Friday, February 24, 2017

వామన వైభవం - 126:



8-681-వ.
ఇ వ్విధంబున వామనుం డయి హరి బలి నడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుం డయి యొసంగె; న త్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి, పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు "వామనుండు వల్లభుం" డని నియమించి యంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవత లకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు "నుపేంద్రుండు ప్రధానుం" డని సంకల్పించె నా సమయంబున.
8-682-క.
కమలజుఁడు లోకపాలురు
నమరేంద్రునిఁగూడి దేవయానంబున న
య్యమరావతికిని వామను
నమరం గొనిపోయి రంత నట మీఁద నృపా!

టీకా:
ఈ = ఈ; విధంబునన్ = విధముగ; వామనుండు = పొట్టివాడుగ; అయి = అవతరించి; హరి = విష్ణువు; బలిన్ = బలిని; అడిగి = కోరి; మహిన్ = భూమిని; పరిగ్రహించి = తీసుకొని; తన = తన; కున్ = కు; అగ్రజుడు = అన్న {అగ్రజుడు - అగ్ర (ముందుగా) జుడు (పుట్టినవాడు), అన్న}; అగు = అయిన; అమరేంద్రున్ = దేవేంద్రుని; కున్ = కి; త్రిదివంబున్ = స్వర్గమును {త్రిదివము - ముల్లోకములు భూఃభువస్సువః లో మూడవది, స్వర్గము}; సదయుండు = దయ కలవాడు; అయి = ఐ; ఒసంగెన్ = ఇచ్చెను; ఆ = ఆ; తరిన్ = సమయమునందు; దక్ష = దక్షుడు; భృగు = భృగువు; ప్రముఖ = మున్నగు; ప్రజాపతులును = ప్రజాపతులు {ప్రజాపతి - ప్రజ (సంతానసృష్టికి) పతి, బ్రహ్మ, వీరు 9మంది, నవబ్రహ్మలు}; భవుండును = పరమశివుడు {భవుడు - భవముతానైన వాడు, శివుడు}; కుమారుండును = కుమారస్వామి; దేవర్షి = దేవఋషులు; పితృగణంబులును = పితృగణములు; రాజులును = రాజులు; తానును = తను; కూడికొని = కలిసి; చతురాననుండు = బ్రహ్మదేవుడు; కశ్యపున్ = కశ్యపున; కును = కు; అదితి = అదితి; కిన్ = కి; సంతోషంబు = సంతోషము; కాన్ = అగునట్లు; లోకంబుల్ = సర్వలోకముల; కున్ = కు; లోకపాలుర = సమస్తలోకపాలకుల; కున్ = కు; వామనుండు = వామనుడు; వల్లభుండు = ప్రభువు; అని = అని; నియమించి = నిర్ణయించెను; అంత = అంతట; ధర్మంబున్ = ధర్మమున; కున్ = కు; యశంబున్ = యశస్సున; కున్ = కు; లక్ష్మి = సంపదల; కిన్ = కు; శుభంబుల్ = శుభముల; కున్ = కు; దేవతల్ = దేవతల; కున్ = కు; వేదంబుల్ = వేదముల; కున్ = కు; వ్రతంబుల్ = వ్రతముల; కున్ = కు; స్వర్గ = స్వర్గము; అపవర్గంబుల్ = మోక్షముల; కును = కు; ఉపేంద్రుండు = వామనుడే {ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు, వామనుడు}; ప్రధానుండు = అధికారి; అని = అని; సంకల్పించెను = నిర్ణయించెను; ఆ = ఆ; సమయంబున = సమయమునందు. కమలజుడు = బ్రహ్మదేవుడు {కమలజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మ}; లోకపాలురున్ = లోకపాలకులును; అమరేంద్రుని = దేవేంద్రునితో; కూడి = కలిసి; దేవయానంబునన్ = ఆకాశగమనమున; ఆ = ఆ; అమరావతి = అమరావతి; కిని = కి; వామనున్ = వామనుని; అమరన్ = ఆదరముతో; కొనిపోయిరి = తీసుకెళ్ళిరి; అంతనటమీద = అటుతరువాత; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.

భావము:
ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి, బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు; శివుడు; కుమారస్వామి; నారదుడు మున్నగు దేవర్షులు; పిత్రుదేవతలు; రాజులుతో పాటు కలిసి బ్రహ్మదేవుడు లోకాలకూ దిక్పాలకులకూ వామనుడు ప్రభువు అని శాసనం చేసాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట, ధర్మానికి కీర్తికీ సంపదలకూ శుభాలకూ దేవతలకూ వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి అని నిర్ణయించాడు. పరీక్షన్మహారాజా! అటుపిమ్మట బ్రహ్మదేవుడూ దిక్పాలకులూ దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=85&Padyam=682

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: