Sunday, April 28, 2019

కపిల దేవహూతి సంవాదం - 113-880-మ.
కణఁకన్ వారలు వెండి మోక్షనిరపేక్షస్వాంతులై యుండి తా
మణిమాద్యష్టవిభూతి సేవితము నిత్యానంద సంధాయియున్
గణనాతీతము నప్రమేయము సమగ్రశ్రీకమున్ సర్వల
క్షణయుక్తంబును నైన మోక్షపదవిం గైకొందు రత్యున్నతిన్.
3-881-వ.
ఇట్లువొంది.

భావము:
ఆ విధంగా మోక్షాసక్తి లేనివారై కూడా వారు అణిమాది అష్టసిద్ధి సంసేవితమూ, శాశ్వతానంద సంధాయకమూ, వర్ణనాతీతమూ, మహనీయమూ, సంపూర్ణ వైభవోపేతమూ, సకలలక్షణ సమేతమూ, మహోన్నతమూ అయిన వైకుంఠధామాన్ని పొందుతారు. ఈవిధంగా పొంది...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=880

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 10


3-879-సీ.
పరికింపఁ గొందఱు భాగవతోత్తముల్;
ఘనత కెక్కిన పురాతనము లైన
చారు ప్రసన్న వక్త్రారుణలోచన;
ములు గల్గి వరదాన కలితములుగఁ
దనరు మద్దివ్యావతార వైభవములు;
మదినొప్పఁ దమ యోగమహిమఁ జేసి
యనుభవించుచుఁ దదీయాలాపములు సన్ను;
తించుచుఁ దివుటఁ దద్దివ్య విలస
3-879.1-తే.
దవయవోదార సుందర నవవిలాస
మందహాస మనోహర మధుర వచన
రచనచే నపహృత మనఃప్రాణు లగుచు
నెలమి నుందురు నిశ్శ్రేయసేచ్ఛ లేక.

భావము:
కొందరు భాగవతోత్తములు ప్రసిద్ధికెక్కిన నా పురాణ స్వరూపాలను స్మరిస్తూ ఉంటారు. అందాలు చిందే ముఖమూ, కరుణారసం విరజిమ్మే అరుణనేత్రాలూ కలిగి భక్తులకు వరాలను ప్రసాదించే నా దివ్యావతారాలనూ వాని వైభవవిశేషాలనూ మనస్సులో నిలుపుకుంటారు. తమ భక్తియోగ మహత్త్వంవల్ల అలనాటి నా సంలాపాలను స్మరించుకొని కొనియాడుతుంటారు. నవనవోన్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్నీ, సుందరమైన నా మందహాసాన్నీ, మనోహరాలైన నా మధురవాక్కులనూ మాటిమాటికీ మననం చేసుకుంటూ మనస్సూ, ప్రాణమూ పరవశింపగా మోక్షంమీద అపేక్ష లేకుండా ఉంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=879

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, April 26, 2019

కపిల దేవహూతి సంవాదం - 9:

3-878-చ.
అమలినభక్తిఁ గొందఱు మహాత్ములు మచ్చరణారవింద యు
గ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై యితరేత రానులా
పముల మదీయ దివ్యతనుపౌరుషముల్ కొనియాడుచుండి మో
క్షము మదిఁ గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై.

భావము:
కొందరు మహాత్ములు నిర్మలమైన భక్తిభావంతో నా పాదపద్మాలను తమ హృదయపద్మాలలో పదిలపరచుకొని ఎంతో కుతూహలంతో పరస్పరం సంభాషించుకుంటూ ఆ సంభాషణలలో నా దివ్యస్వరూపాన్నీ, నా లీలావిశేషాలనూ కొనియాడుతూ ఉంటారు. వారు సర్వదా తమ సమస్త కర్మఫలాలనూ నాకే అర్పించి భక్తి పరవశులై ముక్తిని కూడా వాంఛింపరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=878

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 83-877-సీ.
"జనయిత్రి! విను మఱి సకల పదార్థప;
రిజ్ఞానతత్త్వపారీణ మైన
యామ్నాయ విహితకర్మాచారములు గల్గి;
తివుటమై వర్తించు దేవగణము
పూని నైసర్గికంబైన నిర్హేతుక;
మగు భగవత్సేవ మిగుల ముక్తి
కంటె గరిష్ఠంబు గావున నదియు భు;
క్తాన్నంబు జీర్ణంబు నందఁ జేయు
3-877.1-తే.
దీప్త జఠరాగ్నిగతి లింగదేహనాశ
కంబు గావించు నదియునుగాక విష్ణు
భక్తి వైభవములఁ దేటపఱతు వినుము
సద్గుణవ్రాత యోగలక్షణసమేత

భావము:
“అమ్మా! సద్గుణసమూహం, యోగలక్షణాలు కలదానా! విను. సకలపదార్థాలకూ సంబంధించిన యథార్థస్వరూపాన్ని పూర్తిగా తెలియజేసేవి వేదాలు. వేదసంబంధమైన సత్కర్మలకూ సదాచారాలకూ దేవతలు సంతృప్తులౌతారు. సహజమూ నిర్హేతుకమూ అయిన భగవంతుని సేవారూపమైన భక్తి ముక్తికంటె గొప్పది. జీర్ణాశయమందలి జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవద్భక్తి జీవులు కావించిన కర్మలనూ కర్మఫలాలనూ లోగొంటుంది. అందువల్ల జీవుని లింగమయ శరీరం నశిస్తుంది. విష్ణుభక్తి విశేషాలను వివరిస్తాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=877

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 73-875-క.
"ఏ భక్తి భవద్గుణపర
మై భవపాపప్రణాశమై ముక్తిశ్రీ
లాభము రయమునఁ జేయునొ
యా భక్తివిధంబుఁ దెలియ నానతి యీవే.
3-876-వ.
అదియునుం గాక భవదుదితం బయిన యోగంబును దదంగంబులును దద్గత తత్త్వావబోధంబును సాకల్యంబుగ మందబుద్ధి నైన నాకు స్ఫుటంబుగాఁ దెలియ నానతి" మ్మనినఁ గపిలుం డిట్లనియె.

భావము:
“ఏ భక్తి నీ గుణగణాలకు అంకితమై సంసారపాపాలను పోగొట్టి శీఘ్రంగా మోక్షలక్ష్మిని చేకూరుస్తుందో ఆ భక్తి స్వరూపాన్ని నాకు బాగా తెలిసేటట్లు దయచేసి చెప్పు. అంతేకాక నీచేత పేర్కొనబడిన యోగవిద్యనూ, అందలి విభాగాలనూ, అందులోగల తత్త్వార్థాలనూ సంపూర్ణంగా, సుస్పష్టంగా మందబుద్ధినైన నాకు తెలిసేలా వెల్లడించు” అనగా కపిలుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=876

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, April 25, 2019

కపిల దేవహూతి సంవాదం - 6


3-874-వ.
"మఱియుఁ, జిత్తం బహంకార మమకార రూపాభిమానజాతంబు లగు గామలోభాది కలుష వ్రాతంబులచేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు; నప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు నేకరూపంబు నై ప్రకృతి కంటెఁ బరుండును, బరమ పురుషుండును, నిర్భేదనుండును, స్వయంజ్యోతియు, సూక్ష్మస్వరూపుండును, నితరవస్త్వంతరా పరిచ్ఛిన్నుండును, నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబు నైన ప్రపంచంబును జ్ఞాన వైరాగ్య భక్తి యుక్తం బగు మనంబుచేఁ బొడగాంచి; యోగిజనులు పరతత్త్వసిద్ధికొఱకు నిఖిలాత్మకుం డైన నారాయణు నందు నియుజ్యమానం బయిన భక్తిభావంబువలన నుదయించిన మార్గంబునకు నితరమార్గంబులు సరి గావండ్రు; విద్వాంసులు సంగం బింద్రియా ర్థాద్యసద్విషయంబుగ నొనరింపబడి జీవునకు నశిధిలం బగు బంధంబునకుఁ గారణం బగు ననియు; నదియె సద్విషయం బైన నంతఃకరణ సంయమన హేతుభూతం బగుచు సాధుజనులకు ననర్గళ మోక్షద్వారం బగు ననియుఁ దెలియుదురు; సహనశీలురు సమస్త శరీరధారులకు సుహృత్తులును బరమశాంతులును గారుణికులును నై పరిత్యక్త కర్మఫల స్వభావులును విసృష్ట స్వజన బంధుజనులును నై మత్పదాశ్రయులును, మద్గుణధ్యానపారీణులును, మత్కథాప్రసంగ సంభరిత శ్రవణానందులును నగుచు మదీయ కథల నొడువుచు వినుచునుండు పరమ భాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రయంబు దపింప జాలదు; అట్టి సర్వసంగవివర్జితు లగు పరమభాగవతజనుల సంగం బపేక్షణీయంబు; అది సకలదోష నివారకం బగు; అట్టి సత్సంగంబున సర్వప్రాణి హృత్కర్ణరసాయనంబు లగు మదీయ కథా ప్రసంగంబులు గలుగు; మద్గుణాకర్ణనంబునం జేసి శ్రీఘ్రంబుగఁ గ్రమంబునం గైవల్య మార్గదంబు లగు శ్రద్ధాభక్తు లుదయించు; అదియునుం గాక యే పురుషుం డైననేమి మద్విరచిత జగత్కల్పనాది విహారచింతచే నుదయించిన భక్తింజేసి యింద్రియసుఖంబు వలనను దృష్ట శ్రుతంబు లైన యైహి కాముష్మికంబుల వలనను విముక్తుం డగుచుఁ జిత్తగ్రహణార్థంబు ఋజువు లైన యోగమార్గంబులచే సంయుక్తుం డగునట్టి యోగి ప్రకృతిగుణ సేవనంబుచేత వైరాగ్యగుణ విజృంభితం బైన జ్ఞానయోగంబుచేతను మదర్పిత భక్తియోగంబుచేతను బ్రత్యగాత్మకుండ నైన నన్ను నంతఃకరణ నియుక్తునిం గావించు" నని చెప్పిన విని దేవహూతి గపిలున కిట్లనియె.

భావము:
“ఇంకా నేను నాది అనే అహంకార మమకార రూపమైన అభిమానంవల్ల కామం, క్రోధం, లోభం మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వానికి లోనుగాకుండ వానినుండి విడివడినప్పుడు పరిశుద్ధ మవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు సుఖం, దుఃఖం అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మ ప్రకృతికంటె అతీతుడు, స్వయంప్రకాశుడు, సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మనూ, ఆ పరమాత్మ తేజస్సువల్ల నిస్తేజమైన ప్రపంచాన్నీ యోగివరేణ్యులు భక్తిజ్ఞానవైరాగ్యాలతో కూడిన చిత్తంతో దర్శించినవారై మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమ మైనదని, తక్కిన మార్గాలు దానికి సాటిరావని చాటిచెప్పారు. ఇంద్రియార్థాలైన శబ్దస్పర్శరూపరసగంధాలతో కలయిక అసద్విషయమై, దృఢమైన బంధానికి కారణం అవుతుంది. ఆ సంగమమే భగవంతుని సంబంధమై సద్విషయమైనపుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరిచిన మోక్షద్వారం అవుతుంది అని విద్వాంసుల అభిప్రాయం. సహన స్వభావం కలిగి, సమస్త జీవులకు ఆప్తబంధువులై, శాంతమూర్తులై, కరుణార్ద్రహృదయులై, కర్మఫలాలను పరిత్యజించి, తనవారు, బంధువులు అనే అభిమానం విడిచి, నన్ను చక్కగా ఆశ్రయించినవారై, నా గుణగణాలను ధ్యానిస్తూ, నా చరిత్రను వీనులవిందుగా ఆలకించి ఆనందిస్తూ, నా కథలే చెప్పుకొంటూ, నా కథలే వింటూ ఉండేవారు పరమ భాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యం మాత్రమే కోరదగినది. అదే సకల దోషాలను నివారిస్తుంది. అటువంటివారి స్నేహంవల్ల సర్వప్రాణుల హృదయాలలో చెవులలో సుధారసం చిందించే నా కథాప్రసంగాలు ప్రాప్తిస్తాయి. నా గుణాలను వినడంవల్ల సక్రమమైన మార్గంలో శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రద్ధాభక్తులు ఉద్భవిస్తాయి. ఎవడు నేను చేసిన ఈ విశ్వసృష్టినీ, నా లీలావిహారాలనూ తలపోస్తూ అందువల్ల ప్రభవించిన భక్తిచేత ఇంద్రియ సుఖాలకూ, కనిపించేవీ వినిపించేవీ అయిన ఇహలోక పరలోక సుఖాలకూ లోనుకాకుండా, మనోనిశ్చలత్వం కోసం చక్కని యోగమార్గాన్ని అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతిగుణాలను అనుసరించటం వల్లనూ, వైరాగ్యాన్ని పెంపొందించే జ్ఞానయోగం వల్లనూ, ఆత్మార్పణ రూపమైన భక్తియోగం వల్లనూ సాక్షాత్కరించిన ఆత్మస్వరూపం గల నన్ను తన హృదయాంతరంలో నిలుపుకొంటాడు” అని కపిలుడు చెప్పగా విని దేవహూతి అతనితో ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=874

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 5


3-873-తే.
అదియు నారాయణాసక్త మయ్యెనేని
మోక్షకారణ మగు" నని మునికులాబ్ధి
చంద్రుఁ డన నొప్పు కపిలుండు జననితోడ
నర్థి వినఁ జెప్పి మఱియు నిట్లనియెఁ బ్రీతి.

భావము:
ఆ చిత్తం శ్రీమన్నారాయణుని మీద సంసక్తమైనపుడు మోక్షానికి హేతువవుతుంది” అని మునికుల సాగరానికి చంద్రుని వంటివాడైన కపిలుడు తల్లికి కోరికతో వినిపించి, మళ్ళీ ఆప్యాయంగా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=873

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, April 24, 2019

కపిల దేవహూతి సంవాదం - 4


3-871-క.
విని మందస్మిత లలితా
ననకమలుం డగుచు నెమ్మనమునఁ బ్రమోదం
బనయంబు గడలుకొన నిజ
జననికి నిట్లనియెఁ బరమశాంతుం డగుచున్.
3-872-క.
"విను జీవుని చిత్తము దా
ఘన భవబంధాపవర్గకారణ మది యే
చినఁ ద్రిగుణాసక్తం బయి
నను సంసృతిబంధకారణం బగు మఱియున్.

భావము:
విని, మందహాస సుందర వదనారవిందుడై మనస్సులో సంతోషం అతిశయించగా పరమశాంతుడై కన్నతల్లితో ఇలా అన్నాడు. “విను. గాఢమైన సంసారబంధానికీ మోక్షానికీ జీవుని చిత్తమే కారణం. అది సత్త్వరజస్తమోగుణాలతో సమ్మేళనం పొందినప్పుడు సంసారబంధానికి హేతువవుతుంది. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=872

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 3:3-869-ఉ.
భూరి మదీయ మోహతమముం బెడఁబాప సమర్థు లన్యు లె
వ్వారలు నీవకాక నిరవద్య! నిరంజన! నిర్వికార! సం
సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి
స్తారక! సర్వలోకశుభదాయక! నిత్యవిభూతినాయకా!
3-870-చ.
నిను శరణంబు జొచ్చెద ననింద్యతపోనిధి! నన్నుఁ గావవే"
యని తను దేవహూతి వినయంబున సన్నుతిసేసి వేడఁగా
ననుపమసత్కృపాకలితుఁ డై కపిలుం డనురాగ మొప్ప స
జ్జన నిచయాపవర్గ ఫలసాధనమై తగు తల్లివాక్యమున్.

భావము:
లోపాలు లేనివాడవు, అసహాయ దర్శనం కలవాడవు, మనోవికారాలు లేనివాడవు, సంసారమనే తీగలకు కొడవలి వంటివాడవు, జ్ఞానులలో ఉత్తముడవు, అందరికి శరణు కోరదగినవాడవు, ధర్మమును విస్తరించేవాడవు, శాశ్వతమైన వైభవములకు అధినాయకుడవు అయిన ఓ కపిలా! నా అంతులేని వ్యామోహమనే చీకటిని దూరం చేయడానికి నీవు కాక ఇతరు లెవరున్నారు? ఓ మహాతపస్సంపన్నా! నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను కాపాడు” అని దేవహూతి వినయంగా ప్రార్థించగా కపిలుడు సాటిలేని మేటి దయతో సజ్జనులకు మోక్షాన్ని ఇవ్వడానికి తగిన సాధనమైన తల్లి మాటలను అనురాగ పూర్వకంగా...


http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=870

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, April 23, 2019

కపిల దేవహూతి సంవాదం - 2:3-867-క.
"అసదింద్రియ ఘర్షణమున
వసుమతి నిర్విణ్ణ నగుచు వనరెడి నా కీ
యసదృశమోహతమో విని
రసనం బనఘాత్మ! యే వెరవున ఘటించున్.
3-868-క.
పటు ఘననీరంధ్ర తమః
పటల పరీవృత జగత్ప్రపంచమునకు నె
క్కటి లోచనమై మహితో
త్కటరుచి వెలుగుదువు భానుకైవడి ననఘా!

భావము:
“ఓ పుణ్యాత్మా! అసత్యలైన ఇంద్రియాల సంఘర్షణం వల్ల ఖిన్నురాలినై విచారిస్తున్న నాకు ఈ సాటిలేని మోహాంధకారంలోనుంచి బయటపడే అవకాశం ఏ ఉపాయం వల్ల కలుగుతుంది? ఓ పుణ్యాత్మా! దట్టమైన కారుమేఘాల చీకట్లతో ఆవరింపబడిన ఈ మహాప్రపంచానికి నీవు ఒక్కడివే ఏకైక నేత్రమై సూర్యునివలె వెలుగుతూ ఉంటావు.


// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 1:3-866-వ.
పరబ్రహ్మంబుఁ జిత్తంబున నిల్పి యహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం జేసి సకల భూతంబు లందు సమత్వంబు భజియించి శాంతశేముషీ గరిష్ఠుం డగుచు నిస్తరంగం బగు వార్థి చందంబున ధీరుండై నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా దలంచుచు భక్తియోగంబున భాగవత గతిం బొందె" అని చెప్పి; వెండియు, మైత్రేయుండు విదురునిం గనుంగొని "కర్దముండు వనంబునకుం జనిన యనంతరంబ మాతృవత్సలుం డయిన కపిలుండు బిందుసరంబున వసియించి యుండ దేవహూతి తత్త్వమార్గ ప్రదర్శకుం డైన సుతునిం గనుంగొని బ్రహ్మవచనంబులు దలంచుచు నిట్లనియె.

భావము:
కర్దముడు పరబ్రహ్మను చిత్తంలో నిల్పుకొని, అహంకారాన్ని విడిచి, మమకారాన్ని వదలి, దయామయ హృదయంతో సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తూ, ప్రశాంత స్వభావం కలవాడై, అలలు లేని సముద్రం వలె ధీరుడై, సమస్త ప్రపంచాన్ని విష్ణుమయంగా భావిస్తూ, భక్తియోగంతో భాగవతులు పొందే పరమపదాన్ని అందుకున్నాడు - అని మైత్రేయుడు విదురునితో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “కర్దముడు అరణ్యానికి వెళ్ళిన తరువాత మాతృప్రేమ కలిగిన కపిలుడు బిందుసరోవరం దగ్గర నివసించి ఉండగా దేవహూతి తనకు తత్త్వమార్గాన్ని చూపగలిగే కుమారుని చూచి బ్రహ్మ చెప్పిన మాటలను తలచుకొంటూ ఇలా అన్నది.
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :