Friday, July 31, 2020

ఉషా పరిణయం - 60

( ఫలశృతి ) 

10.2-451-క.
శ్రీకృష్ణుని విజయం బగు
నీ కథఁ బఠియించువార లెప్పుడు జయముం
గైకొని యిహపరసౌఖ్యము
లాకల్పోన్నతి వహింతు రవనీనాథా!"
10.2-452-క.
అని చెప్పిన శుకయోగికి
జననాయకుఁ డనియెఁ గృష్ణచరితము విన నా
మన మెపుడుఁ దనియ దింకను
విన వలతుం గరుణఁ జెప్పవే మునినాథా!"

భావము:
ఓ పరీక్షన్మహారాజా! ఈ శ్రీకృష్ణ విజయగాథను పఠించినవారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి. ఇహ పర సౌఖ్యాలు శాశ్వతంగా లభిస్తాయి.” ఇలా పరీక్షిత్తుతో శుకయోగీంద్రుడు చెప్పాడు. పరీక్షిత్తు శుకుడితో “కృష్ణుని చరిత్ర వినడానికి మనస్సు ఇంకా ఉవ్విళ్ళూరుతున్నది. సంతృప్తి కలుగుట లేదు. దయచేసి, ఆ కథలను ఇంకా చెప్ప” మని ప్రార్థించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=451

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 59

( శివుడు కృష్ణుని స్తుతించుట ) 

10.2-449-మ.
కనియెన్ గోపకుమారశేఖరుఁడు రంగత్ఫుల్లరాజీవ కో
కనదోత్తుంగ తరంగసంగత లసత్కాసారకన్ భూరి శో
భన నిత్యోన్నత సౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్
జనసంతాపనివారకన్ సుజనభాస్వత్తారకన్ ద్వారకన్.
10.2-450-వ.
కని డాయంజనఁ బురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయై చేసన్నలం జీరు చందంబున నందంబునొందు నుద్ధూతతరళ విచిత్ర కేతుపతాకాభిశోభితంబును, మహనీయ మరకతతోరణ మండితంబును, గనకమణి వినిర్మితగోపురసౌధప్రాసాద వీథికావిలసితంబును, మౌక్తిక వితానవిరచిత మంగళ రంగవల్లీ విరాజితంబును, శోభనాకలితవిన్యస్త కదళికాస్తంభ సురభి కుసుమమాలి కాక్షతాలంకృతంబును, గుంకుమ సలిల సిక్త విపణిమార్గంబును, శంఖ దుందుభి భేరీ మృదంగ పటహ కాహళాది తూర్య మంగళారావ కలితంబును, వంది మాగధ సంగీత ప్రసంగంబును నై యతి మనోహర విభవాభిరామం బైన యప్పురవరంబు సచివ పురోహిత సుహృద్బాంధవ ముఖ్యు లెదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనా కరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు గర్పూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి యప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖం బుండె; నంత.

భావము:
గోపాలశేఖరుడైన శ్రీకృష్ణుడు వికసించిన కమలోత్పలాలతో, ఉత్తుంగ తరంగాలతో శోభిస్తున్న సరోవరాలతో నిండినదీ; అనునిత్యమూ సుఖవైభవాలకూ భోగభాగ్యాలకూ అలవాలమైనదీ; సుజనులకు కాపురమైనదీ అయిన ద్వారకను దర్శించాడు. ద్వారకానగరంలోని జండాలు శ్రీకృష్ణుడిని రా రమ్మని నగరలక్ష్మి పిలుస్తున్నట్లుగా ఉన్నాయి; మరకతాల తోరణాలతో మణులు పొదగిన బంగారు భవనాలతో నగరం విలసిల్లుతున్నది; పట్టణంలో ముత్యాల రంగవల్లులు తీర్చబడ్డాయి; అరటి స్తంభాలకు మంచి సువాసనల పుష్పమాలలు అలంకరించబడ్డాయి; ఆ పట్ణణ విపణిమార్గం కుంకుమ నీటితో తడుపబడింది; శంఖ, దుందుభి, భేరీ, మృదంగాది మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి; వందిమాగధుల సంగీత ప్రసంగాలు అతిశయించాయి; ఇంతటి వైభవంతో విలసిల్లుతున్న ద్వారకాపట్టణం లోనికి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు; పురోహిత, బంధుమిత్రులు స్వాగతం పలికారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; పుణ్యస్త్రీలు శుభ అక్షతలు జల్లారు; కామినీమణులు కర్పూర హారతులు ఇచ్చారు; గోవిందుడు తన మందిరంలో ప్రవేశించి ఆనందడోలికలలో తేలియాడుతూ సుఖంగా ఉండసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=450

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, July 29, 2020

ఉషా పరిణయం - 58


( శివుడు కృష్ణుని స్తుతించుట )

10.2-446-క.
పురమున కేగి యుషా సుం
దరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాం
బర దాసదాసికాజన
వరవస్తువితాన మొసఁగి వారని భక్తిన్.
10.2-447-క.
కనకరథంబున నిడుకొని
ఘనవైభవ మొప్పఁ గన్యకాయుక్తముగా
ననిరుద్ధుని గోవిందుం
డనుమోదింపంగ దెచ్చి యర్పించె నృపా!
10.2-448-ఉ.
అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య
త్యంతవిభూతిమై నిజబలావలితోఁ జనుదేర నా యుషా
కాంతుఁడు మున్నుగాఁ బటహ కాహళ తూర్య నినాద పూరితా
శాంతరుఁడై వెసం జనియె నాత్మ పురీముఖుఁడై ముదంబునన్.

భావము:
అటుపిమ్మట, బాణుడు తన నగరానికి వెళ్ళి ఉష అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాలను, దాసీజనులను, విలువైన వస్తువులను ఇచ్చాడు. ఓ పరీక్షిత్తు మహారాజా! బంగారురథం మీద ఉషా అనిరుద్ధులను ఎక్కించి, మిక్కిలి వైభవంతో తీసుకుని వచ్చి శ్రీకృష్ణుడు సంతోషించేలా అప్పగించాడు. ఆ తరువాత, మురాసురుని సంహరించిన కృష్ణుడు త్రిపురాసుర సంహారుడైన పరమ శివుని వద్ద సెలవు తీసుకుని, బాణాసురుడికి ఇక ఉండ మని చెప్పి. అత్యంత వైభవోపేతంగా పరివార సమేతుడై ఉషా అనిరుద్ధులను తీసుకుని పటహ, కాహాళ, తూర్యాదుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగుతుండగా ద్వారకానగరానికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=448

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 57


( శివుడు కృష్ణుని స్తుతించుట )

10.2-444-క.
కరములు నాలుగు సిక్కం
బరిమార్చితి, వీఁడు నీదు భక్తుల కగ్రే
సరుఁడై పొగడొంది జరా
మరణాది భయంబు దక్కి మను నిటమీఁదన్."
10.2-445-వ.
అని యానతిచ్చిన నంబికావరుండు సంతుష్టాంతరంగుం డయ్యె; నబ్బలినందనుం డట్లు రణరంగవేదిం గృష్ణదేవతాసన్నిధిం బ్రజ్వలిత చక్రకృశాను శిఖాజాలంబులందు నిజబాహా సహస్ర శాఖా సమిత్ప్రచయంబును, దత్‌క్షతోద్వేలకీలాల మహితాజ్యధారాశతంబును, బరభయంకర వీరహుంకార మంత్రంబులతోడ వేల్చి పరిశుద్ధిం బొంది విజ్ఞానదీపాంకురంబున భుజాఖర్వగర్వాంధకారంబు నివారించినవాఁడై యనవరతపూజితస్థాణుండగు నబ్బాణుండు, భుజవనవిచ్ఛేదజనితవిరూపితస్థాణుం డయ్యును దదీయవరదాన కలితానంద హృదయారవిందుం డగుచు గోవిందచరణారవిందంబులకుఁ బ్రణామంబు లాచరించి; యనంతరంబ.

భావము:
అందుచేతనే, ఇతనికి నాలుగు చేతులు మాత్రం ఉంచి, తక్కిన హస్తాలను ఖండించాను. ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేసురుడుగా స్తుతింపబడుతూ, జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు.” ఈ మాదిరి శ్రీకృష్ణుడు అనుగ్రహించడంతో పరమేశ్వరుడు ఎంతో ఆనందించాడు. బాణాసురుడు ఈ విధంగా రణరంగం అనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుడి సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను రక్తధారలనే ఆజ్య ధారలతో హూంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడు అయ్యాడు. విజ్ఞానదీపం ప్రకాశించడంతో భుజగర్వమనే అంధకారం తొలగింది. నిరంతర పరమేశ్వర ధ్యానానురక్తుడు అయిన బాణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనసు నిండా ఆనందించాడు. గోవిందుడి పాదపద్మాలకు నమస్కారాలు చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=445

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, July 26, 2020

ఉషా పరిణయం - 56


( శివుడు కృష్ణుని స్తుతించుట )

10.2-442-తే.
అవ్యయుండ; వనంతుండ; వచ్యుతుండ;
వాదిమధ్యాంతశూన్యుండ; వఖిలధృతివి
నిఖిలమం దెల్ల వర్తింతు నీవు దగిలి
నిఖిల మెల్లను నీ యంద నెగడుఁ గృష్ణ!"
10.2-443-సీ.
అని సన్నుతించిన హరి యాత్మ మోదించి$
  మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్త
లలితబాలేందుకళామౌళి కిట్లను$
  "శంకర! నీ మాట సత్య మరయ
నేది నీ కిష్టమై యెసఁగెడు దానిన;
వేఁడుము; నీకిత్తు వీఁ డవధ్యుఁ$
  డిది యెట్టి దనినఁ బ్రహ్లాదుండు మద్భక్తుఁ$
  డతనికి వరము నీ యన్వయమున
10.2-443.1-తే.
జనన మందిన వారలఁ జంప ననుచుఁ
గడఁక మన్నించితిని యది కారణమున
విశ్వవిశ్వంభరాభార విపులభూరి
బలభుజాగర్వ మడఁపంగ వలయుఁగాన.

భావము:
వాసుదేవా! నీవు అవ్యయుడవు; అనంతుడవు; అచ్యుతుడవు; ఆదిమధ్యాంత శూన్యుడవు; విశ్వంభరుడవు; నీవు జగత్తు సమస్తము నందు సంచరిస్తూ ఉంటావు; జగత్తు సమస్తమూ నీలో లీనమై ఉంటుంది.” ఇలా అని స్తుతించగా శ్రీకృష్ణుడు సంతోషించి చిరు నగవుల మోముతో ఇందురేఖాధరుడైన శివుడితో ఇలా అన్నాడు “ఓ శంకరా! నీవు సత్యము పలికావు. నీకు ఇష్టమైన కోరిక కోరుకో తీరుస్తాను. ఈ బాణాసురుడు అవధ్యుడు. ఎందుకంటే, నా భక్తుడైన ప్రహ్లాదుని వంశంవాడు. నీ వంశస్థులను సంహరించను అని ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చాను. అందువలన ఇతడు చంపదగినవాడు కాదు. అందువలన ఇతనిని క్షమించాను. కానీ సమస్త భూభారాన్ని మోస్తున్నాను అని అహంకరించే వీడి భుజగర్వాన్ని అణచివేయక తప్పదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=443

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 55

( శివుడు కృష్ణుని స్తుతించుట ) 

10.2-441-వ.
“దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు; నిఖిల వేద వేదాంత నిగూఢుండవు; నిర్మలుండవు; సమానాధిక రహితుండవు; సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలాకాశంబు పగిది నవలోకింతు; రదియునుంగాక పంచోపనిషన్మయం బయిన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునఁ జంద్రుఁడును, బాదంబుల వసుంధరయు, నాత్మ యందహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీ వ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు, నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబుకొఱకు నీ యకుంఠితతేజంబు గుప్తంబుసేసి జగదుద్భవంబుకొఱకుఁ గైకొన్న భవదీయ దివ్యావతారవైభవం బెఱింగి నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు; యద్వితీయుండవు; పురాణపురుషుండవు; సకల సృష్టి హేతుభూతుండవు; నీశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్ఛాయలం దోఁచు విధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన సంకల్పంబునఁ ద్రిగుణాతీతుండవయ్యును సత్త్వాదిగుణవ్యవధానంబుల ననేక రూపుండ వై గుణవంతులైన సత్పురుషులకుఁ దమోనివారకంబైన దీపంబు రూపంబునం బ్రకాశించుచుందువు; భవదీయమాయా విమోహితులయిన జీవులు పుత్త్ర దార గృహ క్షేత్రాది సంసారరూపకంబైన పాప పారావారమహావర్తగర్తంబుల మునుంగుచుందేలుచుందురు; దేవా! భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియ పరతంత్రుండై భవత్పాదసరసీరుహంబులఁ జేరనెఱుంగని మూఢాత్ముం డాత్మవంచకుండనంబడు; విపరీతబుద్ధిం జేసి ప్రియుండ వైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబుమాని హాలాహలంబుసేవించుట గాదె? జగదుదయపాలన లయలీలాహేతుండవై శాంతుండవయి సుహృజ్జన భాగధేయుండ వై సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణు లైన ముని గణంబులును భజియించుచుందుము; మఱియును.

భావము:
“దేవా! నీవు బ్రహ్మస్వరూపుడవు; జ్యోతిర్మయుడవు; సమస్త వేదవేదాంత నిగూఢుడవు; నిర్మలుడవు; నీతో సమానమైనవాడు అధికుడు మరొకడు లేడు; సర్వవ్యాపకుడవైన నిన్ను నిర్మల స్వభావులు ఆకాశంలాగ దర్శిస్తారు. నీవు పంచోపనిషన్మయంబైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని పరిగ్రహించు నపుడు; నాభి యందు ఆకాశాన్ని, ముఖంలో అగ్నినీ, శిరస్సున స్వర్గాన్నీ, చెవులలోదిక్కులనూ, నేత్రాలలో సూర్యుణ్ణి, మనస్సులో చంద్రుణ్ణి, పాదాలలో భూమినీ, ఆత్మలో అహంకారాన్నీ, కడుపులో సముద్రాలనూ, రేతస్సులో నీటినీ, భుజాలలో దేవేంద్రుణ్ణీ, వెంట్రుకలలో వృక్షౌషధీ విశేషాలనూ, శిరోజాలలో బ్రహ్మలనూ, జ్ఞానంలో సృష్టినీ ప్రజాపతులనూ, హృదయంలో ధర్మాన్నీ వహించిన మహా పురుషుడవు. అయితే లోకం కోసం నీ తేజాన్ని దాచి జగత్కల్యాణం నిమిత్తం అవతారం దాల్చావు. అటువంటి నీ దివ్యావతార వైభవాన్ని స్తుతించడం ఎవరికి సాధ్యం అవుతుంది. నీవు సమస్త సృష్టికి మూలకారకుడవు; అద్వితీయుడవు; పురాణపురుషుడవు; సూర్యుడు మేఘమాలచేత కప్పబడి భిన్నరూపాలతో కనిపించే విధంగా అఘటితఘటనాఘటన సమర్ధమైన సంకల్పంతో త్రిగుణాతీతుడవై కూడా అనేక రూపాలతో గోచరిస్తుంటావు; సత్పురుషులకు అంధకారం తొలగించే దీపంలా ప్రకాశిస్తుంటావు నీ మాయకు లోనైన జీవులు సంసారమనే సముద్రపు సుడిగుండంలో మునిగితేలుతూ ఉంటారు; నీ దివ్యరూపాన్ని దర్శించకుండా నీ పాదకమలపూజ చేయకుండా ఇంద్రియలోలుడై ఉండు మూఢుడు ఆత్మవంచకుడు అనబడతాడు; నిన్ను ధ్యానించకుండా విపరీతబుద్ధితో ఇంద్రియలోలుడు కావటం అమృతాన్ని వదలి హాలాహలం సేవించడం; సృష్టి స్థితి లయకారకుడవై శాంతుడవై, సజ్జన భాగధేయుడవై, అనుపమానుడవైన నిన్ను బ్రహ్మాదిదేవతలూ మహామునీంద్రులూ నేనూ భజిస్తూ ఉంటాము. అంతేకాదు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=441

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, July 25, 2020

ఉషా పరిణయం - 54


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-439-వ.
అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభావిడంబితంబును, భీషణ శతసహస్రకోటి దంభోళినిష్ఠురనిబిడనిశితధారాసహస్ర ప్రభూతజ్వలన జ్వాలికాపాస్త సమస్తకుటిల పరిపంథి దుర్వార బాహాఖర్వ గర్వాంధకారంబును, సకల దిక్పాల దేవతాగణ జేగీయమానంబును, సమదదానవజన శోకకారణ భయంకర దర్శనంబును, సమంచిత సజ్జనలోకప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనం బసురాంతక ప్రేరితంబై చని, యారామకారుండు కదళికా కాండంబుల నేర్చు చందంబునం బేర్చి సమద వేదండ శుండాదండంబుల విడంబించుచుఁ గనకమణివలయ కేయూర కంకణాలంకృతంబు నగు తదీయ బాహా సహస్రంబుఁ గరచతుష్ట యావశిష్టంబుగాఁ దునుము నవసరంబున.
10.2-440-తే.
కాలకంఠుఁడు బాణుపైఁ గరుణ గలఁడు
గాన నఖిలాండపతిఁ గృష్ణుఁ గదియవచ్చి
పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్జుఁ
డగుచుఁ బద్మాయతాక్షు నిట్లని స్తుతించె.

భావము:
సుదర్శనచక్రం ప్రచండ సూర్యమండలంలా శోభించేది; పదివేలకోట్ల వజ్రాయుధాల జ్వలన జ్వాలలతో శత్రువుల గర్వాంధకారాన్ని నివారించేది; సమస్త దేవతల స్తుతులను అందుకునేది; తన దర్శనంతో దానవులకు శోకం కలిగించేదీ; తన సంస్పర్శనంతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ. శ్రీ కృష్ణుడు అట్టి సుదర్శనాన్ని బాణాసురుడి మీద ప్రయోగించగా, అది రత్నఖచితా లైన ఆభరణాలతో శోభిస్తూ, మదగజతుండాలలాగ వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతులలో నాల్గింటిని మాత్రం వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిచెట్లను నరకివేసినట్లు నరికేసింది. పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో దయ. అందుచేత, ఆయన అతనిని రక్షించడం కోసం లోకనాయకు డైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, పురుషసూక్తం పఠించి, నమస్కరించి, పద్మాక్షుడిని ఇలా స్తుతించాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=439

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 53

( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు ) 

10.2-437-వ.
అంత.
10.2-438-చ.
నుత నవపుండరీకనయనుం డన నొప్పు మురారి రోష ఘూ
ర్ణిత మహితారుణాబ్జదళనేత్రుఁడు దా నటు పంచె దైత్యుపై
దితిసుత కాననప్రకరదీపితశుక్రము రక్షితాంచితా
శ్రితజన చక్రమున్ సతతసేవితశక్రము దివ్యచక్రమున్.

భావము:
అలా బాణాసురుడి అస్త్రాలు అన్నింటిని త్రుంచి వేసిన సమయంలో
శ్రీకృష్ణుడి తెల్లతామరరేకుల వలె ఉండే నేత్రాలు రోషం వలన ఎఱ్ఱతామరరేకులుగా మారిపోయాయి. శ్రీకృష్ణుడు అసురులు అనే అరణ్యాలను అగ్నివలె కాల్చివేసేదీ; ఆశ్రితజన రక్షణ గావించేదీ; దేవేంద్రాది దేవతలచే సేవింపబడేదీ అయిన సుదర్శనచక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=438

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, July 24, 2020

ఉషా పరిణయం - 52


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-435-క.
చని రణభూమిని మధ్యం
దిన మార్తాండప్రచండ దీప్తాకృతితోఁ
దనరుచుఁ బరిపంథిబలేం
ధనదవశిఖియైన కృష్ణుఁ దాఁకెం బెలుచన్.
10.2-436-ఉ.
తాఁకి భుజావిజృంభణము దర్పము నేర్పును నేర్పడంగ నొ
క్కూఁకున వేయిచేతుల మహోగ్రశరావళి పింజ పింజతోఁ
దాఁకఁగ నేసినన్ మురవిదారుఁడు తోడన తచ్ఛరావళి
న్నాఁక గొనాకఁ ద్రుంచె నిశితార్ధశశాంక శిలీముఖంబులన్.

భావము:
బాణాసురుడు అలా కదలి వచ్చి కదనరంగంలో మధ్యాహ్న మార్తాండుని వలె ప్రకాశిస్తూ శత్రు సేనలు అనే కట్టెలకు అగ్నిజ్వాలల వలె విరాజిల్లే శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బలిపుత్రుడు బాణుడు తన భుజబలం ద్యోతకము అవుతుండగా ముట్టడించి, ఒకే సారి వేయిచేతులతో శ్రీకృష్ణుడిపై వాడి పరమ భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. మురాంతకుడు కృష్ణుడు ఆ బాణవర్షాన్ని లెక్కచేయకుండా తన వాడియైన అర్ధచంద్ర బాణాలతో వాటిని అన్నింటిని త్రుంచి వేశాడ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=436

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 51


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-433-వ.
అని మఱియు నప్పుండరీకాక్షుండిట్లను “నెవ్వరేనియు నీ యుభయజ్వర వివాదంబును, నీవు మత్ప్రపత్తిం జొచ్చుటయునుఁ జిత్తంబులం దలంతు రట్టి పుణ్యాత్ములు శీతోష్ణజ్వరాది తాపంబులఁ బొర య” రని యానతిచ్చిన నమ్మహేశ్వరజ్వరంబు పరమానందభరిత హృదయంబై యారథాంగపాణికి సాష్టాంగదండప్రణామం బాచరించి నిజేచ్ఛం జనియె; నంత బాణాసురుండు నక్కడ.
10.2-434-సీ.
కమనీయ కింకిణీఘంటికా సాహస్ర$
  ఘణఘణధ్వనిచేత గగన మగల
నన్యజనాలోకనాభీలతరళోగ్ర$
  కాంచనధ్వజపతాకలు వెలుంగఁ
బృథునేమి ఘట్టనఁ బృథివి కంపింపంగ$
  వలనొప్పు పటుజవాశ్వములఁ బూన్చి
నట్టి యున్నతరథం బత్యుగ్రగతి నెక్కి$
  కరసహస్రమున భీకరతరాసి
10.2-434.1-తే.
శర శరాసనముఖ దివ్యసాధనములు
దనరఁ జలమును బలము నుత్కటము గాఁగ
హర్ష మిగురొత్తఁ గయ్యంపుటాయితమునఁ
బురము వెలువడె బలిపుత్త్రుఁ డురుజవమున.

భావము:
అని ఇంకా ఇలా అన్నాడు “ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్నీ; నీవు నన్ను శరణుకోరిన విధానాన్ని; మనస్సులో స్మరిస్తారో, అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు” అని అనగా మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి చక్రాయుధుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగనమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంతలో, అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్ళీ యుద్ధసన్నద్ధుడై బయలుదేరాడు.అసంఖ్యాకమైన చిరుగంటల ధ్వనితో ఆకాశం బ్రద్దలు అవుతుండగా, మిక్కిలి వేగవంతము లైన అశ్వాలను కూర్చిన ఒక ఉన్నత రథాన్ని అధిరోహించి అమితోత్సాహంతో బాణాసురుడు యుద్ధరంగానికి వచ్చాడు. ఆ రథం శత్రు భీకరంగా బంగారు జండాలతో ప్రకాశిస్తోంది. పెద్ద పెద్ద రథచక్రాల వేగానికి భూమి కంపించిపోతోంది. రథం అధిరోహించి ఉన్న అతని వేయి చేతులలో ధనుర్భాణాలూ భయంకరమైన ఖడ్గాది ఆయుధాలూ ప్రకాశిస్తున్నాయి. కసి, బలము, ఉత్సాహము అతిశయిస్తుండగా యుద్ధసన్నధుడై పట్టణములోనుండి రణరంగానికి మిక్కిలి వేగంగా వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=434

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, July 18, 2020

ఉషా పరిణయం - 50


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-431-సీ.
శాంతమై మహితతీక్ష్ణ సుదుస్సహంబై యు$
  దారమై వెలుగొందు తావకీన
భూరిభాస్వత్తేజమునఁ దాప మొందితిఁ$
  గడుఁ గృశించితి, నన్ను గరుణఁజూడు
మితరదేవోపాస్తిరతి మాని మీ పాద$
  కమలముల్‌ సేవించు విమలబుద్ధి
యెందాక మది దోఁప దందాఁకనే కదా$
  ప్రాణులు నిఖిలతాపములఁ బడుట?
10.2-431.1-తే.
యవిరళానన్యగతికుల నరసి ప్రోచు
బిరుదుగల నీకు ననుఁ గాచు టరుదె? దేవ!
ప్రవిమలాకార! సంసారభయవిదూర!
భక్తజనపోషపరితోష! పరమపురుష!"
10.2-432-చ.
అనినఁ బ్రసన్నుఁడై హరి యనంతుఁడు దైత్యవిభేది దాని కి
ట్లనియె "మదీయ సాధన మనన్యనివారణమౌట నీ మదిం
గని నను నార్తిఁ జొచ్చితివి గావున మజ్జ్వర తీవ్ర దాహ వే
దన నినుఁ బొంద దింకఁ బరితాపము దక్కుము నీ మనంబునన్."

భావము:
ఓ పరమపురుషా! భక్తజన ఆనందదాయకా! సంసార భయనివారకా! దివ్యాకారా! శాంతమూ, తీక్షణమూ, దుస్సహమూ, ఉదారమూ అయి వెలుగొందుతున్న నీ మహత్తర తేజస్సు వలన తాపం పొందాను, కృశించిపోయాను నన్ను రక్షించు. ఇతర దైవాలను సేవించడం మాని నీ పాదపద్మాలను సేవించాలనే బుద్ధి ఉదయించేటంతవరకే అన్ని తాపాలు. అనాథ రక్షకుడనే బిరుదుగల నీకు నన్ను రక్షించడం ఏమంత గొప్పవిషయం.” అని స్తుతించగా దానవాంతకు డైన కృష్ణుడు శివజ్వరంతో ఇలా అన్నాడు “నా పరాక్రమం అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు. కనుక, నా జ్వరం నిన్నుబాధింపదు నీ మనస్సులో పరితాపం మాను”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=431

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Friday, July 17, 2020

ఉషా పరిణయం - 49

( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు ) 

10.2-430-వ.
అదియునుం గాక లోకంబున దైవం బనేక ప్రకారంబులై యుండు; నది యెట్టిదనినం గళాకాష్ఠాముహూర్తంబులనంగల కాలంబును, సుకృత దుష్కృతానుభవ రూపంబు లైన జీవకర్మంబులును స్వభావంబును, సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును, సకలపదార్థ పరిజ్ఞాన కారణం బైన యంతఃకరణంబును, మహదహంకార శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవ నానల సలిల ధరాది పంచభూతంబు లాదిగాఁ గల ప్రకృతి వికారంబులును, నన్నింటి సంఘాతంబును, బీజాంకుర న్యాయంబునం గార్యకారణరూప ప్రవాహంబును నై, జగత్కారణ శంకితం బై యుండు; నది యంతయు భవదీయ మాయా విడంబనంబు గాని యున్నయది కాదు; తదీయ మాయానివర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గ గతులం గ్రూరాత్ముల హింసించుచుందువు; విశ్వ! విశ్వంభరాభార నివారణంబు సేయుటకుఁ గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు; గావున నిన్ను శరణంబు వేఁడెద.

భావము:
ఓ దేవా! లోకంలో భగవంతుడు అనేక రీతులలో గోచరిస్తాడు. ముహూర్తము మున్నగు రూపాలలో తెలియబడు కాలంగాను; సుకృతాలు దుష్కృతాల రూపంలోను జీవకర్మలుగాను, స్వభావాలుగాను; త్రిగుణాత్మకమైన ప్రకృతిగాను; సుఖదుఖాలకు ఆశ్రయం అయిన శరీరంగానూ; జీవకోటికి ఆధారమైన ప్రాణంగాను; పదార్థాల గురించిన జ్ఞానాన్ని అందించే అంతఃకరణంగాను; మహత్తుగాను, అహంకారంగాను, పంచతన్మాత్రలుగాను, వాటి కారణభూతములు ఐన పంచభూతాలుగానూ; వీటి అన్నింటి సంఘాతంగాను; బీజాంకుర న్యాయంతో కార్యకారణరూప మైన ప్రవాహమై; ఈ జగత్తుకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది. కానీ, ఇది అంతా నీ మాయయే తప్ప వాస్తవం కాదు. ఆ మాయను నివారించగలవాడ వైన నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోకనిర్మాణ చణులైన బ్రహ్మాదిదేవతలనూ, పుణ్యపురుషులనూ, దేవగణాలనూ రక్షిస్తూ హింసారూప మైన చెడుమార్గాన్ని అనుసరించే దుష్టాత్ములను శిక్షిస్తూ ఉంటావు. ఈ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్యావతారాల ప్రయోజనం అందువలన నిన్ను శరణు కోరుతున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=430

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 48


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-427-తే.
పాఱి యే దిక్కుఁ గానక ప్రాణభీతి
నెనసి యేడ్చుచు నా హృషీకేశు పాద
కంజములఁ బడి ననుఁ గావు కావు మనుచు
నిటలతట ఘటితాంజలిపుటయు నగుచు.
10.2-428-వ.
ఇట్లు వినుతించె.
10.2-429-సీ.
"అవ్యయు, ననఘు, ననంతశక్తిని, బరు$
  లయినట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర
వరుల కీశ్వరుఁ డైనవాని, సర్వాత్మకు$
  జ్ఞానస్వరూపు, సమానరహితు,
వరదుని, జగదుద్భవస్థితి సంహార$
  హేతుభూతుని, హృషీకేశు, నభవు,
బ్రహ్మచిహ్నంబులై పరఁగు సుజ్ఞాన శ$
  క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు, నీశు,
10.2-429.1-ఆ.
నజు, షడూర్మిరహితు, నిజయోగమాయా వి
మోహితాఖిలాత్ము, ముఖ్యచరితు,
మహితతేజు, నాదిమధ్యాంతహీనునిఁ,
జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ!

భావము:
శివజ్వరానికి ఎటూ పారిపోవడానికి దిక్కుతోచక దుఃఖిస్తూ, పంకజాక్షుడైన కృష్ణుడి పాదాలపైపడి, ప్రణామంచేసి, నుదుట చేతులు జోడించి రక్షించమని అంటూ శివజ్వరం ఈ విధముగా స్తుతించసాగింది. శివజ్వరం శ్రీకృష్ణుడిని ఇలా స్తోత్రం చేసింది.
“ఓ శ్రీకృష్ణా! నీవు అవ్యయుడవు; అనంతశక్తి యుక్తుడవు; బ్రహ్మాది దేవతలకు అధీశ్వరుడవు; సర్వాత్మకుడవు; అనుపమానుడవు; వరదుడవు; సృష్టిస్థితిలయ కారకుడవు; హృషీకేశవుడవు; అభవుడవు; పరబ్రహ్మ స్వరూపుడవు; యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు; మహనీయతేజుడవు; ఆదిమధ్యాంత రహితుడవు; చిన్మయాత్ముడవు. అట్టి నిన్ను ప్రార్ధిస్తున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=429

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Thursday, July 16, 2020

ఉషా పరిణయం - 47

( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు ) 

10.2-425-క.
శిరములు మూఁడును ఘన భీ
కరపదములు మూఁడుఁ గలిగి కనలి మహేశ
జ్వర మురు ఘోరాకృతితో
నరుదేరఁగఁ జూచి కృష్ణుఁ డల్లన నగుచున్.
10.2-426-చ.
పరువడి వైష్ణవజ్వరముఁ బంచిన నయ్యుభయజ్వరంబులున్
వెరవును లావుఁ జేవయును వీరము బీరము గల్గి ఘోర సం
గర మొనరింప నందు గరకంఠకృతజ్వర ముగ్రవైష్ణవ
జ్వరమున కోడి పాఱె ననివారణ వైష్ణవివెంట నంటఁగన్.

భావము:
మూడు శిరస్సులతో; మూడు పాదాలతో; తీవ్ర క్రోధంతో; శివజ్వరం భయంకర ఆకారంతో వచ్చింది. దానిని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, వైష్ణవజ్వరాన్ని ప్రయోగించాడు. ఆ శైవవైష్ణవ జ్వరాలు తమ తమ శక్తిసామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో వైష్ణవజ్వర తాకిడికి శివజ్వరం ఓడి పారిపోయింది. అప్పుడు దానిని వైష్ణవజ్వరం వెంబడించి తరమసాగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=426

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 46


( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-424-సీ.
అత్తఱిఁ గోటర యను బాణ జనయిత్రి;
సుతుఁ గాచు మతము సన్మతిఁ దలంచి
వీడి శిరోజముల్‌ వ్రేలంగ నిర్ముక్త;
పరిధానయై మురాసురవిభేది
యెదుర నిల్చినఁ జూడ మదిఁ జాల రోసి ప;
రాఙ్ముఖుఁడై యున్న ననువు వేచి
తల్లడించుచు బాణుఁడుల్లంబు గలగంగఁ;
దలచీర వీడ యాదవులు నవ్వ
10.2-424.1-తే.
నవ్యకాంచనమణిభూషణములు రాలఁ
బాదహతి నేలఁ గంపింపఁ బాఱి యాత్మ
పురము వడిఁజొచ్చె నప్పుడు భూతగణము
లాకులతతోడ నెక్కడే నరుగుటయును.

భావము:
బాణుడు అలా కృష్ణవిజృంభణకు ప్రతికృతి చేయలేకపోతున్న ఆ సమయంలో, బాణాసురుడి తల్లి అయిన కోటర, తన కుమారుడిని రక్షించుకో దలచి వీడినజుట్టుతో వివస్త్రయై శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. ఆమెను చూడడానికి అసహ్యించుకుని మాధవుడు ముఖము త్రిప్పుకున్నాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగ వీడిపోగా; భూషణాలు రాలిపోగా; యాదవులు పరిహసిస్తుండగా; తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=424

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, July 15, 2020

ఉషా పరిణయం - 45

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-422-తే.
ప్రళయ జీమూత సంఘాత భయద భూరి
భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య
మఖిలజనులు భయభ్రాంతులయి చలింపఁ
గడఁగి నిర్భిన్న రాక్షసీగర్భముగను.
10.2-423-వ.
అట్టి యవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు వడి చేయునదిలేక విన్ననయి యున్నయెడ.

భావము:
అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి. శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది, బాణాసురుడు ఏమీచేయలేక చిన్నబోయి ఉండగా.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=423

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 


ఉషా పరిణయం - 44


( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-419-చ.
శరకుముదంబు లుల్లసితచామర ఫేనము లాతపత్ర భా
సుర నవపుండరీకములు శోణితతోయము లస్థి సైకతో
త్కరము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల
స్ఫురణ రణాంగణం బమరెఁ బూరిత శోణనదంబు పోలికన్.
10.2-420-వ.
అట్టియెడ బాణుండు గట్టలుకం గృష్ణునిపైఁ దనరథంబుఁ బఱపించి, యఖర్వబాహాసహస్ర దుర్వారగర్వాటోప ప్రదీప్తుండై కదిసి.
10.2-421-మ.
ఒక యేనూఱు కరంబులన్ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త
క్కక యొక్కొక్కట సాయకద్వయము వీఁకంబూన్చు నాలోన నం
దకహస్తుండు తదుగ్రచాపచయ విధ్వంసంబు గావించి కొం
జక తత్సారథిఁ గూలనేసి రథముం జక్కాడి శౌర్యోద్ధతిన్.

భావము:
బాణాలు కలువపూలుగా; చామరాలు నురుగు తెట్టెలుగా; గొడుగులు తెల్లతామరలుగా; రక్తము నీరుగా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; భుజాలు సర్పాలుగా; కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది. అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో, శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బాణాసురుడు తన ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే, అంతలోనే, శ్రీకృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసాడు; సంకోచించకుండా సారథిని సంహరించాడు; బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=421

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Tuesday, July 14, 2020

ఉషా పరిణయం - 43

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-418-వ.
అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడి, విఱిగి పాఱినం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియుం బోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురిగొల్పి తానును ముంగలి యై నడచె; నప్పు డుభయసైన్యంబు లన్యోన్య జయకాంక్షం దలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీఁకం దాఁకినం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ గదల నడిచియుఁ, గుఠారంబులఁ బొడిచియు; సురియలం గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుఁ, జక్రంబులం ద్రుంచియు, ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియుఁ; గుంతంబుల గ్రుచ్చియుఁ, బంతంబు లిచ్చియుఁ; బరిఘంబుల నొంచియుఁ, బట్టిసంబులం ద్రుంచియు శరంబుల నేసియుఁ, గరవాలంబుల వ్రేసియు, సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియుఁ బెనఁగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును, నులిసిన మేనులును, నలిసిన జానువులును, నొగిలిన వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబు లయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన కర్ణంబులును, విచ్ఛిన్నంబులైన నయనంబులును, వెడలు రుధిరంబులును, బడలుపడు బలంబులును, గొండల వడువునంబడు మాంసఖండంబులును, వాచఱచు కొఱప్రాణంబులును, వ్రాలిన తేరులును,గూలిన కరులును, నొఱగిన గుఱ్ఱంబులును, దెరలిన కాలుబలంబులును గలిగి; పలలఖాదన కుతూహల జనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకలదిశావకాశం బయి సంగరాంగణంబు భీషణంబయ్యె; నయ్యవసరంబున.

భావము:
ఆ సమయంలో, బాణుడి సైన్యం దీనత్వంతో అనాథ యై, పారిపోసాగింది, అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలవలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకులయుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేసారు; కొందరు భయంతో పారిపోయారు; కొందరు ధైర్యంతో ఎదిరించారు; కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగిపోయాయి; ఎముకలు ముక్కలు అయ్యాయి; ప్రేగులు కుప్పలు పడ్డాయి; చెవులు తెగిపోయాయి; కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి; మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో పడ్డాయి; రథాలు కుప్పకూలాయి; గజాలు నేలవ్రాలాయి; గుఱ్ఱాలు కూలబడ్డాయి; కాల్బలం మట్టికరచింది; యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత, పిశాచ, బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈతీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=418

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 42

( శివ కృష్ణులకు యుద్ధమగుట )

10.2-416-ఉ.
పంబి రణక్షితిన్ శరవిపాటిత శాత్రవవీరుఁ డైన యా
సాంబుఁడు హేమపుంఖశిత సాయకజాలము లేర్చి భూరి కో
పంబున నేసినన్ బెదరి బాణతనూభవుఁ డోడి పాఱె శౌ
ర్యంబును బీరముం దగవు నాఱడివోవ బలంబు లార్వఁగన్.
10.2-417-మ.
వరబాహాబలశాలి యా హలి రణావష్టంభ సంరంభ వి
స్ఫురదుగ్రాశనితుల్యమైన ముసలంబుం బూన్చి వ్రేసెన్ బొరిం
బొరిఁ గుంభాండక కూపకర్ణులు శిరంబుల్‌ వ్రస్సి మేదంబు నె
త్తురుఁ గర్ణంబుల వాతనుం దొరఁగ సంధుల్‌ వ్రీలి వే చావఁగన్.

భావము:
శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా, బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళనచేస్తుండగా పలాయనం చిత్తగించాడు. పరాక్రమశాలియైన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేపట్టి, కుంభాండక కూపకర్ణులను ఎదురుకొన్నాడు. ఆ ఆయుధం దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకుని అసువులు వీడారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=417

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 


Monday, July 13, 2020

ఉషా పరిణయం - 41

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-413-క.
జృంభణశరపాతముచే
శంభుఁడు నిజతనువు పరవశం బయి సోలన్
జృంభితుఁడై ఘననిద్రా
రంభత వృషభేంద్రు మూఁపురముపై వ్రాలెన్.
10.2-414-వ.
ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణ పరంపరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు నివ్విధంబునఁ బీనుంగుపెంటలఁ గావించె; నంత.
10.2-415-చ.
ఱిమి మురాంతకాత్మజుఁ డుదాత్తబలంబున బాహులేయుపైఁ
కరిఁ దాఁకి తీవ్రశితకాండ పరంపరలేసి నొంపఁగా
నెఱఁకులు గాఁడిపైఁ దొరఁగు నెత్తుటఁ జొత్తిలి వైరు లార్వఁగాఁ
చె మయూరవాహనముఁ బైకొని తోలుచు నాజిభీతుఁడై.

భావము:
ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు. శూలపాణి స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు. ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కున్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతట, నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=415

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 


ఉషా పరిణయం - 40


( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-410-ఉ.
పాయని కిన్కతో హరుఁడు పాశుపతాస్త్రము నారిఁ బోసినన్;
దోయరుహాయతాక్షుఁడునుఁ దోడన లోకభయంకరోగ్ర నా
రాయణబాణరాజము రయంబున నేసి మరల్చె దానిఁ జ
క్రాయుధుఁ డిత్తెఱంగునఁ బురారి శరావలి రూపుమాపినన్.
10.2-411-క.
ఊహ కలంగియు విగతో
త్సాహుండగు హరునిమీఁద జలజాక్షుడు స
మ్మోహన శిలీముఖం బ
వ్యాహత జయశాలి యగుచు నడరించె నృపా!
10.2-412-వ.
అట్లేసిన.

భావము:
అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు. రాజా! అంతట పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగించడంతో.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=411

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, July 11, 2020

ఉషా పరిణయం - 39

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-407-మ.
అనలాక్షుండు త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా
వనజాతేక్షణు మీఁదఁ గ్రోధమహిమవ్యాకీర్ణుఁ డై యేసె; నే
సినఁ దద్దివ్యశరంబుచేతనె మఱల్చెం గృష్ణుఁ డత్యుద్ధతిన్
జనితాశ్చర్య రసాబ్ధిమగ్ను లగుచున్ శక్రాదు లగ్గింపఁగన్.
10.2-408-శా.
వాయవ్యాస్త్ర ముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతిన్నేయ దై
తేయధ్వంసియుఁ బార్వతాశుగముచేఁ ద్రెంచెం; గ్రతుధ్వంసి యా
గ్నేయాస్త్రం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై; దాని వే
మాయం జేసెను నైంద్రబాణమునఁ బద్మాక్షుండు లీలాగతిన్.
10.2-409-వ.
మఱియును.

భావము:
నుదట అగ్నిని కురిపించే కనులు గల ఆ పరమశివుడు, పరిస్థితిని గమనించి, త్రిలోకపూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. ఇది చూసిన దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు. అంతట ఉమాపతి ఉపేంద్రుడిమీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అసురారి ఆ అస్త్రాన్ని పర్వతాస్త్రంతో నివారించాడు. ఉగ్రుడు మహోగ్రుడై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా, కృష్ణుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=408

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 38


( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-405-చ.
జలరుహనాభుఁ డార్చి నిజ శార్‌ఙ్గ శరాసన ముక్త సాయకా
వలి నిగుడించి నొంచెఁ బురవైరి పురోగములన్ రణక్రియా
కలితుల గుహ్యకప్రమథ కర్బుర భూతపిశాచ డాకినీ
బలవ దరాతియోధులను బ్రమ్మెరపోయి కలంగి పాఱఁగన్.
10.2-406-వ.
ఇట్లేసి యార్చిన కుంభినీధరు భూజావిజృంభణ సంరంభంబునకు సహింపక, నిటలాంబకుం డనలకణంబు లుమియు నిశితాంబకంబులం బీతాంబరునినేసిన, వానినన్నింటి నడుమన ప్రతిబాణంబు లేసి చూర్ణంబు సేసినం గనుంగొని మఱియును.

భావము:
శ్రీకృష్ణుడు సింహనాదంచేసి శార్జ్గమనే తన ధనస్సును ఎక్కుపెట్టి, బాణవర్షాన్ని కురిపించి, యుద్ధవిశారదు లైన ప్రమథగణాలనూ, భూత, పిశాచ, ఢాకినీ వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేసాడు. ఇలా బాణప్రయోగం చేసి విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక, పరమేశ్వరుడు నిప్పులు క్రక్కే శరపరంపరలను పీతాంబరుడైన కృష్ణుడిమీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటిని, మధ్యలోనే శ్రీకృష్ణుడు చూర్ణం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=406

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, July 9, 2020

ఉషా పరిణయం - 37

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-404-వ.
ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబులతోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె; నప్పుడ ప్పురాతన యోధుల యా యోధనంబుఁ జూచు వేడ్కం జనుదెంచిన, సరసిజసంభవ శక్ర సుర యక్ష సిద్ధ సాధ్య చారణ గంధర్వ కిన్నర కింపురుష గరుడోర గాదులు నిజ విమానారూఢులై వియత్తలంబున నిలిచి; రట్టియెడం గృష్ణుండును హరుండును, మారుండును గుమారుండును, గూపకర్ణ కుంభాండులును, గామపాలుండును బాణుపుత్త్రుండగు బలుండును, సాంబుండును; సాత్యకియును బాణుండును, రథికులు రథికులును, నాశ్వికులు నాశ్వికులును, గజారోహకులు గజారోహకులును, బదాతులు పదాతులునుం దలపడి యితరేతర హేతిసం ఘట్టనంబుల మిణుఁగుఱులు సెదరం బరస్పరాహ్వాన బిరుదాం కిత సింహనాద హుంకార శింజినీటంకార వారణ ఘీంకార వాజి హేషారవంబులను, బటహ కాహళ భేరీ మృదంగ శంఖ తూర్య ఘోషంబులను బ్రహ్మాండకోటరంబు పరిస్ఫోటితంబయ్యె; నయ్యవసరంబున.

భావము:
పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాలవారికీ ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులూ; కుమార ప్రద్యుమ్నులూ; కూపకర్ణ కుంభాండులూ; బలరాముడూ సాంబుడూ; బాణనందనుడు బలుడూ బాణసాత్యకులూ; ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ; అశ్వికులు అశ్వికులతోనూ; గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి; సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, పటహము భేరి కాహళము మృదంగము శంఖమూ మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లి పోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=404

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 36


( శివ కృష్ణులకు యుద్ధమగుట )

10.2-402-చ.
వరదుఁ డుదార భక్తజనవత్సలుఁడైన హరుండు బాణునిం
గర మనురక్తి నాత్మజులకంటె దయామతిఁ జూచుఁ గానఁ దా
దురమొనరించువేడ్క బ్రమథుల్‌ గుహుఁడున్ నిజభూతకోటియున్
సరస భజింప నుజ్జ్వల నిశాతభయంకరశూలహస్తుఁ డై.
10.2-403-సీ.
ఖరపుటాహతి రేఁగు ధరణీపరాగంబు;
పంకేరుహాప్తబింబంబుఁ బొదువ
విపులవాలాటోప విక్షేపజాత వా;
తాహతి వారివాహములు విరయఁ
గుఱుచ తిన్నని వాఁడికొమ్ములఁ జిమ్మిన;
బ్రహ్మాండభాండ కర్పరము వగుల
నలవోక ఖణి ఖణిల్లని ఱంకె వైచిన;
రోదసీకుహరంబు భేదిలంగ
10.2-403.1-తే.
గళ చలద్భర్మఘంటికా ఘణఘణప్ర
ఘోషమున దిక్తటంబు లాకులత నొంద
లీల నడతెంచు కలధౌతశైల మనఁగ
నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె.

భావము:
వరదుడు, ఉదారుడు, భక్తజనవత్సలుడు అయిన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్నకొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు. కనుక, బాణుని పక్షాన యుద్ధం చేయాడానికి ప్రమథులు, గుహుడూ, తన అనుచర భూతకోటి వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు. అలా విలాసంగా కదలివస్తున్న కైలాసపర్వతంలాగ మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి పైకిలేచిన దుమ్ము సూర్యబింబాన్ని క్రమ్మివేసింది; తోక కదలిక వలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదరిపోయాయి; వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండభాండం బ్రద్దలయింది; ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసీకుహరం దద్దరిల్లింది; మెడలోని గంటల గణగణ ధ్వనులకు సర్వదిక్కులూ పెటపెటలాడాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=403

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, July 3, 2020

ఉషా పరిణయం - 35


( బాణాసురునితో యుద్ధంబు )

10.2-400-సీ.
ఆ చక్రవాళాచలాచక్ర మంతయు;
బలసి కుమ్మరిసారె పగిదిఁ దిరిగె
ఘన ఘోణి ఖుర కోటిఘట్టిత నదముల;
కరణి నంభోనిధుల్‌ గలఁగి పొరలెఁ
గాలరుద్రాభీల కర శూలహతి రాలు;
పిడుగుల గతి రాలె నుడుగణంబు
చటులానిలోద్ధూత శాల్మలీతూలంబు;
చాడ్పున మేఘముల్‌ చదలఁ దూలె
10.2-400.1-తే.
గిరులు వడఁకాడె దివి పెల్లగిల్లె సురల
గుండె లవిసె రసాతలక్షోభ మొదవె
దిక్కు లదరె విమానముల్‌ తెరలి చెదరెఁ
గలఁగి గ్రహరాజ చంద్రుల గతులు దప్పె.
10.2-401-వ.
అట్టి సమర సన్నాహంబునకుఁ గట్టాయితంబై, మణిఖచితభర్మ వర్మ నిర్మలాంశు జాలంబులును, శిరస్త్రాణ కిరీట కోటిఘటిత వినూత్న రత్నప్రభాపటలంబులును, గనకకుండల గ్రైవేయ హార కంకణ తులాకోటి వివిధభూషణవ్రాత రుచి నిచయంబులును, బ్రచండబాహుదండ సహస్రంబున వెలుంగుచు శర శరాసన శక్తి ప్రాస తోమర గదా కుంత ముసల ముద్గర భిందిపాల కరవాల పట్టిస శూల క్షురికా పరశు పరిఘాది నిశాత హేతివ్రాత దీధితులును, వియచ్చరకోటి నేత్రంబులకు మిఱుమిట్లు గొలుపం గనకాచలశృంగ సముత్తుంగం బగు రథంబెక్కి యరాతివాహినీ సందోహంబునకుం దుల్యంబైన నిజసేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం డక్షీణప్రతాపంబు దీపింప ననికివెడలె; నయ్యవసరంబున.

భావము:
ఈ యుద్ధ సన్నాహానికి ధరణీచక్రమంతా కుమ్మరిసారెలాగా తిరిగింది; ఆదివరాహపు గిట్టల తాకిడి తగిలిన నదులవలె సముద్రాలు కలగిపోయాయి; కాలరుద్రుడి శూలపు దెబ్బలకు రాలిన పిడుగుల వలె చుక్కలు విచ్ఛిన్నమై నేలరాలాయి; భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది పింజలవలె మేఘాలు చెదిరి పోయాయి; పర్వతాలు వణికిపోయాయి; ఆకాశం పెల్లగిల్లింది; దేవతల గుండెలు అవిసిపోయాయి; పాతాళం క్షోభించింది; దిక్కులు సంచలించాయి; విమానాలు చెల్లాచెదరయ్యాయి; సూర్యచంద్రులు గతి తప్పారు. అంతటి భీకరంగా యుద్ధానికి సిద్ధపడిన బాణాసురుడు మేరుపర్వత శిఖరంవలె ఉన్నతమైన రథాన్ని అధిరోహించాడు; మణులు పొదిగిన బంగారు కవచాన్ని ధరించాడు; రత్నకాంతులతో అతని కిరీటం శోభించింది; కుండలాలు, హారాలు, కంకణాలు మొదలైన బంగారు ఆభరణాల కాంతులు అంతటా వ్యాపించాయి; బాణ, కుంత, తోమర, ముసల, గదా, కరవాలం మున్నగు అనేక ఆయుధాలతో అతని వేయి చేతులు వెలిగిపోతూ దేవతల నేత్రాలకు మిరుమిట్లు గొల్పాయి; ఈవిధంగా ఆ రాక్షసేంద్రుడు శత్రుసైన్యంతో సమానమైన సైన్యం ఇరుదిక్కులా నడవగా అమిత పరాక్రమంతో రణరంగానికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=400

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 34

( బాణాసురునితో యుద్ధంబు )

10.2-398-మ.
సరిదారామ సరోవరోపవన యజ్ఞస్థానముల్‌ మాపి వే
పరిఖల్‌ పూడిచి యంత్రముల్‌ దునిమి వప్రవ్రాతముల్‌ ద్రొబ్బి గో
పురముల్‌ గూలఁగఁ ద్రోచి సౌధ భవనంబుల్‌ నూకి ప్రాకారముల్‌
ధరణిం గూల్చి కవాటముల్‌ విఱిచి రుద్దండక్రియాలోలురై.
10.2-399-వ.
ఇట్లనేక ప్రకారంబులు గాసిచేసి, పురంబు నిరోధించి పేర్చి యార్చినంజూచి యాగ్రహసమగ్రోగ్రమూర్తియై బాణుండు సమరసన్నాహసంరంభ విజృంభమాణుండై సంగరభేరి వ్రేయించిన.

భావము:
యాదవవీరులు అత్యుత్సాహంగా శోణపురంలోని నదులను, సరోవరాలను, ఉద్యానవనాలను, యజ్ఞవాటికలను చిందరవందర చేశారు; అగడ్తలను పూడ్చివేశారు; యంత్రాలను చెడగొట్టారు; కోటలను పడగొట్టారు; గోపురాలను కూలద్రోశారు; సౌధాలను, ప్రాకారాలను నేలకూల్చారు; కవచాలు విరగగొట్టారు. ఈ ప్రకారంగా యాదవవీరులు శోణపురాన్ని చుట్టుముట్టి రకరకాలుగా వేధిస్తూ విజృంభించారు. అది చూసిన బాణుడు మిక్కిలి ఆగ్రహంతో సమర సన్నాహంచేసి విజృంభించి యుద్ధభేరి వేయించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=399

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :