Tuesday, October 31, 2017

కిండిల్ లో తెలుగు భాగవతము

కిండిల్ వాడుకరులారా, తెలుగుభాగవతం కిండిల్ లో అందుబాటులోకి వచ్చింది. పోతనను ఆస్వాదించండి.
ఈ క్లూ ఆర్ కోడు వాడండి లేదా క్రింది లింకు వాడండి.
http://telugubhagavatam.org/?library&Branch=AndroidApps&Fruit=KindleTeluguBhagavatamMonday, October 30, 2017

పోతన రామాయణం -  25

9-306-సీ.
కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో; 
నంసభాగంబుల నావరింప
సేసముత్యంబులు చెదరఁ గర్ణిక లూడఁ; 
గంఠహారంబులు గ్రందుకొనఁగ
వదనపంకజములు వాడి వాతెఱ లెండఁ; 
గన్నీళ్ళవఱద లంగములు దడుప
సన్నపు నడుములు జవ్వాడఁ బాలిండ్ల; 
బరువులు నడుములఁ బ్రబ్బికొనఁగ
9-306.1-ఆ.
నెత్తి మోఁదికొనుచు నెఱిఁ బయ్యెదలు జాఱ
నట్టు నిట్టుఁ దప్పటడుగు లిడుచు
నసురసతులు వచ్చి రట భూతభేతాళ
సదనమునకు ఘోరకదనమునకు.

భావము:
భూతభేతాళాలు తిరుగుతున్న ఆ భీకర యుద్దభూమికి తప్పటడుగులు వేస్తూ రాక్షస స్త్రీలు వచ్చారు. వారి జుట్టుముళ్ళు వదులైపోయాయి, పూలహారాల మూపులపై పరచుకొన్నాయి, పాపటముత్యాలు చెదిరిపోయాయి, కర్ణాభరణాలు ఊడిపోయాయి, మెడలో హారాలు చిక్కుపడిపోయాయి, మోములు వాడిపోయాయి, పెదవులు ఎండిపోయాయి, కన్నీళ్ళు వరదలు కట్టాయి, స్తనాల బరువుకు సన్నటి నడుములు జవజవలాడాయి, పైటలు జారిపోయాయి. వారు తలబాదుకొంటూ దుఃఖిస్తున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=306

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 24

9-304-క.
దశరథసూనుండేసిన
విశిఖము హృదయంబుఁదూఱ వివశుం డగుచున్
దశకంధరుండు గూలెను
దశవదనంబులను రక్తధారలు దొరఁగన్.
9-305-వ.
అంతనా రావణుండు దెగుట విని.


భావము:
శ్రీరాముడు వేసిన బాణం హృదయయాన్ని దూసుకుపోగా రావణుడు పది నోళ్లనుండి రక్తం కారుతుండగా నేలకూలాడు. అంతట ఆ రావణుడు మరణించడం విని....:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Sunday, October 29, 2017

పోతన రామాయణం - 23

9-301-క.
నీ చేసిన పాపములకు
నీచాత్మక! యముఁడు వలదు నేఁడిట నా నా
రాచముల ద్రుంచి వైచెద
ఖేచర భూచరులు గూడి క్రీడం జూడన్."
9-302-వ.
అని పలికి.
9-303-మ.
బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా
బ్రళయోగ్రానలసన్నిభం బగు మహాబాణంబు సంధించి రా
జలలాముండగు రాముఁడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా
బలవిద్రావణు వైరిదారజనగర్భస్రావణున్ రావణున్.

భావము:
ఓ నీచ రావణా! నీవు చేసిన దోషాలకు యమధర్మరాజు అక్కరలేదు. ఖేచర భూచరులు అందరూ చూస్తుండగా ఇవాళ ఇక్కడే నా బాణాలతో నిన్ను సంహరిస్తాను." అని పలికి ఆ రాజలలాముడైన శ్రీరాముడు గొప్పదైన ధనుష్టంకారాలు చెలరేగగా, పరుషంగా మాట్లాడే వాడు, దేవతల సైన్యాన్ని పారదోలే వాడిని, శత్రురాజుల భార్యల గర్భస్రావకారణుడు అయిన రావణుని తన ప్రళయాగ్నిసమ భీకరమైన తన బాణాలు ప్రయోగించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=303

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 22

9-299-వ.
ఇట్లు దివ్యరథారూఢుండయి రామచంద్రుండు రావణున కిట్లనియె.
9-300-మ.
"చపలత్వంబున డాఁగి హేమమృగమున్ సంప్రీతిఁ బుత్తెంచుటో
కపటబ్రాహ్మణమూర్తివై యబల నా కాంతారమధ్యంబునం
దపలాపించుటయో మదీయశితదివ్యామోఘబాణాగ్ని సం
తపనం బేగతి నోర్చువాఁడవు? దురంతంబెంతయున్ రావణా!


భావము:
ఈ విధంగా దివ్యరథం ఎక్కిన శ్రీరాముడు రావణునితో ఇలా అన్నాడు. “నాతో యుద్ధం చేయడమంటే చపలత్వంతో చాటునుంచి బంగారులేడిని పంపడం కాదు; బ్రాహ్మణుడిలా దొంగవేషంవేసుకొని ఆడమనిషిని అడవిలో దబాయించడం కాదు. ఓ రావణా! తిరుగులేని, వ్యర్థం కాడం అన్నది లేని నా వాడి బాణాగ్ని తాపం ఎలా ఓర్చుకోగలవో కదా.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Friday, October 27, 2017

పోతన రామాయణం - 21

9-297-వ.
అయ్యవసరంబున.
9-298-క.
సురపతిపంపున మాతలి
గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా
ధరణీవల్లభుఁ డెక్కెను
ఖరకరుఁ డుదయాద్రి నెక్కు కైవడి దోఁపన్.

భావము:
ఆ సమయంలో.... ఇంద్రుడు పంపగా ఇంద్రసారథి మాతలి బహు భవ్యమైన రథాన్ని తీసుకు వచ్చాడు. శ్రీరాముడు ఆ రథం ఎక్కాడు. అలా రాముడు ఎక్కుతుంటే, సూర్యుడు తూర్పుకొండ ఎక్కుతున్నట్లు అనిపించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=298

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 20

9-295-వ
అంత.
9-296-క.
తనవా రందఱు మ్రగ్గిన
ననిమిషపతివైరి పుష్పకారూఢుండై
యనికి నడచి రామునితో
ఘనరౌద్రముతోడ నంపకయ్యము చేసెన్.

భావము:
అప్పుడు తనవైపు ముఖ్య వీరులంతా మరణించగా, రావణుడు పుష్పకవిమానం ఎక్కి యుద్దానికి వెళ్ళి శ్రీరామునితో గొప్ప పౌరుషంతో యుద్దం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=296

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, October 19, 2017

పోతన రామాయణం - 19

9-293-ఆ.
రామచంద్రవిభుఁడు రణమున ఖండించె
మేటికడిమి నీలమేఘవర్ణు
బాహుశక్తిపూర్ణుఁ బటుసింహనాదసం
కుచిత దిగిభకర్ణుఁ గుంభకర్ణు.
9-294-క.
అలవున లక్ష్మణుఁ డాజి
స్థలిఁ గూల్చెన్ మేఘనాదుఁ జటులాహ్లాదున్
బలభేదిజయవినోదున్
బలజనితసుపర్వసుభటభావవిషాదున్.

భావము:
కుంభకర్ణుడు నల్లరంగు రాక్షసుడు, మహా పరాక్రమశాలి. అతను గట్టిగా బొబ్బ పెడితే దిగ్గజాల చెవులు దిమ్మెరపోతాయి. అంతటి కుంభకర్ణుడిని శ్రీరాముడు యుద్దంలో సంహరించాడు. నవ్వుకూడా భయంకరంగా ఉండేవాడు, అవలీలగా ఇంద్రుడిని జయించే వాడిని, తన భుజబలంతో దేవతా సైనికుల మనసులు కలత పెట్టువాడు అయిన మేఘనాథుడిని రణరంగంలో లక్ష్మణుడు కష్టపడి కూలగొట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=294

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Wednesday, October 18, 2017

పోతన రామాయణం - 18

9-291-వ.
అంత నయ్యసురేంద్రుండు పంచినఁ గుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ప్రముఖులగు దనుజవీరులు శర శరాసన తోమర గదాఖడ్గ శూల భిందిపాల పరశు పట్టిస ప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో బవరంబు చేయ సుగ్రీవ, పవనతనయ, పనస, గజ, గవయ, గంధమాదన, నీలాం గద, కుముద, జాంబవదాదు లా రక్కసుల నెక్కటి కయ్యంబు లందుఁ దరుల గిరులఁ గరాఘాతంబుల నుక్కడించి త్రుంచి; రంత.
9-292-క.
ఆ యెడ లక్ష్మణుఁ డుజ్జ్వల
సాయకములఁ ద్రుంచె శైలసమకాయు సురా
జేయు ననర్గళమాయో
పాయున్ నయగుణ విధేయు నయ్యతికాయున్.


భావము:
అంతట రావణుడు పంపించగా నికుంభుడు, ధూమ్రాక్షుడు, విరూపాక్షుడు, సురాంతకుడు, నరాంతకుడు, దుర్ముఖుడు, ప్రహస్తుడు, మహాకాయుడు మున్నగు రాక్షస వీరులు విల్లంబులు, కొరడాలు, గదలు, ఖడ్గాలు, శూలాలు, గుదియలు, గొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, రోకళ్ళు మున్నగు ఆయుధాలు పట్టి ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు ఎక్కి వచ్చి యుద్ధం చేసారు. సుగ్రీవుడు, ఆంజనేయుడు, పనసుడు, గజుడు, గవయుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, కుముదుడు, జాంబవంతుడు మున్నగు వీరులు; ఆ రాక్షసులను ద్వంద్వ యుద్దాలలో చెట్లు, కొండలు పిడికిటిపోట్లుతో కొట్టి సంహరించారు. అంతట. ఆ సమయంలో పర్వతసమ దేహుడు, దేవతలకు సైతం అజేయుడు, మాయోపాయుడు, నయగుణ విధేయుడూ అయిన అతికాయుడిని లక్ష్మణుడు ఉజ్జ్వలమైన బాణాలతో సంహరించాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=292


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
పోతన రామాయణం - 17

9-290-సీ.
ప్రాకారములు ద్రవ్వి పరిఖలు పూడిచి; 
కోటకొమ్మలు నేలఁ గూలఁ ద్రోచి
వప్రంబు లగలించి వాకిళ్ళు పెకలించి; 
తలుపులు విఱిచి యంత్రములు నెఱిచి
ఘనవిటంకంబులు ఖండించి పడవైచి; 
గోపురంబులు నేలఁ గూలఁ దన్ని
మకరతోరణములు మహిఁ గూల్చి కేతనం; 
బులు చించి సోపానములు గదల్చి
9-290.1-ఆ.
గృహము లెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి
భర్మకుంభచయము పాఱవైచి
కరులు కొలను చొచ్చి కలఁచిన కైవడిఁ
గపులు లంకఁ జొచ్చి కలఁచి రపుఁడు.

భావము:
మడుగులో ప్రవేశించిన ఏనుగులు కలచివేసినట్లు, వానర సేన లంక ప్రవేశించి అలా కలచివేసింది. ప్రహారీగోడలు తవ్వి, అగడ్తలు పూడ్చివేసి, బురుజులు నేల కూలగొట్టి, కోటలు పగులగొట్టి, గుమ్మాలు పీకేసి, తలుపులు విరగ్గొట్టి, యంత్రాలు చెరిచి, గువ్వగూళ్ళు పడగొట్టి, గోపురాలు కూలగొట్టి, మకరతోరణాలు నేలగూల్చి, జండాలను చింపేసి, మెట్లు కదిలించి, ఇళ్ళు బద్దలుకొట్టి, భవనాలు కూలగొట్టి, బంగారు కలశాలు పారేసి లంకను అల్లకల్లోలం చేసింది. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=290

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, October 15, 2017

పోతన రామాయణం - 16

9-287-వ.
అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునిం బూర్వప్రకారంబున నుండు పొమ్మని వీడుకొల్పెను; అంత.
9-288-క.
ఘన శైలంబులుఁ దరువులు
ఘనజవమునఁ బెఱికి తెచ్చి కపికులనాథుల్
ఘనజలరాశిం గట్టిరి
ఘనవాహప్రముఖదివిజగణము నుతింపన్.
9-289-వ.
ఇట్లు సముద్రంబు దాఁటి రామచంద్రుండు రావణు తమ్ముం డైన విభీషణుండు శరణంబు వేఁడిన నభయం బిచ్చి; కూడుకొని లంకకుఁ జని విడిసి వేడెపెట్టించి లగ్గలుపట్టించిన.

భావము:
అని సముద్రుడు మనవి చేసుకొనగా శ్రీరాముడు “ఇక వెళ్ళు ఇదివరకు లాగే ఉండు” అని పంపివేసాడు. అప్పుడు. శీఘ్రమే పెద్ద కొండరాళ్ళు, వృక్షాలు పెకిలించి తీసుకొచ్చి వానర జాతి నాయకులు సముద్రము మీద నిర్మించారు. ఇంద్రాది దేవతలు అందరూ స్తుతించారు. ఈ విధంగ సముద్రం దాటి శ్రీరాముడు తన అండ కోరిన శత్రువు రావణుని తమ్ముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. తన పరివారంలో కలుపుకున్నాడు. లంకానగరం వెళ్ళి విడిసి, చుట్టుముట్టి, ముట్టడించాడు. కోటలెక్కించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=288

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, October 13, 2017

పోతన రామాయణం - 15

9-284-క.
ధాతల రజమున దేవ
వ్రాతము సత్త్వమున భూతరాశిఁ దమమునన్
జాతులఁగా నొనరించు గు
ణాతీతుఁడ వీవు గుణగణాలంకారా!
9-285-క.
హరికి మామ నగుదు; నటమీఁద శ్రీదేవి
తండ్రి; నూరకేల తాగడింప? 
గట్టఁ గట్టి దాఁటు కమలాప్తకులనాథ! 
నీ యశోలతలకు నెలవుగాఁగ"


భావము:
సృష్టికర్తలను రజోగుణంతోను, దేవతలను సత్వగుణంతోను జీవజాలాన్ని తమోగుణంతోను పుట్టించే త్రిగుణాలకి అతీతమైన వాడవు. నీవు సకల సుగుణములకే అలంకారం వంటివాడవు. శ్రీరామ! విష్ణువు అయిన నీ భార్య లక్ష్మీదేవికి నేను తండ్రిని, అలాగ నీకు పిల్లనిచ్చిన మామను. అనవసరంగా నన్ను నిర్భందించడం, పీడించడం ఎందుకు. నీ కీర్తి తీగలు సాగేలా వారధి నిర్మించి దాటుము"


http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=285


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Monday, October 9, 2017

పోతన రామాయణం - 14

9-282-వ.
ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోఁ గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబు జొచ్చి యిట్లని స్తుతియించె.
9-283-శా.
"ఓ కాకుత్స్థకులేశ! యోగుణనిధీ! యోదీనమందార! నే
నీ కోపంబున కెంతవాఁడ? జడధిన్; నీవేమి భూరాజవే? 
లోకాధీశుఁడ; వాదినాయకుఁడ; వీ లోకంబు లెల్లప్పుడున్
నీ కుక్షిం బ్రభవించు; నుండు; నడఁగున్; నిక్కంబు సర్వాత్మకా!

భావము:
ఇలా ఆపదపాలైన సముద్రుడు నదులతో కలిసి రూపు ధరించి వచ్చి శ్రీరాముని పాదాలను శరణువేడాడు. ఇంకా ఈ విధంగా స్తోత్రం చేసాడు. “ఓయీ! కాకుత్స్థుని వంశ ప్రభువ! ఓ సుగుణనిధీ! ఓ దీనమందార! సర్వాత్మకా! శ్రీరామా! నేను జడస్వభావిని. నీ కోపాన్ని తట్టుకోలేను. నీవు ఏమైనా సామాన్యరాజువా? సకల జగత్తులకు విభుడవు. మూలపూరుషుడవు, ఎల్లప్పుడు నీ కడుపులో సకల భువనాలు సృష్టింపబడుతూ, మనుతూ, లయమవుతూ ఉంటాయి. ఇది సత్యం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=283

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 13

9-280-వ.
కని తనకుఁ ద్రోవ యిమ్మని వేఁడిన నదియు మార్గంబు చూపక మిన్నందిన నా రాచపట్టి రెట్టించిన కోపంబున.
9-281-క.
మెల్లని నగవున నయనము
లల్లార్చి శరంబు విల్లు నందిన మాత్రన్
గుల్లలు నాఁచులుఁ జిప్పలుఁ
బెల్లలునై జలధి పెద్ద బీడై యుండెన్.


భావము:
అలా సముద్రాన్ని చూసి తనకు దారి ఇవ్వమని కోరాడు. కాని సముద్రుడు దారి ఇవ్వకపోవడంతో, ఆ రాముడి కోపం పెరిగిపోయింది. చిరునవ్వుతో కళ్ళు చలింపజేసి ధనుర్బాణాలు తీసుకొన్న మాత్రంచేతనే సాగరం ఇగిరిపోయి; నత్తగుల్లలు, నాచులు, ఆల్చిప్పలు, మట్టపెళ్ళలు బైటపడి బీడుపడినట్లు మారిపోయింది.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Wednesday, October 4, 2017

పోతన రామాయణం - 12

9-278-వ.
ఇట్లు లంకాదహనంబు చేసివచ్చి వాయుజుండు సీతకథనంబు చెప్పిన విని రామచంద్రుండు వనచరనాథ యూధంబులుం దానును చనిచని.
9-279-శా.
ఆ రాజేంద్రుఁడు గాంచె భూరివిధరత్నాగారమున్ మీన కుం
భీరగ్రాహకఠోరమున్ విపుల గంభీరంబు నభ్రభ్రమ
ద్ఘోరాన్యోన్యవిభిన్నభంగభవనిర్ఘోషచ్ఛటాంభఃకణ
ప్రారుద్ధాంబరపారమున్ లవణపారావారముం జేరువన్.

భావము:
ఈ విధంగా లంకను కాల్చి, వెనుకకు వచ్చి హనుమంతుడు సీత వృత్తాంతం చెప్పగా విని, రామచంద్రుడు వానర సైన్యాలతో రావణాసురుడి మీదకు దాడికి బయలుదేరాడు. బహు రత్ననిధిగా ప్రసిద్ధమైనది, భీకరమైన చేపలు, మొసళ్ళు తిమింగలాలతో దాటరానిది, ఆకాశానికి ఎగిసిపడె అలలు కలది, నీటి తుంపరలతో ఆకాశపు అవధులు తాకేది, గంభీరమైన హోరు కలది అయిన ఆ లవణ సముద్రాన్ని దగ్గరగా ఆ రామ రాజశ్రేష్ఠుడు చూసాడు.
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 11

9-276-వ.
ఇట్లు సముద్రంబు దాఁటి సీతం గని, హనుమంతుండు దిరిగి చనుదెంచుచు నక్షకుమారాదుల వధియించి.
9-277-క.
సముదగ్రత ననిలసుతుం
డమరాహిత దత్త వాల హస్తాగ్నుల 
స్మము చేసె నిరాతంకన్
సముదాసురసుభటవిగతశంకన్ లంకన్.

భావము:
ఈ విధంగ సముద్రాన్ని దాటి సీతను కనుగొని హనుమంతుడు వెనుకకు వస్తూ అక్షకుమారుడు మున్నగు రాక్షసులను సంహరించాడు. మిక్కిలి గొప్పదనంతో వాయుపుత్రు డైన హనుమంతుడి తోక రాక్షసులు అంటించారు. ఆ తోక మంటలతోనే గట్టి రాక్షస సైనికుల రక్షణలో ఉన్న ఆ లంకానగరాన్ని హనుమంతుడు కాల్చివేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=277

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::