Saturday, August 31, 2019

కపిల దేవహూతి సంవాదం - 105


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1019-మ.
"సకలస్థావర జంగమప్రతతికిం జర్చింపఁ దా నాఢ్యుఁడై
యకలంకశ్రుతిగర్భుఁడుం బరముఁడున్నైనట్టి యీశుండు సే
వకయోగీంద్రకుమారసిద్ధమునిదేవశ్రేణియోగప్రవ
ర్తకమై తన్ను భజింపఁజూపు సగుణబ్రహ్మంబు లీలాగతిన్

భావము:
“సమస్త చరాచర ప్రాణికోటికి అధీశ్వరుడు, పవిత్రాలైన వేదాల పుట్టుటకు కారణభూతుడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమేశ్వరుడు యోగీంద్రులు, సనకాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు భక్తియోగంతో తనను భజింపగా వారికి సగుణస్వరూపంతో దర్శనమిస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1019

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 104


(చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1018-వ.
మఱియుఁ, బరమేశ్వరదృష్టిచే హిరణ్యగర్భు నుపాసించువారు సత్యలోకంబున ద్విపరార్థావసానం బగు ప్రళయంబు దనుకఁ బరుండగు చతురాననుం బరమాత్మరూపంబున ధ్యానంబు సేయుచు నుండి పృథి వ్యాప్తేజోవాయ్వాకాశ మానసేంద్రియ శబ్దాది భూతాదుల తోడం గూడ లోకంబును బ్రకృతి యందు లీనంబుసేయ సర్వేశ్వరుండు సకల సంహర్త యగు సమయంబున గతాభిమానంబులు గలిగి బ్రహ్మలోకవాసు లగు నాత్మలు బ్రహ్మతోడం గూడి పరమానందరూపుండును సర్వోత్కృష్టుండును నగు పురాణపురుషుం బొందుదురు; కావున నీవు సర్వభూత హృదయపద్మ నివాసుండును శ్రుతానుభావుండును నిష్కళంకుడును నిరంజనుండును నిర్ద్వంద్వుండును నగు పురుషుని భావంబుచే శరణంబు నొందు" మని చెప్పి మఱియు నిట్లనియె.

భావము:
ఇంకా పరమేశ్వరుడనే దృష్టితో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేవారు సత్యలోకంలో రెండు పరార్థాల కాలం తరువాత వచ్చే ప్రళయం వరకు పరుడైన చతుర్ముఖుని పరమాత్మ రూపంలో ధ్యానిస్తూ ఉంటారు. సర్వేశ్వరుడు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను, మనస్సును, పంచేంద్రియాలను, పంచతన్మాత్రలను, వాటితో కూడిన సమస్త ప్రకృతినీ, సకల లోకాలనూ తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు సత్యలోకంలో నివసించే ఆత్మస్వరూపులు బ్రహ్మతో కూడ పరమానంద స్వరూపుడూ, సర్వోత్కృష్టుడూ అయిన పురాణపురుషునిలో లీనమౌతారు. కాబట్టి అమ్మా! నీవు సకల ప్రాణుల హృదయ పద్మాలలో నివసించేవాడూ, మహానుభావుడూ, నిష్కలంకుడూ, నిరంజనుడూ, అద్వితీయుడూ అయిన పురుషోత్తముణ్ణి శరణుపొందు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1018

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, August 30, 2019

కపిల దేవహూతి సంవాదం - 103


( చంద్రసూర్య పితృ మార్గంబు )

3-1017-సీ.
మఱియు, నహంకార మమకార శూన్యులై; 
యర్థి వర్తించుచు నర్చిరాది
మార్గగతుండును మహనీయచరితుండు; 
విశ్వతోముఖుఁడును విమలయశుఁడు
జగదుద్భవస్థానసంహారకారణుం; 
డవ్యయుం డజుఁడుఁ బరాపరుండుఁ
బురుషోత్తముఁడు నవపుండరీకాక్షుండు; 
నైన సర్వేశ్వరు నందు బొంది
3-1017.1-తే.
మానితాపునరావృత్తి మార్గమయిన 
ప్రవిమలానంద తేజోవిరాజమాన
దివ్యపదమున సుఖియించు ధీరమతులు
మరలిరారెన్నఁటికిని జన్మములఁ బొంద

భావము:
ఇంకా అహంకార, మమకారాలను వదిలి ప్రవర్తిస్తూ వెలుగు త్రోవల పయనించేవాడూ, గొప్ప చరిత్ర కలవాడూ, విశ్వమంతా నిండినవాడూ, పవిత్రమైన కీర్తి కలవాడూ, లోకాల సృష్టి స్థితి లయలకు కారణమైనవాడూ, నాశనం లేనివాడూ, జన్మరహితుడూ, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడూ, పురుషోత్తముడూ, క్రొత్త తామరలవంటి కన్నులు కలవాడూ అయిన సర్వేశ్వరునిపై బుద్ధి నిలిపి, పునర్జన్మ లేని మహనీయమైన మార్గంలో స్వచ్ఛమై ఆనందమయమై తేజస్సుతో వెలిగిపోయే దివ్యపదాన్ని పొంది సుఖించే ధీరులు పునర్జన్మలను పొందడానికి ఎన్నటికీ భూమిపైకి తిరిగిరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1017

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 102


( చంద్రసూర్య పితృ మార్గంబు )

3-1014-వ.
అదియునుం గాక.
3-1015-తే.
ప్రవిమలానంత భోగితల్పంబు నందు
యోగనిద్రాళువై హరి యున్న వేళ
నఖిల లోకంబులును విలయంబు నొందు
నట్టి సర్వేశ్వరునిగూర్చి యలఘుమతులు.
3-1016-మ.
పరికింపన్ నిజభక్తి యుక్తిగరిమం బాటిల్లు పంకేరుహో
దరవిన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగముం
బరివర్జించి విశుద్ధచిత్తు లగుచుం బంకేజపత్రేక్షణే
తర ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారిఁ జింతించుచున్.

భావము:
అంతేకాక అత్యంత నిర్మలమైన ఆదిశేషుని పానుపుమీద హరి యోగనిద్రలో మునిగి ఉన్న సమయంలో సమస్త లోకాలూ ప్రళయాన్ని పొందుతాయి. అటువంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులైనవారు (ధ్యానిస్తారు). ఆ బుద్ధిమంతులు తమ భక్తిప్రపత్తులతో తమతమ ధర్మాలన్నింటినీ పద్మనాభునికే సమర్పించి, ప్రశాంత చిత్తులై, సర్వసంగ పరిత్యాగులై, పుండరీకాక్షుని ఆరాధన తప్ప ఇతర ధర్మాలనుండి దూరంగా ఉంటూ, నిత్యం ఆ దైత్యారినే ధ్యానిస్తూ (ఉంటారు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1016

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, August 27, 2019

కపిల దేవహూతి సంవాదం - 101


( చంద్రసూర్య పితృ మార్గంబు )

3-1013-సీ.
"గృహ మందు వర్తించు గృహమేధు లగువారు; 
మహిత ధర్మార్థకామముల కొఱకు
సంప్రీతు లగుచుఁ దత్సాధనానుష్ఠాన; 
నిరతులై వేదనిర్ణీత భూరి
భగవత్సుధర్మ తద్భక్తి పరాఙ్ముఖు; 
లై దేవగణముల ననుదినంబు
భజియించుచును భక్తిఁ బైతృక కర్మముల్; 
సేయుచు నెప్పుడు శిష్టచరితు
3-1013.1-తే.
లగుచుఁ దగ దేవ పితృ సువ్రతాఢ్యు లయిన
కామ్యచిత్తులు ధూమాదిగతులఁ జంద్ర
లోకమును జెంది పుణ్యంబు లుప్త మయిన
మరలి వత్తురు భువికి జన్మంబు నొంద.

భావము:
“సంసారానికి కట్టుబడిన గృహస్థులు ధర్మార్థకామాలపై ప్రీతి కలిగి వాటితోనే సంతుష్టులై వాటిని సాంధించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాలలో నిర్ణయింపబడిన భాగవత ధర్మాలకూ భగవద్భక్తికీ విముఖులై ఉంటారు. దేవగణాలను నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. పితృకార్యాలను భక్తితో చేస్తూ సదాచార సంపన్నులై ఉంటారు. కానీ ఇట్లా దేవతలకూ పితరులకూ సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై, కోర్కెలు నిండిన చిత్తం గలవారై ఉండి మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అచ్చట సుఖాలు అనుభవించి పుణ్యం తరిగి నశింపగా మళ్ళీ జన్మ ఎత్తడం కోసం భూలోకానికి వస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1013

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 100


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1012-వ.
అట్టి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్రీసంగంబుచే విత్తాపత్య గృహాదిప్రదం బగు స్త్రీత్వంబు నొందు; ఈ క్రమంబున నంగనా రూపుం డగు జీవుండు మన్మాయచేఁ బురుషరూపంబు నొంది ధనాదిప్రదుం డగు భర్తను నాత్మబంధకారణం బగు మృత్యువునుగ నెఱుంగ వలయు; మఱియు జీవోపాధిభూతం బగు లింగదేహంబుచే స్వావాస భూతలోకంబున నుండి లోకాంతరంబు నొందుచుం బ్రారబ్ద కర్మఫలంబుల ననుభవించుచు; మరలం గర్మాదులందాసక్తుఁ డగుచు మృగయుండు గాననంబున ననుకూల సుఖప్రదుం డైనను మృగంబునకు మృత్యు వగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయం బైన దేహంబు గలిగి యుండు; అట్టి దేహనిరోధంబె మరణంబు; ఆవిర్భావంబె జన్మంబునుం; గాన సకల వస్తువిషయ జ్ఞానంబు గలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రయం బగు ద్రష్టదర్శనీయ యోగ్యతాప్రకారంబున జీవునకు జన్మమరణంబులు లేవు; గావున భయకార్పణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవప్రకారంబు జ్ఞానంబునం దెలిసి ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ వైరాగ్యయుక్తం బైన సమ్యగ్జ్ఞానంబున మాయావిరచితం బైన లోకంబున దేహాదులం దాసక్తి మాని వర్తింప వలయు" నని చెప్పి; వెండియు నిట్లనియె.

భావము:
అటువంటి పురుషరూపాన్ని ధరించిన జీవుడు ఎడతెగని స్త్రీసాంగత్యంవల్ల భోగభాగ్యాలు, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిపై ఆసక్తి పెంచుకొని వచ్చే జన్మలో స్త్రీగానే జన్మిస్తాడు. ఈ విధంగా స్త్రీత్వాన్ని పొందిన జీవుడు నా మాయవల్ల పురుషరూపాన్ని పొంది ధనాదులను ఇచ్చే భర్తను సంసారబంధనానికి కారణంగా తెలుసుకోవాలి. ఈ సంసారబంధమే మృత్యువు. జీవునకు ఆధారంగా లింగమయ దేహం నిలిచి ఉంటుంది. ఆ లింగమయదేహంతో తనకు నివాసమైన ఈ లోకంనుండి వేరు లోకాలను పొందుతూ పూర్వకర్మలయొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, తిరిగి కర్మలపై ఆసక్తుడు అవుతూ ఉంటాడు. మనస్సుతో పంచభూతాలతో పంచేంద్రియాలతో ఏర్పడి సుఖ సాధనమైన దేహం క్రమంగా శుష్కించి నశిస్తుంది. అడవిలో వేటగాడు మృగాలకు గానాదులతో అనుకూలమైన సదుపాయాలు కూర్చేవాడైనా, అతడే మృగాలపాలిటికి మృత్యువుగా పరిణమిస్తాడు. అట్టి దేహాన్ని చాలించడమే మరణం. దానిని పొందడమే జననం. కనుక సకల వస్తువులకూ సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి జీవునకు సాధనం కన్ను. ద్రష్ట చూడదగిన దానిని చూడడం అనే యోగ్యత సంపాదించుకున్నప్పుడు జీవునకు పుట్టడం, గిట్టడం అనేవి ఉండవు. కాబట్టి మానవుడు పిరికితనాన్నీ, దైన్యభావాన్నీ వదలిపెట్టి, తొందర లేనివాడై, జీవుని స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకొని, ధైర్యం వహించి బంధనాలు లేనివాడై యోగ్యమైన వైరాగ్యంతో కూడిన చక్కని జ్ఞానాన్ని అలవరచుకోవాలి. మాయాకల్పితమైన ఈ లోకంలో దేహం మొదలైన వానిపై ఆసక్తి లేకుండా ఉండాలి” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1012

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, August 26, 2019

కపిల దేవహూతి సంవాదం - 99


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1010-క.
హరిమాయా విరచితమై
తరుణీరూపంబుఁ దాల్చి ధరఁ బర్విన బం
ధుర తృణపరివృత కూపము
కరణి నదియు మృత్యురూపకం బగు మఱియున్.
3-1011-చ.
ధన పశు మిత్ర పుత్ర వనితా గృహకారణభూత మైన యీ
తనువున నున్న జీవుఁడు పదంపడి యట్టి శరీర మెత్తి తా
ననుగతమైన కర్మఫల మందకపోవఁగరాదు మింటఁ బో
యిన భువిఁ దూరినన్ దిశల కేగిన నెచ్చట నైన డాగిఁనన్.

భావము:
నా మాయచేత కల్పించబడిన కామినీరూపం దట్టమైన గడ్డిచే కప్పబడిన కూపానికి అనురూపమై, మృత్యుస్వరూపమై ఉంటుంది. ఇంకా ధన్యధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైన ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి శరీరాన్ని మళ్ళీ ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1011

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 98


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1008-తే.
రూఢి నా మాయ గామినీరూపమునను
బురుషులకు నెల్ల మోహంబుఁ బొందజేయుఁ
గాన పురుషులు సతులసంగంబు మాని
యోగవృత్తిఁ జరించుచు నుండవలయు.
3-1009-క.
ధీరతతో మత్పదసర
సీరుహసేవానురక్తిఁ జెందినవారల్
నారీసంగము నిరయ
ద్వారముగా మనము లందు దలఁపుదు రెపుడున్.

భావము:
“నా మాయయే స్త్రీరూపంలో పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. కాబట్టి పురుషులు పరస్త్రీ సాంగత్యాన్ని పరిత్యజించి యోగమార్గంలో చరిస్తూ ఉండాలి. స్థిరబుద్ధితో నా పాదపద్మాలను సేవించడంలో ఆసక్తి కలవారు స్త్రీసాంగత్యాన్ని నరకద్వారంగా మనస్సులలో భావిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1009

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, August 24, 2019

కపిల దేవహూతి సంవాదం - 97


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1007-వ.
దీని కొక్క యితిహాసంబు గలదు; 'తొల్లి యొక్కనాడు ప్రజాపతి దన కూఁతు రయిన భారతి మృగీరూపధారిణి యై యుండం జూచి తదీయ రూపరేఖా విలాసంబులకు నోటువడి వివశీకృతాంతరంగుండును విగత త్రపుండును నై తానును మృగరూపంబు నొంది తదనుధావనంబు హేయం బని తలంపక ప్రవర్తించెం;' గావున నంగనాసంగమంబు వలవ; దస్మదీయ నాభికమల సంజాత చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత కశ్యపాది కల్పిత దేవ మనుష్యాదు లందు మాయా బలంబునం గామినీజన మధ్యంబున విఖండిత మనస్కుండు గాకుండఁ బుండరీకాక్షుండైన నారాయణఋషికిం దక్క నన్యులకు నెవ్వరికిం దీరదు" అని వెండియు నిట్లనియె.

భావము:
దీనికొక ప్రాచీన కథ ఉంది. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతి ఆడులేడి రూపాన్ని ధరించి ఉండగా చూచి, ఆమ సౌందర్య లావణ్యాలకు మురిసిపోయి, పరవశించిన హృదయంతో సిగ్గు విడిచి, తానుకూడ మగలేడి రూపాన్ని ధరించి నీచమని భావించకుండా ఆమె వెంటబడి పరుగులెత్తాడు. కాబట్టి పురుషునకు స్త్రీసాంగత్యం తగదు. నా నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ, అతనిచే సృష్టింపబడిన మరీచి ప్రముఖులు, వారికి పుట్టిన కశ్యపాదులు, వీరిచే కల్పించబడిన దేవతలు, మనుష్యులు, వీరందరిలోను చక్కదనాల చుక్కలైన రమణీమణుల మాయలకు చిక్కకుండా మొక్కవోని మనస్సు కలిగి ఉండడం అన్నది పుండరీకాక్షుడైన ఒక్క నారాయణ మహర్షికే తప్ప ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాదు” అని కపిలుడు మళ్ళీ ఇలా చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1007

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 96


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1006-సీ.
జనయిత్రి! సత్యంబు శౌచంబు దయయును; 
ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు 
క్షమయును యశమును శమమును దమమును; 
మొదలుగాగల గుణంబులు నశించు
జనుల కసత్సంగమున నని యెఱిఁగించి; 
వెండియు నిట్లను వినుము, మూఢ
హృదయులు శాంతి విహీనులు దేహాత్మ; 
బుద్ధులు నంగనా మోహపాశ
3-1006.1-తే.
బద్ధ కేళీమృగంబుల పగిదిఁ దగిలి
పరవశస్వాంతముల శోచ్యభావు లైన
వారి సంగతి విడువంగ వలయు నందు
నంగనాసంగమము దోష మండ్రు గాన.

భావము:
అమ్మా! దుర్మార్గుల సాంగత్యంవల్ల సత్యం, శుచిత్వం, దయ, ధ్యైర్యం, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం మొదలైన గుణాలన్నీ నశిస్తాయి” అని చెప్పి కపిలుడు తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. “మూఢ హృదయులు, శాంతి లేనివాళ్ళు, దేహమే ఆత్మ అని భావించేవాళ్ళు, స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని గొలుసులతో బంధించిన పెంపుడు మృగాలలాగా పరులకు వశమైన బుద్ధి కలవారు శోచనీయులు. అటువంటివారి సాంగత్యం వదలిపెట్టాలి. అందులోను స్త్రీసాంగత్యం బలీయమైన దోషం అని ప్రాజ్ఞులంటారు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1006

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, August 21, 2019

కపిల దేవహూతి సంవాదం - 95


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1005-వ.
దశమమాసంబున వాని నధోముఖుం గావించిన నుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులు లేక ఘన దుఃఖభాజనుండు విగత జ్ఞానుండు రక్తదిగ్భాగుండు నై విష్టాస్థక్రిమియుం బోలె నేలంబడి యేడ్చుచు జ్ఞానహీనుం డై జడుడునుం బోలె నుండి; యంత నిజ భావానభిజ్ఞు లగు నితరుల వలన వృద్ధిం బొందుచు నభిమతార్థంబులం జెప్పనేరక; యనేక కీటసంకులం బయిన పర్యంకంబు నందు శయానుండై; యవయవంబులు గండూయమానంబు లైనఁ గోఁకనేరక యాసనోత్థాన గమనంబుల నశక్తుండై; తన శరీరచర్మంబు మశక మత్కుణ మక్షికాదులు పొడువ గ్రిములచే వ్యధంబడు క్రిమియుంబోలె దోదూయమానుండై రోదనంబు సేయుచు విగతజ్ఞానుండై మెలంగుచు; శైశవంబునం దత్త త్క్రియానుభవంబుఁ గావించి పౌగండ వయస్సునఁ దదనురూపంబు లగు నధ్యయనాది దుఃఖంబు లనుభవించి; తదనంతరంబ యౌవనంబు ప్రాప్తం బైన నభిమతార్థ ఫలప్రాప్తికి సాహసపూర్వకంబు లగు వృథాగ్రహంబులు సేయుచుఁ గాముకుండై; పంచమహాభూతారబ్దం బగు దేహం బందుఁ బెక్కుమాఱు లహంకార మమకారంబులం జేయుచుఁ దదర్థంబులైన కర్మంబు లాచరించుచు సంసారబద్ధు డగచు దుష్పురుష సంగమంబున శిశ్నోదరపరాయణుండై వర్తించుచు నజ్ఞానంబునం జేసి వర్దిష్యమాన రోషుం డగుచుఁ; దత్ఫలంబు లగు దుఃఖంబు లనుభవించుచుఁ గాముకుండై నిజనాశంబునకు హేతువు లగు కర్మంబులం బ్రవర్తించు చుండు; మఱియును.

భావము:
పదవ నెలలో జీవుడు తలక్రిందుగా తిరిగి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఎంతో బాధపడుతూ జ్ఞానరహితుడై, నెత్తురు పులుముకున్న దేహంతో భూమిమీద పడి ఏడుస్తూ, ఎరుకలేనివాడై ఉండి, తన ఉద్దేశ్యం అర్థం చేసికోలేని ఇతరులచే పోషింపబడుతూ, తనకు కావలసిన దేదో చెప్పలేక, పెక్కు కీటకాలతో నిండిన ప్రక్కమీద పండుకొని, శరీరం దురద పుట్టినా గోకుకొనలేక, కూర్చోడానికి లేవడానికి నడవడానికి శక్తి చాలక, తన ఒంటి నిండా దోమలూ నల్లులూ ఈగలూ మొదలైనవి ప్రాకి కుడుతూ ఉంటే వారింపలేక, క్రిములచే పీడింపబడే క్రిమిలా బాధపడుతూ, ఏడుస్తూ, జ్ఞానం లేనివాడై మెలగుతూ, శైశవంలో ఆయా అవస్థలను అనుభవించి, బాల్యంలో విద్యాభ్యాసం మొదలైన వాటితో శ్రమపడి, ఆ తర్వాత యౌవనంలో తన కోర్కెలు తీర్చుకొనడం కోసం సాహసంతో కూడిన పనికిమాలిన పంతాలూ పట్టుదలలూ పూనుతూ, కామోద్రేకంతో ప్రవర్తిస్తూ, పంచభూతాత్మకమైన తన దేహంమీద మాటిమాటికీ అహంకార మమకారాలు పెంచుకుంటూ, అందుకు తగిన పనులు చేస్తూ, సంసార బంధాలలో కట్టుబడి, దుష్టుల స్నేహంవల్ల కామం పండించుకొనడం, కడుపు నిండించుకొనడంతోనే సతమతమౌతూ, అజ్ఞానియై పెచ్చు పెరిగిపోతున్న మచ్చరంతో దానికి ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తూ, కామాంధుడై, తన నాశనానికి మూలకారణమైన చెడుపనులను చేస్తూ ఉంటాడు. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1005

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 94


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1002-వ.
మఱియును.
3-1003-చ.
పరఁగుచు నున్న దుర్వ్యసనభాజనమై ఘన దుఃఖమూలమై
యరయఁగ బెక్కుతూంట్లు గలదై క్రిమిసంభవ మైనయట్టి దు
స్తర బహు గర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్
సరసిజనాభ భూరి భవసాగరతారక పాదపద్మముల్."
3-1004-క.
అని కృతనిశ్చయుఁ డయి యే
చిన విమలజ్ఞాని యగుచు జీవుఁడు గర్భం
బున వెడల నొల్లకుండం
జనియెడు నవమాసములును జననీ! యంతన్.

భావము:
ఇంకా ఈ గర్భనరకం అనేక వ్యసనాలకు నిలయమైనది. అంతులేని దుఃఖాలకు మూలమైనది. ఎన్నో రంధ్రాలు గలది. క్రిములకు జన్మస్థానమైనది. ఇటువంటి ఎన్నో గర్భవాసాల ఆపదను పోగొట్టడానికై సంసార సాగరాన్ని తరింపజేసే కమలనాభుని పాదపద్మాలను ఆశ్రయిస్తాను.’ తల్లీ! ఈ విధంగా నిశ్చయించుకొని అతిశయించిన నిర్మలజ్ఞానం కలవాడై, జీవుడు గర్భం నుండి వెడలిరాకుండా తొమ్మిది నెలలు అలాగే గడుపుతాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1003

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, August 19, 2019

కపిల దేవహూతి సంవాదం - 93


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1001-సీ.
"నెలకొని బహు దుఃఖములకు నాలయ మైన; 
యీ గర్భనరకము నేను వెడలఁ
జాల బహిఃప్రదేశమునకు వచ్చిన; 
ననుపమ దేవమాయా విమోహి
తాత్ముండనై ఘోరమైనట్టి సంసార; 
చక్ర మందును బరిశ్రమణశీలి
నై యుండవలయుఁ దా నదిగాక గర్భంబు; 
నందుండు శోకంబు నపనయించి
3-1001.1-తే.
యాత్మ కనయంబు సారథి యైన యట్టి
రుచిర విజ్ఞానమునఁ దమోరూపమైన
భూరి సంసారసాగరోత్తారణంబు
సేసి యీ యాత్మ నరసి రక్షించుకొందు.

భావము:
‘ఎన్నెన్నో దుఃఖాలకు నిలయమైన ఈ గర్భనరకం నుండి నేను బయట పడలేను. ఒకవేళ బయటకు వచ్చినా దేవమాయలకు లోనై వ్యామోహంతో భయంకరమైన సంసార వలయంలో చిక్కుకొని పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అందుకని ఈ గర్భశోకాన్ని పోగొట్టేదీ, ఆత్మను సారథియై నడిపించేదీ అయిన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకార బంధురమైన సంసార సాగరాన్ని దాటి ఆత్మను రక్షించుకుంటాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1001

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 92


( గర్భ సంభవ ప్రకారంబు )

3-999-ఆ.
దీనవదనుఁ డగుచు దేహి యీ దేహంబు
వలన నిర్గమింపఁ దలఁచి చనిన
నెలల నెన్నికొనుచు నెలకొని గర్భంబు 
వలన వెడలఁ ద్రోయువారు గలరె?'
3-1000-వ.
అని తలంచుచు "దీనరక్షకుం డయిన పుండరీకాక్షుండు దన్ను గర్భనరకంబువలన విముక్తునిం జేయ నమ్మహాత్మునికిఁ బ్రత్యుపకారంబు సేయలేమికి నంజలి మాత్రంబు సేయందగునట్టి జీవుండ నైన నేను శమదమాది యుక్తం బైన శరీరంబు నందు విజ్ఞానదీపాంకురంబునం బురాణపురుషు నిరీక్షింతును" అని మఱియు

భావము:
దైన్యంతో నిండిన ముఖం కలవాడై, ఆ గర్భనరకంనుండి బయటపడాలని భావిస్తూ, గడచిన నెలలు లెక్కించుకుంటూ ‘నన్ను ఈ గర్భంనుండి వెలువరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ’ అని తలపోస్తూ ‘దీనులను రక్షించే పుండరీకాక్షుడు ఒక్కడే నన్ను ఈ గర్భనరకం నుండి విముక్తుణ్ణి చేయగలడు. అయితే ఆ మహాత్మునకు నేను ప్రత్యుపకారం ఏమీ చేయలేను. చేతులు జోడించి నమస్కారం మాత్రమే చేయగలుగుతాను. నేను కేవలం జీవుడను. శమ దమాది గుణాలతో కూడిన రాబోయే జన్మలో విజ్ఞాన దీపాంకురాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో పురాణపురుషుణ్ణి చూస్తాను’ అనుకొని, మళ్ళీ ఇలా అనుకుంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1000

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, August 16, 2019

కపిల దేవహూతి సంవాదం - 91


( గర్భ సంభవ ప్రకారంబు )

3-997-వ.
"అట్టి యీశ్వరుండు గాలత్రయంబు నందును జంగమ స్థావరాంత ర్యామి యగుటంజేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించు వారు తాపత్రయ నివారణంబు కొఱకు భజియింతురు" అని చెప్పి మఱియు నిట్లనియె.
3-998-క.
"జనయిత్రి! గర్భ మందును
ఘన క్రిమి విణ్మూత్ర రక్త గర్తము లోనన్
మునుఁగుచు జఠరాగ్నిని దిన
దినమును సంతప్యమానదేహుం డగుచున్.

భావము:
“ఆ భగవంతుడు మూడు కాలాల్లోనూ చరాచర ప్రపంచంలోని సమస్త జీవరాసులలో అంతర్యామిగా ఉండడం వలన బ్రతుకు తెరువున పయనించేవారు తాపత్రయాలు తప్పించుకోవడానికై అతన్ని ఆరాధిస్తారు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “అమ్మా! జీవుడు తల్లి గర్భంలో క్రిములతో నిండిన మలమూత్రాల నెత్తురు గుంటలో మునుగుతూ, ఆకలి మంటలతో దినదినం తపించే దేహం కలవాడై...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=998

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :