Thursday, May 31, 2018

శ్రీకృష్ణ లీలలు - 20

10.1-324-క.
తెఱవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
గఱపించి నీ కుమారుఁడు
వెఱచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!
10.1-325-క.
నా కొడుకును నా కోడలు
నేకతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం
గోక లెఱుంగక పాఱినఁ
గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!

భావము:
ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి. నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=325

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, May 30, 2018

శ్రీకృష్ణ లీలలు - 19

10.1-322-క.
నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా
లేఁగతోఁకతోడ లీలఁ గట్టి
వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు; 
రాచబిడ్డఁ డైన ఱవ్వ మేలె?
10.1-323-క.
నా పట్టి పొట్ట నిండఁగఁ
బై పడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ; 
డూపిరి వెడలదు; వానిం
జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!


భావము:
ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా. పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకు వచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=323


: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Friday, May 25, 2018

శ్రీకృష్ణ లీలలు - 18

10.1-320-క.
వ్రాలఁగ వచ్చిన నీ సతి
"చూలాలం దలఁగు" మనుడు "జూ లగుటకు నే
మూలంబు జెప్పు" మనె నీ 
బాలుఁడు; జెప్పుదురె సతులు? పర్వేందుముఖీ!
10.1-321-క.
మగువా! నీ కొమరుఁడు మా
మగవా రటు పోవఁ జూచి మంతనమునకుం
దగఁ జీరి పొందు నడిగెను
జగముల మున్నిట్టి శిశువు చదువంబడెనే?

భావము:
ఓ యశోదమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె “గర్భవతిని దూరంగా ఉండు అంది”. “ గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు” అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. కాని, అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా. ఓ ఇల్లాలా! మా మగవాళ్ళు బైటకు వెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకి రా అని పిలిచి, నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నా డని ఇంతకు ముందెప్పుడైనా విన్నామా?
గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. ఇక్కడ పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు చెప్పిన విశేషార్థం చూడండి. అసంభవ నాదుల చేత బ్రహ్మైక్యం భంగపరచే దుర్వృత్తులు లే నప్పుడు, రహస్యమున నా యం దైక్యము గమ్మని పిలిచేడు. (ఉపనిషత్ ప్రమాణం – చిదేవాహం చిదేవత్వం సర్వ మే త చ్చిదేవహి.)

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=321

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, May 24, 2018

శ్రీకృష్ణ లీలలు - 17

10.1-318-క.
కొడుకులు లేరని యొక సతి
కడు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం
గొడుకులు గలిగెద రని పైఁ
బడినాఁ డిది వినుము శిశువు పనులే? తల్లీ!
10.1-319-క.
"తలఁగినదానం దల" మనఁ
దలఁగక యా చెలికి నాన తలయెత్తఁగ "నీ
తలఁగిన చోటెయ్యది" యని
తల యూఁచెన్ నీ సుతుండు తగవె? మృగాక్షీ!


భావము:
ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే “అపుత్రస్య గతిర్నాస్తిః” అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, “నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు” అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.
అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల బాల్యచేష్టలను చేస్తున్నాడు. చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు” అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బహిష్ఠు అయిన చోటేది” అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Tuesday, May 22, 2018

శ్రీకృష్ణ లీలలు - 16

10.1-316-క.
చేబంతి దప్పి పడెనని 
ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుకన్
మా బిడ్డ జలక మాడఁగ
నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?
10.1-317-క.
ఇచ్చెలువఁ జూచి "మ్రుచ్చిలి
యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద; నాతో
వచ్చెదవా?" యని యనినాఁ
డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే?

భావము:
ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా! ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా” అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=316

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 15

10.1-314-క.
వెన్నఁ దినఁగఁ బొడగని మా
పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్
జన్నొడిసి పట్టి చీఱెనుఁ
జిన్ని కుమారుండె యితఁడు? శీతాంశుముఖీ!
10.1-315-క.
ఇమ్మగువ దన్ను వాకిటఁ 
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె
నమ్మా! యీ ముద్దుగుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా.


భావము:
చంద్రముఖీ! యశోదమ్మా! మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డంవెళ్ళి ఇవతలకి లాగింది. మీ వాడు మా పడచుపిల్ల రొమ్ముమీద గోళ్ళతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్ళా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా! ఇవి పసిపిల్లలు చేసే పనులా. ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓ యమ్మో! మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Sunday, May 20, 2018

శ్రీకృష్ణ లీలలు - 14

10.1-312-క.
వా రిల్లు చొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!
10.1-313-క.
"వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వ" రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.


భావము:
ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా? ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరున్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Saturday, May 19, 2018

శ్రీకృష్ణ లీలలు - 13

10.1-310-మత్త.
పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ!
10.1-311-క.
ఆడం జని వీరల పెరు
గోడక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!

భావము:
ఓ సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు. లత వలె సున్నితమైన దేహం గల సుందంరాంగీ యశోదా! నీ కొడుకు అలా వెళ్ళి, వీళ్ళ ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూపోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులిమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=311

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 12

10.1-308-క.
పడఁతీ! నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పా లా
పడుచులకుఁ బోసి చిక్కిన
కడవలఁ బో నడిచె నాజ్ఞ కలదో లేదో?
10.1-309-క.
మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్
గోపింపఁ బిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ!


భావము:
ఓ యశోదమ్మా! నువ్వు గొప్ప పడచుదానివే కాని, నీ పిల్లాడు చూడు; మా కుండలలో చక్కగా కాగిన పాలు ఉంటే, ఆ పాలను తోటిపిల్లలకు పోసేశాడు, ఆ పైన మిగిలిన కడవలను పగలగొట్టేశాడు. మీ వాడికి భయభక్తులు చెప్తున్నారో, లేదో మరి. ఓ యమ్మా! మీ అబ్బాయికి మా యింట్లో తాగటానికి సరిపడగ పాలు కనబడలేదు. దానితో కోపించి పసిపిల్లలను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా ఇదేమైనా బాగుందా చెప్పు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Wednesday, May 16, 2018

శ్రీకృష్ణ లీలలు - 11

10.1-306-వ.
మఱియు నా కుమారశేఖరుండు కపట శైశవంబున దొంగజాడలం గ్రీడింప గోపిక లోపికలు లేక యశోదకడకు వచ్చి యిట్లనిరి.
10.1-307-క.
“బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

భావము:
ఇంకను ఆ మాయామాణవబాలకుడు శ్రీకృష్ణుడు మాయా శైశవ లీలలలో క్రీడిస్తుంటే, గోకులంలోని గోపికలు ఓపికలు లేక, తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుని అల్లరి చెప్పుకోసాగారు. కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోవటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడనుల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=307

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, May 15, 2018

శ్రీ కృష్ణ లీలలు - 10

10.1-304-వ.
మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు.
10.1-305-సీ.
"గోవల్లభుఁడ నేను; గోవులు మీ" రని; 
వడి ఱంకె వైచుచు వంగి యాడు; 
"రాజు నే; భటులు మీరలు రండురం" డని; 
ప్రాభవంబునఁ బెక్కు పనులుపనుచు; 
"నేఁదస్కరుండ; మీరింటివా" రని నిద్ర; 
పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు; 
"నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు"; 
లని చెలంగుచు నాటలాడఁ బెట్టు;
10.1-305.1-తే.
మూల లుఱుకును; డాఁగిలిమూఁత లాడు; 
నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు; 
జార చోరుల జాడలఁ జాల నిగుడు; 
శౌరి బాలురతో నాడు సమయమందు. 


భావము:
మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు. “నేను ఆబోతును, మీరందరు ఆవులు” అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజును, “మీరు అందరు నా భటులు” అంటు, అధికారం చూపుతు వాళ్ళతో ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. “నేను దొంగను మీరు గృహస్థులు” అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. “మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వం చేసే సూత్రధారుడను” “నేను తోలుబొమ్మ లాడించే వాడిని, మీరు రకరకాల పాత్రల ధరించే తోలు బొమ్మలు” అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. తిరుగుబోతులా, దొంగలా రకరకాల పోకిళ్ళు పోతాడు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
శ్రీ కృష్ణ లీలలు - 10

10.1-304-వ.
మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు.
10.1-305-సీ.
"గోవల్లభుఁడ నేను; గోవులు మీ" రని; 
వడి ఱంకె వైచుచు వంగి యాడు; 
"రాజు నే; భటులు మీరలు రండురం" డని; 
ప్రాభవంబునఁ బెక్కు పనులుపనుచు; 
"నేఁదస్కరుండ; మీరింటివా" రని నిద్ర; 
పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు; 
"నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు"; 
లని చెలంగుచు నాటలాడఁ బెట్టు;
10.1-305.1-తే.
మూల లుఱుకును; డాఁగిలిమూఁత లాడు; 
నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు; 
జార చోరుల జాడలఁ జాల నిగుడు; 
శౌరి బాలురతో నాడు సమయమందు. 


భావము:
మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు. “నేను ఆబోతును, మీరందరు ఆవులు” అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజును, “మీరు అందరు నా భటులు” అంటు, అధికారం చూపుతు వాళ్ళతో ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. “నేను దొంగను మీరు గృహస్థులు” అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. “మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వం చేసే సూత్రధారుడను” “నేను తోలుబొమ్మ లాడించే వాడిని, మీరు రకరకాల పాత్రల ధరించే తోలు బొమ్మలు” అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. తిరుగుబోతులా, దొంగలా రకరకాల పోకిళ్ళు పోతాడు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Monday, May 14, 2018

శ్రీకృష్ణ లీలలు - 9

10.1-302-ఉ.
చప్పుడు చేయకుండు మని జంకె యొనర్చిన నల్గిపోవఁగా
నప్పుడు బార చాఁచి తన యర్మిలి విందులు వచ్చి రంచు న
వ్వొప్పఁగఁ జీరు తల్లి దెస కొత్తిలి కృష్ణుఁడు రంతు జేయుచు
న్నెప్పటియట్ల చన్గుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయఁగన్.
10.1-303-క.
వల్లవగృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి, యెఱుఁగని భంగిం
దల్లిఁ గదిసి చిట్టాడుచు,
నల్లనఁ జను "బువ్వఁ బెట్టు మవ్వా!" యనుచున్.

భావము:
ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. తల్లి యశోద అల్లరి చేయవద్దని బెదిరిస్తే, కొంటె కృష్ణుడు కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. అది చూసి “నా కన్నతండ్రి! రా ప్రియ చెలికాళ్ళు వచ్చారు” అంటు చేతులు చాపి పిలవగానే పరిగెత్తుకుంటు తల్లి దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగా చనుబాలు త్రాగుతాడు. అలా అల్లరి చేస్తూ పరుగెడుతుంటే, మొలతాడుకు కట్టిన చిరుగంట ఘల్లుఘల్లున మ్రోగుతుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది. గోపికల ఇళ్ళల్లో వెన్నంతా తిని యింటికి వచ్చి, అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా తల్లి పక్కకి చేరతాడు. "అమ్మా బువ్వ పెట్టు" అంటు ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=40&padyam=303

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, May 13, 2018

శ్రీకృష్ణ లీలలు - 8

10.1-300-క.
తన యీడు గోపబాలురు
తనుఁ గొలువఁగ రాముఁ గూడి తనువు గలుగుచుం
దను గమనంబులఁ గృష్ణుఁడు
తనుమధ్యలు మెచ్చ నీల తనురుచి మెఱసెన్.
10.1-301-వ.
మఱియు నా కుమారుండు దినదినంబునకు సంచార సంభాషణ దక్షుండై.


భావము:
బాలకృష్ణుడు అన్న బలరామునితో చిన్నచిన్న అడుగులు వేస్తూ ఆడుకుంటు ఉంటే, తన యీడు గల గొల్లపిల్లవాళ్ళు అతని చుట్టూ చేరి ఆడుకునేవారు. అతడే తమ నాయకుడు అన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. చల్లని వర్తనలు చూసి మందలోని మగువలు చూసి మెచ్చుకునే అతని నీల దేహకాంతి మెరుస్తున్నది.ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
Saturday, May 12, 2018

శ్రీకృష్ణ లీలలు - 7

10.1-298-క.
ఆ పాపల విహరణములు
తీపులు పుట్టింప మరగి తేఁకువ లే కా
గోపాలసతులు మక్కువ
నే పనులును మఱచి యుండి రీక్షణపరలై.
10.1-299-వ.
ఆ సమయంబున బాలకుల తల్లులు గోఱ గోరు కొమ్ములు గల జంతువులవలన నేమఱక, జలదహనకంటకాదుల యెడ మోసపోక, బాలసంరక్షణంబు జేయుచు నుల్లంబుల మొల్లంబు లైన ప్రేమంబు లభిరామంబులు గా విహరించుచుండి రంత.

భావము:
బలభద్ర కృష్ణుల బాల్యక్రీడలు ఆ మందలోని గోపికలకు మధుర మధురంగా కనిపిస్తున్నాయి. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరచిపోయి, అదురు బెదురు లేకుండా ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తు ఉండిపోయారు. బలరామకృష్ణులు శైశవలీలలు ప్రదర్శిస్తున్న సమయంలో, వారి తల్లులు రోహిణి, యశోదలు చక్కని జాగ్రత్తలతో ఆ బాలురను పెంచుతు వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు ఉన్న జంతువులనుండి; నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండ జాగ్రత్త పడ్డారు. హృదయాలలో బాలకుల యెడ ప్రేమానురాగాలు ఉప్పొంగుతు ఉండగా ఆనందంగా కాలం గడుపుతున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=39&padyam=299

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, May 11, 2018

శ్రీ కృష్ణ లీలలు - 6

10.1-296-వ.
మఱియును.
10.1-297-సీ.
తనువున నంటిన ధరణీపరాగంబు; 
పూసిన నెఱిభూతి పూఁత గాఁగ; 
ముందల వెలుగొందు ముక్తాలలామంబు; 
తొగలసంగడికాని తునుక గాఁగ; 
ఫాలభాగంబుపైఁ బరగు కావిరిబొట్టు; 
కాముని గెల్చిన కన్ను గాఁగఁ; 
గంఠమాలికలోని ఘననీల రత్నంబు; 
కమనీయ మగు మెడకప్పు గాఁగ;
10.1-297.1-ఆ.
హారవల్లు లురగహారవల్లులు గాఁగ; 
బాలలీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.


భావము:
అంతే కాకుండా... ఆ శ్రీపతి అపరావతారమైన బాలకృష్ణుడు ఎదగకుండానే పెద్దవాడైన ప్రౌఢబాలకుడు. హరి హరులకు భేదం లేదు ఇద్దరు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆటపాటల సమయాలలో పరమశివుని వలె కనిపించేవాడు. ఎలా అంటే. దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. యశోద ముత్యాలపేరుతో ఉంగరాలజుట్టు పైకి మడిచి ముడివేసింది. అది శంకరుని తలపై ఉండే చంద్రవంకలా కనబడసాగింది. నుదుట పెట్టిన నల్లని అగులు బొట్టు ముక్కంటి మూడవకన్నులా అగబడసాగింది. మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద ఇంద్రనీల మణి, ఈశ్వరుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలా కనబడేది, మెళ్ళోవేసిన హారాలు సర్పహారాలుగా కనబడుతున్నాయి. అలా చిన్ని కృష్ణుడు శివునిలా కనబడుతున్నాడు. ఆ కాలపు వీరశైవ వీరవైష్ణవ భేదాలను పరిహరించిన విప్లవ కవి, ప్రజాకవి మన బమ్మెర పోతనామాత్యుల వారు.: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
శ్రీకృష్ణ లీలలు - 5

10.1-294-క.
అవ్వల నెఱుఁగక మువ్వురి
కవ్వల వెలుఁగొందు పరముఁ డర్భకుఁడై యా
యవ్వలకు సంతసంబుగ
నవ్వా! యవ్వా! యనంగ నల్లన నేర్చెన్.
10.1-295-క.
అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్నుమిన్ను నలమిన బాలుం
డడుగిడఁ దొడఁగెను శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడు గవనిఁబడన్.

భావము:
బ్రహ్మ విష్ణు మహేశ్వరులగు త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే శ్రీమన్నారాయణుడు జన్మలు లేని వాడు గనుక తనకు అమ్మ అంటు ఎవరు లేరు. జగత్తు అంతటికి తనే అమ్మ. అంతటి పరమపురుషుడు యశోదమ్మ కొడుకై గోపెమ్మలు అందరికి ఆనందం కలిగేలా అమ్మా అమ్మా అనటం నేర్చాడు. 
సర్వకారణమై నిష్కారణమై వెలుగు పరబ్రహ్మము ఆత్మావైపుత్రానామాసీత్ అని శ్రుతి కనుక జగత్తునకు మాతృస్థానమైన తానే పుత్రరూపమై జన్మించి అమ్మా అమ్మా అనసాగాడు. అవ్వ అవ్వ అని వేసిన పంచకంచే మాతృత్వ విలువ చెప్పబడుతోందా? ఆదిపరాశక్తితో అబేధం చెప్పబడుతోందా?“సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్” అనగా విష్ణుమూర్తి సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు. అలా వేయి అడుగులు కలిగిన వాడు. ఇక్కడ వేయి, సహస్రం అంటే అనంతమని గ్రహించదగును. వామనావతారుడై బలిచక్రవర్తి నుండి మూడడుగుల భూమి యాచించి, రెండు అడుగులలో భూమిని ఆకాశాన్ని ఆవరించిన వాడు. అట్టి పరమాత్మ ఇలా శ్రీకృష్ణబాలకుడై తప్పటడుగులు వేయ నారంభించాడు. ఆయన అడుగులు వేయటం చూసి దుష్టులు కాళ్ళు కీళ్ళు జారిపోయి అధమ బుద్దులు, సణుగుళ్ళు వదిలేసి క్రింద నేలపై పడి అణగిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=39&padyam=295

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :