Sunday, October 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౩(383)

( శిశుపాలుని వధించుట ) 

10.2-804-వ.
మఱియు నయ్యిందువదన లందంద మందగమనంబునం జెందు ఘర్మజల బిందుసందోహ కందళిత మందహాసచంద్రికాసుందర వదనారవిందంబుల నిందిందిర రుచిర చికురబృందంబులు చిందఱవందఱలై సందడిగొన, నమందానందహృదయలై, సువర్ణశృంగ సంగతంబులైన సంకుమద మలయజ ముఖ సురభితోయంబులు సముదాయంబులై తమ తోయంబులవారి పయిం జల్లుచుఁ జెందొవలఁ గెందలిరుల రచియించిన చిమ్మనగ్రోవులఁ దావులు గల పూఁదేనియలు నించి, వావులు దెలిపి, ఠేవలు మీఱఁ, గ్రేవల నుండి యిమ్ములం గని చిమ్ముచు, మృగమద కుంకుమ పంకంబునుం గొంకక బింకములం జంకెన లొలయం బంకజ సన్నిభంబు లగు మొగంబుల నేమఱించి చరుముచు నుల్లంబులు పల్లవింపఁ బెల్లడరి యందియలు గల్లుగల్లని మొరయఁ, గ్రేళ్లుదాఁటుచుం జారు చంద్రికాసార ఘనసారధూళి మిళిత రజనీపరాగంబు రాగంబు రంజిల్లం, గరంబులం బుచ్చికొని శిరంబులం జల్లుచుఁ జిత్తంబుల నమ్మత్తకాశినుల వృత్తంబులగు కుచంబుల కెత్తువత్తుమని బిత్తరించు పువ్వుగుత్తులం దత్తఱంబున వ్రేయుచుఁ, బరిహసించుచు, నన్యోన్యకర కిసలయ కనకకరండభరితంబగు పన్నీటం జెంగావి జిలుఁగుఁ బుట్టంబులు దట్టంబుగాఁ దోఁగి మర్మంబులు బయలు పడిన నగ్గలంబు లగు సిగ్గులకు నొప్పిదంబులగు తమ కనుఱెప్ప లడ్డంబు సేయుచుఁ, బురుషులుం దాము నారామ లభిరామలీలా రసోక్తు లెనయ, నంతరంగంబుల సంతసంబునం బంతంబులిచ్చుచు వసంతంబు లాడి రవ్వేళ, నతుల విమానారూఢులైన యింద్రపురంధ్రీజనంబులుంబోలె హాటకశిబిక లెక్కి, నిజచేటికాజనంబులు సేవింపఁ జనుదెంచు భూకాంతకాంతాజనంబులం దమ సరసంబులకు నర్హంబులైన ధరణీపాల వధూలలామంబు లాదరించు చెలులపైఁ దమ సఖీజనంబులం బురికొల్పి చల్లించుచు, భావగర్భితంబులగువారి చతురసరసోక్తుల మందహాసచంద్రికలు ముఖకమల లీలావిలాసలక్ష్మిం బ్రోదిసేయం జని రవ్విధంబున, నిజసామ్రాజ్య విభవంబు పూజ్యంబుగా నజాతశత్రుండు గంగాప్రవాహంబున కరిగి యందు నిజవధూయుక్తుండై శాస్త్రోక్తప్రకారంబున నవభృథస్నానం బాచరించె; నా సమయంబున. 

భావము:
ఆ వేశ్యాంగనలు చిరునవ్వులు చిందే ముఖారవిందాల మీద చిందరవందరగా తుమ్మెదలవంటి ముంగురులు పడుతుండగా; పరిమళభరితమైన పన్నీరు జల్లులు బంగారు కొమ్ములతో ప్రక్కనున్నవారి మీద చల్లుతూ; ఎఱ్ఱకలువలు, ఎఱ్ఱచిగురులి ఆకులతో చేసిన చిమ్మనగ్రోవులతో మకరందం నింపి వరసైనవారి మీద చిమ్ముతూ; కస్తూరితో మిళితమైన కుంకుమపంకాన్ని ప్రక్కనున్నవారి ముఖాలపై పట్టించుతూ; పూగుత్తులతో పరస్పరం సరదాగా కొట్టుకుంటూ; ఒకరితో ఒకరు పరిహాసమాడుతూ వసంతా లాడుకున్నారు. బంగారుపల్లకీల నెక్కి చెలికత్తెలు సేవింపగా వస్తున్న దేవకాంతలవంటి రాజకాంతలు తమ సరసాలకు యోగ్యురాండ్రైన రాచకాంత లాదరించే చెలికత్తెల మీదకి తమ చెలికత్తెలను పురికొల్పి వసంతాలు చల్లిస్తూ; నర్మగర్భసంభాషణలు చేస్తూ; చిరునవ్వులు చిందిస్తూ; ప్రయాణం సాగించారు. ఇలా మహాసామ్రాజ్య వైభవంతో అజాతశత్రువు ధర్మరాజు గంగానదికి వెళ్ళి అక్కడ తన భార్యలతో కలిసి శాస్త్రోక్తంగా అవభృథస్నానం చేసాడు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=804 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, October 30, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౨(382)

( శిశుపాలుని వధించుట ) 

10.2-802-వ.
మఱియు యదు, సృంజయ, కాంభోజ, కురు, కేకయ, కోసల, భూపాల ముఖ్యులు చతుర్విధ సేనాసమేతులై ధరణి గంపింప వెన్నడి నడతేర, ఋత్విఙ్నికాయంబును సదస్యులను బ్రహ్మ ఘోషంబు లొలయ మున్నిడికొని, శోభమానానూన ప్రభాభాసమాన సువర్ణమయమాలికా దివ్యమణిహారంబులు గంఠంబునం దేజరిల్ల, నున్నత జవాశ్వంబులం బూన్చిన పుష్పరథంబుఁ గళత్ర సమేతుండై యెక్కి, యతిమనోహర విభవాభిరాముండై చనుదెంచు చుండె; నప్పుడు వారాంగనా జనంబులు దమ తమ వారలం గూడికొని.
10.2-803-సీ.
కనకాద్రిసానుసంగత కేకినుల భాతిఁ-
  గ్రొమ్ముళ్ళు వీఁపుల గునిసి యాడఁ,
దరళ తాటంక ముక్తాఫలాంశుద్యుతుల్‌-
  చెక్కుటద్దములతోఁ జెలిమిసేయఁ,
బొలసి యదృశ్యమై పోని క్రొమ్మెఱుఁగుల-
  గతులఁ గటాక్షదీధితులు దనర,
మంచుపై నెగయ నుంకించు జక్కవ లనఁ-
  జన్నులు జిలుఁగు కంచలల నఱుమ,
10.2-803.1-తే.
మహితకుచభారకంపితమధ్య లగుచు,
నర్థి మొలనూళ్ళు మెఱయఁ బయ్యదలు జారఁ,
గరసరోజాతకంకణక్వణనములునుఁ
జరణనూపురఘోషముల్‌ సందడింప. 

భావము:
అంతేకాకుండా, ఆ అవభృథ స్నానానికి యదు, సృంజయ, కాంభోజ, కేకయ, కోసల దేశాల రాజులు చతురంగ బలాలతో వెంట వస్తున్నారు. ఋత్విక్కులు సదన్యులు వేదపారాయణం చేస్తూ ముందు నడుస్తున్నారు. ఆ విధంగా ధర్మరాజు సువర్ణమయమైన దివ్యమణిహారాలు దేదీప్యమానంగా కంఠంలో ప్రకాశిస్తుండగా, మిక్కిలి వేగవంతమైన గుఱ్ఱాలను పూన్చిన పుష్పరథాన్ని భార్యాసమేతంగా అధిరోహించి మహావైభవంతో ప్రయాణం సాగించాడు. ఆ సమయంలో మేరుపర్వత చరియలలోని నెమిళ్ళలాగ జుట్టుముడులు వీపుల మీద నృత్యం చేస్తుండగా; ముత్యాల చెవిదుద్దుల కాంతులు చెక్కుటద్దాలతో స్నేహం చేస్తుండగా; చెరిగిపోని మెరుపుతీగల్లాంటి కడగంటి చూపులు వెలుగులు వెదజల్లుతుండగా; మంచు మీద నుంచి ఎగరటానికి ప్రయత్నంచేసే జక్కవల మాదిరి స్తనాలు రవికలోనుంచి పైకి ఉబుకుతుండగా; కుచభారంచేత నడుములు చలిస్తూ ఉండగా; మొలనూళ్ళు మెరుస్తుండగా; పైటలు జీరాడుతుండగా; చేతికంకణాల శబ్దాలు కాళ్ళకడియాల సవ్వడులూ సందడిస్తుండగా; వేశ్యాంగనలు వారితో కలసి నడిచారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=803 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Friday, October 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౧(381)

( శిశుపాలుని వధించుట ) 

10.2-800-వ.
అంత ధర్మనందనుండు ఋత్విగ్గణంబులను సదస్యులను బహుదక్షిణలం దనిపి వివిధార్చనలం బూజించి యవభృథస్నానక్రియా పరితోషంబున.
10.2-801-సీ.
మురజ, మృదంగ, గోముఖ, శంఖ, డిండిమ,-
  పణవాది రవము లంబరము నిండఁ,
గవి, సూత, మాగధ, గాయక, వంది, వై-
  తాళిక వినుతు లందంద బెరయ,
వితతమర్దళ వేణు వీణారవంబుల-
  గతులకు నర్తకీగతులు సెలఁగఁ,
దరళ విచిత్రక ధ్వజపతాకాంకిత-
  స్యందన గజ వాజిచయములెక్కి
10.2-801.1-తే.
సుత, సహోదర, హిత, పురోహితజనంబు
గటక, కేయూర, హార, కంకణ, కిరీట,
వస్త్ర, మాల్యానులేపనవ్రాతములను
విభవ మొప్పారఁ గైసేసి వెడల నంత. 

భావము:
అటు పిమ్మట, ధర్మరాజు యజ్ఞం చేయించిన ఋత్విక్కులను, యజ్ఞానికి విచ్చేసిన సదస్యులను అనేక దక్షిణలతో తృప్తిపొందించి, వివిధ విధాలుగా పూజించి యాగాంతంలో చేసే అవభృథస్నానానికి బయలుదేరాడు. అవభృథ సాన్నానికి బయలుదేరిన ధర్మరాజుని ఆయన కుమారులూ, సోదరులూ, మిత్రులూ. పురోహితులూ హారకేయూర కటకకంకణ కిరీటాది భూషణాలను చక్కగా అలంకరించుకుని, ధ్వజ పతాకాలతో కూడిన రథాలు గుఱ్ఱాలు ఏనుగులు ఎక్కి మహావైభవంతో అనుసరించారు. ఆ సమయంలో, నింగి నిండేలా డోలు, మృదంగము, గోముఖము, శంఖము, డిండిమము, పణవము మున్నగు నానావిధ వాద్యాల ధ్వనులు మ్రోగసాగాయి. కవి, సూత, వైతాళిక, వంది మాగధుల పొగడ్తలు మించసాగాయి. వేణు వీణారవాలకు అనుకూలంగా నాట్యకత్తెలు నృత్యం చేయసాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=801 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, October 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౦(380)

( శిశుపాలుని వధించుట ) 

10.2-796-వ.
అనిన మునివరునకు భూవరుం డిట్లనియె.
10.2-797-క.
"కమలాక్షుని నిందించిన
దమఘోషతనూభవుండు దారుణ మల కూ
పమునుం బొందక యే క్రియ
సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చె మునీంద్రా! "
10.2-798-వ.
అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె.
10.2-799-మ.
"మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా
వధి యే ప్రొద్దుఁ దదీయ రూప గుణ దివ్యధ్యాన పారీణ ధీ
నిధి యౌటన్ శిశుపాలభూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై
విధి రుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా! 

భావము:
ఇలా చెప్పిన శుక యోగీశ్వరుడితో మహారాజు పరీక్షిత్తు ఇలా అన్నాడు. “ఓ మునీశ్వరా! శుకా! శ్రీకృష్ణుడిని అంతగా దూషించిన ఆ దమఘోష సుతుడైన శిశిపాలుడు భయంకర నరకకూపంలో పడకుండా, అంత గొప్పగా భగవంతుడైన కృష్ణుడిలో ఎలా ప్రవేశించాడయ్యా.” ఈ మాదిరిగా సందేహం వెలిబుచ్చిన మహారాజుతో మహర్షి ఇలా అన్నాడు. “ఓ రాజేంద్రా! పరీక్షిత్తూ! మధుసూదనుడైన శ్రీహరి మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండి విడువకుండా నిందించడం పేర, ఎల్లప్పుడు ఆ విష్ణుమూర్తి దివ్యమైన రూప గుణాలను ధ్యానిస్తూ ఉండడం వలన, పాపాలు సమస్తం నుండి విముక్తుడై ఈ శిశుపాలుడు బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని అందుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=799 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, October 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౯(379)

( శిశుపాలుని వధించుట ) 

10.2-794-వ.
అప్పుడు కేకయ సృంజయభూపతులుం దామును వివిధాయుధ పాణులై యదల్చి నిల్చిన వాఁడునుం బిఱుతివక యదల్చి పలకయు వాలునుం గైకొని, భుజాగర్వదుర్వారుండై గోవిందునిఁ దదనువర్తులైన వారలం గుపితుండై నిందింప నమ్ముకుందుం డాగ్రహంబున లేచి తన కట్టెదుర నెదిర్చియున్న శిశుపాలుని రూక్షేక్షణంబుల వీక్షించుచు, నా క్షణంబ తన్మస్తకంబు నిశితధారా కరాళంబైన చక్రంబున నవక్రపరాక్రముండై రుధిరంబు దొరఁగం దునుమ, నమ్మహాకలకలం బాకర్ణించి చైద్యబలంబులు దదీయపక్షచరులైన భూపతులును గనుకనిం బఱచి; రయ్యవసరంబున.
10.2-795-క.
మునివరులును జనపతులునుఁ
గనుఁగొని వెఱఁగంద జైద్యుగాత్రమునందుం
డనుపమ తేజము వెలువడి
వనజోదరు దేహమందు వడిఁ జొచ్చె నృపా! " 

భావము:
ఆ సమయంలో కేకయ రాజులు, సృంజయ రాజులు, పాండవులు ఆయుధాలు ధరించి శిశుపాలుడిని అదలించి నిలబడ్డారు. వాడు కూడ భుజబలగర్వంతో పాండ వాదులను లక్ష్యపెట్టక, కత్తీ డాలూ పట్టుకుని కృష్ణుడిని అతడిని అనుసరించే వారిని కోపంగా నిందించసాగాడు. అప్పుడు ముకుందుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా పోరుకు సిద్ధంగా ఉన్న శిశుపాలుడిని తీవ్రంగా చూస్తూ, బహు వాడి కలదైన తన సుదర్శన చక్రంతో వాడి తల తరిగాడు. ఆ భయంకర కలకలాన్ని వినిన చూసిన, శిశుపాలుడి సైన్యము, అతడి పక్షపు రాజులు తత్తరపాటుతో పారిపోయారు. ఓ పరీక్షిన్మహారాజా! ఆ సమయంలో శిశుపాలుని దేహంనుంచి దేదీప్యమానమైన తేజస్సు వెలువడి ఆ పద్మనాభుడు కృష్ణుడు శరీరంలో ప్రవేశించింది, మునీశ్వరులు రాజులు అది చూసి ఆశ్చర్యపోయారు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=794 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, October 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౮(378)

( శిశుపాలుని వధించుట ) 

10.2-792-చ.
అని తను దూఱనాడిన మురాంతకుఁడా శిశుపాలు వాక్యముల్‌
విని మదిఁ జీరికిం గొనఁడు విశ్రుతఫేరవ రావ మాత్మఁ గై
కొనని మృగేంద్రురీతి మునికోటియు రాజులుఁ బద్మనాభు నా
డిన యవినీతి భాషలకు డెందమునం గడు వంత నొందుచున్.
10.2-793-ఉ.
వీనులుమూసికొంచు వినవిస్మయ మంచు "ముకుంద! మాధవా!
శ్రీనిధి! వీని నేగతికిఁ జేర్చెదొ" యంచు దురాత్ముఁ దిట్టుచు
న్నా నరనాథులున్ మునులు నచ్చట నిల్వక పోవఁ బాండు సం
తానము లప్రమేయ బలదర్ప మహోద్ధత రోషచిత్తులై. 

భావము:
ఇలా శిశుపాలుడు నిందిస్తూ ఉంటే, నక్కకూతలను లెక్కపెట్టని సింహంలాగా శ్రీకృష్ణుడు లక్ష్యపెట్టలేదు కానీ, సభలో ఉన్న ఋషులు, రాజులు, మాత్రం శిశుపాలుడు పలికిన దుర్భాషలకు చాలా బాధపడ్డారు. కృష్ణుడిని నిందిస్తున్న శిశుపాలుడి దురాలాపాలను వినలేక మునులు రాజులు చెవులు మూసుకుని ఆశ్చర్యపడుతూ “ఓ కృష్ణా! వీడిని ఎలా కడతేరుస్తావో ఏమిటో?” అంటూ శిశుపాలుడిని నిందిస్తూ సభ నుంచి నిష్క్రమించారు. పాండవులకు శిశుపాలుడి మీద ఎంతో కోపం వచ్చింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=793 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, October 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౭(377)

( శిశుపాలుని వధించుట ) 

10.2-790-సీ.
గురుదేవశూన్యుండు, కులగోత్రరహితుండు,-
  దలిదండ్రు లెవ్వరో తడవఁ గాన,
మప్పులఁ బొరలెడు, నాదిమధ్యావసా-
  నంబులం దరయ మానంబు లేదు,
బహురూపియై పెక్కుభంగుల వర్తించు,-
  వావి వర్తనములు వరుస లేవు
పరికింప విగతసంబంధుండు, తలపోయ-
  మా నిమిత్తంబున మాని సయ్యెఁ
10.2-790.1-తే.
బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి
వాసి కెక్కదు యీ యదువంశమెల్ల,
బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు
బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు?
10.2-791-క.
జారుఁడు, జన్మావధియునుఁ
జోరుఁడు, ముప్పోకలాఁడు సుమహితపూజా
చారక్రియలకు నర్హుఁడె?
వారక యితఁ" డనుచు నశుభవాక్యస్ఫూర్తిన్. 

భావము:
ఈ కృష్ణుడికి గురువులు దేవుడు లేరు, కులం గోత్రం లేవు, తల్లితండ్రులు ఎవరో తెలియదు, నీటి మీద శయనిస్తాడు, ఆది మధ్యాంతాలు కానరావు, నటుడిలా అనేక రూపాలు ధరిస్తూ రకరకాలరీతులో ప్రవర్తిస్తుంటాడు, వర్తించే వావివరుసులు లేవు, ఏ బాంధవ్యబంధాలు లేవు. ఇతడు మా కారణంగానే మాననీయుడయ్యాడు కానీ, యయాతిశాపం వలన ఈ యదువంశం ప్రసిద్ధి అణగారిపోయింది. వీరి వంశం బ్రహ్మతేజాన్నికోల్పోయింది. ఇలాంటి ఈ గోపాలకుడు బ్రహ్మర్షుల పూజకు ఎలా అర్హుడవుతాడు? ఇతడు పుట్టింది మొదలు చోరుడు, జారుడు, మూడు త్రోవల్లో నడచేవాడు. మరి ఇతగాడు ఇంత గొప్ప పూజకు ఎలా అర్హుడు అవుతాడు?” అంటూ అమంగళకరమైన మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=791 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Sunday, October 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౬(376)

( శిశుపాలుని వధించుట ) 

10.2-788-క.
"చాలుఁ బురే యహహా! యీ
కాలము గడపంగ దురవగాహం బగు నీ
తేలా తప్పెను నేఁ డీ
బాలకు వచనములచేతఁ బ్రాజ్ఞుల బుద్ధుల్‌?
10.2-789-వ.
ఇట్లు దప్పిన తెఱం గెట్టనినఁ బాత్రాపాత్ర వివేకంబు సేయనేర్చిన విజ్ఞాననిపుణులు, నున్నతసత్త్వ గరిష్ఠులు, బహువిధ తపోవ్రత నియమశీలురు, ననల్పతేజులు, మహైశ్వర్యశక్తిధరులుఁ, బరతత్త్వవేదులు, నఖిలలోకపాలపూజితులు, విగతపాపులుఁ, బరమయోగీంద్రులు నుండ వీరిం గైకొనక వివేకరహితులై గోపాలబాలునిం బూజసేయుటకు నెట్లు సమ్మతించిరి; పురోడాశంబు సృగాలంబున కర్హంబగునే? యదియునుంగాక. 

భావము:
“ఆహా! భలే! భలే! ఎలాంటి కాలం వచ్చేసింది, దీనిని దాటడం చాలా దుర్లభంగా ఉంది. ఈ కాల ప్రభావం చూడండి, ఇంత పసివాడి మాటలకి బుద్ధిమంతులైన ఈ పెద్దల బుద్ధులు నీతిని ఎలా తప్పాయో? నీతి తప్పాయని ఎలా అంటున్నావు అంటారా! యోగ్యత అయోగ్యతలనూ నిర్ణయించ గలిగిన మహా వివేకులు, గొప్ప సత్త్వగుణ సంపన్నులు, పాపరహితులు, సకల విధ మహా తపస్సులు, వ్రతశీలులు, మహా నియమ పాలకులు, అమిత తేజోశాలురు, గొప్ప ఐశ్వర్యవంతులు, బ్రహ్మజ్ఞానులు, సమస్త లోకపాలుర చేత పూజింపబడువారు, యోగీశ్వరులు ఎందరో ఈ సభలో ఉన్నారు. వీరందరినీ లెక్కించక బుద్ధిహీనుడైన ఒక గొల్లపిల్లవాడిని పూజించటానికి ఎలా సమ్మతించారు. యజ్ఞం కోసం ఉద్దేశించిన పురోడాశం నక్కకు ఎలా అర్హమవుతుంది? అంతేకాకుండా... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=789 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, October 23, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౫(375)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-786-క.
దమఘోషసుతుఁడు దద్విభ
వము సూచి సహింప కలుక వట్రిలఁగా బీ
ఠము డిగ్గి నిలిచి నిజ హ
స్తము లెత్తి మనోభయంబు దక్కినవాఁడై.
10.2-787-వ.
అప్పు డప్పుండరీకాక్షుండు వినుచుండ సభాసదులం జూచి యిట్లనియె. 

భావము:
అంతలో, కృష్ణుని మేనత్త శ్రుతశ్రవస, చేది దేశ రాజు దమఘోషుల కుమారుడైన శిశుపాలుడు ఆ వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అసూయతో మనసులోని భయాన్ని వీడి తన చేతులెత్తి ఆసనం దిగి, నిలబడి పుండరీకముల వంటి కన్నులతో అలరారుతున్న శ్రీకృష్ణుడు వినేలా సభాసదులతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=787 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Friday, October 22, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౪(374)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-784-క.
చంచత్కాంచన రుచిరో
దంచితవస్త్రముల నూతనార్కప్రభలన్
మించిన రత్నములం బూ
జించెన్ ధర్మజుఁడు కృష్ణు జిష్ణు సహిష్ణున్.
10.2-785-వ.
ఇట్లు పూజించి యానందబాష్పజల బిందుసందోహకందళిత నయనారవిందంబులం గోవిందుని సుందరాకారంబు దర్శింపఁ జాలకుండె; నట్లు పూజితుండై తేజరిల్లు పుండరీకాక్షు నిరీక్షించి హస్తంబులు నిజమస్తకంబుల ధరించి వినుతుల సేయుచు, నఖిలజనంబులు జయజయ శబ్దంబు లిచ్చిరి; దేవతలు వివిధ తూర్యఘోషంబులతోడం బుష్పవర్షంబులు గురియించి; రయ్యవసరంబున. 

భావము:
ధర్మరాజు బంగారు జలతారువస్త్రాలతో, బాలభానుడి కాంతులను మించిన కాంతులుగల రత్నాలతో ఆ జయశీలుడు, సర్వసహనశీలుడు అయిన శ్రీకృష్ణుడిని సన్మానించాడు. ఆ విధంగా ధర్మరాజు గోవిందుడిని పూజించి ఆనందబాష్పాలు కనుల నిండా కమ్ముటచే, ఆయన సుందరాకారాన్ని సరిగా చూడలేకపోయాడు. ఈ విధంగా పూజించబడి ప్రకాశించే పుండరీకాక్షుడు శ్రీకృష్ణుని చూసి సమస్త ప్రజలూ చేతులుజోడించి అనేక విధాల పొగడుతూ, జయజయ ధ్వానాలు చేశారు. దేవతల వివిధ మంగళ వాద్యాలు మ్రోగిస్తూ పుష్పవర్షం కురిపించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=785 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, October 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౩(373)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-781-క.
అని సహదేవుఁడు పలికిన
విని యచ్చటి జనులు మనుజవిభులును ఋషులున్
మునుకొని మనములు మోదము
దనుకఁగ నిది లెస్స యనిరి ధర్మజుఁ డంతన్.
10.2-782-క.
మునిజనమానసమధుకర
వనజాతములైన యట్టి వారిజదళలో
చను పదయుగళప్రక్షా
ళన మొగిఁ గావించి తజ్జలంబులు భక్తిన్.
10.2-783-క.
తానును గుంతియు ననుజులు
మానుగ ద్రుపదాత్మజయును మస్తకములఁ బెం
పూనిన నియతి ధరించి మ
హానందము బొంది రతిశయప్రీతిమెయిన్. 

భావము:
అని సహదేవుడు చెప్పగా ఆ సభాసదులు, రాజులు, ఋషులు మొదలైన వారందరూ సంతోషంతో “ఇదే సముచిత మైనది” అని అంగీకరించారు. అప్పుడు ధర్మరాజు మహామునుల మనస్సులు అనే తుమ్మెదలకు పద్మాలవంటి వైన కలువరేకులు వంటి కన్నులు కల శ్రీకృష్ణుని పాదాలు రెండూ భక్తితో కడిగి, ఆ జలాన్ని తానూ, కుంతీ, భీమాదులూ, ద్రౌపదీ అమితమైన ప్రీతితో తమ శిరస్సులమీద శ్రీకృష్ణుని పాదజలాన్ని ధరించి ఎంతో సంతోషించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=783 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, October 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౨(372)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-779-చ.
ఇతఁడె యితండు గన్ను లొకయించుక మోడ్చిన నీ చరాచర
స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్
వితతములై జనించుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్?
10.2-780-ఉ.
ఈ పురుషోత్తమున్, జగదధీశు, ననంతుని, సర్వశక్తుఁ, జి
ద్రూపకు, నగ్రపూజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‌
వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్,
శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్?" 

భావము:
అటువంటి ఈ శ్రీకృష్ణుడు కనుక, కన్నులు కొద్దిగా మూసుకున్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పిచూస్తే ఈలోకాలన్నీ జనిస్తాయి. యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు, ప్రభవిష్ణుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఐన శ్రీకృష్ణుడే ఈ అగ్రపూజకు అర్హుడు. ఇతడు కాకపోతే మరెవ్వరు తగినవారు కాగలరు? ఓ రాజా! పురుషోత్తముడు, సకలలోకాధిపతి, అనంతుడు సమస్తశక్తులు కలవాడు, చిద్రూపుడు అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింప చేస్తే సమస్త లోకాలూ సంతృప్తి పొందుతాయి. కాబట్టి, వేలమాటలు ఎందుకు, నీవు ఆలస్యం చేయకుండా అన్యధా ఆలోచించకుండా ఈ లక్ష్మీపతికి, శ్రీకృష్ణుడికి అగ్ర పూజ చెయ్యి.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=780 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, October 19, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౧(371)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-777-వ.
పూజించునప్పు డందగ్రపూజార్హు లెవ్వరని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతురవచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకులసంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి “యిమ్మహాత్ముని సంతుష్టుంజేసిన భువనంబు లన్నియుం బరితుష్టిం బొందు” నని చెప్పి ధర్మజుం జూచి యిట్లనియె.
10.2-778-ఉ.
"కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ
జ్జాలముదైవమున్గురువుసాంఖ్యముమంత్రమునగ్నియాహుతుల్‌
వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్‌
లీలలఁ దాన యై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్. 

భావము:
అలా యాగాంతంలో పెద్దలను పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హులు ఎవరు అని అడుగగా, సభలో ఉన్నవారు ఎవరికి తోచినట్లు వారు తలకొక రకంగా చెప్పసాగారు. వారి మాటలను వారించి, వాక్ చాతుర్యం కలవాడు, బుద్ధిమంతుడు ఐన సహదేవుడు కృష్ణుడిని చూపించి “ఈ మహాత్ముడిని సంతుష్టుణ్ణి చేస్తే సమస్త లోకాలూ సంతోషిస్తాయి.” అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు. “కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్త, భోక్త, లోకాలు, దైవము, గురువు, మంత్రము, అగ్ని, ఆహుతులు, యాజికులు, సృష్టిస్థితిలయాలూ, సమస్తము తానే అయి ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ శ్రీకృష్ణపరమాత్ముడు ఒక్కడే. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=778 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, October 18, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౦(370)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-774-క.
అదిగాక యిందిరావిభు
పదములు సేవించునట్టి భాగ్యము గలుగం
దుదిఁ బడయరాని బహు సం
పద లెవ్వియుఁ గలవె?" యనుచుఁ బ్రస్తుతి సేయన్.
10.2-775-వ.
అప్పుడు.
10.2-776-చ.
అమరసమానులై తనరు యాజకవర్గములోలి రాజసూ
యమఖవిధానమంత్రముల నగ్నిముఖంబుగఁ జేసి ధర్మజుం
గ్రమమున వేలిపింపఁ గ్రతురాజసమాప్తిదినంబునన్ నృపో
త్తముఁడు గడంగి యాజకసదస్య గురుద్విజకోటిఁ బెంపునన్. 

భావము:
అంతేకాకుండా, “శ్రీకృష్ణుడి పాదపద్మాలు పూజించే భాగ్యం పొందిన వారికి, పొందలేని దంటూ ఏదీ ఉండదు” అని బ్రహ్మాదులు ప్రస్తుతించారు. అంతట దేవతలతో సమానులైన ఋత్విక్కులు రాజసూయ యాగానికి అనువైన మంత్రాలతో హవ్య ద్రవ్యాలను ధర్మరాజుచేత వేలిపించి యాగాన్ని నడిపించారు. ధర్మరాజు ఋత్విక్కులనూ, సభాసదులనూ, పెద్దలనూ, బ్రాహ్మణులనూ యజ్ఞం పరిసమాప్తమైన చివరిదినం పూజించాలని భావించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=776 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౩౬౯(369)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-771-సీ.
అర్థిజాతము గోరినట్టి వస్తువు లెల్లఁ-
  దగఁ బంచియిడఁగఁ రాధాతనూజు,
సరసాన్న పానాది సకలపదార్థముల్‌-
  పాకముల్‌ సేయింపఁ బవనతనయుఁ,
బంకజోదరు నొద్దఁ బాయక పరిచర్య-
  దవిలి కావింప వాసవతనూజు,
సవన నిమిత్తంబు సంచితద్రవ్యంబు-
  పెంపుతో వేగఁ దెప్పింప నకులు,
10.2-771.1-తే.
దేవగురు వృద్ధధాత్రీసురావలులను
నరసి పూజింప సహదేవు, నఖిలజనులఁ
బొలుచు మృష్టాన్న తతులఁ దృప్తులను జేయ
ద్రౌపదిని నియమించెను ధర్మసుతుఁడు.
10.2-772-వ.
అయ్యవసరంబున.
10.2-773-చ.
హరి శిఖి దండపాణి నికషాత్మజ పాశి సమీర గుహ్యకే
శ్వర శశిమౌళి పంకరుహసంభవ చారణ సిద్ధ సాధ్య కి
న్నర గరుడోరగామరగణంబులు వచ్చి మఖంబుఁ జూచి య
చ్చెరువడి "తొల్లి యెవ్వరునుఁ జేయుమఖంబులునింత యొప్పునే 

భావము:
కర్ణుడిని యాచకులు అడిగిన వస్తువులను దానం చేయటానికి; భీముడిని షడ్రసోపేత భోజనపదార్థాలను తయారు చేయించటానికి; శ్రీకృష్ణుడికి సేవలు చేయటానికి అర్జునుడిని; నకులుడిని యజ్ఞానికి అవసరమైన సంబారాలను సమకూర్చటానికి; సహదేవుడిని దేవతలను బ్రాహ్మణులను గురువులను పెద్దలను గౌరవించటానికి; యాగానికి విచ్చేసిన సమస్త ప్రజలూ మృష్టాన్నపానాలతో సంతుష్టులయ్యేలా చూడడానికి ద్రౌపదినీ; ధర్మరాజు నియమించాడు. అలా యాగం జరుగుతుంటే దేవేంద్రుడు మొదలైన దిక్పాలురూ; బ్రహ్మాది దేవతలూ; సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గరుడ, నాగ మున్నగు దేవగణములు; వచ్చి ధర్మరాజు చేస్తున్న యజ్ఞాన్ని చూసారు. “ఇంతకు పూర్వం యే రాజు కూడా ఇంత గొప్పగా యజ్ఞం చేయలే” దని మెచ్చుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=773 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, October 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౮(368)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-768-ఆ.
కడఁగి సవనభూమిఁ గనకలాంగలముల
నర్థి దున్ని పాండవాగ్రజునకు
నచట దీక్షచేసి యంచితస్వర్ణ మ
యోపకరణముల నలోపముగను,
10.2-769-వ.
ఇట్లు నియమంబున సముచిత క్రియాకలాపంబులు నడపుచుండి రప్పుడు.
10.2-770-క.
సకలావనీశు లిచ్చిన
యకలంక సువర్ణరత్న హయ ధన వస్త్ర
ప్రకరంబులు మొదలగు కా
నుక లందుకొనన్ సుయోధనుని నియమించెన్. 

భావము:
పూని యజ్ఞభూమిని బంగారునాగళ్ళతో దున్నించి, సువర్ణమయమైన పరికారాలతో ఏలోపం రాకుండా పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు యజ్ఞదీక్ష ఇచ్చారు. అలా బ్రాహ్మణులు నియమం ప్రకారం ఉచితమైన కార్యకలాపాలు నడుపుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు సమస్తభూపతులూ తనకు సమర్పించే ధన, కనక, వస్తు, వాహనాదులైన కానుకలను స్వీకరించటానికి దుర్యోధనుడిని నియమించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=770 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౩౬౭(367)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2.765-వ
అని గోవిందునిం బొగడి, యద్దేవు ననుమతంబునం గుంతీసుతాగ్రజుండు పరతత్త్వవిజ్ఞాను లైన ధరిణీసురులను ఋత్విజులంగా వరియించి.
10.2-766-సీ.
సాత్యవతేయ, కశ్యప, భరద్వాజోప-
  హూతి, విశ్వామిత్ర, వీతిహోత్ర,
మైత్రేయ, పైల, సుమంతు, మధుచ్ఛంద,-
  గౌతమ, సుమతి, భార్గవ, వసిష్ఠ,
వామదేవాకృతవ్రణ, కణ్వ, జైమిని,-
  ధౌమ్య, పరాశరాధర్వ, కవషు,
లసిత, వైశంపాయ, నాసురి, దుర్వాస,-
  క్రతు, వీరసేన, గర్గ, త్రికవ్య,
10.2-766.1-ఆ.
ముఖ్యులైన పరమమునులను, గృపుని, గాం
గేయ, కుంభజాంబికేయ, విదుర,
కురుకుమార, బంధు, కులవృద్ధ, ధారుణీ
సుర, నరేంద్ర, వైశ్య, శూద్రవరుల.
10.2-767-క.
రప్పింప వారు హర్షము
లుప్పతిలఁగ నేఁగుదెంచి, యుచితక్రియలం
దప్పక కనుఁగొనుచుండఁగ
నప్పుడు విధ్యుక్త నియతులై భూమిసురుల్‌. 

భావము:
ఈవిధంగా ధర్మరాజు కృష్ణుడిని నుతించి ఆయన ఆజ్ఞానుసారం వేదవిజ్ఞానధనులైన బ్రాహ్మణులను యజ్ఞకార్యనిర్వాహకులుగా స్వీకరించాడు. సత్యవతీ కుమారుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, ఉపహూతి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీతిహోత్రుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, మధుచ్ఛందుడు, గౌతముడు, సుమతి, భార్గవుడు, వసిష్ఠుడు, వామదేవుడు, అకృతవ్రణుడు, కణ్వుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, అధర్వుడు, కవషులు, అసితుడు, వైశంపాయనుడు, ఆసురి, దుర్వాసుడు, క్రతువు, వీరసేనుడు, గర్గుడు, త్రికవ్యుడు మొదలైన మునీశ్వరులనూ; ద్రోణుడు, కృపాచార్యుడు ఆది గురువులనూ; భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మున్నగు కురువృద్ధులనూ; దుర్యోధనాది బంధుజనాన్నీ; అలా గురు బంధు మిత్ర కులవృద్ధులను అందరినీ, సమస్త బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ముఖ్యులనూ; ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించాడు. ధర్మరాజు ఆహ్వానించిన వారంతా విచ్చేసి సంతోషంతో ఉచిత కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా, బ్రాహ్మణశ్రేష్ఠులు శాస్త్ర ప్రకారం యజ్ఞం ప్రారంభించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=766 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, October 14, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౬(366)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-764-సీ.
"కమలాక్ష! సర్వలోకములకు గురుఁడవై-
  తేజరిల్లెడు భవదీయమూర్తి
యంశాంశసంభవు లగు లోకపాలురు-
  నీ యాజ్ఞఁ దలమోచి నిఖిలభువన
పరిపాల నిపుణులై భాసిల్లుచున్న వా-
  రట్టి నీ కొక నృపునాజ్ఞ సేయు
టరయ నీమాయ గాకది నిక్కమే? యేక-
  మై యద్వితీయమై యవ్యయంబు
10.2-764.1-తే.
నైన నీ తేజమున కొక హాని గలదె?
చిన్మయాకార! నీ పాదసేవకులకు
నాత్మపరభేదబుద్ధి యెందైనఁ గలదె?
పుండరీకాక్ష! గోవింద! భువనరక్ష! " 

భావము:
“ఓ కమల నయనా! శ్రీకృష్ణా! నీ అంశంనుండి జన్మించిన దిక్పాలకులు అందరూ సర్వలోకాలకూ గురుడవైన నీ ఆజ్ఞను శిరసావహిస్తూ లోకాలు అన్నింటినీ పరిపాలిస్తున్నారు. అంతటి నీకు ఒక సామాన్యుడైన భూపాలుడిని శిక్షించడం ఒక లెక్కలోనిది కాదు. ఇదంతా నీ మాయ కాక మరేమిటి గోవిందా! పుండరీకాక్ష! లోకరక్షకా! చిన్మయరూపా! అద్వితీయమైన నీ తేజస్సుకు తిరుగు లేదు. నీ పాదసేవకులకు భేదభావం ఏమాత్రం కానరాదు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=764 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, October 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౫(365)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-763-వ.
ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును, రాజలోకంబునకు బంధమోక్షణంబును గావించి, వాయునందన వాసవనందనులుం దానును జరాసంధతనయుం డగు సహదేవుండు సేయు వివిధంబు లగు పూజలు గైకొని, యతని నుండ నియమించి, యచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల నింద్రప్రస్థపురంబునకుం జనుదెంచి, తద్ద్వార ప్రదేశంబున విజయశంఖంబులు పూరించినఁ బ్రతిపక్ష భయదంబును, బాంధవ ప్రమోదంబును నగు నమ్మహాఘోషంబు విని, పౌరజనంబులు జరాతనయు మరణంబు నిశ్చయించి సంతసిల్లిరి; వారిజాక్షుండును భీమసేన పార్థులతోఁ బురంబు ప్రవేశించి ధర్మనందనునకు వందనం బాచరించి, తమ పోయిన తెఱంగును నచ్చట జరాసంధుని వధియించిన ప్రకారంబును సవిస్తరంబుగా నెఱింగించిన నతండు విస్మయవికచలోచనంబుల నానందబాష్పంబులు గురియ, నమ్మాధవు మాహాత్మ్యంబునకుఁ దమ యందలి భక్తి స్నేహ దయాది గుణంబులకుం బరితోషంబు నొందుచుఁ గృష్ణునిం జూచి యిట్లనియె. 

భావము:
అలా శ్రీకృష్ణుడు జరాసంధ సంహారం, రాజులందరినీ విడిపించుట నిర్వహించాడు. భీముడు అర్జునుడు తాను జరాసంధుడి కుమారుడు సహదేవుడు చేసిన పూజలను స్వీకరించారు. పిమ్మట, బయలుదేరి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు. పుర ముఖద్వారంలో వారు విజయశంఖాలు పూరించారు. శత్రు భీకరములు, బంధు ప్రీతికరములు అయిన ఆ విజయసూచకాలైన ఆ శంఖధ్వనులను విని, పౌరులందరూ జరాసంధుడు మరణించాడని గ్రహించి సంతోషించారు. శ్రీకృష్ణుడు భీమార్జున సహితంగా ధర్మరాజును దర్శించి నమస్కారం చేసి, తాము మగధకు వెళ్ళిన వృత్తాంతం అక్కడ జరిగిన జరాసంధ సంహారాది సర్వం వివరంగా నివేదించాడు. కన్నులలో ఆనందబాష్పాలు పొంగిపొరలుతుండగా కృష్ణుడికి తమమీద గల స్నేహ వాత్సల్య కారుణ్యాది గుణాలకు సంతోషిస్తూ ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=763 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, October 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౪(364)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-759-క.
నరవరు లీ చందంబున
మురసంహరుచేత బంధమోక్షణులై సు
స్థిరహర్షంబులతో నిజ
పురములకుం జనిరి శుభవిభూతి తలిర్పన్.
10.2-760-క.
హరిమంగళగుణకీర్తన
నిరతముఁ గావించుచును వినిర్మలమతులై
గురుబంధుపుత్త్రజాయా
పరిజన మలరంగఁ గృష్ణుఁ బద్మదళాక్షున్.
10.2-761-వ.
బహుప్రకారంబులం బొగడుచుఁ దమతమ దేశంబులకుం జని.
10.2-762-క.
నళినదళలోచనుఁడు దముఁ
దెలిపిన సద్ధర్మపద్ధతినిఁ దగవరులై
యిలఁ బరిపాలించుచు సుఖ
ముల నుండిరి మహితనిజవిభుత్వము లలరన్.
భావము:
జరాసంధుడిచే బంధింపబడిన ఆరాజులందరూ ఈ విధంగా శ్రీకృష్ణుడిచేత బంధవిముక్తులై, ఎంతో సంతోషంతో గౌరవప్రదంగా వారి వారి రాజ్యాలకు బయలుదేరారు. తమ భార్యా పుత్రులు మిత్రులు మున్నగువారు సంతోషించగా నిర్మలహృదయులై పద్మాక్షుడు శ్రీకృష్ణుడి సద్గుణాలను సంకీర్తిస్తూ, శ్రీకృష్ణుడిని ఆ రాజులు అనేక రకాల నుతిస్తూ తమ తమ రాజ్యాలకు వెళ్ళారు. ఆ రాజులు అందరూ న్యాయశీలురై శ్రీకృష్ణుడు ప్రబోధించిన ధర్మమార్గాన్ని తప్పక తమ తమ రాజ్యాలను వైభవంగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=762 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, October 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౩(363)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-756-వ
అది గావున మీ మనంబుల దేహం బనిత్యంబుగాఁ దెలిసి.
10.2-757-ఉ.
మీరలు ధర్మముం దగవు మేరయుఁ దప్పక, భూజనాళిఁ బెం
పారుచు, సౌఖ్యసంపదల నందఁగఁ బ్రోచుచు, భూరియజ్ఞముల్‌
గౌరవవృత్తి మత్పరముగా నొనరింపుచు, మామకాంఘ్రి పం
కేరుహముల్‌ భజించుచు నకిల్బిషులై చరియింపుఁ డిమ్ములన్.
10.2-758-వ.
అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్య ప్రాప్తులయ్యెదురు; మదీయ పాదారవిందంబులందుఁ జలింపని భక్తియుఁ గలుగు"నని యానతిచ్చి యా రాజవరుల మంగళస్నానంబులు సేయించి, వివిధ మణి భూషణ మృదులాంబర మాల్యానులేపనంబు లొసంగి, భోజన తాంబూలాదులం బరితృప్తులం జేసి, యున్నత రథాశ్వ సామజాధిరూఢులం గావించి, నిజరాజ్యంబులకుఁ బూజ్యులంచేసి, యనిచిన. 

భావము:
కావున, ఈ శరీరం శాశ్వతంకాదని మీరు గ్రహించండి. మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి. మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=758 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, October 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౨(362)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-753-ఉ.
వేదవధూశిరోమహితవీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁబల్కు దా
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా!"
10.2-754-క.
అని తను శరణము వేఁడిన
జననాథుల వలను సూచి సదమలభక్తా
వనచరితుఁడు పంకజలో
చనుఁ డిట్లను వారితోడ సదయామతియై.
10.2-755-చ.
"జనపతులార! మీ పలుకు సత్యము; రాజ్యమదాంధచిత్తులై
ఘనముగ విప్రులం బ్రజలఁ గాఱియఁ బెట్టుటఁ జేసి కాదె వే
న నహుష రావణార్జునులు నాశము నొందిరి; కాన ధర్మ పా
లనమునఁగాక నిల్చునె? కులంబుబలంబుఁ జిరాయురున్నతుల్‌. 

భావము:
యశోదామాతచే ఉదరమున తాడు కట్టబడిన దామోదరా! శ్రీకృష్ణా! దుష్ట సంసారసాగరాన్ని తరింపచేసేవాడా. ఈ సమస్త సృష్టికీ కారణమైన వాడా. వేదాంత వీధుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలచి ఉండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు.” భక్తజనావాసుడైన పద్మలోచనుడు దయతో కూడినవాడై, తనను శరణుకోరుతున్న ఆ రాజులకు ఇలా చెప్పాడు. “ఓ రాజులారా! మీ మాట నిజం. రాజ్యమదంతో బ్రాహ్మణులనూ, ప్రజలనూ మిక్కిలి బాధించటం వలననే కదా వేనుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నాశనమయ్యారు. కాబట్టి ధర్మాన్ని పాటించకపోతే కులం, బలం, ఆయుస్సు, ఔన్నత్యం నిలబడవు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=755 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, October 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౧(361)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-751-సీ.
అవధరింపుము మాగధాధీశ్వరుఁడు మాకు-
  బరమబంధుఁడు గాని పగయకాఁడు
ప్రకటిత రాజ్యవైభవ మదాంధీభూత-
  చేతస్కులము మమ్ముఁ జెప్ప నేల?
కమనీయ జలతరంగముల కైవడి దీప-
  శిఖవోలెఁ జూడ నస్థిరములైన
గురుసంపదలు నమ్మి పరసాధనక్రియా-
  గమ మేది తద్బాధకంబు లగుచుఁ
10.2-751.1-తే.
బరగు నన్యోన్య వైరానుబంధములను
బ్రజలఁ గారించుచును దుష్టభావచిత్తు
లగుచు నాసన్న మృత్యుభయంబు దక్కి
మత్తులై తిరుగుదురు దుర్మనుజు లంత.
10.2-752-చ.
కడపటిచేఁత నైహికసుఖంబులఁ గోల్పడి రిత్త కోర్కి వెం
బడిఁ బడి యెండమావులఁ బిపాసువులై సలిలాశ డాయుచుం
జెడు మనుజుల్‌ భవాబ్ధిదరిఁ జేరఁగలేక నశింతు; రట్టి యా
యిడుమలఁ బొందఁజాలము రమేశ! త్రిలోకశరణ్య! మాధవా! 

భావము:
వినవయ్యా శ్రీకృష్ణా! జరాసంధుడు మా దగ్గర బంధువే కాని శత్రువేం కాదు. రాజ్యవైభవం అనే మదాంధులమైన మా గురించి చెప్పటం అనవసరం. దుర్జనులు మనోఙ్ఞమైన నీటి అలలలాగా, దీపశిఖలలాగా చంచలములు ఐన సిరిసంపదలు శాశ్వతాలని నమ్మి, పరానికి సంబంధించిన కార్యకలాపాలను పరిత్యజించుతారు; పరస్పరం విరోధాలను పెంచుకుంటూ దుష్ఠులు అయి, ప్రజలను బాధిస్తూ ఉంటారు; మరణభయాన్ని మరచిపోయి, పొగరుబోతులై ప్రవర్తిస్తారు. ఓ మాధవా! లక్ష్మీపతీ! త్రిలోకశరణ్యా! అట్టి దుర్జనులు చివరకు ఐహికసుఖాలను నష్టపోతారు; వ్యర్ధమైన కోరికల వెంటబడి నీళ్ళనే భ్రమతో ఎండమావులను చేరినట్లు భ్రష్టులైపోతారు; సంసారసముద్రాన్ని దాటలేక నశించిపోతారు; అటువంటి క్లేశములు మేము అనుభవించలేము. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=752 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, October 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౦(360)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-748-చ.
భరితముదాత్ములై, విగతబంధనులై, నిజమస్తముల్‌ మురా
సురరిపు పాదపద్మములు సోఁకఁగఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై,
కరములు మోడ్చి "యో! పరమకారుణికోత్తమ! సజ్జనార్తి సం
హరణ వివేకశీల! మహితాశ్రితపోషణ! పాపశోషణా!
10.2-749-ఆ.
వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద!
దాసదుఃఖనాశ! వాసుదేవ!
యవ్యయాప్రమేయ! యనిశంబుఁ గావింతు
మిందిరేశ! నీకు వందనములు
10.2-750-ఉ.
ధీరవిచార! మమ్ము భవదీయ పదాశ్రయులన్ జరాసుతో
దారనిబంధనోగ్ర పరితాపము నీ కరుణావలోకనా
సారముచేత నార్చితివి; సజ్జనరక్షయు దుష్టశిక్షయు
న్నారయ నీకుఁ గార్యములు యాదవవంశపయోధిచంద్రమా! 

భావము:
బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు. కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా ఇలా స్తుతించారు. “ఓ దయామయా! సజ్జనుల దుఃఖాలను పోగొట్టేవాడా! ఆశ్రితరక్షకా! దురిత నివారణ! వరదా! పద్మనాభా! శ్రీహరీ! శ్రీకృష్ణ! వాసుదేవా! గోవిందా! ఇందిరావల్లభా! ఆశ్రిత ఆర్తి హరణా! శాశ్వతా! అనంతా! లక్ష్మీపతి! నీకు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము. యాదవవంశ మనే సముద్రానికి చంద్రుని వంటి వాడా! పరమజ్ఞానీ! శ్రీకృష్ణా! నీ పాదాలను ఆశ్రయించిన మాకు జరాసంధుడి బంధనాల వలన కలిగిన పరితాపాన్ని నీ కరుణాకటాక్షమనే జడివానతో చల్లార్చావు. అవును, సజ్జనులను రక్షించుట, దుర్జనులను శిక్షించుట చేయడమే నీ కర్తవ్యాలు కదా 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=750 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, October 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౯(359)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-746-వ.
అయ్యవసరంబునఁ గృష్ణుండు దన దివ్యచిత్తంబున మఱవ నవధరింపక చెఱలు విడిపించిన, వారలు పెద్దకాలంబు కారాగృహంబులఁ బెక్కు బాధలం బడి కృశీభూతశరీరు లగుటంజేసి, రక్తమాంస శూన్యంబులై త్వగస్థిమాత్రావశిష్టంబులును, ధూళిధూసరంబులు నైన దేహంబులు గలిగి, కేశపాశంబులు మాసి, జటాబంధంబు లైన శిరంబులతో మలినవస్త్రులై చనుదెంచి; యప్పుడు.
10.2-747-సీ.
నవపద్మలోచను, భవబంధమోచను-
  భరితశుభాకారు, దురితదూరుఁ,
గంగణకేయూరుఁ, గాంచనమంజీరు-
  వివిధశోభితభూషు, విగతదోషుఁ,
బన్నగాంతకవాహు, భక్తమహోత్సాహు-
  నతచంద్రజూటు, నున్నతకిరీటు,
హరినీలనిభకాయు, వరపీతకౌశేయుఁ-
  గటిసూత్రధారు, జగద్విహారు
10.2-747.1-తే.
హార వనమాలికా మహితోరువక్షు,
శంఖచక్రగదాపద్మశార్‌ఙ్గహస్తు,
లలిత శ్రీవత్సశోభితలక్షణాంగు,
సుభగచారిత్రు దేవకీసుతునిఁ గాంచి. 

భావము:
అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు. పద్మాక్షుడూ, భవబంధ విమోచనుడూ, దురిత దూరుడూ, నానాలంకార సంశోభితుడూ, దోష రహితుడూ, భక్తులకు ఉత్సాహాన్ని ఇచ్చేవాడూ, శివుడి చేత పొగడబడేవాడూ, సకల లోక విహారుడు, గరుడ వాహనుడూ, మంగళాకారుడూ, ఇంద్రనీల ఛాయ దేహము వాడూ, విశాల వక్షము వాడు, గొప్ప కిరీటం ధరించు వాడు, పచ్చని పట్టువస్త్రాలు ధరించు వాడు, ముత్యాల పేరులు వనమాలలు ధరించువాడు, శ్రీవత్సశోభితుడూ, శంఖ చక్ర గదా శార్ఞ్గ పద్మాలను ధరించు వాడు, పవిత్ర చరితుడూ, దేవకీపుత్రుడూ అయిన కృష్ణుడిని ఆ రాజులు అందరు చేరి దర్శించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=747 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, October 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౮(358)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-743-క.
అనిలజుని దేవపతి నం
దనుఁడునుఁ బద్మాక్షుఁడును నుదారత నాలిం
గనములు సేసి పరాక్రమ
మున కద్భుతమంది మోదమునఁ బొగడి రొగిన్.
10.2-744-క.
వనజాక్షుఁ డంతఁ గరుణా
వననిధియును భక్తలోకవత్సలుఁడునుఁ గా
వున మాగధసుతు సహదే
వునిఁ బట్టముగట్టెఁ దన్నవోన్నతపదవిన్.
10.2-745-క.
మగధాధినాథునకు ము
న్నగపడి చెఱసాలలను మహాదుఃఖములన్
నొగులుచుఁ దన పాదాంబుజ
యుగళము చింతించుచున్న యుర్వీశ్వరులన్. 

భావము:
జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు. దయామయుడూ భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టం గట్టి మగధరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ (విడిపించాడు) 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=745 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, October 4, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౭(357)

( జరాసంధ వధ ) 

10.2-742-వ.
ఇవ్విధంబున వజ్రివజ్రసన్నిభంబగు నితరేతర ముష్టిఘట్టనంబుల భిన్నాంగులై, రక్తసిక్తశరీరంబులతోడం బుష్పితాశోకంబుల వీఁకను, జేగుఱుఁ గొండల చందంబునను జూపట్టి పోరుచుండఁ, గృష్ణుండు జరాసంధుని జన్మమరణప్రకారంబు లాత్మ నెఱుంగుటం జేసి, వాయుతనూభవున కలయికలేక లావును జేవయుఁ గలుగునట్లుగాఁ దద్గాత్రంబునందు దనదివ్యతేజంబు నిలిపి, యరినిరసనోపాయం బూహించి సమీరనందనుండు సూచుచుండ నొక్క శాఖాగ్రంబు రెండుగాఁ జీరివైచి వాని నట్ల చీరి చంపు మని సంజ్ఞగాఁ జూపిన, నతండు నా కీలుదెలిసి, యవక్రపరాక్రముండై మాగధుం బడఁద్రోచి, వాని పదంబు పదంబునం ద్రొక్కి, బాహుయుగళంబున రెండవ పదంబుఁ గదలకుండంబట్టి, మస్తకపర్యంతంబుఁ బెళబెళమని చప్పుళ్ళుప్పతిల్ల మత్తదంతావళంబు దాళవృక్షంబు సీరు చందంబునఁ బాద జాను జంఘోరు కటి మధ్యోదరాంస కర్ణ నయనంబులు వేఱువేఱు భాగంబులుగా వ్రయ్యలు వాపి యార్చినఁ, బౌరజనంబులు గనుంగొని భయాకులులై హాహాకారంబులు సేసి;రంత. 

భావము:
ఇలా దేవేంద్రుడి వజ్రాయుధంలాంటి పిడిగ్రుద్దుల వలన శరీరాలు పగిలి కారుతున్న రక్తాలతో భీముడు జరాసంధుడు పుష్పించిన అశోకవృక్షాలలా, ఎఱ్ఱని కొండలలా కనబడసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి, భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి, భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు, ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చి పడేసాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి, రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని మదించిన ఏనుగు తాటిచెట్లను పెళపెళమనే శబ్దం పుట్టేలా చీల్చునట్లు, వాడిని తల వరకూ చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హహాకారాలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=742 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, October 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౬(356)

( జరాసంధ వధ ) 

10.2-740-ఉ.
ప్రక్కలుఁ, జెక్కులున్, మెడలుఁ, బాణితలంబులచేఁ బగుల్చుచున్;
ముక్కు,లు నక్కులుం, జెవులు ముష్టిహతిన్ నలియంగ గ్రుద్దుచున్;
డొక్కలుఁ, బిక్కలున్ ఘనకఠోరపదాహతి నొంచుచున్; నెఱుల్‌
దక్కక స్రుక్క కొండొరులఁ దార్కొని, పేర్కొని పోరి రుగ్రతన్.
10.2-741-ఉ.
హుమ్మని మ్రోఁగుచుం, బెలుచ హుంకృతు లిచ్చుచుఁ, బాసి డాసి కో
కొమ్మనుచున్నొడళ్ళగల గుల్లల తిత్తులుగాఁ బదంబులం
గ్రుమ్ముచు, ముష్ఠి ఘట్టనల స్రుక్కుచు, నూర్పులు సందఁడింపఁగా
సొమ్మలు వోవుచుం, దెలియుచున్, మదిఁ జేవయు లావుఁ జూపుచున్ 

భావము:
ఆ ముష్టియుద్ధంలో భీమజరాసంధులు ప్రక్కలూ, చెక్కులూ, మెడలూ పగిలేలా చేతులతో బాదుకుంటూ, ముక్కులు పగిలేలా గ్రుద్దుకుంటూ, డొక్కల్లో పిక్కల్లో పొడుచుకుంటూ అతి భయంకరంగా పోరాడారు. భీమజరాసంధులు ఇద్దరూ హుంకారాలు చేస్తూ ఒకరి నొకరు తాకుతూ, తిరిగి దూరమవుతూ, శరీరాలు పగిలి గుల్లలయ్యేలా కాళ్ళతో కుమ్ముకుంటూ, పిడికిటి పోట్లతో నొప్పించుకుంటూ, సోలుతూ, వాలుతూ, రొప్పుతూ రోజుతూ, తేరుకుంటూ, బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడ సాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=741 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, October 2, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౫(355)

( జరాసంధ వధ ) 

10.2-738-వ.
ఇవ్విధంబునం బోరుచుండ నొండొరుల గదా దండంబులు దుమురులైనం బెండువడక, సమద దిగ్వేదండశుండాదండమండిత ప్రచండంబు లగు బాహుదండంబు లప్పగించి ముష్టియుద్ధంబునకు డగ్గఱి.
10.2-739-లగ్రా.
కాల వెస దాచియును, గీ లెడలఁ ద్రోచియునుఁ,
  దాలుములు దూలఁ బెడకేల వడి వ్రేయన్,
ఫాలములు గక్షములుఁ దాలువులు వక్షములు;
  వ్రీల, నెముకల్‌ మెదడు నేలఁ దుమురై వే
రాల, విపులక్షతవిలోలమగు నెత్తురులు;
  జాలుగొని యోలిఁ బెనుఁ గాలువలుగం, బే
తాలమదభూతములు ఖేలనలఁ జేతులనుఁ;
  దాళములు తట్టుచు సలీలగతి నాడన్. 

భావము:
అలా భీమజరాసంధులు పోరాడుతుండగా వారి గదాదండాలు ఖండఖండాలు అయిపోయాయి. దానితో ఇద్దరూ నిరుత్సాహపడకుండా దిగ్గజాల తొండాలవంటి ప్రచండ బాహుదండములు సాచి ముష్టియుద్ధానికి తలపడి కాళ్లతో కుమ్ముకుంటూ కీళ్ళు విరగకొట్టుకుంటూ, నొసళ్ళూ, ప్రక్కలూ, చెక్కిళ్ళూ, రొమ్ములు పగిలేలా, ఎముకలు విరిగేలా, గాయాలనుండి నెత్తురు కాలువలు కట్టి ప్రవహించేలా, భూత, బేతాళాలు కేరింతలు కొడుతూ ఉండగా భీమజరాసంధులు ఇరువురూ యుద్ధం చేయసాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=739 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, October 1, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౪(354)

( జరాసంధ వధ) 

10.2-736-చ.
మడవక భీమసేనుఁడును మాగధరాజు గడంగి బెబ్బులుల్‌
విడివడు లీల నొండొరుల వీఁపులు మూఁపులునుం బ్రకోష్ఠముల్‌
నడితల లూరు జాను జఘనప్రకరంబులు బిట్టు వ్రయ్యఁగాఁ
బిడుగులఁబోలు పెన్గదల బెట్టుగ వ్రేయుచుఁ బాయుచున్ వెసన్.
10.2-737-లవి.
బెడ గడరు పెన్గదలు పొడిపొడిగఁ దాఁకఁ, బెను;
  పిడుగు లవనిం దొరఁగ, నుడుగణము రాలన్,
మిడుఁగుఱులు చెద్ర, నభ మడల, హరిదంతములు;
  వడఁక, జడధుల్‌ గలఁగఁ, బుడమి చలియింపన్,
వెడచఱువ మొత్తియునుఁ, దడఁబడఁగ నొత్తియును;
  నెడమగుడు లాఁచి తిరుగుడు పడఁగ వ్రేయన్,
వడవడ వడంకుచును, సుడివడక డాసి, చల;
  ముడుగ కపు డొండొరుల వడిచెడక పోరన్. 

భావము:
భీమజరాసంధులు ఏమాత్రం వెనుదీయకుండా విజృంభించి పెద్దపులుల్లాగా ఒకరినొకరు వీపులూ మూపులూ ముంజేతులూ శిరస్సులూ తొడలూ మోకాళ్ళూ నడుములూ బ్రద్దలయ్యేటట్లు గట్టిగా పెద్ద పెద్ద గదాఘట్టనలతో కొట్టుకోసాగారు. అలా పరస్పరం మోదుకుంటూ, తప్పించుకుంటూ... పెనుగదలు బద్దలై పొడిపొడిగా రాలేలాగ, పిడుగులు పడేలా, చుక్కలు రాలేలా, నిప్పురవ్వలు వ్యాపించేలా, దిక్కులు వణికేలాగ, సముద్రాలు అల్లకల్లోల మయ్యేలాగ, భూమి చలించేలా; కొట్టుకుంటూ, నెట్టుకుంటూ; ఒకరికొకరు తీసిపోకుండా; పిడుగుపాటు దెబ్బలకు అదిరిపోతున్నా, తడబాటు అన్నది లేకుండా తట్టుకుంటూ ఆ భీమజరాసంధులు యుద్ధం చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=737 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :