Saturday, April 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౦(530)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1122-వ.
అని యివ్విధంబునం గృష్ణుం డాడిన సాభిప్రాయంబు లగు వాక్యంబులు విని; య మ్మునీంద్రులు విభ్రాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున క మ్మహాత్ము ననుగ్రహంబు వడసి, మందస్మితముఖులై, య ప్పుండురీకాక్షున కి ట్లనిరి “దేవా! నేమునుం దత్త్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢం బయిన నీ యిచ్ఛ చేత మమ్ము ననుగ్రహించితివి; భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లి మ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులఁ గానంబడు విధంబున నీవును మొదలఁ గారణరూపంబున నేకం బయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబునా నద్భుత కర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, దుష్టజన నిగ్రహంబును, శిష్టజన రక్షణంబును గావించు చుందు; వదియునుంగాక వర్ణాశ్రమధర్మంబు లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్స్వాధ్యాయ నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబు లందు వ్యక్తావ్యక్త స్వరూపంబు లేర్పడఁగా నుందువు; కావున బ్రాహ్మణకులంబు నెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన మహానుభావుండవు; మాయా జవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును దర్శింపం గంటిమి; మా జన్మ విద్యా తపో మహిమలు సఫలంబు లయ్యె; నీకు నమస్కరించెద” మని బహువిధంబులఁ గృష్ణు నభినందించి, య మ్మురాంతకుఁ జేత నామంత్రణంబులు వడసి తమతమ నివాసంబులకుం బోవందలంచు నవసరంబున.

భావము:
ఈలాగున, శ్రీకృష్ణుడు భావగర్భితంగా పలికిన మాటలు విని ఆ మునిశ్రేష్ఠులు విస్మయ హృదయులై, క్షణకాలం మౌనం వహించారు. వెనువెంటనే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొంది, చిరునవ్వు ముఖాలతో ఆయనతో ఇలా అన్నారు. “దేవా! మేము, ఉత్తమ తత్వవేత్త లైన బ్రహ్మరుద్రాదులు నీ మాయకు లోబడి ఉన్నాము. నిగూఢమైన నీ అభీష్టం మేరకు మమ్ము అనుగ్రహించావు. నీ చరిత్రము మిక్కిలి విచిత్రమైనది. ఈ భూమి ఒక్కటే అయ్యూ అనేక రూపాలతో ఎలా కనపడుతుందో అలా నీవు ఒక్కడివే అయినా అనేక రూపాలతో సృష్టిస్థితిలయాలు అనే అద్భుతకార్యాన్ని చేపట్టి, లీలావతారాలు ఎత్తి, దుష్టజనశిక్షణం శిష్టజనరక్షణం చేస్తూ ఉంటావు. అంతే కాకుండా, నీవు వర్ణాశ్రమధర్మాలను అంగీకరించి విరాట్పురుషరూపంతో వేదమార్గాన్ని స్పష్టం చేసిన బ్రహ్మస్వరూపుడవు. తపస్స్వాధ్యాయ నియమాల చేత పరిశుద్ధం అయినది నీ హృదయం. అందుకనే బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైన ఆకారంతో ఉంటున్నావు. కనుకనే, బ్రాహ్మణకులాన్ని రక్షించిన బ్రహ్మణ్యమూర్తివి; మహానుభావుడవు; మాయ అనే తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకమూ మేమూ దర్శించ గలిగాము; మా జన్మమూ, మా విద్యా, మా తపోమహిమా సార్ధకమయ్యాయి; నీకు నమస్కరిస్తున్నాము.” అని మునీంద్రులు బహు విధాల శ్రీకృష్ణుడిని ప్రశంసించి ఆయన వద్ద వీడ్కోలు పొంది తమతమ నివాసాలకు బయలుదేరు సమయంలో.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1122

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, April 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౯(529)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1121-సీ.
"ఆదిత్య, చంద్రాగ్ని, మేదినీ, తారాంబు-
  మారుతాకాశ, వాఙ్మనము లోలిఁ
బరికింపఁ దత్తదుపాసనంబులఁ బవి-
  త్రములుసేయఁగ సమర్థములు గావు;
సకలార్థగోచరజ్ఞానంబు గల మహా-
  త్మకులు దారు ముహూర్తమాత్ర సేవఁ
జేసి పావనములు సేయుదు; రదియు న-
  ట్లుండె ధాతుత్రయ యుక్తమైన
10.2-1121.1-తే.
కాయమం దాత్మబుద్ధియుఁ, గామినీ కు
మారులందు స్వకీయాభిమానములునుఁ,
దివిరి జలమునఁ దీర్థబుద్ధియునుఁ జేయు
నట్టి మూఢుండు పశుమార్గుఁ డనఁగఁ బరఁగు."

భావము:
తరచిచూస్తే, సూర్యచంద్రులు, భూమి, నక్షత్రాలు నీరు, గాలి, ఆకాశములను పూజించినా, అవి మానవుడిని పవిత్రం చేయలేవు. సమస్త విషయాలూ తెలిసిన విజ్ఞానులైన మహాత్ములు ముహుర్తమాత్రం సేవచేతనే మానవులను పవిత్రం చేస్తారు. వాటి మాటకేం గాని. వాతపిత్తశ్లేష్మ అనే త్రిధాతువుల మయమైన శరీరాన్ని ఆత్మ అనుకోవడం; భార్యాపుత్రులు ఆత్మీయులు అని భావించడం; సాధారణ నీటి వనరుని పుణ్యతీర్ధ మని భావించడం మూర్ఖుల లక్షణం. అట్టి మూర్ఖుడిని పశుమార్గంలో ప్రవర్తించేవా డని చెప్పవచ్చు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1121

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, April 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౮(528)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1120-వ.
అదియునుం గాక, యుదకమయంబులైన తీర్థంబులును; మృచ్ఛిలామయంబు లైన దేవగణంబులును; దీర్థదేవతారూపంబులు గాకుండుట లే; దయిననవి చిరకాల సేవనార్చనలంగాని పావనంబు సేయవు; సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబు సేయుదు" రని వెండియు.

భావము:
అంతేకాకుండా, తీర్ధాలూ నీళ్ళతో నిండి ఉంటాయి; దేవతా ప్రతిమలు మట్టిచేత, రాతిచేత చేయబడి ఉంటాయి; అవి కూడా పరమ పవిత్రాలే అయినా వాటిని చాలాకాలం సేవించి పూజిస్తే కాని ఫలితం చేకూరదు. కానీ సత్పురుషులు తమ దర్శనం మాత్రం చేతనే పావనం చేస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1120

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, April 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౭(527)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1119-సీ.
"సన్మునీశ్వరులార! జన్మభాక్కులమైన-
  మాకు నిచ్చోట సమ్మతిని దేవ
నికరదుష్ప్రాపులు నిరుపమయోగీంద్రు-
  లైన మీ దర్శనం బబ్బెఁ గాదె
ధృతి మందభాగ్యు లింద్రియపరతంత్రులు-
  నైన మూఢాత్ముల కనఘులార!
భవదీయ దర్శన, స్పర్శన, చింతన,-
  పాదార్చనలు దుర్లభంబు లయ్యు
10.2-1119.1-తే.
నేఁడు మాకిట సులభమై నెగడెఁ గాదె!
జగతిపైఁ దీర్థభూతులు సాధుమతులు
మిమ్ము దర్శించుటయు చాలు నెమ్మితోడ
వేఱ తీర్థంబు లవనిపై వెదక నేల?

భావము:
“మహామునిశ్రేష్ఠులారా! దేవతలకు సైతం లభించని మీ వంటి పరమ యోగీశ్వరుల దర్శనం మానవమాతృలైన మాకు ఇక్కడ లభించింది. దురదృష్టవంతులకు ఇంద్రియలోలురకు మూఢులకు మీవంటి పుణ్యాత్ముల దర్శనం, స్పర్శనం, చింతనమూ, పాదార్చనమూ దుర్లభ్యములు. అయినా ఇక్కడ మాకు అవి అతి సులభంగా ప్రాప్తించాయి. ఈ లోకంలో సాధువులు పవిత్ర తీర్థాల వంటి వారు. మిమ్మల్ని దర్శించటయే చాలు. వేరే పుణ్యతీర్ధాలు వెదకవలసిన అవసరం లేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1119

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౬(526)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1117-ఉ.
ధీరమతిన్ ద్విత, త్రితక, దేవల, సాత్యవతేయ, కణ్వులున్,
నారద, గౌతమ, చ్యవన, నాకుజ, గార్గ్య, వసిష్ఠ, గాలవాం
గీరస, కశ్య, పాసిత, సుకీర్తి, మృకండుజ, కుంభసంభవాం
గీరులు, యాజ్ఞవల్క్య, మృగ, శృంగ, ముఖాఖిల తాపసోత్తముల్‌.
10.2-1118-వ.
చనుదెంచినం గృష్ణుండు వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి వందనంబు లాచరించి వివిధార్చనలు గావించి యిట్లనియె.

భావము:
ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల తాపస శ్రేష్ఠులు ద్వారకానగరానికి కృష్ణ సందర్శనార్థం విచ్చేసారు. వచ్చిన ఆ మునీశ్వరులకు శ్రీకృష్ణుడు ఎదురేగి, నమస్కారాలు చేసి, యథావిధిగా పూజించి వారితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1117

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, April 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౫(525)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1115-చ.
బలవదరాతిమర్దనులఁ, బాండురనీలనిభప్రభాంగులం,
గలిత నిజాననాంబుజ వికాస జితాంచిత పూర్ణచంద్ర మం
డలులఁ, బరేశులన్, నరవిడంబనులం, గరుణాపయోధులన్,
విలసదలంకరిష్ణుల, నవీనసహిష్ణుల, రామకృష్ణులన్.
10.2-1116-వ.
సందర్శించు తలంపుల నందఱుఁ దమ హృదయారవిందంబులఁ బ్రేమంబు సందడిగొన నప్పుడు.

భావము:
బలరామకృష్ణులు బలవంతులైన శత్రువుల్ని నిర్మూలించడంలో సమర్థులు, పూర్ణచంద్రుడి శోభను మించిన చక్కదనాల మోముల వారు, సర్వాతీత ప్రభులు, లీలామానుషవిగ్రహులు, కరుణాసాగరులు, అలంకార ప్రియులు. వారిలో బలరాముడు తెల్లని వాడు, కృష్ణుడు నల్లని వాడు. ఆ రామకృష్ణులను సందర్శించాలనే కుతూహలం అందరి హృదయాలలో పొంగులువారుతుండేది. అలా అభిమానం ఉప్పొంగగా

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1115

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౪(524)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1114-వ.
ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖిల వస్తువిస్తారుం డయ్యును, నిజాధికారశుద్ధికొఱకు మరలఁ గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసుర విసరంబులు వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్త వస్తువులను గృష్ణునకు సమర్పించి, క్రమంబున సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె” నని చెప్పినఁ గుంతియు గాంధారియుఁ గృష్ణయు, నఖిల నృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, లీలామానుష విగ్రహుండును నైన పుండరీకాక్ష చరణారవింద స్మరణానంద పరవశలై కృష్ణుం బ్రశంసించి; రంత.

భావము:
మహా తేజోనిథి అయిన శ్రీకృష్ణుని అనుగ్రహం వలననే గొప్ప వైభవ సంపత్తులు మా నాన్నగారికి ప్రాప్తించాయి. అయినా తన అధికారానికి అనుగుణంగా కన్యారత్నంతోపాటు అనేక అనర్ఘరత్నాలను మాతండ్రి శ్రీకృష్ణుడికి సమర్పించాడు. బ్రాహ్మణోత్తములు ఆశీస్సులతో కొనియాడుతుండగా, మా తండ్రి బృహత్సేనుడు యథోచితంగా యాదవ ప్రముఖులను పూజించి తన నగరానికి తిరిగి వెళ్ళాడు." అంటూ లక్షణ తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదికి తెలిపింది. అంతట, గాంధారీ, కుంతీ, ద్రౌపదీ, తక్కిన రాజపత్నులూ గోపికలూ తమ తమ హృదయాలలో సర్వాంతర్యామి, లీలామానుష రూపుడు అయిన శ్రీకృష్ణుడి పాదపద్మాలను స్మరిస్తూ ఆనందంతో పరవశించారు. వాసుదేవుని ప్రస్తుతించారు. అటు పిమ్మట కొంతకాలానికి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=78&Padyam=1114

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, April 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౩(523)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1113-చ.
రణిత వినూత్న రత్న రుచిరస్ఫుట నూపుర, హార, కర్ణభూ
షణ, కటకాంగుళీయక, లసత్పరిధాన, కిరీట, తల్ప, వా
రణ, రథ, వాజి, హేతినికరంబులనుం, బరిచారికాతతిం
బ్రణుతగుణోత్తరుం డయిన పద్మదళాక్షున కిచ్చె నెమ్మితోన్.

భావము:
అలా ద్వారకకు వచ్చిన మాతండ్రి వినుతింప తగిన ఉత్తమగుణనిథి అయిన శ్రీకృష్ణునికి ప్రీతితో రకరకాలైన రత్నాభరణాలను, కిరీటాలను, హారాలను, నూపుర కేయూరాలను, అంగుళీయకాలను, పట్టుపాన్పులను, రథగజతురగాలను, ఖడ్గాది ఆయుధాలను, వేలాది పరిచారికలను బహుమానంగా ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=78&Padyam=1113

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, April 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౨(522)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1111-క.
హతశేషులు సొక్కాకుల
గతిఁ దూల నిశాతపవనకాండముల సము
ద్ధతి నేసి తోలి విజయో
న్నతుఁడై నిజనగరి కేగె నగధరుఁ డంతన్.
10.2-1112-వ.
అట్లు మహిత మంగళాలంకృతంబును, నతిమనోహర విభవాభిరామంబు నగు ద్వారకానగరంబున కరుగుదెంచిన మజ్జనకుండును బ్రియంబునఁ దోడన చనుదెంచి.

భావము:
చావుతప్పి బ్రతికిపోయినవారు ఎండుటాకుల్లాగా ఎగిరి నలుదిక్కులకూ పారిపోయేలా శ్రీకృష్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ విధంగా నాతోపాటు విజయాన్ని వరించి గిరిధారి నన్ను తీసుకుని ద్వారకకు చేరుకున్నాడు. ఆ విధంగా మేము సాటిలేని వైభవంతో ప్రకాశిస్తూ రమణీయంగా అలంకరించబడిన ద్వారకానగరానికి వస్తుంటే, మా వెనువెంట మా తండ్రి గారు బృహత్సేనుడు కూడా వచ్చారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=78&Padyam=1112

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, April 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౧(521)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1109-ఉ.
ఆ తఱి భూరిబాహుబలులైన విరోధి నరేశ్వరుల్‌ మృగ
వ్రాతము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న
ట్లాతురులై చతుర్విధ సమగ్ర బలంబులతోడఁ గూడి ని
ర్ధూత కళంకుఁడైన నవతోయజనేత్రునిఁ జుట్టు ముట్టినన్.
10.2-1110-చ.
అలిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్నకుం
డలములతో శిరంబులు, రణన్మణినూపురరాజితోఁ బదం
బులుఁ, గటకాంగుళీయక విభూషణచాప శరాలితోడఁ జే
తులు, నిలఁగూలఁగా విజయదోహలియై తునుమాడె వెండియున్

భావము:
ఆ తరుణంలో మహా బాహుబల విక్రములు అయిన ఆ రాజులందరూ చతురంగబలాలతో కూడి ఒక్కపెట్టున వనమృగాలు మృగేంద్రుని ఎదిరించిన రీతిగా నిర్మలుడు అయిన శ్రీకృష్ణుడిని చుట్టుముట్టారు. అది చూసి కృష్ణునికి మిక్కిలి ఆగ్రహం కలిగింది. ఆయన వజ్రాయుధానికి సాటివచ్చే వాడిబాణాలను ప్రయోగించాడు. కర్ణకుండలాలతో కూడిన శత్రురాజుల శిరస్సులూ, నూపురాలతో పాటూ పాదాలూ కంకణాలతో పాటు చేతులూ తెగి నేలపై కూలేలా చేసి శత్రువు లయిన సకల రాజులను నిర్మూలించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=78&Padyam=1110

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, April 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౦(520)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1107-వ.
అంత.
10.2-1108-చ.
సరసిజలోచనుండు నిజశార్‌ఙ్గశరాసనముక్త హేమ పుం
ఖరుచిరశాతసాయక నికాయములన్ రిపుకోటి నేసి సిం
ధురరిపు విక్రమప్రకట దోర్బలుఁడై విలసిల్లి యొత్తె దు
స్తర చలితాన్యసైన్యమును సజ్జనమాన్యముఁ బాంచజన్యమున్.

భావము:
అంతట శార్ఙ్గ్యము అనే తన ధనుస్సునుండి వెలువడుతున్న వాడి బంగారు బాణాలను శత్రు సైన్యంపై వేసి, తామర రేకుల వంటి కన్నులున్న కృష్ణయ్య సింహపరాక్రముడై విలసిల్లి, శత్రువులు భయభ్రాంతులు అయ్యేలా పాంచజన్యము అనే విజయశంఖం పూరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=78&Padyam=1108

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, April 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౯(519)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1104-చ.
తురగచతుష్కమున్ విమతదుర్దమశూరతఁ బూన్చి దారుకుం
డరదము రొప్ప శత్రునికరాంధతమః పటలప్రచండ భా
స్కరరుచి నొప్పునట్టి నిజకార్ముక యుక్తగుణప్రఘోష సం
భరిత దిగంతరుం డగుచుఁ బద్మదళాక్షుడు వోవుచుండఁగన్!

భావము:
సారథి దారుకుడు శూరత్వం ప్రకటిస్తూ నాలుగు గుఱ్ఱాలను రొప్పుతు రథాన్ని ముందుకు పరుగెత్తించాడు. అప్పుడు శత్రురాజులనే కారుచీకట్లకు సూర్యకిరణాల వంటి తన ధనుష్టంకారాలు దిగంతాలలో ప్రతిధ్వనింప జేస్తూ కలువరేకుల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుడి రథం వేగంగా సాగిపోతుండగా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1104

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, April 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౮(518)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1102-చ.
అమరగణంబుఁ దోలి యురగారి సుధాకలశంబుఁ గొన్న చం
దమున సమస్తశత్రువసుధావర కోటిఁ దృణీకరించి య
క్కమల విలోచనుండు ననుఁ గౌఁగిట నొప్పుఁగ జేర్చి సింహచం
క్రమణ మెలర్పఁ గొంచుఁ జనెఁ గాంచనచారు రథంబుమీఁదికిన్.
10.2-1103-వ.
అట్లు రథారోహణంబు సేసిన.

భావము:
దేవతలను పారద్రోలి గరుత్మంతుడు అమృతకలశాన్ని హరించినట్లు, సమస్త శత్రురాజ సమూహాన్ని ధిక్కరించి శ్రీకృష్ణుడు నన్ను చేరదీసి కౌగలిలో చేర్చి పట్టుకుని సింహగమనంతో తన కాంచనరథం మీదకి చేర్చాడు. అలా మేము రథం ఎక్కగానే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1102

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, April 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౭(517)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1099-వ.
అప్పుడు.
10.2-1100-చ.
కొలఁదికి మీఱఁగా డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, కా
హళ, మురళీ, మృదంగ, పణ, వానక, దుందుభి, ఢక్క, కాంస్య, మ
ర్దళ, మురజారజాది వివిధధ్వను లేపున భూనభోంతరం
బులఁ జెలఁగెన్ నటీనటనముల్‌ దనరారె మనోహరాకృతిన్.
10.2-1101-వ.
అంత.

భావము:
అలా నేను శ్రీకృష్ణుని వరించిన శుభసమయంలో డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, బాకా, మురళీ, మృదంగ, పణ, ఆనక, భేరీ, ఢక్క, తాళములు, మద్దెల, మురజ, అరజ మున్నగు నానావిధ మంగళ వాద్యాలు దిక్కులు పిక్కటిల్లేలా అతిశయించి మ్రోగాయి. నటీమణుల నృత్యాలు కన్నులపండువు చేశాయి. అప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1100

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, April 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౬(516)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1097-చ.
లలితపదాబ్జ నూపురకలధ్వనితో దరహాస చంద్రికా
కలిత కపోలపాలికలఁ గప్పు సువర్ణవినూత్న రత్నకుం
డల రుచులొప్పఁ గంకణఝణంకృతు లింపెసలార రంగ భూ
తలమున కేగుదెంచి ముఖతామరసం బపు డెత్తి చూచుచున్.
10.2-1098-చ.
నరపతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ
త్కరజలజాత దివ్యమణి కాంచనమాలిక నమ్మురారి కం
ధరమున లీలమై నిడి పదంపడి నవ్య మధూకదామ మా
హరికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్.

భావము:
అలా కదులుతుంటే కాలిఅందెలు ఘల్లు ఘల్లు మన్నాయి. పెదవులపై మందహాసం చిందులాడుతోంది. చెక్కుటద్దాలపై బంగారుకర్ణకుండలాల దీప్తులు మెరుస్తున్నాయి. మణికంకణాలు మధురంగా ధ్వనిస్తున్నాయి. అలా ఒయ్యారంగా రంగస్థలం మీదికి వెళ్ళి ముఖమెత్తి అటూ ఇటూ పరికించాను. రాజకుమారులను అందరినీ మనసులోనే తృణీకరించాను. నా చేతులలో ఉన్న దివ్యమైన మణులు పొదిగిన బంగారు హారాన్ని శ్రీకృష్ణుని మెడలో వేశాను. అలాగే నవ్య ఇప్పపూలదండతో ఆయన వక్షాన్ని అలంకరించాను. ఆ సమయాన నా కళ్ళల్లో సిగ్గు తొణికిసలాడింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1098

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, April 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౫(515)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1096-వ.
అయ్యవసరంబున నేనుం బరితుష్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు,నిందిందిర సన్నిభంబులగు చికురబృందంబులు విలసదలిక ఫలకంబునం దళుకులొలుకు ఘర్మజల కణంబులం గరంగు మృగమద తిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను మెఱుంగుగములు గిఱికొన నెఱిగౌను వడవడ వడంక నప్పుడు మందగమనంబున.

భావము:
అప్పుడు నాకు పరమానందం కలిగింది. ఒళ్ళంతా చెమర్చింది. చెమటకి తడిసి కరగిన నా నుదుటి కస్తూరితిలకంలో ముంగురులు అతుక్కున్నాయి. వాటిని నా మృదువైన చేతులతో సరిచేసుకుంటూ, మిసమిలలాడే నా సన్నని నడుము వడ వడ వణకుతుండగ, మందగమనంతో ముందుకు నడిచాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1096

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౪(514)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1095-చ.
సరసిజపత్త్రలోచనుఁడు చాపము సజ్యము సేసి యుల్లస
చ్ఛర మరిఁబోసి కార్ముకవిశారదుఁడై యలవోక వోలె ఖే
చరమగు మీనముం దునిమె సత్వరతన్ సుర సిద్ధ సాధ్య ఖే
చర జయశబ్ద మొప్పఁ బెలుచం గురిసెం దివిఁ బుష్పవర్షముల్‌.

భావము:
పద్మాలవంటి కన్నులు ఉన్న అందగాడు శ్రీకృష్ణుడు ధనువు ఎత్తి నారిని కట్టాడు. ఉల్లాసంగా ఆ శరమును నారికి సంధించాడు. విలువిద్యావిశారదుడై, విల్లెక్కుపెట్టి బాణం ప్రయోగించి అలవోకగా మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. దేవసిద్దసాధ్యాది ఖేచరుల జయజయ ధ్వానాలు ఎగసాయి. ఆకాశం నుండి పూలవాన కురిసింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1095

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, April 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౩(513)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1093-క.
అమరేంద్ర తనయుఁ డమ్మ
త్స్యము నేయ నుపాయ మెఱిఁగి తగ నేసియు మీ
నము ద్రుంపలేక సిగ్గున
విముఖుండై చనియె నంత వికలుం డగుచున్.
10.2-1094-వ.
ఇట్లు సకల రాజకుమారులుం దమతమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ.

భావము:
ఇంద్ర తనయుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించే ఉపాయం తెలిసినవాడే అయినా ఆ యంత్రాన్ని కొట్టలేక విఫలుడు అయి, సిగ్గుతో వికలమైన మనసుతో వెనుదిరిగాడు. ఇలా తమ ప్రయత్నాలు ఫలించలేకపోడంతో ముడుచుకున్న ముఖాలతో ఆ రాకుమారులు అందరూ దైన్యంతో చిన్నబోయి చూస్తూ ఉండగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1094

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, April 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౧(511)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1087-క.
సుందరతనులు దదుత్సవ
సందర్శన కుతుకు లమిత సైన్యులు భూభృ
న్నందను లేతెంచిరి జన
నందితయశు లగుచు మద్రనగరంబునకున్.
10.2-1088-క.
చనుదెంచిన వారికి మ
జ్జనకుఁడు వివిధార్చనములు సమ్మతిఁ గావిం
చిన నా బాహుబలాఢ్యులు
ధనువుం జేరంగ నరిగి ధైర్యస్ఫూర్తిన్.
10.2-1089-వ.
ఇట్లు డగ్గఱి యద్ధనువుం గనుంగొని. 

భావము:
సుందరాకారులైన ఆ రాజకుమారులు ఆ స్వయంవర ఉత్సవాన్ని తిలకించే కుతూహలంతో పెద్ద పెద్ద సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు. అలా విచ్చేసిన వారందరికి మాతండ్రి సంతోషంతో స్వాగతం పలికి సత్కరించాడు. బాహుబలసంపన్ను లైన ఆ రాజపుత్రులు ధైర్యంతో ధనువును సమీపించారు. అలా ఆ ధనుస్సు దగ్గరకు వెళ్ళి చూసిన మహా వీరులు... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1088 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

Friday, April 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౦(510)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1085-క.
ఈ సాయకంబు నారిం
బోసి వెసన్ మత్స్యయంత్రమున్ ధరఁ గూలన్
వేసిన శౌర్యధురీణుఁడు
నా సుత వరియించు" నని జనంబులు వినఁగన్.
10.2-1086-క.
చాటించిన నవ్వార్తకుఁ
బాటించిన సంభ్రమముల బాణాసన మౌ
ర్వీ టంకార మహారవ
పాటితశాత్రవులు బాహుబల సంపన్నుల్‌. 

భావము:
ఇదిగో ఈ బాణాన్ని వింటికి సంధించి, అదిగో ఆ మత్స్యయంత్రాన్ని పడగొడతాడో ఆ వీరుడినే నా పుత్రిక పరిణయమాడుతుంది.” అని అందరికి తెలిసేలా చాటింపు వేయించాడు. మా తండ్రి వేయించిన చాటింపును విలువిద్యలో ఆరితేరిన వీరులెందరో విన్నారు. వింటినారిని మ్రోగించడంలో మిన్నలు, మహా బాహుబల సంపన్నులు అయిన శాత్రవ వీరురెందరో విన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1086 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :