Friday, February 24, 2017

కాళియమర్దనము – ఘన యమునానదీ

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-664-వ.
ఇట్లు వేగంబుగ నాగంబు వీచివైచి జగజ్జెట్టియైన నందునిపట్టి రెట్టించిన సంభ్రమంబున.
10.1-665-సీ.
న యమునానదీ ల్లోల ఘోషంబు;
 సరసమృదంగ ఘోషంబు గాఁగ
సాధు బృందావనర చంచరీక గా;
 నంబు గాయక సుగానంబు గాఁగ
లహంస సారస మనీయమంజు శ 
 బ్దంబులు దాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది;
 జనులు సభాసీననులు గాఁగ
10.1-665.1-తే.
ద్మరాగాది రత్నప్రభాసమాన
హితకాళియ ఫణిఫణామండపమున
ళినలోచన విఖ్యాత ర్తకుండు
నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె.

టీకా:
ఇట్లు = ఇలా; వేగంబుగన్ = వడిగా; నాగంబున్ = పామును; వీచివైచి = విసిరేసి; జగత్ = లోకమునకే; జెట్టి = శూరుడు; ఐన = అయిన; నందుని = నందుని యొక్క; పట్టి = కుమారుడు; రెట్టించిన = ద్విగృణీకృతమైన; సంభ్రమంబునన్ = వేగిరపాటుతో.
ఘన = గొప్ప; యమునా = యమున అనెడి; నదీ = నదియొక్క; కల్లోల = పెద్దఅలల; ఘోషంబు = పెద్దధ్వని; సరస = రసయుక్తమైన; మృదంగ = మద్దెల; ఘోషంబు = ధ్వని; కాగన = అగుతుండగ; సాధు = చక్కని; బృందావన = బృందావనమునందు; చర = మెలగెడి; చంచరీక = తుమ్మెదల; గానంబు = పాట; గాయక = గాయకుల; సు = మంచి; గానంబున్ = పాటలు; కాగన్ = అగుచుండగ; కలహంస = కలహంసల; సారస = బెగ్గురుపక్షుల; కమనీయ = మనోజ్ఞమైన; మంజు = ఇంపైన; శబ్దంబులు = ధ్వనులు; తాళ = పక్కతాళమువేయువారి; శబ్దములు = ధ్వనులు; కాగన్ = అగుచుండగ; దివి = ఆకాశము; నుండి = నుండి; వీక్షించు = చూచెడి; దివిజ = దేవతలు; గంధర్వ = గంధర్వులు; ఆది = మొదలైన; జనులు = ప్రజలు; సభ = సభయందు; ఆసీన = కూర్చున్న; జనులు = వారు; కాగన్ = అగుచుండగ.
పద్మరాగ = కెంపులు; ఆది = మొదలైన; రత్న = రత్నములచేత; ప్రభాసమాన = మిక్కలి వెలుగుచున్న; మహిత = గొప్ప; కాళియ = కాళియుడు అనెడి; ఫణి = పాము; ఫణా = పడగలనెడి; మండపమునన్ = వేదికపైన; నళినలోచన = పద్మాక్షుడు, కృష్ణుడు (అను); విఖ్యాత = ప్రసిద్ధుడైన; నర్తకుండు = నృత్యముచేయువాడు; నిత్య = శాశ్వతమైన; నైపుణమునన్ = నేర్పుచేత; పేర్చి = అతిశయించి; నృత్యము = నాట్యములు; ఆడెన్ = చేసెను.

భావము:
ఈ విధంగా లోకానికే మేటి వీరుడైన శ్రీకృష్ణుడు పామును గిరగిర తిప్పి విసిరికొట్టి రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు.
ఆ కాళీయుని పడగలు అనే విశాలమండపంమీద బాలకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి, బహు నైపుణ్యంతో నృత్యం చేశాడు. ఆ పాముపడగల మండపం పద్మరాగాలు మొదలైన రత్నాలు చేత ప్రకాశిస్తున్నది. ఆ నృత్యావికి సహకారం అందిస్తున్నట్లు యమునానదిలో కదిలే తరంగాల ధ్వనులు చక్కని మృదంగ ధ్వనులుగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరుగుతున్న తుమ్మెదల మధుర సంగీతం, గాయకుల గానంలా వినబడుతున్నది. కలహంసలు, సారసపక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు చక్కని తాళధ్వనులను సంతరించుకున్నాయి. ఆకాశంలోనుండి చూస్తూ ఉన్న దేవతలు, గంధర్వులు మొదలైనవారు సభలో ఆసీనులై ఉన్న ప్రేక్షకుల వలె ఉన్నారు. మొత్తం మీద అదొక గొప్ప నాట్య కచేరీలా ఉంది.

No comments: