Friday, March 31, 2017

మత్స్యావతార కథ - 18:


8-722-మ.
చని సత్యవ్రతమేదినీదయితుఁ డోజం బూని మ్రాన్దీఁగె వి
త్తనముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై
ముని సంఘంబులుఁ దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁ దేలుచుం
గనియెన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్ మీనమున్.
8-723-వ.
కని జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుఁ బాపత్రాటన నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నా రాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె.

భావము:
సత్యవ్రతుడు ఉత్సాహంతో ఆ ఓడ దగ్గరకు వెళ్ళి, అనేక ఓషధులను విత్తనాలను దాని మీద ఎక్కించాడు. విష్ణువును స్త్రోత్రం చేస్తూ మునులతో పాటు ఆ నావను ఎక్కాడు. భయంభయంగా సముద్రం మీద తేలుతూ పోతున్నాడు. అప్పుడు ఆయనకు భక్తులహృదయాలకు అలంకారమైన విష్ణువు మహామీనస్వరూపంతో ఎదుట కనిపించాడు. అలా కనబడిన మహా మీనరూపుని కొమ్ముకు సత్యవ్రతుడు ఒక పెద్ద పామును త్రాడుగా చేసి ఆ ఓడను కట్టివేసాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకున్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణువును ఈవిధంగా పొగడసాగాడు. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=722

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, March 30, 2017

మత్స్యావతార కథ - 17:8-720.1-తే.
గఱులు సారించు; మీసాలుఁ గడలు కొలుపుఁ;
బొడలు మెఱయించుఁ; గన్నులఁ పొలప మార్చు;
నొడలు జళిపించుఁ దళతళ లొలయ మీన
వేషి పెన్నీట నిగమ గవేషి యగుచు.
8-721-వ.
అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున భక్త పరాధీనుం డగు హరిఁ దలంచుచు నుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినం గనుంగొని.

భావము :
సత్యవ్రతుడు ప్రళయ కాలం వచ్చి సముద్రజలాలు భూలోకాన్ని ముంచివేయడానికి ముందే భక్తులకు తోడునీడైన భగవంతుణ్ణి ధ్యానించుతున్న సమయంలో శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకి వచ్చింది. ఆ విధంగా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరుచుకుంటూ, తళతళలాడుతూ సాగరగర్భంలో విహరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=721

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, March 29, 2017

మత్స్యావతార కథ - 16:

8-719-వ.
ఇట్లు లక్ష యోజనాయతం బయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి చొచ్చి.
భావము:
అలా భగవంతుడు శ్రీమహావిష్ణువు లక్ష ఆమడల పొడవైన మత్స్య రూపం ధరించాడు. సముద్రంలో ప్రవేశించి . .. . .
8-720-సీ.
ఒకమాటు జలజంతుయూథంబులోఁగూడు;
నొకమాటు దరులకు నుఱికి వచ్చు;
నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు;
నొకమాటు లోపల నొదిఁగి యుండు;
నొకమాటు వారాశి నొడలు ముంపమిఁ జూచు;
నొకమాటు బ్రహ్మాండ మొరయఁ దలఁచు;
నొకమాటు ఝషకోటి నొడిసి యాహారించు;
నొకమాటు జలముల నుమిసి వైచు;

భావము:
అతడు తళతళలాడే పెనురూపంతో ప్రళయజలాలలో వేదాలకోసం వెదకటానికి పూనుకున్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్ళ లోపల దాగి ఉంటాడు. ఒకసారి సమద్రంలో మునిగి తేలుతాడు. ఒకసారి బ్రహ్మండాన్ని ఒరసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపల గుంపును పట్టి మ్రింగుతాడు. ఒకసారి నీళ్ళను పీల్చి వెలుపలికి చిమ్ముతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=89&padyam=720

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, March 27, 2017

మత్స్యావతార కథ - 14:

8-715-ఆ.
అలసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి
ముఖము నందు వెడలె మొదలి శ్రుతులు
నపహరించె నొక హయగ్రీవుఁ డను దైత్య
భటుఁడు; దొంగఁ దొడర బరుల వశమె?
8-716-క.
చదువులుఁ దన చేఁ బడినం
జదువుచుఁ బెన్ బయల నుండ శంకించి వడిం
జదువుల ముదుకఁడు గూరుకఁ
జదువుల తస్కరుఁడు చొచ్చె జలనిధి కడుపున్.

భావము:
అలా బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు నిద్రపోయాడు. అతని ముఖాలనుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడు అనే రాక్షసవీరుడు వాటిని దొంగిలించాడు. ఆ హయగ్రీవుడికి తప్ప అలా దొంగతనం చేయడం ఇతరులకు సాధ్యం కాదు. అలా వేదాలను చెరపట్టిన హయగ్రీవుడు వాటిని చదువసాగాడు. బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడిన అతడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం గమనించి, వేగంగా సమద్రంలోకి వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=716

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

మత్స్యావతార కథ - 15:

8-717-వ.
ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెల విత్తనంబుల పొత్తరలు పె న్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్ల కార్యంబులకుం గావలి యగునా పురుషోత్తముం డ ప్పెను రేయి చొరుదల యందు.
8-718-క.
కుఱుగఱులు వలుఁద మీసలు
చిఱుదోకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలున్
నెఱి మొగము నొక్క కొమ్మును
మిఱుచూపులుఁ గలిగి యొక్క మీనం బయ్యెన్.

భావము:
ఈ విధంగా వేదాలను అపహరించుకు పోయి సముద్రంలో మునిగిన ఆ రాక్షసదొంగ హయగ్రీవుడిని జయించడం కోసమూ; వృక్షాలూ, తీగలూ అన్నింటి విత్తనాలు సమస్తం సముద్రంలో తడసిపోయి పాడయిపోకుండా రక్షించడం కోసమూ; జగత్తులోని సమస్త్ కార్యములకు స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు ఆ ప్రళయకాల ఆరంభంలో మీనరూపం ధరించాడు.... అలా విష్ణుమూర్తి మత్యావతారం ఎత్తాడు. చిన్నచిన్న రెక్కలూ, పెద్దపెద్ద మీసాలూ, పొట్టితోకా, బంగారపు రంగు శరీరమూ, శ్రీకరమైన మచ్చలూ, చక్కని ముఖమూ, ఒక కొమ్మూ, మిరుమిట్లుగొలిపే చూపులు తోటి ఆ మహామత్య రూపం విరాజిల్లుతోంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=718

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, March 22, 2017

మత్స్యావతార కథ - 13:

8-713-వ.
అంత న మ్మహారాత్రి యందు
8-714-మ.
నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీఁ
పిఱయన్ నీల్గుచు నావులించుచు నజుం డే సృష్టియున్ మాని మే
నొఱఁగన్ ఱెప్పలు మూసి కేల్ దలగడై యుండంగ నిద్రించుచున్
గుఱు పెట్టం దొడఁగెం గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా!

భావము:
అట్టి బ్రహ్మదేవుని రాత్రి సమయం అయిన మహా ప్రళయ కాలంలో. రాజ్యాన్ని ఏలే రాజా పరీక్షిత్తూ! అవిశ్రాంతంగా కూర్చుని ఓర్పుతో ప్రాణులను సృష్టించి జన్మించుట లేని వాడు అగు బ్రహ్మదేవుడు అలసిపోయాడు. వీపు నడుము నొచ్చసాగాయి. అతడు ఒళ్ళు విరుచుకుంటూ, ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపాడు. నడుం వాల్చి, కళ్ళు మూసికొని, చెయ్యి తలగడగా పెట్టుకున్నాడు. గురకలు పెడుతూ కలలు కంటూ ఒళ్ళుతెలియక నిద్రపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=714

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, March 21, 2017

మత్స్యావతార కథ - 12:

8-711-వ.
తదనంతరంబ
8-712-తే.
మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!
బ్రహ్మ మనఁగ నైమిత్తిక ప్రళయ వేళ
నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ
గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.

భావము:
తరువాత పరీక్షిత్తు మహారాజా! గడచిపోయిన కల్పం అంతం కాగా, బ్రహ్మప్రళయం అనే నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. సముద్రాలు చెలియలి కట్టలు దాటాయి. నిట్టనిలువుగా ఆకాశమంత లేచిన అలల సముద్రంలో లోకాల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రాణులు సమస్తం కూలిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=712

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, March 20, 2017

మత్స్యావతార కథ - 11:

8-709-వ.
అంతఁ గల్పాంతంబు డాసిన
8-710-క.
ఉల్లసిత మేఘ పంక్తులు
జల్లించి మహోగ్రవృష్టి జడిగొని కురియన్
వెల్లి విరిసి జలరాసులు
చెల్లెలి కట్టలను దాఁటి సీమల ముంచెన్.

భావము: 
ఇంతలో ప్రళయ సమయం దగ్గరపడగా.... మెరపులతో కూడిన మేఘాలు ఎడతెరపి లేకుండా బహుభయంకరమైన వర్షపు జడులు కురుస్తున్నాయి, సముద్రాలు చెలియలికట్ట దాటి పొంగిపొరలి దేశాలను ముంచేస్తున్నాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=710

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, March 19, 2017

మత్స్యావతార కథ - 10:8-707-వ.
మఱియు న న్నావ మున్నీటి కరళ్ళకు లోనుఁ గాకుండ, నిరుఁ గెలం కుల వెనుక ముందట నేమఱకుండఁ, బెన్నెఱుఁలగు నా గఱులన్ జడి యుచుఁ బొడువ వచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; ఒక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడచూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం పదిలము చేసి నీకునుఁ దపసులకును నలజడి చెందకుండ మున్నీట ని ప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియు నొక ప్రయోజనంబుఁ గలదు; నా మహిమ పరబ్రహ్మం బని తెలియుము; నిన్ను ననుగ్రహించితి" నని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుం డయ్యె; అయ్యవసరంబున.
8-708-ఆ.
మత్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ
దలఁచికొనుచు రాచతపసి యొక్క
దర్భశయ్యఁ దూర్పుఁ దలగడగాఁ బండి
కాచి యుండె నాఁటి కాలమునకు.

భావము:
మత్స్యరూపం ధరించిన నేను ఆ ఓడ సముద్రం అలలకు దెబ్బతినకుండా అన్నివైపులా నా పెద్ద ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నావను ముక్కలు చేయడానిక వచ్చే పెద్ద పెద్ద జలచరాలను తరిమేస్తూ ఉంటాను. ఒక పెద్ద పాము నా ఆజ్ఞానుసారం, అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నావను బంధించు. నీకూ మునీశ్వరులకూ చేటు వాటిల్లకుండా ఆ ప్రళయకాలం గడిచేంతవరకు నేను రక్షిస్తూ ఉంటాను. ఇందుకోసమే నేను ఈ మీనరూపం ధరించాను. ఇంకోక విశేష ప్రయోజనం కూడా ఉన్నది అనుకో. పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమ తెలుసుకో. మరి నేను నిన్ను అనుగ్రహిస్తాను.” ఇలా పలికి శ్రీమన్నారాయణుడు ఆ సత్యవ్రత మహారాజు చూస్తుండగా అదృశ్యం అయ్యాడు. అలా శ్రీ మహా విష్ణువు చేప రూపంతో చెప్పిన విషయాలను తలచుకుంటూ, తపశ్శాలి అయిన సత్యవ్రత మహారాజు తూర్పువైపుగా తలగడ పెట్టుకుని దర్బల శయ్యమీద పరుండి మీన రూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచి ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=708

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, March 18, 2017

మత్స్యావతార కథ - 9:8-705-వ.
అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయ వేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించి మీన రూపధరుండైన హరి యిట్లనియె.
8-706-సీ.
"ఇటమీఁద నీ రాత్రికేడవదినమునఁ;
బద్మగర్భున కొక్క పగలు నిండు;
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి;
లోన మునుంగు; నాలోనఁ బెద్ద
నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున;
దానిపై నోషధితతులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ;
గలవు సప్తర్షులుఁ గలసి తిరుఁగ
8-706.1-ఆ.
మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి
మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ
దొలకుచుండు జలధి దోధూయమాన మై
నావ దేలుచుండు నరవరేణ్య!

భావము:
ఇలా సత్యవ్రత మహారాజు ఈ మత్స్యావతార కారణం చెప్పమని అడిగాడు. ఆ యుగం చివర కాలంలోని ప్రణయవేళ సముద్రంలో ఒంటరిగా సంచరించాలని భావిస్తున్న శ్రీమహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు. “ఓ రాజా! ఈ రాత్రి గడచిన పిమ్మట రాబోయే ఏడవ నాటితో బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తి అవుతోంది. భూలోకం మొదలు మూడులోకాలూ ప్రళయసముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధులు, విత్తనాల రాసులూ ఆ నౌకపై పెట్టుకుని ప్రళయసముద్రంలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఆ ఓడలో ఉంటారు. మీ ముందు అంతా పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల మేని కాంతులు మిణుకు మిణుకు అంటూ మెరుస్తుంటాయి. సముద్రంలో నావ ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=706

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, March 17, 2017

మత్స్యావతార కథ - 8:8-703-క.
ఇతరులముఁ గాము చిత్సం
గతులము మా పాలి నీవుఁ గలిగితి భక్త
స్థితుఁడవగు నిన్ను నెప్పుడు
నతి చేసినవాని కేల నాశముఁ గలుగున్.
8-704-క.
శ్రీలలనాకుచవేదికఁ
గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు దామసాకృతి
నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!

భావము:
మేము నీకు పరాయివాళ్ళం కాదు. నిర్మల జ్ఞానం కలవాళ్ళము. మాకు అండగా నీవు ఉంటావు. భక్తులలో నివసించే వాడవు నీవు. నీకు నిత్యం నమస్కరించే వాడికి చేటు కలుగనే కలుగదు కదా. హరీ! లక్ష్మీదేవి వక్షస్థలంపై క్రీడిస్తూ సంతోషంగా విహరించే ఆనందస్వరూపుడవు. తామస ప్రకృతితో తిరిగే చేప రూపాన్ని ఎందుకు ధరించావో తెలుపుమయ్యా!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=704

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, March 16, 2017

మత్స్యావతార కథ - 7:


8-702-సీ.
ఒక దినంబున శతయోజనమాత్రము;
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము;
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు;
కరుణ నా పన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి;
నవ్యయ నారాయణాభిధాన
8-702.1-తే.
జనన సంస్థితి సంహార చతురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!

భావము:
“ఒక్క రోజులో నూరు యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనివిని ఎరుగము. ఝషజాతులకు ఎక్కడా ఇలాంటి శరీరం ఉండదు. నీవు ఎవరవు? ఎందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు. దీనులను కాపాడటానికి ఈ మహా మీన రూపం ధరించిన నీవు విష్ణువే అని గతెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! పురుషోత్తమా! లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు, భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మ్రొక్కుతున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=702

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, March 15, 2017

మత్స్యావతార కథ - 6:


8-701-వ.
అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతుల నిడుపై యుదంచంబు నిండి పట్టు చాలక వేఱొండుఁ దె మ్మనవుడు నా రాచ పట్టి కరుణాగుణంబునకు నాటపట్టుఁ గావున గండకంబు నొండొక్క చిఱుతమడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలం బై తనకు సంచరింప నది గొంచెం బని పలికినం బుడమిఱేడు మంచి వాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదం బునందు నిడియె; నదియు నా సలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము చాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పని వాఁడైన కతంబున న మ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కిట్లను "పెను మొ సళ్ళు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింతకాలంబు నడపి కడ పట దిగవిడువకు వెడలఁ దిగువు" మని యెలింగింప దెలిసి కడపట యన్నీటితిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁ డిట్లనియె.

భావము:
ఒక్క క్షణంలో ఆ మీనం మూడు చేతుల పొడవు పెరిగిపోయి, (ఆంధ్ర వాచస్పతము చెయ్యి = రెండు మూరల పొడవు అంటే మూడడుగులు) ఆ గంగాళం అంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొకటి తెమ్మంది. దయానిధి అయిన ఆ రాకుమారుడు ఆ మత్స్యాన్ని చిన్న మడుగులోకి మార్పించాడు. ఆ మడుగుకూడా సరిపోనంత పెరిగిపోయి “నాకు తిరగడానికి చోటు చాలటం లేదు” అంది. ఆ భూపాలకుడు మంచివాడు కనుక ఆ జలచరాన్ని నీరు సమృద్ధిగా ఉన్న పెద్ద సరస్సులో ఉంచాడు. అది కూడా సరిపోనంతా పెరిగిపోయి ఆ మహామత్స్యం చోటు చాలటంలేదని చెప్పుకుంది. బహు దొడ్డ సన్మార్గ చరితుడూ, పుణ్యశీలీ కనుక ఆ మహా మీనాన్ని తీసుకెళ్ళి మహా సముద్రంలో వదిలాడు. సముద్రానికి మొసళ్ళకు నెలవు అని పేరుకదా. “ఈ సముద్రంలో పడ్డ నన్ను పెద్ద మొసళ్ళు చుట్టుముట్టి చంపి తినేస్తాయి. ఇన్నాళ్ళూ కాపాడి, ఇవాళ నన్ను ఇలా వదలివేయకు, బయటకు తీసుకురా” అని మొరపెట్టుకుంది. ప్రాజ్ఞుడైన ఆ మహా జలచరంతో రాజు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=701

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, March 14, 2017

మత్స్యావతార కథ - 5:8-699-వ.
అనిన విని కరుణాకరుండగు న వ్విభుండు మెల్లన య య్యంభశ్చర డింభకంబునుఁ గమండలు జలంబునం బెట్టి తన నెలవునకుం గొని పోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము చాలక రాజన్యున కి ట్లనియె.
8-700-క.
"ఉండ నిదిఁ గొంచె మెంతయు
నొండొకటిం దెమ్ము భూవరోత్తమ!" యనుడున్
గండకముఁ దెచ్చి విడిచెను
మండలపతి సలిల కలశ మధ్యమున నృపా!

భావము:
అలా చేప పిల్ల పలికిన మాటలు విని కరుణాహృదయుడైన ప్రభువు సత్యవ్రతుడు, దానిని తన కమండలంలోని నీళ్ళలోకి ఎక్కించి, తన నివాసానికి తీసుకెళ్ళాడు. ఆ చేప పిల్ల రాత్రి గడిచేసరికి పెరిగి కమండలం నిండి పోయింది. దానికి
ఉండటానికి కమండలంలో చోటు చాలక రాజుతో ఇలా అన్నది. “ఓ రాజేంద్రా! ఈ కమండలం నేను ఉండటానికి సరిపోదు. ఇంకొక దానిని తీసుకురా” అని చేప పిల్ల అంది. సత్యవ్రతుడు దానిని పెద్ద నీళ్ళ గంగాళంలోకి మార్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=700

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

కాళియమర్దనము – వారిజలోచనుఁ

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-699-ఆ.
రుడభీతి రమణద్వీప మొల్ల కీ
డువుఁ జొచ్చి తీవుత్పదాబ్జ
లాంఛనములు నీ తను నుంటఁజూచి యా
క్షిరాజు నిన్నుఁ ట్ట డింక."
10.1-700-వ.
అని యిట్లు విచిత్రవిహారుండైన గోపాలకృష్ణకుమారుం డానతిచ్చిన, నియ్యకొని, చయ్యన నయ్యహీంద్రుండు తొయ్యలులుం దానును నెయ్యంబున నయ్యీశ్వరునకు నవ్యదివ్యాంబరాభరణ రత్నమాలికానులేపనంబులు సమర్పించి, తేఁటితండంబులకు దండ యగు నీలోత్పలంబుల దండ యిచ్చి, పుత్ర మిత్ర కళత్ర సమేతుండై, బహువారంబులు కైవారంబుచేసి, వలగొని, మ్రొక్కి లేచి, వీడ్కొని రత్నాకరద్వీపంబునకుం జనియె; నిట్లు.
10.1-701-క.
వారిజలోచనుఁ డెవ్వరు
వారింపఁగలేని ఫణినివాసత్వంబున్
వారించిన యమున సుధా
వారిం బొలుపారె నెల్లవారికిఁ బ్రియమై.

టీకా:
గరుడ = గరుత్మంతుని వలన; భీతిన్ = భయముచేత; రమణక = రమణకము అనెడి; ద్వీపమున్ = ద్వీపముననుండుటకు; ఒల్లక = అంగీకరింపక; ఈ = ఈ యొక్క; మడువున్ = మడుగును; చొచ్చితివి = ప్రవేశించితివి; ఈవు = నీవు; మత్ = నా యొక్క; పద = పాదములనెడి; అబ్జ = పద్మముల; లాంఛనములు = గుర్తులు; నీ = నీ యొక్క; తలనున్ = పడగలపైన; ఉంటన్ = ఉండుటను; చూచి = చూసి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పక్షిరాజు = గరుత్మంతుడు; నిన్నున్ = నిన్ను; పట్టడు = పట్టుకొనడు; ఇంక = ఇకపైన.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; విచిత్ర = ఆశ్చర్యకరమైన; విహారుండు = వర్తనకలవాడు; ఐన = అయిన; గోపాల = గోపాలుడైన; కృష్ణకుమారుండు = బాలకృష్ణుడు; ఆనతిచ్చినన్ = సెలవియ్యగా, చెప్పగా; ఇయ్యకొని = అంగీకరించి; చయ్యన = శీఘ్రమే; ఆ = ఆ యొక్క; అహి = సర్ప; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; తొయ్యలులున్ = భార్యలు; తానును = అతను; నెయ్యంబునన్ = భక్తితో; ఆ = ఆ ప్రసిద్ధుడైన; ఈశ్వరున్ = కృష్ణున; కున్ = కు; నవ్య = సరికొత్త; దివ్య = భవ్యమైన; అంబర = బట్టలు; ఆభరణ = భూషణములు; రత్నమాలిక = రత్నాలహారములు; అనులేపంబులు = మేని పూతము; సమర్పించి = చక్కగానిచ్చి; తేటి = తుమ్మెదల; తండంబుల్ = బారుల; కున్ = కు; దండ = ఆవాసము; అగు = ఐన; నీలోత్ఫలంబుల = నల్లకలువల; దండ = దండను; ఇచ్చి = ఇచ్చి; పుత్ర = కొడుకులతోను; మిత్ర = స్నేహితులతోను; కళత్ర = భార్యలతోను; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; వారంబులు = మార్లు; కైవారంబులు = నమస్కారములు; చేసి = చేసి; వలగొని = ప్రదక్షిణలుచేసి; మ్రొక్కి = వంగి నమస్కరించి; లేచి = లేచి; వీడ్కొని = శలవుతీసుకొని; రత్నాకర = కడలిలోని {రత్నాకరము - రత్నములు ఉండు స్థానము, సముద్రము}; ద్వీపంబున్ = ద్వీపమున; కున్ = కు; చనియె = వెళ్ళిపోయెను.
వారిజలోచనుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; ఎవ్వరున్ = ఎవరుకూడ; వారింపగలేని = అడ్డుకొనలేని; ఫణిన్ = కాళియసర్పము యొక్క; నివాసత్వంబున్ = ఉనికిని; వారించినన్ = పోగొట్టగా; యమున = యమునానది; సుధా = అమృతపు; వారిన్ = నీటిని; పొలుపారెన్ = ఒప్పియుండెను; ఎల్లవారి = లోకులందర; కిన్ = కి; ప్రియము = ఇష్టమైనది; అయ్యి = అయ్యి.

భావము:
ఇంతకు ముందు గరుత్మంతుని వలన భయంతో రమణకద్వీపాన్ని వదలిపెట్టి ఈ మడుగులో చేరావు. కాని నా పాదాల గుర్తులు నీ పడగలమీద ఉండటం చూసి, ఇకపై పక్షిరాజైన గరుత్మంతుడు నిన్ను పట్టుకొనడు.”
ఈ విధంగా విచిత్రమైన నడవడికలు కలిగిన గోపాలుడైన బాలకృష్ణుడు కాళియుడిని ఆఙ్ఞాపించేడు. ఆ నాగరాజు వెంటనే అంగీకరించాడు. తన భార్యలతో కలిసి అతను కృష్ణుడికి సరికొత్త దివ్యవస్త్రాలు, ఆభరణాలు, రత్నహారాలు, సుగంధ మైపూతలు సమర్పించాడు. ఇంకా తియ్యటితేనెలు వెల్లివిరిసే నల్లకలువల దండ సమర్పించాడు. పెళ్ళంపిల్లలు స్నేహితులు అందరితో కలిసి అనేకమార్లు ఆ నందనందనునికి వందనాలు చేసాడు, ప్రదక్షిణలు చేసి, మొక్కాడు. సెలవుతీసుకొని సముద్రంలోని ఒక ద్వీపానికి వెళ్ళిపోయాడు.
కమలలాంటి కన్నులున్న కన్నయ్య ఎవరికి వారింప శక్యంకాని కాళియుడనే సర్పం నివాసాన్ని తొలగించగానే యమునానది అమృతం వంటి నీళ్ళతో అందరికి ప్రీతిపాత్రమై విలసిల్లింది.”


ఓం నమో భగవతే వా.దేవాయ
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనా స్సుఖినో భవంతు.


Monday, March 13, 2017

మత్స్యావతార కథ - 4:8-697-ఆ.
వలలు దారు నింక వచ్చి జాలరి వేఁట
కాఱు నేఱు గలఁచి కారపెట్టి
మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద;
రప్పు డెందుఁ జొత్తు? ననఘచరిత!
8-698-క.
భక్షించు నొండె ఝషములు
శిక్షింతురు ధూర్తు లొండెఁ; జెడకుండ ననున్
రక్షింపు దీనవత్సల!
ప్రక్షీణులఁ గాచుకంటె భాగ్యము గలదే? "

భావము:
ఓ పుణ్య చరితుడా! ఇంక చేపలు పట్టే జాలారి వాళ్ళు వలలు పట్టుకు వేస్తారు. నదిని కలతపెట్టి నన్ను పట్టుకుంటారు. తప్పించుకుని పోకుండా, మెడ పట్టుకుంటారు అప్పడు ఎక్కడకని పోగలను. ఓ దీనవత్సలా! సత్యవ్రతా! నన్ను పెద్ద చేపలు అయినా తినేస్తాయి. లేదంటే, ధూర్తులు అయిన జాలరులైనా పట్టుకుంటారు. అలా చచ్చిపోకుండా నన్ను కాపాడు. బలహీనులను కాపాడగలిగే అవకాశం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=698

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

కాళియమర్దనము – నిను నే శాసించిన కథ

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-697-క.
నిను నే శాసించిన కథ
మునఁ జింతించి రేపుమాపును గీర్తిం
చి మనుజులు నీ భయమును
విను మెన్నడు బొంద రెందు విషవిజయముతోన్.
10.1-698-మ.
ది మొద లెవ్వరైన నరు లీ యమునాతటినీ హ్రదంబులో
లక తోఁగి నన్ను నుపవాసముతోడఁ దలంచి కొల్చుచుం
లక దేవతాదులకుఁ గా జలతర్పణ మాచరించినన్
మలచిత్తులై దురితసంఘముఁ బాయుదు రా క్షణంబునన్.

టీకా:
నినున్ = నిన్ను; నే = నేను; శాసించిన = శిక్షించిన; కథ = వృత్తాంతము; మనమునన్ = మనసునందు; చింతించి = విచారించుకొని; రేపుమాపు = ప్రతిదినము; కీర్తించిన = స్తుతించినట్టి; మనుజులు = మానవులు; నీ = నీ వలన; భయమును = భీతిని; వినుము = వినుము; ఎన్నడున్ = ఎప్పుడును; పొందరు = పొందరు; ఎందున్ = ఎక్కడను; విష = విషమును; విజయము = జయించుట; తోన్ = తోటి.
ఇది = ఇప్పటి; మొదలు = నుంచి; ఎవ్వరు = ఎవరు; ఐనన్ = అయినను; నరులు = మానవులు; ఈ = ఈ యొక్క; యమునాతటిన్ = యమునానదివద్ద; ఈ = ఈ యొక్క; హ్రదంబు = మడుగు; లోన్ = అందు; వదలక = పూని; తోగి = స్నానముచేసి; నన్నున్ = నన్ను; ఉపవాసము = నిరాహారము; తోడన్ = తోటి; తలంచి = ధ్యానించి; కొల్చుచున్ = సేవించుచు; కదలక = స్థిరముగా; దేవతలు = దేవతలు; ఆదుల = మున్నగువారి; కున్ = కు; కాన్ = అగునట్లు; జలతర్పణము = నీటినితృప్తికైసమర్పించుట; ఆచరించినన్ = చేసినచో; సత్ = మిక్కలి; అమల = నిర్మలమైన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దురిత = పాపముల; సంఘమున్ = సముదాయమును; పాయుదురు = వదలివేసెదరు; ఆ = ఆ; క్షణంబునన్ = క్షణమునందే.

భావము:
నిన్ను నేను శిక్షించిన ఈ కథను మనస్సులో స్మరించి, ప్రతిరోజు పఠించే మనుషులు విషాన్ని జయించి సురక్షితంగా ఉంటారు. వారు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఇకపై మీ పాముల గురించి భయం పొందరు.
ఇప్పటి నుంచి ఈ యమునా నది మడుగులో స్నానంచేసి, ఉపవాసం ఉండి, నన్ను పూజించి, దేవతలు మొదలైన వారికి జలతర్పణాలు వదలిన వారెవరైనా ఆ క్షణంలోనే నిర్మలమైన మనస్సు కల వారు అవుతారు, వారి పాపాలన్నీ తత్క్షణమే తొలగి పోతాయి.