Tuesday, February 14, 2017

వామన వైభవం - 116:

8-662-శా.
బద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై
సిద్ధైశ్వర్యముఁ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యముం గరుణయున్ సొంపేమియుం దప్పఁ డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే.
8-663-ఆ.
అసురనాథుఁ డనుచు ననఘుని మర్యాద
యేను జూత మనుచు నింత వలుక
నిజము పలికె నితఁడు నిర్మలాచారుండు
మేలుమేలు నాకు మెచ్చువచ్చు.

టీకా:
బద్దుండు = బంధింపబడినవాడు; ఐ = అయ్యి; గురు = గురువు యొక్క; శాప = శాపమువలన; తప్తుడు = తపించువాడు; అయి = ఐ; తాన్ = అతను; బంధు = బంధువుల; వ్రజ = సమూహములచే; త్యక్తుడు = విడువబడినవాడు; ఐ = అయ్యి; సిద్ధ = ప్రాప్తించిన; ఐశ్వర్యమున్ = సంపదలు; కోలుపోయి = నశించి; విభవ = ప్రాభవములు; క్షీణుండున్ = నశించినవాడు; ఐ = అయ్యి; పేద = పేదవాడు; ఐ = అయ్యి; శుద్దత్వంబునన్ = స్వచ్ఛతను; సత్యమున్ = సత్యమును; కరుణయున్ = దయను; సొంపున్ = ప్రసన్నతలను; ఏమియున్ = ఏమాత్రము; తప్పడు = విడువలేదు; ఉద్బుద్ధుండు = జ్ఞాని; ఐ = అయ్యి; యజయాఖ్య = గెలువసాధ్యముకాని; మాయన్ = మాయను; గెలిచెన్ = జయించెను; పుణ్యుడు = పుణ్యాత్ముడు; ఇతడు = ఇతగాడు; అల్పుడే = తక్కువవాడా కాదు.
అసుర = రాక్షసులకు; నాథుడు = రాజు; అనుచున్ = అనుచు; అనఘుని = పుణ్యుని; మర్యాద = మంచినడవడిని; ఏను = నేను; చూతము = పరీక్షించెదము; అనుచున్ = అనుకోనగా; ఇంతవలుక = ఇంతవరకు; నిజమున్ = సత్యమునే; పలికెన్ = పలికెను; ఇతడు = ఇతను; నిర్మల = నిర్మలమైన; ఆచారుండు = నడవడికగలవాడు; మేలుమేలు = చాలామంచిది; నా = నా; కున్ = కు; మెచ్చు = మెప్పుగొలుపుతున్నది;

భావము:
ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపంవలన పరితాపానికి గురయ్యాడు. బంధువులనుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్నీ కోల్పోయి పేదవాడు అయ్యాడు. ఐనా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని దయనూ సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞానియై గెలవడానికి సాధ్యంకాని మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు. ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకూ ఊరకున్నాను. ఇతడు మంచి నడవడి కలవాడు; సత్యవాది; మేలు మేలు ఈతనిప్రవర్తన నాకు మెప్పుకలుగుచున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=83&Padyam=663

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: