:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-668-వ.
ఇట్లు దుష్టజన దండధరావతారుండైన హరి వడి గలిగిన
పడగల మీఁదఁ దాండవంబు సలుప,
బెండుపడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబు లుమియుచుఁ
గన్నుల విషంబు గ్రక్కుచు నుక్కుచెడి చిక్కి దిక్కులుచూచుచుఁ గంఠగతప్రాణుండై
ఫణీంద్రుండు తన మనంబున.
10.1-669-ఉ.
"వేలుపులైన లావుచెడి వేదనఁ బొందుచు నా విషానల
జ్వాలలు సోఁకినంతటన చత్తురు; నేడిది యేమి చోద్య? మా
భీలవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ
బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడున్.
జ్వాలలు సోఁకినంతటన చత్తురు; నేడిది యేమి చోద్య? మా
భీలవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ
బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడున్.
టీకా:
ఇట్లు = ఇలాగున; దుష్ట = చెడ్డ; జన =
వారి యెడల; దండధర = యముని; అవతారుండు
= రూపుదాల్చినవాడు; ఐన = అయిన; హరి =
కృష్ణుడు; వడి = బిగువు; కలిగిన
= ఉన్న; పడగల = పాముపడగల; మీదన్
= పైన; తాండవంబు = ఉధృతమైన నాట్యమును; సలుపన్ = చేయుచుండగా; బెండుపడి = నిస్సారుడై; ఒండొండ = క్రమముగా; ముఖంబులన్
= ముఖములనుండి; రక్త = రక్తము; మాంసంబులు
= మాంసములు; ఉమియుచున్ = కక్కుతు; కన్నులన్ = కన్నులనుండి; విషంబున్ = విషమును; క్రక్కుచున్ = కక్కుతు; ఉక్కుచెడి = బలహీనపడి; చిక్కి = కృశించి; దిక్కులు
= ఇటునటు; చూచుచున్ = చూస్తు; కంఠ =
కుత్తుకయందు; గత = ఉన్న; ప్రాణుండు
= ప్రాణములు కలవాడు; ఐ = అయ్యి; ఫణీంద్రుడు
= సర్పరాజు; తన = తన యొక్క; మనంబున
= మనసులో.
వేలుపులు = దేవతలు; ఐనన్ = అయినను; లావు =
శక్తి; చెడి = నశించి; వేదనన్
= సంకటమును; పొందుచున్ = పొందుచు; నా = నా యొక్క; విష =
విషము అనెడి; అనల = అగని; జ్వాలలు
= మంటలు; సోకినన్ = తాకిన; అంతటనన్
= మాత్రముచేతనే; చత్తురు = చనిపోయెదరు; నేడు = ఇవాళ; ఇది =
ఇది; ఏమి = ఏమిటి; చోద్యము
= విచిత్రము; ఆభీల = భయంకరమైన; విష =
విషమనెడి; అగ్ని = అగ్నిచేత; హేతి =
దెబ్బల; చయ = అనేకము యొక్క; పీడ =
బాధ; కున్ = కు; ఓర్చియున్
= తట్టుకొనుటేకాక; క్రమ్మఱంగ = మరల; ఈ = ఈ
యొక్క; బాలుడు = చిన్నపిల్లవాడు; మత్ = నా యొక్క; ఫణా =
పడగల; శతమున్ = నూటిని, సమూహమును; భగ్నము = నలిగిపోయినవి; కాన్ = అగునట్లు; వెసన్
= వేగముగా; త్రొక్కి = తొక్కి; ఆడెడున్
= నృత్యముచేస్తున్నాడు.
భావము:
ఈ విధంగా దుర్మార్గుల పాలిటి కాలయముడైన
కృష్ణుడు కాళియుడి బిగువైన పడగలపై ప్రచండ తాండవం చేసాడు; దానితో కాళియుడు బలహీనుడైపోయాడు. ఒక్కొక్క
నోటినుండి రక్తమాంసాలు కక్కుతున్నాడు. కళ్ళల్లోంచి విషం ఉబుకుతోంది. పౌరుషం
చెడిపోయింది. బాగా నీరసించిపోయాడు. ప్రాణాలు గొంతులోకి వెళ్ళుకొచ్చేశాయి. దిక్కులు
చూస్తు కాళియుడు తనలో తాను ఇలా అనుకొన్నాడు.
“నా
విషాగ్ని జ్వాలలు సోకితే చాలు, దేవతలైనా సరే శక్తి
నశించిపోయి గిలగిలకొట్టుకొని చచ్చిపోతారు. అలాంటిది ఇవేళ ఈ బాలుడు క్రూరమైన
నావిషాగ్ని జ్వాలల తాకిడి ధాటికి తట్టుకొన్నాడు. పైగా నా నూరు పడగలను
చితకతొక్కేస్తూ నాట్యంచేసేస్తున్నాడు కూడ. ఇదేమి విచిత్రమో?
No comments:
Post a Comment