Saturday, February 18, 2017

వామన వైభవం - 120:

8-670-ఉ.
ఎన్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ
మన్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే?
పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపదఁ గల్గనేర్చునే?
8-671-వ.
అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందు ధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరి కృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె.

టీకా:
ఎన్నడున్ = ఎప్పుడు; లోక = లోకములను; పాలకులన్ = పరిపాలించెడివారినికూడ; ఈ = ఇంత; కృపన్ = దయతో; చూడని = చూడనట్టి; నీవు = నీవు; నేడు = ఇవాళ; నన్నున్ = నన్ను; ఉన్నతున్ = గొప్పవానినిగ; చేసి = చేసి; నా = నా యొక్క; బ్రతుకున్ = జీవితమును; ఓజయున్ = తేజస్సును; ఆనతియిచ్చు = కలుగజేసి; కాచితి = కాపాడితివి; ఈ = ఇట్టి; మన్ననలు = గౌరవించుటలు; ఈ = ఇట్టి; దయారసమున్ = కరుణ; మాటలు = మాటలు; పెద్దఱికంబున్ = మర్యాద; చాలవే = సరిపోవా, సరిపోవును; పన్నగతల్ప = శేషసాయి; నిన్నున్ = నిన్ను; ఎఱిగి = తెలిసి; పట్టినన్ = ఆశ్రయించినచో; ఆపద = కష్షము; కల్గనేర్చునే = కలుగగలవా, కలుగవు. అని = అని; పలికి = పలికి; హరి = విష్ణుని; కిన్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; ప్రణామంబు = నమస్కారము; చేసి = చేసి; ఇందుధరున్ = పరమశివుని; కిన్ = కి; వందనంబు = నమస్కారము; ఆచరించి = చేసి; బంధ = బంధములనుండి; విముక్తుడు = విడుదలైనవాడు; ఐ = అయ్యి; తనవారల = తనవారి; తోన్ = తోటి; చేరికొని = కలిసి; బలి = బలి; సుతలంబున్ = సుతలమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; హరి = విష్ణుని; కృపావశంబునన్ = దయవలన; కృతార్థుండు = ధన్యుడు; ఐ = అయ్యి; కుల = వంశమును; ఉద్దారకుండు = ఉద్దరించెడివాడు; అయిన = ఐన; మనుమని = మనుమడిని; కని = చూసి; సంతోషించి = సంతోషించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతున్ = విష్ణుని; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
శేషశాయి శయనా! శ్రీమహావిష్ణూ! నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడూ ఇంతటి దయచూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్ననా, ఈ కరుణా ఈ మాటల మర్యాదా నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించినవారికీ ఎన్నడూ కష్టాలు కలుగవు. ఇలా విష్ణమూర్తిని స్తుతించి, బలిచక్రవర్తి విష్ణువుకూ, బ్రహ్మదేవునకూ, చంధ్రశేఖరుడైన శివునికీ నమస్కరించాడు. బంధనం నుండి విడుదలపొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=670

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: