Tuesday, February 28, 2017

త్రిపురాసుర సంహారం - 4:

7-392-వ.
ఇట్లు రక్కసులు దన వెనుకఁ జొచ్చిన మాయానిలయుండును దుర్ణయుండును నైన మయుండు దన విద్యాబలంబున నయోరజత సువర్ణమయంబులై యెవ్వరికిని లక్షింపరాని గమనాగమనంబులును వితర్కింపరాని కర్కశపరిచ్ఛదంబులును గలిగిన త్రిపురంబుల నిర్మించి యిచ్చిన, నక్తంచరు లందఱు నందుంబ్రవేశించి కామసంచారులై పూర్వవైరంబుఁ దలంచి సనాయకంబు లయిన లోకంబుల నస్తోకంబయిన నిజబలాతిరేకంబున శోకంబు నొందించిన.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; రక్కసులు = రాక్షసులు; తన = తన యొక్క; వెనుకన్ = ఆశ్రయమునకు; చొచ్చిన = చేరగా; మాయా = మాయలకు; నిలయుండును = నివాసమైనవాడు; దుర్ణయుండునున్ = చెడ్డనీతిగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; తన = తనయొక్క; విద్యా = యోగవిద్య యొక్క; బలంబునన్ = శక్తిచేత; అయస్ = ఇనుము; రజత = వెండి; సువర్ణ = బంగారములచే; మయంబులు = చేయబడినవి; ఐ = అయ్యి; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి యైనను; లక్షింప = ఛేదింప; రాని = శక్యముకాని; గమనాగమనంబులు = రాకపోకలుగలది; వితర్కింప = ఊహించుటకు; రాని = శక్యముకాని; కర్కశ = కఠినములైన; పరిచ్ఛదంబులును = రక్షా కవచములు,పరిజనము; కలిగిన = ఉన్నట్టి; త్రి = మూడు (3); పురంబులన్ = పురములను; నిర్మించి = తయారుచేసి; ఇచ్చినన్ = ఇవ్వగా; నక్తంచరులు = రాక్షసులు {నక్తంచరులు - నక్తన్ (రాత్రులందు) చరులు (తిరుగువారు), రాక్షసులు}; అందఱున్ = అందరు; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; కామసంచారులు = యధేచ్ఛగా తిరుగువారు; ఐ = అయ్యి; పూర్వ = వెనుకటి; వైరంబు = శత్రుత్వము; తలంచి = తలచుకొని; సనాయకంబులు = లోకపాలురతోకూడినవి; అయిన = ఐన; లోకంబులన్ = లోకములను; అస్తోకంబు = అధికము; అయిన = ఐన; నిజ = తమ; బల = బలము యొక్క; అతిరేకంబునన్ = అతిశయముచేత; శోకంబున్ = దుఃఖము; ఒందించినన్ = చెందించగా.

భావము:
అలా రాకాసి మూకలు తన చెంతచేరి, నీవే దిక్కు అనే సరికి ఆ మాయలమారీ, దుర్మార్గుడూ అయిన మయుడు తన యోగబలంతో ఇనుము, వెండి, బంగారాలతో మూడు పురాలను సిద్దం చేశాడు. అవి రాకపోకలు తెలియరా నటువంటివీ; రహస్య మార్గాలూ, రక్షణగృహాలూ కలిగినట్టివి. తనను శరణువేడిన రాత్రించరులైన రక్కసులకు ఆ త్రిపురాలను ఇచ్చాడు. వారందరూ ఆ త్రిపురాలలో ప్రవేశించి యథేచ్ఛగా తిరుగసాగారు. తమ వెనుకటి శత్రుత్వం గుర్తుంచుకుని భయంకరమైన తమ పరాక్రమంతో లోకాలను, లోకనాయకులను దుఃఖాలపాలు చేయసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=392

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: