Thursday, February 23, 2017

కాళియమర్దనము – అంతం గృష్ణుఁడు

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:

10.1-662-శా.
అంతం గృష్ణుఁడు మేను పెంప భుజగుం డావృత్తులం బాసి తా
సంప్తాయతభోగుఁ డై కఱచుటల్ చాలించి నిట్టూర్పుతో
శ్రాంతుండై తల లెత్తి దుర్విషము నాసావీథులం గ్రమ్మ దు
శ్చింతన్ దిక్కులు చూచుచుం దలఁగి నిల్చెన్ ధూమకాష్ఠాకృతిన్.
10.1-663-చ.
వె మఱలేని మేటి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్క చేఁ
చి ఖగేంద్రుచందమునఁ క్కన దౌడలు పట్టి కన్నులం
జొజొఱ దుర్విషానలము జొబ్బిలు చుండఁగ నెత్తి లీలతోఁ
జిజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్.

టీకా:
అంతన్ = ఆ తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; మేను = శరీరమును; పెంపన్ = పెంచగా; భుజగుండు = ఆ కాళియ సర్పము; ఆవృత్తులను = తన చుట్లను; పాసి = విడిచి; తాన్ = తను; సంతప్త = సంతాపముపొందిన; ఆయత = నిడుపాటి; భోగుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; కఱచుటలు = కరుచుట; చాలించి = ఆపి; నిట్టూర్పు = దీర్ఘశ్వాసల; తో = తో; శ్రాంతుడు = బడలినవాడు; ఐ = అయ్యి; తలలు = పడగలను; ఎత్తి = పైకెత్తి; దుర్ = చెడ్డ; విషమున్ = విషమును; నాసా = ముక్కురంధ్రముల; వీదులన్ = దారిని; క్రమ్మన్ = కమ్ముకొన; దుశ్చింతన్ = చెడు ఆలోచనలతో; దిక్కులున్ = ఇటునటు; చూచుచున్ = చూస్తు; తలగి = తొలగి; నిల్చెన్ = నిలబడెను; ధూమ = పొగతోటి; కాష్ఠ = కొఱవికట్టె; ఆకృతిన్ = లాగ.
వెఱ = బెదురు; మఱ = మరపు; లేని = లేనట్టి; మేటి = గొప్పవాడు; బలువీరుడు = మహాశూరుడు; కృష్ణకుమారుడు = బాలకృష్ణుడు; ఒక్క = ఒకేఒక్క; చేన్ = చేతితో; చఱచి = కొట్టి; ఖగేంద్రు = గరుత్మంతుని; చందమునన్ = వలె; చక్కన = చక్కగా; దౌడలు = రెండుదౌడలను; పట్టి = పట్టికొని; కన్నులన్ = కళ్ళమ్మట; జొఱజొఱ = జొఱజొఱ అను ధ్వనితో; దుర్ = చెడ్డ; విష = విషము అనెడి; అనలము = అగ్ని; జొబ్బిలిచుండగన్ = స్రవించుచుండగా; ఎత్తి = పైకెత్తి; లీల = విలాసము; తోన్ = తోటి; జిఱజిఱ = జిఱజఱ అను ధ్వనితో; త్రిప్పి = తిప్పి; వైచెన్ = విసిరివేసెను; పరిశేషిత = కొద్దిగమిగిలిన; దర్పము = మదముకలది; క్రూర = క్రూరమైన; సర్పమున్ = పామును.

భావము:
అప్పుడు కృష్ణుడు చటుక్కున తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళీయుడి చుట్టలు జారిపోయాయి. అతని పడగలు వేడెక్కిపోయాయి దేహం కమిలిపోయింది. కరవడం మానేసాడు. పొగచూరిన కట్టెలా తేజస్సుకోల్పోయిన నాగరాజు నిట్టూర్పులు వదుల్తూ బాగా కష్టపడి పడగలు పైకెత్తాడు. విషాన్ని విరజిమ్మే చెడ్డ ఉద్దేశంతో అటునిటు చూస్తు పక్కకి తొలగి నిల్చున్నాడు.
నదురు బెదురు లేని గొప్ప మహావీరుడైన బాలకృష్ణుడు ఒక అరచేత్తో కాళియుడి పడగల మీద ఒక చరుపు చరిచాడు. గరుత్మంతుడిలా దౌడలు రెండు పట్టుకొని పైకెత్తి గిరగిర తిప్పి విలాసంగా విసిరికొట్టాడు. కాళీయుని కళ్ళలోంచి దుష్ట విషాగ్నులు బుసుబుస పొంగి జరజర కారాయి. ఆ క్రూర మైన కాళియుడి గర్వమంతా అణగిపోయింది.

No comments: