Tuesday, November 30, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౦(410)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-869-క.
స్ఫురదనలాభశరంబులు
పొరిఁబొరి బుంఖానుపుంఖములుగా నేయం
దెరలియు మరలియు మురిసియు
విరిసియుఁ బిఱుతివక పోరె వెస యదుబలముల్‌.
10.2-870-క.
అయ్యెడ మానము వదలక
డయ్యక మగపాడితో దృఢంబుగఁ బోరన్
దయ్య మెఱుంగును? నెక్కటి
కయ్యం బపుడయ్యెఁ బేరుగల యోధులకున్.
10.2-871-క.
మును ప్రద్యుమ్నకుమారుని
ఘననిశితాస్త్రములచేతఁ గడు నొచ్చిన సా
ల్వుని మంతిరి ద్యుమనాముఁడు
సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్. 

భావము:
అప్పుడు, సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది. ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది. మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=870 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, November 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౯(409)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-867-సీ.
ఒకమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు-
  నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు
నొకమాటు శైలమస్తకమున వర్తించు-
  నొకపరిఁ జరియించు నుదధినడుమ
నొక్క తోయంబున నొక్కటియై యుండు-
  నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును
నొకమాటు సాల్వసంయుక్తమై పొడసూపు-
  నొక తోయ మన్నియు నుడిగి తోఁచు
10.2-867.1-ఆ.
నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన
గతి మహోగ్రవృత్తిఁ గానవచ్చు
మఱియుఁ బెక్కుగతుల నరివరుల్‌ గలఁగంగఁ
దిరిగె సౌభకంబు ధీవరేణ్య!
10.2-868-వ.
ఇవ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు. 

భావము:
పరీక్షన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకతూరి సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొఱవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది.ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=867 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౮(408)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-864-క.
అక్రూరుఁడుఁ దదనుజులు న
వక్రపరాక్రమము మెఱసి వైరుల బాహా
విక్రమమున వధియించిరి
చక్రప్రాసాది వివిధ సాధనములచేన్.
10.2-865-మ.
కృతవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి
శ్రితవర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న
ద్భుతకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర
క్షితిధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా!
10.2-866-వ.
అయ్యవసరంబున సాల్వుండు గోపోద్దీపితమానసుండై యుండ మాయావిడంబకంబైన సౌభకం బప్పుడు. 

భావము:
అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు. ఓ పరీక్షిన్మహారాజా! రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు. అప్పుడు, సాల్వుడికి బాగా కోపం వచ్చింది. అతడి సౌభకవిమానం తన మాయాప్రభావంతో విజృంభించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=865 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౭(407)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-861-ఉత్సా.
చారుదేష్ణుఁ డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో
స్సారదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
దారుణప్రతాప సాల్వదండనాథమండలిన్
మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.
10.2-862-క.
శుకుఁ డా యోధన విజయో
త్సుకమతి బాహాబలంబు సొప్పడ విశిఖ
ప్రకరంబులఁ దను శౌర్యా
ధికుఁ డన విద్వేషిబలతతిం బరిమార్చెన్.
10.2-863-ఉ.
సారణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో
స్సార మెలర్పఁ గుంత శర శక్తి గదా క్షురికాది హేతులన్
వారక వాజి దంతి రథవర్గములం దునుమాడి కాల్వురన్
వీరముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై. 

భావము:
చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు. యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు. సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=863 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౬(406)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-859-ఉ.
సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసౌభ సాం
గత్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భాసురా
దిత్యమయూఖపుంజరుచితీవ్రశరంబులఁ జూపి సైనిక
స్తుత్యపరాక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లె భూవరా!
10.2-860-ఉత్సా.
భానువిందుఁ డుద్ధతిన్ విపక్షపక్షసైన్య దు
ర్మాన కాననానలోపమాన చండ కాండ సం
తాన మూన నేసి చూర్ణితంబు చేసెఁ జాప వి
ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చఁగాన్. 

భావము:
ఓ రాజశ్రేష్ఠుడా! సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు. భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=860 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౫(405)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-857-ఉ.
సాంబుని సాల్వభూవిభుఁడు సాయకజాలము లేసి నొంచినన్
జాంబవతీతనూభవుఁడు చాపము సజ్యము సేసి డాసి సా
ల్వుం బదియేను తూపుల నవోన్నతవక్షము గాఁడనేసి శా
తాంబకవింశతిన్నతని సౌభక మల్లలనాడ నేసినన్.
10.2-858-చ.
గదుఁడు మహోగ్రవృత్తి నిజకార్ముక నిర్గతవిస్ఫురద్విధుం
తుదవదనాభబాణవితతుల్‌ పరఁగించి విరోధిమస్తముల్‌
గుదులుగ గ్రుచ్చియెత్తుచు నకుంఠిత విక్రమకేళిలోలుఁడై
చదల సురల్‌ నుతింప రథిసత్తముఁ డొప్పె నరేంద్రచంద్రమా! 

భావము:
సాల్వుడు సాంబుడి మీద అనేక బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అంతట ఆ జాంబవతీ తనయుడు సాంబుడు తన ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుడి వక్షాన్ని పదిహేను బాణాలతో కొట్టాడు. వాడి బాణాలు ఇరవై వేసి వాడి సౌభక విమానాన్ని అల్లల్లాడేలా చేసాడు. ఓ పరీక్షిత్తు రాజేంద్రా! గొప్ప రథికుడైన గదుడు రాహుముఖం లాంటి బాణాలను ప్రయోగించి శత్రువుల శిరస్సులు ఖండించి గుదులు గుదులుగా నేలకూలుస్తు మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు. ఆకాశంలో అతని పరాక్రమం చూసి దేవతలు ప్రస్తుతించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=858 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, November 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౪(404)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-854-చ.
పదిపది యమ్ములన్ మనుజపాలవరేణ్యుల నొంచి రోషముం
గదురఁగ మూఁడుమూఁడు శితకాండములన్ రథదంతివాజులం
జదియఁగ నేసి యొక్కొక నిశాతశరంబున సైనికావలిన్
మదము లడించి యిట్లతఁ డమానుషలీలఁ బరాక్రమించినన్.
10.2-855-క.
దుర్మానవహరు నద్భుత
కర్మమునకు నుభయ సైనికప్రకరంబుల్‌
నిర్మలమతి నుతియించిరి
భర్మాచలధైర్యు విగతభయుఁ బ్రద్యుమ్నున్. 

భావము:
ప్రద్యుమ్నుడు పదేసి బాణాలు చొప్పున వేసి, సాల్వుడి మిత్రులైన రాజశ్రేష్ఠులను నొప్పించాడు. మూడేసి బాణాలు వేసి రథ, గజ, అశ్వాలను పడగొట్టాడు ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులను చిందరవందర చేసాడు. ఇలా ప్రద్యుమ్నుడు ఎదురులేని విధంగా పరాక్రమించాడు. అలా మేరుపర్వతం అంత ధైర్యంతో ప్రద్యుమ్నుడు నిర్భయంగా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగా, తిలకించిన ఉభయ సైన్యాలు ప్రస్తుతించాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=855 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౩(403)


( యదుసాల్వ యుద్ధంబు)

10.2-851-మ.
యంబుం గలుషించి సౌభపతి మాయాకోట్లు చంచచ్ఛరా
 నిర్ముక్త నిశాత దివ్యమహితాస్త్రశ్రేణిచేఁ దత్‌క్షణం
బు లీలాగతి నభ్రగుల్‌ మనములన్ భూషింప మాయించె న
వ్వజాతాప్తుఁడు భూరి సంతమసమున్ వారించు చందంబునన్
10.2-852-వ.
మఱియును.
10.2-853-చ.
తిరథికోత్తముం డన నుదంచితకాంచనపుంఖ పంచ విం
తివిశిఖంబులన్నతని సైనికపాలుని నొంచి యుగ్రుఁడై
 శతకోటికోటినిభసాయకముల్‌ పరఁగించి సాల్వభూ
తి కకుదంబు నొంచి లయభైరవుకైవడిఁ బేర్చి వెండియున్.

భావము:
సాల్వుడు కలుషాత్ముడై పన్నిన అనంత మాయాజాలాలను వీక్షించాడు. వీరావేశంతో విజృంభించి, సూర్యుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు చేయునట్లు, ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో ఆ మాయాజాలాన్ని ఛేదించాడు. గగనచరులు అతని పరాక్రమం చూసి పొగిడారు. అనంతరం గొప్ప అతిరథుడి వలె ప్రద్యుమ్నుడు ఇరవైఐదు వాడి బాణాలతో సాల్వుడి సైన్యాధిపతిని నొప్పించాడు. పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని మూపు పగలగొట్టాడు. లయకాలపు భైరవుడి లాగ విజృంభించాడు. అటుపిమ్మట....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=853

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౦౨(402)


( యదుసాల్వ యుద్ధంబు)

10.2-848-మ.
రిరింఖారథనేమి సద్భటపదవ్యాఘట్టనోద్ధూత దు
స్తధూళీపటలప్రభూత నిబిడధ్వాంతప్రవిధ్వంస కృ
త్క శాతాసి గదాది హేతిరుచు లాకాశంబు నిండన్ వియ
చ్చ దృక్కుల్‌ మిఱుమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లఁగన్.
10.2-849-చ.
కొని సైనికుల్‌ గవిసి తార్కొని పేర్కొని పాసి డాసి యం
కిలి గొనకెమ్ములమ్ములఁ బగిల్చి నొగిల్చితరేతరుల్‌ తలల్‌
లియఁగ మొత్తి యొత్తి నయనంబులు నిప్పులు రాల లీల నౌఁ
లు లలాటముల్‌ ఘనగదాహతి నొంచి కలంచి పోరఁగన్.
10.2-850-వ.
అయ్యవసరంబునం బ్రద్ముమ్నుండు గనుంగొని.

భావము:
గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి. ఇరు పక్షాల సైన్యాలు పూని ఒకరి నొకరు ఎదిరించి బాణ వర్షాలు కురిపించి మర్మస్థానాలను చీల్చేస్తు, క్రోధంతో కన్నులనుండి నిప్పురవ్వలు రాలగా పెద్ద పెద్ద గదలతో తలలపై బాదుకుంటూ, భయంకరంగా పోరాడారు. అలా భీకరంగా పోరుసాగుతున్న సమయంలో అదంతా వీక్షిస్తున్న ప్రద్యుమ్నుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=849

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 18, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౧(401)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-846-వ.
చని యా గోవిందనందన స్యందనంబుం బలసందోహంబునుం దలకడచి, యదు సైన్యంబులు సాల్వబలంబులతోడం దార్కొని బెరయునప్పుడు దేవదానవ సంకులసమర విధంబునం దుములం బయ్యె; నయ్యెడ.
10.2-847-మ.
వితతజ్యాచయ టంకృతుల్‌, మదజలావిర్భూతశుండాల ఘీం
కృతు, లుద్యద్భటహుంకృతుల్,‌ మహితభేరీభాంకృతుల్,‌ భీషణో
ద్ధతనిస్సాణధణంకృతుల్,‌ ప్రకటయోధవ్రాతసాహంకృతుల్‌,
కుతలంబున్, దివి నిండ మ్రోసె రిపుసంక్షోభంబుగా భూవరా! 

భావము:
ఈ విధంగా యాదవసైన్యం ప్రద్యుమ్నుని రథాన్నిదాటి ముందుకు పోయి సాల్వుడి సైన్యాలను ఎదిరించింది. అప్పుడు రెండు పక్షాల బలాలకు జరిగిన బాహాబాహీ సంకుల సమరం దేవదానవ యుద్ధంలాగ కనబడసాగింది. ఓ పరీక్షిన్మహారాజా! ఆ సంకుల సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=847 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 17, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౦(400)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-844-చ.
సమధిక బాహుశౌర్యజితచండవిరోధులు వెళ్లి రున్నత
క్షమ గద భానువింద శుక సాత్యకి సారణ చారుదేష్ణ సాం
బ మకరకేతనాత్మజ శ్వఫల్కతనూభవ తత్సహోదర
ప్రముఖ యదూత్తముల్‌ విమతభంజనులై కృతవర్మమున్నుగన్
10.2-845-క.
వారణ వాజిస్యందన
వీరభటావలులు సనిరి విశ్వము వడఁకన్
ఘోరాకృతి వివిధాయుధ
భూరిద్యుతు లర్కబింబముం గబళింపన్. 

భావము:
మహా భుజబల పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుని నందననుడు అనిరుద్ధుడు, శఫల్కుని పుత్రుడు అక్రూరుడు మున్నగు యాదవవీరులందరూ కృతవర్మ నాయకత్వంతో యుద్ధభూమికి బయలుదేరారు. యాదవవీరులు చతురంగబలసమేతులై జగత్తు కంపిస్తుండగా, తాము ధరించిన రకరకాల ఆయుధాల కాంతులు సూర్యబింబాన్ని కప్పివేస్తుండగా అరివీర భీకరంగా రణరంగానికి బయలుదేరారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=845 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౯(399)


( సాల్వుండు ద్వారకన్నిరోధించుట)

10.2-841-క.
టులపురత్రయదనుజో
త్కదుస్తర బాధ్యమానధారుణిగతి న
ప్పుభేదన మెంతయు వి
స్ఫుపీడం జెంది వగల సుడివడుచుండన్.
10.2-842-చ.g7

ని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు ,qq1 రౌక్మిణేయుఁ డv
జ్జముల నోడకుండుఁ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా
ములఁ బూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కే

 రుచి గ్రాల నున్నతరస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్.

భావము:
త్రిపురాసురులవల్ల బాధపడిన భూలోకం లాగ ద్వారకానగరం సాల్వుడిచేత మిక్కిలి ఇక్కట్లపాలై దుఃఖంతో కలత చెందింది. అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి, మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=842

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, November 15, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౮(398)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-838-సీ.
సరిదుపవన సరోవరములు మాయించి-
  బావులు గలఁచి కూపములు సెఱిచి
కోటలు వెస వీటతాటముల్‌ గావించి-
  పరిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి
యట్టళ్లు ధరఁ గూల్చి యంత్రముల్‌ దునుమాడి-
  కాంచనధ్వజపతాకములు నఱకి
భాసుర గోపుర ప్రాసాదహర్మ్యేందు-
  శాలాంగణములు భస్మములు చేసి
10.2-838.1-తే.
విమల కాంచనరత్నాది వివిధవస్తు
కోటి నెల్లను నందంద కొల్లపుచ్చి
ప్రజలఁ జెఱపట్టి దొరలను భంగపెట్టి
తఱిమి యిబ్భంగిఁ బెక్కుబాధల నలంచి.
10.2-839-చ.
మదమున నంతఁ బోవక విమానయుతంబుగ నభ్రవీథికిన్
గొదకొని యేపుమై నెగసి కొంకక శక్తి శిలా మహీరుహ
ప్రదరము లోలిమైఁ గురిసి బంధురభూమిపరాగ శర్కరల్‌
వదలక చల్లుచున్ వలయవాయువుచే దిశ లావరించుచున్. 

భావము:
ద్వారకానగరంలోని సెలయేర్లను ఉపవనాలను ధ్వంసం చేయించాడు; చెఱువులు బావులు పూడిపించాడు; కోటలను ఛిన్నాభిన్నము చేయించాడు; అగడ్తలను పాడుచేసాడు; కోటగోడలను పడగొట్టించాడు; ప్రాకారాలు బురుజులు కూలదోయించాడు; యంత్రాలను ధ్వజపతాకాలనూ నరకించాడు; గోపురాలను మిద్దెలను మేడలను చంద్రశాలలను కాల్చి బూడిద చేసాడు; పట్టణంలోని బంగారాన్ని రత్నాలు మొదలైన వస్తువులను కొల్లగొట్టాడు; ప్రజలను చెఱపట్టాడు; అధికారులను అవమానించాడు; ఇలాగ సాల్వుడు ద్వారకలోని ప్రజలను పెక్కు బాధలకు గురిచేసాడు. అంతటితో వదలిపెట్టకుండ విమానం ఎక్కి సాల్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండి చర్నా(చిల్ల)కోలల్లా ఉన్న తీగలు, గడ్డిపోచలు, చెట్లు, కొమ్మలు, రాళ్ళు, బాణాలు వరసపెట్టి కురిపిస్తూ ద్వారకావాసులను బాధించాడు. దట్టమైన దుమ్ము ధూళితో ఇసుకరేణువులతో కూడిన సుడిగాలులు విసురుతూ కల్లోలపరచాడు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=839 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, November 14, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౭(397)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-837-వ.
అని అభ్యర్థించినం బ్రసన్నండై హరుండు వాని కోర్కి కనురూపం బైన పురంబు నిర్మింప మయుని నియోగించిన నతండును “నట్ల చేసెద” నని కామగమనంబును నతివిస్తృతంబునుగా లోహంబున నిర్మించి సౌభకంబను నామంబిడి సాల్వున కిచ్చిన వాఁడును బరమానందంబునం బొంది తద్విమానారూఢుండై యాదవుల వలని పూర్వవైరంబుఁ దలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకానగరంబుపైఁజని నిజసేనాసమేతంబుగాఁ దత్పురంబు నిరోధించి. 

భావము:
అలా సాల్వుడు కోరిన విధమైన విమానాన్ని ఈశ్వరుడు “అతడి కోరికకు తగిన పురము నిర్మించి యి” మ్మని మయుడిని ఆదేశించాడు. అతడు చిత్తమని కామగమనమూ మిక్కిలి వెడల్పూ పొడవూ కలిగి లోహమయమైన ఒక విమానాన్ని నిర్మించి దానికి “సౌభకము” అని పేరుపెట్టి సాల్వుడికి ఇచ్చాడు. వాడు పరమానందంతో దానిని ఎక్కి యాదవుల మీద తనకు ఉన్న పూర్వ శత్రుత్వం గుర్తుచేసుకుని గర్వంతో కన్నుమిన్ను గానక తన సేనలతో వెళ్ళి ద్వారకాపట్టణాన్ని ముట్టడించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=837 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౬(396)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-834-క.
బోరనఁ బ్రత్యక్షంబై
కోరినవర మేమి యైనఁ గొసరక యిత్తున్
వారక వేఁడు మటన్నను
నా రాజతపోధనుండు హరునకుఁ బ్రీతిన్.
10.2-835-తే.
వందనం బాచరించి యానంద వికచ
వదనుఁడై నొస లంజలిఁ గదియఁ జేర్చి
"శ్రితదయాకార! నన్ను రక్షించెదేని
నెఱుఁగ వినిపింతు వినుము మదీప్సితంబు.
10.2-836-తే.
గరుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర
వరులచే సాధ్యపడక నా వలయు నెడల
నభ్రపథమునఁ దిరిగెడు నట్టి మహిత
వాహనము నాకు దయసేయు వరద! యీశ! " 

భావము:
అంతట, ఈశ్వరుడు ప్రత్యక్షమై “నీవు ఏ వరం కోరినా ఇస్తాను. కోరుకొమ్ము” అని సాల్వుడిని అనుగ్రహించాడు. సాల్వుడు పరమ ప్రీతితో శంకరుడికి నమస్కారంచేసి, ఆనందంతో అంజలి నొసట ఘటించి ఇలా అన్నాడు “ఓ శివా! ఆశ్రితుల ఎడ కృప చూపు వాడా! నన్నురక్షించేటట్లయితే నా కోరిక ఏమిటో మనవి చేస్తాను. చిత్తగించు. ఓ ఈశ్వరా! వరదా! ప్రభూ! గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస, దేవతాదులకు సాధ్యం కానట్టిది, నా కోరిక ప్రకారం అవసరమైనప్పుడు ఆకాశమార్గంలో సంచరించగలది అయిన అద్భుతమైన విమానాన్ని నాకు ప్రసాదించు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=836 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౫(395)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-831-తే.
వసుధేశ! విను; మును వైదర్భి పరిణయ-
  వేళ దుర్మద శిశుపాలభూమి
వరునకుఁ దోడ్పడ నరుదెంచి సైనికా-
  వలితోడఁ దొడరి దోర్బలము దూలి
హరిచేత నిర్జితులైన రాజులలోనఁ-
  జైద్యుని చెలికాఁడు సాల్వభూమి
పతి జరాసంధాది పార్థివప్రకరంబు-
  విన మత్సరానల విపులశిఖల
10.2-831.1-తే.
"ధాత్రి నిటమీఁద వీతయాదవము గాఁగఁ
గడఁగి సేయుదు"నని దురాగ్రహముతోడఁ
బంతములు పల్కి యటఁ జని భరితనిష్ఠఁ
దపము కావింపఁ బూని సుస్థలమునందు.
10.2-832-క.
ధృతి వదలక యుగ్రస్థితిఁ
బ్రతిదినమునుఁ బిడికెఁ డవనిరజ మశనముగా
నతినియమముతో నా పశు
పతి, శంకరు, ఫాలనయను, భర్గు, నుమేశున్. 

భావము:
ఓ రాజా! రుక్మిణీ స్వయంవర సమయంలో శిశుపాలుడికి సహాయంగా సైన్యంతో సహా వచ్చి, కృష్ణుడిని ఎదిరించి, అతని చేత చావుదెబ్బలు తిని పరాజితులైన రాజులలో సాల్వుడు అనే రాజు ఒకడు. అతడు విపరీతమైన కోపంతో, మొండిపట్టుదలతో “యాదవులను అందరిని నాశనం చేస్తాను” అని జరాసంధాది రాజుల ఎదురుగా ప్రతిజ్ఞ చేసాడు. అటుపిమ్మట అతడు అత్యంత నిష్ఠతో ఒక ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుడిని గురించి తపస్సు చేయటానికి ఉపక్రమించాడు. అలా ఉపక్రమించిన సాల్వుడు ప్రతిదినం పిడికెడు దుమ్ము మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ పట్టుదలగా పరమేశ్వరుని గురించి భీకర తపస్సు చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=832 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౪(394)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-829-చ.
జనవరబంధమోక్షణముఁ జైద్యవధంబును బాండురాజ నం
దన మఖరక్షణంబును నుదారతఁ జేసిన యట్టి దేవకీ
తనయుచరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతు రిష్ట శో
భన బహుపుత్త్ర కీర్తులును భవ్యవివేకము విష్ణులోకమున్."
10.2-830-క.
అని శుకయోగీంద్రుండ
మ్మనుజేంద్రునిఁజూచి పలికె మఱియును “శ్రీకృ
ష్ణుని యద్భుత కర్మంబులు
వినిపింతుం జిత్తగింపు విమలచరిత్రా! 

భావము:
రాజులను బంధవిముక్తులను చేయడం శిశుపాలుడిని వధించడం ధర్మజ్ఞుని యజ్ఞాన్ని రక్షించడం మొదలైన శ్రీకృష్ణుని విజయ గాథలను చదివినవారు కోరిన సౌభాగ్యాలనూ, కీర్తిని, దివ్యమైన జ్ఞానాన్ని వైకుంఠ వాసాన్ని పొందుతారు." ఇలా పలికిన శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా చెప్పసాగాడు. “నిర్మలమైన చరిత్రగల ఓ రాజా పరీక్షిత్తూ! శ్రీకృష్ణుడి అద్భుత కార్యాలను ఇంకా వివరిస్తాను శ్రద్దగా ఆలకించు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=830 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౩(393)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-827-వ.
దామోదరానుమోదితులయి మహారవంబుగాఁ బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనతవదనుండై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబునకరిగె; నయ్యవసరంబున ధీవిశాలు రైన సభాసదులగు నచ్చటి జనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున విన్ననై యుండె; నప్పుండరీకాక్షుండు భూభార నివారణకారణుం డగుటంజేసి దుర్యోధను నపహాసంబునకుం గాదనండయ్యె; నంత.
10.2-828-క.
హరి ధర్మసుతుని వీడ్కొని
తరుణీ హిత బంధుజన కదంబము గొలువం
బరితోషమునఁ గుశస్థల
పురమునకుం జనియె మోదమున నరనాథా! 

భావము:
కృష్ణుడి ఆమోదంతో అక్కడున్న రాజులు స్త్రీ జనము భీముడితోపాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళాకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించ లేదు. ఓ మహారాజా! ఆ తరువాత కృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యాబిడ్డలు, బంధుజనులు సేవిస్తుండగా సంతోషంగా కుశస్థలికి ద్వారకానగరానికి వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=828 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౨(392)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-824-వ.
అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబు నందు.
10.2-825-క.
సలిలములు లేని ఠావున
వలువలు వెస నెగయఁ దిగిచి వారక తోయం
బులు గల చోటనుం జేలం
బులు దడియఁగఁ బడియె నిజవిభుత్వము దఱుఁగన్
10.2-826-క.
ఆ విధమంతయుఁ గనుఁగొని
పావని నవ్వుటయు నచటి పార్థివులునుఁ గాం
తావలియును యమతనయుఁడు
వావిరిఁ జేసన్నఁ దమ్ము వారింపంగన్. 

భావము:
ఇలా వచ్చిన దుర్యోధనుడు మాయమయమైన మయాసభా మధ్యంలో ప్రవేశించి. ఆ మయాసభలో నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులు పైకి ఎగగట్టుకుని; నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని; దుర్యోధనుడు భ్రమకు లోను అయ్యాడు. ఈవిధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన భీమసేనుడు నవ్వాడు. అక్కడున్న రాజులూ స్త్రీ జనమూ ధర్మరాజు సైగ చేసి వారిస్తూ ఉన్నా... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=826 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, November 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౧(391)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-822-సీ.
సుత సహోదర పురోహిత బాంధవామాత్య-
  పరిచార భటకోటి బలసి కొలువఁ
గలిత మాగధ మంజు గానంబుఁ బాఠక-
  పఠన రవంబునుఁ బ్రమద మొసఁగఁ
గంకణ ఝణఝణత్కారంబు శోభిల్ల-
  సరసిజాననలు చామరములిడఁగ
మయ వినిర్మిత సభామధ్యంబునను భాస-
  మాన సింహాసనాసీనుఁ డగుచు
10.2-822.1-తే.
నమర గణములు గొలువఁ బెంపారు ననిమి
షేంద్రుకైవడి మెఱసి యుపేంద్రుఁ డలర
సరసఁ గొలువున్న యత్తఱి దురభిమాని
క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు.
10.2-823-ఉ.
కాంచనరత్నభూషణ నికాయముఁ దాల్చి సముజ్జ్వలప్రభో
దంచితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటఁ గ్రందువాయ వా
రించ సహోదరుల్‌ నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప నే
తెంచెను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్. 

భావము:
ధర్మరాజు మయసభ మధ్యలో ప్రకాశవంతమైన సింహాసనం మీద ఆసీనుడై కొలువుతీరి ఉండగా ఆయన పుత్రులు, తమ్ముళ్ళు, పురోహితులు, బంధుమిత్రులు, మంత్రులు, సేవకులు అయనను సేవిస్తున్నారు; వందిమాగధుల మధుర స్తోత్రాలు సంతోషాన్ని కలిగిస్తున్నారు; చేతి కంకణాలు మ్రోగుతుండ యువతులు వింజామరలు వీస్తున్నారు; అప్పుడు దేవతలు సేవిస్తుండగా ప్రకాశించే దేవేంద్రుడిలాగా కొలువుతీరి ఉన్నాడు; ఇలా కొలువుతీరి ఉన్న ధర్మరాజుని వీక్షించి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ సమయంలో దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడకి వచ్చి సువర్ణమయములైన మణిభూషణాలు ధరించి రాజసం ఉట్టిపడే తేజస్సుతో సేవకులు ముందు నడుస్తూ జనాన్ని ఒత్తిగిస్తుండగా తమ్ముళ్ళు రాజులు ఇరువైపులా చేరి అనుసరించి సేవిస్తుండగా దుర్యోధనుడు వైభవోపేతంగా ధర్మరాజు సమక్షానికి విచ్చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=823 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Sunday, November 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౦(390)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-821-వ.
ఉండం గనుంగొని; యదియునుంగాక, యొక్కనాఁడు లలితాష్టమీ శశాంకబింబంబులం విడంబించుచు నింద్రనీలరుచినిచయంబు నపహసించు కుటిలకుంతలంబులు నటనంబు సలుపం దనరు నిటలఫలకంబులును, బుష్పచాపుచాపంబు రూపునేపుమాపు భ్రూయుగోపాంతంబులై సౌదామనీదామ రుచిస్తోమంబులై, కర్ణాంతసీమంబులై యంజనంబులతోడ రంజిల్లు నేత్రకంజంబులును, నవమల్లికాముకుళ విభాసిత దంతమరీచికా నిచయోద్దీపిత మందహాసచంద్రికాధవళితంబులును, ముకురోపమితంబులై కర్ణకుండలమణిమరీచి జాలంబులు బెరసి బహుప్రకారంబులఁ బర్వంబొలుచు కపోలపాలికలును, విలసిత గ్రైవేయక ముక్తాఫలహార నిచయంబుల కిమ్ముచూపక మిసమిసని పసగల మెఱుంగులు గిఱికొన మీటినంబగులు ననం బొగడందగి మొగంబులకుం బుటంబులెగయు నుత్తుంగపీనకుచభారంబుల వ్రేఁగు లాఁగలేక తూఁగాడుచుం గరతల పరిమేయంబులగు మధ్యభాగంబులును, ఘనజఘనమండ లావతీర్ణకాంచన కాంచీకలాప కింకిణీకలకల నినాదోల్లసితంబులగు కటిప్రదేశంబులును, సల్లలిత హల్లక పల్లవకాంతుల మొల్లంబులఁ గొల్లలుగొని యభిరామంబులై శోభిల్లు పదపాణితలంబులును, నలసగతులం బదంబులం దనరు మణినూపురంబులు గోపురంబులం బ్రతిస్వనంబు లొలయ మొరయ నలరు చరణారవిందంబులును, రత్నవలయ కంక ణాంగుళీయకాది వివిధ భూషణద్యుతినిచయంబు లుష్ణమరీచి కరనిచయంబుల ధిక్కరింప వెలుంగు కరకంజంబులును, మృగ మద ఘనసార హరిచందనాగరు కుంకుమపంకంబుల భాసురంబులగు వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబు నొందిన మాణిక్యపుబొమ్మల విధంబున గగన మండలంబు నిర్గమించి, వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల చెలువున శృంగారరసంబు మూర్తీభవించిన జగంబుల మోహపఱచు మోహినీదేవతలచందంబున, విల సించు మాధవ వధూసహస్రంబుల సంగతిని సౌదామనీలతయునుం బోలె నొప్పుచుండెడు ద్రుపదరాజనందన విభవంబును రాజసూయ మహాధ్వరోత్సవంబునం జూచి చిత్తంబుత్తలపడ సుయోధనుండు సంతాపానలంబునం గ్రాఁగుచుండె; నంత నొక్కనాఁడు ధర్మనందనుఁడు నిర్మలంబగు సభాభవనంబునకుం జని. 

భావము:
ఒకనాడు మనోహరమైన అష్టమినాటి చంద్రబింబాల వంటి ఫాలభాగములతో; ఇంద్రనీలమణులను మించిన ముంగురులతో; మన్మథుడి ధనుస్సులవంటి కనుబొమ్మలతో; ఆకర్ణాంతములై తళతళ మెరుస్తున్న కాటుకకన్నులతో; విరజాజిమొగ్గల వంటి పలువరుసతో; చిగురు పెదవుల చిరునవ్వు వెన్నెలలతో; కర్ణకుండలాల కాంతులు జాలువారు చక్కని చిక్కని చెక్కిళ్ళతో; ముత్యాలహారములకు సైతం సందీయక మిసమిసలాడు ఉత్తుంగ పయోధరములతో; నకనకలాడు సన్నని నెన్నడుములతో; చిరుగజ్జెల సవ్వడులతో; కూడిన బంగారు ఒడ్డాణములు ప్రకాశించు కటి ప్రదేశాలతో; చిగురుటాకులవంటి అరచేతులతో; ఘల్లుఘల్లున మ్రోగుచున్న కాలి అందియలతో; రతనాల గాజులు, కంకణాలు ఉంగరాలు కాంతులీను కరకమలములతో; సుగంధాలు విరజిమ్ము కస్తూరి పచ్చకర్పూరము మంచిగంధము మైపూతలతో అలరారుతూ; ప్రాణాలతో ఉన్న మాణిక్యపు బొమ్మల చక్కదనాలతో; దివి నుండి భువికి దిగివచ్చిన చంద్రరేఖ తీరున శృంగారరసం మూర్తీభవించిన మోహినీదేవతల వలె విరాజిల్లుతున్న మిక్కిలి సౌందర్యవతు లైన శ్రీకృష్ణుడి సతుల నడుమ; మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఉన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూస్తున్న దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిండుకొలువు తీర్చి కూర్చున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=821 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, November 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౯(389)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-819-చ.
అనిన మునీంద్రుఁ డిట్లను ధరాధిపుతోఁ "గురురాజు పాండు నం
దనులదెసన్ననేక దురితంబులు నిచ్చలుఁ జేయుచుండు నై
నను, నొకనాఁడు పంకరుహనాభ దయాపరిలబ్ధభూరి శో
భనజిత దేవదైత్యనరపాలకరాజ్యరమామహత్త్వమై.
10.2-820-చ.
వెలయు ననూనసంపదల విశ్రుతకీర్తులు మిన్ను ముట్టఁ బెం
పలరిన పాండుభూవరసుతాగ్రజుఁ డంతిపురంబులోన ను
జ్జ్వలమణిభూషణాంశురుచిజాలము బర్వఁ బయోజనాభు ను
త్కలిక భజించుచున్ ఘనసుఖస్థితి భూరిమనోహరాకృతిన్. 

భావము:
ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. “దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడూ అపకారమే చేస్తుంటాడు. అయినా శ్రీకృష్ణుని దయచేత కలిగిన దేవ, దానవ, నరులను పాలించే రాజ్య సంపదలను వైభవం కలవాడైన ధర్మరాజు మహదైశ్వర్యంతోనూ విశ్రుత యశస్సుతోనూ శ్రీకృష్ణుని దయవలన ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉజ్వలమైన రత్నవిభూషణాల వెలుగుల మధ్య బహు మనోజ్ఞంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని సేవిస్తూ... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=820 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Friday, November 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౮(388)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-816-ఆ.
రాజసూయమఖ వరప్రభావమునకు
నఖిలజనులు మోదమంది రపుడు
కలుషమానసుండు కులపాంసనుఁడు సుయో
ధనుఁ డొకండు దక్క ధరణినాథ! "
10.2-817-వ.
అనిన విని శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.
10.2-818-ఆ.
"అఖిల జనుల కెల్ల నానందజనకమై
యెనయు మఖము కురుకులేశ్వరునకుఁ
గర మసహ్యమైన కారణ మెయ్యది
యెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత! " 

భావము:
ఓ రాజా పరీక్షిత్తూ! కల్మషచిత్తుడు, వంశనాశకుడు అయిన దుర్యోధనుడు తప్పించి, తక్కిన సమస్త ప్రజలూ రాజసూయయాగ వైభవానికి సంతోషించారు.” అని చెప్పగా విని పరీక్షిత్తు శుకమునీంద్రునితో ఇలా అన్నాడు. “ఓ మహానుభావ! అందరికీ సంతోషాన్ని కలిగించే రాజసూయ యాగం దుర్యోధనుడికి ఎందుకని సహింపరానిది అయిందో నాకు వివరంగా చెప్పు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=818 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౩౮౭(387)

( శిశుపాలుని వధించుట ) 

10.2-813-వ.
ఇట్లు పాండవాగ్రజుప్రార్థనం గైకొని దామోదరుండు సమస్త యాదవులనుఁ గుశస్థలికిఁ బోవంబనిచి కతిపయ పరిజనంబులుం దానును నతనికిఁ బ్రియంబుగాఁ దన్నగరంబునఁ బ్రమోదంబున నుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.
10.2-814-చ.
"జనవర! పాండుభూపతనుజాతుఁడు దుస్తరమౌ మనోరథా
బ్ధిని సరసీరుహాక్షుఁ డను తెప్ప కతంబున దాఁటి భూరి శో
భనయుతుఁడై మనోరుజయుఁ బాసి ముదాత్మకుఁడై వెలింగె, న
వ్వనరుహనాభుదాసజనవర్యులకుం గలవే యసాధ్యముల్‌?
10.2-815-వ.
అట్టి యెడ. 

భావము:
ఇలా ధర్మరాజు చేసిన విన్నపం శ్రీకృష్ణుడు మన్నించాడు. యాదవులను అందరినీ కుశస్థలికి పంపించాడు. తాను మాత్రం కొంత పరివారంతో ధర్మరాజు తృప్తిచెందే దాక ఇంద్రప్రస్థనగరంలోనే సంతోషంగా ఉన్నాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. “మహారాజా! రాజసూయం చేయాలనే బహు దుష్కరమైన సముద్రమంతటి తన కోరికను ధర్మరాజు కృష్ణుడనే ఓడ ద్వారా దాటి, మానసికవ్యధ నుండి దూరమై గొప్పఐశ్వర్యంతో సంతోషంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడి భక్తులకు సాధ్యం కానిది ఏముంది? ఆ విధంగా రాజసూయ యాగం విజయవంతంగా సుసంపూర్ణమైన సమయంలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=814 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, November 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౬(386)

( శిశుపాలుని వధించుట ) 

10.2-810-వ.
అట్లు నారాయణపరాయణులై దేవసమాన ప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ఘ్యరత్నమయభూషణ మాల్యానులేపనంబులు ధరించి పరమానంద భరితాత్ములై యెప్పియుండి; రంత.
10.2-811-చ.
సునిశితభక్తిఁ దన్మఖముఁ జూడఁగ వచ్చిన యట్టి దేవతా,
ముని, ధరణీసురప్రకర, భూవర, విడ్జన, శూద్రకోటి య
జ్జనవరచంద్రుచే నుచిత సత్కృతులం బరితోషచిత్తులై
వినయముతోడ ధర్మజుని వీడ్కొని పోవుచుఁ బెక్కుభంగులన్.
10.2-812-చ.
హరిచరణాంబుజాతయుగళార్చకుఁడై పెనుపొందు పాండుభూ
వరసుత రాజసూయమఖ వైభవమున్ నుతియించుచున్, సమా
దరమున నాత్మభూముల కుదారత నేఁగిరి; ధర్మసూనుఁడున్
సరసిజనేత్రుఁ దా ననుపఁజాలక యుండు మటంచు వేఁడినన్. 

భావము:
ఆ విధంగా మిక్కిలి విలువైన రత్నమయభూషణాలు గంధమాల్యాదులు ధరించి, దేవతలలా ప్రకాశిస్తూ, నారాయణపరాయణులై నగరంలోని స్త్రీపురుషులు అందరూ ఆనందంగా ఉన్నారు. అలా తను చేసిన రాజసూయయాగాన్ని భక్తితో చూడడానికి వచ్చిన దేవతలు, మునులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు అందరిని ధర్మజుడు సముచిత రీతిలో సత్కరించాడు. వారందరు సంతృప్తి చెంది సంతోషంతో సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ యజ్ఞానికి విచ్చేసిన వారంతా శ్రీకృష్ణభక్తుడు పాండురాజ సుతుడు అయిన ధర్మరాజు కావించిన రాజసూయ యాగం వైభవాన్ని పొగుడుతూ తమ తమ స్థలాలకు వెళ్ళారు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని వదలలేక ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=812 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, November 2, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౫(385)

( శిశుపాలుని వధించుట ) 

10.2-807-ఆ.
అంత ధర్మతనయుఁడభినవమృదుల దు
కూల సురభికుసుమమాలికాను
లేపనములు రత్నదీపితభూషణా
వళులు దాల్చి వైభవమున నొప్పె.
10.2-808-వ.
అంత నవభృథస్నానానంతరంబున మరలి చనుదెంచి,
10.2-809-ఉ.
పాండుతనూభవాగ్రజుఁడు, పాండుయశోనిధి, భాసమాన మా
ర్తాండనిభుండు యాజక, సదస్య, మహీసుర, మిత్ర, బంధు, రా
ణ్మండలిఁ బూజ సేసి బుధమాన్యచరిత్రుడు వారి కిచ్చెనొం
డొండ దుకూలరత్న కనకోజ్జ్వలభూషణముఖ్యవస్తువుల్‌. 

భావము:
ధర్మరాజు సరిక్రొత్త మృదువైన నూతనవస్త్రాలు, పరిమళ భరితమైన పూలమాలలు, అనులేపనాలు ధరించి; రత్నాలతో ప్రకాశిస్తున్న ఆభరణాలను అలంకరించుకుని, అత్యంత వైభవంగా ప్రకాశించాడు. అవభృథస్నానానంతరం ధర్మరాజు ఇంద్రప్రస్థ పట్టణానికి తిరిగి వచ్చి యజ్ఞం చేయించిన వారిని యజ్ఞ కార్యాన్ని పర్యవేక్షించిన వారినీ సభాసదులైన బ్రాహ్మణులను, బంధుమిత్రులను, రాజులను పాడవులలో అగ్రజుడు, నిర్మలయశస్వి, సూర్య తేజోవంతుడు, పండితమాన్యుడు అయిన ధర్మరాజు సత్కరించాడు. వారందరికీ పట్టువస్త్రాలు, సువర్ణ రత్న భూషణాలు మున్నగువాటిని బహుమానంగా ఇచ్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=809 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, November 1, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౪(384)

( శిశుపాలుని వధించుట ) 

10.2-805-క.
అనిమిషదుందుభి ఘన ని
స్వనములు వీతెంచెఁ, బుష్పవర్షము గురిసెన్,
మునిదేవపితృమహీసుర
వినుతుల రవ మెసఁగె నపుడు విమలచరిత్రా!
10.2-806-క.
నరులెట్టి పాపు లైననుఁ
గర మర్థిని నెద్ది సేసి గతకల్మషులై
చరియింతు రట్టి యవభృథ
మరుదుగఁ గావించి రెలమి నఖిలజనంబుల్‌. 

భావము:
ఓ పుణ్యచరిత్రుడా! పరీక్షిత్తూ! అలా ధర్మరాజాదులు మహావైభవంగా అవభృథసానాలు చేసే సమయంలో, దేవదుందుభులు మారుమ్రోగాయి; పూలవాన కురిసింది; మహర్షుల, దేవతల, పితృదేవతల. బ్రాహ్మణుల స్తుతులు గట్టిగా చేసారు. యజ్ఞాంతమున చేసే అవభృథస్నానం చేసిన మానవులు ఎంతటి పాపాత్ములైనా సమస్త పాపాలనుంచి విముక్తులవుతారు. అక్కడ ఉన్న వారు అందరూ అంతటి మహా ప్రభావవంతమైన ఆ అవభృథస్నానం చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=806 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :