8-668-క.
దానవ దైత్యుల సంగతిఁ
బూనిన నీ యసురభావమును దోడ్తో మ
ద్ధ్యానమునఁ దలఁగి పోవును
మానుగ సుతలమున నుండుమా మా యాజ్ఞన్.
8-669-వ.
అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుఁ పలుకుఁ జెఱకు రసంపుసోనలు వీనుల తెరువులం జొచ్చి లోను బయలు నిండి ఱెప్పల కప్పు దప్పం ద్రోచికొని కనుఁ గవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఱవ, నురః ఫలకంబునం బులకంబులు కులకం బులయి తిలకంబు లొత్తఁ, గేలు మొగిడ్చి నెక్కొన్న వేడుకం ద్రొక్కుడు పడుచుఁ జిక్కని చిత్తంబునఁ జక్కని మాటల రక్కసుల ఱేఁ డిట్లనియె.
టీకా:
దానవ = దానవుల {దానవులు - కశ్యపునకు దనువు వలన కలిగిన పుత్రులు, రాక్షసులు}; దైత్యుల = దైత్యుల {దైత్యులు - కశ్యపునకు దితి వలన కలిగిన పుత్రులు, రాక్షసులు}; సంగతిన్ = తోకూడుటవలన; పూనిన = కలిగిన; నీ = నీ యొక్క; అసురభావమున్ = రాక్షసత్వమును; తోడ్తోన్ = వెంటనే; మత్ = నా యొక్క; ధ్యానమునన్ = ధ్యానమువలన; తలగిపోవును = తొలగిపోవును; మానుగ = మనోజ్ఞంగా, సంతోషంగా; సుతలమునన్ = సుతలమునందు; ఉండుమా = ఉండుము; మా = మేము; ఆజ్ఞన్ = చెప్పినట్లుగా.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = పలుకుచున్నట్టి; ముమ్మూర్తుల = త్రిమూర్తులందు; ముదుకవేల్పు = వృద్దదేవుని; తియ్యని = తియ్యటి; నెయ్యంపు = స్నేహపూరిత; పలుకున్ = మాటలు యనెడి; చెఱకురసంపు = చెరకురసముయొక్క; సోనలు = జల్లులు; వీనుల = చెవుల; తెరువులన్ = ద్వారా; చొచ్చి = ప్రవేశించి; లోను = లోపల; బయలున్ = బయట; నిండి = నిండిపోయి; ఱెప్పలన్ = కనురెప్పలను; తప్పందోచుకొని = తొలగదోసుకొని; కన్ను = కళ్లు; గవ = రెంటి (2); కొలంకులన్ = కొలకులు యనెడి; అలుగులున్ = కుళాయిలనుండి; వెడలిన = వెలువడిన; చందంబునన్ = విధముగ; సంతసంబునన్ = సంతోషమువలన; కన్నీరు = కన్నీరు; మున్నీరు = ప్రవాహములు; ఐ = అయ్యి; పఱవన్ = ప్రవంహించగా; ఉరఃఫలకంబునన్ = వక్షస్థలమునందు; పులకంబులున్ = పులకరింతలు; కులకంబులు = అంకురించినవి; అయి = అయ్యి; తిలకంబులొత్తన్ = అతిశయించినవికాగా; కేలు = చేతులు; మొగిడ్చి = జోడించి; ఎక్కొన్న = అధికమైన; వేడుకన్ = కుతుకముతో; త్రొక్కుడుపడుచు = తడబడుతు; చిక్కని = దృఢమైన; చిత్తంబునన్ = మనసుతో; చక్కని = చక్కటి; మాటలన్ = మాటలతో; రక్కసుల = రాక్షసుల; ఱేడు = రాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:
దైత్యదానవుల కలయికవలన నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడంవలన త్వరలో తొలగిపోతుంది. మా ఆజ్ఞప్రకారంగా సంతోషంగా సుతలంలో ఉండు.” ఇలా ప్రీతితో పరమాత్ముడు పలికిన తియ్యని మాటలు బలిచక్రవర్తి చెవులలో చెరకురసపు జల్లులవలే దూరి, లోపలా బయటా నిండాయి. సంతోష బాష్పాలు రెప్పల చాటునుండి త్రోసుకుంటూ కాలువలై వెలువడి ప్రవహించాయి. వక్షస్ధలమంతా పులకాంకురములు నిండాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించాడు. స్థిరమైన మనస్సుతో మెల్లగా ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=668
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment