8-653-వ.
అని పలికి జగదీశ్వరుండును నిఖిలలోక సాక్షియు నగు నారాయణ దేవునకు నమస్కరించి, ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున.
8-654-మ.
తతమత్తద్విపయాన యై కుచ నిరుంధచ్ఛోళ సంవ్యానయై
ధృత భాష్పాంబు వితాన యై కరయుగాధీ నాలికస్థానయై
పతిబిక్షాం మమ దేహి కోమలమతే! పద్మాపతే! యంచుఁ ద
త్సతి వింద్యావళి చేరవచ్చెఁ ద్రిజగద్రక్షామనున్ వామనున్.
టీకా:
అని = అని; పలికి = పలికి; జగత్ = లోకములకు; అధీశ్వరుండును = ప్రభువు; నిఖిల = సమస్తమైన; లోక = లోకములకు; సాక్షియున్ = దర్శనుండు; అగు = అయిన; నారాయణ = విష్ణువు యనెడి; దేవున్ = దేవుని; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; పలుకుచున్న = పలుకుతున్నట్టి; సమయంబునన్ = సమయమునందు; తత్ = ఆ; మత్త = మదించిన; ద్విప = గజమువంటి; యాన = గమనముయామె; ఐ = అయ్యి; కుచ = వక్షస్థలమును; నిరుంధత్ = గట్టిగా; చోళ = పైటచెరగు; సంవ్యాన = చుట్టకొన్నామె; ఐ = అయ్యి; ధృత = కారిన; బాష్పాంబు = కన్నీటి; వితాన = సమూహములుకలామె; ఐ = అయ్యి; కర = చేతులు; యుగా = రెండును; అధీ = జోడించబడిన; అలికస్థాన = నుదుటిప్రదేశము కలామె; ఐ = అయ్యి; పతి = భర్త అను; బిక్షాన్ = బిక్షను; మమ = నాకు; దేహి = పెట్టుము; కోమలమతే = మృదువైనమనసుకలవాడ; పద్మాపతే = లక్ష్మీపతీ; అంచున్ = అనుచు; తత్ = ఆ; సతి = ఇల్లాలు; వింధ్యావళి = వింధ్యావళి; చేరన్ = దగ్గరకు; వచ్చెన్ = వచ్చెను; త్రిజగత్ = ముల్లోకములను; రక్ష = కాపాడుట; ఆమనున్ = సమృద్ధిగా కలవానిని; వామనున్ = వామనుని.
భావము:
లోకనాధుడూ లోకదర్సకుడూ అయిన విష్ణు దేవునకు ఇలా ప్రహ్లాదుడు నమస్కరించి ఇలా అన్నాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరగు బిగించుకుని ఉంది. రెండుచేతులనూ నుదిటిపై జోడించి “దయామయా! లక్ష్మీపతీ! నాకు పతిబిక్షపెట్టు” అంటూ ముల్లోకాలకూ ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=654
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment