8-237-క.
శిక్షింతు హాలహలమును
భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతుఁ బ్రాణి కోట్లను
వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!
8-238-వ.
అని
పలికిన ప్రాణవల్లభునకు వల్లభ "దేవా! దేవర చిత్తంబు కొలంది నవధరింతురు గాక!" యని పలికె"
నని
చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.
టీకా:
శిక్షింతున్ =
దండించెదను;
హాలాహలమున్ = హాలాహలవిషమును;
భక్షింతును = ఆరగించెదను;
మధుర =
తీయని; సూక్ష్మ = చిన్న;
ఫల = పండు; రసము = రసము;
క్రియన్ = వలె;
రక్షింతున్ =
కాపాడెదను; ప్రాణి = జీవ;
కోట్లను = జాలమును;
వీక్షింపుము = చూడుము;
నీవు =
నీవు; నేడు = ఇప్పుడు;
వికచాబ్జముఖీ = సుందరీ {వికచాబ్జముఖి - వికచ (వికసించిన)
అబ్జ (పద్మము) వంటి ముఖి (ముఖముగలామె),
అందమైన స్త్రీ}.
అని = అని; పలికిన =
అనిన; ప్రాణవల్లభున్ = భర్త;
కున్ = కు; వల్లభ = భార్య;
దేవా = దేవా;
దేవర =
ప్రభువు యొక్క;
చిత్తంబు = మనసు;
కొలందిన్ = ప్రకారము;
అవధరింతుగాక =
ధరింతురుగాక;
అని = అని; పలికెన్ = అనెను;
అని = అని; చెప్పిన = పలుకగా;
ఆ = ఆ; ముని = మునులలో;
ఇంద్రున్ = ఉత్తమున;
కున్ = కు; నరేంద్రుడు = రాజు;
ఇట్లు = ఈ
విధముగ; అనియె = పలికెను.
భావము:
వికసించిన పద్మం వంటి మోము గల సతీదేవీ! హాలాహలాన్ని దండిస్తాను.
చిన్న తియ్యని పండ్లరసంవలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం
సమస్తాన్ని కాపాడతాను. నువ్వు చూస్తూ ఉండు.”
ఇలా హాలాహలం మింగుతా అంటున్న తన భర్త అయిన భవునితో, ప్రియభార్య భవానీదేవి ఇలా అంటోంది. “స్వామీ! మీ మనస్సుకు తగినట్లు చేయండి.” ఇలా చెప్తున్న శుక మహర్షితో పరీక్షిన్మహారాజు
ఇలా అడిగాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment