Monday, February 13, 2017

వామన వైభవం - 115:

8-660-వ.
అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుం డిట్లనియె.
8-661-సీ.
ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని;
యఖిల విత్తంబు నే నపహరింతు
సంసార గురుమద స్తబ్దుఁడై యెవ్వఁడు;
దెగడి లోకము నన్ను ధిక్కరించు
నతఁ డెల్ల కాలంబు నఖిల యోనుల యందుఁ;
బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప
విత్త వయో రూప విద్యా బలైశ్వర్య;
కర్మ జన్మంబుల గర్వ ముడిగి
8-661.1-తే.
యేక విధమున విమలుఁడై యెవ్వఁ డుండు
వాఁడు నా కూర్చి రక్షింపవలయువాఁడు;
స్తంభ లోభాభిమాన సంసార విభవ
మత్తుఁడై చెడ నొల్లఁడు మత్పరుండు.

టీకా:
అని = అని; పలికిన = చెప్పిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వచనంబులు = మాటలు; విని = విని; భగవంతుండు = విష్ణుమూర్తి {భగవంతుడు - ఐశ్వర్యాదికములు కలుగుటచే పూజ్యుడైనవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. ఎవ్వనిన్ = ఎవిరినైతే; కరుణింపన్ = దయచూపవలెనని; నిచ్చయించితిని = అనుకొనెదనో; వానిని = వానిని; అఖిల = సమస్తమైన; విత్తంబున్ = సంపదలను; నేన్ = నేను; అపహరింతున్ = లాగుకొనెదను; సంసార = సంసారసంబంధమైన; గురు = పెద్ద; మద = మదము చేత {మదము - 1కొవ్వు 2గర్వము, అష్టవిధమదములు 1విత్త 2వయో 3రూప 4విద్యా 5బల 6ఐశ్వర్య 7కర్మ 8జన్మల సంబంధించిన మదములు}; స్తబ్దుడు = నిస్తేజుడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవడైతే; లోకమున్ = లోకమును; నన్ను = నన్ను; ధిక్కరించున్ = తిరస్కరించునో; అతడున్ = అతను; ఎల్ల = ఎంత; కాలంబున్ = కాలమైనను; అఖిల = అనేకరకములైన; యోనులన్ = గర్భముల; అందున్ = లో; పుట్టుచున్ = పుడుతూ; దుర్గతిన్ = నరకమును; పొందున్ = పొందును; పిదపన్ = తరవాత; విత్త = ధనము; వయో = యౌవనము; రూప = అందము; విద్యా = విద్యలు; బల = బలము; ఐశ్వర్య = సంపదలు; కర్మ = వృత్తి; జన్మంబులన్ = వంశముల; గర్వమున్ = గర్వములను; ఉడిగి = విడిచిపెట్టి.  ఏకవిధమున = ఏకాగ్రముగా; విమలుడు = నిర్మలుడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవరైతే; ఉండున్ = ఉండునో; వాడు = అతడు; నా = నాచేత; కూర్చి = ఇష్చపడి; రక్షింపన్ = కాపాడబడ; వలయున్ = వలసిన; వాడు = వాడు; స్తంభ = అజ్ఞానము; లోభ = అత్యాశ; అభిమాన = గర్వములతో; సంసార = లౌకిక; విభవ = ప్రాభవములతే; మత్తుడు = మదించినవాడు; ఐ = అయ్యి; చెడన్ = నశించుటకు; ఒల్లడు = అంగీకరించడు; మత్ = నాకు; పరుండు = చెందినవాడు.

భావము:
ఇలా విన్నవించిన బ్రహ్మదేవుడి మాటలు విని భగవంతుడు అగు వామనుడు ఇలా అన్నాడు. “ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో, వాడి సంపద అంతటిని అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కారిస్తుంటాడో, వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ, చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో, వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయినవాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకికసంపదలతో మదించి నశించడాన్ని ఆశించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=83&Padyam=661

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: