శివునిగరళభక్షణకైవేడుట
8-219-మ.
చని కైలాసముఁ జొచ్చి శంకరుని వాసద్వారముం జేరి యీ
శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి కుయ్యో మొఱో
విను; మాలింపుము;
చిత్తగింపుము; దయన్ వీక్షింపు మం చంబుజా
సనముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.
టీకా:
చని = వెళ్ళి;
కైలాసమున్ = కైలాసమునందు;
చొచ్చి = ప్రవేశించి;
శంకరుని = పరమశివుని {శంకరుడు -
సుఖమును కలుగజేయు వాడు};
వాస = నివాసపు;
ద్వారమున్ = ప్రవేశమును;
చేరి =
సమీపించి; ఈశుని = పరమశివుని;
దౌవారికులు = ద్వారపాలకులు;
అడ్డపడన్ = అడ్డుపడగా;
తలము = తొలగుము;
అంచున్ = అనుచు;
చొచ్చి = ప్రవేశించి;
కుయ్యోమొఱో = అమ్మబాబోయ్;
వినుము = వినుము;
ఆలింపుము = ఆలకించుము;
చిత్తగింపుము = తలచుము;
దయన్ = దయతో;
వీక్షింపుము = చూడుము;
అంచున్ = అనుచు;
అంబుజాసన = బ్రహ్మదేవుడు {అంబుజాసనుడు -
అంబుజము (పద్మము)న ఆసనుడు (ఆసీనుడగువాడు),
బ్రహ్మ}; ముఖ్యుల్ = మొదలగువారు;
కనిరి = దర్శించిరి;
ఆర్త = దుఃఖపడినవారిని;
రక్షణ = కాపాడెడి;
కళా = కళయందు;
సంరంభుని = వేగిరిపాటుగలవానిని;
శంభునిన్ = పరమశివుని.
భావము:
ఆ సమయంలో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని
కాపాడే వాడూ, సుఖప్రదాతా అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్ళారు. పరమశివుని
మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నరు. కానీ వారిని తప్పుకోమని లోనికి
ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకుని “శరణు, శరణు చిత్తగించు దయతో చూడు, కాపాడు” అంటూ మొరపెట్టుకున్నారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment