Saturday, June 30, 2018

శ్రీకృష్ణ లీలలు -౩౬

10.1-353-సీ.
"అవనీశ! విను ద్రోణుఁ డనువాఁడు వసువుల; 
యందు ముఖ్యుఁడు; ధర యతని భార్య; 
వారి నిద్దఱ బ్రహ్మ వసుధపై జన్మించు; 
డంచుఁ బంపిన వార లతనిఁ జూచి
"విశ్వేశ్వరుండైన విష్ణుసేవారతి; 
మా కిచ్చితేనిని మహి జనింతు"
మనవుడు "నట్ల కా" కనియె వేల్పులపెద్ద; 
యా ద్రోణుఁ డీ నందుఁడై జనించె
10.1-353.1-ఆ.
ధర యశోద యయ్యె; దనుజేంద్రవైరియుఁ
గమలగర్భుమాట గారవించి
తల్లిదండ్రు లనుచుఁ దగ వారి మన్నించె; 
నధిక భక్తితోడ నలరి రిట్లు.

భావము:

"ఓ పరీక్షిత్తు మహారాజా! చెప్తాను విను! వసువులు అనే దేవతలలో "ద్రోణుడు" అనేవాడు ముఖ్యుడు; అతని భార్య "ధర"; బ్రహ్మదేవుడ ;వారిద్దరినీ భూలోకంలో జన్మించమని ఆదేశించాడు; "విశ్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవించే భాగ్యం ప్రసాదించినట్లు అయితే అలాగే భూమిపై జన్మిస్తాము" అన్నారు ఆ దంపతులు; బ్రహ్మదేవుడు "అలాగే" అని అనుగ్రహించాడు; ఆ ద్రోణుడు అనే వసువే ఈ నందుడుగా జన్మించాడు, ధరాదేవి అనే వసువే యశోద; శ్రీమన్నారాయణుడు కూడా బ్రహ్మదేవుని మాట మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించాడు; ఎంతో భక్తితో, సంతోషంతో గౌరవించాడు;

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=50&padyam=353

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, June 29, 2018

శ్రీకృష్ణ లీలలు - ౩౫

10.1-351-క.
ప్రబ్బిన భక్తిని హరిపైఁ
గబ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ
కబ్బుదు రట! హరిపోషణ
మబ్బిన తలిదండ్రు లెచటి కబ్బుదురొ? తుదిన్."
10.1-352-వ.
అనిన విని రాజయోగికి శుకయోగి యిట్లనియె.


భావము:
కవీశ్వరులు ఎంతో భక్తితో శ్రీమహావిష్ణువు మీద కావ్యాలు వ్రాసి, మోక్షలక్ష్మీకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి ఆ విష్ణుమూర్తినే కని, పెంచి, పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి చేరుతారో?” అని రాజయోగి అయిన పరీక్షిన్మహారాజు అడుగగా, యోగిబ్రహ్మ శుకుడు ఇలా అన్నాడు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Thursday, June 28, 2018

శ్రీకృష్ణ లీలలు - ౩౪

10.1-349-వ.
అనిన విని రా జిట్లనియె.
10.1-350-ఆ.
"జగదధీశ్వరునకుఁ జ న్నిచ్చు తల్లి గా
నేమి నోము నోఁచె నీ యశోద? 
పుత్రుఁ డనుచు నతనిఁ బోషించు తండ్రి గా
నందుఁ డేమి జేసె? నందితాత్మ!

భావము:
ఇలా శుకమహర్షి యశోద బాలకృష్ణుని ముద్దు చేస్తోంది అని చెప్పగా విని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
శుకమహర్షీ! నీవు ఆత్మానందం పొందిన వాడవు. ఈ లోకాలన్నిటికీ ప్రభువూ భగవంతుడూ అయిన శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి పూర్వజన్మలలో ఏమి నోములు నోచిందో? శ్రీ హరిని పొషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏమి తపస్సులు చేశాడో?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=50&padyam=350

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, June 24, 2018

శ్రీ కృష్ణ లీలలు - ౩౩

10.1-347-వ.
అని తన్ను పరమేశ్వరుండని తలంచుచున్న యశోద యందు నా కృష్ణుండు వైష్ణవమాయం బొందించిన.
10.1-348-క.
జడనుపడి యెఱుక చెడి యా
పడతుక సర్వాత్ముఁ డనుచుఁ బలుకక యతనిం
గొడుకని తొడపై నిడుకొని 
కడు వేడుకతోడ మమతఁ గావించె నృపా!”

భావము:
బాలకృష్ణుడు ఇలా తనను భగవంతుడైన శ్రీమహావిష్ణువుగా భావిస్తూ ఉన్న యశోదకు మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేశాడు. పరీక్షిన్మహారాజా! ఆ మాయా ప్రభావంవలన యశోద మోహం చెంది, బాలకృష్ణుడు సర్వాత్ముడే అనే విషయం మరచిపోయింది. అతడు తన కొడుకే అనుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా ముద్దులాడింది”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=48&padyam=348

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, June 20, 2018

శ్రీకృష్ణ లీలలు - 32

10.1-345-ఆ.
“ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు
గానఁబడిన బుద్ధి కంప మయ్యె
నా మహాత్ము విష్ణు నఖిలలోకాధారు
నార్తులెల్లఁ బాయ నాశ్రయింతు.
10.1-346-క.
నా మగడు నేను గోవులు
నీ మందయు గోపజనులు ని బ్బాలుని నె
మ్మోమున నున్న విధముఁ గని
యేమఱితిమి గాక యీశుఁ డీతఁడు మాకున్".

భావము:
ఇలా ఈ నోటిలో విశ్వదర్శనం ఇచ్చిన కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. .
“విష్ణుమూర్తి అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు. ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్న ఆ మహాత్ముడైన విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనబడింది. నా బుద్ధి చలించిపోయింది. నా దుఃఖాలన్నీ పోవడానికి ఆ మహా విష్ణువునే శరణు కోరుతాను. ఇలా ఈ నోట విశ్వదర్శనం చూపిన కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. . “ఈ బాలకుని నిండు ముఖాన్ని చూసి నేను, నా భర్త, ఈ వ్రేపల్లెలోని గోపగోపికా జనాలు అందరం, చివరకు గోవులుకూడ ఇతడు బాలుడే అని భ్రాంతి పడ్డాం కాని, ఇతడు మా కందరికి ప్రభువైన ఈశ్వరుడు అని గుర్తించలేకపోయాం.’

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=48&padyam=346

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, June 17, 2018

శ్రీకృష్ణ లీలలు - 31

10.1-343-ఆ.
బాలమాత్రుఁడగు సలీలుని ముఖమందు
విశ్వ మెల్ల నెట్లు వెలసి యుండు
బాలు భంగి నితఁడు భాసిల్లుఁ గాని స
ర్వాత్ముఁ డాది విష్ణుఁ డగుట నిజము.”
10.1-344-వ.
అని నిశ్చయించి.

భావము:
యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసిన విభ్రాంతిలో ఇంకా ఇలా అనుకుంటోంది.
ఇంత చిన్న పిల్లవాడి నోటిలో, ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఇమిడిపోయింది పసివాడిలాగ కనిపిస్తున్నాడు కాని ఇతడు నిజానికి సర్వమునందు ఆత్మరూపంలో ఉండే సర్వాత్మకుడు, ఆదిమూలాధారమైన సర్వవ్యాపకుడు అయిన శ్రీమహావిష్ణువే. ఇదే ముమ్మాటికీ నిజం.” ఇలా యశోదాదేవి ఈ కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొని .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=48&padyam=343

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, June 16, 2018

శ్రీకృష్ణ లీలలు -  30

10.1-341-వ.
కనుంగొని.
10.1-342-మ.
“కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో! 
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్

భావము:
యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి. కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి విభ్రాంతురాలైన యశోద ఇలా అనుకోసాగింది “నేను కలగనటం లేదు కదా? లేకపోతే ఇదంతా విష్ణుమాయేమో? ఇదంతా నా చిత్తభ్రమా? కాకపోతే ఇదే సత్యమా? ఒకవేళ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదా? అసలు నేను యశోదను అవునా కాదా? ఇది అసలు మా ఇల్లేనా మరొటా? ఈ పిల్లాడు ఎంత, వీడి నోటిలో బ్రహ్మాండం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి? ఇలా ఎలా సాధ్యం? ఆలోచించేకొద్దీ ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=48&padyam=342

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 29

10.1-339-వ.
అని పలికి నెయ్యంబున నయ్యవ్వ నియ్యకొలిపి క్రీడామనుజ బాలకుం డైన యీశ్వరుండు తన నోరు దెఱచి ముఖంబుఁ జూపిన
10.1-340-క.
ఆ లలితాంగి కనుంగొనె
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

భావము:
అలా కృష్ణుడు తల్లిని మెత్తని మాటలతో శాంతింపజేసాడు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానవ వేషధారి అయిన శైశవకృష్ణుడు తన నోరు తెరిచి తల్లి యశోదాదేవికి చూపించాడు. యశోదామాత ఆ పసివాని నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు మొదలగు వాటితో భూగోళము; అగ్ని; సూర్యుడు; చంద్రుడు; అష్టదిక్పాలకులు 1తూర్పుకి ఇంద్రుడు, 2ఆగ్నేయానికి అగ్ని, 3దక్షిణానికి యముడు, 4నైఋతికి నిరృతి, 5పడమరకి వరుణుడు, 6వాయవ్యానికి వాయువు, 7ఉత్తరానికి కుబేరుడు, 8ఈశాన్యానికి శివుడు మొదలగు సమస్తముతో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూసింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=48&padyam=340

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, June 15, 2018

శ్రీకృష్ణ లీలలు - 28

10.1-337-వ.
అని పలికిన ముగుదతల్లికి నెఱదంట యైన కొడు కిట్లనియె.
10.1-338-శా.
"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? 
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."

భావము:
ఆ ముద్దరాలు అయిన తల్లి యశోదా దేవికి మాయలమారి కృష్ణబాలుడు సమాధానం చెప్తున్నాడు. " అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మవద్దు" అని చిన్నికృష్ణుడు. మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి, నోరు తెరిచి చూపించబోతున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=48&padyam=338

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 27

10.1-335-వ.
అంత నొక్కనాడు బలభద్రప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను దినె నని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని యిట్లనియె.
10.1-336-క.
"మన్నేటికి భక్షించెదు? 
మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా! మ న్నేల మఱి పదార్థము లేదే? "
భావము:
ఒక రోజున బలరాముడు మొదలైన యాదవ బాలురు కృష్ణుడు మట్టి తిన్నాడు అని యశోదాదేవికి చెప్పారు. అంత ఆ అమాయకపు తల్లి ఆ నెరదంట పాపడిని చెయ్యి పట్టుకొని గదమాయిస్తోంది. "ఏమయ్యా కన్నయ్యా! మట్టెందుకు తింటున్నావు. నే వద్దని చెప్పేవేవి ఎందుకు లెక్క చేయవు. తల అలా అడ్డంగా ఊపకు. అన్న బలరాముడు, స్నేహితులు అందరు చెప్తున్నారు కదా. ఏం ఇంట్లో తినడానికి ఇంకేం లేవా ఏమిటి పాపం.": : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Friday, June 8, 2018

శ్రీకృష్ణ లీలలు - 26:

10.1-334-ఉ.
కాంతలు దల్లితోఁ దన వికారము లెల్ల గణింప భీతుఁ డై
శాంతుని సొంపునం బరమ సాధుని పెంపున గోలమాడ్కి వి
భ్రాంతుని కైవడిన్ జడుని భంగిఁ గుమారకుఁ డూరకుండె నే
వింతయు లేక దల్లి కుచవేదికపైఁ దల మోపి యాడుచున్. 

భావము:
ఇలా గోపికలు తన తల్లి యశోదకు తను చేసే అల్లరిల పనులు అన్ని ఎంచి మరీ చెప్తుంటే, ఈ కొంటె కృష్ణుడు ఏం మాట్లాడకుండా ఎంతో భయపడిపోయిన వాడిలాగ, ఎంతో నెమ్మదైన వానిలాగ, పరమ సాధు బుద్ధి వానిలాగ, అమాయకపు పిల్లవానిలాగ, నివ్వెరపోయినవానిలాగ, మందుడి లాగ ఊరికే ఉన్నాడు. అసలు ఏమి జరగనట్లు తల్లి ఒడిలో చేరి తల్లి రొమ్ములపై తలాన్చి ఆడుకుంటున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=47&padyam=334

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, June 7, 2018

శ్రీకృష్ణ లీలలు -25

10.1-332- తే.
అన్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు; 
మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ! 
రామలార! త్రిలోకాభిరామలార! 
తల్లులార! గుణవతీమతల్లులార!
10.1-333-వ.
అని యశోద వారల నొడంబఱచి పంపి గొడుకుం గోపింపఁజాలక యుండె; నిట్లు.


భావము:
తల్లులల్లారా! మనోజ్ఞమైన మగువల్లారా! ముల్లోకాలకు మోదం కలిగించే ముదితల్లారా! నామాట వినండి. ఇతను ఇతరమైనదేది ఎరుగడు. తనంతట తనే క్రీడిస్తు ఉంటాడు. మా కన్నయ్య ఎంతో మంచివాడు అమ్మలార! సకల సద్గుణవతీ లలామల్లారా! ఇతనిపై అపనిందలు వేయకండమ్మా." తల్లి యశోదాదేవి తన వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి చెప్పే గోపికలను సమాధాన పరుస్తోంది. ఇలా ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను చెప్పుకుంటున్న ఓపికలు లేని గోపికలకు యశోదాదేవి నచ్చచెప్పి పంపిది, కాని కొడుకుమీద ఉన్న ప్రేమ వలన కోప్పడలేకపోయింది.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Wednesday, June 6, 2018

శ్రీకృష్ణ లీలలు - 24

10.1-330-వ.
అని మఱియు ననేకవిధంబుల బాలకృష్ణుండు చేయు వినోదంబులు దమ యందుఁ జేయు మహాప్రసాదంబు లని యెఱుంగక దూఱుచున్నయట్టి గోపికలకు యశోద యిట్లనియె.
10.1-331-క.
"చన్ను విడిచి చనఁ డిట్టటు
నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగఁడు నేడుం
గన్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ చేయం దగునే?

భావము:
మరికా ఆ కపట శైశవమూర్తి కొంటె కృష్ణమూర్తి దొంగజాడల ఇలా రకరకాల బాల్యచేష్టలను లీలలుగా ప్రదర్శిస్తూ క్రీడిస్తుంటే. తమకు అందిస్తున్న ఆ మహాప్రసాదాలను తెలుసుకోలేక, ఓపికలు నశించిన గోపికలు తిడుతుంటే. యశోదాదేవి వారికి ఇలా చెప్పుతున్నారు. "మా కన్నయ్య చంటాడు నా ఒళ్ళో కూర్చుండి పాలు తాగుతుండటమే తప్ప నన్ను వదలి ఈ పక్కకి ఆ పక్కకి పోడు. పక్కింటికి కూడ దారి తెలియదు. అలాంటి ఈ నాటికి సరిగా కళ్ళు తెరవడంరాని పసిగుడ్డును ఇలా అల్లరి పెట్టడం మీకు తగినపని కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=47&padyam=331

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, June 5, 2018

శ్రీకృష్ణ లీలలు - 23

10.1-328-క.
కడు లచ్చి గలిగె నేనిం
గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్
బడుగుల వాడలపైఁ బడ
విడుతురె రాకాంత లెందు? విమలేందుముఖీ!
10.1-329-క.
ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా! 
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!” 


భావము:
నిర్మలమైన మోము గల ఓ యశోదాదేవి! ఎంత భాగ్యవంతులు అయితే మాత్రం. గొప్ప తిండి తింటారు, గొప్ప బట్టలు కట్టుకుంటారు. అంతేకాని రాజవంశపు స్త్రీలు ఎక్కడ అయినా ఇలా పిల్లలను ఊళ్ళోని పేదల మీద పడి పేదలను వేపుకు తిన మని చిరునవ్వులు నవ్వుతూ పంపుతారా? చెప్పు. ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు.": : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
శ్రీకృష్ణ లీలలు - 22

10.1-327-సీ.
కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ; 
పట్టి రాఁగల డని పాలు పెరుగు
లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ; 
జూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ? 
తలుపుల ముద్రల తాళంబులును బెట్టి; 
యున్న చందంబున నున్న వరయ; 
నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నాడు; 
నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;
10.1-327.1-ఆ.
నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ
పక్షి ఘోషణములు పరఁగఁ జేయు
నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో
కాన రాఁడు రిత్త కడవ లుండు.

భావము:
ఓ యశోదమ్మా! మంజులవాణి! మీ వాడు వస్తాడని ఊహించాము. మా వీథిలోని గొల్ల భామలము అందరము తలుపులు అన్ని వేసేసి, గడియలకు తాళాలు బిగించాము. అతను వచ్చే దారిని కాపాలాగా చూస్తునే ఉన్నాం. తలుపులకు వేసిన గొళ్లేలు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. కాని ఇలా చూసేసరికి ఎలా వచ్చాడో ఎలా దూరాడో మరి ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు. ఇంకొక ఇంటిలో గెంతుతున్నాడు. ఇంకో ఇంట్లో నవ్వుతున్నాడు. మరింకొక ఇంట్లోనేమో తిడుతున్నాడు. ఇంకొక చోటేమో ఎక్కిరిస్తున్నాడు. కొన్ని ఇళ్ళల్లో అయితే పక్షులలా కూతలు జంతువులలా కూతలు కూస్తున్నాడు.. ఇంతట్లోనే ఎలా వెళ్ళిపోతాడో చటుక్కున వెళ్ళిపొతాడు. చూస్తే ఖాళీ కడవలు ఉంటాయి తల్లీ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=327

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, June 4, 2018

శ్రీకృష్ణ లీలలు - 21

10.1-326-ఆ.
తరుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ దుది వంగి
వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి
మగువ! నీ సుతుండు మగపోఁడుములు చేయ
సాఁగినాఁడు తగదె? జక్కఁజేయ.


భావము:
ఓ యమ్మా! ఒక యువతి పెరుగు చిలుకుతోంది. చివరకి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి పోకిరీ పనులు చేయసాగాడు. కొంచం బుద్ధి చెప్పరాదా?
స్త్రీ బాలాంధజడోపమా అంటారు కదా అలా ఉండి, పెరుగు అనే జ్ఞానం పేరుకున్న వేదాలు చిలికిచిలికి, వెన్న అనే సారం తీయడానికి ప్రయత్నిస్తే సరిపోదు అని. ఏకాంతిక భక్తి లేనిచో వ్యర్థమని పరమాత్మ వెనుతగిలి మగపోడుమ లనే సరైన పురుషయత్నం చూపుతున్నాడట.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :