Sunday, January 20, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 97

10.1-608-సీ.
వేదాంత వీధుల విహరించు విన్నాణి; 
విహరించుఁ గాంతారవీధులందు; 
ఫణిరాజశయ్యపైఁ బవళించు సుఖభోగి; 
వల్లవ శయ్యలఁ బవ్వళించు; 
గురుయోగి మానసగుహలఁ గ్రుమ్మరు మేటి; 
గ్రుమ్మరు నద్రీంద్ర గుహలలోనఁ; 
గమలతోడఁ బెనంగి కడు డయ్యు చతురుఁ డా; 
భీరజనులతోడఁ బెనఁగి డయ్యు;
10.1-608.1-ఆ.
నఖిల లోకములకు నాశ్రయుండగు ధీరుఁ
డలసి తరులనీడ నాశ్రయించు
యాగభాగచయము లాహరించు మహాత్ముఁ
డడవిలోని ఫలము లాహరించు

భావము:
వేదాంత వీధులలో విహరించే విన్నాణి, ఈ నాడు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. మృదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమ భోగి, ఇప్పుడు చిగురాకు ప్రక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్ప యోగుల అంతరంగాల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు, ఇక్కడ కొండగుహలలో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఇవాళ గోపబాలురతో ఆడిపాడి అలసిపోతున్నాడు. సర్వ లోకాలకూ ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు, ఈ రోజు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నాడు. మహామునీంద్రుల యజ్ఞాల లోని హవిర్భాగాలను భుజించే భగవంతుడు, అడవిలో కాయలు పండ్లు తింటున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=608

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 96

10.1-605-క.
కాంతార విహారమ్ముల 
శ్రాంతుండై గోపకాంకశయుఁడగు నన్నన్
సంతుష్టిఁ బొందఁజేయు ని
రంతర కరచరణ మర్శనాదుల నధిపా!
10.1-606-క.
పాడుచు నాడుచు ముచ్చట
లాడుచు నొండొరులఁ దాఁకు నాప్తులఁ గని బి
ట్టాడుచుఁ జేతులు వ్రేయుచుఁ 
గ్రీడింతురు నగుచు బలుఁడుఁ గృష్ణుఁడు నొకచోన్.
10.1-607-వ.
ఇవ్విధంబున.

భావము::
ఓ రాజా! పరీక్షిత్తు! బలరాముడు అడవిలో తిరిగి తిరిగి ఒక్కక్క సారి అలసిపోయి ఆ గొల్లబాలుర తొడల మీద తల పెట్టుకుని విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరి ఆయన కాళ్ళు, చేతులు ఒత్తి అలసట పోగొట్టి సంతృష్టి పరచేవాడు. అప్పుడప్పుడు గోపబాలకులు ఆట లాడుతూ పాటలు పాడుతూ పరుగు పందాలు వేసుకుంటారు. ఆ అటలలో వారు పరుగెత్తుకుంటూ వచ్చి, బలరామకృష్ణులను తాకుతూ ఉంటారు. అటువంటి ఆప్తులైన గోపబాలురను చూసి వారిద్దరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చక్కలిగింతలు పెడుతూ క్రీడిస్తూ ఉంటారు. ఈ విధంగా. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=606

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, January 19, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 95

10.1-603-వ.
మఱియును.
10.1-604-సీ.
రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ!
రమ్ము భగీరథరాజతనయ! 
రా సుధాజలరాశి! రా మేఘబాలిక! ;
రమ్ము చింతామణి! రమ్ము సురభి! 
రా మనోహారిణి! రా సర్వమంగళ! ;
రా భారతీదేవి! రా ధరిత్రి! 
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! ;
రమ్ము మందాకిని! రా శుభాంగి!
10.1-604.1-ఆ.
యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
లడవిలోన దూరమందు మేయ
ఘనగభీరభాషఁ గడునొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.

భావము:
ఇంకా... ఇలా రావే ఓ పూర్ణచంద్రికా! రామ్మా గౌతమీగంగ! రావే భాగీరథీతనయా! ఇటు రా సుధాజలరాశి! రావమ్మ ఓ మేఘబాలిక! ఇలా రామ్మా చింతామణి! రామ్మా ఓ సురభి! రావే మనోహారిణీ! రమ్ము సర్వమంగళ! రా భారతీదేవీ! ఇటు రా ధరిత్రీ! రావమ్మా శ్రీమహాలక్ష్మీ! రావే మందమారుతి! రమ్ము మందాకిని! ఇలా రా శుభాంగీ! అంటు తన మేఘగర్జన లాంటి కంఠస్వరంతో అడవిలో దూర ప్రాంతాలకు పోయిన గోవులను వాటి పేరు పెట్టి పేరుపేరునా పిలుస్తున్నాడు. బహుచక్కటి ఆ పలుకుల గాంభీర్యానికి, మాధుర్యానికి ఆనందించి గోకులంలోని ఆభీరజనులు ఎంతో మెచ్చుకుంటున్నారు. 
గోవులు (జ్ఞానులు నామ రూప జ్ఞానాలు) మేస్తూ అడవిలో (సంసారాటవిలో) దూరదూరాల్లోకి దారితప్పి వెళ్ళి పోయాయి. శ్రీకృష్ణుడు గొల్లపిల్లలను (పసిమనసు లంత స్వచ్ఛమైన సిద్ధులను) చల్దులు తింటో (మననం చేస్తూ) ఉండ మని చెప్పి గోపాల బాలుడు బయలుదేరాడు ఇదిగో ఇలా, శ్రీకృష్ణ తత్వ ఆవిష్కరణ వెల్లడిస్తూ బమ్మెర వారు బ్రహ్మాండంగా అలతి పొలతి పదాలతో అలరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=604

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 94

10.1-602-సీ.
ఒకచోట మత్తాళి యూధంబు జుమ్మని; 
మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండు
నొకచోటఁ గలహంసయూధంబు గూడి కేం; 
కృతులు జేయంగఁ గేంకృతులు జేయు
నొకచోట మదకేకియూధంబు లాడంగ; 
హస్తాబ్జములు ద్రిప్పి యాడఁ దొడఁగు
నొకచోట వనగజయూధంబు నడవంగ; 
నయముతో మెల్లన నడవఁజొఁచ్చుఁ
10.1-602.1-ఆ.
గ్రౌంచ చక్ర ముఖర ఖగము లొక్కొకచోటఁ
బలుక వానియట్ల పలుకుఁ గదిసి
పులుల సింహములను బొడగని యొకచోటఁ
బఱచు మృగములందుఁ దఱచు గూడి.

భావము:
శ్రీకృష్ణ భగవానుడు వనవిహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు జుంజుమ్మని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటి తోపాటు ఝంకారం చేయసాగాడు; మరొకచోట కలహంస పంక్తులు క్రేంకారాలు చేస్తూంటే తాను కూడా క్రేంకారాలు చేసాడు; ఇంకొకచోట మదించిన నెమళ్ళు నాట్యం చేస్తుంటే తాను కూడా తామరపూల వంటి చేతులు త్రిప్పుతూ నాట్యం చేసాడు; వేరొకచోట మదపుటేనుగుల గుంపు మంద మందంగా నడుస్తూ ఉంటే తాను కూడా వాటి వలె మెల్ల మెల్లగా నడవసాగాడు; అలాగే ఒకొక్కచోట క్రౌంచపక్షులు చక్రవాకపక్షులు మొదలైనవి కూతలు పెడుతుంటే వాటి ననుసరించి తాను రెట్టించి కూతలు పెట్టాడు; ఒకచోట పులులు సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాల తోపాటు దూకుతూ పరుగులు తీసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=602

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, January 15, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 93

10.1-600-సీ.
నీ పాదములు సోఁకి నేడు వీరుత్తృణ; 
పుంజంబుతో భూమి పుణ్య యయ్యె
నీ నఖంబులు దాఁకి నేడు నానాలతా; 
తరుసంఘములు గృతార్థంబు లయ్యె
నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల; 
ఖగ మృగంబులు దివ్యకాంతిఁ జెందె
నీ పెన్నురము మోవ నేడు గోపాంగనా; 
జనముల పుట్టువు సఫల మయ్యె”;
10.1-600.1-ఆ.
నని యరణ్యభూమి నంకించి పసులను
మిత్రజనులు దాను మేపు చుండి
నళినలోచనుండు నదులందు గిరులందు
సంతసంబు మెఱయ సంచరించె.
10.1-601-వ.
మఱియు నయ్యీశ్వరుండు.

భావము:
నీ యొక్క పాదాలు సోకి నేడు భూదేవి పూపొదలతో పెరిగిన పచ్చికలతో పావనమై పోయింది. రకరకాల తీగలూ చెట్లూ అన్నీ ఈవేళ నీ గోళ్ళు తాకి ధన్యములయ్యాయి. ఇక్కడ ఉన్న నదులూ పర్వతాలు పక్షులూ జంతువులూ నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి దివ్యమైన కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలంపై వాలిన గోపికల జన్మలు ధన్యమయ్యాయి.” ఈవిధంగా పలుకుతూ వనభూములలో ప్రవేశించి తన మిత్రుల తోపాటు తాను పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరాలలోనూ పర్వత సానువుల పైననూ ఆనందంగా విహారం చేసాడు. అంతే కాకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=77&padyam=600

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, January 11, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 92

10.1-599-సీ.
నిఖిల పావనమైన నీ కీర్తిఁ బాడుచు; 
నీ తుమ్మెదలు వెంట నేగుదెంచె
నడవిలో గూఢుండవైన యీశుఁడ వని; 
ముసరి కొల్వఁగ వచ్చె మునిగణంబు
నీలాంబరముతోడి నీవు జీమూత మ; 
వని నీలకంఠంబు లాడఁ దొడఁగెఁ 
బ్రియముతోఁ జూచు గోపికలచందంబున; 
నినుఁ జూచె నదె హరిణీచయంబు
10.1-599.1-ఆ.
నీవు వింద వనుచు నిర్మలసూక్తులు
పలుకుచున్న విచటఁ బరభృతములు
నేఁడు విపినచరులు నీవు విచ్చేసిన
ధన్యులైరి గాదె తలఁచి చూడ.


భావము:
ఈ తుమ్మెదలు, సర్వులను పావనం చేయగల నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనుకనే ఎగిరివస్తూ ఉన్నాయి. ఈ ఋషిపక్షులు నీవు ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవు అని గుమికూడి నిన్ను సేవించడానికి వస్తూ ఉన్నాయి. నల్లని వస్త్రం ధరించిన నిన్ను చూసి మేఘము అనుకుని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. గోపికలు నిన్ను ప్రేమతో చూస్తునట్లు ఈ ఆడలేళ్ళు, నిన్ను అనురాగంతో చూస్తున్నాయి. నీవు తమ అతిధివని కోకిలలు నీకు రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి. ఇవాళ నీ రాక చేత ఇక్కడ ఉండే వనచరులు అందరూ ధన్యులయ్యారు.// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
శ్రీకృష్ణ లీలావిలాసం - 91

10.1-598-శా.
శాఖాపుష్పఫలప్రభారనతలై చర్చించి యో! దేవ! మా
శాఖిత్వంబు హరింపు; మంచు శుకభాషన్ నీ కెఱింగించుచున్
శాఖాహస్తములం బ్రసూనఫలముల్ జక్కన్ సమర్పించుచున్
శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే.

భావము:
“అన్నా! బలదేవా! ఈ చెట్లు చూసావా? కొమ్మల నిండా నిండి ఉన్న పూలగుత్తుల బరువుతో, పళ్ళ భారంతో వంగిపోయి నీ పాదాలు స్పృశిస్తూ, నమస్కరిస్తూ ఉన్నాయి. తమ మీద వాలిన చిలుకల వాక్కులతో “ఓ దేవా! మా యీ వృక్షజన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించ” మని తమ కోరికను నీకు వివ్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు అనే చేతులతో పూవులు పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్లు వరుసలు కట్టి నీ పాదపద్మాలకు చక్కగా మ్రొక్కుతూ ఉన్నాయి

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=77&padyam=598

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :