Wednesday, September 27, 2017

పోతన రామాయణం - 10

9-274-క.
ఇలమీఁద సీత వెదకఁగ
నలఘుఁడు రాఘవుఁడు పనిచె హనుమంతు నతి
చ్ఛలవంతున్, మతిమంతున్, 
బలవంతున్, శౌర్యవంతు, బ్రాభవవంతున్.
9-275-క.
అలవాటు కలిమి మారుతి
లలితామిత లాఘవమున లంఘించెను శై
వలినీగణసంబంధిన్
జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్.

భావము:
గొప్పవాడైన శ్రీరాముడు సీతజాడ వెతుకమని మిక్కలి చురుకైనవాడు, మహామహిమాన్వితుడు, గొప్ప బుద్దిమంతుడు, మిక్కలి బలశాలి, మహా వీరుడు అయిన హనుమంతుని నియోగించాడు. బాలునిగా సూర్యుని వరకు గెంతి మింగబోయిన అలవాటు ఉండడంతో మారుతి నదులు అన్నింటికీ బంధువు, భూమికి ఆకాశానికి వ్యవధానం, నీటితో నిండి ఉండేది అయిన సముద్రాన్ని మిక్కిలి లాఘవంగా దాటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=274

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, September 23, 2017

పోతన రామాయణం - 9

9-272-క.
నిగ్రహము నీకు వల దిఁక
నగ్రజు వాలిన్ వధింతు నని నియమముతో
నగ్రేసరుఁగా నేలెను
సుగ్రీవుం జరణఘాతచూర్ణగ్రావున్.
9-273-క.
లీలన్ రామవిభుం డొక
కోలం గూలంగ నేసె గురు నయశాలిన్
శీలిన్ సేవితశూలిన్
మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్.

భావము:
ఒక్క తన్నుతోనే బండరాళ్ళను పిండిపిండి చేయగల మహ బలశాలి సుగ్రీవుడికి, “ఇకపైన నీకు ఈ నిర్భందం అక్కరలేదు, మీ అన్న వాలిని సంహరిస్తాను” అని అభయం ఇచ్చి, శ్రీరామచంద్ర ప్రభువు పాలించాడు. గొప్ప నీతిశాలి, పరమశివ భక్తుడు, ఇంద్రుడు ఇచ్చిన మాల ధరించిన వాడిని, రావణుని గర్వాన్ని హరించినవాడు ఐన వాలిని, శ్రీరాముడు ఒకే ఒక బాణంతో కూల్చివేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=273

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, September 22, 2017

పోతన రామాయణం - 8

9-270-ఉ.
ఆ యసురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న
న్యాయము చేసి నిష్కరుణుఁడై కొనిపోవఁగ నడ్డమైన ఘో
రాయతహేతిఁ ద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద
త్తాయువుఁ బక్షవేగపరిహాసితవాయువు నజ్జటాయువున్.
9-271-వ.
అంతనా రామచంద్రుండు లక్ష్మణసహితుండై, సీత వెదక నరుదెంచి, నిజకార్యనిహతుండైన జటాయువునకుఁ పరలోకక్రియలు గావించి, ఋశ్యమూకంబునకుం జని.

భావము:
దయావిహీనుడైన రాక్షసరాజు అలా మోసం చేసి వేగంగా ఆకాశ మార్గాన సీతను తీసుకుపోతుంటే, రామకార్యం కోసం ఆయుస్సు త్యాగంచేసినది, వాయువేగాన్ని మించిన వేగం గలది అయిన జటాయువు అడ్డగించింది. నిస్సహాయురాలైన ఆ జటాయువును భయంకరమైన పెద్ద ఆయుధంతో రావణుడు సంహరించాడు. అప్పుడు, సీతాన్వెషణకై వచ్చిన రామలక్ష్మణులు, రామకార్యంలో ప్రాణాలు త్యజించిన ఆ జటాయువునకు, అంత్యక్రియలు చేసి, ఋశ్యమూకపర్వతానికి వెళ్ళారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=271

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, September 18, 2017

పోతన రామాయణం - 7

9-269-సీ.
ఆ వనంబున రాముఁ డనుజ సమేతుడై; 
సతితోడ నొక పర్ణశాల నుండ
రావణు చెల్లలు రతిఁ గోరి వచ్చిన; 
మొగి లక్ష్మణుఁడు దాని ముక్కు గోయ
నది విని ఖరదూషణాదులు పదునాల్గు; 
వేలు వచ్చిన రామవిభుఁడు గలన
బాణానలంబున భస్మంబు గావింప; 
జనకనందన మేని చక్కఁదనము
9-269.1-తే.
విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు
నర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యై నటించు
నీచు మారీచు రాముఁడు నెఱి వధించె
నంతలో సీతఁ గొనిపోయె నసురవిభుఁడు.

భావము:
శ్రీరాముడు తమ్ముడితో భార్యతో కలిసి దండకారణ్యంలో ఒక పర్ణశాలలో ఉన్నాడు. అప్పుడు రావణాసురుని చెల్లెలు శూర్పణక కామించి వచ్చింది. అంతట లక్ష్మణుడు ఆమె ముక్కు కోసేశాడు. అది విని ఖరుడు దూషణుడు అనే రాక్షసులు పద్నాలుగువేల మంది రాక్షససేనతో దండెత్తి వచ్చారు. శ్రీరామచంద్రుడు యుద్దంచేసి తన బాణాగ్నిలో వారిని భస్మం చేశాడు. సీత చక్కదనం విని మన్మథు పరవశుడైన రావణుడు మారీచుడిని పంపాడు. ఆ నీచుడు బంగారు లేడి రూపంలో రాగా, శ్రీరాముడు వాడిని వధించాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతను తీసుకుపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=269

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, September 16, 2017

పోతన రామాయణం - 6

9-267-క.
భరతున్ నిజపదసేవా
నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్
సురుచిర రుచి పరిభావిత
గురుగోత్రాచలముఁ జిత్రకూటాచలమున్.
9-268-ఉ.
పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

భావము:
తన పాదాసేవానురక్తుడైన భరతుడిని రాజ్య పాలన యందు నియమించాడు. పిమ్మట, కులపర్వతాలను మించిన రమణీయమైన కాంతులు గల చిత్రకూటపర్వతాన్ని రాజశేఖరుడు శ్రీరాముడు ఎక్కాడు. పుణ్యాత్ముడైన శ్రీరామచంద్రుడు అలా వెళ్ళి ఋషీశ్వరుల సమాశ్రయము, పురివిప్పి ఆడే నెమళ్ళతో మనోజ్ఞమైనది, పవిత్ర గోదావరీ జలాలతో విలసిల్లేది, గొప్ప చెట్లు పొదలుతో కూడినది ఐన విశిష్టమైన దండకారణ్యాన్ని సంతోషముతో దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=268

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, September 15, 2017

పోతన రామాయణం - 5

9-265-క.
దశరథుఁడు మున్ను గైకకు
వశుఁడై తానిచ్చి నట్టి వరము కతన వా
గ్దశ చెడక యడివి కనిచెను
దశముఖముఖకమలతుహినధామున్ రామున్.
9-266-క.
జనకుఁడు పనిచిన మేలని
జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్
జనపతి రాముఁడు విడిచెను
జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్.

భావము:
దశరథుడు ఇంతకు ముందు తాను కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి రావణుని ముఖ కమలాలకు చంద్రునివంటి వాడైన శ్రీరాముడిని అడవికి పంపించాడు. అయోధ్య రాజులచే పూజినీయమైనది. శత్రువులకు సాధింపరానిది. అట్టి అయోధ్యను తండ్రి ఆఙ్ఞను శిరసావహించి సీతాదేవి, లక్ష్మణుడు తనను సేవిస్తుండగా శ్రీరాముడు వదిలి పెట్టెను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=266

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, September 14, 2017

పోతన రామాయణం - 4

9-264-క.
రాముఁడు నిజబాహుబల
స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో
ద్దామున్ విదళీకృతనృప
భామున్ రణరంగభీము భార్గవరామున్.
9-265-క.
దశరథుఁడు మున్ను గైకకు
వశుఁడై తానిచ్చి నట్టి వరము కతన వా
గ్దశ చెడక యడివి కనిచెను
దశముఖముఖకమలతుహినధామున్ రామున్.

భావము:
శ్రీరాముడు తన భుజబలాతిశయంతో; గొడ్డలి ఆయుధం పట్టే గండరగండడిని, రాజలోకం అందరి రోషం పటాపంచలు చేసిన వాడిని, భీకరమైన యుద్ధం చేసేవాడిని, పరశురాముడిని భంగపరచాడు. దశరథుడు ఇంతకు ముందు తాను కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి రావణుని ముఖ కమలాలకు చంద్రునివంటి వాడైన శ్రీరాముడిని అడవికి పంపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=264

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, September 12, 2017

పోతన రామాయణం - 3

9-262-మ.
ఒక మున్నూఱు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షుచాపంబు బా
లకరీంద్రంబు సులీలమైఁ జెఱకుఁగోలం ద్రుంచు చందంబునన్
సకలోర్వీశులు చూడఁగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా
పక గేహంబున సీతకై గుణమణిప్రస్ఫీతకై లీలతోన్.
9-263-క.
భూతలనాథుఁడు రాముఁడు 
ప్రీతుండై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్.

భావము:
సుగుణాల ప్రోవు సీతాదేవి కోసం, ఆమె తండ్రి విదేహరాజు జనకుని ఇంట, రాజలోకం అందరు చూస్తుండగా, మూడువందల మంది కదలించి తీసుకువచ్చిన శివధనుస్సును, గున్న ఏనుగు అవలీలగా చెరుకు గడను విరిచినట్లు అతి సుళువుగా విరిచేసాడు. లోకనాయకుడు అయిన శ్రీరాముడు గొప్ప గుణవంతురాలు, అదృష్టవంతురాలు మఱియు చంద్రుని మించిన కాంతివంతమైన ముఖము కలిగిన సీతాదేవిని ప్రీతితో పెళ్ళిచేసుకొన్నాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=263

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, September 10, 2017

పోతన రామాయణం - 2

9-260-మ.
సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా
నవలీలం దునుమాడె రాముఁ డదయుండైబాలుఁడై కుంతల
చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకం దాటకన్.
9-261-క.
గారామునఁ గౌశిక మఖ
మా రాముఁడు గాచి దైత్యు నధికు సుబాహున్
ఘోరాజిఁ ద్రుంచి తోలెన్
మారీచున్ నీచుఁ గపటమంజులరోచున్.

భావము:
చిన్నపిల్లవాడుగా ఉండగా శ్రీరాముడిని తండ్రి యఙ్ఞం కాపాడటానికి మహర్షి విశ్వామిత్రుని వెంట పంపించాడు. అక్కడ ఉన్న రాకాసి తాటకి బంగారు రంగు జుట్టు కలది, కపట పలుకులతో నాటకాలు ఆడేది, సూర్యుని గుఱ్ఱాలను మించిన వేగం కలది. చేతిలో గొప్పడాలు కలది. అలాంటి తాటకిపై ఏమాత్రం దయ చూపకుండా శ్రీరాముడు దానిని సుళువుగా సంహరించాడు. శ్రీరాముడు భీకర యుద్ధంచేసి రాక్షసుడైన సుబాహుని చంపాడు. కపటవేషం వేసిన దుర్మార్గుడు మారీచుని తరిమికొట్టాడు. కౌశికుడు అను మరొక పేరు గల విశ్వామిత్రుని యాగాన్ని కాపాడాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=261

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, September 9, 2017

పోతన రామాయణం - 1

9-258-వ.
అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు, దీర్ఘబాహునకు రఘువు, రఘువునకుఁ బృథుశ్రవుండుఁ, బృథుశ్రవునకు నజుండు, నజునకు దశరథుండును, పుట్టి; రా దశరథునకు సురప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించె; తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; యైననుం జెప్పెద సావధానమనస్కుండవై యాకర్ణింపుము.
9-259-మ.
అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుండై నట్లు నారాయణాం
శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన
క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకుం గౌసల్యకున్ సన్నుతా
సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్.

భావము:
ఖట్వాంగుడికి దీర్ఘబాహుడు, దీర్ఘబాహునికి రఘువు, రఘువుకు పృథుశ్రవణుడు, పృథుశ్రవణునికి అజుడు, అజునికి దశరథుడు జన్మించారు. దేవతలు వేడగా పరబ్రహ్మ స్వరూపుడు నారయణుడు నాలుగు (4) రకాలుగ అయ్యి, ఆ దశరథునికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే పేర్లతో తన అంశతో అవతరించి పుట్టాడు. వారి కథను వాల్మీకి మున్నగు మహర్షుల వలన వివరింపబడింది. ఆ ఇతిహాసాన్ని చెప్తాను శ్రద్ధగా విను. తూర్పుదిక్కున నిండుచంద్రుడు ఉదయించినట్లు; పతివ్రత, పరిశుద్ధురాలు, సంసారసాఫల్యం పొందినామె, సాటిలేని సాధ్వీ ఐన కౌసల్యాదేవికి; గర్వాంథుడైన రావణుని తలలు నరకుటలో ఆరితేరినవాడు శ్రీరాముడు, విష్ణుమూర్తి అంశతో జన్మించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=259

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Wednesday, September 6, 2017

శ్రీ కృష్ణ జననం -33

10.1-113-క.
స్నానముచేయఁగ రామిని
నానందరసాబ్ధిమగ్నుఁడై విప్రులకున్
ధేనువులం బదివేలను
మానసమున ధారవోసె మఱి యిచ్చుటకున్.
10.1-114-వ.
మఱియు వసుదేవుండు.
10.1-115-క.
"ఈ పురిటియింటి కుద్య
ద్దీపంబును బోలి చాల దీపించె నిజం
బీ పాపఁడు నలు మొగముల
యా పాపని గనిన మేటి యగు" నని భక్తిన్.

భావము:
స్నానం చేయడం వీలుకాకపోవుట చేత ఆనంద రసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు బ్రాహ్మణులకు "పదివేల ఆవులు దానం చేస్తున్నాను" అని మానసికంగా ధారపోసాడు. ఇంకా వసుదేవుడు. ఇంకా వసుదేవుడు “పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ పాపడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని కన్న మహానుభావుడు అయిన విష్ణుమూర్తే.” అని అనుకొన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=11&padyam=113

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, September 5, 2017

శ్రీ కృష్ణ జననం - 32

10.1-109-క.
సుతుఁ గనె దేవకి నడురే
యతి శుభగతిఁ దారలును గ్రహంబులు నుండన్
దితిసుత నిరాకరిష్ణున్
శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్.
10.1-110-క.
వెన్నుని నతిప్రసన్నునిఁ 
గ్రన్నన గని మెఱుఁగుఁబోఁడి గడు నొప్పారెం
బున్నమనాఁడు కళానిధిఁ
గన్న మహేంద్రాశ చెలువు గలిగి నరేంద్రా! 
చంద్రుని షోడశ కళలు
10.1-111-వ.
అప్పుడు.
10.1-112-సీ.
జలధరదేహు నాజానుచతుర్బాహు; 
సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ; 
గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు; 
శ్రీవత్సలాంఛనాంచిత విహారు
నురుకుండలప్రభాయుత కుంతలలలాటు; 
వైడూర్యమణిగణ వరకిరీటు 
10.1-112.1-తే.
బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది
యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె.

భావము:
దేవకీదేవి అర్థరాత్రి వేళ నక్షత్రాలు గ్రహాలు అత్యంత శుభస్థానాలలో ఉండగా, రాక్షసులను శిక్షించేవాడు; ఆశ్రయించినవారి ముఖాలలో ఆనందం నింపేవాడు; జయశీలము గలవాడు; విశ్వం అంతా వ్యాపించి ఉండువాడు అయిన శ్రీమహావిష్ణువును ప్రసవించింది. ఓ పరీక్షిన్నరేంద్రా! శ్రీ మన్నారాయణుని ప్రసవించి దేవకి మెరుపు తీగలా మెరిసి పోతూ మిక్కిలి అందంగా ఉన్నది; ఆ సమయంలో, దేవకి నిండు పౌర్ణమినాటి పదహారు కళలతో నిండిన చంద్రుని కన్న తూర్పు దిక్కు అంత అందంగా ఉంది. అప్పుడు ఆ బాలుడు దివ్యరూపంతో వసుదేవునికి దర్శనమిచ్చాడు. అతడు నీలమేఘ వర్ణ దేహం కలిగి ఉన్నాడు; (మోకాళ్ళ వరకు) పొడవైన నాలుగు చేతులలో గద శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి; తామరరేకుల వంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి; కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి; అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది; చెవికుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి; వైడూర్య మణులు పొదగిన కిరీటం ధరించి ఉన్నాడు; పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు.; అతడు భక్తులందరిని రక్షించే వాడు; సృష్టిలోని సగుణాల పోగు; అతి విశాలమైన కరుణ కలవాడు; వసుదేవుడు ఆ హరిని కనుగొని చూసి పులకించి, ఆశ్చర్యంతో మైమరచి ఉప్పొంగి, ఉబ్బితబ్బిబయ్యాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=11&padyam=112

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::