Tuesday, February 21, 2017

వామన వైభవం - 123:



8-676-తే.
వత్స! ప్రహ్లాద! మేలు నీ వారు నీవు
సొరిది మనుమనిఁ దోడ్కొని సుతలమునకుఁ
బయనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ
జేరి రక్షింప దురితంబు చెంద దచట.
8-677-వ.
అని యిట్లు నియమించినం బరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుట ఘటిత నిటల తటుండయి, వీడ్కొని, బలిం దోడ్కొని సక లాసురయూథంబునుం దాను నొక్క మహాబిలద్వారంబు చొచ్చి ప్రహ్లాదుండు సుతల లోకంబునకుం జనియె; నంత బ్రహ్మవాదు లయిన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న శుక్రునిం జూచి నారాయణుం డి ట్లనియె.

టీకా:
వత్స = కుమారా; ప్రహ్లాదా = ప్రహ్లాదుడా; మేలు = సంతోషము; నీవారు = నీవారు; నీవున్ = నీవు; సొరిదిన్ = క్రమముగా; మనుమనిన్ = మనుమడిని; తోడ్కొని = వెంటబెట్టుకొని; సుతలమున్ = సుతలమున; కున్ = కు; పయనము = బయలుదేరినవాడవు; ఐ = అయ్యి; పొమ్ము = వెళ్ళుము; నేన్ = నేను; గదా = గదాయుధము; పాణిని = చేత ధరించినవానిని; అగుచున్ = అగుచు; చేరి = వచ్చి; రక్షింపన్ = కాపాడుతుండగా; దురితంబు = ఏకష్టము; చెందదు = కలుగదు; అచటన్ = అక్కడ. అని = అని; ఇట్లు = ఈ విధముగ; నియమించినన్ = ఆజ్ఞాపించగా; పరమేశ్వరున్ = విష్ణుని; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; వలగొని = ప్రదక్షిణచేసి {వలగొను - వలను(దక్షిణమువైపు) కొను, ప్రదక్షిణముచేయు}; కర = చేతులు యనెడి; కమల = పద్మములను; పుటఘటిత = జోడించిపెట్టబడిన; నిటలతటుండు = నుదుటిభాగము కలవాడు; అయి = ఐ; వీడ్కొని = సెలవుతీసుకొని; బలిన్ = బలిని; తోడ్కొని = వెంటబెట్టుకొని; సకల = సర్వ; అసుర = రాక్షస; యూథంబునున్ = సమూహమును; ఒక్క = ఒక; మహా = గొప్ప; బిల = గుహా; ద్వారంబు = ద్వారము; చొచ్చి = ప్రవేశించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; సుతలలోకంబున్ = సుతలమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; బ్రహ్మవాదులు = బ్రహ్మవేత్తలు; అయిన = ఐన; యాజకుల = ఋత్విజుల యొక్క; సభా = సమూహము; మధ్యంబునన్ = నడుమ; కూర్చున్న = కూర్చొని ఉన్న; శుక్రునిన్ = శుక్రుని; చూచి = చూసి; నారాయణుండు = విష్ణువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
“నాయనా! ప్రహ్లాదా! మంచిది. నీవు నీమనుమనితోపాటు నీవారితొపాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏకష్టమూ కలుగదు. ఈ విధంగా సుతలమునకు వెళ్ళమని ఆజ్ఞాపించిన భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేసాడు. నొసటిపై చేతులు జోడించి సెలవుతీసుకున్నాడు. ఆ తరువాత, అతడు బలిచక్రవర్తినీ రాక్షసుల సమూహాన్ని వెంటపెట్టుకొని, ఒక గొప్ప గుహ గుండా సుతలలోకానికి వెళ్ళాడు. అటు పిమ్మట, మహావిష్ణువు బ్రహ్మవేత్తలైన ఋత్విజుల నడుమ సభలో కూర్చున్న శుక్రాచార్యుని చూసి, ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=676

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: