహరించిన కృష్ణుడు ఉండగా మనకి ఈ పాములంటే భయం దేనికి. రండర్రా! పోదాం. కాదు వంకరబుద్ధితో మనలని దిగమింగిందా, బకాసురుడి లాగే ఇదీ కచ్చితంగా చచ్చిపోతుంది. అంతే” అనుకుంటూ కృష్ణుడిని చూస్తూ గోపబాలురు అందరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. వారిని వారించడం ఎవరికీ సాధ్యం కాదు. అలా ఆ కొండచిలువగాడి నోటి లోనికి గొల్లపిల్లలు వెళ్తుంటే, కృష్ణుడు తన మనసులో....



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Wednesday, September 26, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 22

10.1-469-వ.
ఆ సమయంబున.
10.1-470-మ.
ఒక వన్యాజగరేంద్ర మల్లదె గిరీంద్రోత్సేధ మై దావ పా
వక కీలా పరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోర వ
హ్ని కరాళాతత జిహ్వతోడ మనలన్ హింసింప నీక్షించుచున్
వికటంబై పడి సాగి యున్నది పురోవీధిం గనుంగొంటిరే?

భావము:
అలా అఘాసురుడు ఎదురు చూస్తూ పడి ఉన్న ఆ సమయంలో.... ఆ దారిన వస్తూ ఉన్న గోపబాలకులు కొండచిలువను చూసారు. “అదిగో అడవి కొండచిలువ పర్వతమంత పెద్ద శరీరంతో పడుకుని ఉంది చూసారా? అగ్నిజ్వాలలతో తీక్ష్ణమైన బుసలు భయంకరంగా కొడుతోంది చూడండి. దాని చాచిన నాలుకల నుండి అగ్నిజ్వాలలు రేగుతున్నాయి చూసారా? మనలను చంపేద్దాం అని మన దారి మధ్యలో అడ్డంగా పడుకుని ఉంది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=470

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, September 25, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 21

10.1-467-వ.
అని నిశ్చయించి, యోజనంబు నిడుపును, మహాపర్వతంబు పొడుపును, గొండతుదల మీఱిన కోఱలును, మిన్నుదన్ని పన్నిన నల్ల మొగిళ్ళ పెల్లుగల పెదవులును, బిలంబులకు నగ్గలంబు లయిన యిగుళ్ళ సందులును, నంధకారబంధురంబయిన వదనాంతరాళంబును, దావానల జ్వాలాభీలంబయిన దృష్టిజాలంబును, వేఁడిమికి నివాసంబులయిన యుచ్ఛ్వాస నిశ్వాసంబులును మెఱయ, నేల నాలుకలు పఱచుకొని ఘోరంబగు నజగ రాకారంబున.
10.1-468-క.
జాపిరము లేక యిప్పుడు 
గ్రేపుల గోపాలసుతులఁ గృష్ణునితోడన్
గీపెట్టఁగ మ్రింగెద నని
పాపపు రక్కసుఁడు త్రోవఁ బడి యుండె నృపా!


భావము:
అని నిశ్చయించుకున్న అఘాసురుడు ఘోరమైన కొండచిలువ రూపాన్ని ధరించాడు. ఆ కొండచిలవ యోజనం పొడుగుతో, మహాపర్వతమంత పెద్దగా ఉంది. దాని కోరలు పర్వతశిఖరాలను మించిపోయి ఉన్నాయి. నల్లని మేఘాల వంటి పెదవులు తెరచి ఉండగా పైపెదవి అకాశాన్ని, క్రిందపెదవి నేలని తన్నుతున్నట్లు ఉంది. దాని కోరల మధ్యన ఉన్న సందులు పర్వత గుహల వలె ఉన్నాయి. అంధకార బంధురమైన నోటితో భయంకరంగా ఉంది. దాని చూపుల నుండి అగ్నిజ్వాలలు భీకరంగా వెలువడుతున్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసములు భరించలేనంత వేడిగా నిప్పులు కురిపిస్తున్నాయి. ఆ రాకాసి కొండచిలువ నాలుకలు నేల మీద పరచుకుని పడుకుని ఉంది. “గిలగిలా కొట్టుకునేలా చేసి ఈ గొల్లపిల్లలనూ. దూడలను కృష్ణుడితో పాటు కలిపి ఇప్పటికి ఇప్పుడే మింగేస్తాను.” అనుకుంటూ ఆ రాక్షసుడు దారిలో నోరు తెరుచుకుని పడుకుని ఉన్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 20

10.1-465-క.
బకునికిఁ దమ్ముఁడు గావున
బకమరణముఁ దెలిసి కంసు పంపున గోపా
లక బాలురఁతోఁ గూఁడను
బకవైరినిఁ ద్రుంతు ననుచుఁ బటురోషమునన్.
10.1-466-క.
బాలురు ప్రాణంబులు గో
పాలురకు; మదగ్రజాతు ప్రాణము మా ఱీ
బాలురఁ జంపిన నంతియ
చాలును; గోపాలు రెల్ల సమసిన వారల్.

భావము:
ఆ అఘాసురుడు బకాసురుడి తమ్ముడు. కంసుడి ఆజ్ఞానుసారం అతడు తన తమ్ముడిని చంపినవాడిని తోడి బాలకులతో సహా చంపుతాను అని గర్వంతో రెచ్చిపోయి బయలుదేరాడు. అఘాసురుడు “గోపాలకులకు ప్రాణాలు వారి మగ పిల్లలు. మా అన్న బకాసురుని ప్రాణానికి బదులుగా ఈ పిల్లగాళ్ళను చంపేస్తే చాలు. గోపాలకులు అందరూ చచ్చినట్లే.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=466

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, September 23, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 19

10.1-463-వ.
అని పలికి శుకయోగీంద్రుండు మఱియు ని ట్లనియె.
10.1-464-క.
అమరు లమృతపానంబున
నమరిన వా రయ్యు నే నిశాటుని పంచ
త్వమునకు నెదుళ్ళు చూతురు
తము నమ్మక యట్టి యఘుఁడు దర్పోద్ధతుఁడై.


భావము:
ఇలా చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షన్మహారాజుతో మరల ఇలా అన్నాడు. “ఇలా ఉండగా కొంతకాలానికి అఘాసరుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. దేవతలు అమృతం త్రాగి మరణం లేని వారైనా, ఈ అఘాసురుడి పేరు చెబితే బెదిరి పోతారు. ఈ అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని, వారు ఎదురుచేస్తూ ఉంటారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 18

10.1-462-క.
విందులకును బ్రహ్మసుఖా
నందం బై భక్తగణమునకు దైవత మై
మందులకు బాలుఁ డగు హరి
పొందుఁ గనిరి గొల్ల; లిట్టి పుణ్యులు గలరే?

భావము:
జ్ఞానులకు బ్రహ్మానంద స్వరూపుడూ, భక్తులకు ఆరాధ్య దైవమూ అయిన ఆ భగవంతుడు; అజ్ఞానులకు బాలుని వలె కనిపిస్తున్నాడు. ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుగ్రహించేవాడు. అటువంటి కృష్ణుని సాన్నిధ్యాన్ని ఆ గోపాలకులు పొందారు. ఆహ! ఇంతటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉన్నారా!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=65&padyam=462

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, September 22, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 17

10.1-460-వ.
ఇవ్విధంబున.
10.1-461-ఉ.
ఎన్నఁడునైన యోగివిభు లెవ్వని పాదపరాగ మింతయుం
గన్నులఁ గాన రట్టి హరిఁ గౌఁగిఁటఁ జేర్చుచుఁ జెట్టఁ బట్టుచుం
దన్నుచు గ్రుద్దుచున్ నగుచుఁ దద్దయుఁ బైఁపడి కూడి యాడుచుం
మన్నన జేయు వల్లవకుమారుల భాగ్యము లింత యొప్పునే?


భావము:
ఇలా కృష్ణుని సహచర్యంతో గోపబాలలు.... మహాయోగులు కూడా ఏ పరమపురుషుని పాదపద్మాల ధూళి కొంచెం కూడా చూడను కూడా చూడలేరో, అంతటి వాడు అయిన కృష్ణునితో గోపబాలకులు కలిసి మెలసి ఆడుకున్నారు. అతడిని కౌగిలించుకుంటూ, అతనితో చెట్టపట్టాలు పట్టి తిరుగుతూ, తన్నుతూ, గ్రుద్దుతూ, హాస్యాలాడుతూ, మీదపడుతూ, కలసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నారు. చెప్పలే నంతటిది కదా ఈ గోపబాలకుల భాగ్యం.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Thursday, September 20, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 16

10.1-458-క.
తీపుగల కజ్జ మన్యుఁడు
కోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం
బైపడి యది గొని యొక్కఁడు 
క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా!
10.1-459-క.
వనజాక్షుఁడు ము న్నరిగిన
మునుపడఁగా నతని నేనె ముట్టెద ననుచుం
జని మునుముట్టనివానిన్
మునుముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా!

భావము:
ఓ పరీక్షిన్మహారాజా! తియ్యటి పిండివంట ఒకడి చేతిలోంచి మరొకడు లాక్కుని పారిపోతున్నాడు. మొదటి వాడు ఉడుక్కున్నాడు. ఇంతలో ఇంకొకడు దానిని లాక్కుని పోయి, దూడల మధ్య అటు యిటు పరిగెడుతు ఏడిపించసాగాడు. మహారాజా! కృష్ణుడు ముందు వెళ్తుంటే, ఇద్దరు బాలకులు కృష్ణుణ్ణి “నేనే అంటే నేనే ముందు ముట్టుకుంటాను” అంటూ పరుగు లెత్తారు. ముందు ముట్టుకోగలిగినవాడు ముట్టుకోలేనివాడిని చూసి పకపక నవ్వాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=65&padyam=459

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 15

10.1-456-క.
ఒకనొకని చల్దికావిడి
నొకఁ డొకఁ డడకించి దాఁచు; నొకఁ డొకఁ డది వే
ఱొక డొకని మొఱఁగికొని చను
నొక డొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా!
10.1-457-క.
ఒక్కఁడు ము న్నేమఱి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్; వే
ఱొక్కఁడు మిట్టి తటాలున
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁగన్.


భావము:
ఓరాజా! ఒకతని చల్ది కావిడి మరొకతను అదిలించి లాక్కొని దాచేసాడు. ఇంకొకతను మరొకని అడ్డుపెట్టుకొని తీసుకుపోయాడు. మరింకొకతను ఆ కావిడిని తీసుకొచ్చి యిచ్చేసాడు. పరధ్యానంగా ఒక గోపకుమారుడు ముందు నడుస్తుంటే గమనించినవాడు, అత నులిక్కిపడేలా పెనుబొబ్బ పెట్టాడు. ఒక గోపడు మరొకని కళ్ళు వెనకనించి తటాలున మూసాడు. అది చూసి ఇంకొకడు పకపక నవ్వుతున్నాడు.


పద్య విశేషం:
అలతిపొలతి పదాలతో కళ్ళకు కట్టినట్టు చెప్పటంలో చెప్పుకొదగ్గ పోతన, తన భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరించిన ఘట్టాలలో చల్దులు గుడుచుట ఒకటి. అలా మిక్కిలి ప్రసిద్దమైన యీ పద్యం ఆ ఘట్టంలోది.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, September 16, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 14

10.1-455-వ.
అంత నొక్కనాఁడు రామకృష్ణులు కాంతారంబున బంతిచల్దులు గుడువ నుద్యోగించి ప్రొద్దున లేచి, గ్రద్దనం దమ యింటి లేఁగకదుపులం గదలించి, సురంగంబులగు శృంగంబులు పూరించిన విని, మేలుకని, సంరంభంబున గోపడింభకులు చలిది కావడులు మూఁపున వహించి, సజ్జంబులగు కజ్జంబులు గట్టుకొని పదత్రాణ వేత్రదండంధరులయి, లెక్కకు వెక్కసంబైన తమతమ క్రేపుకదుపులం జప్పుడించి రొప్పుకొనుచు, గాననంబు జొచ్చి, కాంచనమణి పుంజగుంజాది భూషణ భూషితులయ్యును, ఫల కుసుమ కోరక పల్లవ వల్లరులు తొడవులుగా నిడుకొని, కొమ్ములి మ్ముగఁ బూరించుచు వేణువు లూఁదుచుఁ, దుమ్మెదలం గూడి పాడుచు, మయూరంబులతోడం గూడి యాడుచుఁ, బికంబులం గలసి కూయుచు, శుకంబులం జేరి రొదలు జేయుచుఁ, బులుగుల నీడలం బాఱుచుఁ, బొదరిండ్లం దూఱుచు సరాళంబులగు వాఁగులు గడచుచు, మరాళంబుల చెంత నడచుచు, బకమ్ములం గని నిలుచుచు, సారసంబులం జోపి యలంచుచు, నదీజలంబులం దోఁగుచుఁ, దీగె యుయ్యెలల నూఁగుచు, బల్లంబులం డాఁగుచు, దూరంబుల కేగుచుఁ, గపుల సంగడిఁ దరువులెక్కుచు ఫలంబులు మెక్కుచు రసంబులకుంజొక్కుచు నింగికి న్నిక్కుచు నీడలు చూచి నవ్వుచుఁ, గయ్యంబులకుం గాలుదువ్వుచు, చెలంగుచు, మెలంగుచు, వ్రాలుచు, సోలుచు బహుప్రకారంబుల శరీర వికారంబులు జేయుచు మఱియును.

భావము:
ఒకరోజు బలరామకృష్ణులు గోపబాలురు అందరూ కలసి వనభోజనాలు చేయాలని సరదాపడ్డారు. ప్రొద్దుటే లేచి గబగబ తమ ఇంటి లేగదూడలను బయటకి తొలుకుని వచ్చారు. అందమైన కొమ్మూబూరలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులు అందరూ మేల్కొన్నారు. చల్దిఅన్నం కావడులను భుజాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండివంటలు మూటలు కట్టుకున్నారు. కాళ్లకు చెప్పులు చేతికి కఱ్ఱలు ధరించారు. లెక్కపెట్టడానికికూడా కష్టం అనిపించే తమతమ లేగల మందలను “హెహెయ్” అనే కేకలతో తోలుకుంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించారు. బంగారు మణిభూషణాలు ధరించి ఉన్నా పూలను చివుళ్ళను చిన్నచిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు. కొమ్ముబూరాలు పూరిస్తూ; పిల్లనగ్రోవులు ఊదుతూ; తుమ్మెదల తోపాటు ఝమ్మని పాడుతూ; నెమళ్ళతో సమానంగా నాట్యంచేస్తూ; కోకిలలను మిగిలిన పక్షులను అనుకరిస్తూ; చిలుకల తోపాటు అరుస్తూ కేరింతలు కొట్టారు; పైన పక్షులు ఎగురుతుంటే వాటి నీడల తోపాటు తామూ పరిగెత్తారు; జలజలపారే సెలయేళ్ళను చెంగున దూకారు; హంసలను అనుసరిస్తూ వెళ్ళారు; కొంగల తోపాటు ఒంటికాలిపై నిలపడ్డారు; బెగ్గురు పక్షులను తరమితరిమి కొట్టారు; గోతులలో దాక్కున్నారు; తీగల ఊయలు లూగేరు; దూరాలకు పరుగు పందాలు వేసుకున్నారు; కోతులతో చెట్లు ఎక్కారు; పండ్లుతిని వాటి రసాలకు పరవశించిపోయారు; కుప్పించి దూకి తమ నీడలను చూసి నవ్వుకున్నారు; ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు; అలా కేరింతలు కొడుతూ ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=65&padyam=455

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 13

10.1-453-వ.
అని పలికిరి; మఱియు నా రామకృష్ణులు క్రేపులం గాచు తఱి.
10.1-454-సీ.
కపులమై జలరాశిఁ గట్టుదమా యని; 
కట్టుదు రడ్డంబు కాలువలకు; 
మునులమై తపములు మొనయుదమా యని; 
మౌనులై యుందురు మాటలేక; 
గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ; 
బాడుదమా యని పాడఁ జొత్తు; 
రప్సరోజనులమై యాడుదమా యని; 
యాఁడు రూపముఁ దాల్చి యాఁడఁ జనుదు;
10.1-454.1-ఆ.
రమర దైత్యవరులమై యబ్ధిఁ ద్రత్తమా
యని సరోవరముల యందు హస్త
దండచయముఁ ద్రిప్పి తరుతురు తమ యీడు
కొమరు లనుచరింపఁ గొమరు మిగుల. 


భావము:
ఆ రామకృష్టులు ఆ దూడలను మేపే వయసులో తోటి గోపకులు అలా అనుకున్నారు. ఆ బలరామకృష్ణులూ గోపాలబాలురూ దూడలను కాచే సమయాలలో రకరకాల ఆటలు ఆడుకునేవారు “మనం అందరం కోతుల మట సముద్రానికి వారధి కడదామా” అంటూ కాలువలకు అడ్డం కడుతూ ఉంటారు. “మనం మునులమట తపస్సు చేసుకుందామా” అంటూ కన్నులు మూసుకుని మునులవలె మౌనంగా ఉండి పోతారు. “మనం గంధర్వ శ్రేష్ఠుల మట. ఎవరు పాటలు బాగాపాడుతారో” అంటూ పాటలు పాడుతారు. “మనం అందరం అప్సరసలమట నాట్యం చేద్దామా” అంటూ నర్తకుల వేషాలు వేసుకుని నాట్యాలు చేస్తారు. “మేము దేవతలం; మీరు రాక్షసులు అట; సముద్రాన్ని మథించుదామా” అంటూ చెరువులలో చేరి చేతులతో నీళ్ళు చిలుకుతారు. బలరామకృష్ణులు ఏ పని చేస్తే మిగిలిన గోపకులు అందరూ వారినే అనుసరించి ఆ పనినే చేస్తారు. ఈ విధంగా రకరకాల ఆటపాటలతో వారందరూ అందరికీ ముద్దుగొలిపేటట్లు కన్నులకువిందు చేస్తూ ఉండేవారు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, September 8, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 12

10.1-451-వ.
అప్పు డా నందనందనుమీఁద వేలుపులు చాలపులుగా నందన మల్లికాది కుసుమవర్షంబులు హర్షంబునం గురియించిరి; దేవవాద్యంబులు మొరసె; రామాది గోపకుమారులు ప్రాణంబులతోఁ గూడిన యింద్రియంబులునుం బోలెఁ గ్రమ్మఱ కృష్ణునిం గని రమ్మని కౌఁగిలించుకొని కృష్ణసహితులయి లేఁగదాఁటుల మరల దాఁటించుకొని మందగమనంబున మంద కరిగిరి; వారలచేత నా వృత్తాంతం బంతయు విని వెఱంగుపడి గోపగోపికాజనంబులు.
10.1-452-క.
“ఆపదలమీఁద నాపద
లీ పాపనిఁ జెంది తొలఁగె; నీ యర్భకుపై
వే పడిన ఖలులు దహనుని
వైపున శలభముల పగిదిఁ బడిరి ధరిత్రిన్.”

భావము:
అలా బకాసురుని చంపగానే కృష్ణుడి మీద దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలు కురిపించారు. ఆకాశంలో దుందుభి ధ్వనులు వినిపించాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలుకూడా ఎలా సచేతనాలు అవుతాయో అలాగే బలరాముడు మొదలైన గోపకుమారులు అందరూ బ్రతికిపోయామని సంతోషించారు. “బ్రతికి వచ్చావా కృష్ణా!” అంటూ అతణ్ణి కౌగలించుకున్నారు. అందరూ కలసి మందలను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇండ్ల వద్దకు చేరుకున్నారు. బకాసురవధను గురించిన కధ అంతా వారు చెప్పగా గోకులంలోని గోపగోపికాజనాలు విని నివ్వెరపోయారు. “ఈ లేతపాపనికి ఆపదలపై ఆపదలు వచ్చినట్లే వచ్చి తొలగిపోయాయి. పసివాడు కదా అని కృష్ణుడిపైకి విజృంభించిన దుర్మార్గులు ఎవరైనా సరే అగ్నిలో పడిన మిడతలలాగా భస్మమైపోయారు”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=452

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, September 7, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 11

10.1-449-శా.
కంఠోపాంతము దౌడలున్ మెఱముచుం గాలాగ్ని చందంబునం
గుంఠీభూతుఁడు గాక వేండ్రమగు నాగోపాలబాలున్ జయో
త్కంఠున్ బ్రహ్మగురున్ మహామహిముఁ జక్కంమ్రింగ రాదంచు సో
ల్లుంఠం బాడుచు వాఁడు గ్రక్కె వెడలన్ లోకం బశోకంబుగన్.
10.1-450-క.
క్రక్కి మహాఘోషముతోఁ
జక్కగఁ దనుఁ బొడువరాఁగఁ జంచులు రెండున్
స్రుక్కఁగఁ బట్టి తృణము క్రియ 
గ్రక్కున హరి చీరె బకునిఁ గలహోత్సుకునిన్.


భావము:
ఆ బకాసురుని కంఠం ముందు భాగమూ దౌడలూ కాలాగ్నివలె మండిస్తూ విజృంభించాడు కృష్ణుడు నిప్పుముద్దలాగ బకాసురుని కంఠానికి అడ్డుపడ్డాడు. అతడు విజయం సాధించే శీలంకలవాడు; బ్రహ్మదేవుడు అంతటివాడికి తండ్రి; అతడు మహా మహిమ గలిగినవాడు. అతడు మ్రింగుడుపడడం లేదని దీర్ఘంగా నిందిస్తూ, ఆ బకాసురుడు కృష్ణుణ్ణి మళ్లీ బయటకి వెళ్ళగ్రక్కాడు. అలా కృష్ణుడు బయటపడటం చూసి లోకం అంతా సంతోషించింది. ఆ విధంగా బయటికి క్రక్కివేసిన కృష్ణుణ్ణి ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పొడిచి చంపేద్దామని భీకరంగా నోరు తెరచి ముందుకు దూకాడు. కలహానికి కాలు దువ్వే ఆ కొంగ ముక్కు రెండు భాగాలను కృష్ణుడు రెండు చేతులతో పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్లు నిలువునా చీల్చేసాడు. .



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం :




Thursday, September 6, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 10

10.1-447-క.
దనుజుఁడు మ్రింగినఁ గృష్ణునిఁ
గనలేక బలాది బాలకప్రముఖు లచే
తనులై వెఱఁ గందిరి చ
య్యనఁ బ్రాణములేని యింద్రియంబుల భంగిన్.
10.1-448-వ.
అట్లు మ్రింగుడుపడి లోనికిం జనక.

భావము:
అలా రాక్షసుడు మ్రింగిడంతో బలరాముడు మొదలైన గోపాలబాలకులు కృష్ణుడు కనిపించక, ప్రాణంలేని అవయవాలవలె అచేతనులై భయంతో కంపించిపోయారు.‌అలా మ్రింగబడిన కృష్ణుడు ఆ రాకాసికొంగ గొంతుక దాటి లోపలికి పోలేదు. . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=447

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం :