Monday, February 6, 2017

వామన వైభవం - 108:

8-649-వ.
అని యిట్లు పలుకుచున్న యవసరంబున.
8-650-శా.
ఆ దైత్యేంద్రుఁడు పీనవక్షు, నవపద్మాక్షుం, బిశంగాంబరా
చ్ఛాదున్. నిర్మలసాధువాదు. ఘనసంసారాదివిచ్ఛేదు. సం
శ్రీదున్, భక్తిలతాధిరోహిత హరిశ్రీపాదు, నిఃఖేదుఁ, బ్ర
హ్లాదున్ బోధకళావినోదుఁ గనియెన్ హర్షంబుతో ముందటన్

టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = అనుచున్నట్టి; అవసరంబునన్ = సమయమునందు. ఆ = ఆ; దైత్యేంద్రుడు = బలిచక్రవర్తి; పీనవక్షున్ = విశాలమైన; వక్షున్ = వక్షము కలవానిని; నవ = విరిసిన; పద్మా = పద్మములవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; పిశంగ = పచ్చని; అంబర = పట్టుబట్టలు; ఆచ్ఛాదున్ = కట్టుకొన్నవానిని; నిర్మల = స్వచ్ఛముగా; సాధు = మంచిగా; వాదును = మాట్లాడువానిని; ఘన = గట్టిదైన; సంసార = భవబంధములను; విచ్ఛేదున్ = తెంచుకొనినివానిని; సంశ్రీదున్ = సుగుణసంపన్నుని; భక్తి = భక్తి యనెడి; లతా = లతలతో; తిరోహిత = లొంగదీసుకొన్న; హరి = విష్ణుమూర్తి యొక్క; శ్రీ = మంగళకరములైన; పాదున్ = పాదములు కలవానిని; నిఃఖేదున్ = దుఃఖములేనివానిని; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; బోధకళా = జ్ఞానవిద్యాలతో; వినోదున్ = ఆనందించెడివానిని; కనియెన్ = సందర్శించెను; హర్షంబు = సంతోషము; తోన్ = తోటి; ముందటన్ = ఎదురుగా.

భావము:
ఇలా బలిచక్రవర్తి పలుకుతున్న సమయంలో... ఇంతలో అక్కడకి ప్రహ్లాదుడు వచ్చాడు. అతడు విశాలమైన వక్షస్థలమూ, తాజా పద్మాలవంటి కన్నులూ కలవాడు; పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకున్నవాడు; చక్కగా మాట్లాడడంలో నిపుణుడు; సంసారపు బంధాలను తెగత్రెంచుకున్న సుగుణసంపన్నుడు; భక్తితో భగవంతుని పాదాలను లోబరచుకున్నవాడు; దుఃఖాన్ని పారద్రోలి జ్ఞానవిద్యతో ఆనందించేవాడు; అటువంటి ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి సంతోషంగా దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=650

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: