Tuesday, December 18, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 74

10.1-568-వ.
దేవా! యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుఁడవు, సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపకుఁడవు నని యెవ్వ రెఱుంగుదురు, వారు గదా గురు వనియెడు దినకరునివలనఁ బ్రాప్తంబైన యుపనిషదర్థజ్ఞానం బను సునేత్రంబునంజేసి సంసార మిథ్యాసాగరంబుఁ దరించిన చందంబున నుండుదురు; రజ్జువందు రజ్జువని యెఱింగెడి యెఱుక లేకుండ, న య్యెఱుంగమి నది సర్పరూపంబయి తోఁచిన పిదప నెఱింగిన వారివలన రజ్జువు రజ్ఝువని యెఱుంగుచుండ, సర్పరూపంబు లేకుండు కైవడి, నాత్మ యప్పరమాత్మ యని యెవ్వ రెఱుంగరు వారి కయ్యెఱుంగమివలన సకల ప్రపంచంబు గలిగి తోఁచు; నాత్మ యప్పరమాత్మ యని యెవ్వరెఱుంగుదురు, వారి కయ్యెఱుకవలనఁ బ్రపంచంబు లేకుండు నజ్ఞాన సంభావిత నామకంబులైన సంసార బంధ మోక్షంబులు, జ్ఞాన విజ్ఞానంబులలోనివి గావు; కావునఁ గమలమిత్రున కహోరాత్రంబులు లేని తెఱంగునఁ, బరిపూర్ణ జ్ఞానమూర్తి యగు నాత్మ యందు నజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబు లేమిని మోక్షంబు లే; వాత్మవయిన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నిన్నుఁగాఁ దలంచియు, నాత్మ వెలినుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదకుచుందురు; వారి మూఢత్వంబుఁ జెప్పనేల? బుద్ధిమంతులయి పరతత్వంబు గాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ తమ శరీరంబుల యంద నిన్నరయుచుందు రదిగావున.


భావము:
ఓ దేవా! శ్రీకృష్ణా! ఇట్టి నీవు జీవాత్మస్వరూపుడ వని; ఆత్మలు అన్నింటికీ ఆత్మ యైన పరమాత్మ స్వరూపుడ వని గ్రహించ గలిగినవారు, గురువు అనే సూర్యుని వలన ఉపనిషత్తుల జ్ఞానం అనే కన్నును పొందినవారు. అటువంటివారు సంసార మనే ఈ మాయాసముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు. అది త్రాడే అను జ్ఞానం లేనప్పుడు, దానిని చూస్తే అది పాములా కనిపిస్తుంది. తరవాత తెలిసినవారి వలన అది త్రాడే అని తెలుసుకున్న తర్వాత ఇంక పాము అనే రూపం ఉండదు. అలాగే తనలో నున్న ఆత్మయే పరమాత్మ అని తెలియని వారికి, ఈ ప్రపంచ మంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తరువాత తాను ఆత్మ అని ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తరువాత వారికి “అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమంతా తనకు కనిపించినదే తప్ప నిజంగా అక్కడ ఏమీ లే” దని తెలుస్తుంది. సంసారబంధము అనేది అజ్ఞానం వలన పుట్టినది. మోక్షం అనేది కూడా అజ్ఞానం వలననే పుట్టినదే. ఈ బంధ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాల లోనికి చేరవు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం వలన మనకు రాత్రింబవళ్ళు ఉన్నాయి గానీ సూర్యునికి రాత్రి పగలు లేవు అలాగే సంపూర్ణు డైన, జ్ఞాన స్వరూపు డైన ఆత్మకు అజ్ఞానం లేనందువలన బంధ మోక్షాలు ఉండవు. ఆత్మ వైన నిన్ను శరీర మని శరీరాదులు నీ వని భావించేవారు శరీరానికి బయట ఎక్కడో ఆత్మ ఉంటుంది అనుకునేవారు మూఢులు. అంటే మోహం చెందిన వారు. అ మోహంలోనే పడి ఆత్మ కోసం వెతుకులాడుతూ ఉంటారు. వారి మూఢత్వం ఇంత అని చెప్పడ మెందుకు. జడపదార్ధంలో కూడా పరమాత్మనే దర్శనం చేసేవారు బుద్ధిమంతు లైన సత్పురుషులు. వారు తమ శరీరాల లోనే నిన్ను చూడగలుగుతారు. అందుచేత. . .// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Sunday, December 16, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 73

10.1-567-సీ.
అది గాన నిజరూప మనరాదు; కలవంటి; 
దై బహువిధదుఃఖమై విహీన
సంజ్ఞానమై యున్న జగము సత్సుఖబోధ; 
తనుఁడవై తుదిలేక తనరు నీదు
మాయచేఁ బుట్టుచు మనుచు లే కుండుచు; 
నున్న చందంబున నుండుచుండు; 
నొకఁడ; వాత్ముఁడ; వితరోపాధి శూన్యుండ; 
వాద్యుండ; వమృతుండ; వక్షరుండ;
10.1-567.1-ఆ.
వద్వయుండవును; స్వయంజ్యోతి; వాపూర్ణుఁ
డవు; పురాణపురుషుఁడవు; నితాంత
సౌఖ్యనిధివి; నిత్యసత్యమూర్తివి; నిరం
జనుఁడ వీవు; తలఁపఁ జనునె నిన్ను. ?

భావము:
కనుక ఇది నీ అసలు స్వరూపం అని అనటానికి లేదు. ఈ జగత్తు అంతా కల వంటిది, ఎన్నో రకాల దుఃఖాలు కలది “సత్య జ్ఞానం” నష్టపోవడంలో మునిగి ఉంది. అటువంటి జగత్తు అంతా నీ మాయ చేత పుట్టుతూ, ఉంటూ, లేకుండా పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు మాత్రం సత్తు, నిరతిశయానంద రూపుడవు. ఆది, అంతమూ అంటూ లేనివాడవు; నీవు అనితరుడవు, స్వేతరుడవు కనుక ఒక్కడివే; ఆత్మ స్వరూపుడవు; నీవు మరో శరీరం అక్కరలేని వాడవు; నీవే అంతటికీ మూలమైన వాడవు; అంతము లేని వాడవు; తరిగిపోవడం అంటూ ఉండని వాడవు; నీకు సాటి రెండవవాడు లేడు; నీ యంత నీవు వెలుగుతూ ఉన్నావు; మొదటినుండీ సర్వమూ నీ లోనే ఉన్నవాడవు; ప్రాచీనులలో కెల్లా ప్రాచీనతముడవు అయిన మొట్టమొదటి పురుషుడవు నీవే; నిరంతరమైన సంపూర్ణమైన సుఖమునకు నిధానమైన వాడవు నీవు; సమస్త సృష్టికీ నిత్యమూ ఆధారమైన సత్యము నీవే; షోడశకళాపూర్ణ స్వరూపుడవు నీవు. ఇటువంటి నిన్ను ఉత్తి భౌతిక మనస్సుతో భావించాలంటే సాధ్యమా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=567

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, December 14, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 72

10.1-565-క.
జలచర మృగ భూసుర నర
కులముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్
జెలిమిని సుజనుల మనుపను
దలపోయఁగ రాదు నీ విధంబు లనంతా!
10.1-566-ఆ.
మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన
యో! పరాత్మభూమ! యోగిరాజ! 
యే తెఱంగు లెన్ని యెంత యెచ్చోట నీ
హేల లెవ్వఁ డెఱుఁగు నీశ్వరేశ!


భావము:
ఓ అనంత కృష్ణా! నీవలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీవు దుర్మార్గులను శిక్షించడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ జలచరములుగా, మృగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈవిధంగా ఉంటాయని ఊహించడం అసాధ్యం కదా. ఓ పరమాత్మా! మహాయోగీశ్వరేశ్వరా! శ్రీకృష్ణా! నీ కన్న ఇతరులుగా జీవిస్తున్న జీవులందరూ “ఎవరికివారు “నేను” అని మిగిలినవారిని “వారు” అని అనుకుంటున్నారు. వారందరిలో ఉన్న “నేను” నివాసంగా “నీవు” ఉన్నావు. దానిని దర్శించడానికి సాధన చేసేవారే యోగులు. వారి యోగంగా వారిలో వెలుగుతూ ఉన్నదీ నీవే మిగిలినవారు ఈ నీ యందు మరుపు కలిగి ఉంటారు. “తాము ఉన్నామనే తెలివి” మైకంగా కప్పుతుంది. ఈ మైకాన్నికలిగించి నీవు లోపల ఉంటే వారికి నీవు నిద్రిస్తున్నట్లు ఉంటావు. అలాంటి యోగనిద్రలో ఉన్న నీ లీలలు ఎవరికి తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయి?// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
శ్రీకృష్ణ లీలావిలాసం - 71

10.1-563-క.
ఎఱిఁగిన వారికిఁ దోఁతువు
నెఱిఁ బ్రకృతింజేరి జగము నిర్మింపఁగ నా
తెఱఁగున రక్షింపఁగ నీ
తెఱఁగున బ్రహరింప రుద్రు తెఱఁగున నీశా!
10.1-564-వ.
అదియునుం గాక.

భావము:
శ్రీకృష్ణ ప్రభూ! నీవు ప్రకృతితోకూడి జగత్తును నిర్మిస్తూ ఉండి నేను గానూ; రక్షిస్తూ ఉండి నీవు గానూ; లయం చేస్తూ ఉండి రుద్రుని గానూ జ్ఞానులకు నీవే తెలుస్తూ ఉంటావు. అంతే కాకుండా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=563

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, December 11, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 70

10.1-561-మ.
వినుమో; యీశ్వర! వెల్పలన్ వెలుఁగు నీ విశ్వంబు నీ మాయ గా
క నిజంబైన యశోద యెట్లుగనియెం? గన్నార నీ కుక్షిలోఁ
గనెఁ బోఁ గ్రమ్మఱఁ గాంచెనే? భవదపాంగశ్రీఁ బ్రపంచంబు చ
క్కన లోనౌ; వెలి యౌను; లోను వెలియుం గాదేఁ దదన్యం బగున్;
10.1-562-మ.
ఒకఁడై యుంటివి; బాలవత్సములలో నొప్పారి తీ వంతటన్
సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేఁ గొల్వఁగాఁ
బ్రకటశ్రీ గలవాఁడ వైతి; వటుపై బ్రహ్మాండముల్ జూపి యొ
ల్లక యిట్లొక్కఁడవైతి; నీ వివిధ లీలత్వంబుఁ గంటిం గదే?


భావము:
ఓ శ్రీకృష్ణ ప్రభూ! వెలుపల కనిపిస్తున్న ఈ విశ్వం అంతా నీ మాయకాక నిజమే అయినట్లయితే, యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూడగలిగింది? చూసిందే అనుకో, మళ్లీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటిచూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలది అవుతుంది; నీ బయటది అవుతుంది; లోపల వెలుపల కాకపోతే మూడవది అవుతుంది; లోపలా వెలుపలా కూడా అవుతుంది. మొదట నీవు ఒక్కడవే ఉన్నావు; తరువాత గోపబాలురలో లేగలలో వెలుగొందేవు; ఆ తరువాత అందరిచేత నమస్కారాలు అందుకుంటున్న చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో కనిపించి నన్ను ఆనందపరచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు; ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు; తరువాత అది కాదని మళ్లీ ఇప్పుడు ఇలా ఒక్కడివిగా కనిపిస్తున్నావు; ఆహ! ఏమి నా భాగ్యం? ఇన్నాళ్ళకు ఇన్నిరకాల నీ లీలలు చూసాను.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Monday, December 10, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 69

10.1-560-సీ.
నళినాక్ష! నీ వాది నారాయణుండవు; 
జలము నారము జీవచయము నార
మందు నీవుంట నీ యం దవి యుంటను; 
నారాయణుండను నామ మయ్యె
సకల భూతములకు సాక్షి వధీశుండ; 
వబ్ధి నిద్రించు నారాయణుఁడవు
నీ మూర్తి యిది నీకు నిజమూర్తి యనరాదు; 
నళిననాళము త్రోవ నడచి మున్ను
10.1-560.1-తే.
కడఁగి నూఱేండ్లు వెదికి నేఁ గాననయితి
నేకదేశస్థుఁడవు గా వనేక రుచివి
జగములోనుందు; నీలోన జగములుండు
నరుదు; నీ మాయ నెట్లైన నగుచు నుండు.


భావము:
తామరరేకులవంటి కన్నుల కలవాడా! కృష్ణా! నీవు త్రిమూర్తులకూ మూలమైన ఆదినారాయణుడవు. జలములు, జీవరాసులు నారములు అని పిలవబడతాయి. నారములలో నీవు ఉండడం చేత, నీ యందు అవి ఉండడంచేతా నీకు నారాయణుడు అనే పేరు మేము పెట్టుకున్నాం. భూతములు జీవరాశులు సర్వం వస్తూ పోతూ ఉంటే, నీవు సాక్షిగా ఉంటావు. నీవు వాటికి అన్నింటికీ అధిష్టానమైన ఈశ్వరుడవు. సముద్రంలో నిద్రించే నారాయణా అదే నీ నిజమైన రూపం అనడానికీ వీలులేదు. నేను పూర్వం తామరతూడు లోపల పయనిస్తూ నూరేండ్లు వెదకినా నీ అసలు రూపం ఏమిటో చూడలేకపోయాను కదా. నీవు ఒకచోట ఉంటావు అనడానికీ వీలులేదు. నీవు ఎన్నో రూపాలు కాంతులు కలవాడవు. సృష్టిలో నీవు ఉంటావు నీ లోపల సృష్టి ఉంటుంది. నీ మాయాప్రభావంతో ఏ విధంగా నైనా ఉండగలవు.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Sunday, December 9, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 68

10.1-558-త.
కడుపులోపల నున్న పాపఁడు కాలఁ దన్నినఁ గిన్కతో
నడువఁ బోలునె క్రాఁగి తల్లికి? నాథ! సన్నము దొడ్డునై
యడఁగి కారణ కార్యరూపమునైన యీ సకలంబు నీ
కడుపులోనిదె గాదె? పాపఁడఁ గాక నే మఱి యెవ్వఁడన్?
10.1-559-క.
భూరి లయ జలధినిద్రిత
నారాయణనాభికమలనాళమున నజుం
డారఁయఁ బుట్టె ననుట నిజ
మో! రాజీవాక్ష! పుట్టె నోటు తలంపన్.

భావము:
ఓ కృష్ణ ప్రభూ! కడుపులో ఉన్న పాపడు కాలితో తన్ని బాధపెట్టినా తల్లి కోపగించి కొట్టదు కదా. సూక్ష్మము, స్థూలము, అయి కారణరూపము కార్యరూపము అయిన ఈసృష్టి సమస్తం నీ కడుపులోనిదే కదా. మరి నేను నీ పాపడనుకాక మరెవ్వడను?మహాప్రళయ సమయంలో ఆ సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ ఉన్న నారాయణుని బొడ్డుతామర నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అనే మాట సత్యం. ఆలోచిస్తే, నేను పుట్టినప్పుడే నాతోపాటే నా ఓటమి కూడా పుట్టిందేమో అనిపిస్తోంది..

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=559

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, December 8, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 67

10.1-557-సీ.
సర్వేశ! నే రజోజనితుండ; మూఢుండఁ; 
బ్రభుఁడ నేనని వెఱ్ఱి ప్రల్లదమున
గర్వించినాఁడను; గర్వాంధకారాంధ; 
నయనుండ గృపఁజూడు ననుఁ; బ్రధాన
మహదహంకృతి నభో మరుదగ్ని జల భూమి; 
పరివేష్టితాండకుంభంబులోన
నేడు జేనల మేన నెనయు నే నెక్కడ? ;
నీ దృగ్విధాండంబు లేరి కైన
10.1-557.1-తే.
సంఖ్య జేయంగ రానివి; సంతతంబు
నోలిఁ బరమాణవుల భంగి నొడలి రోమ
వివరముల యందు వర్తించు విపులభాతి
నెనయుచున్న నీ వెక్కడ? నెంతకెంత?


భావము:
సర్వేశ్వరా! కృష్ణా! నేను రజోగుణము నుండి జనించిన వాడను. కనుక మోహం చెంది ఉన్నాను. నేనే ప్రభువును అనుకుని వెర్రి అహంకారంతో గర్వించాను. గర్వం అనే చీకటితో నా కన్నులు చీకట్లు క్రమ్మాయి. ప్రధాన పురుషుడు అతని చుట్టూ మహత్తు అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇలా ఒకదాని చుట్టూ మరియొకటి ఆవరించి యున్న బ్రహ్మాండంలో ఏడుజానల పొడవున్న నేనెంతవాడను? ఎవరికీ లెక్కించనలవి కానన్నిఇలాంటి బ్రహ్మాండాలు కల బ్రహ్మాండ భాండాలు ఎన్నింటినో నిత్యమూ ఒకదానివెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకూపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడ? నేనెక్కడ? ఎక్కడి కెక్కడికి పోలిక?// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Thursday, December 6, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 66

10.1-556-ఉ.
మాయలు గల్గువారలను మాయలఁ బెట్టెడి ప్రోడ నిన్ను నా
మాయఁ గలంచి నీ మహిమ మానముఁ జూచెద నంచు నేరమిం
జేయఁగఁ బూనితిం; గరుణ చేయుము; కావుము; యోగిరాజ వా
గ్గేయ! దవాగ్నిఁ దజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే.

భావము:
ఓ గడసరివాడా! కృష్ణమూర్తీ! యోగీశ్వరులు అందరిచేతా వాక్కుల తోను పాటలతోను స్తుతింపబడుతూ ఉండేవాడా! దావాగ్ని నుండి పుట్టిన ఒక అగ్నిజ్వాల, ఆ దావాగ్నినే మించి ప్రకాశించడం ఎలా సాధ్యం అవుతుంది? నీవు ఎంతటి మాయలు కల వారిని అయినా మాయలో పడవేస్తుంటావు. అటువంటి నిన్ను నా మాయతో ఇబ్బందిపెట్టి నీ మాయ ఎంతటిదో చూద్దాం అనుకున్నాను. చేత కాదని తెలియక చేయడానికి సాహసించాను. నా యందు దయ చూపి రక్షించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=556

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 65

10.1-554-క.
తారా తుషార శీకర
భూరజములకైన లెక్క బుధు లిడుదురు; భూ
భారావతీర్ణకరుఁ డగు
నీ రమ్యగుణాలి నెన్న నేర రగణ్యా!
10.1-555-శా.
ఏ వేళం గృపఁ జూచు నెన్నఁడు హరిన్ వీక్షింతు నం చాఢ్యుఁడై
నీ వెంటంబడి తొంటి కర్మచయమున్ నిర్మూలముం జేయుచున్
నీ వాఁడై తను వాఙ్మనోగతుల నిన్ సేవించు విన్నాణి వో
కైవల్యాధిపలక్ష్మి నుద్దవడిఁ దాఁ గైకొన్నవాఁ డీశ్వరా!


భావము:
ఓ గణనాతీతా! శ్రీకృష్ణా! ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపరలను, భూమి మీది ధూళి కణాలను అయినా లెక్కించడం సాధ్యం కావచ్చు. కాని భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులూ లెక్కపెట్టలేరు. నీవు అన్ని లెక్కలకూ పైనున్నవాడవు కదా. సర్వేశ్వరా! శ్రీకృష్ణా! నన్ను ఏనాటికి దయతో చూస్తాడో ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో అనే ఆర్తితో ఉన్నవాడు నిజమైన సంపన్నుడు. అట్టి నీ భక్తుడు నీ వెంటపడాలి. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తన పూర్వకర్మల మొత్తాన్ని మొదలంటా తొలగించుకొని, నీ వాడు కావాలి. మనస్సుతోను, వాక్కుతోను, చేష్టలతోను నిన్నే సేవించాలి. అతడు నిజమైన నేర్పరి. అటువంటి నేర్పరికి గాని మోక్షలక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Wednesday, December 5, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 64

10.1-553-సీ.
విక్రియాశూన్యమై విషయత్వమును లేని; 
దగుచు నాత్మాకారమై తనర్చు
నంతఃకరణ మొక్క యధిక సాక్షాత్కార; 
విజ్ఞానమునఁ బట్టి వే ఱొరులకుఁ
నెఱుఁగంగ రానిదై యేపారి యుండుటఁ; 
జేసి నీ నిర్గుణ శ్రీవిభూతి
బహిరంగవీధులఁ బాఱక దిరములై; 
యమలంబు లగు నింద్రియములచేత
10.1-553.1-ఆ.
నెట్టకేలకైన నెఱుఁగంగ నగుగాని
గుణవిలాసి వగుచుఁ గొమరుమిగులు
నీ గుణవ్రజంబు నేర రా దెఱుఁగంగ
నొక్క మితము లేక యుంట నీశ!

భావము:
ఓ పరమేశా! కృష్ణా! నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులూ ఉండవు కనుక తెలియడానికి ఏమీ ఉండదు. పైగా తన కన్నా వేరే తనకు వెలుపల ఏమీ ఉండదు. దానినే తత్ లేదా ఆత్మ అంటాము. అది అన్నింటి లోపల అంతర్యామియైన ప్రయోజనంగా ఉంటుంది. అది ఇంద్రియాలకి, ఎదుట కనిపించడావికి అవకాశం లేదు. ఎందుకంటే, అంతకు ముందున్న విజ్ఞానం అనే అలవాటు ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు కదా. అది తనకు తప్ప ఇంకొకళ్ళకు తెలియదు. ఎందుకనగా, దానికి అదే కాని ఇతరము ఏదీ ఉండదు. అది ఎప్పడూ వెలుపల కనిపించేది కాదు. కనుక ఇంద్రియాలను లోపలికి త్రిప్పితే తనకు తాను అనిపిస్తుంది. ఇలా తిప్పలుపడి ఎలాగో అలాగ నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవచ్చు. అదే కష్టం అనుకుంటారు కానీ, నిజానికి నీ సగుణరూపం తెలుసుకోవడమే అసాధ్యం. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు. నీవు గుణాలతో కూడి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. మరి (గుణాతీతుడవైన) నీ గుణాలకు పరిమితి అన్నదే లేదు కనుక, నీ యొక్క కనిపించే రూపాలను తెలుసుకోవడమే అసాధ్యం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=553

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 63

10.1-551-క.
శ్రేయములుఁ గురియు భక్తిని
జేయక కేవలము బోధసిద్ధికిఁ దపమున్
జేయుట విఫలము; పొల్లున
నాయము జేకుఱునె తలఁప నధికం బైనన్.
10.1-552-క.
నిజముగ నిన్నెఱుఁగఁగ మును
నిజవాంఛలు నిన్నుఁ జేర్చి నీ కథ వినుచున్
నిజకర్మలబ్ధ భక్తిన్
సుజనులు నీ మొదలిటెంకిఁ జొచ్చి రధీశా!


భావము:
భక్తి అనేది సర్వ శుభాలనూ వర్షిస్తుంది. అటువంటి భక్తిని వదలిపెట్టి కేవలం జ్ఞానంకోసం తపస్సు చేయడం వ్యర్ధం. ఎంత ఎక్కువగా కూడపెట్టినా, ఊక (బియ్యంపైన ఉండే పొట్టు) వల్ల ఏమి ఆదాయం లభిస్తుంది? ఎంత ఊకదంపుడు చేసినా ఏమి ఫలితం దక్కుతుంది. ప్రభూ! విష్ణుమూర్తీ! నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీ యందు సమర్పించి, నీ కథలు వింటూ ఉండాలి. అప్పుడు తాము చేసిన సత్ కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తుంది. ఇలా లభించిన భక్తితో సజ్జనులు మాత్రమే నీ మూలస్థానం అయిన పరమపదాన్ని చేరతారు.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Saturday, December 1, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 62

10.1-549-మ.
నను మన్నించి భవజ్జనంబులకు నానందంబు నిండించు నీ
తను రూపం బిదె నా మనంబున కచింత్యంబయ్యె; నీ యుల్లస
ద్ఘన విశ్వాకృతి నెవ్వఁ డోపు? నెఱుఁగన్ గైవల్యమై యొప్పు నా
త్మ నివేద్యంబగు నీదు వైభవము చందంబెట్టిదో? యీశ్వరా!
10.1-550-క.
విజ్ఞాన విధము లెఱుఁగక
తద్జ్ఞులు నీ వార్త చెప్పఁ దను వాఙ్మనముల్
యజ్ఞేశ! నీకు నిచ్చిన
యజ్ఞులు నినుఁబట్టి గెలుతు రజితుఁడవైనన్.

భావము:
పరమేశ్వరా! నన్ను అనుగ్రహించు. నీ వారికి అందరకీ ఆనందం నిండించే నీ ఈ చిన్నరూపమే నా మనస్సుకే ఊహించడానికి సాధ్యం కాలేదు. ఇక నీవు ఉల్లాసంతో ధరించిన మహావిశ్వరూపాన్ని తెలుసుకోవడానికి సమర్థు లెవరు? నాలో నేను గా నున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవ విశేషం ఎంతటిదో ఎవరికి మాత్రం తెలుస్తుంది? ఓ యజ్ఞరూపా! శ్రీహరీ! మహా పండితులు తాము వివరించ దలచిన నీ పరబ్రహ్మ తత్వాన్ని “అది (తత్)” అని వ్యవహరిస్తారు. వారు ఆత్మ జ్ఞానాన్ని తెలియ లేక, చెప్పడానికీ ఈ పదాన్నే వాడుతూ ఉంటారు. అంతేతప్ప, ఎంతటి పండితుల కైనా నీవు జయింపరాని వాడవే. అయితే, ఏమీ తెలియని వాళ్ళు సైతం, త్రికరణములు అనే శరీరము వాక్కు మనస్సులతో సహా తమను తాము నీకు సమర్పించుకుని భక్తితో గట్టిగా నిన్ను పట్టుకుంటే, నిన్ను అందుకో గలుగుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=550

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 61

10.1-548-సీ.
“శంపాలతికతోడి జలదంబు కైవడి; 
మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ
కమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ; 
వేణుచిహ్నంబుల వెలయువాని
గుంజా వినిర్మిత కుండలంబులవాని; 
శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ
వనపుష్పమాలికావ్రాత కంఠమువాని; 
నళినకోమల చరణములవానిఁ
10.1-548.1-ఆ.
గరుణ గడలుకొనిన కడగంటివాని గో
పాలబాలుభంగిఁ బరగువాని
నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!


భావము:
“మెరపుతీగతోకూడిన మేఘంవలే నీ శరీరం బంగారురంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తున్నది. నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా ఎంతో అందంగా ఉంది. వెదురుకర్ర, కొమ్ముబూర, మురళి మొదలైనవి అలంకారాలవలె కలిగి ప్రకాశిస్తున్నావు. ఏనుగు దంతంతో చక్కగా చేసిన నీ కుండలాలు; నెమలి పింఛంతో చుట్టబడిన శిరస్సు; అడవిపూల మాలికతో అలంకరించబడిన నీ కంఠం; తామరపూవులా సున్నితమైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. అదిగో కడగంటితో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణికిసలాడుతోంది. నీ గోపాలబాల రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే, నన్ను చూసి నవ్వుతున్న నీ మోము చాలా రమణీయంగా ఉంది. కమలదళాలవంటి కన్నులకల నీవు నన్ను కన్నతండ్రివని ఇప్పుడు గుర్తించాను. ఓ విష్ణుమూర్తీ! నీకు మ్రొక్కి నిన్ను సేవించుకుంటున్నాను.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :