Sunday, May 30, 2021

శ్రీకృష్ణ విజయము - 243

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-225-క.
ఆ రామలతో నెప్పుడుఁ
బోరాములు సాల నెఱపి పురుషోత్తముఁడున్
గారామునఁ దిరిగెను సౌ
ధారామ లతాసరోవిహారముల నృపా!
10.2-226-క.
ఏ దేవుఁడు జగముల ను
త్పాదించును మనుచుఁ జెఱుచుఁ బ్రాభవమున మ
ర్యాదారక్షణమునకై
యా దేవుం డట్లు మెఱసె యాదవులందున్.

భావము:
ఓ రాజా! పురుషోత్తముడు శ్రీకృష్ణుడు రాకపోకలతో స్నేహం ప్రదర్శిస్తూ, ఆ స్త్రీలతో ఇళ్ళలో, తోటలలో, క్రీడా కొలనులలో విహరించాడు. ప్రపంచాన్ని తన ప్రభావంతో సృష్టించి, పోషించి, అంతం చేసే ఆ పరమాత్ముడు, జగద్రక్షకుడై యాదవులలో శ్రీకృష్ణుడుగా అవతరించి ఈవిధంగా విరాజిల్లాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=226

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 242

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-223-సీ.
ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు-
  నానీత వస్తువులందుకొనుచు
సౌవర్ణమణిమయాసనములు వెట్టుచుఁ-
  బదములు గడుగుచు భక్తితోడ
సంవాసితస్నానజలము లందించుచు-
  సద్గంధవస్త్రభూషణము లొసఁగి
యిష్ట పదార్థంబు లిడుచుఁ దాంబూ లాదు-
  లొసఁగుచు విసరుచు నోజ మెఱసి
10.2-223.1-తే.
శిరము దువ్వుచు శయ్యపైఁ జెలువు మిగుల
నడుగు లొత్తుచు దాసీసహస్రయుక్త
లయ్యుఁ గొలిచిరి దాసులై హరి నుదారుఁ
దారకాధిప వదనలు దారు దగిలి.
10.2-224-శా.
నన్నే పాయఁడు; రాత్రులన్ దివములన్ నన్నే కృపం జెందెడిన్;
నన్నే దొడ్డగఁ జూచు వల్లభలలో నాథుండు నా యింటనే
యున్నా డంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా
యన్నుల్‌ గాఢ పతివ్రతాత్వ పరిచర్యా భక్తియోగంబులన్.

భావము:
ఇంటికి రాగానే ఎదురువెళ్ళి తెచ్చిన వస్తువులు అందుకుంటారు. మణులతో పొదిగిన బంగారు ఆసనాలు వేస్తారు. భక్తితో పాదాలు కడుగుతారు, స్నానానికి సుగంధంతో కలిపిన నీళ్ళను అందిస్తారు. సుగంధాలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పిస్తారు. ఇష్టమైన పదార్ధాలు వడ్డిస్తారు. తాంబూలం అందిస్తూ, విసురుతూ, తల దువ్వుతూ, పాదాలు ఒత్తుతూ, వేలకొలది దాసీలు ఉన్నప్పటికీ ఆ చంద్రముఖులు చేసే సేవలు అన్నీ వాసుదేవుడికి స్వయంగా తామే చేస్తారు. “శ్రీకృష్ణుడు రాత్రింబవళ్ళు నాచెంతనే ఉంటూ నన్నే ప్రేమిస్తున్నా”డని తమలో తాము సంబరపడుతూ, ఆ పదహారువేలమంది పడతులు గొప్ప భక్తి భావంతో, పాతివ్రత్యంతో యదువల్లభుడిని ఆదరాభిమానములతో ఆరాధించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=223

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, May 29, 2021

శ్రీకృష్ణ విజయము - 241

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-221-క.
తరుణులు బెక్కం డ్రయినను
బురుషుఁడు మనలేఁడు సవతి పోరాటమునన్,
హరి యా పదాఱువేవురు
తరుణులతో సమత మనియె దక్షత్వమునన్.
10.2-222-శా.
ఎన్నే భంగుల యోగమార్గముల బ్రహ్మేంద్రాదు లీక్షించుచున్
మున్నే దేవునిఁ జూడఁగానక తుదిన్ మోహింతు; రా మేటి కే
విన్నాణంబుననో సతుల్‌ గృహిణులై విఖ్యాతి సేవించి ర
చ్ఛిన్నాలోకన హాస భాషణ రతిశ్లేషానురాగంబులన్.

భావము:
లోకంలో పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటే సవతి పోరాటాలతో జీవించలేక సతమత మైపోతాడు. కానీ, శ్రీకృష్ణుడు పదహారువేలమంది తరుణుల పట్ల సరి సమాన భావాన్ని ప్రదర్శిస్తూ తన సామర్ధ్యంతో సుఖంగా జీవించాడు. బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైన వారు యోగమార్గంలో విష్ణుమూర్తిని దర్శించాలని ఎన్నో రీతులుగా ప్రయత్నించి, సాధ్యం కాక చివరకు మాయామోహితులు అవుతారో, ఆ మహాత్ముడికి ఎంతో నేర్పుతోఆ స్త్రీలు ఇల్లాండ్రై; ఎడతెగని ఆత్మీయ చూపులతో, చిరు నవ్వులతో, సరస సంభాషణలతో, ఆలింగన క్రీడలతో, అనురాగాలతో ప్రఖ్యాతంగా సేవించుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=222

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 240

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-219-చ.
అమితవిహారుఁ డీశ్వరుఁ డనంతుఁడు దా నొక నాఁడు మంచి ల
గ్నమునఁ బదాఱువేల భవనంబులలోనఁ బదాఱువేల రూ
పములఁ బదాఱువేల నృపబాలలఁ బ్రీతిఁ బదాఱువేల చం
దముల విభూతినొందుచు యథావిధితో వరియించె భూవరా!
10.2-220-ఉ.
దానములందు సమ్మద విధానములం దవలోకభాషణా
హ్వానములందు నొక్క క్రియ నా లలితాంగుల కన్ని మూర్తు లై
తా ననిశంబు గానఁబడి తక్కువ యెక్కువలేక యుత్తమ
జ్ఞాన గృహస్థధర్మమునఁ జక్రి రమించెఁ బ్రపూర్ణకాముఁడై.

భావము:
మహానుభావుడు, భగవంతుడు ఐన శ్రీకృష్ణుడు, ఒక శుభముహుర్తాన ఆ పదహారువేల భవనాల యందు, పదహారువేల రూపాలతో, పదహారువేల మంది రాజకన్యలను, పదహారువేల రీతులతో శోభిస్తూ శాస్త్రోక్తంగా వివాహమాడాడు. దానాది క్రియలలో, సంతోషపెట్టుటలో, నిండైన ప్రేమతో చూడటంలో, సంభాషణలలో, ఆహ్వానాలతో శ్రీకృష్ణుడు ఎక్కువ తక్కువలు కాకుండా, బాలామణులు అందరకూ అన్ని విధాలుగా కనిపిస్తూ ఉత్తమమైన గృహస్థధర్మాన్ని పాటిస్తూ ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=220

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, May 28, 2021

శ్రీకృష్ణ విజయము - 239

( పారిజాతాపహరణంబు )

10.2-217-సీ.
నరకాసురుని బాధ నలఁగి గోవిందుని-
  కడ కేగి తత్పాదకమలములకుఁ
దన కిరీటము సోఁక దండప్రణామము-
  ల్గావింప నా చక్రి కరుణ సేసి
చనుదెంచి భూసుతు సమయించి తనవారిఁ-
  దన్ను రక్షించుటఁ దలఁప మఱచి
యింద్రుండు బృందారకేంద్రత్వ మదమునఁ-
  "బద్మలోచన! పోకు పారిజాత
10.2-217.1-ఆ.
తరువు విడువు" మనుచుఁ దాఁకె నడ్డము వచ్చి
తఱిమి సురలు నట్లు దాఁకి రకట!
యెఱుకవలదె నిర్జరేంద్రత కాల్పనే?
సురల తామసమును జూడ నరిది.
10.2-218-వ.
ఇట్లు దనకు నొడ్డారించి యడ్డంబు వచ్చిన నిర్జరేంద్రాదుల నిర్జించి తన పురంబునకుం జని, నిరంతర సురభి కుసుమ మకరంద మాధురీ విశేషంబులకుఁ జొక్కిచిక్కక నాకలోకంబుననుండి వెంటనరుగుదెంచు తుమ్మెదలకు నెమ్మిదలంచుచున్న పారిజాతమ్ము నాశ్రితపారిజాతుం డయిన హరి మహాప్రేమాభిరామ యగు సత్య భామతోఁ గ్రీడించు మహోద్యానంబున సంస్థాపించి, నరకాసురుని యింటం దెచ్చిన రాజకన్యక లెందఱందఱకు నన్నినివాసంబులు గల్పించి గృహోపకరణంబులు సమర్పించి.

భావము:
ఇంద్రుడు తాను త్రిలోకాధిపతిననే గర్వంతో “ఓ శ్రీకృష్ణా! దొంగతనంగా పారిజాతవృక్షాన్ని పట్టుకుపోవద్దు. విడువు. విడువు.” అని త్రోవకు అడ్డం వచ్చి శ్రీకృష్ణుడిని ఎదిరించాడు. దేవతాసైన్యం శ్రీకృష్ణుడిమీద యుద్ధానికి వచ్చింది. నరకాసురుడు పెట్టే బాధలకు ఓర్చుకోలేక, తాను శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు తన కిరీటం సోకేలా సాష్టాంగ నమస్కారం చేస్తే, కృష్ణుడు దయతలచి నరకాసురుడిని సంహరించి, దేవతలను రక్షించిన సంగతి దేవేంద్రుడు మరచిపోయాడు. ఆపాటి వివేకంలేని దేవేంద్రపదవి ఎందుకు? దేవతల అహంకారం చాలా విచిత్రంగా ఉంది. తనను ఎదిరించిన దేవేంద్రాదులను ఓడించి, ఆశ్రితపారిజాతమైన శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి, తనను గొప్పగా ప్రేమించే సత్యభామతో తాను విహరించే ఉద్యానవనంలో నాటించాడు. దేవలోకపు తుమ్మెదలు సువాసనలు విరజిమ్మే పారిజాతవృక్షాన్ని అనుసరించి కూడా వచ్చేసాయి. శ్రీకృష్ణుడు నరకాసురుడి బారినుండి తప్పించి తెచ్చిన రాజకన్యకలు అందరకీ వేరు వేరుగా సౌధాలను, కావలసిన గృహోపకరణాలను ఏర్పాటు చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=23&Padyam=217

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 238

( పారిజాతాపహరణంబు )

10.2-215-మ.
హరి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపైఁ బెట్టె సుం
దరగంధానుగతభ్రమద్భ్రమరనాదవ్రాతముం బల్లవాం
కుర శాఖా ఫల పర్ణ పుష్ప కలికా గుచ్ఛాది కోపేతమున్
గిరిభిత్త్రాతముఁ బారిజాతముఁ ద్రిలోకీయాచకాఖ్యాతమున్.
10.2-216-వ.
ఇట్లు పారిజాతంబును హరించి యదువల్లభుండు వల్లభయుం దానును విహగవల్లభారూఢుండై చనుచున్న సమయంబున.

భావము:
అక్కడ పర్వతాల గర్వాలు అణిచిన ఆ ఇంద్రుడు అంతవానిచే పోషింపబడుతున్న పారిజాతవృక్షాన్ని చూసారు. ముల్లోకాల ప్రజల కోరికలుతీర్చడంలో మిక్కిలి ప్రసిద్ధమైనది ఆ దేవతా తరువు. మనోజ్ఞమైన దాని పరిమళాలకు దరిచేరి చక్కర్లు తిరుగుతున్న తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. చిగుళ్ళు, అంకురాలు, మొగ్గలు, గుచ్ఛాలు, కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు మున్నగువాటితో నిండుగా ఉన్నది. ఆ పారిజాతాన్ని అలాగే చేతితో పెకలించి గరుత్మంతుడి మీద పెట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా పారిజాతాన్ని అపహరించి తన ప్రాణసతి అయిన సత్యవతీదేవితోపాటు పక్షీంద్రుడు గరుత్మంతుడుపై ఎక్కి బయలుదేరుతున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=23&Padyam=215

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, May 25, 2021

అన్నమయ్య శతగళార్చన - 26న 8AM IST / 1030AM SGT : : Annamayya Satagalaarchana - ON 26th May



ఆత్మీయ భగవద్భక్తులారా! సరససహృదయులారా! అన్నమయ్య సంగీతాభిమానులారా!  

మన అంతర్జాల  అన్నమయ్య శతగళార్చన సేవ రేపే అనగా 26-05-`21  సింగపూరు నుండి ప్రత్యక్ష ప్రసారం కదండి... 

తత్సంబంధ FaceBook & YouTube లింకులు క్రింద ఇవ్వబడ్డాయి గమనించండి.

మరి తప్పక రండి ఆస్వాదిద్దాం. శ్రీ ఏడుకొండలవాని భక్తిలో అన్నమయ్య పదాల సోయగాలతో ఓలలాడుదాం. .  

https://youtu.be/UV0QC8a8c8A

https://www.facebook.com/events/536326657361496/


   ~తెలుగు భాగవత ప్రచార సమితి

-- - - - - - - 


Annamayya Satagalaarchana - ON 26th May 8AM IST / 1030AM SGT

Please note tomorrow ie., on 26-05-21, our Singapore Annamayya Satagalaarchana is live online. FaceBook & YouTube links are given below. Do join and enjoy all the beautiful renditions of Annamayya Keertanas.

https://youtu.be/UV0QC8a8c8A

https://www.facebook.com/events/536326657361496/


  ~Telugu Bhagavata Prachara Samiti

Monday, May 24, 2021

శ్రీకృష్ణ విజయము - 237

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-214-వ.
ఇట్లు బహువిధంబులం దమతమ మన్ననలకు నువ్విళ్ళూరు కన్నియలం బదాఱువేల ధవళాంబరాభరణ మాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను, ధవళంబులై వేగవంతంబులై యైరావతకుల సంభవంబులైన చతుర్దంత దంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి; దేవేంద్రుని పురంబునకుం జని యదితిదేవి మందిరంబు సొచ్చి, యా పెద్దమ్మకు ముద్దు సూపి, మణికిరణ పటల పరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి.

భావము:
ఈ మాదిరిగా తన ఆదరణ కోసం ఉవ్విళ్ళూరుతున్న ఆ కన్యలు అందరకూ తెల్లని చీరలను, ఆభరణాలనూ, పూమాలలనూ, సుగంధ మైపూతలనూ శ్రీకృష్ణుడు ఇచ్చాడు; నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలనూ, రథాలనూ, అశ్వాలనూ, అమితమైన వేగం కలిగిన ఐరావత కులంలో ఉద్భవించిన తెల్లని నాలుగు దంతాల ఏనుగులనూ, ద్వారకానగరానికి పంపించాడు. ఆ పదారువేలమంది స్త్రీలనూ పల్లకీలలో ఎక్కించి ద్వారకకు సాగనంపాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణ మైన అమరావతికి వెళ్ళాడు. దేవమాత అదితి అంతఃపురానికి వెళ్ళి ఆమె ప్రేమను చూరగొని తమ కాంతులతో సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న ఆమె మణికుండలాలను ఆమెకు సమర్పించాడు. శచీదేవీ దేవేంద్రుల చేత సత్యభామ సమేతంగా పూజలు అందుకున్నాడు. తర్వాత సత్యభామ నందనవనం వెళ్దామని కోరింది. ఆమెను ఆ వనానికి తీసుకొని వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=214

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 236

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-212-సీ.
వనజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన-
  గదిసి వ్రేలుదు గదా కంఠమందు;
బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన-
  మెఱసి యుండుదు గదా మేనునిండఁ;
గన్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన-
  నొప్పు సూపుదుఁ గదా యురమునందు;
బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన-
  మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి;
10.2-212.1-ఆ.
పద్మగంధి! నేను బర్హదామము నైనఁ
జిత్ర రుచుల నుందు శిరమునందు"
ననుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు
గములు గట్టి గరుడగమనుఁ జూచి.
10.2-213-శా.
భూనాథోత్తమ! కన్యకల్‌ వరుస "నంభోజాతనేత్రుండు న
న్నే నవ్వెం దగఁ జూచె డగ్గఱియె వర్ణించెన్ వివేకించె స
మ్మానించెం గరుణించెఁ బే రడిగె సన్మార్గంబుతోఁ బెండ్లి యౌ
నేనే చక్రికి దేవి" నంచుఁ దమలో నిర్ణీత లై రందఱున్.

భావము:
ఓ పద్మాలాంటి కనులున్న సఖీ! నేను గనుక వైజయంతికను అయిన ట్లయితే అతని మెడలో వ్రేలాడేదానిని కదా. ఓ దొండపండు లాంటి పెదవిగల సుందరీ! నేను కనుక పట్టువస్త్రాన్ని ఐనట్లైతే ఆయన శరీరంమీద ప్రకాశిస్తూ ఉండేదానిని కదా. ఓ బాలామణీ! నేను కౌస్తుభమణిని ఐనట్లయితే ఆయన వక్షస్థలంమీద మెరుస్తూ ఉండేదానిని గదా. ఓ కన్యామణీ! నేను పాంచజన్యాన్ని అయినట్లయితే అతని పెదవిని తాకి పరవశించి పోయేదానిని కదా. ఓ పద్మాల సుగంధాలతో విలసిల్లే చెలీ! నేను నెమలి పింఛాన్ని అయిన ట్లయితే ఆయన శిరస్సుమీద చిత్రమైన కాంతులతో విలసిల్లేదానిని కదా.” అని అనేక విధాలుగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ కన్యలు గుంపులు కూడి గరుడ వాహనుడు, శ్రీకృష్ణుడిని చూసి ఓ మహారాజా! పరీక్షిత్తూ! “శ్రీకృష్ణుడు నన్ను చూసే నవ్వాడు.” “నా వైపే చూసాడు.” “నా చెంతకు వచ్చాడు.” “నన్నే వర్ణించాడు.” “నన్నే గౌరవించాడు.” “నన్నే కరుణించాడు.” “నా పేరే అడిగాడు.” “నన్నే పెండ్లాడుతాడు.” “నేనే శ్రీకృష్ణుని భార్యను అవుతా” నని రకరకాలుగా అంటూ ఆ కన్య లందరూ ఎవరికి వారు నిర్ణయిం చేసేసుకోసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=212

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, May 23, 2021

శ్రీకృష్ణ విజయము - 235

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-210-క.
ఉన్నతి నీతఁడు గౌఁగిట
మన్నింపఁగ నింక బ్రదుకు మానిని మనలో
మున్నేమి నోము నోఁచెనొ
సన్నుతమార్గముల విపిన జల దుర్గములన్.
10.2-211-క.
విన్నారమె యీ చెలువముఁ?
గన్నారమె యిట్టి శౌర్యగాంభీర్యంబుల్‌?
మన్నార మింతకాలముఁ
గొన్నారమె యెన్నఁ డయినఁ గూరిమి చిక్కన్.

భావము:
మనలో ఎవరినైతే ఈ కమలాక్షుడు కనికరంతో కౌగిట చేర్చి గౌరవిస్తుంటే జీవిస్తుందో, ఆ సౌభాగ్యవతి తాను పూర్వ జన్మలో ఏ అరణ్యాలలో ఏ జల దుర్గాలలో ఎంత తపస్సు చేసిందో? కదా. ఇటువంటి సౌందర్యాన్ని గూర్చి ఎక్కడైనా విన్నామా? ఇంతటి శౌర్యాన్నీ గాంభీర్యాన్నీ ఎప్పుడైనా కన్నామా? ఇంత కాలం జీవించాం గానీ ఇంతటి అనురాగాన్ని ఎక్కడైనా పొందామా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=211

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, May 21, 2021

శ్రీకృష్ణ విజయము - 234

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-208-వ.
కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది గుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలిత హృదయలై, దైవయోగంబునం బరాయత్తంబులైన చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుండుత్తలపెట్ట నతండు దమకుఁ బ్రాణవల్లభుండని వరియించి.
10.2-209-ఉ.
"పాపపురక్కసుండు సెఱపట్టె నటంచుఁ దలంతుఁ మెప్పుడుం
బాపుఁడె? వాని ధర్మమునఁ బద్మదళాక్షునిఁ గంటి మమ్మ! ము
న్నీ పురుషోత్తముం గదియ నేమి వ్రతంబులు సేసినారమో?
యా పరమేష్ఠి పుణ్యుఁడుగదమ్మ! హరిన్ మముఁ గూర్చె నిచ్చటన్

భావము:
అలా చూసి శ్రీకృష్ణుని సౌందర్యం, చాతుర్యం, గాంభీర్యం మున్నగు సుగుణాలకు ఆకర్షితలై మోహించారు. వలపులు పొంగి ధైర్యం కోల్పోయి సిగ్గులు వదలి శృంగార భంగిమలతో సంచలించిన హృదయాలతో పంచబాణుడు తొందరపెట్టగా ఆ రాచకన్నెలు అతడే తమ ప్రాణవల్లభు డని వరించారు. “పాపాత్ముడైన రాక్షసుడు మనల్ని చెరపట్టాడని ఎప్పుడూ భావిస్తుండేవాళ్ళం. వాడిధర్మాన పద్మాక్షుని దర్శించాం. ఈ పురుషోత్తముని దగ్గర చేరడానికి మనం పూర్వజన్మలో ఏ వ్రతాలు చేశామో? శ్రీకృష్ణునితో మనలను జతకూర్చిన ఆ బ్రహ్మదేవుడు ఎంత పుణ్యాత్ముడో? కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=209

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 233

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-206-ఉ.
రాజకులావతంసుఁడు పరాజిత కంసుఁడు సొచ్చి కాంచె ఘో
రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుఁ డు
త్తేజిత శక్తిఁ దొల్లిఁ జెఱదెచ్చినవారిఁ బదాఱువేల ధా
త్రీజన మాన్యలన్ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్.
10.2-207-మ.
కని రా రాజకుమారికల్‌ పరిమళత్కౌతూహలాక్రాంతలై
దనుజాధీశ చమూవిదారు నతమందారున్ శుభాకారు నూ
తనశృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచనా
జన చేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్.

భావము:
కంసారి, యదుకులావతంసుడు అయిన శ్రీకృష్ణుడు ఆ రాజసౌధంలో, ఘోరమైన యుద్ధాలలో భూదేవి కొడుకు నరకుడు రాజులను శర పరంపరలతో ఓడించి, చెరపట్టి తెచ్చిన మాననీయులూ, గుణవతులూ అయిన పదహారువేలమంది రాజకన్యలను చూసాడు. ఆ రాజపుత్రికలు, రాక్షస సైన్యసంహారుడూ; ఆశ్రిత మందారుడూ; సుందరాకారుడూ; సుగుణాధారుడూ; మానినీమానస చోరుడూ; మనోహారుడూ; రత్నకిరీట ధరుడూ; అయిన శ్రీకృష్ణుడిని మిక్కిలి వికసించిన కుతూహలంతో చూశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=207

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, May 19, 2021

శ్రీకృష్ణ విజయము - 232

( నరకాసురుని వధించుట )

10.2-203-వ.
దేవా! నీవు లోకంబుల సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్త్వగుణంబును, సంహరించుటకుఁ దమోగుణంబును ధరియింతువు; కాలమూర్తివి, ప్రధానపూరుషుండవు, పరుండవు, నీవ; నేనును, వారియు, ననిలుండు, వహ్నియు, నాకాశంబుఁ, భూతతన్మాత్రలును, నింద్రియంబులును, దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్త్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన నీ యంద సంభవింతుము.
10.2-204-చ.
దయ నిటు సూడుమా! నరకదైత్యుని బిడ్డఁడు వీఁడు; నీ దెసన్
భయముననున్నవాఁడు; గడుబాలుఁ; డనన్యశరణ్యుఁ; డార్తుఁ; డా
శ్రయరహితుండు; దండ్రి క్రియ శౌర్యము నేరఁడు; నీ పదాంబుజ
ద్వయిఁ బొడఁగాంచె భక్తపరతంత్ర! సువీక్షణ! దీనరక్షణా! "
10.2-205-వ.
అని యిట్లు భూదేవి భక్తితోడ హరికిం బ్రణమిల్లి వాక్కుసుమంబులం బూజించిన నర్చితుండై భక్తవత్సలుం డయిన పరమేశ్వరుండు నరకపుత్త్రుం డయిన భగదత్తున కభయంబిచ్చి, సర్వసంపదలొసంగి నరకాసురగృహంబు ప్రవేశించి యందు.

భావము:
ఓ దేవా! నీవు ప్రపంచాన్ని సృష్టించడం కోసం రజోగుణాన్ని రక్షించడం కోసం సత్త్వగుణాన్ని నశింపజేయడం కోసం తమోగుణాన్ని ధరిస్తావు. నీవు కాలమూర్తివి; ప్రధానవ్యక్తివి; నరుడవు; నేను (భూమి), నీరు, అగ్ని, వాయువు, ఆకాశము; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; అనగా పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇంద్రియాలు; దేవతలు; మనస్సు; కర్త; మహాత్తత్వం; ఈ చరాచరమయమైన సమస్త ప్రపంచం; అద్వితీయుడవైన నీ యందే ఉద్భవిస్తాము. ఓ భక్తమందారా! ధనరక్షణా! దయతో ఇటు చూడు ఈ బాలుడు నరకుని కుమారుడు; నిన్ను చూసి బెదిరిపోతున్నాడు; చిన్న పిల్లవాడు; నీవు తప్ప వేరే దిక్కులేనివాడు; ఆర్తినొందిన వాడు; ఆశ్రయం లేనివాడు; తండ్రిలాగ పరాక్రమవంతుడు కాదు; నీ పాదాలనే ఆశ్రయించుకున్నాడు.” ఈవిధంగా భూదేవి భక్తితో హరికి నమస్కరించి, మాట లనే పూలతో పూజించగా, భక్తవత్సలు డైన శ్రీకృష్ణుడు నరకుని కుమారు డైన భగదత్తునికి అభయ మిచ్చి; సర్వ సంపదలనూ ప్రసాదించాడు. అనంతరం నరకాసుని సౌధంలోకి ప్రవేశించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=204

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 231

( నరకాసురుని వధించుట )

10.2-201-వ.
అంత భూదేవి వాసుదేవుని డగ్గఱ నేతెంచి జాంబూనదరత్న మండితంబైన కుండలంబులును, వైజయంతియను వనమాలయును, వరుణదత్తంబయిన సితచ్ఛత్త్రంబును, నొక్క మహారత్నంబును సమర్పించి మ్రొక్కి భక్తి తాత్పర్యంబులతోడం గరకమలంబులు ముకుళించి, విబుధవందితుండును, విశ్వేశ్వరుండును నైన దేవదేవుని నిట్లని వినుతించె.
10.2-202-సీ.
"అంభోజనాభున కంభోజనేత్రున-
  కంభోజమాలాసమన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు-
  దేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ-
  బొందువానికి నాదిపురుషునకును
నఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ-
  డయినవానికిఁ, బరమాత్మునకును,
10.2-202.1-ఆ.
ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! యమితచరిత!

భావము:
అప్పుడు నరకాసుర సంహారం కాగానే, భూదేవి వాసుదేవుడు కృష్షుడి దగ్గరకు వచ్చింది. అతివిలువైన రత్నాలు పొదిగిన బంగారు కుండలాలనూ, వైజయంతి అనే వనమాలనూ, వరుణుడు ఇచ్చిన తెల్లని గొడుగునూ, ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చింది. నమస్కరించి, భక్తిభావంతో ఆ దేవదేవుడిని ఈవిధంగా స్తుతించింది. "సర్వభూత స్వరూపుడా! సాటిలేని వాడ! పరమేశ్వరా! అపర పరాలు తానే యైన మహితాత్ముడా! మేరలులేని వర్తనలు కలవాడ! నీవు పద్మనాభుడవు; పద్మాక్షుడవు; పద్మ మాలా విభూషణుడవు; పద్మపాదుడవు; అనంతశక్తి స్వరూపుడవు[1]; వసుదేవు సుతుడవు[2]; దేవాధిదేవుడవు; భక్తులు కోరిన రూపం ధరించ గల వాడవు[3]; ఆది పురుషుడవు; సమస్త జగత్తుకు కారకుడవు; పరిపూర్ణవిజ్ఞాన వంతుడవు; పరమాత్మవు; సృష్టికర్తల పుట్టుకకు కారణ మైన వాడవు; పుట్టుక లేనివాడవు; అయినట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. -
[1] అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వ భోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వ నియామకత్వ సర్వాంతర్యామిత్వ సర్వ సృష్టత్వ సర్వపాలకత్వ సర్వ సంహారకత్వాది మేర లేని సమర్థతలు కల వాడు, విష్ణువు -
[2] వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోప లుంచుకొని ప్రపంచ మందు ఎల్లడల సర్వ భూతము లందు వసించి ఉండు వాడు, విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు, కృష్ణుడు -
[3] ఏ రూపైన పొందు వాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతు లైనను సూక్ష్మ స్థూలాది రూపము లైనను చేపట్టు వాడు"

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=202

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


Monday, May 17, 2021

శ్రీకృష్ణ విజయము - 230

( నరకాసురుని వధించుట )

10.2-199-శా.
"ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో!
తల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం దన్నుం గృపం గావఁడే!
చెల్లంబో! తలఁ ద్రుంచె" నంచు నిల నాక్షేపించు చందంబునన్
ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై.
10.2-200-క.
"కంటిమి నరకుడు వడఁగా
మంటిమి నేఁ" డనుచు వెస నమర్త్యులు మునులున్
మింటం బువ్వులు గురియుచుఁ
బంటింపక పొగడి రోలిఁ బద్మదళాక్షున్.

భావము:
“అమ్మా! వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలి నని చాటిచెప్పేదానవు కదమ్మా. కనీసం నిన్ను చూసి అయినా దయచూపకుండా, అయ్యో! అయిపోయింది. ఇదిగో చూడు శ్రీకృష్ణుడు నాతల త్రుంచా”డని భూదేవిని అధిక్షేపిస్తున్నట్లుగా నరకాసరుడు యుద్ధభూమిలో నేలకూలాడు. “అమ్మయ్యా! నరకాసురుడి చావు కనులారా కన్నాము. ఇంక ఇవాళ మనం బ్రతికిపోయాము.” అని దేవతలూ, మునీంద్రులూ ఆకాశం నుండి వరుసగా పూలవర్షం కురిపిస్తూ పద్మాక్షుని స్తుతించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=200

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



శ్రీకృష్ణ విజయము - 229

( నరకాసురుని వధించుట )

10.2-197-వ.
మఱియును విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపం జాలక హతశేషంబైన సైన్యంబు పురంబు సొచ్చుటం జూచి, నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతి శక్తిం గొని గరుడుని వైచె; నతండును విరులదండ వ్రేటునఁ జలింపని మదోద్దండ వేదండంబునుంబోలె విలసిల్లె; నయ్యవసరంబున గజారూఢుండై కలహరంగంబున
10.2-198-మ.
సమదేభేంద్రము నెక్కి భూమిసుతుఁ డా చక్రాయుధున్ వైవ శూ
లము చేఁబట్టిన, నంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురో
త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర
త్నమయోదగ్ర వినూత్నకుండల సమేతంబైన తన్మూర్ధమున్.

భావము:
గరుత్మంతుడి రెక్కల విసురు వలన పుట్టిన గాలివేగానికి నిలువలేక, చావగా మిగిలిన నరకుడి సైనికులు పట్టణంలోనికి పాఱిపోయారు. అది చూసి నరకాసురుడు దేవేంద్రుని వజ్రాయుధాన్ని తిరస్కరించిన తన చేతిలోని శక్తి అనే ఆయుధాన్ని, గరుత్మంతుడి మీద ప్రయోగించాడు. అంతటి దెబ్బకూ, పూలదండ దెబ్బకు చలించని మదపుటేనుగులాగ గరుత్మంతుడు ఏమాత్రం చెక్కుచెదరక భాసిల్లాడు. ఆ సమయంలో యుద్ధరంగంలో ఓ మదగజాన్ని ఎక్కి వస్తున్న నరకాసురుడు, చక్రాయుధుడి మీద ప్రయోగించడానికి శూలాన్నిపట్టుకుని పైకెత్తే లోపునే, శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసవీరులను ఖండించిన తన చక్రాయుధాన్ని వాడిమీద ప్రయోగించాడు. ఆ చక్రం రత్నాలు పొదిగిన సరిక్రొత్త కుండలాలతో కూడిన నరకుడి తలని తెగనరికింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=198

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



Saturday, May 15, 2021

శ్రీకృష్ణ విజయము - 228

( నరకాసురుని వధించుట )

10.2-195-ఆ.
మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు
శస్త్రసముదయముల జనవరేణ్య!
మురహరుండు వరుస మూఁడేసి కోలలన్
ఖండితంబు సేసె గగన మందు.
10.2-196-క.
వెన్నుని సత్యను మోచుచుఁ
బన్నుగఁ బద నఖర చంచు పక్షాహతులన్
భిన్నములు సేసె గరుడుఁడు
పన్నిన గజసముదయములఁ బౌరవముఖ్యా!

భావము:
ఓ మహారాజా! పరీక్షిత్తూ! దైత్యవీర ప్రముఖులు శ్రీకృష్ణుడి మీద అనేక ఆయుధాలను ప్రయోగించారు. రాక్షసులు ప్రయోగించే వాటన్నింటినీ గాల్లోనే, మురారి మూడేసి బాణాలు ప్రయోగించి ఖండించి వేశాడు. ఓ పురువంశోత్తమా! పరీక్షన్మహారాజా! సత్యభామ శ్రీకృష్ణులను తన మూపున మోస్తూనే, గరుత్మంతుడు తన కఱకు గోళ్ళతో, వాడి ముక్కుతో, రెక్కల దెబ్బలతో శత్రుసైన్యంలోని ఏనుగుల గుంపుల్ని చిన్నాభిన్నం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=196

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 227

( నరకాసురుని వధించుట )

10.2-192-వ.
అని పలికి హరి నరకాసురయోధులమీఁద శతఘ్ని యను దివ్యాస్త్రంబు ప్రయోగించిన నొక్క వరుసను వారలందఱు మహావ్యథం జెందిరి; మఱియును.
10.2-193-మ.
శర విచ్ఛిన్న తురంగమై పటుగదాసంభిన్న మాతంగమై,
యురుచక్రాహత వీరమధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై,
సురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్ శోషించి హైన్యంబుతో
హరి మ్రోలన్ నిలువంగ లేక పఱచెన్ హాహానినాదంబులన్.
10.2-194-వ.
అప్పుడు.

భావము:
అని పలికిన శ్రీకృష్ణుడు, నరకాసురుడి సైన్యం మీదకి శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ శతఘ్ని ధాటికి రాక్షస సైనికు లంతా తీవ్రవేదనలకు లోనయ్యారు. అంతేకాదు శ్రీకృష్ణ జనార్దనుడు ప్రయోగించిన శరసమూహాలకు గుఱ్ఱాలు కుప్పకూలాయి; గదాఘాతాలకు మదగజాలు నేలకఱచాయి; చక్రాయుధ విజృంభణానికి సైనికుల కాళ్ళు, చేతులూ, తలలూ తుత్తునియలు అయిపోయాయి; ఈవిధంగా, నరకాసురుడి సైన్యం దైన్యంతో కృష్ణుడి ఎదుట నిలబడలేక హాహాకారాలు చేస్తూ పాఱిపోయింది. అలా కృష్ణుడి ధాటికి దానవ సైన్యం పలాయనం పాఱిపోతుంటే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=193

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, May 13, 2021

శ్రీకృష్ణ విజయము - 226

( నరకాసురుని వధించుట )

10.2-188-వ.
అని పలికి సమ్మానరూపంబులును, మోహనదీపంబులును, దూరీకృత చిత్తవిక్షేపంబులునైన సల్లాపంబులం గళావతిం దద్దయుఁ బెద్దఱికంబు సేసి, తత్కరకిసలయోల్లసిత బాణాసనంబు మరల నందుకొనియె; నప్పుడు సురవైరి మురవైరి కిట్లనియె.
10.2-189-క.
"మగువ మగవారి ముందఱ
మగతనములు సూప రణము మానుట నీకున్
మగతనము గాదు; దనుజులు
మగువల దెసఁ జనరు మగలమగ లగుట హరీ! "
10.2-190-వ.
అనిన హరి యిట్లనియె.

భావము:
ఈ విధంగా, బహు మన్నన విధములు, అనురాగ కలితములు, మనసులోని కలవరపాటు తొలగించేవీ, ముచ్చటగొలిపేవీ అయిన మాటాలు మాటలాడుతూ, సకలకళా ప్రవీణ అయిన తన ఇష్ట సఖి చేతులో ఉన్న విల్లును గౌరవ పూర్వకముగా శ్రీకృష్ణుల వారు తీసుకున్నారు. అప్పుడు, నరకాసురుడు, మురాసుర సంహారి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. “ఇలా వీర పురుషుల ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తుంటే, యుద్ధం చేయకుండా కూర్చోవడం నీకు మగతనం కాదు సుమా. మేము రాక్షసేశ్వరులం, పరాక్రమశాలులైన మగవారినే శాసించే మొగుళ్ళం, కనుక ఆడవారి జోలికి వెళ్ళం” అని పౌరుషంగా మాట్లాడుతున్న నరకాసురుడితో సకల పాపాలాను హరించే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=189

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 225

( నరకాసురుని వధించుట )

10.2-186-వ.
అయ్యవసరంబునం గంససంహారి మనోహారిణిం జూచి సంతోషకారియుం, గరుణారసావలోకన ప్రసారియు, మధురవచన సుధారస విసారియుం, దదీయ సమరసన్నాహ నివారియునై యిట్లనియె.
10.2-187-క.
"కొమ్మా! దానవ నాథుని
కొమ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై
కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ
గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్. "

భావము:
అలా దానవ సైన్యంపై విజయం సాధించగా కంసుని సంహరించిన వాని మనసును దోచిన వీరనారి సత్యభామను చూసి కృష్ణుడు సంతోషం ఉప్పొంగేలా, కరుణాకటాక్ష వీక్షణలు వీక్షిస్తూ, మృదు మధుర అమృత పూరిత పలుకులతో ఆమె రణోద్రేకాన్ని శాంతింపజేస్తూ ఇలా అన్నాడు “ఓ కాంతా రత్నమా! కాంచితి నీ రణకౌశలము. రాక్షస రాజు సైన్యం మొత్తం ఓడి పాఱిపోయింది. ఇది ఒక గొప్ప విజయం సుమా. అందుకే మెచ్చుకుంటున్నాను. నీకు కావలసిన ఆభరణాలు ఏవైనా సరే కోరుకో ఇచ్చేస్తాను.”

విశేషాంశం:
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, “కొమ్మా” అనే అక్షర ద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకౌశల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాలా అన్నట్లు ఉంటుంది “10.2-172-క. లేమా…” పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=187

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, May 11, 2021

శ్రీకృష్ణ విజయము - 224

( సత్యభామ యుద్ధంబు )

10.2-183-సీ.
రాకేందుబింబమై రవిబింబమై యొప్పు-
  నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతువై ఘన ధూమకేతువై-
  యలరుఁ బూఁబోఁడి చేలాంచలంబు;
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై-
  మెఱయు నాకృష్టమై మెలఁత చాప;
మమృత ప్రవాహమై యనల సందోహమై-
  తనరారు నింతిసందర్శనంబు;
10.2-183.1-తే.
హర్షదాయియై మహారోషదాయియై
పరఁగు ముద్దరాలి బాణవృష్ణి;
హరికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.
10.2-184-వ.
ఇవ్విధంబున.
10.2-185-క.
శంపాలతాభ బెడిదపు
టంపఱచే ఘోరదానవానీకంబుల్‌
పెంపఱి సన్నాహంబుల
సొంపఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్.

భావము:
ఏక కాలంలో ఆ సుందరాంగి ఒక ప్రక్క పతిపై అనురాగం, ఒక ప్రక్క శత్రువుపై పరాక్రమం కురిపిస్తోంది; అప్పుడు, ఆమె నిండు ముఖ పద్మమును నల్లనయ్యకు చంద్ర బింబము లాగా, నరకాసురునికి సూర్యమండలం లాగా కనబరుస్తోంది; అందమైన ఆ అతివ పైట కొంగు కన్నయ్యకు కందర్పుని జెండాలాగా, ఆ ధూర్తుడికి ధూమకేతువు లాగా కనబడుతొంది; ఆమె చేతి విల్లు మానసచోరుడికి మన్మథ భావాలు ఆవరిస్తున్నట్లుగా, ఆ దానవుడి పాలిటికి ప్రళయకాలపు సూర్యుని చుట్టి ఉన్న పరివేషంలాగా బహు ఆకర్షణీయంగా మెరుస్తోంది; ఆ సుందరి సౌందర్యం గోపయ్యకు అమృత ధారలను, అసురుడికి అగ్నిశిఖలను చూపెట్టుతూ మెరిసిపోతోంది; ఆ భామ బాణవర్షాలు హరికి హర్షమును, అరికి మహా రోషమును కలిగిస్తున్నాయి; అలా అక్కడికక్కడే శృంగార, వీర రసాలు ఒలికిస్తూ వీరనారి సత్యభామ విజృంభించింది. ఆ విధంగా సత్యభామ చేస్తున్న యుద్ధంలో మెఱుపు తీగల వంటి ఆమె బాణా పరంపరలతో అంత భయకర రాక్షస సైన్యమూ ఓడిపోయి, గర్వం అణగి, వెన్నుచూపి, చెదిరి, నరకాసురుని మరుగు జొచ్చింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=20&Padyam=185

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 223

( సత్యభామ యుద్ధంబు )

10.2-181-సీ.
వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ-
  బాణాసనం బెట్లు పట్ట నేర్చె?
మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ-
  గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె?
సరవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే-
  నిపుణత సంధించె నిశితశరముఁ?
జిలుకకుఁ బద్యంబు సెప్ప నేరని తన్వి-
  యస్త్రమంత్రము లెన్నఁ డభ్యసించెఁ?
10.2-181.1-ఆ.
బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే
గతి నొనర్చె సింహగర్జనములు?
ననఁగ మెఱసెఁ ద్రిజగదభిరామ గుణధామ
చారుసత్యభామ సత్యభామ.
10.2-182-శా.
జ్యావల్లీధ్వని గర్జనంబుగ; సురల్‌ సారంగయూథంబుగా;
నా విల్లింద్రశరాసనంబుగ; సరోజాక్షుండు మేఘంబుగాఁ;
దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్.

భావము:
వీణనే చక్కగా పట్టుకోలేని పడతి, విల్లు ఎక్కుపెట్టడం ఎలా నేర్చిందో? తీగను ఆలంబనగా ఉండే చెట్టు మీదకు ఎక్కించ లేని తన్వి, పెద్దవింటికి నారిని ఎలా సంధించిందో? ముత్యాల గవ్వలాటలు ఆడదామంటే వాటిని వెయ్యలేననే భామ, వాడి బాణాలను ఎలా ప్రయోగించిందో? చిలుకకు పలుకులు నేర్పలేని చిన్నది, అస్త్రాలు వాటి మంత్రాలు ఎప్పుడు నేర్చిందో? మాట్లాడు మాట్లాడు అన్నా ఎక్కువ మాట్లాడని మగువ, యుద్ధంలో సింహగర్జనలు ఎలా చేసిందో? అని ఆశ్చర్యపోయేలా ఆ యుద్ధభూమిలో ముల్లోకాలకు పొగడదగ్గ సుగుణాల రాశి, చక్కదనాల చక్కని చుక్క, సత్యభామ భాసిల్లింది. అల్లెతాడు మోతలే ఉరుములుకాగా; దేవతలు వానకోయిల గుంపులుకాగా; ఆ విల్లే ఇంద్రధనుస్సు కాగా; పద్మాక్షుడు, కృష్ణుడే మేఘముకాగా; తానే మెఱుపుతీగె కాగా; దేవతలనే జయించిన ఆ భీకర రాక్షసదేహం అనే కార్చిచ్చును చల్లార్చే అనేక బాణములు అనే నీటి తుంపరలు ధారలు కాగా; నీరుగార్చే వర్షాకాలమా అనిపించేలా ఆ భామ సత్యాదేవి శరపరంరపరను ప్రయోగించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=20&Padyam=181

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, May 10, 2021

శ్రీకృష్ణ విజయము - 222

( సత్యభామ యుద్ధంబు )

10.2-179-మ.
అలినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో
నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో
వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై.
10.2-180-సీ.
బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల-
  రణరంగమున కెట్లు రాఁ దలంచె?
మగవారిఁ గనినఁ దా మఱుఁగుఁ జేరెడు నింతి-
  పగవారి గెల్వనే పగిదిఁ జూచెఁ?
బసిఁడియుయ్యెల లెక్క భయ మందు భీరువు-
  ఖగపతి స్కంధమే కడిఁది నెక్కె?
సఖుల కోలాహల స్వనము లోర్వని కన్య-
  పటహభాంకృతుల కెబ్భంగి నోర్చె?
10.2-180.1-ఆ.
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
నలసి తలఁగిపోవు నలరుఁబోఁడి
యే విధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?

భావము:
తుమ్మెద నీలం ముంగురులతో అలరారుతున్న ఆ సత్యభామ, ఎడమపాదం ముందుకు పెట్టి కుడికాలు వంచి చెమటకు తడిసి ముఖాన వ్యాపించిన ముంగురులతో చెవిదాకా లాగిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివేళ్ళ గోళ్ళ కాంతులతో వైరిసమూహం వైపు గురిచూస్తూ గుండ్రని ధనుస్సు నుండి వదలుతున్న శరపరంపరలతో శత్రువులను సంహరిస్తూ శోభిల్లింది. బొమ్మల పెండ్లిండ్లకే వెళ్ళని ముద్దరాలు, యుద్ధరంగాని కెలా రావాలని భావించిందో? మగవారిని చూడగానే చాటుకు వెళ్ళే లతాంగి, పగవారిని గెలవాలని ఎలా అనుకుందో? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడతి, గరుత్మంతుడి వీపుపై ఎలా ఎక్కిందో? చెలికత్తెల కోలాహలమే ఆలకింపలేని ముగ్ధ, భేరీలు తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా ఓర్చుకుంటున్నదో? నెమిళ్ళకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల, ఎడమపాదం ముందు కుంచి కుడిపాదం వంచి సంగరరంగంలో శత్రువుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైందో? అంతా వింతే.

విశేషాలు:
అసలే అసమాన సౌందర్య నారీ రత్నం, మథురానగరి అంతఃపుర వాసిని, శ్రీకృష్ణునంతటి వాని పట్టపు మహిషి. హంసతూలికా తల్పములు, బంగరు తూగుటుయ్యలలు, నానావిధ భూషణ, లేపనాదుల సౌఖ్యాలకు అలవాలమైన జీవన శైలి. అట్టి కాంతామణి కఠోర భీకర రాక్షసమూకలతో యుద్ధానికి వచ్చిందట. అది కేళీ వేదికలపై నుండి చెలులతో చేసే లీలారణరంగం కాదు. ఎత్తున ఎగురుతూ ఉండే పక్షీంద్రుని మూపున ఉండి అస్త్ర శస్త్రాల పరంపరలతో ఏమరుపా టన్నది లేని అరివీర భయంకర యుద్ధం. దానికి తగ్గని సందర్భశుద్ధి, వ్యక్తిత్వ పరిపుష్టి ప్రకటనలు చూపుతూ; లలిత లావణ్యాలు వదలకుండా, కర్కశ రణకౌశలం చూపుతూ; శృంగార రసం, వీరరసం కలిసి ఉప్పొంగి పారాయి; మన పోతనామాత్యుల వారి గంటంనుండి జాలువారాయి; మన మానస వాకిళ్ళను అలరారిస్తూ, ఇదేకాదు ముందరి అయిదు, తరువాతి మూడు పద్యాల పోకిళ్ళు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=20&Padyam=180

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 221

( సత్యభామ యుద్ధంబు )

10.2-177-సీ.
సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు-
  శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు-
  గండమండలరుచిఁ గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు-
  బాణజాలప్రభాపటలి నడఁప
శరపాత ఘుమఘుమశబ్దంబు పరిపంథి-
  సైనిక కలకల స్వనము నుడుప
10.2-177.1-తే.
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల
నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.
10.2-178-మ.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

భావము:
బంగారుకంకణాల ఝణఝణ ధ్వనులు, వింటినారీధ్వనితో కలసిపోగా; చెవికమ్మలకు పొదగిన మణుల ధగధగ కాంతులు, చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా; అందమైన క్రీగంటి చూపుల ధగధగ కాంతులు, బాణాల కాంతులను కప్పివేయగా; శరములు ప్రయోగించుట వలన కలిగిన ఘుమఘుమ శబ్దం, శత్రుసైన్యాల కలకల ధ్వనులను అణచివేయగా; వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం, లాగడం, ప్రయోగించడం గూడ గుర్తించరానంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయసాగింది. చంద్రముఖి సత్యభామ ఒక ప్రక్క కోపంతో కనుబొమలు ముడివేసి వీరత్వం మూర్తీభవించినట్లు కను లెఱ్ఱచేసి, వాడి బాణాలను ప్రయోగిస్తూ శత్రువు నరకాసురుడిని నొప్పిస్తోంది; మరొక ప్రక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరిస్తూ ప్రియుడైన శ్రీకృష్ణుడిని మెప్పిస్తోంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=20&Padyam=177

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, May 9, 2021

శ్రీకృష్ణ విజయము - 220

( సత్యభామ యుద్ధంబు )

10.2-174-క.
హరిణాక్షికి హరి యిచ్చెను
సురనికరోల్లాసనమును శూరకఠోరా
సురసైన్యత్రాసనమును
బరగర్వనిరాసనమును బాణాసనమున్.
10.2-175-శా.
ఆ విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే
షావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై
తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం దన్వంగి దైత్యాంగనా
గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్.
10.2-176-క.
నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!

భావము:
శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని, ఎంతటి ఘోర వీర రాక్షసులకు అయినా సంతాపాన్నీ కలిగించేదీ, శత్రువుల గర్వాన్ని అణచివేసేదీ ఐన ధనుస్సును లేడికన్నుల చిన్నది సత్యభామ చేతికి అందించాడు. సత్యభామాదేవి కృష్ణభగవాను డిచ్చిన ఆ ధనుస్సు అందుకుంది. దానితో ఎక్కడలేని శక్తి వచ్చింది. గొప్ప తేజోవిశేషంతో మహాప్రతాపంతో వీరలోకానికి తేరిచూడరాని రీతిలో విలసిల్లింది. యుద్ధోత్సాహంతో ఆ నారీమణి రాక్షసస్త్రీల కంఠాలలోని మంగళసూత్రాలు తెగేలాగ నారి బిగించి, ధనుష్టంకారం చేసింది. ఆ నారీమణి, వైరిసేనలకు అధైర్యం కలిగేలాగ శత్రువుల ఏనుగులు మొదలైనవి మూర్చ పొందేలాగా నారి సారించింది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=20&Padyam=176

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, May 7, 2021

శ్రీకృష్ణ విజయము - 219

( సత్యభామ యుద్ధంబు )

10.2-170-శా.
వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ
శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ
బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంభద్వీరసంరంభయై
యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్.
10.2-171-క.
జన్యంబున దనుజుల దౌ
ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ
జన్యవతిఁ జూచి యదురా
జన్యశ్రేష్ఠుండు సరససల్లాపములన్.
10.2-172-క.
"లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "

భావము:
ఆ లేడికన్నుల సుందరి సత్యభామ, వడివడిగా వాలుజడ ముడివేసుకుంది; చీరముడి బిగించింది; భూషణాలను సరిచేసుకుంది; పైట సవరించుకుంది; ముఖచంద్రుడు కాంతులీనుతుండగా తన కాంతుడు శ్రీకృష్ణుడి ముందు నిబ్బరంగా నిలబడింది.
అందాల రాశి శ్రీకృష్ణ భగవానుని ఇష్ట సఖి సత్య రణ సన్నాహానికి, వేసిన సాహితీ అలంకారాలు ఆ “ణ”కార ప్రాస; వేణిం, శ్రేణిం, పాణిం, ఏణీలోచన పదాల సొగసు; పద్యం నడకలోని సౌందర్యం బహు చక్కగా అమర్చిన పోతన్నకు జోహార్లు. రణరంగంలో రాక్షసుల దౌర్జన్యాలను అణచడానికి సిద్ధమై వచ్చిన సత్యభామను చూసి యాదవ ప్రభువులలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు సరసమైన మాటలతో ఇలా అన్నాడు. “భామా! మేము రాక్షసులను గెలువలేమా? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలా రా! యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా, అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=20&Padyam=172

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, May 5, 2021

శ్రీకృష్ణ విజయము - 218

( నరకాసుర వధకేగుట )

10.2-167-వ.
మఱియు హరి శరజాలచక్రనిహతులయి తనవారలు మడియుటకు వెఱంగుపడి రోషించి గరుడగమనుని దూషించి తన్ను భూషించుకొని సరకు సేయక నరకుండు వరకుండలప్రముఖాభరణభూషితుండయి దానసలిలధారాసిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు నైన వేదండంబులు తండంబులై నడువ వెడలి భండనంబునకుం జని.
10.2-168-మ.
బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి
స్థల శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
లలనారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
కని కలహంబునకు నరకాసురుండు గమకింపం దమకింపక విలోకించి సంభ్రమంబున.

భావము:
యుద్ధంలో తన పక్షం వారంతా శ్రీకృష్ణుడి చక్రానికి బాణాలకు బలి అయిపోవడంతో నరకాసురుడు ఆశ్చర్యపోయి; రోషంతో శ్రీహరిని దూషించాడు; తనను తాను పొగడుకున్నాడు; కృష్ణుడి పరాక్రమాన్ని తిరస్కరించాడు; కుండలాలు మొదలైన అనేక ఆభరణాలు ధరించి, దానజలంతో తడిసిన గండస్థలాలు గొప్ప తొండాలూ గల ఏనుగుల గుంపులతో యుద్ధరంగానికి బయలుదేరాడు. మహాబలశాలి నరకాసురుడు, నీలవర్ణంతో శోభిస్తున్న రణకోవిదుడైన శ్రీకృష్ణుడిని చూసాడు. అప్పుడు, శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మూపుమీద భార్య సత్యభామతో ఆసీనుడై ఉండి, చంద్రబింబం మీద మెఱపుతీగతో కూడిన మేఘంలా ప్రకాశిస్తున్నాడు. వీపున తూపులపొది తాల్చిన ఆ గోపాలకృష్ణుడు ఆమెతో సంగ్రామ విశేషాలు సంభాషిస్తున్నాడు. ఈ విధంగా ఉన్న శ్రీకృష్ణుడిని చూసి నరకాసురుడు యుద్ధానికి సిద్ధం కావడం సత్యభామ చూసింది. ఆమె ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, తొందర తొందరగా.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=168

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 217

( నరకాసుర వధకేగుట )

10.2-165-వ.
ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్ఛిన్నంబు లయిన వజ్రివజ్రధారా దళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుఁ గూలిన, వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్దను మర్దింతు మని రణకుర్దనంబునం దామ్రుండు, నంతరిక్షుండు, శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నననేడ్వురు యోధులు సక్రోధులై కాలాంతకచోదితం బైన ప్రళయపవన సప్తకంబు భంగి నరకాసుర ప్రేరితులై రయంబునఁ బీఠుండనియెడు దండనాథుం బురస్కరించుకొని, పఱతెంచి హరిం దాఁకి శర శక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన.
10.2-166-ఉ.
ఆ దనుజేంద్రయోధ వివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్
మేదినిఁ గూలనేయుచు సమిద్ధనిరర్గళ మార్గణాళిఁ గ్ర
వ్యాదకులాంతకుండసుర హస్త భుజానన కంఠ జాను జం
ఘాదులఁ ద్రుంచివైచెఁ దిలలంతలు ఖండములై యిలం బడన్.

భావము:
దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు తెగి కూలిన పర్వతం మాదిరి, శ్రీకృష్ణుడి చక్రం దెబ్బకు శిరస్సులు తెగిన మురాసురుడు నీటిలో కూలిపోయాడు. తండ్రి మరణానికి దుఃఖించిన మురాసురుని ఏడుగురు కుమారులు శోకోద్రిక్తులై జనార్దనుడు అయిన శ్రీకృష్ణుడిని సంహరిస్తామని యుద్ధానికి బయలుదేరారు. కాలాంతకునిచే పంపబడిన ప్రళయకాలం నాటి పవనసప్తకం (ప్రవహము, ఆవహము, ఉద్వహము, సంవహము, వివహము, ప్రతివహము, పరావహము అను ఈ ఏడూ సప్తవాయువులు అనబడును) లాగా నరకాసురుడి చేత ప్రేరేపింపబడిన ఆ తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే ఏడుగురు యోధులు; పీఠుడు అనే సేనానాయకుడి నాయకత్వంలో యుద్ధానికి వచ్చి బాణాలు, శక్తి, గద, రకరకాల కత్తులు, శూలం మొదలైన ఆయుధాలను కృష్ణుడి మీద ప్రయోగించారు. ఆ రాక్షస యోధులు ప్రయోగించే ఆయుధాలు అన్నింటినీ పరాక్రమంతో నేలపాలు చేస్తూ, నిరాటంకంగా బాణాలను ప్రయోగించి, శ్రీకృష్ణుడు ఆ రాక్షసుల చేతులు, కాళ్ళు, కంఠాలు మొన్నగు అవయవాలు అన్నింటినీ నువ్వు గింజలంత ముక్కలు ముక్కలై క్రింద పడేలా ఖండించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=166

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, May 4, 2021

శ్రీకృష్ణ విజయము - 216

( నరకాసుర వధకేగుట )

10.2-163-క.
గరుడునిపైఁ బడ వచ్చిన
మురశూలము నడుమ నొడిసి ముత్తునియలుగాఁ
గరముల విఱిచి ముకుందుఁడు
ముర ముఖముల నిశితవిశిఖములు వడిఁ జొనిపెన్.
10.2-164-మ.
గద వ్రేసెన్ మురదానవుండు హరిపైఁ; గంసారియుం దద్గదన్
గదచేఁ ద్రుంచి సహస్రభాగములుగాఁ గల్పించె; నాలోన వాఁ
డెదురై హస్తము లెత్తికొంచు వడి రా నీక్షించి లీలాసమ
గ్రదశన్ వాని శిరంబులైదును వడిన్ ఖండించెఁ జక్రాహతిన్.

భావము:
గరుత్ముంతుడిపై మురాసురుడు ప్రయోగించిన ఆ శూలాన్ని శ్రీకృష్ణుడు మధ్యలోనే ఒడిసిపట్టుకుని, మూడు ముక్కలుగా విరిచేసాడు. ముకుందుడైన కృష్ణుడు ఆ రాక్షసుడి ముఖాలమీద బలంగా నాటేలా వాడి బాణాలను ప్రయోగించాడు. ఆ ముర రాక్షసుడు హరి మీద తన గదను ప్రయోగించాడు, కంసుని సంహరించిన ఆ కృష్ణుడు ఆ గదను తన గదతో వెయ్యి ముక్కలయ్యెలా విరగొట్టాడు. ఇంతలో, ఆ దానవుడు చేతులు పైకెత్తుకుని శరవేగంతో తన మీదకు వస్తుండడం చూసి శ్రీకృష్ణుడు చక్రం ప్రయోగించి అతడి అయిదు తలలనూ అవలీలగా ఖండించేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=164

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 215

( నరకాసుర వధకేగుట )

10.2-160-వ.
అంత లయకాల కాలాభ్రగర్జనంబు పగిది నొప్పు నమ్మహా ధ్వని విని పంచశిరుం డైన మురాసురుండు నిదుర సాలించి యావులించి నీల్గి లేచి జలంబులు వెడలివచ్చి హరిం గని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్ష్యుండై కరాళించుచుం దన పంచముఖంబులం పంచభూతమయం బయిన లోకంబుల మ్రింగ నప్పళించు చందంబునం గదిసి యాభీల కీలాజటాలంబగు శూలంబున గరుడుని వైచి భూనభోంతరంబులు నిండ నార్చుచు.
10.2-161-క.
దురదురఁ బరువిడి బిరుసున
హరి హరి! నిలు నిలువు మనుచు నసురయుఁ గదిసెన్
మురముర! దివిజుల హృదయము
మెరమెర యిదె యడఁగు ననుచు మెఱసెన్ హరియున్.

భావము:
ప్రళయకాలం నాటి కాలమేఘ గర్జన వంటి ఆ పాంచజన్య ధ్వనిని విని, అయిదు తలలు గల ఆ మురాసురుడు నిద్రమేల్కొన్నాడు. ఆవులించి లేచి, నీటిలో నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడిని చూసాడు. ప్రళయకాలం నాటి అగ్నిజ్వాలలాగ మండుతూ చూడశక్యం కానివాడై పెడబొబ్బలు పెడుతూ, పంచభూతాలతో కూడిన అన్ని లోకాలను తన ఐదు నోళ్ళతో మ్రింగబోతున్నాడా అన్నట్లు నోళ్ళు తెరుచుకుని, శ్రీకృష్ణుడిని సమీపించాడు. మురాసురుడు భయంకరమైన అగ్నిజ్వాలల వంటి జడలతో కూడిన తన శూలాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు. ముందుకు పరిగెత్తుకు వస్తూ గర్వంతో “కృష్ణా! ఆగు; అక్కడే ఆగు; కృష్ణా!” అంటూ ఆ రాక్షసుడు కృష్ణుని సమీపించాడు. అంతట, శ్రీహరి “దేవతల మనోవ్యధ ఈనాటితో తీరుతుంది” అని భావిస్తూ తేజరిల్లాడు.

విశేషాంశం:
అవే అక్షరాలు కాని, పదాలు కాని మరల మరల వస్తుంటే అనుప్రాసం అంటారు. రెండేసి వ్యంజనము (అక్షరములు) ఎడతెగకుండా మరల మరల వస్తే ఛేకానుప్రాసము అంటారు. ఛేకులు అనగా విద్వాంసులు పలుకు కమ్మదనము ఎఱిగినవారు. అట్టివారి మెప్పు గన్న అనుప్రాసము కనుక ఇది ఛేకానుప్రాసము అనే అలంకారం అయినది. ఈ దురదుర, నిలునిలు, మురముర, మెరమెర అనుప్రాసాల అందాలు ఆస్వాదించండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=161

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, May 1, 2021

శ్రీకృష్ణ విజయము - 214

( నరకాసుర వధకేగుట )

10.2-157-మ.
గదచేఁ బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత
ప్రదరశ్రేణుల శస్త్రదుర్గచయమున్ భంజించి చక్రాహతిం
జెదరన్ వాయుజలాగ్ని దుర్గముల నిశ్శేషంబులం జేసి భీ
ప్రదుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్.
10.2-158-వ.
మఱియును.
10.2-159-శా.
ప్రాకారంబు గదా ప్రహారముల నుత్పాటించి యంత్రంబులున్
నాకారాతుల మానసంబులును భిన్నత్వంబు సెందంగ న
స్తో కాకారుఁడు శౌరి యొత్తె విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రే
ఖాకాఠిన్యముఁ బాంచజన్యము విముక్తప్రాణి చైతన్యమున్.

భావము:
శ్రీకృష్ణుడు తన గదాదండంతో పర్వతదుర్గాలను ముక్కలు ముక్కలు చేసాడు; బాణసమూహంతో శస్త్రదుర్గాల సమూహాన్ని ఛేదించి వేశాడు; వాయు జల అగ్ని కోటలను చక్రంతో కొట్టి నాశనం చేసాడు; అరిభయంకరు డైన అరవిందాక్షుడు, మురాసురుని పాశాలను ఖడ్గంతో ఖండించాడు. అంతేకాక. గదలతో కొట్టి ప్రాకారాలను, యంత్రాలను పడగొట్టాడు, రాక్షసుల హృదయాలు భేదిల్లేలా మహానుభావు డైన వాసుదేవుడు ముల్లోకాలను మూర్చిల్లజేసేదీ ప్రళయకాల మేఘనిర్ఘోషం వంటి కఠోరధ్వని కలదీ అయిన పాంచజన్య మనే తన శంఖాన్ని పూరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=159

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 213

( నరకాసుర వధకేగుట )

10.2-155-ఉ.
"దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ
తో నరుదెంతు" నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్.
10.2-156-వ.
ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబులఁగ్రుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగన మార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన ప్రాగ్జ్యోతిషపురంబు డగ్గఱి.

భావము:
“నాథా! నీ బాహువులు అనే దుర్గాల అండ నాకు ఉండగా, వారు రాక్షస సమూహాలైతే మాత్రం నాకేం భయం. నేను నీతో వస్తాను.” అని అభిమానవతి అయిన సత్యభామ పద్మాల వంటి తన చేతులు జోడించి మరీ బ్రతిమాలింది. శ్రీకృష్ణుడు సంతోషించి, సత్యభామ వంక మెచ్చుకోలుగా చూసాడు. ఈలాగున తనను బ్రతిమాలిన సత్యభామను తన కలువల వంటి చేతులతో గరుత్ముంతునిపై ఎక్కించుకుని, ఆమెతోపాటు ఆకాశమార్గాన మురాసురుని పట్టణం ప్రాగ్జ్యోతిషాన్ని చేరాడు. ఆ పట్టణం పర్వతదుర్గాలతో, శస్త్రదుర్గాలతో, వాయుదుర్గాలతో, జలదుర్గాలతో, అగ్నిదుర్గాలతో ఇలాంటి అనేక కోటలతో జయింపరానిదై ఉంది. అది అనేకమైన మురాసురుని మాయా పాశాలుచే పరిరక్షింపబడి దుర్భేధ్యమై ఉంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=155

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :