Wednesday, August 23, 2017

శ్రీ కృష్ణ జననం - 31

10.1-105-క.
పంకజముఖి నీ ళ్ళాడఁను
సంకటపడ ఖలులమానసంబుల నెల్లన్
సంకటము దోఁచె; మెల్లన
సంకటములు లేమి తోఁచె సత్పురుషులకున్.
10.1-106-సీ.
స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేడును; 
గలఘోషణముల మేఘంబు లుఱిమె; 
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె; 
దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ; 
గమ్మని చల్లని గాలి మెల్లన వీఁచె; 
హోమానలంబు చెన్నొంది వెలిఁగెఁ; 
గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ; 
బ్రవిమలతోయలై పాఱె నదులు;
10.1-106.1-తే.
వర పుర గ్రామ ఘోష యై వసుధ యొప్పె; 
విహగ రుత పుష్ప ఫలముల వెలసె వనము; 
లలరుసోనలు గురిసి ర య్యమరవరులు; 
దేవదేవుని దేవకీదేవి గనఁగ.
10.1-107-క.
పాడిరి గంధర్వోత్తము; 
లాడిరి రంభాది కాంత; లానందమునన్
గూడిరి సిద్ధులు; భయముల
వీడిరి చారణులు; మొరసె వేల్పుల భేరుల్.
10.1-108-వ.
అయ్యవసరంబున.

భావము:
పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనుటకు ప్ర,సవవేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి. దేవకీదేవి శ్రీకృష్ణభగవానుని ప్రసవిస్తున్నట్టి ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేసాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్ని దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళ లాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్టమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలుతో భూదేవి వెలిగి పోయింది. పక్షుల కిలకిలారావాలతో, పూలతో పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. శ్రేష్ఠులైన గంధర్వులు (నారద, చిత్రసేనాదులు) దివ్యగానాలు చేసారు; రంభ మొదలైన అప్సరసలు (ఏకత్రింశతి అప్సరసలు) నృత్యాలు చేసారు; సిద్దులు అనే దేవతలు ఆనందంతో గుంపులు గుంపులుగా చేరారు; చారణులు అనే దేవతలకు భయం తీరి ఆనందించారు; దేవతలు ఉత్సవంగా భేరీలు మోగించారు; అలాంటి సమయంలో:

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=11&padyam=106

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, August 20, 2017

శ్రీ కృష్ణ జననం - 30

10.1-101-క.
ముచ్చిరి యున్నది లోకము
నిచ్చలుఁ గంసాదిఖలులు నిర్దయు లేఁపన్; 
మచ్చికఁ గావఁగ వలయును
విచ్చేయుము తల్లికడుపు వెడలి ముకుందా!
10.1-102-వ.
అని మఱియు దేవకీదేవిం గనుంగొని యిట్లనిరి.
10.1-103-మత్త.
తల్లి! నీ యుదరంబులోనఁ బ్రధానబూరుషుఁ డున్నవాఁ
డెల్లి పుట్టెడిఁ; గంసుచే భయ మింత లేదు; నిజంబు; మా
కెల్లవారికి భద్రమయ్యెడు; నింక నీ కడు పెప్పుడుం
జల్లగావలె యాదవావళి సంతసంబునఁ బొంగఁగన్.
10.1-104-వ.
అని యి వ్విధంబున హరిం బొగడి దేవకీదేవిని దీవించి దేవత లీశాన బ్రహ్మల మున్నిడుకొని చని; రంత .

భావము:
ముకుందా! కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉంది. లోకాన్ని కాపాడడానికి తల్లి కడుపులోనుండి వెంటనే బయటకి రావయ్యా!” బ్రహ్మాదిదేవతలు అలా విష్ణువును ప్రార్ధించి దేవకిదేవిని చూసి ఇలా అన్నారు. “తల్లీ! దేవకీదేవీ! నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు. రేపు పుట్టబోతున్నాడు కంసుడి వలన ఏమాత్రం భయంలేదు. మామాట నమ్ము. ఈనాటి నుండి మాకందరికీ క్షేమం చేకూరుతుంది. యాదవులు అందరూ సంతోషంతో పొంగిపోతున్నారు. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి." ఇలా విష్ణుమూర్తిని స్తుతించి, దేవకీదేవిని దీవించి, దేవతలు అందరూ శివుడిని, బ్రహ్మదేవుడిని ముందు ఉంచుకొని బయలుదేరి వెళ్ళిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=10&padyam=103

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, August 19, 2017

శ్రీ కృష్ణ జననం - 29

10.1-98-క.
ధరణీభారము వాసెను
బురుషోత్తమ! యీశ! నీదు పుట్టువున; భవ
చ్చరణాంబుజముల ప్రాపున
ధరణియు నాకసముఁ గాంచెదము నీ కరుణన్.
10.1-99-ఉ.
పుట్టువు లేని నీ కభవ! పుట్టుట క్రీడయె కాక పుట్టుటే? 
యెట్టనుడున్ భవాదిదశ లెల్లను జీవులయం దవిద్య దాఁ
బుట్టుచు నుండుఁ గాని నినుఁ బుట్టినదింబలెఁ బొంతనుండియుం 
జుట్టఁగ లేని తత్క్రియలఁ జొక్కని యెక్కటి వౌదు వీశ్వరా!
10.1-100-ఉ.
గురు పాఠీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనృకే
సరివై, భిక్షుఁడవై, హయాననుఁడవై, క్ష్మాదేవతాభర్తవై, 
ధరణీనాథుడవై, దయాగుణగణోదారుండవై, లోకముల్
పరిరక్షించిన నీకు మ్రొక్కెద; మిలాభారంబు వారింపవే.

భావము:
పురుషోత్తమా! ఈశ్వరా! నీవు జన్మించడంవలన ఈ భూమి భారము తగ్గిపోతుంది. నీ పాదపద్మములు అండగా ఉండగా నీ దయవల్ల భూమి ఆకాశము ఎక్కడ ఉన్నాయో చూడగల్గుతాము. పుట్టుక ఎరుగని నారాయణా! నీకు పుట్టుట అంటూ వేరే లేదు. అటువంటి నీవు ఇలా పుట్టడం అనేది నీకు క్రీడ గాని పుట్టుక కాదు కదా. అది ఎలా అంటే జన్మ మరణం మొదలైన స్థితులన్ని మాయకారణంగా జీవులను ఆవరిస్తూ ఉంటాయి. కానీ, నిన్ను మాత్రం ఆ మాయాదేవి ప్రక్కన నిలబడి కూడా స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. కనుక ఆ మాయామయమైన క్రియలు వేటిలోనూ చిక్కకుండా ఏకైక మూర్తివిగా నిండిపోతావు. కనుకనే ఈ జగత్తులు సమస్తానికీ నీవు ఈశ్వరుడవు. మహా మత్స్యావతార మెత్తి, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, హయగ్రీవావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం మున్నగు అనే కావతారాలు యెత్తి దయాదాక్షిణ్యాది గుణాలతో, ఉదారుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే మేము నమస్కరిస్తున్నాము; ఈ భూమి భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=10&padyam=100

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, August 18, 2017

శ్రీ కృష్ణ జననం - 28

10.1-96-క.
నిను నాలుగాశ్రమంబుల
జనములు సేవింప నఖిల జగముల సత్త్వం
బును శుద్ధంబును శ్రేయం
బును నగు గాత్రంబు నీవు పొందుదువు హరీ!
10.1-97-సీ.
నలినాక్ష! సత్త్వగుణంబు నీ గాత్రంబు; 
గాదేని విజ్ఞానకలిత మగుచు
నజ్ఞానభేదకం బగు టెట్లు? గుణముల; 
యందును వెలుఁగ నీ వనుమతింపఁ
బడుదువు; సత్త్వరూపంబు సేవింపంగ; 
సాక్షాత్కరింతువు సాక్షి వగుచు
వాఙ్మనసముల కవ్వలిదైన మార్గంబు; 
గలుగు; నీ గుణజన్మకర్మరహిత
10.1-97.1-తే.
మైన రూపును బేరు నత్యనఘబుద్ధు
లెఱుగుదురు; నిన్నుఁ గొల్వ నూహించుకొనుచు
వినుచుఁ దలచుచుఁ బొగడుచు వెలయువాఁడు
భవము నొందఁడు నీ పాద భక్తుఁడగును.

భావము:
బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అనే నాలుగు ఆశ్రమాల ప్రజలూ నిన్ను సేవిస్తూ ఉంటారు. అన్ని లోకాలలోనూ సత్త్వమయమైనది, పరిశుద్ధమైనదీ, క్షేమము చేకూర్చేది అయిన దేహాన్ని నీవు పొందుతుంటావు. పద్మదళముల వంటి కన్నులుగల శ్రీమన్నారాయణా! సత్త్వగుణమే నీ శరీరంగా రూపుదిద్దుకుంది కాకపోతే విజ్ఞానంతో నిండి వుండి, నీ శరీరం అజ్ఞానాన్ని భేదించడం ఎలా సాధ్య? గుణములలో కూడా వెలుగుతూ ఉన్నవాడీగా నీవు పరిగణింపబడుతూ ఉన్నావు. అలాకాకుండా నీ సత్త్వరూపాన్నే సేవిస్తే సాక్షాత్కరిస్తావు అటువంటప్పుడు నీవు గుణములకు అంటక కేవలము సాక్షివిగా ఉంటావు. వాక్కుకు మనసుకు అతీతంగాఉంటుంది నీమార్గం గుణములకు కర్మలకు అతీతమైన నీరూపాన్ని పుణ్యాత్ములైన వివేకవంతులు గ్రహిస్తున్నారు. నిన్ను సేవిస్తూ భావనచేస్తూ వింటూ స్మరిస్తూ స్తోత్రం చేస్తూ జీవించేవాడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములనే అంటిపెట్టుకుని భక్తుడై ఉండిపోతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=10&padyam=97

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, August 17, 2017

శ్రీ కృష్ణ జననం - 27

10.1-93-ఆ.
మంచివారి కెల్ల మంగళ ప్రద లయ్యుఁ
గల్లరులకు మేలుగాని యట్టి
తనువు లెన్నియైనఁ దాల్చి లోకములకు
సేమ మెల్లప్రొద్దు జేయు దీవు.
10.1-94-క.
ఎఱిఁగినవారల మనుచును
గొఱమాలిన యెఱుక లెఱిఁగి కొందఱు నీ పే
రెఱిగియు దలఁపగ నొల్లరు
పఱతు రధోగతుల జాడఁ బద్మదళాక్షా!
10.1-95-క.
నీ వారై నీ దెసఁ దమ
భావంబులు నిలిపి ఘనులు భయవిరహితులై
యే విఘ్నంబులఁ జెందక
నీ వఱలెడి మేటిచోట నెగడుదు రీశా!

భావము:
నీవు నిత్యమూ ఎన్ని శరీరాలలో అయినా అవతరిస్తావు. అలా అసంఖ్యాకమైన అవతారాలు ధరిస్తూ లోకాలకు క్షేమం కలుగజేస్తూ ఉంటావు. ఆయా శరీరాలతో నీవు మంచివారికి అందరికి శుభములు చేకూరుస్తూ; దుష్టులకు శిక్షలు విధిస్తూ ఉంటావు. కొందరు జ్ఞానులము అనుకుంటూ దుష్టులై పనికిమాలిన తెలివి తేటలతో నీ నామసంకీర్తన చేయరు. నీ నామసంకీర్తనం నిజంగా జ్ఞానులైనవారిని రక్షిస్తుంది అని గ్రహించక, అలా ప్రవర్తించి అధోగతులైన వారిని చూసైనా నేర్చుకోరు. నిజంగా గొప్పవారైనవారు తమ సొంతం అంటూ ఏమీలేకుండా నీ వారుగా ఉంటారు. నీ యందే తమ భావాలను నిలిపి ఉంచడం వలన భయం అనేది వారికి ఉండదు. నీ యందు హృదయాలు నిలిపి ఉంచడం వలన విఘ్నాలేవీ వారిని చేరవు. నీవు ఎక్కడ ఉంటావో ఆదివ్యలోకంలోనే వారు నివసిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=10&padyam=94

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, August 15, 2017

శ్రీ కృష్ణ జననం - 26

10.1-90-వ.
అదియునుం గాక.
10.1-91-సీ.
ప్రకృతి యొక్కటి పాదు; ఫలములు సుఖదుఃఖ; 
ములు రెండు; గుణములు మూఁడు వేళ్ళు; 
తగు రసంబులు నాల్గు ధర్మార్థ ముఖరంబు; 
లెఱిగెడి విధములై దింద్రియంబు; 
లాఱు స్వభావంబు లా శోక మోహాదు; 
లూర్ములు; ధాతువులొక్క యేడు; 
పైపొరలెనిమిది ప్రంగలు; భూతంబు; 
లైదు బుద్ధియు మనోహంకృతులును;
10.1-91.1-తే.
రంధ్రములు తొమ్మిదియుఁ గోటరములు; ప్రాణ
పత్త్రదశకంబు; జీవేశ పక్షియుగముఁ
గలుగు సంసారవృక్షంబు గలుగఁ జేయఁ
గావ నడఁగింప రాజ వొక్కరుఁడ వీవ.
10.1-92-క.
నీదెసఁ దమచిత్తము లిడి
యే దెసలకుఁ బోక గడతు రెఱుక గలుగువా; 
రా దూడయడుగు క్రియ నీ
పాదం బను నావకతన భవసాగరమున్.

భావము:
అంతే కాకుండా...జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటుంది. 1) దానికి ప్రకృతి పాదు. 2) సుఖదుఃఖాలనేవి రెండూ ఫలాలు. 3) సత్త్వరజస్తమస్సు అనే గుణాలు మూడూ దానికి వేళ్ళు. 4) ధర్మమూ, అర్దమూ, కామమూ, మోక్షమూ అనే నాలుగు పురుషార్ధాలూ రసాలు. 5) దానికి శబ్దం, స్పర్శం, రూపం, రుచి, వాసన అనే ఐదూ ఇంద్రియాలు గ్రహించే విధానాలు. 6) కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే ఆరూ స్వభావాలూ 7) ఆరు ఊర్ములు ఆకలి, దప్పిక, శోకమూ, మోహమూ, ముసలితనమూ, మరణమూ అనేవి. 8) రసం, రక్తం, మాంసం, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్రము అనే ఏడు ధాతువులూ ఆ వృక్షానికి గల ఏడు పొరలు అయి ఉంటాయి. ఇంత తెలిసి తొట్రుపాటు పడడమెందుకు. 9) పంచభూతాలు, బుధ్ది, మనస్సు, అహంకారం అనే ఎనిమిది ఆ వృక్షానికి కొమ్మలు. 10) కన్నులు, చెవులు, ముక్కుపుటాలు, నోరు, మల మూత్రాద్వారాలు అనే తొమ్మిదీ ఆ వృక్షానికి గల తొమ్మిది రంధ్రాలు. 11) ప్రాణమూ, అపానమూ, వ్యానమూ, ఉదానమూ, సమానమూ అనే పంచప్రాణాలూ నాగమూ, కూర్మమూ, కృకరమూ, దేవదత్తము, ధనంజయం అనే ఐదు ఉపప్రాణాలు మొత్తం పది ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది ఆ సంసార వృక్షం. 13) జీవుడు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఆవృక్షంపై నివసిస్తుంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి రక్షించడానికీ మళ్లీ లయం చేయడానికీ ప్రభువా! నీవు ఒక్కడివే. పరమ జ్ఞానులు తమ మనస్సును ఏవైపునకూ పోనీయకుండా నీయందే నిలుపుతారు. అందువలన వారు నీపాదమనే తెప్ప ఆధారంతో భయంకరమైన సంసార మహాసముద్రాన్ని దాటతారు. అది కూడా ఆవుదూడ అడుగును దాటినంత తేలికగా దాటగలుగుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=10&padyam=91

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 25

10.1-88-వ.
అ య్యవసరంబున ననుచరసమేతులైన దేవతలును, నారదాది మునులునుం గూడ నడవ నలువయును, ముక్కంటియు నక్కడకు వచ్చి దేవకీదేవి గర్భంబున నర్భకుండై యున్న పురుషోత్తము నిట్లని స్తుతియించిరి.
10.1-89-సీ.
సత్యవ్రతుని నిత్యసంప్రాప్త సాధనుఁ; 
గాలత్రయమునందు గలుగువాని
భూతంబు లైదును బుట్టుచోటగు వాని; 
నైదుభూతంబులం దమరువాని
నైదుభూతంబులు నడఁగిన పిమ్మట; 
బరఁగువానిని సత్యభాషణంబు
సమదర్శనంబును జరిపెడువానిని; 
ని న్నాశ్రయింతుము; నీ యధీన
10.1-89.1-ఆ.
మాయచేత నెఱుకమాలిన వారలు
పెక్కుగతుల నిన్నుఁ బేరుకొందు; 
రెఱుగనేర్చు విబుధు లేకచిత్తంబున
నిఖిలమూర్తు లెల్ల నీవ యండ్రు.

భావము:
మధురలో పరిస్థితి ఇలా ఉండగా బ్రహ్మదేవుడు అనుచరులతోనూ కలసి కూడా వస్తున్న పరమేశ్వరుడితోనూ, దేవతలతోనూ, నారదాదిమునులతోనూ, దేవకీదేవి బంధింపబడి ఉన్న కారాగారం దగ్గరకు వచ్చాడు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముడైన విష్ణువును ఈవిధంగా స్తోత్రం చేసాడు. “మహానుభావా! నీవు సత్యమే వ్రతంగా కలవాడవు; నిత్యత్వం అనే యోగసిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారం; జరిగినది జరుగుతున్నది జరుగబోయేది అయిన కాలములలో నీవు ఉంటూ ఉంటావు; భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు భూతాలూ నీయందే జన్మిస్తున్నాయి; అ ఐదు భూతాలలోనూ నీవే నిండేఉన్నావు; పంచభూతాలూ ప్రళయంలో అణిగి పోయిన తర్వాత కూడా నీవు ఉంటూ ఉంటావు; సృష్టిలో ఉన్న సత్యమనేదే నీవాక్కు; అన్నిటిని సమానంగా చూడడం అనేది నీవే నిర్వహిస్తూంటావు; అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాము; మాయ అనేది నీ అధీనంలో ఉంటుంది; ఆమాయచేత జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవరించినవారు నీయందు భేదభావం వహించి ఉంటారు; కాని జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో అలోచించి ఈ విషయాలు అన్ని చెప్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=10&padyam=89

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, August 12, 2017

శ్రీ కృష్ణ జననం - 24

10.1-84-వ.
మఱియు వైరానుబంధంబున నన్యానుసంధానంబు మఱచి యతండు.
10.1-85-క.
తిరుగుచుఁ గుడుచుచుఁ ద్రావుచు
నరుగుచుఁ గూర్చుండి లేచు చనవరతంబున్
హరిఁ దలఁచితలఁచి జగ మా
హరిమయ మని చూచెఁ గంసుఁ డాఱని యలుకన్.
10.1-86-వ.
వెండియు.
10.1-87-సీ.
శ్రవణరంధ్రముల నే శబ్దంబు వినఁబడు; 
నది హరిరవ మని యాలకించు; 
నక్షిమార్గమున నెయ్యది చూడఁబడు నది; 
హరిమూర్తి గానోపు నంచుఁ జూచుఁ; 
దిరుగుచో దేహంబు తృణమైన సోఁకిన; 
హరికరాఘాతమో యనుచుఁ నులుకు; 
గంధంబు లేమైన ఘ్రాణంబు సోఁకిన; 
హరిమాలికాగంధ మనుచు నదరుఁ;
10.1-87.1-తే.
బలుకు లెవ్వియైనఁ బలుకుచో హరిపేరు
పలుకఁబడియె ననుచు బ్రమసి పలుకుఁ; 
దలఁపు లెట్టివైనఁ దలఁచి యా తలఁపులు
హరితలంపు లనుచు నలుఁగఁ దలఁచు.

భావము:
విష్ణువుతో సంభవించిన శత్రుత్వం కారణంగా, కంసుడు విష్ణువు తప్ప ఇతర విషయాలు సమస్తం మరచిపోయాడు. తిరుగుతున్నా, భోజనంచేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, లేచినా, కూర్చున్నా, ఎప్పుడూ విష్ణువునే స్మరించసాగాడు. క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా విష్ణుమయంగానే దర్శించసాగాడు. ఇంకా కంసుడి పరిస్థితి ఎలా ఉంది అంటే.... చెవులకు ఏ శబ్దం వినబడినా అది విష్ణువు మాటేనని వింటూ ఉన్నాడు. కనులకి ఏది కనిపించినా అది విష్ణుదేవుడి రూపమేనని చూస్తున్నాడు. శరీరానికి గడ్డిపరక తగిలినా విష్ణుని చేయి తగిలిందేమోనని ఉలుక్కిపడుతూ ఉన్నాడు. ముక్కుకు సోకినా అది విష్ణువు మెడలోని వనమాలిక వాసనేమోనని అదిరిపడుతున్నాడు. తాను ఏ మాట ఉచ్చరించినా విష్ణువు పేరు పలికానేమోనని భ్రమపడి విష్ణువు పేరే పలుకుతున్నాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణువును గురించిన ఆలోచనలేమోనని ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=87

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 23

10.1-80-ఉ.
ఏమి దలంచువాఁడ? నిఁక నెయ్యది కార్యము? నాఁడునాఁటికిం
గామిని చూలు పెంపెసఁగె; గర్భిణిఁ జెల్లెలి నాఁడు పేద నే
నేమని చంపువాడఁ? దగ వేలని చంపితినేని శ్రీయు ను
ద్దామయశంబు నాయువును ధర్మమునుం జెడిపోవ కుండునే?
10.1-81-క.
వావి యెఱుంగని క్రూరుని
జీవన్మృతుఁ డనుచు నిందఁ జేయుదు; రతడుం
బోవును నరకమునకు; దు
ర్భావముతో బ్రదుకు టొక్క బ్రదుకే తలఁపన్?
10.1-82-వ.
అని నిశ్చయించి క్రౌర్యంబు విడిచి, ధైర్యంబు నొంది, గాంభీర్యంబు వాటించి, శౌర్యంబు ప్రకటించికొనుచు, దిగ్గనం జెలియలిం జంపు నగ్గలిక యెగ్గని యుగ్గడించి మాని, మౌనియుం బోలెనూర కుండియు.

భావము:
ఇప్పుడు నేనేమి మంత్రాంగం ఆలోచించాలి? ఏమి తంత్రం చేయాలి? రోజురోజుకీ ఈమె గర్భం కాంతిమంతం అవుతూ ఉంది? ఇటు చూస్తే ఈమె ఆడకూతురు గర్భవతి చెల్లెలూ కదా ఎట్లా చంపేది? ఎందుకు వచ్చిన గొడవ అని చంపానంటే, నా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి, ధర్మం అన్నీ నాశనమైపోవా? “వావివరుసలు చూడని క్రూరుడు బ్రతికినా చచ్చినవాడే” అని నిందిస్తారు లోకులు అలాంటి వాడు నరకానికిపోతాడు. దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా?” ఇలా అని ఆలోచించి నిశ్చయించుకుని, క్రౌర్యం మాని, ధైర్యం తెచ్చుకొనిస గాంభీర్యం పైపైన పులుముకుని, శూరునిలా ప్రవర్తించాడు. “చెల్లెలిని చంపడం మహా పాపం” అని గట్టిగా భావించాడు. ఆతర్వాత ఏమీ మాట్లాడకుండా మౌనిలాగ శాంతస్వభావం ప్రకటిస్తూ ఉండిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=81

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, August 11, 2017

శ్రీ కృష్ణ జననం - 22

10.1-77-ఆ.
జ్ఞానఖలునిలోని శారదయును బోలె
ఘటములోని దీపకళిక బోలె 
భ్రాతయింట నాఁకఁ బడియుండె దేవకీ
కాంత విశ్వగర్భగర్భ యగుచు.
10.1-78-వ.
అంత న క్కాంతాతిలకంబు నెమ్మొగంబు తెలివియును, మేనిమెఱుంగును, మెలంగెడి సొబగునుం జూచి వెఱఁగుపడి తఱచు వెఱచుచుఁ గంసుండు తనలో నిట్లనియె.
10.1-79-క.
కన్నులకుఁ జూడ బరువై 
యున్నది యెలనాఁగగర్భ ముల్లము గలగన్
ము న్నెన్నఁడు నిట్లుండదు
వెన్నుఁడు చొరఁ బోలు గర్భవివరములోనన్.

భావము:
కుండ లోపల దీపకణికలాగ దేవకీదేవి అన్నగారి ఇంట్లో బంధించబడి ఉంది. అలా నిర్బంధంలో అణగిమణిగి ఉండిపొయింది. అంతకంతకూ అతిశయిస్తున్న ఆమె ముఖంలోని కాంతిని శరీరపు మెరుపునూ అందాన్ని చూసి కంసుడు నిశ్చేష్టుడు అవుతున్నాడు. అస్తమానూ భయపడుతూ తనలోతను ఇలా అనుకోసాగాడు. “ఈమె గర్భం చూస్తూ ఉంటే, నా గుండె బరువెక్కుతోంది. మనస్సు కలవరపడుతోంది. ఇంతకుముందు ఏ గర్భాన్ని చూసినా ఇలా అవ్వ లేదు. ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉండవచ్చు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=79

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 21

10.1-75-సీ.
అతివకాంచీగుణం బల్లన బిగియంగ; 
వైరివధూ గుణవ్రజము వదలె; 
మెల్లన తన్వంగి మెయిదీవ మెఱుఁగెక్క; 
దుష్టాంగనాతనుద్యుతు లడంగె; 
నాతి కల్లన భూషణములు పల్పలనగాఁ; 
బరసతీభూషణ పంక్తు లెడలె; 
గలకంఠి కొయ్యన గర్భంబు దొడ్డుగాఁ; 
బరిపంథిదారగర్భములు పగిలెఁ;
10.1-75.1-తే.
బొలఁతి కల్లన నీళ్ళాడు ప్రొద్దు లెదుగ
నహితవల్లభ లైదువలై తనర్చు 
ప్రొద్దు లన్నియుఁ గ్రమమున బోవఁ దొడగెఁ; 
నువిదకడుపున నసురారి యుంటఁజేసి.
10.1-76-వ.
ఇవ్విధంబున.

భావము:
దేవకీదేవి గర్బాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండడం చేత; ఆమెకు మొలనూలు నెమ్మదిగా బిగిసిపోతూ ఉంటే, శత్రువుల భార్యల మంగళ సూత్రాల త్రాళ్ళు జారిపోసాగాయి; తన శరీరకాంతి హెచ్చుతూ ఉండగా, పగవారి భార్యల శరీర కాంతులు మాసిపోసాగాయి; ఆమెకు ఆభరణాలు బరువు అనిపిస్తుండగా, శత్రుభార్యల కడుపులు జారిపోసాగాయి; ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్నకొద్దీ శత్రువుల భార్యలు ముత్తైదువలుగా ఉండే దినాలు తరిగిపోసాగాయి. ఈ విధంగా లోకాలన్నింటినీ కడుపులోదాచుకున్న విష్ణువును తన గర్భంలో ఇలా మోస్తూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=75

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, August 10, 2017

శ్రీ కృష్ణ జననం - 20

10.1-72-వ.
మఱియును.
10.1-73-సీ.
సలిల మా యెలనాఁగ జఠరార్భకునిఁ గానఁ; 
జనిన కైవడి ఘర్మసలిల మొప్పె; 
నొగిఁ దేజ మా యింతి యుదరడింభకు గొల్వఁ; 
గదిసిన క్రియ దేహకాంతి మెఱసెఁ; 
బవనుఁ డా కొమ్మ గర్భస్థుని సేవింప; 
నొలసెనా మిక్కిలి యూర్పు లమరెఁ; 
గుంభిని యా లేమ కుక్షిగు నర్చింపఁ; 
జొచ్చుభంగిని మంటి చొరవ దనరె;
10.1-73.1-ఆ.
గగన మిందువదనకడుపులో బాలు సే
వలకు రూపు మెఱసి వచ్చినట్లు
బయలువంటి నడుము బహుళ మయ్యెను; బంచ
భూతమయుఁడు లోనఁ బొదల సతికి.
10.1-74-వ.
తదనంతరంబ.

భావము:
ఇంకనూ... పంచభూతాత్మకుడు అయిన విష్ణుమూర్తి దేవకి గర్భంలో పెరుగుతూ ఉండటంతో. పంచభూతాలలో జలములు ఆ గర్భస్థ బాలుడిని చూడడానికి వెళ్ళాయా అన్నట్లు, ఆమెకు చెమటలు పోయడం మొదలెట్టాయి; అగ్ని ఆ కడుపులోని పాపడిని సేవించడానికి వచ్చినట్లు, ఆమె శరీరం కాంతితో మెరిసింది; ఆ గర్భస్తుడైన శిశువును వాయుదేవుడు సేవించబోయినట్లు, ఆమెకు నిట్టూర్పులు ఎక్కువ అయ్యాయి; భూమి ఆ కడుపులోని పిల్లాడిని పూజించడానికి వెళ్ళిందా అన్నట్లు, దేవకీదేవికి మన్నుపై ప్రీతి ఎక్కువైంది; గర్భంలో ఉన్న శిశువును సేవించడానికి అకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు, కనుపించని ఆమె నడుము విశాలమైంది.అటుపిమ్మట....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=73

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::