8-247-ఆ.
హరుఁడు గళమునందు హాలహలము బెట్టఁ
గప్పుఁ గలిగి తొడవు కరణి నొప్పె;
సాధురక్షణంబు సజ్జనులకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!
8-248-వ.
తదనంతరంబ
8-249-క.
గరళంబుఁ గంఠబిలమున
హరుఁడు ధరించుటకు మెచ్చి యౌ నౌ ననుచున్
హరియు విరించియు నుమయును
సురనాథుఁడుఁ బొగడి రంత సుస్థిరమతితోన్.
టీకా:
హరుడు = శంకరుడు
{హరుడు - ప్రళయకాలమున సర్వమును హరించువాడు,
భక్తులపీడను హరించువాడు,
శివుడు}; గళమున్ = కంఠము;
అందున్ = లో;
హాలాహలమున్ = హాలాహలవిషమును;
పెట్టన్ = పెట్టుటచే;
కప్పు = నలుపు;
కలిగి = కలిగి;
తొడవు = అలంకారము;
కరణిన్ = వలె;
ఒప్పెన్ =
చక్కగనుండెను;
సాధు = సాధుజనుల;
రక్షణంబున్ = కాపాడుట;
సజ్జనుల్ = మంచివారి;
కున్ = కి; ఎన్నన్ = ఎంచిచూడగా;
భూషణంబు = అలంకారము;
కాదె = కదా ఏమిటి;
భూవరేంద్ర = మహారాజా {భూవరేంద్రుడు - భూవరుల (రాజుల)లో వరుడు
(శ్రేష్ఠుడు), మహారాజు}.
తదనంతరంబ = ఆ తరువాత.
గరళంబున్ = విషమును;
కంఠబిలమునన్ = గొంతుకలో;
హరుడు = శివుడు;
ధరించుట = తాల్చుట;
కున్ = కు; మెచ్చి = మెచ్చుకొని;
ఔనౌన్ = మేలుమేలు;
అనుచున్ = అనుచు;
హరియున్ = విష్ణుమూర్తి;
విరించియును = బ్రహ్మదేవుడు {విరించి - హంసలచే వహింపబడువాడు,
బ్రహ్మ}; ఉమయును =
ఉమాదేవి {ఉమ - రక్షించునట్టియామె,
పార్వతి}; సురనాథుడు = ఇంద్రుడు {సురనాథుడు -
సుర (దేవతలకు) నాథుడు (ప్రభువు),
ఇంద్రుడు}; పొగిడిరి = స్తుతించిరి;
అంతన్ =
అంతట; సుస్థిర = నిలకడగల;
మతి = మనస్సుల;
తోన్ = తోటి.
భావము:
ఓ రాజోత్తమా! పరీక్షిత్తూ! హరుడు హాలాహలాన్ని కడుపులోకి
మ్రింగకుండా కుత్తుకలో నిలుపుకోవడం వలన ఆయన కఠంమీద నల్లమచ్చ
ఏర్పడి ఒక ఆభరణంగా నప్పింది. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధు సంరక్షణ అలంకారమే కదా.
అలా హరుడు హాలాహలం భుజించాక. . .
శంకరుడు విషాగ్నిని తన గొంతులో ధరించటం చూసి; విష్ణువూ, బ్రహ్మదేవుడూ, పార్వతీదేవీ, దేవేంద్రుడూ అచ్చమైన మనస్సుతో “మేలు, మేలు” అని మెచ్చుకున్నారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment