Friday, February 13, 2015

7-169 కమలాక్షు నర్చించు

7-169-సీ.
మలాక్షు నర్చించు రములు కరములు;
 శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
 శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
 ధువైరిఁ దవిలిన నము మనము;
గవంతు వలగొను దములు పదములు;
 పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
తే.
దేవదేవుని చింతించు దినము దినము;
క్రహస్తునిఁ బ్రకటించు దువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
            నాన్నగారు! పద్మాక్షుని పూజించే చేతులు మాత్రమే చేతులు అన దగ్గవి. లక్ష్మీశుని కీర్తించే నాలుకే నాలుక అన దగ్గది. దేవేశుని చూసే చూపులనే చూపు లనవచ్చు. నారాయణుని మొక్కే శిరస్సు మాత్రమే శిరస్సు. హరిని వినిపించే చెవులే చెవులు. మాధవుని యందు లగ్న మయ్యే మనస్సు మాత్రమే మనస్సు అన దగ్గది. భగవంతునికి ప్రదక్షిణలు చేసే అడుగులే అడుగులు. ఆదిపురుషుని మీద లగ్న మయ్యే బుద్ధిమాత్రమే సద్బుద్ధి. పరదేవుని ధ్యానించే రోజు మాత్రమే మంచిరోజు. చక్రపాణిని తెలియజెప్పేది మాత్రమే అసలైన విద్య. విశ్వంభరుని వివరించే వాడే సద్గురువు. వైకుంఠుని దగ్గరకు పొమ్మనే వాడే మంచి తండ్రి. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.
            గురువుల ఆశ్రమంనుండి వచ్చిన ప్రహ్లాదుని గురువులు చండామార్కులు వద్ద ఏమేమి విద్యలు నేర్చుకున్నావు అని లాలనగా అడిగాడు. భక్తిమార్గాన్ని కన్నతండ్రికి ప్రియ నందనుడైన ప్రహ్లాదుడు తెలియచెప్తున్నాడు. విష్ణుమూర్తిని 12 నామాలతో స్మరించే ఈ పద్యం తెలుగు వారికి అందించిన అద్భుతమైన పాఠం. ఇలా అయిదేండ్ల బాలుని నోట ఇంతటి ఆధ్యాత్మిక తత్వాలు ఎంత అలవోకగా పలికించాడో మహానుభావుడు మన పోతనామాత్యులు.
7-169-see.
kamalaakShu narchiMchu karamulu karamulu;
 shreenaathu varNiMchu jihva jihva;
surarakShakuniM~ joochu chooDkulu chooDkulu;
 shEShashaayiki mrokku shiramu shiramu;
viShNu naakarNiMchu veenulu veenulu;
 madhuvairiM~ davilina manamu manamu;
bhagavaMtu valagonu padamulu padamulu;
 puruShOttamuni meeM~di buddhi buddhi;
tE.
dEvadEvuni chiMtiMchu dinamu dinamu;
chakrahastuniM~ brakaTiMchu chaduvu chaduvu;
kuMbhineedhavuM~ jeppeDi guruM~Du guruM~Du;
taMDri! hariM~ jEru maniyeDi taMDri taMDri.
          కమలాక్షున్ = నారాయణుని {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; అర్చించు = పూజించెడి; కరములు = చేతులే; కరములు = చేతులు; శ్రీనాథున్ = నారాయణుని {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవికి) నాథుడు (భర్త), విష్ణువు}; వర్ణించు = స్తోత్రము చేసెడి; జిహ్వ = నాలుకే; జిహ్వ = నాలుక; సురరక్షకునిన్ = నారాయణుని {సుర రక్షకుడు - సుర (దేవతలకు) రక్షకుడు, విష్ణువు}; చూచు = చూచెడి; చూడ్కులు = చూపులే; చూడ్కులు = చూపులు; శేషశాయి = నారాయణుని {శేషశాయి - శేష (ఆదిశేషుని)పై శాయి (శయనించువాడు), విష్ణువు}; కిన్ = కి; మ్రొక్కు = నమస్కరించెడి; శిరము = తలయే; శిరము = తల; విష్ణున్ = నారాయణుని {విష్ణువు - సర్వమునందు వ్యాపించువాడు, హరి}; ఆకర్ణించు = వినెడి; వీనులు = చెవులే; వీనులు = చెవులు; మధువైరిన్ = నారాయణుని {మధు వైరి - మధు యనెడి రాక్షసుని వైరి (శత్రువు), విష్ణువు}; తవిలిన = లగ్నమైన; మనము = చిత్తమే; మనము = చిత్తము; భగవంతున్ = నారాయణుని; వలగొను = ప్రదక్షిణలు చేసెడి; పదములు = అడుగులే; పదములు = అడుగులు; పురుషోత్తముని = నారాయణుని {పురుషోత్తముడు పురుషు లందరిలోను ఉత్తముడు, విష్ణువు}; మీది = మీద గల; బుద్ధి = తలపే; బుద్ధి = తలపు.
దేవదేవుని = నారాయణుని {దేవ దేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; చింతించు = ధ్యానించు; దినము = రోజే; దినము = రోజు; చక్రహస్తుని = నారాయణుని {చక్ర హస్తుడు - చక్రాయుధము హస్తుడు (చేతిలోగలవాడు), విష్ణువు}; చదువు = చదువే; చదువు = చదువు; కుంభినీధవున్ = నారాయణుని {కుంభునీ ధవుడు - కుంభినీ (భూదేవి కి) (వరాహాతారమున) ధవుడు (భర్త), విష్ణువు}; చెప్పెడి = చెప్పెడి; గురుడు = గురువే; గురుడు = గురువు; తండ్రి = తండ్రి; హరిన్ = నారాయణుని; చేరుము = చేరుము; అనియెడి = అనెడి; తండ్రి = తండ్రియే; తండ్రి = తండ్రి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

1 comment:

Anand Rao Devalkar said...

పోతనామాత్యుడు అందించిన రసగులిక. మధురమైన లాలిత్యం కలిగిన a పథ్యమెంత హృధ్యం