65- ఉ.
“నమ్మితి
నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల
మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి
గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! ని
న్నమ్మినవారి
కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
“తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని
మనస్పూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి
ఎప్పటికి హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!” అంటు గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది.
రుక్మిణికి కృష్ణుడు వచ్చేడని తెలుసు కాని ఇంకా కలవలేదు.
65- u.
“nammiti naa manaMbuna
sanaatanu laina yumaamahEshulan
mimmuM~ buraaNadaMpatula mElu bhajiMtuM~ gadamma! mETi pe
ddamma! dayaaMburaashivi gadamma! hariM batiM~ jEyu mamma! ni
nnamminavaari kennaTiki naashamu lEdu gadamma! yeeshvaree!”
నమ్మితిన్ = నమ్మినాను; నా = నా యొక్క; మనంబునన్ = మనసునందు; సనాతనులు = శాశ్వతులు; ఉమా = పార్వతీ {ఉమ
- అనత్యీత్యమా అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి}; మహేశులన్ = పరమేశ్వరులను {మహేశుడు - మహాంశ్ఛాసావీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి),
దేవతలలో శ్రేష్ఠుడు, శివుడు}; మిమ్మున్ = మిమ్ములను; పురాణదంపతులన్ = పురాతనమైన దంపతుల; మేలు = చక్కగా; భజింతున్ = పూజించెదను; కదా = కదా; అమ్మ = తల్లీ; మేటి = గొప్ప; పెద్ధమ్మ = పెద్దతల్లీ; దయా = దయకు; అంబురాశివి = సముద్రమువంటి ఆమెవు; కదా = కదా; అమ్మ = తల్లీ; హరిన్ = కృష్ణుని; పతిన్ = భర్తగా; చేయుము = కావింపుము; అమ్మ = తల్లీ; నిన్నున్ = నిన్ను; నమ్మిన = నమ్ముకొన్న; వారి = వారల; కిన్ = కి; ఎన్నటికిన్ = ఎప్పటికి; నాశము = చెరుపు; లేదు = లేదు; కద = కదా; అమ్మ = తల్లి; ఈశ్వరీ = పార్వతీదేవి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment