Wednesday, October 24, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 37

10.1-504-క.
ఇచ్చోఁ బచ్చిక మేసిన; 
విచ్చోఁ ద్రావినవి తోయ; మేగిన విచ్చో; 
నిచ్చోట మంద గొన్నవి; 
యిచ్చోఁ బాసినవి; జాడ యిదె యిదె యనుచున్.
10.1-505-క.
కంజదళాక్షుఁడు వెదకెను
గొంజక లేఁగల నపార గురుతృణవనికా
పుంజంబుల భీకర మృగ 
కుంజంబుల దరుల గిరులఁ గొలఁకుల నదులన్.
10.1-506-వ.
అంత.


భావము:
అలా వెళ్తూ కృష్ణుడు లేగల జాడ కనిపెట్టసాగాడు. “ఇవిగో ఇక్కడ పచ్చిక మేసాయి. ఇక్కడ నీరు త్రాగాయి. ఇదిగో ఇక్కడ మళ్లీ బయలుదేరాయి. ఇక్కడ ఒక్కచోటికి మందగా చేరాయి. ఇదిగో ఇక్కడ మంద విడిపోయాయి.” ఇలా చూసుకుంటూ కృష్ణుడు వెనుదీయకుండా లేగలను వెదుకసాగాడు. దట్టమైన అడవిలో పచ్చిక గుబురులలోనూ; భయంకర మృగాలుండే చెట్ల గుంపుల లోనూ; చెట్లవెనుక; పర్వతాలపైనా; కొలనుల చెంత; నదుల దగ్గర అంతటా వెదికాడు. అప్పుడు...



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, October 23, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 36

10.1-502-శా.
కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో
స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పింఛదామంబుతోఁ
బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ
దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్.
10.1-503-వ.
ఇట్లేగుచు.

భావము:
జులపాల జుట్టు చెవులదాకా వేళ్ళాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగరంలా మెరిసే కఱ్ఱ చేతిలో ఉంది. చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు. ఎఱ్ఱటి అర చేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసి పోతూ ఉంది. ఇలా గోపాల కృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళాడు. అలా దూడల జాడలకై వెళ్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=69&padyam=502

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, October 22, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 35

10.1-500-మ.
“వినుఁ డో! బాలకులార! క్రేపు లటవీవీధిన్ మహా దూరముం
జనియెన్ గోమల ఘాసఖాదన రతోత్సాహంబుతో నెందుఁ బో
యెనొ? యే మయ్యెనొ క్రూరజంతువులచే నే యాపదం బొందెనో? 
కని తెత్తుం గుడువుండు చల్ది గొఱఁతల్ గాకుండ మీ రందఱున్.”
10.1-501-వ.
అని చెప్పి,


భావము:
“ఓ మిత్రులారా! మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమైపోయి, ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి నట్లున్నాయి. ఎక్కడకి వెళ్ళాయో యే మయ్యాయో? ఏ క్రూరజంతువుల కైనా చిక్కి ఆపదలో పడ్డాయో? ఏమిటో? నేను వెదకి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి.” అని చెప్పి బయలుదేరాడు. ఇలా తన సహచరులకు చల్దులు తింటూ ఉండమని చెప్పిన కృష్ణుడు....



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, October 16, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 34

10.1-499-వ.
ఇట్లు కృష్ణసహితు లయిన గోపకుమారులు చల్దులు గుడుచునెడఁ గ్రేపులు మేపులకుం జొచ్చి, పచ్చని గఱికిజొంపంబుల గుంపుల కుఱికి, లంపులు మేయుచు, ఘోరంబగు నరణ్యంబు నడుమం దోరంబగు దూరంబు జనిన, వానింగానక వెఱచుచున్న గోపడింభకులకు నంభోజనయనుం డిట్లనియె.

భావము:
ఇలా ఇక్కడ కృష్ణుడితోపాటు గోపకుమారులు చల్దులు ఆరగిస్తుండగా, అక్కడ లేగదూడలు పచ్చికలు మేస్తున్నాయి. పచ్చని పచ్చికలున్న గుబుర్లలోనికి జొరబడి దొంగమేతలు మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపబాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించ లేదు. వారు కంగారు పడుతుంటే కృష్ణుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=68&padyam=499

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, October 15, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 33

10.1-497-వ.
అ య్యవసరంబున.
10.1-498-సీ.
కడుపున దిండుగాఁ గట్టిన వలువలో; 
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును; 
జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది; 
ముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు; 
వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి
10.1-498.1-ఆ.
సంగడీల నడుమఁ జక్కగఁ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.


భావము:
అలా చల్దులు గుడుస్తున్న ఆ సమయంలో యాగభోక్త అయిన శ్రీకృష్ణుడు దేవతలు అందరూ ఆశ్చర్య చకితులు అవుతుండగా మనోహర శైశవ చేష్టలు ప్రదర్శిస్తున్నాడు. పొట్టమీదకు దట్టీలా కట్టిన అంగవస్త్రంలో మనోజ్ఞమైన మురళిని ముడిచాడు. నిర్మలమైన కొమ్ముబూర, పశువుల తోలు కఱ్ఱలను ఎడం చంకలో చక్కగా ఇరికించి జారిపోకుండా పట్టుకున్నాడు. ఎడమ చేతిలో ఏమో మీగడ పెరుగు కలిపిన చద్దన్నం ముద్ద పట్టుకున్నాడు. కోరిమరీ తెచ్చుకున్న నంజుడు ఆవకాయ ముక్కలు వేళ్ళ మధ్య నేర్పుగా ఇరికించుకున్నాడు. తన తోటి పిల్లల మధ్య చక్కగా కూర్చుని వారితో ఒక ప్రక్క పరిహాసాలు ఆడుతున్నాడు. మరొక ప్రక్క చిరునవ్వులు రువ్వుతున్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, October 14, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 32

10.1-496-సీ.
మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు; 
నూరుఁగాయలు దినుచుండు నొక్క; 
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి; 
"చూడు లే" దని నోరు చూపునొక్కఁ; 
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి; 
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ; 
డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన; 
మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;
10.1-496.1-ఆ.
"కృష్ణుఁ జూడు" మనుచుఁ గికురించి పరు మ్రోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు; 
నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు నొక్కఁడు; 
ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు.

భావము:
ఎంత చక్కగా మురిపిస్తున్నాడో చూడండి మన పోతన కృష్ణుడు. – ఒక గొల్ల పిల్లాడు వ్రేళ్ళ మధ్యలో ఊరగాయ ముక్క ఇరికించుకొని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తిన్నాడు. ఇంకొక గోప బాలుడు పక్కవాడి కంచంలోది చటుక్కున లాక్కొని మింగేసి, వాడు అడిగేసరికి ‘ఏదీ ఏంలేదు చూడు’ అంటు తన నోరు చూపించాడు. మరొకడు పందాలు కాసి మరీ, ఐదారుమంది తినే చల్దులు నోట్లో కుక్కుకొని తినేసాడు. మరో పిల్లాడు ‘ఒరే ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, స్నేహ మంటే పంచుకోడంరా’ అంటు బంతెనగుండు లనే ఆట ఆడుతు తింటున్నాడు. ఇంకో కుర్రాడు ‘ఒరే కృష్ణుణ్ణి చూడు’ అని దృష్టి మళ్ళించి, మిత్రుడి ముందున్న మధుర పదార్థాలు తినేసాడు. మరింకో కుర్రాడు తాను నవ్వుతున్నాడు. ఇంకొకడు అందరిని నవ్విస్తున్నాడు. మరొకడు ముచ్చట్లాడుతున్నాడు. వేరొకడు ఉరికే మురిసిపోతున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=68&padyam=496

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, October 13, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 31

10.1-495-మ.
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్గోపార్భకుల్ భూవరా!


భావము:
ఓ పరీక్షిన్మహారాజా! తామర పువ్వు బొడ్డు చుట్టూరా వరుసలు వరుసలుగా రేకులు పరచుకొని ఉంటాయి. అలాగే చల్దులు తినడానికి కృష్ణుడు మధ్యన కూర్చున్నాడు. గోపకలు అందరు చూట్టూరా చేరి కూర్చుని కృష్ణుణ్ణే చూస్తున్నారు. వాళ్ళకి వేరే కంచాలు లేవు. రాతిపలకలు, తామరాకులు, వెడల్పైన గడ్డిపోచలుతోను లతలుతోను పొడుగాటి పొన్న పూలతోను అల్లిన చదరలు, తెచ్చుకున్న చిక్కాలు, వెడల్పైన ఆకులు వీటినే కంచాలుగా వాడుకుంటు అందరు చక్కగా చల్దులు ఆరగించారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 30

10.1-493-శా.
"ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ
దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం
దండంబై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?"
10.1-494-వ.
అనిన “నగుఁగాక” యని వత్సంబుల నుత్సాహంబున నిర్మలంబు లగు జలంబులు ద్రావించి, పచ్చికల మొల్లంబులుగల పల్లంబుల నిలిపి చొక్కంబులగు చల్దిచిక్కంబులు చక్కడించి.

భావము:
“మిత్రులారా! ఇప్పటికే ఎండలో మ్రగ్గిపోయారు ఆకలితో నకనకలాడుతున్నారు కదా. ఇంకా ఆలస్యం దేనికి? ఇది చల్దులు తినడానికి అనువైన అందమైన చోటు. లేగదూడల మందలు ఈ కొలనులో నీరు త్రాగి ఈ ప్రక్కనే ఉన్న పచ్చికబయళ్ళులో స్వేచ్ఛగా మేస్తూ విహరిస్తూ ఉంటాయి. మరి మనం హాయిగా చల్దులు ఆరగిద్దాం. ఏమంటారు?” కృష్ణుడిలా అనగానే గోపబాలకులందరూ సరే అన్నారు. లేగదూడలకు నిర్మలమైన నీటిని త్రాగించి, చిక్కని పచ్చికబయళ్ళులో మేతకు వదలిపెట్టారు. నోరూరించే చల్దులను చిక్కాలనుంచి బయటకు తీసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=68&padyam=493

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, October 9, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 29

10.1-484-క.
తన రూ పొకమా ఱైనను
మనమున నిడుకొనినఁ బాపమయు నైనను లోఁ
గొనిచను హరి తను మ్రింగిన
దనుజునిఁ గొనిపోవకున్నె తనలోపలికిన్?

భావము:
శ్రీహరి తన రూపాన్ని ఒక్కసారైనా మనస్సులో నిలుపుకుంటే ఎంతటి పాపాత్ముడి నైనా తన లోనికి స్వీకరిస్తాడు. అటువంటిది తననే మ్రింగిన రాక్షసుని తన లోనికి స్వీకరించడా మరి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=484

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, October 6, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 28

10.1-482-ఆ.
అమరవరులకొఱకుఁ గమలజాండం బెల్ల
బలిఁ దిరస్కరించి బలియు వడుగు
గోపసుతులకొఱకుఁ బాపపుఁ బెనుబాము
గళము దూఁటుగట్ట బలియకున్నె?
10.1-483-ఉ.
ఆ పెనుబాము మేన నొక యద్భుతమైన వెలుంగు దిక్తటో
ద్దీపకమై వడిన్ వెడలి దేవపథంబునఁ దేజరిల్లుచున్
క్రేపులు బాలురున్ బెదరఁ గృష్ణుని దేహము వచ్చి చొచ్చె నా
పాపఁడు చొచ్చి ప్రాణములఁ బాపిన యంతన శుద్ధసత్వమై.

భావము:
వామనమూర్తిగా దేవతల కోసం బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండం అంతా ఆక్రమించిన ఈ కృష్ణమూర్తి; అమాయకులైన గోపబాలకుల కోసం పాపిష్టి పాము గొంతుక బ్రద్దలై పగిలిపోయేలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? అలా కృష్ణుడు సహచరులతో బయటకు వచ్చిన ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. అంతటి పాపిష్టి పాము తన దేహంలోకి కృష్ణుడు ప్రవేశించి ప్రాణాలు తీయగానే శుద్ధతత్త్వమయం అయిపోయింది. దిక్కులు వెలిగిపోయే టంత అద్భుతమైన వెలుగువలె వేగంగా వెలువడి ఆకాశంలో వెలుగుతూ వచ్చి కృష్ణుని శరీరంలో ప్రవేశించింది. అది చూసిన గోపబాలురు లేగలతో పాటు బెదరిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=483

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, October 2, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 27

10.1-480-క.
ఊపిరి వెడలక కడుపున
వా పొదవినఁ బాము ప్రాణవాతంబులు సం
తాపించి శిరము వ్రక్కలు
వాపికొనుచు వెడలి చనియెఁ బటు ఘోషముతోన్.
10.1-481-శా.
క్రూరవ్యాళ విశాల కుక్షిగతులన్గోవత్ససంఘంబుతో
గారుణ్యామృతవృష్టిచేత బ్రతుకంగాఁ జూచి వత్సంబులున్
వారుం దాను దదాస్యవీధి మగుడన్ వచ్చెన్ ఘనోన్ముక్తుఁడై
తారానీకముతోడ నొప్పెసఁగు నా తారేశు చందంబునన్.


భావము:
ఆ పాముకు ఊపిరి ఆడలేదు. లోపల చేరిన గాలి బయటకి వెళ్ళక కడుపు ఉబ్బిపోసాగింది. ప్రాణవాయువులు లోపల తుకతుక లాడాయి. అవి వ్యాకోచించి చివరకు పాము తల పెద్దశబ్దంతో పేలి పగిలి పోయి వాయువులు బయటకు వచ్చేశాయి. క్రూరసర్పం కడుపులో ఇరుక్కుపోయిన గోపబాలురు, లేగదూడలతోసహా కృష్ణుడు తన కరుణ అనే అమృత వర్షంతో బ్రతికించాడు. ఆ పాము నోటిలోనుంచి తాను, తనతోపాటు గోపబాలురు, లేగదూడలు కూడా బయటకు వస్తూ ఉంటే ఆవరించిన మేఘాలు విరిసిపోగానే చంద్రుడు నక్షత్రాలతో బయటపడినట్లుగా ఉంది.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Monday, October 1, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 26

10.1-478-ఉ.
“పడుచులు లేఁగలుం గలసి పైకొని వత్తురు తొల్లి కృష్ణ! మా
కొడుకు లదేల రా; రనుచు గోపిక లెల్లను బల్క నేక్రియన్
నొడివెద? నేఁడు పన్నగము నోరికి వీరికి నొక్కలంకెగా
నొడఁబడ నేలచేసె? విధి యోడక జేయుఁగదయ్య! క్రౌర్యముల్.”
10.1-479-వ.
అని తలపోసి, నిఖిలలోచనుండును, నిజాశ్రిత నిగ్రహమోచనుండు నైన తమ్మికంటి, మింటి తెరువరులు మొఱలిడ రక్కసు లుక్కుమిగుల వెక్కసంబగు నజగరంబయి యున్న య న్నరభోజను కుత్తుకకుం బొత్తుగొని మొత్తంబు వెంటనంటం జని తమ్ము నందఱఁ జిందఱ వందఱ చేసి మ్రింగ నగ్గలించు నజగరంబు కంఠద్వారంబున సమీరంబు వెడలకుండఁ దన శరీరంబుఁ బెంచి గ్రద్ధన మిద్దెచఱచి నట్లుండ.

భావము:
“నేను ఇంటికి వెళ్ళేసరికి గోపికలు ఎదురు వస్తారు. “కృష్ణా! ఇంతవరకూ మా పిల్లలూ లేగదూడలు కలసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు ఇవాళ మా కొడుకులు రారేమిటి? ఏమయ్యారు?” అని అడుగుతారు వారికి నేనేమి జవాబు చెప్పగలను. విధి ఈ రోజు వీరిని గుత్తగుచ్చినట్లు పాము నోటికి అప్పగించింది. ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడూ ఇలాంటి క్రూరకృత్యాలే చేస్తాడేమిటో?”
ఇలా భావించిన కృష్ణుడు సర్వమూ చూడగలవాడు; అందరి చూపూ తానే అయిన వాడు; తనను ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు; తామరరేకుల వంటి కన్నులు కలవాడు కనుక. దేవతలు కూడా మొరలు పెట్టేలాగ, రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడేలాగ, ఆ రాక్షసుడు కొండచిలువ రూపంతో బాలకులను లేగదూడలను మ్రింగుతూ ఉంటే కృష్ణుడు కూడా వారివెనుకనే లోపలికి ప్రవేశించాడు. ఆ కొండచిలువ నాలుకలతో అందరిని చిందరవందరచేసి మింగడానికి ప్రయత్నించుతూ ఉంటే; కృష్ణుడు కంఠద్వారం దగ్గర చేరి తన శరీరాన్ని విపరీతంగా పెంచి దిమ్మిస కొట్టినట్లు అక్కడ గొంతుకలో ఇరుక్కున్నాడు. ఇక పాముకు ఊపిరి వెళ్ళే దారి మూసుకు పోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=478

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :