Friday, March 30, 2018

శ్రీహరి వైభవం - 1

2-201-మ.
హరి మాయా బల మే నెఱుంగ నఁట శక్యంబే సనందాది స
త్పురుషవ్రాతము కైన, బుద్ధి నితరంబున్ మాని సేవాధిక
స్ఫురణం దచ్ఛరితానురాగగుణవిస్ఫూర్తిన్ సహస్రాస్య సుం
దరతం బొల్పగు శేషుఁడుం దెలియఁ డన్నన్జెప్ప నే లొండొరున్.
2-202-చ.
ఇతరముమాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా
శ్రితజన సేవితాంఘ్రి సరసీరుహుఁడైన సరోజనాభుఁ డం
చితదయతోడ నిష్కపటచిత్తమునం గరుణించు; నట్టివా
రతుల దురంతమై తనరు నవ్విభు మాయఁ దరింతు రెప్పుడున్.

భావము:
నేనే శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోలేకున్నాను. ఇక తెలుసుకోవడానికి సనందుడు, సనకుడు, సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం వీలవుతుందా. ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలన్నీ వదలి పెట్టి బుద్ధిని సదా భగవత్సేవకే అంకితం చేశాడు. వేయి నోళ్లతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తు ఉంటాడు. అట్టి శేషుడు గూడ ఆయన మాయామహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు. ఇక ఇతరుల సంగతి చెప్పాలా. ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణే దృఢంగా నమ్మి సేవిస్తారో, వాళ్లను, ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయగలిగి, కల్లాకపటంలేని మనస్సుతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైనవాళ్లు మాత్రమే సాటిలేనిది, దాటరానిది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=2&Ghatta=26&padyam=201

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, March 10, 2018

నీలకంఠ వైభవం - 25

న మచ్చిక గలిగిన
నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె
చిచ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.


భావము:
మెచ్చినప్పుడూ, నచ్చినప్పుడూ ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ; ఇతరుల కోసం భగభగ మండే చిచ్చును కోరి కబళంచేసి మింగటం అన్నది, ఆ చిచ్చర కన్ను గల పరమ శివుడైన హరునికి తప్పించి ఎవరికి సాధ్యం అవుతుంది?


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=246


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
నీలకంఠ వైభవం - 24

8-245-క.
ఉదరము లోకంబులకును
సదనం బగు టెఱిఁగి శివుఁడు చటుల విషాగ్నిం
గుదురుకొనఁ గంఠబిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.

భావము:
పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకూ నివాసం కనుక. ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉందరంలోనికి పోనివ్వకుండా, ఏదో చిన్న పండ్ల రసాన్ని ఉంచుకున్నట్లుగా, తన కంఠ బిలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=245

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, March 6, 2018

నీలకంఠ వైభవం - 23

8-244-మ.
కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటాచంద్రుఁడుం గందఁడున్; 
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.


భావము:
మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
నీలకంఠ వైభవం - 22

8-242-మ.
తనచుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీర రవంబుతో శివుఁడు లోకద్రోహి! హుం! పోకు ర
మ్మని కెంగేలఁ దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్.
8-243-వ.
అయ్యవిరళ మహాగరళదహన పాన సమయంబున.

భావము:
దేవతలు మహాదేవుని చుట్టూ చేరి “జయ జయ” ధ్వానాలు చేశారు. పరమ శివుడు మేఘ గంభీర కంఠస్వరంతో “ఓహో! లోకద్రోహీ! పారిపోకు రా! రా!” అని, సర్వనాశనము చేసే ఆ హాలహాల మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకుని, ముద్ద చేసి, నేరేడు పండునోట్లో వేసుకున్నంత సుళువుగా, విలాసంగా భుజించాడు. పరమ శివుడు అలా అతి భీకరమైన మహా విషాగ్నిని మ్రింగే సమయంలో. . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=242

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, March 5, 2018

నీలకంఠ వైభవం - 21

8-241-క.
మ్రింగెడి వాఁడు విభుం డని 
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!


భావము:
ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది. 


వివరణ: 
ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అటుపక్క ఆ గరళానికి, మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో. మరల మరల ప్రయోగించిన గ’, ళ’ లు, మింగటంలో గళం లోనే ఆపేసాడు అని, శక్తి స్వరూపిణి స్త్రీతో పాలుపంచుకంటుంటే ఎంతటి కాలకూటవిషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్పురిస్తోంది.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
నీలకంఠ వైభవం - 20

8-239-మ.
అమరన్ లోకహితార్థమంచు నభవుం "డౌఁగాక" యం చాడెఁ బో
యమరుల్ భీతిని "మ్రింగవే" యనిరి వో యంభోజగర్భాదులుం
దముఁ గావన్ హర! "లెమ్ము లెమ్మనిరి" వో తాఁజూచి కన్గంట న
య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్.
8-240-వ.
అనిన శుకుం డిట్లనియె.


భావము:
“భయం చెంది అమరత్వం కోరుతున్న దేవతలు హాలాహలాన్ని “మ్రింగు” అని కోరారే అనుకో! పద్మం గర్భంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగువారు తమను కాపాడటానికి “పూనుకోవయ్యా హరా!” అని వేడుకున్నారే అనుకో! ఆ పరమ శివుడు లోకాలకు మేలు జరుగుతుంది కదా అని “సరే” అన్నాడే అనుకో! తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుడు ఆది అన్నది లేని వాడు కావచ్చు అనుకో, అయనా పార్వతీ దేవి కంటి ఎదురుగా భయంకరమైన అగ్ని జ్వాలలతో కూడిన హాలాహలాన్ని చూస్తూ, “మ్రింగు” అని ఎలా చెప్పిందయ్యా?”. ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకముని ఇలా అన్నాడు...:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::