8-266-సీ.
పాలమున్నీటి లోపలి మీఁది మీఁగడ;
మిసిమి జిడ్డునఁ జేసి మేను పడసి
క్రొక్కారు మెఱుఁగుల కొనల క్రొత్తళుకుల;
మేనిచే గలనిగ్గు మెఱుఁగు జేసి
నాఁటి నాఁటికిఁ బ్రోది నవకంపుఁదీవల;
నునుఁ బోద నెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారు కెందమ్మి కొలఁకునఁ బ్రొద్దునఁ;
బొలసిన వలపులఁ బ్రోది పెట్టి
8-266.1-తే.
పసిడి చంపక దామంబు బాగుఁగూర్చి
వాలు క్రొన్నెల చెలువున వాడిఁ దీర్చి
జాణతనమునఁ జేతుల జడ్డు విడిచి
నలువ యీ కొమ్మ నొగిఁ జేసినాఁడు నేఁడు.
టీకా:
పాలమున్నీటి =
సముద్రపు; లోపలి = అందలి;
మీది = పైన యుండెడి; మీగడ = మీగడ, మస్తువు;
మిసిమి =
మిసమిసలాడెడి;
జిడ్డునన్ = మెరుగు;
చేసి = వలన;
మేనున్ = దేహమును;
పడసి = పొంది;
క్రొక్కారు = వర్షాకాలపు;
మెఱుగుల = మెరుపులయొక్క;
కొనలన్ = కొసలయొక్క;
కొత్తళుకుల = సరికొత్తతళుకుల;
మేనిచేగల = కాంతులు తేగల;
నిగ్గు = అతియించెడి;
మెఱుగుచేసి = మెరుగుపెట్టి;
నాటినాటికి = అంతకంతకు;
ప్రోదిన్ = పోగుపడెడి;
నవకంపు = సరికొత్త;
తీవల = తీగలయొక్క;
నును = లేత;
బోదన్ = కాండములచే;
నెయ్యంబున్ = స్నేహమును;
నూలుకొలిపి = కుదిర్చి;
క్రొవ్వారు = అరవిరసిన;
కెందమ్మి = ఎర్రతామరల;
కొలకునన్ = కొలను యందు;
ప్రొద్దున = ఉదయమే;
పొలసిన =
వ్యాపించిన;
వలపులన్ = సువాసనలను;
ప్రోదిపెట్టి = పోగుచేసి.
పసిడి = బంగారు;
చంపక = సంపెంగల;
దామంబున్ = దండలను;
బాగుగా = చక్కగా;
కూర్చి = కట్టి;
వాలు =
క్రిందికి దిగుచున్న;
క్రొన్నెల = వెన్నెల;
చెలువనన్ = సొగసుతో;
వాడిదీర్చి =
పదునుపెట్టి;
జాణతనమునన్ = నేర్పుతో;
చేతుల = చేతులయొక్క;
జడ్డు = జడత్వమును;
విడిచి = విడిచిపెట్టి;
నలువ = బ్రహ్మదేవుడు;
ఈ = ఈ; కొమ్మన్ = అందగత్తెను;
ఒగిన్ = చక్కగా;
చేసినాడు = చేసెను;
నేడు = ఇప్పుడు.
భావము:
బ్రహ్మదేవుడు పాలసముద్ర జలాలపైన తేలే మీగడ మిసమిసలు నేర్పుగా తీర్చి దిద్ది
ఆమె దేహాన్ని నిర్మించాడు; ఆపైన తొలకరి కాలపు మెరుపుల అంచులలోని సరిక్రొత్త
కాంతిరేఖలతో మెరుగు పెట్టాడు; ఆపైన కోమలమైన తీగల నున్నని చెలువంతో ప్రతిదినం
చెలిమి చేయించాడు; ఎర్రతామరల కొలనులో వేకువజామున వెదజల్లే సువాసనలు
ప్రోదిచేసి; బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి; బాలచంద్రుని సొగసుతో
పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లు లక్ష్మీదేవి ఒప్పారింది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment